కృత్రిమ బింబం

“ప్రతిరోజూ నువ్వు నిద్రలేచింది మొదలు, రోజు గడిచేలోగా నీకళ్ళముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో నువ్వు స్పందించి, గుర్తించుకునేలా చేసేవి కొన్నైనా ఉంటాయి. అవి కలిగించే అనుభూతుల కారణంగా, నీ మనసు ఆనందంతో పులకించనూ వచ్చు! బాధతో మూల్గనూ వచ్చు! అలా నీలో కలిగే భావాలు ఎవరితోనైనా పంచుకోవాలనిపించిందనుకో! అవన్నీ విని, అర్థంచేసుకునే ఓపికా, సమయం ఎవరికుంటుంది చెప్పు? సరిగ్గా అలాంటప్పుడు నీకు సాయపడే మంచి మిత్రుడులాంటిది డైరీ! ఆయా సమయాల్లో నీలో కలిగిన అనుభూతుల్ని డైరీలో పొందుపరిస్తే, అవి కలకాలం నిలిచిపోతాయి. కాలం  రోజులు, నెలలు, సంత్సరాలు మింగేసాక, ఎప్పుడో ఒక్కసారి డైరీ పుటలు వెనక్కితిప్పి చూడు! – అరోజుల్లో,నీ నడవడిక ఎలాఉన్నదీ నీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అప్పట్లో,ఏదైనా విషయంలో నువ్వు అనుచితంగా ప్రవర్తించినట్లు నీకనిపిస్తే, ప్రస్తుతకాలంలో నీలో వచ్చిన మానసిక పరిపక్వత మరోమారు అలాంటి పొరబాటు జరగకుండా జాగ్రత్తపడేలా చేస్తుంది.

చెప్పాలంటే, ఒకరకంగా డైరీ అద్దంలాంటిది. నువ్వు అద్దంలో చూసుకుంటే, నీ ప్రతిబింబం ఉన్నదున్నట్లు ఎలా కనిపిస్తుందో,అలా డైరీ నీ భావాలకు ప్రతిరూపం కావాలి. నిజబింబాన్ని తలపించాలి. అందుకే నీపదహారో పుట్టినరోజు కానుకగా ఈ డైరీ ప్రెజెంట్ చేస్తున్నా! నేను చెప్పిందంతా, నీకర్ఠమయ్యిందనే అనుకుంటున్నాను. ఈరోజు వంకాయకూర తిన్నాను,చెరుకురసం తాగాను,కడుపునొప్పొచ్చింది లాంటి పిచ్చిరాతలతో నింపక ఈ డైరీ సద్వినియోగం చేస్తావని అశిస్తాను.”

తండ్రి చెప్పిందంతా శ్రద్ధగా విన్న మురహరి ఆయన ఇస్తున్న డైరీని అపురూపంగా చూస్తూ అందుకున్నాడు. ఆరాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక, తనూ నిద్రలోకి జారుకునేముందు డైరీ తెరిచి ఇలా రాసుకున్నాడు. – .”ఈరోజు చాలా అనందదాయకమైన రోజు. డైరీ రాయడమనే మంచి అలవాటుకు నాంది పలుకుతున్నాను. డైరీనొక మంచి మిత్రుడిగా స్వీకరిస్తున్నాను .ప్రయోజనకారిగా ఉండే విధంగా డైరీ రూపొందించాలని మనసారా కోరుకుంటున్నాను.నాన్న చేసిన సూచనలు తు.చ. తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తాను.”

తను రాసింది నాలుగైదుసార్లు తనివితీరా చదువుకున్నాడు. నిజానికి అతని మనసులో ప్రతిబింబించిన భావాలే అతని డైరీలో చోటు చేసుకున్నాయి.

కాని,మర్నాడు మురహరి డైరీ రాసే సమయానికి అతని ఉద్దేశాలు,నిర్ణయాలు తల్లక్రిందులయ్యాయి. ఎందుకంటే, ఆరోజు అతని జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనే జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న మురహరికి కొంతకాలంగా సిగరెట్లు కాల్చడం అలవాటయింది. స్టైల్ గా సిగరెట్లు కాల్చడంలో విన్యాసాలు చేసే హీరో రజనీకాంత్ అతని అభిమాన నటుడు.అతనిలా సిగరెట్ పొగ రింగురింగులుగా వదలడం,సిగరెట్ పైకెగరేసి పెదాలతో పట్టుకోవడం వంటి ఫీట్స్ ప్రాక్టీస్ చెయ్యడం పరిపాటిగా మారింది.

ఆరోజు సాయంత్రం స్నేహితులతో కలిసి గుప్పుగుప్పున పొగ వదుల్తూ,బజార్లో షికార్లు కొడుతున్న తరుణంలో, ఖర్మకాలి తండ్రి కంట పడనే పడ్డాడు. దాంతో ఏముంది…? ఇంటికి రాగానే – “ఓరి దౌర్భాగ్యుడా!బుద్దిగా చదువుకుని ఏదో ఉద్ధరిస్తావనుకుంటే చివరికిలా తగులడ్డావన్నమాట? మీసమన్నా మొలిచిందో లేదో,నీకప్పుడే ఇన్ని పెడబుద్ధులా? ఏదో ఇలా ఇవాళ నా కంటబడ్డావ్ గాని,ఇంకా ఎన్ని  వెధవ్వేషాలు వేస్తున్నావో? మొన్న పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయంటే రావూ? ఒరేయ్!అల్లరిమూకతో చేరి అడ్డమైన దురలవాట్లు చేసుకోవడం గొప్ప కాదురా! నా అంత ఎత్తెదిగావ్! నాచేత ఇలా తిట్టించుకోవడం సిగ్గుగా లేదూ?”

తిట్ల జడివాన ఒక క్షణం ఆగింది.

మళ్ళీ మొదలయింది చిరుజల్లులా!

“నీకు సిగ్గులేకపోయినా నాకుంది.బుద్ధులు చెప్పే దశ నువ్వు దాటిపోయావు. ఇక నీవిషయంలో నేను పట్టించుకోను.నా మనసులో బాధ అర్థం చేసుకోగలిగి ఈ వెధవలవాట్లు మానేస్తే సంతోషం.లేకుంటే నీ ఖర్మ! అంతే!”

మురహరి మౌనంగా చీవాట్లన్నీ భరించాడు.రాత్రి భోజనం కూడా సయించలేదు.పడుకోబోయేముందు డైరీ చేతిలోకి తీసుకున్నప్పుడు మాత్రం,అతనిలో చెలరేగుతున్న భావతరంగాలు ఉవ్వెత్తున పొంగాయి.

“ఈ నాన్నకసలు బుద్ధి లేదు.సిగరెట్లు కాలిస్తేనే ఎవడి పీకో తెగ్గోసినట్లు అల్లాడిపోయాడు.ఏడ్వలేకపోయాడూ? అసలెప్పుడన్నా ఆ ఘటం ఒకదమ్ము లాగి చూస్తే తెలిసేది – సిగరెట్ కాల్చడంలో ఎంత మజా ఉందో! ఎంత స్టయిలుందో! దమ్ములాగే దమ్ములుంటేగా? ఒట్టి అర్భక ప్రాణి!చాతకాని వాడు చాతకాని వాడిలా ఉండక ఈ ఉపన్యాసాలెందుకో? పైగా సిగరెట్లు కాల్చడం మూలంగా మార్కులు తక్కువొచ్చాయంటాడేమిటి?అర్థంలేదు.ఆ లెక్చరర్లు ఒక ముఠాగా మారి కత్తిగట్టినట్లు మా బాచ్ కి కావాలని మార్కులు తగ్గించారు. అంతే తప్ప మరోటి కాదు.కానీయ్!పబ్లిక్ పరీక్షల్లో ఏం చెయ్యగలరు? అంతేకాదు. సిగరెట్లు పిచ్చిపిచ్చిగా ఊదేసి,ఆ ప్రభావం చదువు మీద పడదని నిరూపించాలి.సిగరెట్ ని చులకనగా చూసిన నాన్నకు తెలిసొచ్చేలా చెయ్యాలి.ఏది ఏమైనా తన మనసులోని భావాలు డైరీలోకెక్కించే మంచి అవకాశం దొరికింది.ఇంకెందుకు ఆలస్యం?” అనుకుంటూ పెన్ను అందుకున్నాడు.అదే క్షణంలో అతని బుర్రలో దరిద్రపుగొట్టు ఆలోచన ఒకటి తలెత్తింది.”మనసులో అనుకున్నవన్నీ ఉన్నదున్నట్లుగా రాతల్లో చూపిస్తే కొంప మునుగుతుందేమో? ఔను!నిజమే! ఖర్మకాలి డైరీ నాన్న కంటపడితే? కుతూహలం కొద్దీ పేజీలు తిరగేస్తే…? ఇంకేముంది? డైరీ మనసుకు ప్రతిబింబం కావడం సంగతటుంచి,నాన్న తనమీద విరుచుకుపడడానికి కారణమై కూర్చుంటుంది. అలాగని డైరీ రాయడం మానేయడమా? నో! మానేయడానికి వీల్లేదు. మరైతే ఏం చెయ్యాలి?”

తీవ్రంగా ఆలోచించి,డైరీ తెరిచి రాయడం మొదలుపెట్టాడు.

“ఈరోజు జరిగినదానికి చాలా సిగ్గుపడుతున్నాను. నాన్న మనసు నొప్పించినందుకు నిజానికి నాకు విమోచన లేదు. ఏమైతేనేం? నా జ్ఞాననేత్రం తెరుచుకుంది. నాన్న తెరిపించాడు.సిగరెట్లు కాల్చడం చెడ్డ లక్షణం. నేను చెడ్డవాడ్ని కాదు.మరి ఆ చెడ్డ లక్షణం నాకుండకూడదు కదా!? ఈరోజు నుంచి సిగరెట్లు కాల్చకూడదని ఒట్టేసుకుంటున్నాను. బుద్ధిగా చదివి,పరీక్షలు పాసయి,నాన్న మనసు మెప్పించడమే నా ధ్యేయం.”

డైరీ మూసేసి,పగలబడి నవ్వుకున్నాడు మురహరి.

డైరీ అసలు ఉపయోగం ఇతరుల్ని ఫూల్స్ చెయ్యడం కోసం మాత్రమే! అదే నిజం.తను ఇప్పుదు రాసింది నాన్న కనుక చదివాడంటే- దిమ్మ తిరిగిపోతుంది.నిజంగానే తనలో పశ్చాతాపం కలిగిందని నమ్ముతాడు. పొంగిపోతాడు.ఇది మళ్ళీ ఎప్పుడైనా చదివితే- ఏ పరిస్థితిలో ఇలా రాయాల్సివచ్చిందో తనకొక్కడికే కళ్ళకు కట్టినట్లు గుర్తుకొస్తుంది.అంతే తప్ప, ఇది చదివిన వేరే నరమానవుడెవడూ తను రాసుకున్నదాని వెనుకున్న అసలు కథా కమామిషు చస్తే కనిపెట్టలేడు.డైరీ అలా సరికొత్త కోడ్ లో రాయడం కనిపెట్టినందుకు మురిసిపోయాడు మురహరి.

మరో నాలుగు రోజుల తర్వాత-

ఊళ్ళో కొత్త సినిమా రిలీజయింది.మురహరి మిత్రబృందం మొదటిరోజు మొదటి షో చూడాలని తీర్మానించుకున్నారు.కాని, పెట్టుబడి ఎవరు పెట్టాలన్న సమస్య ఎదురయింది.చీట్లు తీసారు. మురహరి పేరు వచ్చింది. మురహరి గుండాగినంత పనయింది.ఇంకా అయిదుగురు ఉన్నారు- తన పేరే రావాలని ఎక్కడుంది అని చీట్లు తీయడానికి ఒప్పుకున్నాడు కాని,తన నెత్తిమీదకే వస్తుందని ఊహించలేకపోయాడు.ఇప్పుడెలా? సినిమా,సిగరెట్ల ఖర్చు కోసం ఎంతకాదన్నా నాలుగైదు వందలు కావాలి. తనెక్కడినుంచి తేగలడు?

వెనుకంజ వేస్తే స్నేహితుల్లో చులకన అయిపోతాడు. ఊహూఁ…అలా కావడానికి వీల్లేదు.మరెలా? ఏది దారి? ఇంట్లో దొంగతనం చెయ్యడమనేదే మార్గాంతరంగా కనిపించింది మురహరికి. అక్కయ్య దగ్గర కొట్టెయ్యాలి. నాన్న అప్పుడప్పుడూ ఇచ్చిన డబ్బులు తనలా ఖర్చు పెట్టేయక, పైసాపైసా కూడబెట్టి భద్రంగా దాచుకుంటుంది. దాని పెట్టె వెదికితే సరి!

ఎవరూ లేకుండా చూసి, కార్యసాధనకు దిగాడు మురహరి.అక్కయ్య పెట్టెలో నాలుగు వందల రూపాయిలు దొరికాయి.చాలు! అవసరం గడుస్తుందని సంతోషించాడు.దర్జాగా స్నేహితుల్తో సినిమాకు వెళ్ళొచ్చాడు కాని,తన దొంగతనం బయటపడితే ఏమవుతుందోనన్న గుబులు లేకపోలేదతనికి!

ఆ ఘడియ కూడా త్వరలోనే వచ్చింది. దాచుకున్న డబ్బు కనబడకపోయేసరికి, మురహరి అక్క కళ్ళనీళ్ళ పర్యంతమయింది.ఇంట్లో ఉండేది నలుగురు- మురహరి, అమ్మానాన్నా,అక్క! ఇంకేముంది?తండ్రి ముందు దోషిగా నిలబడ్డాడు మురహరి. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అన్న విషయం అతనప్పటికే ఆలోచించుకుని తయారుగా ఉన్నాడు.కాబట్టి-  “నాకేం తెలియదు.నేనసలు అక్కయ్య పెట్టె జోలికే పోలేదు.దాని డబ్బుతో నాకేం పని? అయినా అంత డబ్బుతో నేనేం చేసుకుంటాను? అకారణంగా నామీద నిందలు వేస్తున్నారు.ఇది అన్యాయం. పనిమనిషి తీసిందేమో కనుక్కున్నారా? అసలు అక్కయ్యే ఇంకెక్కడో పెట్టి మర్చిపోయిందేమో? దానికసలే మతిమరపు జాస్తి. సరిగ్గా వెతకమని చెప్పండి! ఏ పాపమూ ఎరుగని నామీద దొంగతనం మోపడం మీకు భావ్యం కాదు.” గుడ్ల నీరు కుక్కుకుని చివ్వున వెనుతిరిగి వెళ్ళిపోయాడు మురహరి. ముందు గదిలో ఒక మూల కూర్చుని డైరీ రాయడం మొదలెట్టాడు.

“ఛీ! ఎంతటి దుర్దినమీ రోజు? చివరికి దొంగతనం కూడ అంటగట్టారు నాకు. ఈ గుండె మంటను ఎలా భరించను? నేను దోషిని కానని ఎలా నిరూపించడం? పాపం! అక్కయ్యను చూస్తే జాలేస్తుంది. నిజానికి దాని డబ్బెలా పోయిందో దేవుడికే ఎరుక. దాని డబ్బు పోయిందని నాకూ చాలా బాధగా ఉంది.కాని, ఏం చెయ్యను? ఏం చెయ్యగలను? ఏది ఏమైనా మంచితనాన్ని ఎవరూ గుర్తించరు. ఇలాంటి నిందలు భరిస్తూ బ్రతకడం కన్నా ఆత్మహత్య మేలు కాదూ?”

తను డైరీ రాసున్నంతసేపూ, నాన్న పరిశీలనగా తనవైపే చూడడం ఓరకంట గమనించకపోలేదు మురహరి. అలా తండ్రి దృష్టిని ఆకర్షించాలనే అతని ఉద్దేశం కూడా!

ఆ రాత్రి నిద్ర పట్టక పక్కమీద దొర్లుతున్న సమయంలో లోపలి గదిలోంచి తల్లిదండ్రుల సంభాషణ లీలగా వినరావడంతో చెవులు రిక్కించి వినసాగాడు.

“అమ్మాయి సరిగ్గా అన్నం కూడ తినలేదు. ఏడుస్తూనే పడుకుంది. ఎట్లాగండీ వీడితో? ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నారు!”

“వాడ్నేమీ అనకు. పాపం!వాడికేమీ తెలియదు.వాడిని అనుమానించడం సరికాదు.”

“ఏమిటి? మీరు వాడ్ని వెనకేసుకొస్తున్నారు! వాడు తియ్యకపోతే ఈఇంట్లో ఇంకెవరున్నారు?మీరూ,నేనూ!అంతేగా? మీరేమైనా తీసారేమిటి కొంపదీసి?” నాన్న మాటల్ని ఖండిస్తూ,వ్యంగ్యంగా అంది అమ్మ.

“చాల్లే! సంతోషించాం నీతెలివికి! వాడు తియ్యలేదని నాకు రూఢిగా తెలుసు.అంత గట్టిగా ఎలా చెప్తున్నారు అని నన్ను తిరిగి కోర్టులో నిలబెట్టినట్లు అడక్కు! నాకు తెలుసు.వాడు నిర్దోషి.రేపు ఉదయం పనిమనిషిని కాస్త గట్టిగా అడిగి చూడు! ఇంక ఈ విషయం గురించి ఎలాంటి చర్చా వద్దు. నాకు నిద్రొస్తోంది.మళ్ళీ రేపు ఉదయమే కేంపుకెళ్ళాలి. తెల్లారుగట్ట నాలుగింటికి అలారం పెట్టి నువ్వూ పడుకో!”

ఆ తరువాత మాటలేవీ వినపడలేదు.తృప్తిగా నిట్టూర్చాడు మురహరి. నాన్న నా డైరీ తీసి చదివేఉండాలి! లేకుంటే నా తరపున వకాల్తా పుచ్చుకోడు. డైరీ నాన్నను బాగానే  బోల్తా కొట్టించింది. “నా ప్రియమైన డైరీ! కలకాలం ఇలాగే వర్ధిల్లు!” విజయగర్వంతో నవ్వుకుని నిద్రకుపక్రమించాడు మురహరి.

 

X                   X                   X

 

కొన్నేళ్ళు గడిచాయి. మురహరి చదువు పూర్తయి, విజయవాడలో బాంక్ జాబ్ రావడంతో వెళ్ళి ఉద్యోగంలో చేరాడు. ఇన్నేళ్ళూ-   మురహరి అవాస్తవాలు, అబద్ధాలతో కూడిన రాతలతో డైరీలు నింపడం మానలేదని వేరే చెప్పాలా? అదే బాంక్ లో పనిచేస్తున్న మనోజవంతో స్నేహం కలిసింది.అతడు ఉండే రూం లోనే చోటు సంపాదించుకున్నాడు.

చూడడానికి అపర మొద్దు స్వరూపంలా కనిపించే మనోజవం నిజానికి కబుర్ల పోగు. ఎప్పుడూ గలగలా మాట్లాదుతూ, జోకులేస్తూ అందర్నీ నవ్విస్తూ ఉంటాడు.అతని సాంగత్యం మూలంగా కొత్త ప్రదేశంలోకి వచ్చిపడ్డానన్న బెరుకు,బెంగ లేకుండా పోయాయి మురహరికి.

డ్యూటీ అయిపోగానే, సాయంత్రం పూట మనోజవంతో కలిసి అలా బజార్లో షికార్లు కొట్టి,హోటల్లో భోంచేసి రూంకి చేరడం అలవాటయింది. పడుకునే ముందు మాత్రం డైరీలో ఏదో ఒకటి గిలకడం తప్పనిసరి.

ఒకరోజు రాత్రి డైరీ రాస్తుంటే అడిగాడు మనోజవం-  “మీరు చాలా రెగ్యులర్ గా డైరీ రాస్తారనుకుంటానే?”

అతనలా అడగ్గానే మురహరికి హుషారు పుట్టుకొచ్చింది. ఇక మొదలెట్టాడు- “అవునండీ! డైరీ రాయడం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు. డైరీ రాయడంలో ఆనందముంది. నన్నడిగితే డైరీ రాయడం ప్రతివాళ్ళూ అలవాటు చేసుకోవాలంటాను. నిత్యజీవితంలో ఎన్నో సంఘటనలు,అనుభవాలు,అనుభూతులు-  వీటిని ఏళ్ళ తరబడి భద్రపరిచే ఏకైక సాధనం డైరీ!  మన ఆలోచనా విధానం ఏయే సందర్భాల్లో ఎలా ఉన్నదీ కళ్ళకు కట్టినట్లు చూపగలిగేది డైరీ మాత్రమే! అందుకే నాలో కలిగే ప్రతి భావన అద్దంలాంటి నాడైరీలో పొందుపరుస్తాను.”

మురహరి చెప్పేదంతా ఆసక్తిగా విన్నాడు మనోజవం.

“నిజమే సుమండీ! డైరీ రాయడం మంచి వ్యాపకం” అన్నాడు మెచ్చిలోలుగా! ఆ తర్వాత తిరిగి తనే అన్నాడు- “మరి అంత  అమూల్యమైన డైరీ భద్రంగా ఉంచుకోక అలా బయట వదిలేస్తారేంటి? ఎవరైనా తీసి చదివే ప్రమాదముంది కదా?”

“నాజీవితంలా నా డైరీ కూడా తెరిచిన పుస్తకం. అందులో రహస్యాలేవీ ఉండవు. అన్నీ నిజాలే! వాస్తవాలే! అందుకే ఎవరన్నా చదువుతారేమోనన్న భయం లేదు.” బిగ్గరగా నవ్వుతూ అన్నాడు మురహరి.

తనూ చిన్నగా నవ్వేసి ఊరకుండిపోయాడు మనోజవం.

 

X                         X                       X

 

నాలుగు రోజుల తర్వాత,మురహరి డైరీ రాయడానికి ఉపక్రమిస్తూ,మనోజవం వైపు చూసి విస్తుపోయాడు.అతడు దించిన తల ఎత్తకుండా ఏదోరాయడంలో నిమగ్నమై ఉన్నాడు.

“ఏమిటి గురువుగారూ! మీరూ ఏదో రాతలో పడ్డారు?”కుతూహలంగా అడిగాడు.

తలెత్తి చూసాడు మనోజవం.

“డైరీ అండీ! మీరు చెప్పాక డైరీ రాయడంలోని ఆంతర్యం, ఔచిత్యం నాకు అవగతమయింది.నేనూ రెగ్యులర్ గా డైరీ రాయడం అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మంచిరోజని మొదలుపెట్టాను.”చిన్నగా నవ్వుతూ చెప్పాడు.

“గుడ్!తప్పకుండా రాయండి. కానీయండి!” తన హర్షాన్ని వెలిబుచ్చాడు మురహరి. ఆరోజు నుంచి, భోంచేసి రాగానే మురహరి కన్నా ముందే డైరీ ముందేసుకు కూర్చుంటున్నాడు మనోజవం. రోజులు గడిచేకొద్దీ, మనోజవం డైరీలో విశేషాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత మురహరిని ఊపిరి సలుపుకోనివ్వడం లేదు. కాని,అందుకు ఎలాంటి ఆవకాశం ఇవ్వడం లేదు మనోజవం. డైరీ రాయడం ముగించగానే,అది సూట్ కేస్ లో పెట్టి తాళం వేసేవాడు.పొరబాటున కూడా బయట వదిలేవాడు కాదు. చివరికి మురహరి కోరిక తీరే సమయం వచ్చింది. ఆరోజు రాత్రి విజయవాడలో ఉండే దూరపు బంధువుల ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళాల్సి వచ్చింది మనోజవానికి. అతడు వెళ్ళేటప్పుడు తన తాళం చెవులు టేబుల్ మీదే మర్చిపోవడం గమనించాడు మురహరి. మళ్ళీ గుర్తొచ్చి,తాళంచెవుల కోసం ఎక్కడ తిరిగొస్తాడోనని, అతడు వెళ్ళిన వెంటనే సూట్ కేస్ తెరవాలన్న కోరికను అతి కష్టం మీద అణచుకున్నాడు. ఒక పది నిముషాలాగి అతడిక తిరిగిరాడని నిర్ధారణ చేసుకున్నాక, గది తలుపులు లోపలినుంచి గడియ పెట్టి తాళంచెవులు అందుకుని మనోజవం సూట్ కేస్ వైపు నడిచాడు.వణుకుతున్న చేతులతో డైరీ బయటకు తీసాడు. ముఖ్యమనిపించిన వివరాలు చదువుకుంటూ పోయాడు.

జూన్ ముప్ఫై: ఈరోజు నుండి డైరీ రాయడం మొదలుపెడ్తున్నాను. మురహరి అన్నట్లు మనసులో చెలరేగే ప్రతి ఆలోచనకు దర్పణం కావాలి డైరీ! అందుకే ఈరోజు జరిగిన సంఘటన గురించి రాయకుండా ఉండలేకపోతున్నాను. డైరీ కొనడానికి బజారుకు వెళ్ళాను. నేనిచ్చిన అయిదొందల నోటుకు చిల్లరిస్తూ కొట్టువాడు పొరబాటున వంద రూపాయిలు ఎక్కువిచ్చాడు. వంద రూపాయిలు ఎక్కువిచ్చారు అని చెప్పాలనుకున్న నా నోటిని ఏదో శక్తి  గట్టిగా నొక్కేసింది. నోట్లు జేబులో కుక్కుకుని వచ్చేసాను. కాని, తప్పు చేసానన్న అపరాధ భావన మనసును కలవరపెదుతోంది. ఛీ! వంద రూపాయిలకు కక్కుర్తి పడ్డాను. ఇంత హీనమైన బుద్ధి నాలో దాగిఉందా? ఇకముందు ఎప్పుడూ నిజాయితీ తప్పనని ఒట్టేసుకుంటున్నాను. రేపు వెళ్ళి ఆ కొట్టువాడికి డబ్బు తిరిగి ఇచ్చేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు.

జూలై ఒకటి: జీతాలిచ్చారు. నాన్న ఈ నెలలో మరో వంద రూపాయిలు ఎక్కువ పంపమని రాసాడు. వీలు పడదని రాస్తూ, ఎప్పుడూ పంపే మొత్తమే ఎం.ఓ చేసాను. లేకపోతే ఏమిటి? సంపాదిస్తున్నానన్న మాటే  గాని నా సరదాలేం తీరుతున్నాయి? నాన్న మరీ ఆశపోతులా తయారవుతున్నాడు.ఎంత పంపినా, ఇంకా పంపమని బీద అరుపులు అరుస్తాడు.

 

జూలై ఆరు: మురహరితో సినిమాకు వెళ్ళాను. అనుకోకుండా ఒక వెధవ పని చేసాను. నా పక్క సీట్లో ఎవరో అమ్మాయి కూర్చుంది. చాలా అందంగా ఉంది. నా బుద్ధి వక్రించి మెల్లగా కాలు తగిలించాను. ఆ అమ్మాయి ఏమీ పట్టించుకోలేదు. దాంతో ధైర్యం వచ్చి నా కాలితో ఆమె పాదాన్ని నొక్కాను. ఆమె నన్ను కాల్చేసేటట్లు కోపంగా చూసి తన కాలు దూరంగా జరుపుకుంది. నాకప్పుడు భయం వేసింది. ఆమె గట్టిగా అరిచి గొడవ చేసి ఉంటేనో…..? ఆమ్మ బాబోయ్! నలుగురిలో అవమానం పాలయి ఉండేవాడ్ని! అదృష్టం బాగుండి బ్రతికిపోయాను. అయినా, ఏమిటిలాంటి పెడబుద్ధులు పుడుతున్నాయి నాకు? ఇక లాభం  లేదు. బ్రహ్మచారి జీవితానికి స్వస్తి పలికి పెళ్ళి చేసుకోవాలి. కానీ, నాన్న సంగతేమిటి? డబ్బు పంపించే కొద్దీ- ఇంకా తే! తే! అంటాడు తప్ప నా పెళ్ళి ఊసే ఎత్తడేమిటి?

 

జూలై 8: ఈరోజు చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ లేవు. ఏం రాయను? అవతల మురహరి ఏదో తెగ రాసేస్తున్నాడు. ఈ మురహరి కంపెనీ బాగానే ఉంది, మంచివాడే! వచ్చిందల్లా ఒకటే ఇబ్బంది. రైలింజన్ లా గుప్పుగుప్పుమంటూ వెధవ ధూమపానం! ఈ పొగ పీల్చి పీల్చి ఏ కేన్సరో,క్షయో నాకొచ్చేటట్లుంది.

 

జూలై 9:: ఇవాళ అక్కౌంటెంట్ మీద చచ్చే కోపమొచ్చింది. నా ఫిగర్స్ సవ్యంగా లేవని చీవాట్లేసాడు. వాడి మొహం! అసలు అంకెలు సరిగ్గా వేయడం వాడికే వచ్చి చావదు. నన్నంటాడేమిటి? అయ్యా! ఇక్కడ తమరు వేసింది ఏడో ఒకటో కాస్త చెప్పండి”అని కడిగేయాలనిపించింది. మళ్ళీ ఇన్సబార్డినేషన్ అంటూ గోల పెడతాడని కోపాన్ని అణచుకున్నాను.

 

జూలై 10: నాపెళ్ళి చేయాలన్న తలంపే లేదని మొన్న కాక మొన్నే నాన్నను ఆడిపోసుకున్నాను కదా? అదెంత పొరబాటో ఈరోజు తెలిసొచ్చింది. ఆయన చిన్ననాటి స్నేహితుడి కూతురట! ఫొటో పంపాడు. నచ్చిందంటే చెప్పు!పెళ్ళిచూపులుకి ఏర్పాట్లు చేస్తానని రాసాడు. మానాన్నను అపార్థం చేసుకున్నందుకు నన్ను నేను తిట్టుకున్నాను. మనసులోనే చెంపలేసుకున్నాను.ఆ ఫొటోలోని అమ్మాయి చాలా బాగుంది. నచ్చిందని వెంటనే చెప్తే పెళ్ళికి నేను మరీ ఆరాటపడుతున్నానని అనుకుంటారేమో? కాస్తాగి నాన్నకు ఉత్తరం రాయాలి.

 

మనోజవం డైరీ చదవడం పూర్తిచేసిన మురహరికి తల తిరిగింది. తన మాటలతో ప్రభావితుడై డైరీ రాయడం మొదలుపెట్టిన మనోజవం జరిగిన విషయాలు ఉన్నదున్నట్లు రాసుకున్నాడు. వివిధ సందర్భాల్లో అతని ఆలోచనా పరంపర అక్షరాల రూపంలో డైరీలో చోటు చేసుకుంది.

మరి తనో? ఎవర్నో వంచించాలనీ, ఫూల్స్ ని చెయ్యాలనీ, ఎవరైనా తన డైరీ చదివితే, వారందరూ తననో ఉత్తముడిలా భావించాలనీ-  పచ్చి అబద్దాలతో ఇన్నాళ్ళూ డైరీలు నింపాడు. నిజానికి డైరీ అంటే నిర్వచనం మనోజవం రాతలు చూస్తే తెలిసింది. తాను ఎంతో తెలివిగా వ్యవహరిస్తున్నానని అనుకుంటున్నాడు .  కాని,ఇన్నాళ్ళూ తనను తానే మోసం చేసుకుంటున్నాడన్న విషయం ఇప్పుడు స్ఫురించగానే ఎవరో వెన్ను మీద చరిచినట్లనిపించింది మురహరికి. అద్దం తనముందుకొచ్చి వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. దాంతో, ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతూ, అచేతనంగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చి మనోజవం డైరీ యధా స్థానంలో ఉంచి సూట్ కేస్ కి తాళం వేసాడు.

నిర్మల మనస్కుడై, తన డైరీ అందుకుని రాయడం మొదలుపెట్టాడు.

“డైరీకి అసలు అర్ఠం తెలిసింది. ఇన్నాళ్ళూ చీకటిలో మగ్గినందుకు సిగ్గుపడుతున్నాను.

అభూతకల్పనలతో, నన్ను నేను మభ్యపరుచుకోవడానికి ఇంతటితో స్వస్తి పలుకుతున్నాను. ఇకనుంచి, మంచైనా,చెడైనా నా మనసులో రేకెత్తే అనుభూతులే నా డైరీలో చోటు చేసుకుంటాయి. నా కళ్ళు తెరిపించిన మనోజవానికి ఎంతైనా రుణపడి ఉంటాను.”

X                 X               X

 

మరో పది రోజుల తరువాత-

రాత్రి ఎనిమిది గంటల వేళ, గదిలో మనోజవం ఒక్కడే ఉన్నాడు. తలనొప్పిగా ఉంది,రాలేనని అతడనడంతో మురహరి ఒక్కడే కొత్తగా రిలీజయిన సినిమాకు వెళ్ళాడు.

మురహరి వెళ్ళిన కాస్సేపటి తరువాత,ఏకాగ్రతతో డైరీ రాయడం ప్రారంభించాడు మనోజవం. అయితే,అతడు రాస్తున్నది ఈమధ్య కొత్తగా కొన్న డైరీలో కాదు. మరో పాత డైరీలో! రాయడం పూర్తికాగానే,తను అంతవరకూ రాసిందంతా మరోసారి చదువుకోసాగాడు.

డైరీ ప్రాముఖ్యత గురించి నాకు వివరిస్తూ, మురహరి లెక్చర్ దంచిన మరుసటి రోజే అతని నిజాయితీని శంకించే సంఘటనలు రెండు నా దృష్టిలోకి వచ్చాయి. ఆరోజు ఉదయం రక్తదాన శిబిరానికి వెళ్ళానని అతడు నాకు చెప్పాడు. కాని ఆ సమయంలో అతడు మార్నింగ్ షో సినిమాకు వెళ్ళినట్లు సూచించే సినిమా టికెట్ అనుకోకుండా నాకు చెత్తబుట్టలో దర్శనం ఇచ్చింది. అదో కారణమైతే- తుఫాన్ బాధితుల కోసం ఆ నెల జీతంలో సగభాగం విరాళంగా ఇచ్చినట్లు నాకు చెప్పిన విషయం నిజం కాదని తుఫాన్ బాధితుల నిధి నిర్వాహకులు అతని నుంచి అందిన వంద రూపాయిలకు పంపిన రశీదు నా కళ్ళబడడం మరో కారణమయింది. ఇలా సందేహాస్పదమైన మురహరి ప్రవర్తన నన్ను ఎప్పుడూ టేబుల్ మీద పడి ఉండే అతని  డైరీ చదవడానికి పురిగొల్పింది. చదవడం మొదలెట్టాక అతడు అబద్ధాల గోడ కడతాడని అర్థమయింది. నేననుకున్నట్లే,మొన్న రక్త దానం చేసినట్లూ, భూరి విరాళం ఇచ్చినట్లూ రాసుకున్నాడు. తన డైరీలో రాతల ద్వారా, అందరూ తనని ఉదాత్తతకు ప్రతిరూపంగా, దాతృత్వానికి ప్రతీకగా, రాగద్వేషాలకు అతీతుడిగా భావించాలని తాపత్రయపడుతున్నాడు. అంతేతప్ప ఊహాకల్పిత రాతలతో తనను తాను మభ్యపెట్టుకుంటున్నాడన్న విషయం గ్రహించలేకపోతున్నాడని నాకు అర్థమయింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, కొన్నాళ్ళకు తన అబద్ధపు రాతలే నిజమని తనే నమ్మే చిత్త భ్రాంతికి అతడు లోనయ్యే ప్రమాదం పొంచిఉందని భయపడ్డాను.

పరిస్థితి చేయి దాటిపోకముందే, మురహరికి కనువిప్పు కలిగేలా చెయ్యడం నా బాధ్యతగా భావించాను. అందుకు సరైన దారి కోసం అన్వేషించాను. నిలువెత్తు దర్పణానికి నిర్వచనం అని అతడు నమ్మేలా నేను డైరీ రూపొందించగలిగితే, అతనిలో మార్పు రావడానికి అవకాశం ఉంటుందని విశ్వసించాను. ఆ విశ్వాసమే  నన్ను అతడి దృష్టిని ఆకర్షించేలా సరికొత్త  డైరీ సృష్టించడానికి ముందుకు నడిపించింది. నాలో కలిగిన నిజమైన భావ పరంపర అని అతడు నమ్మే విధంగా,నాన్న ఆ అమ్మాయి ఫొటో పంపిన ఒక్క విషయం తప్ప, కల్పిత సన్నివేశాలతో, నేనూ దొంగ డైరీ రాసాను. సహజత్వం కోసం, పాపం! ఏనాడూ పైసా కూడా పంపమని అడగని నాన్నకు సైతం నా అబద్ధాల రంగు పులిమాను. నిజానికి,ఫొటోలో అమ్మాయి నాకు నచ్చిందని, ఆ అమ్మాయి ఇష్టాఇష్టాలు కనుక్కోమని నాన్నకు అదేరోజు ఉత్తరం రాసేసాను. ఇక నేను కావాలనే తాళంచెవులు వదిలి బయటకు వెళ్ళిన రోజు…..!- నేను ఆశించినట్లే జరిగింది. మురహరి నా సూట్ కేస్ లో పైకి కనిపించే విధంగా ఉంచిన డైరీ తీసి చదివాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను చిన్నప్పుడు చదివిన డిటెక్టివ్ నవలల తెలివితేటలు ఉపయోగించి,నా తల వెంట్రుకలు డైరీ మొదటి పేజీలో ఒకటి,చివరి పేజీలో మరొకటి ఉంచాను. నేను తిరిగి వచ్చాక డైరీ తెరిచి చూస్తే, అవి కనిపించలేదు. బహుశా, మురహరి డైరీ చదివినప్పుడు జారిపడిపోయి ఉంటాయి. ఇందాక,మురహరి సినిమాకు వెళ్ళాక, అతని డైరీ తిరిగి చదివే అవకాశం లభించింది. మునుపటిలా అతడు డైరీ బయట వదిలేయడం లేదు. భద్రంగా సూట్ కేస్ లో ఉంచి తాళం వేస్తున్నాడు. ఆ తాళం తెరవడానికి నేను పెద్దగా ప్రయాస పడలేదు. సాధారణంగా అందరూ స్పేర్ కీస్ అవసరం ఎప్పుడు వస్తుందో అని అందుబాటులో ఉండే ప్రదేశంలో భద్రపరుస్తారు. మురహరి కూదా ఆ పద్దతికి మినహాయింపు కాదు. అతడు ఊరు వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న ఎయిర్ బేగ్ లో అవి కనిపించాయి. డైరీ తీసి చదువుతుంటే-  అతడు డైరీ రాయడంలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది. అవాస్తవిక భావాలు మచ్చుకైనా లేవు. నా ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చిందన్న విషయం తేటతెల్లం కావడంతో సంతోషిస్తూ, డైరీ యధాస్థానానికి చేర్చాను. నాకూ డైరీ రాసే అలవాటు ఎప్పటినుంచో ఉన్నా, ఊకదంపుడు రాతలతో నింపకుండా, ముఖ్యమైన విశేషాలు రాయాల్సి వచ్చినపుడు మాత్రమే అది బయటకు తీస్తాను. అందుకే నాతో కొత్తగా పరిచయమైన మురహరికి పాపం నా డైరీ రాసే అలవాటు గురించి తెలియదు. ఈ సెప్టెంబర్ 20వ తేదీన నా పెళ్ళికి ముహూర్తం కుదిరిందని నాన్న ఉత్తరం రాసాడు. పెళ్ళయ్యాక,నా భార్య కాపురానికి వస్తుంది కనుక వేరే మంచి ఇల్లు వెతుక్కోవాలి. అంటే,మురహరితో నా సాంగత్యం మహా అయితే మరో నెల రోజులు. ఈ నెల రోజుల పాటు ఈ డైరీ పొరబాటున కూడా మురహరి కంటబడకుండా కాపాడుకోవాలి.”

తను రాసింది చదవడం పూర్తికాగానే, డైరీని తన సూట్ కేస్ లోని అడుగు భాగంలో భద్రం చేసి వచ్చి కుర్చీలో కూలబడి సంతృప్తిగా నిట్టూర్చాడు మనోజవం.

               *

విజయ్ ఉప్పులూరి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు