“నెత్తురు కూడు తినే దెయ్యాలు లేవిక్కడ”

కుల మతాలకు అతీతంగా ,ప్రాంతాలకు అతీతంగా ప్రపంచమంతట వున్న సమాజాలను ప్రభావితం చేసిన అరుదైన గొప్ప వ్యక్తిత్వం కలిగిన అతికొద్ది మహానుభావుల్లో అగ్రగణ్యుడు మహాత్మా గాంధీ. ఇది  యావద్ప్రపంచం అంగీకరించిన  వాస్తవం. సామాజిక జీవితంలోని వివిధ రంగాలకు సంబంధించిన గాంధీజీ ఆలోచనలు ,వాటిని తన నిత్యజీవితంలో ఆచరించడంలోని చిత్తశుద్ధి వగైరాలు  నిద్రావస్థలో వున్న అలనాటి సమాజాన్ని తట్టి లేపి అభివృద్ది బాటలో నడవడానికి  ప్రేరణగా నిలిచాయి.ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి. స్వయంగా  ఆచరించేవాటిని మాత్రమే ,ఇతరులను ఆచరించమని కోరారు గాంధీజీ .‘’కప్పు’’కీ ‘’లిప్పు’’కీ మధ్య తేడాలేని వారి ప్రవర్తన ప్రజలను ఆకర్షించింది. గాంధీజీ కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు ;గొప్ప దార్శనికుడు కూడా.

ప్రపంచంలోని ఎన్నో సమాజాలను ప్రభావితం చేసిన వారు మలయాళ సమాజాన్ని కూడా ఎంతో  ప్రభావితం చేసారనే మాట ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర లేదు. ఈ ప్రభావానికి దోహదం చేసాయి గాంధీజీ చేసిన పర్యటనలు.  అలనాటి  మూడు భిన్న మలయాళ సమాజాలు [మలయాళ భాష మాట్లాడే ప్రదేశాలు ] కలిసినదే నేటి కేరళ రాష్ట్రం. తిరువితాంకూర్ ,కొచ్చి ,మలబార్ అనే ఈ మూడు ప్రాంతాలూ వేరు వేరు మహారాజుల పాలనలో వుండేవి . ఈ ప్రాంతాలను 1920 నుంచి 1940 వరకు అయిదు సార్లు సందర్శించారు గాంధీజీ. ఆ ప్రాంతాల్లో, ఆ రోజుల్లో జరిగిన చారిత్రాత్మక ఉద్యమాలకు మద్దతు పలకడం కోసమే ఈ సందర్శనలు జరిగాయి. సందర్శించిన ప్రతి సారి ప్రజలతో విడి విడిగా మాట్లాడడమే కాకుండా బహిరంగ సభల్లో కూడా మాట్లాడి ప్రజలకు తన ఆలోచనలను పంచి పెట్టి ,వాళ్ళను ప్రభావితం చేసారు. ఆ సందర్శనల గురించీ ప్రజల స్పందన గురించీ మాట్లాడే ముందు ఒక మాట నేటి పరిస్థితులదృష్ట్యా ఖచ్చితంగా చెప్పాలి . 1924 లో, ఈ ప్రాంతాల్లో జరిగిన మహాప్రళయం వల్ల నిరాశ్రయులైన వారి కోసం గాంధీ గారు ఆ రోజుల్లో 6000 రూపాయిలు సేకరించారు [1924లో 6000 రూపాయిలంటే  చాలా పెద్ద మొత్తమే ].

1920 లో జరిగింది గాంధీ గారి మొదటి సందర్శన.  మలబార్ ప్రాంతం సందర్శించారు గాధీజీ. కిలాఫత్ ఉద్యమకారులను కలవడం కోసం వచ్చారు గాంధీ. 1915 నుంచి 1923 వరకు జరిగింది ఈ ఉద్యమం . తుర్కి పాలకుడ్నికాలీఫ్ గా కొనసాగించడం కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మలబార్ లోని  ముస్లిం సమాజం సంఘటితంగా చేసిన ఉద్యమం ఇది .మలబార్ లోని ముస్లిం ప్రజలకు మద్దతు  పలకడం కోసం కోడికోడ్ చేరుకొని ఉద్యమ నాయకులతో మాట్లాడారు గాంధీజీ .అహింసా యుతంగా సత్యాగ్రహం చేయాలనే గాంధీ గారి అభ్యర్ధనను నాయకులు అంగీకరించారు .బదులుగా తన సహకారం వాళ్ళకు అందించడానికి గాంధీజీ ఒప్పుకున్నారు. మొదటి సహాయనిరాకరణ ఉద్యమం ఇదే.  స్వరాజ్యం అనే భావం మొలకెత్తే రోజులవి. 500 కాంగ్రాస్ సభ్యులతో మాట్లాడడమే కాక సాయంత్రం కోడికోడ్ లో జరిగిన బహిరంగ సభలో కూడా మాట్లాడారు గాంధీజీ . హిందూ ముస్లింలను కలిసి, ,ఇద్దరి మధ్య వుండవలసిన సఖ్యత గురించి ఆవేశంతో మాట్లాడిన గాంధీ ,కోడికోడ్ నుంచి కన్నూర్ ,తలస్సేరి మొదలగు పట్నాలకు కూడా వెళ్ళి మాట్లాడారు . అతని మాటలు ప్రజలను ప్రగాఢంగా ప్రభావితం చేసాయి .

సుప్రసిద్ధ వైకం సత్యాగ్రహ సమయంలో జరిగింది రెండో సందర్శన . 8-3-1925 నుంచి 19-3-1925 వరకు జరిగింది ఈ సందర్శన . ఆ రోజుల్లో సవర్ణులకు మాత్రమే క్షేత్రప్రవేశానుమతి వుండేది. సవర్ణులు అంటే మలయాళ సమాజంలోని నంబూతిరి ,నాయర్ సముదాయాలు [మీనోన్ కూడా నాయరే ] వీళ్ళు కాక అయ్యర్ అనే ‘సర్ నేం ‘ తో కూడిన తమిళ బ్రాహ్మణులు కూడా సవర్ణులే.ఈళవ మొదలుకొని వున్న ఇతర నిమ్న కులస్తులందరూ అవర్ణలు. వీళ్ళుకు గుడి వద్దకే కాదు గుడికి వెళ్ళే రోడ్డు మీదకి వెళ్లడానికి కూడా హక్కు వుండేది కాదు. క్షేత్ర ప్రవేశ హక్కు గురించి 30 -3-1924 లో మొదలైన సత్యాగ్రహం 23-11 -1925 లో జరిగిన ఒప్పందంతో ముగిసింది. ఆ శాంతియుత సత్యాగ్రహంలో పాల్గొనడం కోసం  వైకం చేరుకున్నారు గాంధీజీ . మహాత్మా గాంధీ యోక్క అహింసపూరితమూ ,అక్రమరహితమూ ఐన సత్యాగ్రహం సజావుగా జరిగింది వైకంలోనే. వైకం తిరువితాంకూర్ ప్రాంతంలో వుంది. ఆ రోజుల్లో తిరువితాంకూర్ ప్రాంతాన్ని పాలించిన రాణి లక్ష్మీ బాయి ని కలిసారు గాంధీజీ. ఆ నాటి సంఘ సంస్కర్తలనూ నాయకులనూ కలిసి మాట్లాడారు. అప్పుడే గాంధీజీ బ్రహ్మర్షి శ్రీ నారాయణ గురువును కలవడం జరిగింది. అహింస పట్ల పూర్తి నమ్మకం గల  నారాయణ గురు  సత్యాగ్రహానికి పూర్తి మద్దతు ఇచ్చారు

‘’ఒకే కులం ,ఒకే మతం ,ఒకే దేవుడు ,మనిషికి అనే ఆశయంతో సంఘ సంస్కరణ కోసం [ముఖ్యంగా ఈళవ సమాజాభ్యున్నతికోసం] బ్రతికిన శ్రీనారయణ గురు గారు [1856—1928 ]నిమ్న కులస్తులకు క్షేత్రప్రవేశహక్కు కానీ క్షేత్రనిర్మాణ హక్కు కానీ లేని రోజుల్లో  గుడి కట్టి శివుడ్ని ప్రతిష్టించారు. సవర్ణులు ప్రశ్నించినప్పుడు తను ప్రతిష్టించినది సవర్ణుల శివుడ్ని కాదని ఈళవ శివుడ్ని అని జవాబిచ్చారు. శ్రీ నారాయణ గురువునీ మహాత్మా గాంధీనీ కలిపింది, వైకం సత్యాగ్రహం. 1925 మార్చి 13 వ తేది గాంధీజీ గురువుగారి శివగిరి ఆశ్రమానికి వెళ్ళి  నారాయణ గురువును కలిసారు. ‘’ఒకే కులం ,ఒకే మతం ఒకే దేవుడు మనిషికి ‘’ అనే గురు సందేశం పట్ల అప్పుడు కొంత అయిష్టం ప్రదర్శించిన గాంధీజీ 1937 లో ఆ మాటతో పూర్తిగా ఏకీభవించారు. అంటరానితనం,సత్యాగ్రహం ,మతమార్పిడి ,బడుగువర్గాల సంక్షేమం, లౌకిక ,అధ్యాత్మిక మోక్షం మొదలైనవాటి గురించి చర్చించారు వాళ్ళు . ఒక రోజు శివగిరిలోని వైదీక మఠంలో వున్నారు గాంధీజీ. తన శివగిరి పర్యటన గురించి తిరువనంతపురంలోని ఒక సభలో ఇలా అన్నారు గాంధీజీ.

‘’శ్రీ నారాయణ గురువుకి కూడా వైకం రోడ్డు మీద నడిచే హక్కు లేదని తెలిసినప్పుడు సిగ్గు అనిపించింది నాకు .శివగిరి మతం మహిమ గలది ;అందంగా వుంది. శుచీ , శుభ్రతల గురించి అక్కడ అమలుపరిచే  చర్యలు నాకు నచ్చాయి. అక్కడ కొందరు దళితుల పిల్లలు [పులయ– అంటే మాల ]సంస్కృత పారాయణం చేయడం విన్నాను నేను. సంస్కృత పండితుల్లో కూడా కొందరు మాత్రమే అంత అందంగా పారాయణం చేయగలరు’’

1927 అక్టోబర్ 14 న మరో సారి నేడు మధ్య కేరళ లోవున్న  త్రిస్సూర్ అనే ఊరికి వచ్చారు గాంధీజీ. అక్కడ వున్న వివోకొదయ స్కూల్ సందర్శించారు . స్కూల్ లో వుంచిన సందర్శకుల డెయిరీలో గాంధీజీ ఇలా వ్రాసారు ‘’వందల కొద్ది మగ పిల్లలూ ఆడపిల్లలూ చర్కాలో నూలు తీయడం చూసి సంతోషించాను .కాని నాణ్యత ఇంకా గణనీయంగా పెంచుకోవచ్చు .ఈ పని ఎందుకు చేస్తున్నారని,వాళ్ళు తెలుసుకోవాలి . అక్టోబర్ 15 న కామకోటే శంకరాచార్యులను కలిసి పాలక్కాడ్ లో ఒక బహిరంగ సభలో మాట్లాడిన తరువాత వెళ్ళిపోయారు గాంధీజీ

1934 లో జనవరి 10 నుంచి 22 వరకు మలబార్ సందర్శించారు గాంధీజీ. అట్టడుగు వర్గం వాళ్ళ సంక్షేమం కోసం ధన సేకరణ చేయడం ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశ్యం . శబరి ఆశ్రమం సందర్శించడమే కాక మలబార్ ప్రాంతపు రాజు సామూతిరి ని కూడా కలిసి క్షేత్ర ప్రవేశ సమస్య గురించి చర్చ చేసారు గాంధీజీ .అక్కికావు అనే ఊరిలో కేవలం హరిజనుల కోసమే నిర్మించిన ఒక సౌజన్య ఆసుపత్రిని ప్రారంభించారు. ఎన్నో హరిజన వాడలు సదర్శించారు. ఒక బహిరంగ సభలో గాంధీజీ మాట్లాడిన వెంటనే కౌముది అనే ఒక బాలిక వేదిక వద్దకి దూసుకొని వెళ్ళి తన ఒంట్లోని బంగార నగలు మొత్తం అట్టడుగు వారి సంక్షేమం కోసమని గాంధీజీకి సమర్పించింనది ,ఈ పర్యటనలోనే.అంతే కాదు,ఆ బాలిక  తన  జీవితంలో  బంగార నగలు ధరించనని ప్రతిజ్ఞ చేసింది కూడా.ఈ బాలిక గురించి తన ‘హరిజన్ ‘ పత్రికలో ‘’కౌముది కా త్యాగ్’’ అనే పేరుతో గాంధీజీ ఒక వ్యాసం వ్రాయడం కూడా జరిగింది.

మళ్ళీ 1937 జనవరి 12 నుంచి 21 వరకు తిరువితాంకూర్ సందర్శించారు .క్షేత్ర ప్రవేశ చట్టం అమలు పరిచినందుకు ధన్యవాదాలు చెప్పడం కోసం వచ్చారు గాంధీ ఈ సారి .

గాంధీజీ సందర్శనల వల్ల ఎందరో మలయాళీలు ప్రభావితులై గాంధీజీకి శిష్యులుగా మారారు . గాంధీజీ ఆలోచనలను ప్రజల వద్దకి తీసుకొని వెళ్ళారు . వాళ్ళలో ముఖ్యుడు తరువాత కాలంలో కేరళ గాంధీ అని ప్రసిద్ధుడైన కే .కేలప్పన్ .

గాంధీజీ —-మలయాళ కవిత్వం

సమాజాన్ని ప్రభావితం చేసిన ఏ వ్యక్తి అయినా ఆ సమాజం సృష్టించిన  సాహిత్యాన్ని ప్రభావితం చేయడం సహజం. రచయితలు కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తారనేదీ వాస్తవమే. కాని  తన  సిద్ధాంతాల వల్ల ,జీవిత దృక్పదం వల్ల ,తాత్విక అధ్యాత్మిక చింతన వల్ల ,తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించడం వల్ల ప్రజల మన్నెనలు పొంది వాళ్ళ పట్ల ఒక అయస్కాంత ఆకర్షణ కలిగించిన వ్యక్తుల గురించి రచనలు రావడం సహజమే . గాంధీజీ –మలయాళ కవిత్వం [మొత్తం సాహిత్యం కాదు ]అనే విషయం గురించి వివరంగా వ్రాస్తే పది పదిహేను వందల పేజీలైనా వ్రాయ వలసి వస్తుంది.అందువల్ల చాలా చాలాతక్కువగా , కొన్ని విషయాల గురించీ కొన్ని రచనల గురించీ మాత్రమే రేఖాప్రాయంగా సూచిస్తున్నాను

ఇరవయో శతాబ్దపు తొలి దశకాల్లోనే కాదు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మలయాళ కవిత్వం మీద గాంధీజీ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతోంది. అలనాటి ఆధునిక కవి త్రయమైన కుమారన్ ఆశాన్ [1873 –1924 ]ఉల్లూర్ ఎస్.  పరమేశ్వర అయ్యర్ [1877—1949 ],వళ్ళతోల్ నారాయణ మీనోన్ [1878 –1958 ]మొదలగు కవుల రచనలు మొదలుకొని ఆధునిక కవులైన ఎన్. వి . కృష్ణ వారియర్ ,సుగత కుమారి .సచ్చిదానందన్ మొదలగు కవుల రచనల్లో కూడా గాంధీజీ ప్రభావం కొన్ని చోట్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనబడుతోంది. నిజం చెప్పాలంటే కుమారన్ ఆశాన్ ,గాంధీయుగ ప్రారంభానికి ముందు[లేకపోతే ప్రారంభపు తొలి రోజుల్లో ] రచన చేసిన కవి.ఈ కవి వ్రాసిన చివరి కావ్యం దురవస్థ [1922]. కుల కలహాల్లో చిక్కుకొని సావిత్రి అంతర్జనం అనే నంబూతిరి బ్రాహ్మణ యువతి గత్యంతరం లేక ఒక మాల గుడెసలో దాంకోవడం అది తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెకి పిండం పెట్టడం తనకు రక్షణ కలిగించిన మాల యువకుడ్ని ఆమె భర్తగా స్వీకరించడం ఈ కావ్యంలోని కధాంశం. శ్రీ నారాయణ గురు గారి శిష్యుడైన కుమారన్ ఆశాన్ కుల వివక్ష తాలూకు అర్ధరహిత్యాన్ని ,ప్రస్తావించాడు ,ఇంచుమించు తను రచించిన  అన్ని కావ్యల్లోనూ .అన్ని సామాజిక రంగాల్లో కూడా బానిసత్వం రాజ్యమేలిన ఒకానొక కాలంలో బ్రతికిన ఈ కవి తన  జీవితానుభవాలను కావ్యాల ద్వారా ఆవిష్కరించి మానవాభ్యున్నతికి బాటలు వేయడానికి  ప్రయత్నించాడు. సామాజిక అసమానతలు తొలిగిపోతేనే స్వాతంత్ర్యం లభిస్తుందనే గట్టి నమ్మకం వుండేది ఈ కవికి. మానవత్వపు జెండా పట్టుకొని కుళ్ళిపోయిన సామాజిక దురాచారాలనూ ,కులవివక్షనూ ,స్త్రీ విరుద్ధ  ఆలోచనలనూ నిర్మూలనం చేయాలనేదే  ఇతని రచనల్లోని సారాంశం. గాంధీజీ ఆశయాలకు అనుగుణమైన ఆశయాలివి.

కాని గాంధీజీ తాలూకు స్వాతంత్రపు దప్పికలో కరిగిపోయిన ఒక అపూర్వ ప్రతిభ మహాకవి వళ్ళతోల్ నారాయణ మీనోన్ . ఇంచుమించు గాంధీజీకి సమకాలికుడు [1878 –1958]. ఇతడు జాతీయవాది. వారసత్వపు గొప్పతనాన్ని కాపాడుకుంటూనే బానిసత్వపు దురవస్థను ఆవిష్కరిస్తూ ప్రబోధాత్మకంగా రచన చేసిన ఈ కవి తాలూకు కావ్య హృదయం గాంధీ సిద్ధాందాలు . గాంధీజీని తన గురువుగా భావించాడు వళ్ళతోల్. ‘’నా గురువు ‘’అనే పేరుతో వళ్ళతోల్ వ్రాసిన కవితలో గాంధీ గురించి ఇలా వ్రాసారు

1 . ‘’లోకమే తరవాడు* , మానులు  పురుగులు [*తరవాడు –మాతృసామ్య వ్యవస్థలోని ఉమ్మిడి కుటుంబం.]

పచ్చిక, పిచ్చుక అంతా తన కుటుంబమై

త్యాగమన్నదే జయం ,నమ్రతే అభ్యున్నతి

యోగ విత్తనం జల్లి గెలిచే గురువర్యులు ‘’  [అనువాదం –ఎల్ , ఆర్ స్వామి ]

2   ‘’చుక్కల మణి హారం  వేసినా సరే, బురద  కాలువా నీళ్ళు తీసి జల్లినా సరే;

లేదుగా గర్వం ,బాధ అసలే, సమస్వచ్చమీ విహాయసు అట్లనే గురుగారు’’ [అనువాదం –ఎల్ . ఆర్ .స్వామి ]

‘’శాశ్వతం అహింస,యదె ఈ మహాత్ముని వ్రతం

శాంతియే ఇలవేల్పు, చీల్చేది లేదుగా

ఖడ్గమేదైనా  అతని అహింసా కవచాన్ని

[అనువాదం : ఎల్ ఆర్ . స్వామి ]

ఇలా సాగుతుంది   ‘’నా గురువు’’  అనే వళ్ళతోల్ కవిత

అహింస అనే మరో కవితలో ఇలా అన్నారు వళ్ళతోల్.

‘’నీకు లేదనుమతి చావడానికే తప్ప

చంపడానికి, నరుడా ! సాధిస్తే విజయం

శాశ్వతం

అహింసతో  ఓడిపోతుందిలే

లోకం  గొప్ప  అహింసావాదుల ఎదుట [అనువాదం : ఎల్ . ఆర్ .స్వామి ] [వ్రాసిన కాలం 1928]

గాంధీజీకి ప్రియమైన , గాంధీ సిద్ధాంతాలకు అనుగుణమైన అన్ని విషయాలనూ చాలా కావ్యాత్మకంగా ఆవిష్కరించారు వళ్ళతోల్ . అంటరానితనం ,గ్రామ స్వరాజ్ ,సర్వ మత సౌబాతృత్వం ,దేశాభిమానం ,మొదలగు విషయాలు అతనికి కవిత్వ విషయాలయాయి . వళ్ళతోల్ గొప్ప దేశాభిమాని ; గాంధీయ వాది.  పైన ప్రస్తావించిన విషయాల గురించి ఈ కవి వ్రాసిన కొన్ని పంక్తులు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది

రైతు పాట [1928] అనే కవితలో ఆయుధ బలం వల్ల నిలబడిన అధికారానికి లొంగ కుండా వుండాలనే పిలుపు ఇస్తున్నారు ఈ కవి

  1. ‘’ జీవరక్తాన్ని పెంచి పోషించే సేద్యానికే

ఆయుధాలుగా వున్న నా మిత్రులు

జీవరక్త ప్రళయము సృష్టించే ,రణంలో

ఆయుధాలుగా మారడం మెంత , విడ్డూరం ‘’[అనువాదం : ఎల్ . ఆర్ .స్వామి ]

2        ‘’ఎగర వేయకూడదు విజయ బావుటాలను

పర ప్రాణవాయువులతో

శతృత్వం కాదు మన తూటా ,స్నేహమే

నింపారు సద్గురు మన పీరంగులలో  [  ‘’  అనువాదం : ఎల్ . ఆర్ .స్వామి ]

ఒక పల్లెలోని మధ్యాహ్నం ,ఒక పల్లెలోని చలికాలం అనే రెండు కవితల్లో నిరుపేదకి స్వాతంత్ర్యం ఆహారం అనే గాంధీ సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు, వళ్ళతోల్ . దారిద్ర్యపు క్రౌర్యం అనే కవితలోని ఒక పంక్తి చూడండి :

‘’ధనికులారా, సమర్పించవచ్చు మీరు

ముత్యాలు పగడాలు వజ్ర వైడూర్యాలు

తెలుసా మీకు ఈశ్వరునికి ఇష్టమెప్పుడూ

కూలివాడు సమర్పించే చెమట బిందువులే’’ [అనువాదం : ఎల్ . ఆర్ .స్వామి ]

గాంధీజీ నాయకత్వంలో అఖిల భారత కిసాన్ సభ అనే సంస్థ రూపు దిద్దుకుంది . రైతుల పునరుద్ధరణం  ఈ సభ తాలూకు లక్ష్యం . హింసాస్పర్శ లేని రైతు జీవితం గురించి 1926 లో వళ్ళతోల్  ఇలా వ్రాసారు

‘’సౌభాగ్యంకైనా ,సంతోషం కైనా

స్వేచ్చకైనా కావాలి రైతు జీవితం

పునరుద్ధరించాలి రైతు జీవితం’’ [అనువాదం : ఎల్ . ఆర్ . స్వామి ]

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత భారత దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని అనుకున్నారు కాని అది జరగలేదు. అలనాటి భారత దేశంలో కనబడిన కులమత గొడవలు వల్లనే అలా జరిగిందని  కొందరు అనుకున్నారు. ఆ ఆలోచనా ధోరణిని వ్యతిరేకిస్తూ  1926 లో వ్రాసిన  ‘’మన జవాబు’’ అనే కవితలో  తన ఆలోచనను ఇలా ఆవిష్కరించారు

అనర్హులా మనం స్వాతంత్ర్యానికి

కులమతాల గొడవలుంటే మాత్రం

సోదరుల గొడవ గోడవే కాదుగా ,అవి

సౌహృద భావపు గట్టి కదలికలు మాత్రం

తమలో కొట్టుకుండూ గర్జిస్తాయి కెరటాలు

వాస్తవమది కాని కలసి నవ్వుతాయి,శ్వేత

నురుగులతో వెంటనే ,చూస్తున్నాం కదూ మనం [ అనువాదం : ఎల్ . ఆర్ .స్వామి ]

 

‘’ధర్మమే ఆయుధం భారత దేశానికి ఖడ్గం కాదు

నెత్తురు కూడు తినే దెయ్యాలు లేవిక్కడ ‘’  [అనువాదం : ఎల్ . ఆర్ .స్వామి ]

అని కూడా ఒక కవితలో వ్రాసారు.

గాంధీజీ తూటా తగిలి నేల మీదకి ఒరిగినప్పటినుంచి మహాత్ముని చితాబస్మం పుణ్య నదుల్లో కలిపినంత వరకు, చోటు చేసుకున్న వివిధ  సందర్భాలను గురించిన వివరణలతో బప్పూజీ[1948 ] అనే లఘు కావ్యం రచించారు వళ్ళతోల్  .

‘’గుండెకి లేదు రక్త ప్రసారం  కొట్టుకోవాలంటే

వాయువూ లేదోక నిట్టూర్పు వదిలాలంటే

కన్నీరు లేదు కనులలో ఏడవాలంటే మరీ

మాటలసలే లేవు  గట్టిగా  విలపించాలంటే

దు:ఖకడలిలో మునిగాము ఒడ్డు చూడకున్నాం’’ [అనువాదం : ఎల్ . ఆర్ . స్వామి ]

****************************

‘’వేటగాడి బాణం తగిలి కృష్ణుడు

శిలువ తగిలి యేసువు

మూర్ఘుని తూటా తగిలి గాంధీజీ’’

దేహం విడిచారని వివరిస్తూ గాంధీజినీ కృష్ణునితో యేసువుతో పోలిస్తూ మతాతీతుడు గాంధీజీ అని వర్ణిస్తున్నారు కవి

‘’నైవేద్యం’’ అనే కవితలో అయితే గాంధీజీ హత్యకి గురికావడం వల్ల విలపించే తండ్రిని అతని పసి పిల్లాడు తన ఆట వస్తువైన విల్లుతో ఆ హంతకుడ్ని చంపుతానని చెప్పి  సాంత్వన పరిస్తాడు.

ఆ మహాత్ముని మాటలు పాటించక కేవలం  ప్రతిమలు మాత్రం ప్రతిష్టించి గాంధీ అభిమానులని చెప్పుకునే స్థితి చూసి బాధ పడిన కవి ఇలా వ్రాసారు :-

‘’‘’ప్రతీతాత్ముడగు మా గురు దేవుని

ప్రతిమగా చేసి ప్రతిష్టింప చేసి ,మనం’’

అని చెప్తూ కేవలం ప్రతిమను ప్రతిష్టించడం వల్ల ప్రయోజనం లేదనీ గాంధీ తత్వాలను ఆచరించాలని చెప్తున్నారు

గాంధీజీ వల్ల ప్రభావితుడైన ఈ కవి ఖదరు ధరించడమే కాక భారత స్వాతంత్ర్య సమర కాలంలో ఆవేశభరితమైన దేశభక్తి గీతాలు కూడా ఎన్నో వ్రాసారు

గాంధీజీ గురించి వ్రాసిన కవిత్వం ఈ కవి రచనల్లో ఒక భాగం మాత్రమే.నేను ఇంత వ్రాసినా వళ్ళతోల్ గాంధీజీ ప్రభావంతో రచించిన రచనల తాలూకు ఒక శాతం గురించి కూడా వ్రాయలేదనేది వాస్తవం.మహాకావ్యం తో  సహా  ఎన్నో ఖండకావ్యాలు కూడా వ్రాసిన ఈ కవి అభిజ్ఞానశాకుంతలం మొదలుకొని,కాళిదాసుని కొన్ని ఇతర కావ్యాలు ,ఋగ్వేదం కూడా మలయాళం లోకి అనువదించారు.

వళ్ళతోల్ తరువాత తరంలోని కవులు ,ఆ మాటకొస్తే ఈ తరం కవులు కూడా గాంధీజీ వల్ల, గాంధీ దర్శనం వల్ల , ప్రభావితులై రచనలు చేసారు .వాళ్ళలో ఒకరిద్దరు గురించి మాత్రమే ప్రస్తావిస్తాను.

మొదటి జ్ఞానపీఠ అవార్డు పొందిన మహాకవి జి , శంకర కుర్రుప్[1901 –1998 ]కూడా గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందినవారే.

1 .   ‘’బానిసత్వపు బండరాళ్ళు పగలగొట్టాలన్నా

స్వార్ధపు గట్టులు చదును చేయాలన్నా

కేవలం అహింసయే తమరి  ఆయుధం

దాని పదునేమో నిజాయతి మాత్రమేగా’’     [అనువాదం : ఎల్ . ఆర్ . స్వామి ]

2        ధర్మపు కొత్త ఆయుధశాలకి చిహ్నామై

కర్మకోవిదుడు ,సత్య ,శుచీ వ్రతుడు

వచ్చారు గాంధీజీ ,ఒక ఆయుధంతో

మంటలో కాలని, ఖడ్గలాకు లొంగని ,అహింసతో

పి .కుంజీరామన నాయర్[1905 –1978 ] అనే కవి కూడా మలయాళ భాషలో మహాకవుల కోవకి చెందినవారు; సౌందర్యాత్మక కవి . ఈ మహాకవి ‘’పడక గదిలో కరినాగం ‘’అనే కవితలో,గాంధీజీ అహింసకీ  సత్యదీక్షకీ వ్యతిరేకంగా వెలుబడిన అపస్వరాల ప్రతిధ్వని గురించి ఇలా వ్రాసారు

‘’హాయి కొలిపే  స్వాతంత్ర్యపు గాలికోసం,కాలం

సగం తెరిచిన తలుపునుంచి,దూరింది

మనిషి పెంచిన కొత్త అడవిలో ,పాకింది

హింసాంధకారపు కరినాగం ‘’ [ అనువాదం : ఎల్ . ఆర్ . స్వామి ]

************************

‘’కధ మరోలా వుండేది హిమాద్రి యాశ్రమంలో

లేకపోతే ఈ కృశాంగుడు ‘’

ఇంకా ఎందరెందరో కవులు గాంధీజీ సిద్ధాంతాలు వల్ల స్ఫూర్తి పొంది రచనలు చేసారు ;ఇప్పటికీ చేస్తున్నారు. ఉదాహరణకి సుప్రసిద్ధుడైన నేటి మలయాళ కవి శ్రీ సచ్చిదానందన్ [1946–]  రచించిన ‘’శరీరం ఒక నగరం’’ ,’’ఎక్కడెక్కడో పడేసిన వస్తువులు’’ అనే రెండు కవితాసంపుటల్లో కూడా గాంధీజీ ప్రభావం వల్ల వ్రాసిన కవితలున్నాయి.   ఈ రెండు సంపుటాల తెలుగు అనువాదాలు [అనువాదం –ఎల్ . ఆర్ స్వామి ] లభ్యం కనుక ఉదహరించడం లేదిక్కడ.                         ఈ చిన్న వ్యాసంలో గాంధీజీ వల్ల ప్రభావితులైన కవులందరి గురించీ, వాళ్ళ కవిత్వం గురించీ ప్రస్తావించడం సాధ్యం కాదు. అలా ఛేస్తే ఈ వ్యాసం ఒక పుస్తకం అయిపోతుంది. గాంధీజీ మలయాళ సమాజాన్నీ ,సాహిత్యాన్ని గొప్పగా ప్రభాటితం చేసారనే వాస్తవాన్ని ప్రస్తావించాలని అనుకున్నాను ,అంతే.  ఇంత వరకు పూర్తిగా మూసివున్న కిటికీ రెక్కలను అతి తక్కువగా తెరిచి అందులోనుంచి గది లోపల అందాలను తొంగి చూడడానికి ఒక అవకాశం కల్పించడమే నా ఉద్దేశ్యం

*

ఎల్. ఆర్. స్వామి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు