ఒక విషయం రచయిత దృష్టిలో పడుతుంది. అది జీవంపోసుకుని రచనౌతుంది. పాఠకుల మనసులలో వెలుగు నింపుతుంది. వారి స్వంత అనుభవంలా భ్రమింప చేస్తుంది .హృదయాలలో శాశ్వత ముద్ర వేస్తుంది.
కథలన్నీ రచయితల దృష్టి కోణాలకు అద్దం పడతాయి. కొన్ని కేవలం ఆ దృష్టి కోణానికి, ఆ రచయిత భావజాలానికి ప్రచారంలా ఉంటాయి. తీర్పులిస్తాయి .కొన్ని అర్థంకాకుండా వుంటాయి .అర్థంకాని కథలు చదివి పాఠకులు తమ తెలివిని తక్కువ అంచనా వేసుకునే పరిస్థితి కల్పిస్తాయి. శిల్ప చాతుర్య ప్రదర్శన కోసం కథలు వ్రాయవచ్చు. సర్రియలిస్టిక్ గా వ్రాయవచ్చు. మాంత్రిక వాస్తవికతతో వ్రాయవచ్చు. పాఠకులకి కథ అర్థం కావాలి. మాంత్రికతలో లోని వాస్తవికతను అర్థంచేసుకునే శక్తిని ఇవ్వాలి.
కథలకి కూడా గైడ్స్ వ్రాసుకోలేము కదా! సమాజంలో పండితుల కన్నా సాధారణ చదువరులే ఎక్కువ కనుక కథలో వారు తమని తాము చూసుకోగాలగాలి. లేదా ఒక వర్గపు జీవితాన్ని రచయిత మన కళ్ళముందు పెట్టినప్పుడు అంతవరకూ మనకు తెలియని ఒక సామాజిక పార్శ్వాన్ని మనం అర్థం చేసుకోగలగాలి . అట్లా ఆంధ్రా కోస్తా తీర వాసుల, దక్షిణ జిల్లాల పట్టపోళ్ళ జీవితాల్ని వాళ్ళ ఆచార వ్యవహారాలని ఆరాట పోరాటాలను మన ముందు పెట్టిన కృష్ణ జ్యోతి కథలు హంగూ ఆర్భాటమూ లేకుండా జీవితాన్ని మాత్రమే చూపిస్తాయి . జీవితాలనుంచే పుట్టిన కథలు. మధ్య తరగతి బుద్ధి జీవుల కథలు కావు. చాలా వరకూ దిగువ తరగతి శ్రమ జీవుల జీవన పోరాటపు కథలు. Overtones లేకుండా శక్తివంతంగా చెప్పిన కథలు. కథలో ప్రత్యక్ష్యంగా ఏదో ఒక పాత్ర పక్షం వహించడం కాక ఒక ప్రేక్షకురాలిగా సంయమనంతో ‘ఇదీ సంగతి, ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం’ అన్నట్టు నిబ్బరంగా చెప్పిన కథలు. సామాన్యంగా అనిపించే అసామాన్యమైన కథలు. అభివృద్ది పథంలో ముందుకు దూసుకు పోతున్నామని భ్రమ పెట్టే వాతావరణంలో, అభివృద్ధి అందరిదీ కాదు అని అర్థం చేయించే కథలు. హేతువూ, జ్ఞానమూ, సౌకర్యవంతమైన బ్రతుకూ అందరికీ చేరలేదని చెప్పే కథలు. కొన్ని నమ్మకాలూ విశ్వాసాలూ చిరస్థాయిగా నిలిచిపోయి బ్రతుకుపరుగులో అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నాయని చెప్పే కథలు. ఎక్కువ కథలు దాదాపు క్రింది తరగతికి సంబంధించినవే.
పితృస్వామ్య సమాజంలో జీవిస్తూనే దానితో తలపడుతున్న బలమైన స్త్రీ పాత్రలు ప్రధానంగా ఉండే కథలున్నాయి .
కాకిగూడు కథ లో కాకిగూడు పడగొట్టడాన్ని ఆపడం ఒక్కటే అంశం కాదు. ఇందులో ఇంకొక పొర కూడా వుంది. అమ్మ ఇంటి నుంచీ అత్త ఇంటికి వచ్చిన కోడలు అక్కడ నిలదొక్కుకుని అది తన ఇల్లు కూడా అనే భావం రావడానికి పట్టే వ్యవధి చాలా వుంటుంది. ఆ భావం కోడలికి రానివ్వకుండా ఉండడానికి అటునుంచీ చాలా ప్రయత్నాలుంటాయి. పిల్లలు పుట్టాక కాస్త ఫరవాలేదు. చెట్టుమీద కాకి గూడు పడగొట్ట నివ్వకుండా కాపాడడానికి ఎన్నో మాయమాటలు చెప్పాల్సోస్తుంది ఆఖరికి వీధి పిల్లలకు కూడా. ఆడబడచు కూతురి పెళ్ళికి తన వడ్డాణం ఇవ్వడంతో ఆ ఇంటికి రాణి నయ్యానంటుంది కథకురాలు. ఉపాయంతోనో త్యాగంతోనో కరుణ తోనో గూడు నిలబెట్టేది స్త్రీలే. మనిషి గూడైనా కాకిగూడైనా .
స్త్రీ ధనం కథలో రమణమ్మ, దురాయి కథలో లచ్చమ్మ,కొత్త పండుగ కథలో అలివేలు విజయమో అపజయమో చివరి వరకూ నమ్మిన విషయంకోసం పోరాడిన స్త్ర్రీలు. రమణమ్మ కి డబ్బు విలువ తెలుసు. మొగుడి మాయలో పడి తన స్త్రీ ధనమే కాక అత్త ముందుచూపుగా కూడ బెట్టుకున్న డబ్బు కూడా పోగొట్టుకుని చివరికి తన దగ్గిరికే చేరిన కోడల్ని దగ్గరకు తీసి జీవిత సత్యం చెప్పిన రమణమ్మ వ్యక్తిత్వాన్ని చాలా సహజంగా చిత్రించారు రచయిత్రి. రవణమ్మ కొడుకు తల్లినీ భార్యనీ కూడా మోసం చేసి ఆ డబ్బుతో చెక్కేస్తాడు. దురాయి కథలో లచ్చమ్మకూడా కూతుర్ని కొట్టిన అల్లుడిని శిక్షించాలని చాల పోరాడి అసహాయురాలై చివరికి అల్లుడికి యాక్సిడెంట్ అయితే చనిపోయిన భర్తే అతన్ని అట్లా శిక్షించాడని తృప్తి పడుతుంది. కానీ దెబ్బలు తగిలిన అతనికి సేవ చేయడానికి కూతురే వెళ్లాల్సి వచ్చింది. పితృస్వామ్య సమాజంలో ఉండే గొప్ప ఐరనీ అది. కొత్త పండగ కథలో రామమూర్తి కూతుర్ని అపురూపంగా పెంచుకుని పెళ్లి చేస్తే, ఆ అల్లుడు అస్తమానమూ దేశాలు పట్టుకు పోయి సంసారం పట్టించుకోడు. ఇద్దరు ఆడపిల్లల్ని కన్నాక ఇక అంతులేకుండా ఎటో పోయాడు. అలివేలు గుండె నిబ్బరం చేసుకుంది. తండ్రీ కూతురూ ఒకరికొకరుగా బ్రతుకుతూ ఉంటే హఠాత్తుగా పోయాడు రామమూర్తి. అప్పుడు తలకొరివి చర్చ మొదలైంది. చివరికి రామమూర్తి దూరపు బంధువు ఒకర్ని పట్టుకున్నారు. తల కొరివి పెట్టడం అంటే ఊరకే ఉందా ? అతగాడు బేరాలు పెట్టాడు. ఎకరంపొలం ఇమ్మన్నాడు. అలివేలు కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యమన్నాడు. చివరికి అరెకరం పొలానికి ఒప్పుకున్నాడు. అప్పుడు లేచి నిలబడింది అలివేలు. తన తండ్రి బ్రతికి ఉండగా ఎప్పుడూ తననే తల కొరివి పెట్టమనే వాడనీ, అంచేత తనే ఆ పని చేస్తాననీ ముక్కు పచ్చలారని తన బిడ్డని చింపిరి జుట్టు పిల్లవాడికి ఇచ్చే పని లేదనీ చెప్పేసింది. కొంత పెత్తందారీ తనం, కొంత చర్చ, కొంత బెదిరింపులయ్యాక జనం దిగి వచ్చారు. అలివేలు కుండ పట్టుకుని శవం ముందు నడిచింది. కొత్త పండగలా రామమూర్తి ఆఖరి ఊరేగింపు సాగింది. ఆ పల్లెలో అది కొత్త సంగతే. సందర్భాన్ని స్వార్థానికి ఉపయోగించుకోవాలని ఒకరు చూసినప్పుడు ధైర్యంగా నిలబడ్డ అలివేలు కొత్త దేవతే.
‘నేను తోలు మల్లయ్య కొడుకుని’ ‘సముద్రపు పిల్లాడు’ రెండూ విశిష్టమైన కథలు. సముద్రంతో స్నేహం చేసిన చిన్న పిల్లాడు. కాళ్ళకి చెప్పులు లేవు. స్కూలు సంచీ చిరిగి పోయింది. ఆసమయంలో మామతో బోటుమీద పోయి తన చిట్టి చేతులతో బరువైన చేపను పట్టాడు. అది అమ్మితే అతనికి స్కూలు సంచీ వస్తుంది. మామ సంతోషిస్తాడు కానీ చేప పొట్టలో గుడ్లున్నాయి. చేపను చంపితే గుడ్లు కూడా చచ్చి పోతాయి. పిల్లలు రావు. అందుకని మళ్ళీ దాన్ని సముద్రంలో వదిలేసాడు. వాళ్ళ నాన్న చేపలు పట్టను పోయి సముద్రంలో మునిగి పోయాడు. వాళ్ళ అమ్మ వాడికి, చేపలు గుడ్లు పెట్టే కాలంలో నాన్న వస్తాడని చెప్పేది. చేపలు గుడ్లు పెడితే పట్టపు పిల్లల నాన్నలు వస్తారు. స్కూలు సంచి లేకపోతె గోనె సంచిలో పుస్తకాలు తీసుకుపోవచ్చు అనుకుంటాడు. కథ చుట్టూ సముద్రంలో చేపలు పట్టే వాళ్ళ నేపధ్యం, పిల్లవాడి ఆలోచనలు, తండ్రిలేని బాల్యం గొప్పగా చిత్రించారు కృష్ణ జ్యోతి. ‘నేను తోలు మల్లయ్య కొడుకుని’ కథ ఎన్ని ప్రభుత్వాలు మారినా చెప్పులు రిపేర్ చేసే మారయ్య బ్రతుకు మెరుగుపడదు. మారిన జీవన శైలుల వలన అతని వృత్తి దెబ్బ తింటుంది. అట్లాగే అతని స్నేహితుడు జగ్గయ్య జీవితం,బీదరికం, కులాల మధ్య అంతరాలు అడ్డుగోడలు కూడా మారవు, కూలవు. ఆ ఉక్కు గోడలు కూలాలంటే వాటిక్రింద బాగా వేడి పెట్టాలంటుంది తొమ్మిదో క్లాసు చదివే అతని మనమరాలు. ఆ పిల్ల తరానికైనా ఆ గోడలు కూలుతాయో లేదో! ఆ సంగతి మారయ్య కి అర్థం అయిందో లేదో!! ‘నా నేల నాకు ఇడిసి పెట్టు సారూ’ కథ ప్రభుత్వం తీసుకున్న కాస్త మడి చెక్క మీద మనేదతో ప్రాణాలు విడిచిన రైతు అంకయ్య కథ. మట్టిలో పుట్టి మట్టిని నమ్ముకుని బ్రతికిన మనిషి.
నాగరికత పెరిగిన కొద్దీ మూఢ నమ్మకాలు కూడా పెరగడానికి సాక్ష్యంగా ఇప్పుడు జనన మరణాలకు కూడా ముహూర్తాలు మంచిరోజులు చూడ్డం వచ్చాయి. మరణానికి ముహూర్తం పంచమి కథ. వ్యగ్యమూ ఒకింత హాస్యమూ కలిపి చెప్పిన కథ ‘తెల్ల మచ్చల నల్లపంది’. నగరమూ పల్లె అనే భేదం లేకుండా యువతలో పెరుగుతున్న పోర్న్ విడియోలు పిచ్చి గురించిన కథ ‘బొమ్మ’. చెత్త డబ్బా లో దొరికే సానిటరీ నాప్కిన్ తో ధన్యమయ్యే ఈ దేశంలోని ఒక ధన లక్ష్మి కథ ‘ఒక దేశం-ఒక ధనమ్మ’. ఇట్లా అన్ని కథల్ని గురించీ రాసుకుంటూ పోవడం తప్పు కదా! అయినా వ్రాత చాపల్యం కొద్దీ చాలా కథల్ని గురించి చెప్పాను . కానీ, పై పై కథ తెలిసిపోయినా, కథనం లోని బిగువు, పదాల వాడకంలోని వింతైన సొగసు వల్ల మొదటినుంచి చివరికంటా ఈ కథలు పాఠకులని ఆకర్షిస్తాయి.
కృష్ణజ్యోతి కథల్లో కథకి అవసరమైన నేపధ్యాన్ని చెప్పడం వరకే వర్ణనలుంటాయి. అనవసరమైన వివరాలు అసలుండవు. క్లుప్తంగా నిరాడంబరంగా కథ చెబుతుంది. పాత్రోచితమైన భాష వాడుతుంది .అక్కడక్కడా కొన్ని చక్కని వాక్యాలుంటాయి.
‘చేసినంత చాకిరీ గా ఉంటుంది’
‘ఆడదానికి తగిలిన నొప్పి మనిషి జాతికి పట్టదు.ఆడ పుటకని న్యాయదేవత వెలేసింది కదా….’
‘సముద్రం వదిలి మట్టిలో కలిశాడు’
‘ఆడమనిషిలో, మొగోడు చిన్నంగా నవ్వి రెండు మంచి ముచ్చట్లాడి దగ్గరికి తియ్యగానే, గొర్రెకి మల్లె ఒళ్లప్పగించే బోళాతనం లేకుండా ఉంటే దాన్ని గెలవను శివుడి తరం కూడా కాదబ్బా’
*
కొత్త పండగ కి మీ పరిచయం బాగుంది. రచయిత్రి కి శుభాకాంక్షలు.
good foreword. congrats.
అభినందనలు కృష్ణ జ్యోతి గారు.
బెజవాడ పి. సత్యవతి అక్కయ్యా!
హంగూ ఆర్భాటమూ లేకుండా జీవితాన్ని మాత్రమే చూపిస్తూ, జీవితాలనుంచే పుట్టిన కథలు … హేతువూ, జ్ఞానమూ, సౌకర్యవంతమైన బ్రతుకూ అందరికీ చేరలేదని చెప్పే కథలు రాసిన కృష్ణజ్యోతి గారి ‘సముద్రపు పిల్లాడు’ కధ నాలో కలిగించిన అలజడిని వారికి ఫోను చేసి తెలియచేసుకున్నా. త్రిపుర గారి రమణజీవి రాసిన అద్భుతమైన కధ ” సముద్రం ” చదివారా? మన తిర్పతి నామిని అన్నను పలకరిస్తూ ఉన్నారు కదా అంటూ …
సత్యోతక్కయా, మీ లాంటి ప్రతిభావంతురాలైన సీనియర్ రచయిత్రి కృష్ణజ్యోతి గారి కధల సంకలనం “ కొత్త పండగ “ ను విశ్లేషిస్తూ పాఠకులకు పరిచయం చేస్తున్నందుకు కృతజ్నతలు. మరిన్ని ఇస్మత్ ఆపా కధల అనుసృజనలు కానీ, లేకుంటే “దమయంతి కూతురు”, “సప్తవర్ణ సమ్మిశ్రితం” లాంటివి కాని మరిన్ని ఇవ్వరా!
నేను తోలు మల్లయ్య కొడుకుని… కృష్ణజ్యోతి
http://saarangabooks.com/retired/2015/10/01/%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A4%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B1%81/
సముద్రపు పిల్లాడు ~ ఎం.యస్.కె. కృష్ణజ్యోతి
http://lit.andhrajyothy.com/tajakadhalu/samudrapu-pilladu-13454