కృష్ణక్క – విరామ మెరగని మానవి

న చుట్టూ అనేకమంది మనుషులు. కళాత్మకతతో జీవితాన్ని వెలిగించిన వారు కొందరు. వెలుగుకు కారణాలు వెతికే వారు కొందరు. సాహిత్యం ,కుటుంబం, ఉద్యమం  ఈ మూడింటి ప్రాధాన్యతలో తెలుగు సమాజంలో సుదీర్ఘకాలం పని చేసినవారు అరుదు. ఐదుతరాల జీవన యానానికి చుక్కానిలా ఉండేవారు అరుదు.సామాజిక, సమాజ తలాలలో చలనంలో వుండటమే  కాదు. ఆచలనశీలత కుటుంబ ,సమాజ జీవనంలోకి అనువర్తింపచేసేవారు చాలా తక్కువ .జీవితం ఎక్కడో జారిపోతుంది. ఆజారిన ఖాళీ దగ్గర  దిగులు నిండిన హృదయంతో మమేకం కావడం నేటి సమాజ వాస్తవస్థితి .

    కృష్ణా బాయి పరిచయం అక్కర్లేని పేరు. తొంబై ఏళ్ళ జీవన ప్రస్థానంలో విరామ మెరగని మానవి. తన చుట్టూ ఉన్న భౌతిక జీవితాన్ని ఒడిసిపట్టిన మహిళ. సాహిత్యాన్ని ,ఉద్యమాన్ని కుటుంబాన్ని సమదృష్టితో చూసిన మగువ . రాజీలేని మానవ జీవన ప్రయోగాన్ని అనేక విషాదాల మధ్య దాటిన మనిషి .కృష్ణాజిల్లా ఘంటసాలపాలెం గ్రామం నుండి మొదలై తెలుగు రాష్ట్రాలలోని   అన్ని  ఊర్లు తమదిగా    చేసుకున్న కుటుంబం. కృష్ణాబాయి నూరేళ్ల  స్వావలంబనకు ప్రతినిధి.
   మనుషులు రూపొందే క్రమం ఎలా ఉంటుంది .ఏ సమాజ చలనాలు మనుషులను తయారు చేస్తాయి .వారి మానసిక, సమాజ వికాసాల చుట్టూ ఉన్న భౌతికావరణ ఎంతవరకు కారణం. జీవిస్తున్న కాలం ,గతం, వర్తమానం, భవిష్యత్తు ఈమూడింటి మధ్య నుండి ఆమె జీవనసరళి ఎలా       రూపొందింది . సంగీతం ,లలిత కళలు, విద్య, వివాహము, కుటుంబం, పిల్లలు ఒక మనిషిని సమాజపరం ఎలా చేయగలుగుతాయి. గ్రామీణ జీవితం ,అభ్యుదయ భావజాల కుటుంబం వీటి మధ్య పెరగడం వలన  ఆమె జ్ఞానవిస్తృతి  చెందిందా ! ఆమె అస్తిత్వం జీవన పోరాట యోధురాలుగా మార్చిందా!  కుటుంబ జీవితం , ఆమె చుట్టూ వున్న మనుషులు ఆమెను  ప్రభావితం చేసారా!  తన చుట్టూ ఉన్న సంప్రదాయ ఆవరణను చేదించడానికి ఆమె పడిన అంతరంగ ఘర్షణ . అనేక  కాలాల నుండి స్త్రీలు ఈ కొలిమి నుండి మొలకెత్తిన వారు. కొందరు విజేతలు . ఇంకొందరు పరాజితులు. గెలుపు వ్యక్తిగతం కాదు. సామూహికత నుండి ఉద్భవించేది .కృష్ణాబాయిది విడి,విడి వ్యక్తిత్వం కాదు. అనేకుల కలయికలో రూపొందిన మనిషి . తెలుగు సమాజ వికాసం, విస్తృతి, సామాజిక ఉద్యమాల చలనాలు ఆమెను నడుస్తున్న సృజన శీలిగా మలిచాయి.
    నక్సల్ బరి రాజకీయాల తరంలో విప్లవ రాజకీయాలకు చేరువ కావడం, నాయకత్వం వహించడం ఇది ఒక చరిత్ర. జెండర్ అనే దగ్గర ఆగకుండా సాహిత్య కేంద్రంగా విప్లవ శిబిరంలోకి వచ్చారు. ఇక్కడ దాకా రావడానికి కమ్యూనిజం అనే భావన ఉంటే సరిపోదు. సాహిత్య దివిటీ వెలిగించుకుని నలుగురి దారిలో తనకొక మార్గాన్ని రూపొందించుకున్నారు. ప్రతినిత్యం లేదా ప్రతిక్షణం సాహిత్య సంబంధాల మధ్య ఉండడం అదొక మేధో ప్రయాస .ఆ ప్రయాసలో పెనుగులాడుతున్న ప్రపంచం ఉన్నది. తుమ్మల కృష్ణా బాయిని ఎలా వర్గీకరిస్తాము? జీవన వాస్తవికతలో ఆమె స్థానాన్ని ఎలా నిర్ణయిస్తాము?
     సాహిత్య, సమాజ సంబంధాల్లో ఆమెది ఖచ్చితమైన నిర్ధారణ. తను రూపొందుతున్న సమయంలో తెలుగు సమాజపు ఆవరణ విశాల మౌతున్నది. వ్యవసాయ సంబంధాలలోని మిగులు అనేక రంగాలకు వ్యాప్తి చెందుతుంది .ఒక దగ్గర వాణిజ్యం కావచ్చు. ఇంకొక దగ్గర కళాత్మకతతో ముడిపడి ఉండవచ్చు .సంపద మిగులు అనేది అనేక రంగాలకు వ్యాపించింది. సినిమా, సాహిత్యం, నాటకం, చిత్రకళ వికాస స్థితిని కృష్ణా బాయి దగ్గరగా చూశారు. సమాజ తలానికి, తనకి  వుండే  విభజనను సాహిత్యం ద్వారా పరిశీలించారు. తన చుట్టూ ఉండే మనుషుల చలనం నుండి కాకుండా సాహిత్య వివేచన ద్వారా  సమాజపు ఆంతర్యాన్ని  సొంతం చేసుకోగలిగారు. బిందువు దగ్గర  మొదలైన ఆమె సమాజం పరివర్తన దిశగా సాగడానికి బీజం వేసింది. చరిత్ర చలనాన్ని వ్యక్తులు ప్రభావితం చేస్తారు.
    సాహిత్యంలో  కృష్ణాబాయి సాధన ఏమిటి. తన సాహిత్య ప్రస్థానంలో సాహిత్యాన్ని తులనాత్మకంగా అంచనా వేశారు. స్వతహాగా కవి, వ్యాసకర్త. భిన్న  సాహిత్య ప్రక్రియలలో ఆమె చూపిన చొరవ ఉంది.  సాహిత్య సరళని రచయితల యొక్క  రచనా తీరును అంచనా వేశారు. ఆ వెలుగులో సాహిత్య సర్వస్వాలకు చలసాని ప్రసాదుతో కలిసి సంపాదక బాధ్యతలను నిర్వహించారు. కృష్ణా బాయిది స్పష్టమైన సాహిత్య వివేచన . తనని ప్రభావితం చేసిన  కమ్యునిజం చింతన అంతర్లయ. ఆ సారస్వత జ్ఞాన వికాసం విప్లవ రచయితల సంఘం వరకు కొనసాగింది . జీవిత పర్యంతరం  విప్లవ సాహిత్య సంస్థకు కేంద్ర బిందువుగా నిలిచారు. విరసం కార్యదర్శిగా పనిచేశారు. అనేక నిర్భందాల, నిషేధాల మధ్య  వెలుగురేఖలా  నిలబడ్డారు.
     ఇదొక సాహసికమైన చర్య .స్త్రీల నాయకత్వంలో అనేక విజయాలు నమోదయినాయి. తనకున్న సాహిత్య  పరిచయాల నుండి విరసం నిర్మాణంలో తనదైన భూమికను నిర్వహించారు. ఈ స్థాన బలిమి దగ్గర నిఠారుగా నిలబడ్డారు .సాహిత్యంలోని అనేక  ప్రక్రియల పట్ల అవగాహన ఉంది.  అనేక ఆటుపోట్ల మధ్య విరసంను నిలబెట్టారు . సాహిత్య నిబద్ధతలో ఆమె చూపిన చొరవ  ఉద్యమ విశాలతను చూపుతుంది.   విరసం వంటి సంస్థను నిలబెట్టడంలో ఆమెది సాహసిక చర్య . విరసం వైపు  రచయిత లను కాపు కాయించడంలో ఆమె చూపిన సాహిత్య సంబంధాలు ప్రధానమైనవి.ఏక కాలంలో కాళోజి  , సాంప్రదాయ సంగీత కారుడు పినాకపాణితో మాట  కలపగలరు . ఏడు దశాబ్దాల సాహిత్య చరిత్రకు సాక్షి కృష్ణాబాయి.
    సాహిత్యం,జీవితం వీటన్నిటి వెనుక స్త్రీలు నిర్వహించిన భూమిక  విస్మరణకు గురి అయింది. దీనిని ఎంతో కొంతమేర సరిచేసే ప్రయత్నం చేసారు. మానవీయ ,కుటుంబ సంబంధాల విచ్చిన్నత పట్ల ఆందోళన సరే. కృష్ణాబాయి ఏమి రాసినా  సాధికారతతో రాశారు. ప్రపంచ దేశాల సాహిత్య చరిత్రను అధ్యయనం చేశారు. సాహిత్య అభినివేశం, మనుషులు చుట్టూ అల్లుకున్న అల్లిక. కృష్ణాబాయి జీవితంలో, సాహిత్యంలోనూ అనేక పాయలు ఉన్నాయి. వ్యక్తిగత జీవనలాలసను వదిలి సాహిత్య  జీవిగా జీవిస్తున్న క్షణాలు అపురూపమైవి.
   సృజనశీలిగా తన సాహసపు జీవితాన్ని మలుచుకున్నారు. తెలుగు సమాజంలో అనేకమంది రచయితలతో కృష్ణక్కగా పిలుచుకునే కృష్ణబాయి స్త్రీల సమానత కోసం పని చేస్తున్నారు. విశాఖను వదిలి హైదారాబాద్ లో కుమార్తె డాక్టర్ నళిని దగ్గర వుంటున్న కృష్ణాబాయి అంతరంగం నిండా సాహిత్యమే. అందులో మనుషులుంటారు. ప్రజా ఉద్యమాల వాస్తవికత వుంటుంది.
*

అరసవిల్లి కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు