కేరాఫ్ శరత్ , రంగరాజపురం సెవెన్ లాంప్ జంక్షన్

ఇవన్నీ కాదు ఎన్ని ఇబ్బందుల్నైనా తట్టుకుని ముందు బతకాలి … ఇంటిదగ్గర అనుక్షణం నాకోసం ఎదురుచూసే నా పిల్లల కోసం బతకాలి. 

వుందో లేదో తెలియని వ్యాధికి కీమో థెరపీల వంటి వేదనాభరితమైన ట్రీట్మెంట్ , జుట్టు వూడిపోయి మొహం మాడిపోయి చందమామను రాహువు మింగేసినట్టు విలవిలలాడే నా మనసును చందన లేపనంలా చల్లబరిచిన మనుషుల కధలే అడయార్ కధలు .

నాకు మాత్రం వైజాగ్ పారిపోదామా అన్నట్టుంది . కానీ ఇక్కడ డాక్టర్లు వదిలేలా లేరు . వాళ్లు ప్రతి శుక్రవారం కేస్ మీద డిస్కషన్ చేసి వాళ్లకు ఏం చేయాలో అర్ధం కాని కేస్లను అడ్వైజర్ దగ్గరికి పంపుతారు.

నా రిపోర్ట్ వచ్చింది మళ్లీ కధ మొదలు . సస్పెక్టెడ్ సెల్ !

అడ్వైజర్ సుందరేశన్ 70 ఏళ్లుంటాయ్ . ఆయన మొత్తం అన్నీ చూసి ఒక సలహా ఇచ్చాడు .

ఈ అమ్మాయి వయసు 27 ఏళ్లు . ఇంక బోలెడు భవిష్యత్తు వుంది . ముందే భుజంపైన ట్యూమర్ తీస్తే అక్కడ వున్న నరాలు తెగితే వైకల్యం రావచ్చు.
పోనీ ట్యూమర్ తీసి పంపించేస్తే ఆ సస్పెక్టెడ్ సెల్ కేన్సర్ అయితే ప్రాణానికే ప్రమాదం.

కాబట్టి ఈమెకి కీమో థెరపీలు ఇవ్వాలి . దీని వల్ల ట్యూమర్ సైజ్ చిన్నగా అవుతుంది . అప్పుడు ఆపరేషన్ చేసి ఆ గడ్డ తీస్తే డిసెబిలిటీ అంతగా వుండదు. కీమోలు మొదలెట్టమని అడ్వైజ్ ఇచ్చాడు .

ఇక కీమో థెరపీలు తీసుకోవడం తప్పదు అని అర్ధమైంది .

ఒక్కో కీమో మూడు రోజులు . అప్పటికే కీమో థెరపీ గురించి అక్కడికి వచ్చే పేషంట్ల దగ్గర వినేదాన్ని . ప్రత్యక్ష నరకం అని చెప్పేవారు .
శారీరిక బాధలకు తోడు జుట్టు మొత్తం రాలిపోయి కనుబొమలతో సహా వూడిపోయి చూడటానికి కూడా వికారంగా కనిపిస్తామనేది నాకు సష్టంగా అర్ధమైంది . అందానికి అంత ప్రాధాన్యత ఇవ్వక్కరలేదనేంత పరిపక్వత నాకు అప్పటికి లేదు .

నేను బాగుంటానని ఎందరో పొగిడిన సందర్భాలు గుర్తొచ్చాయ్ . చిన్నప్పుడు మా మనోహరం టీచర్ ” కర్లీ హెయిర్ , డింపుల్ చిన్ ” అనే ఇంగ్లీష్ పద్యం చదివి ” మన షర్మిలా లాగా అన్న మాట !” అని చెప్తుంటే తెగ గొప్పగా అనిపించిన సంగతి గుర్తొచ్చింది .
కాలేజీలో నా కోసం పడి చచ్చిన అబ్బాయిలు , కాస్త అసూయగా చూసే అమ్మాయిలు అందరూ గుర్తొచ్చారు .

ఇవన్నీ కాదు ఎన్ని ఇబ్బందుల్నైనా తట్టుకుని ముందు బతకాలి … ఇంటిదగ్గర అనుక్షణం నాకోసం ఎదురుచూసే నా పిల్లల కోసం బతకాలి.
ఇంకో నాలుగు రోజుల్లో మొదటి కీమో ఇస్తామని నా దగ్గర సహాయంగా వుండటానికి ఆడవాళ్లు ఎవరైనా వుంటే పిలిపించుకోమన్నారు .
అమ్మ నాకోసం వచ్చింది . నాన్న స్నేహితుడు శరత్ మద్రాస్ ఆంధ్రా క్లబ్ లో పనిచేస్తారని తెలుసుకుని నాన్నతో మాట్లాడించాం . శరత్ అంకుల్ హోటల్ కి వచ్చాడు .
శరత్ కి అప్పటికి 40 ఏళ్లుంటాయ్ చూడడానికి 30 ఏళ్ల యువకుడిలాగా కనిపిస్తాడు . తనని అంకుల్ అనడానికి కాస్త సంకోచంగా అనిపించింది .
శరత్ ఒంటరి వ్యక్తి. ఎందుకనో పెళ్లి చేసుకోలేదు .

” నేను రంగరాజపురం సెవెన్ లాంప్ జంక్షన్ దగ్గర వుంటాను .అమ్మడు ఎలాగూ హాస్పటల్ లో జాయిన్ అవుతుందంటున్నారు కదా , రాజు గారూ ! మీరు మా ఇంటికి వచ్చి వుండండి ” అన్నాడు .
మేం కూడా ప్రతి రూపాయి చూసి ఖర్చు చేయాల్సి వస్తోంది. పైగా కాస్త హోమ్లీగా వుంటుందని శరత్ ఇంటికి వెళ్లాం .
ఇల్లు చాలా నీట్ గా వుంది . ఒక పెద్దగది ఒక చిన్న వంటిల్లు , చిన్న గది . వంటింట్లో వున్న గాస్ స్టవ్ లో నీడ చూసుకోవచ్చన్నట్టు తళతళా మెరిసేట్టు తుడిచి దాని మీద చిన్న నాప్కిన్లు వేసి వుంచాడు .

న్యూస్ పేపర్లు అసలు చదివాడా లేక అట్లాగే వచ్చిన వాటిని పేర్చాడా అన్నట్టు తేదీలవారీగా పొందికగా వున్నాయి . మా ఇంట్లో నేను ఒక అల్మారాలో ఎడాపెడా పడేసే సంగతి గుర్తొచ్చి సిగ్గేసింది .

ఆయన ఒక బొంత రెండు మడతలేసి దానిపైన దుప్పటీ చిన్న ముడతకూడా లేకుండా పరుచుకుని పడుకునేవాడు . పక్కకి తిరిగి పడుకుంటే తప్ప ఆ బొంత సరిపోదు . పొద్దున్న లేచేటప్పటికి ఎట్లా ఏసిన పక్క అట్లాగే వుండేది .

ఆయన ఒద్దిక , శుభ్రం అడుగడుగునా నన్ను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేశాయి .

నేను ఆస్పత్రిలో జాయిన్ అవుదామని వెళ్లే లోగానే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని తమ్ముడి ఫోన్ వచ్చింది.
కష్టాలన్నీ కట్టకట్టుకుని వస్తున్నట్టున్నాయ్ . నాన్న వేటికీ చలించనట్టు కనిపిస్తారు . మరి నాకేమవుతుందో అని ఆందోళన పడ్డారో ఏమో !
అమ్మ వెంటనే బయల్దేరి వెళ్లి పోవాల్సి వచ్చింది .

నన్ను చూసుకోవడానికి మా పిన్నత్తగార్లు ముగ్గురూ మూడు కీమో థెరపీలకు వచ్చి నా బెడ్ దగ్గరే వుండి సేవలూ చేయడానికి ముందుకొచ్చారు .
నా ఈ జీవన్మరణ పోరాటంలో నా సన్నిహితుల కంటే నాకు పెద్దగా సంబంధం లేని వాళ్లు నాకు చేసిన మేలు తలుచుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది .
మొదటి కీమో మొదలైంది .

ఒక పెద్ద గదిలో రెండు బెడ్లు వున్నాయి కిటికీ పక్కనే బెడ్ వుంది . విజిటింగ్ అవర్స్ లో తప్ప మిగతా సమయంలో కిటికీ దగ్గర బయటనుంచే మా ఆయన చూసి అవసరమైనవి ఇచ్చి వెళ్లేవాడు .

నా ఎదురు బెడ్లో ఒక 70 ఏళ్ల పెద్దావిడ చేరింది .

గర్భాశయ కేన్సర్తో ఆవిడది జగ్గయ్యపేట దగ్గర గుండుబోయినపాలెం . కూతురు మాత్రం మద్రాసులోనే వుండేది . కొడుకులు ఆమెను ఆస్పత్రిలో చేర్చి కూతురికి అప్పగించి వెళ్లారు .

( వచ్చే సంచికలో గుండుబోయినపాలెం మామ్మగారు , ప్యారేలాల్ పంచిన అభిమానం )

షర్మిలా కోనేరు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ కధ ఎటు వెల్తుందో తెలియదు కాని… నన్ను లాగింది మాత్రం ఆ రంగరాజపురం సెవెన్ లైట్స్ వెలుతురులో నా కళ్ళకు కనపడిన కొన్ని జీవితాలు.

    సెవెన్ లైట్స్ వెలుతురులో ఆడుకునే పదేళ్ళ కొడుకు వేసవి సెలవులకి అమమ్మ దగ్గిరకి వెళ్ళి రక్తపు విరోచనాలతో వెనక్కి వస్తే, ఆ ‘రాక్షసి’ కోరలనుండి తప్పించడానికి తగిన సొమ్ములేకపోతే, ఆ మధ్య తరగతి ఉద్యోగి, నా మొహం చూసస్తూ, డబ్బులడగలేక, హాండ్ బిల్ ముద్రించి పంచితే, దాని మీదున్న ప్రింటర్ అడ్రస్ చూసుకుని, ప్రింటింగ్ బిల్లు సెటిల్ చేసిన వైనం, ఆ కుర్రాడు బతకడు అని తెలిపిన డాక్టర్లు, చనిపోయిన తరువాత ఆ రంగరాజపురం సెవెన్ లైట్స్ దాని చుట్టు పరుచుకున్న జ్ఞ్నాపకాలతో బతకలేక ఆ ఊరే వదిలివెళిపోయిన కుటుంబం గుర్తు వచ్చింది. ఆ తల్లికి అతను, ఆ భర్తకి ఆమే మాత్రమే తోడు. ఇప్పుడు ఎక్కడ ఎలాగున్నారో మరి!

    • అనిల్ గారూ ! నా కధ శీర్షిక మీ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసింది . బిడ్డని పోగొట్టుకున్న ఆ తల్లితంద్రుల వ్యధ లాగే బిడ్డల కోసం మృత్యువుతో పోరాడిన తల్లి , ఆ తల్లికి తోడుగా నిలిచిన మంచి మనసుల కధలే అడయార్ కధలండీ .

    • మిమ్మల్ని కదిలిస్తే నా ప్రయత్నం ఫలించినట్టేనండి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు