మూడు చక్రాల బేరింగుల మీద మోకాళ్ళతో కూర్చొని నూకాలమ్మ గుడి ఇవతలనుంచి కింద స్మశానం దాకా వున్న డవును వరకు పోటీలు పెట్టుకొని ఫీట్లు చేస్తున్నారు. ముప్పై అడుగుల నల్ల తారు రోడ్డు నిండా బేరింగు గీతలు తెల్లగా కనపడుతున్నాయి.
టాప్ లెస్ పోలీస్ జీపు ఒకటి వీళ్ళను దాటుకొని వెళ్లి క్యాంపు ఎదురుగా వున్న మేడ ఇంటి దగ్గర ఆగింది.
కుక్క కరిసిందేమో, గుండెల దాకా లుంగీ కట్టుకున్న బర్మా కాందిశీకుడు జిల్లేడు ఆకుల కోసం వెతుకుతూ , మోకాలి పిక్క దగ్గర జిల్లేడు పాలు అద్దుతున్నాడు.
కొండ మీద నుంచి రెండు ఖాళీ బిందెలు పట్టుకొని ఆదరా బాదరా కిందకు దిగుతోంది.
కీచ్…. మంటూ జీప్ బర్మా రౌడీ ఇంటి ముందు ఆగింది.
* * *
కప్పల బడి కప్పరాడ నుంచి బర్మా కేంపు కు మెల్లగా నడుచుకుంటూ వొస్తుండగా నేషనల్ హైవే అయిదు ( అప్పుడు ) కి అటూ ఇటూ కర్రలతో బారికేడ్లు కట్టి వున్నాయి. జంక్షన్లో పోలీసులు, ఆగిపోయి చూద్దును కదా ఎవరో పెద్దాయన అక్కడకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వున్న ఎయిర్ పోర్ట్ నుంచి వొస్తున్నాడని జనం ఎదురు చూస్తున్నారు. గంట, రెండు గంటలు, మూడు గంటలు, నాలుగు గంటలు…. అదిగో వొచ్చేసాడు, అందరికి చేతులు ఊపుకుంటూ వెళిపోతున్నాడు.
“ఒరే నా వొంక చూసి చెయ్యూపాడు బే ” అంటాడు మా ఫ్రెండ్ తేలూ గాడు.
” కాదు బే నా వొంక చూసి ” అంటాను నేను.
ఇద్దరం బర్మా క్యాంపు ఎత్తు ఎక్కుతుండగా మా పక్కనుంచి శవాన్ని తీసుకుపోతున్నారు. శవం ముందు తాగేసిన జనం చిందులు వేస్తున్నారు, పాడికి నాటుకోడి ఒకటి వేలాడగట్టేరు. పోయింది పెద్ద వయసువాళ్లేమో చొక్కా లేకుండా వున్న కుర్రోడిని చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. కుర్రోడి చేతిలోనేమో నల్ల కుండ, దాన్నిండా నిప్పులు.
శవం పైనుంచి బంతి, గులాబీ రేకులు, పది, ఇరవై పైసల బిళ్ళలు పసుపురాసినవి విసురుతున్నారు. ఆ పువ్వులు తొక్కకుండా, ఆ డబ్బులు ఏరుకోకుండా జనం దూరంగా జరిగి వెళిపోతున్నారు. నేనొకటి, మా తేలు గాడొకటి ఇరవై పైసల బిళ్ళ హవ్వాయి చెప్పుల కింద తొక్కి పెట్టేసాం.
ఊరేగింపు,శ్మశానం ముఖ ద్వారంలో ఆఖరి దింపుడుకల్లెం చేసేశాక లోపలికి వెళ్ళిపోయింది. ఆ పసుపు రాసిన డబ్బులు ‘కొట్టోడు’ తీసుకోడు కాబట్టి బోరింగు కాడ కడిగీసి “అల్లీ కాయలు ” కొనేసి కేంపు వైపు నడవటం మొదలు పెట్టాము.
* * *
కేంపు లో గుడి ఇవతల నుంచి , బర్మా కాందిశీకుల సంఘం అర్జున రావ్ యింటి వరకు, అక్కడ నుంచి పొద్దున్నే నాన్ రోటీలు అమ్మే కొట్టు వరకు రోడ్డుకు అటూ ఇటూ జనమే జనం.
పోలీసులు నరసింహమూర్తి కోసం వొచ్చేరంట.
గుంట నా కొడుకులంతా వేప చెట్టు కింద కూర్చొని నరసింహమూర్తి చెట్లెక్కి, పుట్లెక్కి ఎలా పోలీసుల నుంచి తప్పించుకునేదీ,అతని దగ్గర తుపాకీ గురుంచి, అతని సాహసాలు కథలు, కథలుగా చెప్పుకునే వాళ్లం.
అలాంటి ‘ కేంపు రౌడీ’ని తీసుకు పోతున్నారు పోలీసులు.
సన్నగా రివటలా వున్న ఈ మనిషినా ఇన్నాల్లూ చూడాలని తెగ తిరిగాం, అని గుంటలమంతా ఒకటే గుస గుస.
నరసింహమూర్తిది మేడ ఇల్లు. ఇంటి ముందు కొట్టు పెట్టుకొని వాళ్ళ అమ్మ పిండొ డియాలు, కిరాణా సామాన్లు అమ్మేది. వెంకట స్వామి కొడుకూ నేనూ ఎన్ని సార్లు అతన్ని చూద్దామని ఏదో ఒకటి కొనే వొంకతో వెళ్ళామో లెక్కలేదు. ఎప్పుడైనా కనిపిస్తే కదా. ఎవరినో కొట్టాడని ఒకరు, “పార్టీ ” వాళ్ళను బెదిరించాడని ఒకరు , ఇలా రకరకాల మాటలు అతని గురుంచి వినడమే.
రెండు చేతులకూ బేడీలు వేసి అతన్ని జీపులో కూర్చోబెట్టేరు. టాపులేని నీలి జీపులో అటూ ఇటూ పోలీస్ కానిస్టేబుళ్లు ఉండగా, బేడీలు వేసిన చేతులతో జనానికి నమస్కారం పెడుతూ సినీమాలో చిరంజీవి లాగ వెళిపోయాడు
అతను ఎవరినో హత్య చేసాడని , ఆ తరువాత “ఇనుప స్క్రాప్ ” గొడవల్లో ఒక వ్యాపారే నర్సింహ మూర్తిని చంపించేసేడని నిజాలు, అబద్ధాలు కలగలిపి జనం చాన్నాళ్లు మాట్లాడుకునే వారు.
* * *
పందొమ్మిది వందల అరవై నాలుగు లో బర్మాలో మిలటరీ పాలన వొచ్చాక ఇండియా వొచ్చేసిన తెలుగు వారైన” బర్మా కాందిశీకులు ” పళ్ళాలు,లుంగీలు, గొడుగులు, నగిషీ వస్తువులు అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తన్నారు. బర్మా లో రాజాల్లాగా బతికినోళ్లు ఇక్కడ కుదేలయిపోతున్నారు.
తరువాత తరం కుర్రాళ్లకు మాత్రం తిక్కలేసింది, రైల్వే యార్డ్ ఇవతల బీడి దిమ్మలు, ఇనుపకడ్డీలు , ఇనుప సామాను సెక్యూరిటీ ఫోర్సు వోళ్ల కన్ను గప్పి కొట్టేసేవారు. గూడ్స్ బండ్ల నుంచి పంచదార బస్తాలు, కంది పప్పు బస్తాలు లేపేసే వారు.
కింద నున్న పరమేశ్వరి పిక్చర్ పాలస్ దగ్గర గలాటాలు, కొట్లాటలతో బర్మా రౌడీలు దడ పుట్టించీవోరు. “వుడుంగోడు ” ” జలగడు ” లాంటి చిత్రమైన మారుపేర్లతో ఉండేవారు.
ఇలా పేదరికంతో బాధపడుతున్న జనానికి ఎమర్జెన్సీ తరువాత అప్పటి ప్రధాని ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. అంతే జనం అంది వొచ్చిన కాడికి పోర్టు, డాక్యార్డ్ లల్లో చేరిపోయారు.
అక్కడక్కడా మిగిలిన వొకరిద్దరితో ” బర్మా కేంపు రౌడీలు” అని పేరు మాత్రం మిగిలిపోయింది.
కానీ ఆ తరువాత ఎక్కడెక్కడి నుంచో జనం ఇక్కడి ప్రాంతానికి వలస వొచ్చేరు.
ఈ కొత్త జనానికి పక్క జిల్లాలనుంచి వలసొచ్చిన వ్యాపారులు ” బర్మా కేంప్ బాచ్చీ ” అని ముద్ర వేసి, ఉపయోగించుకొని, సెటిల్ మెంట్లు, దందా లు చేసుకొని రాజకీయం గా ఎదిగారని అంటారు.
కుర్రోళ్ళు మాత్రం ” బ్లేడ్ బాచ్చీ ” ” స్నేక్ బాచ్చీ ” అని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
అప్పటిలా,ఇప్పటి వ్యాపారస్తులకు వీళ్ళ అవసరం లేదు.
* * *
మంచి కంటే చెడుకే ప్రచారం ఎక్కువ. బర్మా కేంప్ రౌడీలు పేరు మాత్రం మిగిలిపోయింది.
“మనం ఆచరించిన బౌధ్ధం , ప్రతియేడు కనుమ నాడు అనకాపల్లి తొట్లకొండ కాడ చేసే బౌధ్ధ మేళా , తెలుగు భాషకు, నాటకానికి బర్మా వాళ్ళు చేసిన కృషి ఇవ్వన్నీ తెలియాల్సినంత తెలియలేదు అని బాధపడుతో ” బర్మా కాందిశీకుల సంఘపోల్లు ప్రతీ పౌర్ణమికి ఇలా బుద్ధ భగవానుడిని స్మరిస్తున్నారు..
దుఃఖం అంతటా వుంది.
ఈ దుఃఖం ‘తృష్ణ’ వలన కలుగుతుంది.
తృష్ణ ‘అవిద్య’ వలన వస్తుంది.
అష్టాంగ మార్గమే అవిద్యానాశకారి.
సంఘం శరణం గచ్చామి.
*
చనిపోయిన వాళ్ళను తీసుకు వెళ్లేటప్పుడు శవం మీద వేసే డబ్బులు చేపుల కింద దాచేసి తర్వాత తీసుకు వెళ్లి గోలిలు కొనడం ఇలా రాయడం చాలా నచ్చింది.
కెంపు రౌడీలా కథ బాగుంది సర్
హరి వెంకటరమణ కెంపు రౌడీలు కధ చాలా ఆసక్తి కలిగిస్తూ చదివింపజేసింది. సంఘం శరణం గచ్చామి అంటూ కధ ముగించడం బాగుంది.
కెంపు రౌడీలు కధ చాలా బాగుంది.ఆసక్తిగా సాగింది.ముగింపు కూడా బాగుంది.
బర్మాకేంపు కథలు / నేపధ్యం
బర్మాకేంపు ఒక చిత్రమైన ప్రాంతం, రెండో ప్రపంచ యుద్ధం వచ్చినపుడు 1939నుంచి 1945 మయన్మార్ లో తెలుగువాళ్లు ఇండియా వొచ్చేసారు. భారతదేశం నుండి ఉపాధి, వ్యాపార నిమిత్తం మయన్మార్ వలస వెళ్లిన వాళ్లంతా తిరిగి ఓడల్లో వచ్చేసారు,రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వాళ్ళు విశాఖపట్నం తుమ్మడ పాలెంలో, నవాబుపేటలో ఒక మిలటరీ కేంపు, తాటిచెట్ల పాలెం దగ్గర మిలటరీ కేంపు పెట్టారని అంటారు, యుద్ధం అయిపోయాక తెలుగువాళ్లు తిరిగి బర్మా వెళ్లిపోయారు.
1962 సంవత్సరo బర్మాలో మిలటరీ అధికారంలోకి వొచ్చింది , తెలుగువాళ్లను భారతదేశం వెళ్లిపోమంది. ఓపిక తో ఓడల్లో చేరినవారు చాలామంది, శక్తి ఉండి అక్కడనుంచి విమానాల్లో కలకత్తా వొచ్చి రైళ్లో విశాఖపట్నం చేరినవాళ్లు మరికొంతమంది.
ఇండియా చేరిన కాందిశీకులకోసం అప్పటి ప్రభుత్వాలు దేశంలో ఆశ్రయం కల్పించాయి ,విశాఖపట్నంలో కూడా వారికి ఆశ్రయం కల్పించాయి. ప్రధానమైనది కంచరపాలెం దగ్గర బర్మాకేంపు మిగతావి ఐ టి ఐ జంక్షన్ దగ్గర సిధార్థ నగర్, గంట్యాడ, శ్రీహరిపురం ,అనకాపల్లి, యలమంచిలి దగ్గర ఉన్నాయి.
కాందిశీకుల కోసమే ఉన్న ఈ కంచరపాలెం బర్మాకేంపు చుట్టూ తరువాత మిగతా కుటుంబాలు కూడా చేరాయి. ఈ కాందిశీకులలో ఎక్కువ మంది విశాఖ జిల్లా నుంచి వెళ్లిన వాళ్లే మరికొంత మంది ఇతర జిల్లాల వాళ్లు. శెట్టిబలిజలు, వెలమలు, వాడ బలిజలు, కాపులు, గవరలు ,రెల్లీలు ,దళితులు ఇలా అన్ని కులాల వాళ్ళు వున్నారు.
కాందిశీకులుగా ఇక్కడకు వచ్చినా బర్మా వాళ్లలాగా ప్రత్యేకమైన వారిగా భావిస్తూ గొప్పలు పోవడం, అక్కడి కట్టూ బొట్టూ పూర్తిగా మారకపోవడం, అక్కడ బాగా బతికి ఇక్కడ ఇమడలేక ఇబ్బందులు పడటం, మోసపోవటం,మెల్లగా చిన్న చిన్న వ్యాపారాలు పనులు చేసుకోవటం, ఆత్మగౌరవం అదంతా బర్మా కాందిశీకులు జీవితం .
బర్మా సేమ్యాలు, నాను రోటీలు, నూడుల్సు , మోయింగా ,బర్మా లుంగీలు, పెద్దవారికి బర్మా భాష రావడం, సాయంత్రం అయితే చాలు నీసు కూరలు, ఇళ్ల చుట్టూ ములక్కాడ చెట్లూ, బాదంచెట్లూ, బౌద్ధం ఆచరించడం,ఇక్కడ దుర్గాదేవికి, సంతోషిమాతకు,నూకాలమ్మ దేవతలకు పూజలు, వినాయక చవితికి పందిర్లు, పండగలన్నీ ఒక సంబరంలాగా చేయడం. ఇంకా రోడ్ల మీద కొట్లాటలు, రౌడీయిజం ,ఆడాళ్ల బూతులు, బోరింగ్ దగ్గర గొడవలు, ఆప్యాయతలు అదో ప్రత్యేకమైన ప్రపంచం.
‘కేంప్’ చుట్టూ వున్న ప్రజల జీవితాలు, వైవిధ్యమైన జీవితం, ఉత్తరాంధ్ర అలవాట్లు ఈ కథల్లో పంచుకుందామని నా ప్రయత్నం. ఈ కథలన్నీ ఎనభైయ్యో దశకం చివరి ప్రాంతానికి చెందినవి, అప్పటి మనుషులవి.
హరి వెంకట రమణ
98660 84124
You have narrated camp rowdies story very well sir….
expecting more stories from you sir.
All the best sir
కథనం ఆసక్తికరంగా సాగింది. ఆనాటి పరిస్థితులు, పరిసరాలు, పద్ధతులు బాగా వర్ణిస్తున్నారు. మరిన్ని బర్మా కాంప్ కధనాలు ఆశిస్తున్నాను. అభినందనలు హరివెంకట్ గారు.
అందరికీ ధన్యవాదాలు.