అల్లర్లు , లూటీలూ నలువైపులా జరుగుతూండగానే , యిప్పుడు దానికి గృహ దహనాలు కూడా తోడయ్యాయి .
ఇవన్నీ పట్టించుకోకుండా తన మెడకు ఒక హార్మోనియం వేలాడదీసుకుని ఓ మనిషి వీధులంట చాలా పరిచితమైన పాటని గానం చేస్తున్నాడు .
“ఆమె ఎక్కడో దూరతీరాలకు వెళ్ళిపోయింది
నా హృదయాన్ని ముక్కలు చేసి
ఇంకొకరినెవ్వరినీ ప్రేమించకుండా చేసేసింది ….” అంటూ.
యవ్వనంలో వున్న ఒక కుర్రాడు చేతుల్లో డజన్ల కొద్దీ దొంగిలించిన అప్పడాల పాకెట్లు మోసుకు పరిగెడుతున్నాడు . పట్టు తప్పి ఒక పాకెట్ కింద పడిపోయింది . దాన్ని వంగి తీసుకోబోతూ వుండగా , దొంగిలించిన కుట్టు మిషను తలపై తీసుకుపోతున్న ఓ వ్యక్తి “ఎందుకు చింతపడుతున్నావు అబ్బాయీ ! రోడ్డు ఎంత వేడిగా వుందంటే అప్పడాలు వేగి కర కరలాడతాయి ” అన్నాడు .
ఇంతలో బరువైన ఒక గోనె మూట వీధి మద్యలో ధడ్ మని పడింది . రక్తసిక్తమై పారిపోతున్న వారెవరైనా దానిలో వున్నారేమో బహుశా అన్న ఆశతో , ఒక వ్యక్తి ముందుకువచ్చి వేటాడే పెద్ద కత్తితో ఆ గోనె మూట ముడిని నరికాడు,కానీ అందులోంచి తెల్లగా మెరుస్తున్న పంచదార పలుకులు జల జలా రాలాయి . వెంటనే జనాలు పోగై అనుకోకుండా దొరికిన బహుమతిని తమలో తాము పంచుకోసాగారు .కేవలం ఒక తెల్లటి గుడ్డను చుట్టుకున్న ఒక వ్యక్తి , ఎంతో సాధారణంగా చేస్తున్నట్లు , ఆ గుడ్డను విప్పేసి , దాన్ని అప్పటికప్పుడు ఓ సంచీలా మడిచి పిడికిళ్లతో పంచదారను అందులో నింపుకోసాగాడు .ఈలోగా
“చూసుకోండి చూసుకోండి దారి ఇవ్వండి దారి ఇవ్వండి ” అన్న అరుపులతో ముందుకి వస్తూ, నిగ నిగలాడుతూన్న కర్ర సామానులతో నిండిపోయిన ఒక టాంగా ఆ వీధిలోంచి త్వరగా వెళ్ళిపోయింది .
పై అంతస్థులో కిటికీ నించి వీధిలోకి తొంగి చూస్తూ ఒక వ్యక్తి తనకు దొరికిన పెద్ద ముఖ్మల్ గుడ్డ చుట్టని ఒకేసారి మోయలేక
క్రిందకు జారవిడిచాడు, కానీ నేలపై చేరేలోగా క్రింది అంతస్తు కిటికీ లోంచి నాలుకలు చాస్తున్న మంటలకు ఆహుతై బూడిదే మిగిలింది.
ఎన్నో బరువైన స్టీలు యినప్పెట్టెలున్న ఒక యింటి లోంచి కొందరు వ్యక్తులు ఎంతో పెనుగులాడుతూ ఒక్క యినప్పెట్టెను మాత్రం బయటకు తరలించగలిగారు కానీ అది ఎంతకూ తెరవబడ్డంలేదు.
యింకో వ్యక్తి ఆ యింటి పక్కనేవున్న దుకాణం లోంచి” కౌ ఎండ్ గేట్” కంపెనీ పాలపొడి డబ్బాలు దొంగిలించి వీధి చివర మాయమయ్యాడు.
“రండి రండి! ఎంతో ఎండగా వుంది. ముందు యిక్కడున్న చల్లటి నిమ్మ రసం సీసాలు తీసుకు తాగండి” అని ఒక వ్యక్తి అందరికీ స్వాగతం పలికాడు. మెడలో దొంగిలించిన కారు టైరు వేలాడదీసుకున్న ఓ మనిషి కనీసం ధన్యవాదాలైనా చెప్పకుండా రెండు బాటిల్స్ తీసుకుని వెళ్లిపోయాడు.
ఇంతలో ఎవరో అరిచారు “అగ్ని మాపక దళానికి కబురు చేయండి లేకుంటే ఎంతో విలువైన వస్తువులన్నీ ఈ మంటలకు ఆహుతి అయిపోతాయి.” కానీ ఈ మంచి సలహాపై ఎవ్వరూ శ్రద్ధ చూపలేదు.
సూర్యుడి ఎండవేడి ప్రభావంతో రోజంతా మరింత రాజుకుంటున్న మంటల వేడి భరించరానిదైపోయింది. హఠాత్తుగా గాలిలో తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. పోలీసులు వచ్చేలోగా వీధి చివర వేగంగా కనుమరుగవుతున్న ఓ మనిషి ఆకారం తప్ప అంతా నిర్మానుష్యంగా వుంది. భూతంలా కనిపించీ కనిపించక మాయమవుతున్న ఆ ఆకారం వైపు విజిల్స్ వేస్తూ వెంటబడ్డారు. కాస్త పొగలేని ప్రదేశానికి చేరుకున్నాక ఆ వ్యక్తి రోజువారీ కూలీ పని వెదుక్కుంటూ మైదానాలకు వచ్చిన వేలాది కాశ్మీరీ కూలీలలో ఒకడిని గుర్తు పట్టారు. అతని వీపు మీద ఒక పెద్ద బరువైన గోనె మూట వుంది. పోలీసులు జోరుగా విజిల్స్ వేస్తూ వెంటపడుతున్నా అతడు ఆగడం లేదు. తను వీపు మీద వున్నది బరువైన మూట కాదు ఏదో పక్షి ఈక వున్నట్లు పరిగెత్తుతున్నాడు. పొలీసులు పరుగెత్తి పరుగెత్తి అలసిపోయారు. ఊది ఊది వారి విజిల్స్ సైతం బొంగురు పొయాయి. వారిలో ఒకడు కోపంతో, తన రివాల్వర్ తీసి ఆ కాశ్మీరీ కూలీ కాలికి తగిలేలా పేల్చాడు. అతని వీపు మీద వున్న మూట కింద పడింది. రక్తం ఉబుకివస్తున్న తన కాలుని చూసుకున్నా లెక్క చెయ్యకుండా మరుక్షణం మూట ఒక్కసారిగా వీపు పైకెత్తుకుని మళ్ళీ పరుగు లంకించుకున్నాడు. విసుగొచ్చి పోలీసాడు “పోతే పోనీ నరకానికి వెధవని” అని వెంటపడ్డాడు మానేశాడు. కానీ ఈ లోగా బరువైన ఆ మూటతో కూలీ నేలపై కుప్పకూలాడు.
ఆ కూలీనీ గోనె మూటనీ పోలీసులు స్టేషన్ కు తీసుకుపోసాగారు. . దారిలో కూలీ పోలీసులను ప్రార్థిస్తూ “గొప్ప బాబుల్లారా నాలాంటి బీదవాడిని ఎందుకు పట్టుకుంటారు. నేను తీసుకు పోగలిగేది కేవలం ఈ బియ్యం మూటనే ! నాలాంటి వాడిని ఎందుకు కాల్చటం బాబుల్లారా?” అని ప్రాథేయపడినా లాభం లేకపోయింది. స్టేషన్ కు చేరుకున్న తర్వాత కూడా “ఎందరో ఎన్నో పెద్ద వస్తువులన్నీ దొంగిలించారు. నాలాంటి పేదవాడు యిలాంటి బియ్యం మూటనే దొంగిలిస్తాడు ఎందుకంటే కేవలం అన్నమే తింటాం కనుక” అంటూ ప్రాధేయపడ్డా ఉపయోగం లేకపోవడంతో విసుగు చెంది చివరకు తలపై మాసిపోయివున్న నమాజ్ టోపీ తీసి నుదురు తుడుచుకుంటూ, ఎంతో కోరికతో బియ్యం మూట వైపు చూస్తూ, చేతులు ముడిచి పోలీసు యినస్పెక్టరుతో “సరే! ఓ గొప్ప బాబూ ఈ బియ్యం మూట మీరే వుంచుకోండి, కనీసం ఈ బీదవాడికి నాలుగణాలు కూలీ యివ్వండి” అన్నాడు.
*
తగినంత పర్యవేక్షణ
తన స్నేహితుడు కూడా తన మతానికి చెందిన వాడేనని పరిచయం చెయ్యగానే, యిద్దరికీ మిలటరీ సంరక్షణలో దారంట బారుగా పోతూన్న వారి బండ్లలో సురక్షిత ప్రాంతానికి ప్రయాణం చేసే అవకాశం దొరికింది.
ప్రయాణం మద్యలో సమయానుకూలంగా ఏ స్నేహితుడైతే తన మతం మార్చుకున్నాడో అతడు సైనికులతో “ఈ ప్రాంతంలో తాజాగా ఏమైనా సంఘటనలు జరిగాయా?” అని అడిగాడు.
సైనికుడు “ఎక్కువగా ఏం జరగలేదు” అని చెబుతూ “ఈ పరిసర ప్రాంతంలో ఓ సంకర జాతికి చెందిన కుక్కని కాల్చి చంపడం తప్ప’ అన్నాడు.
అతడు అదిరిపడి “ఇంకా ఏమైనా జరిగిందా?” అడిగాడు.
సైనికుడు “లేదు కేవలం పక్కనే పారుతున్న కాలువలో మూడు ఆడ కుక్కల శవాలు మాత్రం కనిపించాయి” అన్నాడు.
మిలటరీ తటస్థ వైఖరిని, భయపడుతున్న తన స్నేహితుడుకి తెలియజేయాలని ఆయన స్నేహితుడు, సైనికుడిని ఉద్దేశిస్తూ “మిలటరీ ఏమీ చెయ్యదా?” అని అడిగాడు.
సైనికుడు “చేస్తుంది! కానీ అంతా దాని తగినంత పర్యవేక్షణలోనే” అన్నాడు.
*
డబల్ క్రాస్
“చూడూ, యిది ఏ మాత్రం న్యాయంగా లేదు. నీవు కల్తీ పెట్రోల్ నాకు బ్లాకు మార్కెట్ ధరకు అమ్మావు కానీ దానితో ఒక్క దుకాణం కూడా తగులబెట్టబడలేదు.”
*
దేశ విభజన సృష్టించిన కల్లోలం – దక్షిణ భారతానికేమోగానీ, పశ్చిమోత్తర భారతదేశపు రాష్ట్రాల్లో ముఖ్యంగా- పంజాబ్‌లో పరమఘోరమైన పచ్చి నిజం. తల్లులూ బిడ్డలూ అక్కలూ తమ్ముళ్లూ మంచితనమూ మానవత్వమూ పాశవికంగా కాలిబూడిదైన కాలమది. పైకి పెచ్చులు కట్టినా, లోపలింకా ఆ గాయలు పూర్తిగా మానుబట్టలేదనే చెప్పాలి. ఆ కల్లోలానికి సాక్షిగా మంటోనుంచి వెలువడిన ఈ కథల్లో, గుండెల్ని పిండేసే వ్యథ ఉంది. ఆ భావోద్వేగాలని పుట్టించేది ముఖ్యంగా మంటో రచనాకృతి. ఉర్దూ-హిందీ భాషలకి ఉండే ‘వెసులుబాటు’ని అతి చక్కగా వినియోగించుకున్న మంటో, దశాబ్దాలకొద్దీ గుర్తుండిపోయే ఆణిముత్యాలని స్రవించాడు. ఆ వేదనలని పట్టిచూపే, సరితూగే పదాలని మరో భాషలో పొదగగలగడం ఒక ప్రత్యేకమైన కళ – అని నా నమ్మకం. మంటో కథల్లోని వాక్యాలకి తెలుగులో పదాలు వెతకడం కష్టం కావచ్చేమోగానీ, అసాధ్యం మాత్రం కాదు. ఆయనతోబాటు తాదాత్మ్యత చెందితే పదాలు వాటంతటవే తడతాయి. లేకపోతే ఆ అనువాదం – ఆత్మకి అతుకుల చీర చుట్టినట్లే ఉంటుంది.