కవిత్వం లో వస్తువు ముఖ్యమా? శిల్పం ముఖ్యమా అన్న ప్రశ్నకు సమాధానం సూటిగా దొరక్కపోవచ్చు కానీ అదే మనం ఒక కవి రచనలను మదింపు చేస్తే ఆ కవి మార్గమేదో గమనించవచ్చు.సామాజిక అంశాలను ఎంచుకునేవారు వస్తు ప్రధానకవులయితే..ఎంచుకున్న అంశమేదయినా ఒక గొప్ప సౌందర్యానుభూతితో చెప్పటం ద్వారా అది అనుభూతి కవిత్వమై పాఠకుడిని ఆకట్టుకుంటుంది.ఆకాశవాణి ప్రయోక్త ఆవాల శారదగారి వర్ణాల వాన కవిత్వ సంపుటిని పరిశీలించినప్పుడు ఈ ఆలోచన అప్రయత్నంగా మెదిలింది.అసలు ఆకాశవాణిలో పనిచేసిన సృజనశీలురందరూ సౌందర్యారాధకులే.ఆచంట జానకీరాం, కృష్ణ శాస్త్రి, బుచ్చిబాబు, లత,గోపిచంద్, శ్రీకాంత శర్మ ,సుధామ,కలగ కృష్ణ మోహన్ వంటి ప్రముఖుల రచనలు ఆ సౌందర్య శోభను ప్రదర్శిస్తాయి. ఆవాల శారద కవిత్వం కూడా ఆ రకమైన సౌందర్యంతో కాంతులీనుతుంది.
కెంజాయ కెరటాల “వర్ణాల వాన”
తాజా కవిత్వ సంపుటాల సమీక్షకి ఒక ప్రత్యేక శీర్షిక – కవితా, ఓ కవితా! మీ సమీక్షలు పంపించాల్సిన చిరునామా: editor@saarangabooks.com
ఇక ఇప్పుడు వర్ణాల వాన కవిత్వంలోకి వద్దాం.ఈ సంపుటి లోని అన్ని కవితల్లో నేరుగా వస్తువు గోచరించదు..కొంత దూరం వెళ్ళాక దారేదో కనిపించినట్టు, కవిత తో కొంత ప్రయాణం చేశాక కానీ రచయిత్రి దేనిగురించి చెబుతున్నారో స్పష్టం కాదు.ఈలోగా ఆ కవితలోని భావసౌందర్యానికి, ఇమేజరీస్ కు ఆశ్చర్యపోతుంటాం.
ఈ సంపుటిలో యాభై కవితలున్నాయి.ఒక అద్భుతమైన ఎత్తుగడ,కెంజాయ కెరటాల్లాంటి నడక, తీరం తాకుతున్న అలల సవ్వడి లాంటి ముగింపు తో, మొత్తంగా కవిత మైమరిపిస్తుంది. పుస్తకం పూర్తయ్యేసరికి మరణం, మట్టి, మోహం రుతువు, చీకటి,తెలివెన్నెల, కింజాల్కాల పరాగాలు,తడారని సంతకాలు మనలను కమ్మేస్తాయి. కొన్ని కవితలు హిందీ పాటలు శీర్షికలతో ఉండి కవయిత్రి రేడియో పాద ముద్రలను గుర్తుచేస్తాయి.
కభీ తన్హాయి మే
ఖోయా ఖోయా చాంద్
లెహరోంకీ తర్హా వంటి కవితలు మచ్చుకి చెప్పుకోవచ్చు
అసలు కవిత్వమే ఒక అర్థం కాని ఆల్కెమీ అనుకుంటే పాఠకుడితో కనెక్ట్ అయ్యే విధమేదో తెలిసిన టెక్నిక్ అనండి..జాదూ అనండి..అది ఈ కవితల్లో నాకు కనిపించింది.. stream of consciousness శిల్పం కథల్లో కనిపించినంతగా కవిత్వంలో కనిపించదు కారణాలు ఏవయినా. కభీ తన్హాయి మే పద్యాన్ ని తీసుకుంటే ఒక నైరూప్య చిత్రం లా ఉంటుంది.
రికామీ గాలి జతగా
గుండెల్ని తాకే గజల్ రజను
సునో మేరీ బంధూరే అంటూ మొదలై మెలిపెట్టే పాట
అనేక అనుభూతుల సమాహారమై ప్రయాణిస్తుంది.
అది మంద్రంగా సాగేఆలాప్ గా
గమకాల్లో మెలితిరిగే పాటగా
దుఃఖ తంత్రుల్ని మీటే పాటగా పతాక స్థాయికి తీసుకెళ్ళే
ఆ పాటకు మధ్య మధ్యలో ఎన్నో పల్లవులను సమకూర్చుతారు రచయిత్రి . చివరికి ఏమయింది.పాట ఆగిపోతుంది.దోసిలి నిండా కలలో రా లిన పూలు అని ముగుస్తుంది కవిత.కొత్త వ్యక్తీకరణలకు సాక్షిగా నిలిచే కవిత కభీ తన్హాయి మే.
పుష్ప విలాపం విన్నాం కదా.. పుష్ప విలాసం గురించి రచయిత్రి ఎంత విలాసంగా చెబుతారో
అమాయకంగా కనిపించే విరులు ఎంత పనిచేస్తాయో అని ఆశ్చర్యం ప్రకటిస్తూ ఆ భావాలను విరుల తేనె గా పంచుతారు
పొడిగాలిలో తేలి
నిదురోయిన తడి జ్ఞాపకాలను
దండకట్టిమెడలో వేస్తాయి ” అంటారు.
తిరణాలలో గోపాలదేవుణ్ణి గరుడ వాహనం మీద
ఊరగించినట్టు
మల్లెపూల మారాణుల్ని
పల్లకీ కట్టి ఊరేగించాలనుంది
అని సౌందర్యాన్ని మన మనసున మాలలు కడతారు.
ఆవాల శారద గారి కొన్ని కవితలోని పదబంధాలు మీముందుంచుతాను.వాటిలోని సౌకుమార్యం తెలుగు భాషలోని సొగసును మనముందుంచుతాయి
దక్షిణపు గాలిలాంటి /మెత్తటి హాయి కోసం/
ఎడతెగని నిరీక్షణ (రాతి పువ్వు)
పడిపోయే మనిషిని/పట్టుకుని లేపి కళ్ళు తుడిచి/
గుండెకద్దుకునేది దుఃఖమే (దయామయి)
రంగుల రాట్నమల్లే /ఖాళీగా పైకీ కిందకీ ఊగే కాలం/
ఎప్పుడైనా ఆగిపోవచ్చు (పసరు జ్ఞాపకం)
కవి ఎప్పుడూ అందమైన తన భావాలకు అద్భుతమైన పదచిత్రాల రెక్కలు అమర్చాలనే ఆరాటపడతాడు.కానీ అందరికీ అది సాధ్యం కాదు..కథా రచన ఎలాంటి క్రాఫ్ట్ గా భావిస్తామో..కవిత్వంలో వస్తు ,శిల్పాల సమతుల్యత సాధించటం మరింత కష్టం.. చాలా తక్కువ మందికి ఆ నేర్పు అలవడుతుంది.ఈ కవయిత్రి ఆ నేర్పు, ఒడుపు తెలిసినవారు.అందుకు సాక్ష్యం ఈ వర్ణాల వాన. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి ప్రత్యక్ష శిష్యరికం, దేవులపల్లి వారి ఏకలవ్య శిష్యరికం శారద గారి కవిత్వ శైలిపై ప్రభావం చూపాయనిపిస్తుంది.అందుకే పదలాలిత్యం,భావప్రకటన పోటీ పడుతుంటాయి.ఈ కవితలన్నీ వారి పదేళ్ల ప్రయాణపు మైలురాళ్ళు.ఇప్పటికే అనేక బహుమతులు పొందున్నారు.అందరి కవిత్వం మనసు మూలల్లోకి చొచ్చుకుపోదు.కొందరికే అది సాధ్యం.
కవిత చదవగానే ధ్యానంలో కి వెళ్లి నెమరేసుకున్న అనుభూతి వర్ణాల వాన కవిత్వానిది.
వస్తువు, శిల్పం పోటీ పడితే ఆ కవితలోని భావసాంద్రత మనలను ఓ పట్టాన వదలదు.అలాంటి ఒక కవిత కొల..మానం. ఈ పంక్తులు చూడండి.
ఎదిగిందనుకున్న నాగరికత/
దిగంబరంగా నిశీధిలో ఊరేగుతోంది/
మానమంటే కేవలం స్త్రీ వాచకమేనా
మర్మాయవమంటే ప్రేమనూస్రవించే పుణ్యక్షేత్రమని/
మానమంటే చేయెత్తి మొక్కే సంస్కార చైతన్యమని/
వారికి ఎవరైనా చెప్పండి”
ప్రతి మగవాడిలోను ఒక అపరాధ భావన రేకెత్తించే వాక్యాలు..
దాదాపు నాలుగు దశాబ్దాల ఆకాశవాణి విశాఖపట్నం, విజయవాడ హైదరాబాద్ప్ర, కొత్త గూడెం కేంద్రాల్లో పనిచేసిన కాలంలో అనేక కార్యక్రమాలను రూపొందించిన వారి స్వరం శ్రోతలకు ఎంతో సుపరిచయం
భర్త ఈమని కృష్ణశాస్త్రి తో కలిసి నిర్మించిన కార్యక్రమాలకు ఆకాశవాణి వార్షిక పురస్కారాలు అందుకున్న ఆవాల శారద, చాలా ఆలస్యంగా తొలి పుస్తకం వెలువరించారు. ఈ పుస్తకం వెలువడటానికి ప్రేరణగా నిలిచి తరలిరాని లోకాలకు వెళ్ళిపోయిన సహచరుడికి అంకితమిచ్చారు.
కవిత్వం అంటే ఏమిటి.. దాని ప్రత్యేకత ఏమిటి అని ప్రశ్నించే అనేకమందికి సమాధానం వారి కవనం కవితలో లభిస్తుందనిపిస్తుంది.
“బాధలో నానిన అక్షరాలు
జీవానుభవాల సముచ్ఛయమైతే
తలపుల చెరువులో
రంగుల ఋతువై విచ్చుకునే కవిత్వమంటే
మాండలీకాల కందని మానవ భాషేగా”
వచనమే కవిత్వం గా చెలామణీ అవుతున్న కాలంలో
కవిత్వమంటే శాలువాలు, కవి సమ్మేళనాలు,సోషల్ మీడియా స్టేటస్ గా మారిన కాలంలో
కవిత్వమంటే గుండె కవాటాల్లో దాచుకునే రసానుభూతి
అని ప్రకటించే కవిత్వంగా వర్ణాల వాన పాఠకుడికి గుర్తుండిపోతుంది
వర్ణాల వాన
ఆవాల శారద కవిత్వం
నూట మూడు పుటలు
120రు.
కాపీలకు 9295601447 నెంబర్ సంప్రదించాలి
కవిత్వపు వర్ణాల వాన