సమకాలీన దేశీ సాహిత్యానికి తెలుగు అనువాద వేదికగా ఛాయ నిలుస్తున్న విషయం పాఠకులకూ సాహితీ జీవులకు తెలిసిందే. ఈ ఏడాది నుండి అంతర్జాతీయ సమకాలీన సాహిత్యానికీ ఛాయను వేదికగా చేయాలని అనుకున్నాం. ఛాయ విదేశీ అనే సిరిస్ ద్వారా వచ్చే రెండు – మూడు ఏళ్ళలో 20 పుస్తకాలు తెలుగులోకి తేవాలని రైట్స్ తీసుకుంటున్నాం. ఆ 20 పుస్తకాలు కూడా ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, అమెరికన్ ఇంగ్లిష్ నుండే గాక ఇప్పటి వరకు ఇతర భారతీయ భాషల్లోనూ అంతగా అనువాదం అవ్వని నార్డిక్, డానిష్, ఫీనిష్, స్వీడిష్, అరబిక్, పోర్చుగీస్ నుండీ తేవాలనేది మా ఆలోచన.
అందులో భాగంగానే జనవరి 23 – 26 వరకు జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో నిర్వాహకుల ఆహ్వానం మేరకు పాల్గొన్నాం. గత ఏడు సంవత్సరాలుగా కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్న డీసీ బుక్స్ అనే ప్రచురణ సంస్థ ఈ ఏడాది మొదటిసారిగా రైట్స్ టేబుల్‌ని నిర్వహించ తలపెట్టింది. దానికి గెస్ట్ కంట్రిగా ఫ్రాన్స్ వచ్చింది. ఫ్రెంచ్ ప్రచురణ రంగంలో ప్రఖ్యాత ప్రచురణ సంస్థ flamrion తో పాటూ ఇంకో ఏడు ప్రచురణ సంస్థలు/వాటిని రిప్రజెంట్ చేసే లిటరరీ ఏజెంట్స్ ఇందులో పాల్గొన్నారు. దీనిని నిర్వహిస్తున్న డీసీ బుక్స్ దక్షిణాది ప్రచురణ సంస్థలకు పెద్దపీట వేయాలని అనుకున్నది. కన్నడ, తమిళ, తెలుగు నుండి ప్రచురణ సంస్థలను పిలిచింది.
తమిళం నుండి కాలచ్చువాడు, జీరో డిగ్రీ, ఎథిర్ వేలియేడు, డిస్కవరీ బుక్స్, సిక్స్త్ సెన్స్, యావరం; కన్నడ నుండి పంచమి, నవ కర్ణాటక; తెలుగు నుండి ఛాయ, ఎలమి; మరాఠీ నుండి మెహతా పబ్లిషింగ్ హౌజ్, ఇండియన్ ఇంగ్లిష్ ప్రచురణ సంస్థ అయిన హార్పర్ కోలిన్స్ ఈ రైట్స్ టేబుల్‌లో పాల్గొన్నాయి. రెండు రోజుల పాటు అక్కడ జరిగిన సమవేశంలో ఫ్రెంచ్ పుస్తకాలను ఇతర భాషల్లోకి తీసుకువెళ్ళడం కోసం అక్కడి ప్రచురణ సంస్థలే గాక ప్రభుత్వాలు చూపే శ్రద్ధ గురించి ఫ్రెంచ్ ఎంబసి ప్రతినిధులు వివరించారు. అక్కడి పబ్లిషర్స్‌తో కొన్ని పుస్తకాలు తెలుగులోకి తేవడం గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన అంకెలు వింటే అరకొరగా సాహిత్యం అమ్ముడుపోయే తెలుగు నుండి వెళ్ళిన నాకు ఆశ్చర్యమే కలిగింది. ఒక రచయిత రాసిన పిల్లల బొమ్మల పుస్తకం గత 60 ఏళ్లలో అక్షరాల నాలుగు కోట్ల ఇరవై లక్షల కాపీలు అమ్ముడుపోయిందంటా. ఎలెనా ఫెర్రాంటే అనే ఇటాలియన్ రచయిత్రి పుస్తకాలు ఫ్రెంచ్ లోకి అనువాదం అయితే 56 లక్షల కాపీలు అమ్ముడుపోయిందంట. (ఎలెనా రచనలు వచ్చే రెండేళ్ళలో తేబోయే ఛాయ విదేశీ సిరీస్ ద్వారా తెలుగులోకి తెస్తున్నాం.)
ఇదంతా ఒకెత్తు అయితే, కేరళ లిటరేచర్ ఫెస్టివల్ మరొక ఎత్తు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విన్నర్ జెన్నీ ఎర్పెన్‌బెక్, ఆ పుస్తక అనువాదకుడు మైకేల్ హాఫ్‌మన్, గత ఏడాది బుకర్ ప్రైజ్ వచ్చిన పాల్ లించ్ సెషన్స్ విందామని వెళ్తే ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన బుక్ షాప్‌లో రద్దీ ఎక్కువగా ఉందని తలుపులు మూసేశారు. అంతకు ముందు రోజు ఆ బుక్ స్టోర్‌కి వెళ్ళి కొన్ని పుస్తకాలు కొనుక్కున్నాం. కనీసం వెయ్యి మందికి తక్కువ లేరు అందులో. తలుపులు మూసేసంతగా జనాలు ఉన్నారా అని బుక్ బ్రహ్మ సతీష్, నేనూ వెనక గేటు గుండా లోపలికి వెళ్తే చిన్న జాతర నడుస్తోంది.
వెళ్లేముందు ఎగ్జిట్ దగ్గరా జనం గుమిగూడి ఉంటే ఏంటా అని ఆరా తీస్తే కే.ఆర్ మీరా, ఇంకో రచయిత్రి పుస్తకాలపై సంతకాలు పెట్టేందుకు కూర్చుని ఉన్నారు అని చెప్పారు. లోపలి నుండి బయటకి వచ్చినప్పుడు చూస్తే సంతకాల కోసం బారుల తీరిన జనం సంఖ్యా పదిహేను వందలకు పైనే ఉంటుంది. “ఇది కర్నాటకలో సాధ్యం అయ్యే పని కాదు” అని సతీష్, “తెలుగులోనూ ఇప్పట్లో అవ్వదేమో!” అని నేనూ అనుకున్నాం. “ఇంతకీ మొత్తం ఫెస్టివల్‌కి ఎంత మంది వచ్చి ఉంటారు?” అని సతీష్‌ని అడిగితే “ఈ సంవత్సరం 6 లక్షల మంది వరకు రావొచ్చు అని డీసీ అంచనా అని దాని సీఈఓ రవి చెప్పాడు” అన్నాడు. “రెండేళ్ళ కింద పోయినప్పుడు మనుషులు నడిచేనంత ఖాళీ అయితే ఉండేది. ఇప్పుడు మనుషులు మరో పది మంది మనుషులకు తాకకుండా వెళ్ళడం సాధ్యం కావడం లేదు” అని గుర్తు చేసుకున్నాను.
అక్కడి నుండి బయటకు ఐతే వచ్చాను గానీ ఆ జనం, పుస్తకాల దుకాణం తలుపులు మూయడం మాత్రం తొలుస్తూనే ఉంది. ఇంత మంది బారులు తీరారు అంటే ఇక్క ఎంత పెద్ద సాహిత్య ఉద్యమం నడచి ఉండాలి. మన వట్టికోట ఆల్వార్ స్వామిలా ఎందరు కాళ్ళకు బలపం కట్టుకుని, నెత్తిన పుస్తకాల మూట పెట్టుకుని ఊరూరు తిరిగి ఉండాలి అని అనిపించింది. దానికి సమాధానం ప్రముఖ మలయాళీ రచయితా, కేరళ లిటరేచర్ ఫెస్టివల్ డైరెక్టర్ సచ్చిదానందన్‌ని అడిగితే చెప్పాడు. ఆయన మాటల్లో చదవండి.
“కేరళలో చదివే సంస్కృతి ఉన్నది. మా ఊర్లో స్కూల్ లో ఉండే లైబ్రరీలు గాక రెండు లైబ్రరీలు ఉన్నాయి. ఇక్కడ కేవలం స్థానిక రచయితల పుస్తకాలనే గాక అంతర్జాతీయ రచయితల సాహిత్యం కూడా చదువుతారు. గలిబినో, మిలన్ కుందేరా… ఇట్లా చాలామంది పేర్లు వారి సాహిత్యం ఇక్కడి ప్రజలకు సుపరిచితం. ఓ మాటా చెబితే నీవు ఆశ్చర్యపోతావేమో గాని ఇది నిజం. ఇక్కడి ప్రజలు గాబ్రియేల్ గార్శియో మార్క్వెజ్‌ని ఎంతగా ఓన్ చేసుకున్నారంటే ఆయననొక మలయాళీ రచయిత అనే అనుకుంటారు. (మార్క్వెజ్ చనిపోయినప్పుడు ఒక మిత్రుడు ఫోన్ చేసి “ఏంటి మలయాళీ రచయిత చనిపోతే అమెరికాలో న్యూస్ వస్తుంది అన్నాడు. ఎవరా అని అడిగితే మార్క్వెజ్ పేరు చెప్పాడు” అని డీసీ రవి బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్‌లో చెప్పాడు). ఓ. విజయన్ పుస్తకాలు 60 ఎడిషన్లు పోయాయి. అంత ఈజీగా అర్థమయ్యే రచనలు కావు తనవి. లేయర్లు లేయర్లుగా రాస్తాడు. ఇక్కడి ప్రజలు సాహిత్యాన్ని ఎంతగా చదువుతారు అనేందుకు ఇదొక ఉదాహరణ.
అయితే, ఇదంతా కొన్ని సంవత్సరాలలో జరిగింది కాదు. వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్నది. ఇక్కడ పౌర గ్రంథాలయ ఉద్యమం బలంగా జరిగింది. 1920లో ఇక్కడ పునరుజ్జీవ ఉద్యమం వచ్చింది. కుమరన్ ఆశన్ లాంటి పునరుజ్జీవ కవులు వచ్చారు. స్వాతంత్ర ఉద్యమానికి సమాంతరంగా ఇక్కడ సాహిత్య ఉద్యమం జరిగింది. సృజనాత్మక సాహిత్యం, సమాంతర ఉద్యమం ఇక్కడ కవితల్లోనూ, వచనంలోనూ జరిగింది. సామాజిక ఉద్యమాలు సాహిత్య ఉద్యమానికి దోహదం చేశాయి. సాహిత్య ఉద్యమాలు సామాజిక ఉద్యమాలకు దోహదం చేశాయి. ఇవి ఒకదాని చేయి పట్టుకుని మరొకటి నడిచాయి. ఒకటి మరొక దానికి ప్రతిబింభించింది.
ఇక కేరళ లిటరేచర్ ఫెస్టివల్ విషయానికి వస్తే, 2016లో కేరళ లిటరేచర్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ ప్రారంభమైనది. మధ్యలో కోవిడ్ వలన రెండు ఏళ్ళు ఆన్‌లైన్లో నిర్వహించాం. ఇది ఎనిమిదవ ఎడిషన్. ఇది మొదలైనప్పటి నుండి నేను దీనికి డైరెక్టర్‌గా వ్యహరిస్తున్నాను. ప్రతి యేడూ ఇది పెరుగుతూ పోతోంది. 3 వేదికలు 300 మంది రచయితలతో ఇది మొదలైంది. ఇప్పడు 9 వేదికలు. 500కి పైగా రచయితలు. దేశ, విదేశాల నుండి వస్తారు. విదేశీ భాగస్వామ్యం కూడా పెరిగింది. ఈ కోళికోడ్ బీచ్ నిర్వహించడం కూడా కలిసి వచ్చింది. స్థలం సమస్య లేదు. ఎంతమంది వచ్చిన ఇబ్బంది ఉండదు. పైగా ఈ ఊరుకు పెద్ద సాహిత్య చరిత్ర ఉన్నది. ఇక్కడ కవులు పుట్టారు. రచయితలూ పుట్టారు. హిందుస్తానీ సంగీతం, నాటకాలకూ ఈ ఊరు ప్రసిద్ధి. వైక్కోం బషీర్ తెలుసు కదా ఆయనది ఇదే ఊరు. ఎంటీ వాసుదేవనాయర్‌దీ ఇదే ఊరు. గొప్ప నాటకకర్తలు కేటీ మహమ్మద్, తిక్కోడయాన్‌లు, వాసు ప్రదీప్ లాంటి నాటక రచయితలూ, బాలామణి అమ్మ లాంటి కవయిత్రులు ఇక్కడ పుట్టారు. ఇటీవల యునెస్కో కోళికోడ్‌ని “సిటీ ఆఫ్ లిటరేచర్”గా గుర్తించింది. ఆ గుర్తింపులో కేఎల్‌ఎఫ్ పాత్ర ఉన్నది. ఇక్కడ లిటరేచర్ ఫెస్టివల్ జరిగే నాలుగు రోజులు కాలేజెస్ విద్యార్థులకు సెలవును ప్రకటిస్తాయి. ఇది కూడా ఇంత మంది హాజరుకావడానికి కారణం.
డోమ్నిక్ చాకో కిళకెమురి ఈ డీసి బుక్స్ అనే సంస్థను స్థాపించాడు. ఆయన ఇంతక ముందు SPSC అనే సాహిత్య ప్రవర్తక కో – ఆపరేటివ్ సొసైటీ అనే సంస్థను ప్రారంభించాడు. అది సాహిత్యకారులు పుస్తకాలు వేసేందుకు, అమ్మేందుకు దోహదం చేసేది. రచయితలకు రాయల్టిలు ఇప్పించేది. తరువాతి కాలంలో అందులో అవినీతి జరుగుతుందని గుర్తించి అయన బయటకు వచ్చాడు. వచ్చాక DC (డోమ్నిక్ చాకో) బుక్స్‌ని స్థాపించాడు. ఇప్పుడు దానిని అతని కొడుకు రవి చూస్తున్నాడు. (ట్రావెన్‌కోర్ రాజ్యం పుస్తకాలపై ఉండే సేల్స్ టాక్స్‌ని ఎత్తేయడంలో కిళకెమురిది ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తదనంతరం ప్రధాని జవహర్ లాల్ నెహ్రు దీన్ని చూసి దేశ వ్యాప్తంగా పుస్తకాలపై సేల్స్ టాక్స్‌ని ఎత్తేశాడు.)”
*
Add comment