కృష్ణశాస్త్రి రావిచెట్టు నేర్పిన పాఠం

ఈ ఉదయం ఈ వేపచెట్టు కేసి చూస్తుంటే నీకు కరోనా బాధ లేదు కదా అనిపించింది.

శార్వరి పేరుతో వచ్చిన కొత్తసంవత్సరం రెండోరోజు ఉదయమే మెలకువ వచ్చేసింది. ఆరుగంటలని తెల్లవారుఝాము అనం కదా. కానీ నా లాంటి చాలా మందికి అది తెల్లవారు జామే.
లేచి తలుపుతీసి బాల్కనీ లోకి వచ్చేను.
అంతటా నిశ్శబ్దం. కాసిని పిట్టల అరుపులు చక్కగా వినిపిస్తున్నాయి. మామూలుగా ఐతే ఏదో జనసమ్మర్దపు రొద వినిపించేది. దూరాలనుంచే. కానీ అదేదీ లేదు. అందరూ నిద్రలలోనో మెలకువ లలోనో జీవనసంరంభాలకు ఒకింత ఎడంగా ఉన్నారు. అందుకే ఈ నిశబ్దం.
అడవి ప్రాంతంలో రాత్రిపూట ఆకాశమూ, చుక్కలూ ఎంత నల్లగా ఎంత ఉజ్వలంగా ఉంటాయో అనుభవైక వేద్యం. విద్యుత్ దీపాల వెలుగులు శూన్యాకాశాన్ని ఆవరించకపోవడం వల్ల. చీకట్లు చిక్కగా ఉండడం వల్ల.
అందుకే నన్నయ గారు “శారద రాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులను చారుతరంబులయ్యె” అని రాయగలిగేరు.
ఈ ఉదయపు నిశబ్దం అలాగే అనిపించింది.
ఎదురుగా గాలికి నెమ్మదిగా ఊగుతూ వేపచెట్టు. మొక్క ఈ మధ్యనే కాస్త చెట్టయింది. గుర్తు గా అక్కడక్కడ కాసింత పూత.
ఉదయపు గాలి ఆ పూత తాలూకు స్పృహను మోసుకొస్తోంది. ఏదేనా చెప్పుకుంటే ఈ వేపచెట్టు కి అర్ధమౌతుందా? మాటలు వింటుందేమో వినగలదేమో అనిపించింది.
ఇళ్లలోనే ఉండిపోయి మౌనాలలోకీ ధ్యానాలలోకీ వెళ్లడానికి తగిన అవకాశమే కదా ఇది. కానీ దానికోసం మనసును ఎంత చిక్కబట్టుకోవాలి. ఎంత నిమిత్తమాత్రంగా ఉండడం నేర్చుకోవాలి అని అది పెద్ద బరువుగా తోచింది. ఇది మోస్తేనే బరువు. దింపెయ్యగలిగితే ఈ బరువు మనది కాదు. దింపాలని గట్టిగా అనుకుంటే అనేక మార్గాలు. అందులో భాగంగా  కృష్ణశాస్త్రి గారు వాళ్ల ఊళ్లో రావిచెట్టు మీద రాసిన వ్యాసం గుర్తొచ్చింది.
పిఠాపురం దగ్గర చంద్రంపాలెం అనేఊరు దేవులపల్లి వారి ఊరు. నేను మొదటిసారి ఆ ఊరు వెళ్లక ముందే ఈ మా ఊళ్లో రావిచెట్టు వ్యాసం చదివాను. తర్వాత వెళ్లినప్పుడు ఎక్కడ ఉందా అని వెతికాను. ఊరి మధ్యనే ఉంది. ఆయన చెప్పినట్టే ఉంది.
ఐతే ఆ వ్యాసం చదవకపోతే నాకు మామూలు రావిచెట్టు లాగే అనిపించి ఉండును.
చదివేక ప్రతీ రావిచెట్టూ ఆ చెట్టు లాగే అనిపించింది. అలా గమనించడం నేర్పేరనమాట.
ఆయన మాటల్లోనే చూద్దాం
“చెప్పేను కదా మా ఊళ్లో రావిచెట్టు ఊరి మధ్యనే ఉంది. దాని మానుచుట్టూ పెద్ద మట్టి అరుగు ఉండేది. దానిమీద ఎప్పుడూ ఎవళ్లో కూర్చునో పడుకునో ఉండేవారు. కానీ రావిచెట్టు మాత్రం ఎప్పుడూ నిద్దరపోయేది కాదు. ఎంచేత అంటారా ఒక నిమిషమైనా కన్నుమూయనిది రావిచెట్టు ఒక్కటే.
రావిచెట్టు ఆకులు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. ఒక్క చిటికైనా ఆగకుండా. అంచేతనే కాబోలు నాకు అదెప్పుడూ నిద్రపోనట్టు అనిపించడం.” అంటూ దాని మెలకువ గురించి ఒక చెణుకు విసురుతారు.
చిన్నప్పుడు దానిమీద దయ్యాలుండేవని భయపడేవాళ్లట పిల్లలంతాను. ఆ భయం బావుండేది ట. ఇది చెప్పి ఇప్పుడు పిల్లోళ్లే పెద్దోళ్ళయి పుట్టేసేరు అంటారు. ఆ అమాయకత్వం పోయిందని. సైన్సు చదివేసుకుని దయ్యాలు లేవంటారని.
చెట్టు ని మనం అలా గమనించుకుంటూ ఉండాలే గాని చాలా స్పందనలు వినిపిస్తుందిట.
ఆ చెట్టుకింద తోలుబొమ్మలాటల వాళ్లు విరాటపర్వం ఆడుతూ ఉంటే తమతో పాటు చెట్టు కూడా స్పందించేదట.
ఎలాగంటే రావిచెట్టెప్పుడూ గలగలలాడినా సమయాన్ని బట్టీ కథ పట్టును బట్టీ రావి సవ్వడి మారేదట. ద్రౌపది కష్టాలకి ఉస్సురని నిట్టూర్చడం, వలలుడి చేష్టలకి గలగల మని నవ్వడం అలాగ.
కథాసందర్భానికి అనుగుణంగా దాని గలగలలు ఆ బాలకవికి అనిపించే వనమాట. పురాణం చెప్తుంటే ఊఁ కొడుతున్నట్టే ఉండేదిట. అందుకని వాళ్ల ఊళ్లో ఓ కవి “రామశాస్త్రి పురాణం చెబుతుంటే రావిచెట్టు ఊఁ కొట్టు రంగయ్య గుర్రు పెట్టు అని కొంటెగా రాసేడట
మన శాస్త్రి గారికే కాకుండా మరోకవికి కూడా రావిచెట్టు ని వినడం అర్ధమైందనమాట.
వాళ్ల ఊళ్లో రావిచెట్టు కింద అనేకం జరిగేవట. అన్నీ విని కూడా దేనినీ పైకి పొక్కనిచ్చేది కాద ట. పైగా ఎత్తుగా ఉండడం వల్ల ఊళ్లో సంగతులన్నీ కనిపెట్టినా కడుపులో దాచుకునేదట.
దానికి ఎరుక ఎక్కువ అంటారు. అందుకే అది బోధివృక్షం అయిందని. దానికి దయకూడా ఎక్కువ కాబట్టే ఎన్ని తరాల నుంచో ఊరి రహస్యాలు తెలిసీ ఏమీ పైకి పొక్కనివ్వకుండా ఊరిని కాపాడుకుంటూ వస్తున్నదని అంటారు ఆయన.
చిన్నప్పుడు ఆయన దాన్ని ఎంతగా కనిపెడుతూ ఉండేవాడో. నిత్యమూ దాన్ని చూస్తూ ఎలాంటి అనుబంధాన్ని పెనవేసుకున్నాడో చదువుతూంటే ఆశ్చర్యం గొలుపుతుంది.
పెద్దయ్యాక  ఆ చెట్టు గురించి ఆలోచించుకుంటే తనకు తోచిన మాటలు ఇలా రాస్తారు.
“నా కొకటి వింతగా తోస్తుంది.
ఏమిటంటే ఎప్పుడూ రావిచెట్టు ఆకులు గలగలమంటూ రొద చేస్తూనేఉంటాయి కదా! ఆ రొద ప్రశాంతమైన గ్రామవాతావరణాన్ని కలచివేయకుండా మరింత నిశ్శబ్దం లో ఎలా నింపుతుందీ అని. అదేమిటో గానీ మా ఊళ్లో వినపడే ప్రతీ ధ్వనీ ఆవు అంబారవమూ, రాట్నపు రొదా, పొలికేకా ఒక్కొక్క పాట. అవన్నీ కూడా చల్లని నిశ్శబ్దాన్నే మరింత చల్లగా చేస్తాయి. రావి ఆకుల రొదకూడా అంతే.
నగరంలో ప్రతీధ్వనీ నరాలను కదిలిస్తుంది, తెంపుతుంది. పల్లెలో మనసును నింపుతుంది “
లాక్డౌన్ వల్ల నగరాలు పట్నాలూ నిశ్శబ్దంలోకి బలవంతంగా నెట్టబడ్డాయి. కానీ ఈ ఉదయం పట్నం అంతా పల్లె నిశ్శబ్దంలోకి తిరిగిందనిపించింది.
కాస్త సమయం చిక్కింది. జరిగేదేదైనా తప్పదు.ఆపడం కోసమే ఈ స్టే హోమ్ లు. ఇంతకన్న మన చేతుల్లో కూడా ఏమీ లేదు. ఇళ్లకే పరిమితం కావడం కాస్త కష్టమేమో చాలామందికి.
 కానీ దొరికిన ఈ సమయాన్ని మౌనం లోకి మలచుకోగలిగితే, ఇలా చెట్లూ మొక్కలూ మనకి చేరువై, మనతో మన మౌన భాషణం వింటాయేమో. మన దిగులూ, బెంగా కూడా వినగలవేమో
మా శరభవరం లో మా ఇంటి ఆవరణ లో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆరువందల గజాల స్థలంలో రెండు మట్టిళ్ల మధ్యనున్న ఆవరణ లో ఆ చెట్టు ఉండేది.
శీతాకాలపు ఎండని వేసవికాలపు నీడలని అందించేది. పిల్లలం దానికింద కూచుని రాత్రి వేళ అన్నాలు తినేవాళ్లం. మమ్మల్ని అన్నివేళలా కనిపెట్టుకుని ఉన్నట్టుండేది. కానీ మా పనుల్లో హడావిడుల లో దాన్ని పట్టించుకునేవాళ్లం కాదు. ఎప్పుడైనా వేసవి రాత్రి దాని కింద పడుకున్నప్పుడు ఆకులమధ్యనుంచి కనిపించే వెన్నెలనేనా చూసేవాళ్లం కాని దాని మాటలకి చెవి ఇచ్చేవాళ్లం కాదు.
కానీ ఈ ఉదయం ఈ వేపచెట్టు కేసి చూస్తుంటే నీకు కరోనా బాధ లేదు కదా అనిపించింది. దానికి అర్ధమయి నవ్వింది.  “మమ్మల్ని మీరు పెట్టే బాధలు మీకు తెలియవు కదా” అని. అనే. సందేహం లేదు. కానీ ఓదార్పు గానే అనిపించింది అది  ప్రాయశ్చిత్తానికి చెందిన ఊరట.
మనుషుల రొద నుంచి తప్పించుకుని మరికాస్త ధ్యానం కోసం ప్రయత్నిస్తే వాటి మాటలు కూడా వినగలమేమో. వాటివెనక ఉన్న ఓదార్పుకి సేద తీరగలమేమో
వినగలమని, సాంత్వన పడగలమనే కదా దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి చంద్రంపాలెం లోని రావిచెట్టు గురించి ఆయన అంటున్నది.
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇంత ఒత్తిడి సమయం లో ఎంతో సాంత్వన కలిగించేరు…..ఈ కరోనా హడావిడి తగ్గిన తరువాత ఒకసారి చంద్రపాలెం వెళ్ళాలనిపిస్తోంది.
    ధన్యవాదాలు, 🙏🙏🙏
    కుచేలరావు

  • కృష్ణశాస్త్రి గారి వ్యాసం లానే మీ వ్యాసమూ హృద్యం గా ఉంది

  • చాలా హృద్యంగా ఉంది. శైలి మధురంగా, చదివించేదిగా ఉంది. ధన్యవాదాలు.

  • Excellent presentation, Devulapalli gari prastavana bagundi, apt for the present time
    Congratulations 🎉

  • లక్ష్మీ! మర్రిచెట్టు, మీ ఇంటి ముందున్న నేరెడు చెట్లు కనిపించి ఊసులాడాయి. మనుషులు అందరూ quarantine . ఇక వింటే ఎన్ని కథలు పలుకుతాయో! వినే మనసు , చెవులు ఉండాలి అంతే.. . ఇలా అందంగా కథలు అల్లటంలో మీరు మీరే. ఒక్కసారి ఆ తెలవారి నిశ్శబ్దం. , ఆ చల్లదనం అనుభూతికి తెచ్చింది. 💐💐💐

  • లక్ష్మీ!! మర్రిచెట్టు, మీ ఇంటి ముంగిటి నేరేడు చెట్టు చూపించారు. ఆ చల్లనిగాలి ఎన్నో ఊసుల్ని వినిపించాయి. వినే మనసు ఉండాలేగానీ ఎన్నైన వినవచ్చు. ఇలా మర్రిచెట్టు ను తీసుకుని ఎన్నో ఊసులు చెప్పగలరు ,కథలు అల్లగలరు. మీరు మీరే. ! మనుషులందరూ quarantine లో ఉన్నారుగా. ఆ తెలవారు సమయంలో ఎన్నో కథల అనుభూతి. 💐💐💐

  • ఎంత బాగా చెప్పేరు కృష్ణశాస్త్రి గారు .ఊరిమధ్య ,ఊరిచివర చెట్లు ఎంతమందికి ఎరుకని పంచాయో కదా ?నాకు ఎనిమిదేళ్ళు సముద్రం ఆ పని చేసింది .అలల జోలపాట లేకుండా నిద్రపోవడం నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో ! ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ పుణ్యమాని రాత్రిళ్ళు ఇంత దూరానికి కూడా వినిపిస్తోంది .

    • లాక్ డౌన్ పుణ్యమా అని
      ఎంత బాగా చెప్పేరు కళ్యాణి గారూ

  • As usual, very good essay Veeralakshmi garu!

    “నా కొకటి వింతగా తోస్తుంది.
    ఏమిటంటే ఎప్పుడూ రావిచెట్టు ఆకులు గలగలమంటూ రొద చేస్తూనేఉంటాయి కదా! ఆ రొద ప్రశాంతమైన గ్రామవాతావరణాన్ని కలచివేయకుండా మరింత నిశ్శబ్దం లో ఎలా నింపుతుందీ అని. అదేమిటో గానీ మా ఊళ్లో వినపడే ప్రతీ ధ్వనీ ఆవు అంబారవమూ, రాట్నపు రొదా, పొలికేకా ఒక్కొక్క పాట. అవన్నీ కూడా చల్లని నిశ్శబ్దాన్నే మరింత చల్లగా చేస్తాయి. రావి ఆకుల రొదకూడా అంతే.”

    Wow.. thrilled to read these lines. పన్నెండేళ్ళ క్రితం దాదాపు ఇదే భావనతో రాసిన ఈ “మంచులోయలో” కవిత గుర్తొచ్చింది.

    మంచులోయలో..
    ——————-

    పైన్ చెట్ల మధ్యనుంచి
    ప్రవేశించింది సంధ్య

    సాయంకాలపు నిశ్శబ్దం
    లోయంతా ఆవరించింది

    లీలగా వినపడుతున్న
    సెలయేటి సవ్వడి
    చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని
    రెట్టింపు చేస్తోంది!

  • రావి చెట్టు, గలగలలు,. మీ,rachana చదవ గానే…నాకు,okat అనిపించింది, మా ఇంటి ముందున్న, కానుగ మొక్క ఆకులు,గల గలలు,వినాలని, ిిి .ిిఇనలు పటించు కోలేదు..ధన్యవాదాలు. మామ్!💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు