“సగం నగరం లో కూలదోసిన కట్టడాల ముక్కలు చెక్కలు కంకర, మిగిలిన సగం, కట్టబోతున్న కొత్తవాటి తాలూకు ముడి సామగ్రి. ఈ చిల్లపెంకులు చెత్తలను ఒక పల్చటి మంచుపొర కప్పబట్టి కానీ లేకపోతే చూడశక్యం అయేది కాదు.” ‘Kairos’ లో ఒక వాక్యం.
సిటీ బస్ ప్రయాణం లో ఒకరికొకరు తారసపడిన క్షణంలో Hans, Katherina అనే మనుషుల మధ్య ఉద్వేగపూరిత ప్రేమ గా మొదలయ్యి ఐదారేళ్ళ లో దారుణ మనస్తాపంగా పర్యవసించిన కథ ఈ Kairos అనే 2024 లో బుకర్ ప్రైజ్ గెల్చుకున్న నవల లో.
Hans ది చాలా శిథిలాలు చూసిన బాల్యం. Berlin wall Germany రెండు ముక్కలు చేయడం, హిట్లర్ నియంతృత్వ రాజ్యపాలనం, ఆ భావజాలం వైపు మొగ్గిన తన తండ్రి, అతన్ని పద్దెనిమిది యేళ్ళు రాగానే తన ఇల్లు, ఊరు, ఆ పడమటి దేశంలో వదిలి తూర్పు జర్మనీకి వెళ్ళేట్టు చేసాయి. అతనికి కాథరీనా ను కలిసేటప్పటికి భార్య, పద్నాలుగేళ్ళ కొడుకు. కొన్ని వివాహేతర సంబంధాలు. కాథరీనా కు మటుకు ఇతని మీద అలౌకికమా అనేంత ప్రేమ.
కాథరీనా ను కలిసాక మాత్రం అతను మరో సాంగత్యం పెట్టుకోలేదు కథలో. కానీ ఆ పిల్లను ప్రేమించడంలో ఒక పైశాచికత. కాథరీనా ఒకేఒకసారి తప్పు చేసినందుకు ఆమెను ఇక నిష్కృతి లేని పాపివి నీవు అన్నట్టు మాటలతో చేతలతో హింసిస్తాడు. ఆమెను వదిలి సంతోషంగా ఉండలేడు. దగ్గర ఉన్నప్పుడు సుఖంగా ఉండలేడు. అతడిని ఆమెలో రాజ్యం లో హింస విషాదాలు మనుషుల్లో మలినాలు చూడని బాల్యం, స్వచ్ఛమైన యవ్వనం తాలూకు జీవిత స్పృహ ఆకర్షించాయి. తను కోల్పోయినది చూస్తున్న ఆనందం, అదే సమయం లో మానవసహజమైన అభద్రత, అసూయ.
చివరకు అతని మరణ వార్త, అటుపై Hans తాలూకు రెండు పెద్ద పెద్ద అట్టపెట్టెలు ఈమెను చేరడం ముగింపు. ఆ పెట్టెల్లో ఈ ప్రేమికుల గుర్తులు ; చాక్లెట్ రేపర్ దగ్గరనుంచి కాఫీ బిల్, థియేటర్ టికెట్ల వరకూ సావనీర్ లు గా మిగిలిన రశీదులు ఆమె ఒక్కొక్కటీ చూడటం మొదలు పెట్టడంతో నవల మొదలు. Kairos , chronos రెండూ గ్రీకు పదాలు. Chronos కాలం, kairos ఒక నిర్దుష్ట ఘడియ.
నవల మొత్తం బాగలేదు అనలేను గానీ, Michael Hofman ఇంగ్లిష్ కాకపోతే ఈ పుస్తకాన్ని చదవటం కూడా ఇష్టమూ సులభమూ అయ్యేది కాదేమో. వ్రాయడానికి క్రాఫ్ట్ పరంగా రచయిత ఎంత కఠినశ్రమ పడ్డారో అని అడుగడుగునా అనిపించుతూనే దాన్ని చక్కదనాల వచనం గా మార్చిన అనువాదపు పనితనమూ తెలుస్తుంటుంది మొదటి నుండీ నవల చివరి వరకూ (జర్మన్ భాష ముక్క రాకపోయినా, నేను anglophile కాకపోయినా.) చరిత్ర లో కాలం, దేశం, మనిషి ఉంటారు. వాస్తవంలో మొదటి రెండూ మారుతాయి. మనిషి మొరాయిస్తాడు. మారనంటాడు. అదే అవుతుంది వస్తువు చాలా కథలకు.
1986 నుంచి ఉరామరికగా 1992 వరకూ నడిచిన ఒక ప్రేమ, ఒక పొలిటికల్ సంఘటన ల ఉద్వేగపూరిత పూర్వాపరాలు ‘Kairos’ నవల లో విషయం. “పానపాత్రలోపల ఒక పక్క గోడకు అంటుకుని ఉన్న మరో చిన్న పాత్ర లాంటి” తూర్పు జర్మనీ తన పడమర భాగం నుంచి, బెర్లిన్ గోడ ఆసరాగా విడిగా గిరి గీసుకుని ఉన్నానని అనుకునే రాజకీయాల నుంచి, ఆ మధ్యలో గోడ ను కూల్చి తనను అంతిమంగా కలిపేసుకుంటున్నాను అంటూ పశ్చిమ దేశం, తన సమస్తాన్ని రూపుమాపు చేసిన రాజకీయం వరకూ అస్తిత్వం కోల్పోయిన దిగులు తో తూర్పు జర్మనీ చెప్పిన కథ ఇది.
ఇది కలిసిపోవడం కాదు, పూర్వపు నామరూపాలు లేకుండా కొత్త నీళ్ళల్లో కొట్టుకుపోతున్న సుదీర్ఘ విషాద సంఘటన తాలూకు కథ, తూర్పు జర్మనీ తనకు గతం తో పాటు భవిష్యత్తూ పోతోంది అని చెప్పుకున్న కథ లో Hans అనే పాత్ర East Germany కి మెటఫర్ కూడా. దీంతోపాటు జమిలిగా నడుస్తూ వచ్చిన మరో కథ, ఇరవైకి ఇంకా ఒక యేడాది ఆగవలసిన Katherina అనే అమ్మాయికి యాభై నాలుగేళ్ళ వివాహితుడైన Hans కు మధ్య యాదృచ్ఛికంగా మొదలై బీభత్సంగా సాగిన ప్రేమ కథ. చదివే వాళ్ళకు కూడా బీభత్సమే ఈ ప్రేమ. ఇదీ ప్రతీకాత్మతనే, రెండు భాగాలుగా విడిపోయిన దేశం కలుస్తూన్న సమయంలో జరిగే సంఘర్షణ, పరస్పర అసంతృప్తి, వంచన, నేరారోపణ ఈ పాత్రల మధ్య కూడా. అలెగరీ, మెమొరీ, కలలు, చైతన్యస్రవంతి కథనం, కథనంలో కలిపేసి రాసిన సంభాషణలు(ఎవరివి ఏ మాటలో స్పష్టంగా చూపకుండా), కథలోకి కుప్పలు తెప్పలుగా వచ్చిపడే వివిధ మైథాలజీల, సంగీతాల, చిత్రకళల విస్తారమైన ప్రస్తావనల చొరబాటు … పెద్ద కష్టమే ఉంది పుస్తకం వెనక. ఈ అన్నిటిని సంక్లిష్టంగా పేనిన విధాన్ని జాగ్రత్తగా క్లుప్తంగా ముఖ్యంగా చాలా అందంగా ఇంగ్లిష్ లోకి తెచ్చిన అనువాదకుడికి గొప్ప అభినందనలు ఇవ్వాలి.
Kairos కు సరిగ్గా చెప్పాలంటే తెలుగు లో తర్జుమా ‘సుమూహుర్తం’. కానీ, అలా అని కథలో ఒక్క మంచి విషయమూ జరగలేదు. అన్ని రకాల విధ్వంసమూ ఉంది తప్ప కథలో. అందుకే ‘ముహూర్త క్షణం’ కంటే ‘ఘటన’ అనడం ఉచితం యేమో Kairos కు అర్థం గా. ఘటనలు వాటంతట అవి జరుగుతాయి, జరిగిపోయాక ఆ నిమిషాలను ఆ రోజులను గుర్తుపెట్టుకుంటాడు మానవుడు. కానీ ముహూర్తాన్ని తాను ముందుగా నిర్ధారిస్తున్నాను అనుకుంటాడు. అంతా అయ్యాకా అవుతూన్నప్పుడు తేదీ, గంటలూ, నిమిషాల తో సహా నమోదయి నిలబడుతుంది. ఇక్కడా అదే జరిగింది, ముందు తెలియదు ఎవరికీ. రెండొందలు పై చిలుకు పేజీల్లో సర్వసాక్షి కథనంలో రచయిత్రి జెన్నీ ఎర్పెన్ బెక్ almost visceral scale లో చెప్పిన ఒక ప్రేమ తాలూకు ఉత్థానపతనాలు, బెర్లిన్ వాల్, దాంతోపాటు ఈస్ట్ జర్మనీ పతనం ఇతివృత్తం అయిన ఈ కథలో వైయక్తిక సాంఘిక సాంస్కృతిక ఆర్థిక నైతికత, దాని చంచలత్వం ప్రధానమైన ముచ్చట.
మరో కీలకమైన అంశం, నమ్మకద్రోహం, దానికి ఎదుటివాడు ఝళిపించే నిరంకుశ prosecution, persecution , ఇవన్నీ క్లుప్త వాక్యాలలో క్షుణ్ణంగా చూస్తాం. రచయిత ను “మీరు ఎక్కువగా ఎంచుకునే వస్తువు నమ్మక ద్రోహం కదూ?” అని అడిగిన ప్రశ్నకు ఆమె “కాదేమో, ఆ వస్తువే నన్ను మాటిమాటికీ ఎంచుకుంటున్నది” అన్నది ఒక ఇంటర్వ్యూలో. నమ్కద్రోహం, వినడానికి పెద్ద ఘోరమైన మాట లా అనిపిస్తుంది కానీ, నిద్రలేస్తే చీమ పరిమాణం లోనో బ్రహ్మ పరిమాణం లోనో అది లేకుండా ఏ పనైనా ఉందా ఈ లోకంలో ఈ కాలంలో ? నిజానికి ఎప్పుడూ ఉండదు అట్లా. ఏమైనా కానీ రచయిత చెప్పినవీ, ఆ రచన చెప్పినవీ అయిన ఆ పై పై పొరలన్నింటినీ విప్పితే, సూక్ష్మంగా ఇది ఒక అన్వేషణ కథ. తనకు సాంతం దొరక్కుండాపోయిన బాల్యకాలం కొరకు, ఒకప్పటి సమయమూ, స్థలమూ, తన నిజ ముఖము కొరకు Hans అనే ఈ కథలోని ప్రొటాగనిస్ట్ చేసిన అన్వేషణ నే ఈ కథ అని అనుకుంటున్నాను(ఈ పాత్ర ఒక నవలా రచయిత.) ఇతడు Katherina లో “పోయిన నేను“ అనే పద్దెనిమిది యేళ్ళవాడు కనపడతాడు నాకు అనుకున్నాడు.
తనను పట్టుకుందాం అనుకుంటుండగానే ఆమే వచ్చి అంటుకుంది తనను. (అదేనేమో ‘Kairos’! ) ఎంత ప్రియమైనదైనా ఇప్పుడది తను వహించలేని వెలుగు. తన గుప్పెట్లో పట్టి ఉంచలేని అగ్ని. అలా అని వయసు లో తారతమ్యం కాదు విషయం, వయసు అంటే భౌతికంగా లెక్కవేసే సంవత్సరాలతో కాదు అసలు సమస్య. వయసును తన పైన పడనీయని శరీరమూ కాకపోవచ్చు సమస్య. అది వస్తు తత్త్వం. కాలం గతం గతః! అంతే. To romance your childhood, that too this way is like Faustus sleeping with the ghost of Helen. Here he’s sleeping with his own ghost. Hans could not grasp what he had lost however hard he tried looking for it , gazing into a strange place, though “without revolting.” D.H. Lawrence “Sons and Lovers” లోని ఒక వాక్యం గుర్తొస్తుంది. Katherina లో తన ఆత్మనూ, గతాన్ని, వెతుక్కుంటున్నాను అనుకుంటూ Hans ఆమె శీలాన్ని శల్య పరీక్ష చేయడం విచిత్రం. పైగా, “నీవు శారీరకంగా, మానసికంగా కూడా పాపం చేసి నాకు, తద్వారా మన ప్రేమకు ద్రోహం చేశావు అంటూ ఆమె మస్తిష్కం లోకి ఆ నేరం చేసానన్న భావనను ఇంకించి హింసించాడు. Katherina “immorality” తో తనకు ద్రోహం చేయటం కాదు, గడిచిపోయిన కాలాన్ని ఆమె ద్వారా బంధించాలనుకుని తనను, ఆమెనూ కూడా అతడు రాక్షసంగా బంధించాడు. అదే అతని పతనం.
“The return to the beginning has made the beginning into something complete in itself.” మరప్పుడు అంతటితో దాన్ని వదలక గతించినది వాస్తవం లోకి తెచ్చుకోగలననుకోవడం విషాదం, హింస కదా. కానీ, ఇటు చూస్తే అతని ప్రవర్తన వెనుక గాయం పరిధీ, లోతూ తూర్పు పడమరల జర్మనీ అంచుల ను దాటినది. “దేశ జాతీయగీతం లో పదాలు, స్వరాలు ఎలా సమకూర్చారంటే ఇప్పుడు విడి విడి దేశస్థులు గా ఉండికూడా పాటు వింటూ అటువారు ఇటువారు ఒకే క్షణం లో ఊపిరి పీల్చేవిధంగా.” అంటాడు అతను ఆమెతో. విడిపడటం గూర్చే ఇంకా ఒక సమాధానానికి రాకముందు తిరిగి ఈ ఐక్యీకరణ పేరుతో నేలమట్టం అవుతున్న తన జీవితం అతన్ని దాదాపు మానసిక రోగి గా చేసి వదిలేసింది. సరిహద్దు కు ఇవతల సగం దేహం, అటు సగం. కానీ అతని ఉద్యోగం అటు సగం పైన నిఘా పెట్టడం. కమ్యూనిస్ట్ ఈస్ట్ లో జనాన్ని కాపిటలిస్ట్ వెస్ట్ ఎలా కారుచవకగా వస్తువులు విసిరేసి వశం చేసుకుందో చెప్తుంది కథ.
ఇటువైపు మనిషి ఒక పనిముట్టు, చెప్పినట్టు పనిచేసినంతకాలమే అది కూడా. అటువైపు మనిషి వస్తువులను కొనేవాడు, వస్తువుల మాయతో కొనబడేవాడు. పెడ్తే నా? నిఘా పెట్టకపోతేనా దేశద్రోహం? తను ఎటు చెందుతాడో, ఎటు చెందాలో తెలియక పోవడం ద్రోహం ఎలా అవుతుంది? ట్రాజెడీ అవుతుంది కానీ. Hans ఆమెను నిలదీస్తున్న ప్రశ్నలు, ఆమెపై మోపుతున్న నేరాలు ఒకవిధంగా అతను తనకు తాను వేసుకోవలసినవి అని తెలిసి, వేసుకోలేక, తన జవాబులు ఆమె నుండి రాబట్టుకుంటున్నాడు. దేశాల మధ్య హద్దులు కట్టి ఒకసారీ, సరిహద్దుగోడ పడగొట్టి ఒకసారీ మామూలు మనుషుల కాళ్ళ కింద నేలను లాగేది ఎవరు? It is like being thrown into a different time zone, while still very much being here, very much being now. కాలం లక్షణం జారిపోవడం. గతం లక్షణం కప్పబడి ఉండలేక పోవడం కూడా. “Can you bury what once was? No.” సన్నటి మట్టి పొర కింద ఇంకా జీవిస్తున్న శవాలు, వాటితో పాటు బ్రతికున్న వాళ్ళ గతాలు. Kairos అయిపోయాక ఫర్లేదు, బానే ఉంది అని భారంగా అనిపించిన నవల.
కొన్ని వాక్యాలు నచ్చినవి: The strange trick of paper to become a document, the strange trick of paper to produce deceptions. To peel off one reality from the other, to start a pecking order of different realities. A lie must be properly engineered for it to be believed, the “lie” as the preferred form of power for those who have no power. The dead linked umbilically to the living by their hope for punishment to be exacted. (But the punishment here, is it to be exacted for them or through them as in Hamlet!) The life after death looks exactly the same as it was before death. Our personal tragedies are not those that move the world and not even our defeats belong to us.
మతం పైన అక్కడక్కడా చురకలు వదల్లేదు రచయిత- బాహాటంగా ఒకసారి ఇలా : “this positively ovine willingness to sacrifice!” నవల చదివేటప్పుడు ”it is so much detritus” అనిపించింది అప్పుడప్పుడు. ఒక సాహిత్యరచన గా ముప్పై సంవత్సరాల కింద చదివిన, ఇదే Booker prize గెలుచుకున్న అరుంధతీ రాయ్ ‘God of Small Things’ యే మెరుగు అని కూడా అనిపించింది. Pretended craft చాలా తక్కువ అందులో అని అనుకోకుండా ఉండలేకపోయాను.
*
Add comment