1
కవిత్వం కంటే ముందు కథే నన్ను మొదట బాగా కట్టిపడేసిన ప్రక్రియ.
కథ రాయడంలో వుండే తృప్తినీ, అసంతృప్తినీ మొదటిసారి అనుభవించింది నా ఎనిమిదో తరగతిలో- అప్పటికి మేం చింతకాని అనే పల్లె నుంచి ఖమ్మం చేరి ఏడాది అయింది. పట్నమూ, అక్కడి బడి చదువులూ ఇంకా అర్థం కాక సతమతమవుతున్న దశ నాది. “నీ పల్లెటూరి మొహం నువ్వూ. ఏదీ ఒకసారి చెబితే తలకెక్కదు” అని మా ఇంగ్లీష్ మేడమ్ తిట్టి, చెవులు మెలిపెట్టడం ఇప్పటికీ బాగా గుర్తుంది. ఉర్దూ, తెలుగూ, ఇంగ్లీషు మూడు ముఖాల చదువుతో ఇంకెవరితోనూ ఆ బాధ పంచుకోలేక తెలుగు అక్షరాల్లోకి మళ్ళాను. వొక రాత్రి బిగ్గరగా ఏడవడానికి బదులు ఎదో రాసి, తెల్లారే దానికి “కథ” అని పేరు పెట్టాను, అదే నిజం అని లోకానికి తెలియడం ఇష్టం లేక! వాస్తవం కన్నా ఊహల్లో సంచారమే బాగుండేది ఆ రోజుల్లో-
కాని ఆ కథ ఇద్దరు స్నేహితుల మధ్య నుంచి నలుగురి దాకా చేరింది. “మాటలు రాని మొద్దువే గాని నువ్వు రాతగాడివిరా” అన్న స్నేహితుల “సత్కారం”తో కాగితాలు నలుపెక్కడం మొదలయింది. అదీ కేవలం స్నేహితుల మధ్య మాత్రమే సంచరించిన అచ్చు కాని మొదటి కథ వెనక కథ.
పల్లె నుంచి పట్నం వచ్చిన బడి పిల్లాడి బాధ. పల్లెలో మొదట వీధి బడి, తరవాత ఉర్దూ చదువూ, ఆ తరవాత జిల్లా పరిషత్ స్కూలు తెలుగు నించి పట్నం వలస వచ్చాక కాన్వెంటు ఖైదులో బందీ అయిన లేత గుండె కోత. వొక రకంగా అది ఆత్మ కథే. గొప్ప ఆవేశంతో రాశాను కాని, ఎక్కడికి ఎవరికి పంపించాలో తెలీక ఇద్దరు స్నేహితులు కూర్చున్నపుడు, ఆ కథ ఆవేశంగా చదివేయడం మరచిపోలేని తొలి కథా పఠన జ్ఞాపకం. అట్లా పైకి చదవడం అంటే భలే ఇష్టంగా వుండేది. నా రచన అనే కాదు, ఏదైనా సరే! ఆ రచనల్లో పాత్రల్లా మాట్లాడడం నేర్చుకోవాలని ఈ “మూగ మొద్దు” తాపత్రయం. అమెరికా వచ్చిన కొత్తలో అమెరికన్ ఇంగ్లీషు అర్థం కాక, మాడిసన్ లో బాత్ రూమ్ తలుపులు వేసుకొని, గట్టిగా ఇంగ్లీషు మాట్లాడే వాణ్ని. అది భాషని మచ్చిక చేసుకోడానికి నా అమాయకమైన అభ్యాసం!
ఆ బడి రోజులలో వొకరిద్దరే నా తొలి చదువరులు. వాళ్ళు చెప్పింది వేదం. వాళ్ళ మాటలే సాహిత్య విమర్శ కూడా! ఆ ఇద్దరు స్నేహితులూ ఆ తరవాత రెండు కాపీ నోట్ బుక్కులు తీసుకొచ్చి, ఆ పేజీలన్నీ నలుపు చేయమని అడగడంతో రచయితగా నా పబ్లిక్ ఇమేజి కాస్త పెరిగింది. “ఒక్క తురక మాట లేకుండా శుభ్రమైన తెలుగురా నీది!” అని అందులో వొకరి ప్రశంస, మంచి ఉద్దేశంతోనే! అది అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు కాని, స్నేహితుల మీది ఇష్టం వల్ల కథారచన దినచర్యగా మారిపోయింది. కదిల్తే కథ, మెదిల్తే కథ. ఎడాపెడా రాయడం అంటారు కచ్చితంగా అట్లాగే రాశేశాను కాని అచ్చు అనే ధ్యాస లేదు చాలా కాలం దాకా-
ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయో తెలీదు. కాని, కథ బాగా రాయాలి అన్న తపనలో బాగా చదవడం మొదలెట్టాను. ఖమ్మం లైబ్రరీలో దొరికిన ప్రతి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ కథల పుస్తకం ఆవురావురని చదివేశాను. నా వొంటరితనం వల్ల ఆ దశలో భాషలు బాగా నేర్చుకున్నాను. ఆ వేడిలో చదివిన కథకులు- గురజాడ నించి అర్నాద్ దాకా, మేరీ లాంబ్ షేక్స్పియర్ కథనాల నుంచి సోమర్సెట్ మాం దాకా- హిందీ అనువాదంలో మంటో దొరికాడు. ఉర్దూలో ఇస్మత్ చుగ్తాయి. ఆ శైలిని అనుకరిస్తూ కొన్ని కథలు రాశాను. అవీ ఇప్పుడు దొరకడం లేదు. దొరికించుకోవాలన్న ఆసక్తీ లేదు.
అయినా, కథాయాత్ర ఆగలేదు. చదువుతూనే, రాస్తూనే వున్నా. పత్రికలకు పంపించవచ్చు అనే ఆలోచన జూనియర్ ఇంటర్ తరవాత ఎండాకాలం సెలవుల్లో పుట్టింది. అదీ మిత్రుల వొత్తిడి వల్లనే. నా కథ ఆంధ్రజ్యోతి వీక్లీలో మాత్రమే రావాలని వాళ్ళ మొండిపట్టు.
సాయంత్రాలు ఖమ్మం వీధుల్లో గాలికి తిరిగే వేళల్లో — అప్పటికి రంగా అనే వొక మొల్తాళ్ళు అమ్మే పిల్లాడితో నాకు కొద్దిపాటి దోస్తీ కుదిరింది. రోజూ సాయంత్రం వాడూ, వాడి కుటుంబం వుండే చెట్టు కింద కూర్చొని, వాడితో కబుర్లు చెప్పేవాణ్ని. గోలీలు, బిళ్ళంగోడు ఆడేవాణ్ని. వాడు నాకంటే అయిదారేళ్ళు చిన్న కాని, ఇద్దరి మధ్యా ఆ తేడా రాలేదు. వాడితో ఆడీ, మాట్లాడీ వచ్చాక రాత్రి కూర్చొని, వాడి మాటలు వున్నవి వున్నట్టు నోట్స్ లో రాసుకునే వాణ్ణి. కనీసం ఆరునెలలపాటు ఇది కొనసాగింది. వొకసారి వాడు వున్నట్టుండి మాయమయ్యాడు. వాడి కుటుంబం మాత్రం చెట్టు కిందనే వుంది. వాళ్ళ అమ్మని అడిగితే “అంతే వాడు, వాడే వస్తాడులే మళ్ళా!” అంది అలవాటైన వ్యవహారమే అన్నట్టు.
నేను రోజూ చెట్టు దాకా వెళ్ళడం, వాణ్ని వెతుక్కోవడం, వాడి గురించి అడగడం…వొక నెల తరవాత ఆ చెట్టు కింద నించి వాళ్ళూ మాయమయ్యారు. రంగా కనిపించడం లేదన్న వెలితిలో వున్న నేను ఇక వాళ్ళు కూడా కనిపించకపోయేసరికి దిగులు పడడం మొదలెట్టాను. వొక ప్రశ్న నన్ను వేధించింది: “ఇప్పుడు రంగా చెట్టు దగ్గిరకి వచ్చి, అమ్మానాన్నని వెతుక్కుంటే…” వాడి మనఃస్థితి నాకు తెలుసు. నోట మాట రానివాడు. లోకం పెద్దగా తెలియని వాడు. ఆ వొంటరితనాన్ని ఎట్లా ఎదుర్కొంటాడు? అన్న ఆలోచన చాలా రోజులు అశాంతికి గురిచేసింది. అందులోంచి పుట్టిన కథ “అడివి.”
ఆ కథ రాసింది 1980, కాని నా నిత్య సంశయ పీడిత మనసు వల్ల, ఎక్కడికీ పంపించక, చివరికి పారుపల్లి శ్రీధర్ అనే మిత్రుడి బలవంతం మీద ఆంధ్రజ్యోతి కి పంపించాను. అతనే పంపించాడని కూడా నాకు గుర్తు, అదీ దీపావళి కథల పోటీకి! కాళీపట్నం, మధురాంతకం రాజారామ్, పెద్దిభొట్ల, స్మైల్ న్యాయనిర్ణేతలు. పోటీలో ఆ కథకి బహుమతి వచ్చినప్పుడు అది నిజంగానే మా విద్యార్థి లోకంలో talk of the town! అప్పుడు ఖమ్మం చిన్న పట్నమే. కాని, విద్యార్థులు చాలా active గా వుండే వాళ్ళు. ప్రతి విద్యార్ధి చిన్న విజయమూ వొక ఆశ్చర్యంలా విశేష వార్తలా వ్యాపించేది.
“అడివి” కథ తరవాత ఇంకా కొన్ని కథలు వరసగా రాశాను. కాని, వాటిలో కొన్ని నాకు దొరకడం లేదు. దొరికిన కొన్ని ఈ సంపుటికి ఎంపిక చేయలేదు. ఇంకా కొన్ని కథలు నా కంప్యూటరులో బందీ అయి వున్నాయి. వాటికి ఇప్పట్లో విముక్తి లేదు. కాబట్టి, ఇప్పుడు ఈ సంపుటి కేవలం ఎంపిక చేసిన కొన్ని కథలు మాత్రమే!
2
కథ అంటే కొత్త వూహలూ ఆసక్తీ పెరిగిన 1990ల నుంచి ఇప్పటిదాకా కథా సాహిత్యంలోనూ, నాలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు కొన్ని అయినా మీకు ఈ కథల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా, సమస్యని గురించి ఆలోచించే విషయంలో మార్పు వచ్చింది. పల్లె నుంచి వచ్చి, ఎక్కువ కాలం పట్టణాల్లోనే బతికినా, పల్లె నా పునాదిలో బలంగా నిలిచిపోయింది. ఆ పల్లె ఇప్పటికీ నా కథల్లో ప్రధానమైన కేంద్రమే! ఉద్యోగాల వల్ల మూడు పెద్ద పట్టణాలూ, వొక మహానగరమూ, అమెరికా నా జీవితంలో తప్పనిసరి ఘట్టాలయ్యాయి. వాటి ప్రభావం నా మీద లోతైనదే. వూరు మారినప్పుడల్లా కథ మారుతూనే వుంది, జీవితంలానే-
1992 బాబ్రీ మసీదు విధ్వంసం నాలో కొత్త ప్రశ్నలకు జన్మభూమి.
అప్పుడు బెజవాడలో ఎంతో ప్రశాంతమైన వొక వీధిలో వుండే వాళ్ళం. ఆ వీధికి వొక చివర మసీదు, ఇంకో చివర వెంకటేశ్వర స్వామి గుడీ వుండేవి. హిందూ ముస్లిం ఇళ్ళు తేడా లేకుండా కలిసే వుండేవి. బాబ్రీ మసీదు కూల్చిన వార్త వినగానే మా వాడలోని మసీదు ఎదురుగా కొంత మంది ముస్లిం కుర్రాళ్ళు చాలా కోపావేశాలతో గుమికూడి, ఉర్దూ తెలుగు భాషల్లో బిగ్గరగా కేకలు వేయడం మొదలెట్టారు. ఉర్దూ పబ్లిక్ స్పేస్ లో అంత గట్టిగా వినిపించడం అదే మొదలు నాకు. పైగా, ఆ వీధిలో అట్లాంటి మతపరమైన ఆగ్రహం మాకందరికీ పూర్తిగా కొత్త. మసీదు దగ్గిర ఆ నిరసన ప్రదర్శన కొద్దిసేపే జరిగింది కాని, రెండు మతాల మధ్యా వొక ఇబ్బందికరమైన స్థితి చాలా కాలం కొనసాగుతూ వచ్చింది. “హిందూ” “ముస్లిం” అనే గీత చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. అది నా మనసులో కూడా అట్లా ముద్రపడిపోయింది.
అక్కడి ఆవేశాలు తగ్గే సూచన కనిపించలేదు గాని, నా మటుకు నేను కొంత లోపలికి తొంగిచూసుకుంటూ ఆలోచనల్లో పడుతూ వచ్చాను. “ముస్లిం” అనే ముద్ర అంత స్పష్టంగా అంతకుముందు అనుభవించలేదు నిజానికి- కనీసం అది బలమైన వర్గీకరణ అనే భావన కూడా లేదు. కాని, కారంచేడు వల్ల నిర్దిష్ట రాజకీయ వాస్తవికతా, దళిత అస్తిత్వం వైపు మొగ్గాను. “ఊరవతలి దుఃఖం” “యానాం వేమన ఏమనె” కవితలకూ, ఈ సంపుటిలోని “ధేడి” (2002) అనే కథకీ చుట్టరికం తప్పకుండా వుంది. దళిత కవిత్వ సంపుటాలు వేస్తున్నప్పుడు మిత్రులు లక్ష్మి నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ “ఇక నువ్వు వేరే పుస్తకం వేసే సీన్ లేదు. నీ మొత్తం కవిత్వం అంతా మా సంకలనంలో ఎక్కేసింది” అనడం బాగా గుర్తు. అస్తిత్వ వేదన నుంచి అస్తిత్వ వాదం దాకా అట్లా సాగింది నడక చాలా సహజంగానే!
1992 డిసెంబర్ ఆరు అనేది లేకపోతే నా ఆలోచనల లోకం ఎట్లా వుండేదా అని ఇప్పటికీ చాలా సార్లు అనుకుంటూ వుంటాను. అంతకుముందు పిల్లల ఆటల్లో, పెద్దల మాటల్లో “తురక” అనే ఐడెంటిటీని గుర్తు చేసే చర్యలు లేవని కాదు. తప్పకుండా వున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు నేను స్కూల్లో వున్నప్పుడు నా తెలుగులో తురక మాటల వేట సరదాగానే సాగుతూ వుండేది తప్ప దాని వెనక మత ద్వేషమేమీ లేదు. నా మీద వ్యక్తిగత ద్వేషం అసలే లేదు. రాజమండ్రిలో నేను మొట్టమొదటి సారి సాహిత్య ప్రసంగం చేసిన తరవాత వొక పండితుడు నిర్మొహమాటంగానే “అబ్బ, తురకం అనేది పడకుండా స్వచ్చంగా, చక్కగా మాట్లాడారండీ తెలుగు!” అన్నారు. ఆ మాటలో కూడా ఈ రెండు రకాల ద్వేషాలూ నాకు వినిపించలేదు, కాని లోపల ఎక్కడో కాస్త కలుక్కుమంది, చివరికి “తురకం” అనే మాట పడ్డాను కదా అని!
1992 తరవాత మాత్రమే మత ద్వేషానికి బీజాలు ఎట్లా, ఎందుకు పడ్డాయి అన్న కొత్త ప్రశ్న పుట్టింది. ఆ ప్రశ్న ఇప్పటికీ వేధిస్తూనే వుంది. మరీ మొదట్లో అయితే మనసు చాలా కలత పడేది. దాన్ని కథగా చెప్పాలన్న ఆలోచన అక్షరమవడానికి చాలా సమయం పట్టింది. కనీసం పదేళ్ళు పట్టింది. మొదట ఆ కొత్త పరిస్థితిని జీర్ణం చేసుకోడానికే ఎక్కువ సమయం పట్టింది. 2002లో అది “గోరీమా” అనే కథగా రూపు దిద్దుకుంది.
వామపక్ష వుద్యమాలూ, తెలంగాణా పోరాట నేపథ్యం నుంచి వచ్చిన మా కుటుంబంలో మతం ఎప్పుడూ margins లో మాత్రమే వుండింది. రోజువారీ నమాజ్ లూ, ఖురాన్ చదవాలనే పట్టింపూ, రంజాన్ కి స్నేహితుల సందడి వున్నప్పటికీ ఇస్లాం మా అనుదిన జీవితంలో కేవలం శకలం మాత్రమే. ఆ మాటకొస్తే, నాన్నగారితో నేను ఎక్కువగా తెలుగులోనే మాట్లాడే వాణ్ణి. కొంత మంది ముస్లిం చుట్టాలు “తెలంగీ పత్తా “ అని నవ్వేవాళ్ళు కూడా.
మా కుటుంబంతో పాటు నేనూ వామపక్ష విద్యార్ధి రాజకీయాల్లో చురుగ్గా వుండడం వల్ల ఇస్లాం పట్ల balanced perspective మొదటి నించీ వుంది. బాబ్రీ మసీదు వివాదం తరవాత మాత్రం ఇస్లాం, ముస్లిం అస్తిత్వాలు ఇంట్లో కూడా చర్చగా మారిపోయాయి. ఇక బయటి పరిస్థితి చెప్పక్కర్లేదు. కొంతమంది ముస్లిం మిత్రులు “మీరు మనవాళ్ళు మాత్రమే వుండే ఖిల్లలోపలికి వచ్చేయండి భాయి సాబ్!” అని నేరుగా ఖిల్లాలోపల ఇళ్ళు కూడా చూసిపెట్టడం మొదలెట్టారు.
అట్లాంటి కొన్ని క్షణాలని అయినా డాక్యుమెంట్ చేయాలని 1992 నుంచీ కొంత అప్రయత్నంగా, ఇంకొంత ప్రయత్నంగా కొనసాగుతూ వచ్చింది. కవిత్వంలో ఈ వేదన చాలా స్పష్టంగానే వ్యక్తమవుతూ వచ్చింది. నా కవిత్వంలోని తీవ్రతా, గాఢతా, వైవిధ్యం నచ్చే చాలా మంది మిత్రులు ఈ మార్పుని మొదట్లో పెద్దగా ఇష్టపడలేదు. “అది నీ స్వరం కాదు!” అని బాహాటంగానే చెప్పేవాళ్ళు. కాని, నన్ను నిలదీస్తున్న వొక ప్రశ్ననీ, అనుభవాన్నీ కాదని నిరాకరించడం ఎట్లానో నాకు అర్థం కాలేదు. నాకు కలిగిన భావాలకు ముసుగు వేయకుండా సహజంగా చెప్తూ వచ్చాను.
3
2000 సంవత్సరం తరవాత ముస్లిం రాజకీయాల గురించి ఎక్కువగా ఆలోచనలు మళ్లడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ కాలంలో ఉద్యోగరీత్యా నేను రాయలసీమలో వుండడం వల్ల అక్కడి ముస్లిం జీవన సంస్కృతిని దగ్గిరగా గమనిస్తూ అనేక కొత్త విషయాలు అనుభవంలోకి వచ్చాయి. రాజకీయ వ్యవస్థలో పెద్ద భాగస్వామ్యం లేకపోయినా, అక్కడి సాంస్కృతిక జీవనంలో ముస్లింలు కలగలిసిపోయిన అనుభవం వొక ఆదర్శ నమూనాగా కనిపించింది. ఆ ఆసక్తి వల్లనే గూడు అనే చిన్న గ్రామంలో పీర్ల పండగ చుట్టూ ఏర్పడిన సంస్కృతిని ఉదాహరణగా తీసుకొని పరిశోధనాత్మక రచనలు చేశాను. ఆ కృషి అంతా The Festival of Pirs: Popular Islam and Shared Devotion in South India అనే పుస్తకం Oxford University Press ద్వారా 2013లో ప్రచురణ అవడమే కాకుండా అమెరికా, యూరప్ లలోని వివిధ యూనివర్సిటీల తరగతి గదుల్లోనూ, అంతర్జాతీయ వేదికల మీదా విశేష చర్చకి దారి తీసింది. చిన్న వూరి నించి వచ్చిన ఈ పల్లెటూరి మొద్దు ప్రపంచం నాలుగు దిక్కులా చుట్టి వచ్చాడంటే అది కేవలం ఆ గూగూడు అనే చిన్న వూరు నాలో కదిలించిన ప్రకంపనల వల్లనే!
కేవలం పరిశోధకుడిగా కాకుండా, కథారచయితగా కూడా అది నా జీవితంలో మేలుమలుపు.
ఆ పరిశోధనలో భాగంగా దక్షిణ భారత దేశంలో కనీసం మూడు వందల సూఫీ కేంద్రాలలో తిరిగాను. కొన్ని చోట్లకి మైళ్ళ దూరం కాలినడకన వెళ్లాను. ఆ భ్రమణం వల్ల అసలు కథ అనేది మామూలు జనంలో ఎక్కడ పుట్టి, ఎలా పెరుగుతుందన్న లోచూపు పెరిగిందనే చెప్పాలి. అయితే, దాని విస్తృతీ, లోతూ ఇంకా నాలో పూర్తిగా ఇంకలేదని కూడా చెప్పుకోవాలి. సూఫీయిజంని వొక మతవిశ్వాసంగానో, ఆధ్యాత్మిక మార్మిక విధానంగానో కాకుండా భారతీయ సామాజికతలో మొదటి నుంచీ ఇప్పటిదాకా వొక సామాన్యుడి దృష్టి నించి ఎట్లా చూడాలన్న ఆలోచన పెరిగింది. ఆ సూఫీ వెలుగు అంతా “ధేడీ” (2002) కథనుంచి నెమ్మదిగా ప్రసరించడం మొదలైంది. ముస్లింలూ దళితుల మధ్య సూఫీలు తెచ్చిన సఖ్యత ఎంత అవసరమో అర్థమైంది.
2002 అల్లర్లలో దక్కనీ సూఫీ కవి వలీ సమాధిని మతోన్మాదులు ధ్వంసం చేయడం మత రాజకీయ వ్యవస్థ విసిరిన సవాల్ లాగా అనిపించింది. దానికి ప్రతిస్పందనే అప్పటి నించీ కొనసాగుతూ వస్తున్న నా సాహిత్య కృషి, పరిశోధనా మార్గం! కవిత్వంలో సున్నితంగా కనిపించే ఈ కొత్త ధోరణే కథలోకి వచ్చేసరికి జీవితంలోని సమకాలీనతని చుట్టుకొని వాస్తవ దృశ్యంగా వ్యక్తమవుతుంది. “చమ్కీ పూల గుర్రం” (2015) కథ దీనికి ఉదాహరణ.
4
కథకుడిగా నా ప్రయాణం అతినెమ్మది. 1980 మొదటి కథ అనుకుంటే ఇవాళ్టి దాకా రాసినవి పాతిక కథలు కూడా వుండవు. వీటిల్లో కొన్ని ముఖ్యంగా తొలి రోజుల్లో రాసిన రాజకీయ వ్యంగ్య కథలు – అవి వాటి కాల స్పర్శని కోల్పోయాయి. ఇప్పటికీ స్నేహితులు వాటిని తలచుకొని, “ఆ వ్యంగ్య హాస్య ధోరణి అట్లా కొనసాగి వుంటే అదొక ప్రత్యేకమైన దారి”గా వుండేదని అంటూ వుంటారు. అట్లాగని, కాలాతీతమైన వూహలూ సాహిత్యం వుంటాయని నేను ఎప్పుడూ అనుకోలేదు, అనుకోను. కాని, తన కాలాన్ని గురించి చెప్తూనే, ప్రతి రచనా కొంత అతీతమైన రేఖ మీద ప్రయాణిస్తుందని ఎంతో కొంత నమ్ముతాను. అట్లాగే, కథని కథగా మలిచే సాధనాలు తప్పకుండా వుంటాయని కూడా అనుకుంటాను. ఈ విషయంలో చదువరిగా మనం చదివే కథా సాహిత్యానికీ, జీవితాన్ని పరిశీలించే వ్యక్తిత్వానికీ, కథగా వాటిని మలిచే రచయితకీ మధ్య బంధం అపూర్వమైందని భావిస్తాను.
ఈ కథలు చదువుతున్నప్పుడు ఎట్లాంటి చారిత్రక, రాజకీయ, వ్యక్తిగత సందర్భాల నుంచి ఈ రచయిత వస్తున్నాడో చదువరిగా మీకు తెలిసిపోతూనే వుంటుంది. అయితే, ప్రతి సందర్భంలోనూ నాలోని వ్యక్తి తనదైన స్వేఛ్చా భావనతో గొంతు విప్పడం కూడా మీకు వినిపిస్తూనే వుండాలి.
ఎవరీ వ్యక్తి? అతను కోరుకుంటున్న స్వేచ్ఛ ఏమిటీ అన్న ప్రశ్న తలెత్తడమూ సహజం.
5
స్వేచ్ఛ అనే ఈ భావనకీ మా కుటుంబ చరిత్రలో కొంత పునాది వుంది. అమ్మా నాన్నా ఇద్దరి కుటుంబాలూ తెలంగాణా పోరాట సమయంలో సర్వస్వం ధారపోసిన వాళ్ళే. కమ్యూనిస్టు పార్టీ తిరిగిన ప్రతి మలుపూ మా కుటుంబ చరిత్రలో కలగలిసిపోయి కనిపిస్తుంది. అమ్మ వైపు వాళ్ళు పూర్తిగా రాజకీయ పక్షమైతే, నాన్న గారు సాంస్కృతిక రంగం వైపు అంటే ప్రజానాట్య మండలిలో, అభ్యుదయ రచయితల ఉద్యమంలో కూడా క్రియాశీలి. మా అమ్మమ్మా, అమ్మ నుంచి విన్న మేరకు పార్టీ గెలవడం ఖాయం అనుకున్న 1952 ఎన్నికల సమయంలో విపరీతమైన మానసిక సంక్షోభం కూడా వాళ్ళు అనుభవించారు. ఇతర పార్టీ సాంస్కృతిక ప్రతినిధులతో పాటు నాన్న గారు కూడా కొంత కాలం సినిమా రంగానికి వెళ్లివచ్చారు. నాన్నగారు ఎప్పుడూ అనేవారు: “ఎంత నిబద్ధత వున్నా, వ్యక్తిగత స్వేచ్చనీ, నోరు విప్పి మాట్లాడే హక్కునీ ఎక్కడా ఎట్లాంటి స్థితిలోనూ తాకట్టు పెట్టకూడదు” అని! ఆ కట్టుబాటే ఆయన ఎంతో చదువుకున్నా ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే పరిమితమయ్యేలా చేసింది. రాజకీయ రంగంలో వచ్చిన అవకాశాల్ని కూడా ఆయన నిస్సంకోచంగా తిరస్కరించేలా చేసింది.
మా కుటుంబంలోని ఈ రాజకీయ కోణం నుంచే స్వేచ్చకి నిర్వచనం. అట్లాగే, ప్రతి వ్యక్తిగతమూ రాజకీయమే అనే అస్తిత్వ చైతన్యం వైపు నేను మళ్ళడానికీ అదే కారణం. ఈ కథల్లో వినిపించే ముస్లిం స్వరంలో కూడా అదే వినిపిస్తుంది. ఆ కోణం నుంచి చూసినప్పుడు “గోరీమా” ఈ సంపుటికి తొలి కథ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. నిజానికి ఈ సంపుటికి ఆ శీర్షికే పెట్టాలని మొదట అనుకున్నాను. కాని, తరవాత అర్బన్ నక్సల్ అనే పదం మన రోజువారీ నిఘంటువులోకి ఎక్కిన తరవాత నా ఆలోచనల్లో వచ్చిన మార్పు వల్ల “సాహిల్ వస్తాడు” అనే శీర్షిక ఆ మార్పుకి సంకేతం అనుకున్నాను. అయితే, ఇందులో ప్రతి కథలోనూ ఆ నిరసన స్వరం వినిపిస్తూనే వుంటుంది. జీవితం పట్లా, మనుషుల పట్లా ప్రేమా, సహానుభూతితో నిండిన లేత గొంతుకలోని ఆర్తిని పట్టుకునే తపన బతికి వున్నంతకాలం మన అస్తిత్వానికి ప్రమాదం లేదన్న భరోసా నాది.
ఆ భరోసా ప్రమాదంలో పడ్డప్పుడల్లా నేనొక కథనయ్యాను. అట్లాంటి అనేక క్షణాల కలయిక ఈ సంపుటి.
ఫిలడెల్ఫియా, డిసెంబర్ ఇరవై ఏడు, రెండువేల పద్దెనిమిది
*
అఫ్సర్ పుట్టిన అదే ఖమ్మం జిల్లాలోని ఓ పల్లె లో పిన పాక బళ్ళో దావూద్ అలీ గారు మా హిందీ సారు ఓ రోజు పాఠం మొదలు పెట్టేందుకు పుస్తకాలు తియ్యమని చెప్పి ఇంతలో ఏదో గుర్తుకొచ్చి ” ఒరోయ్… మీకు నా కవిత్వం వినిపిస్తా ” అని “ఇంతకి మీకు కవిత్వం అంటే తెలుసారా” అని మా పిచ్చి మొహాల వైపు చూసి bell bottom పాంట్ లోంచి ఓ తెల్ల కాగితం మడత ని అపురూపంగా విప్పి ” వినండిరా” ఆంటో చదవడం మొదలెట్టారు..
విన్నట్టు నటించడం తప్ప కవిత్వం అంటే ఇదే కామోసు…. అబ్బ.. ఒక హిందీ సారు తెలుగులో భలే రాశారు అనుకున్నాం….అది ఎనిమిదో తరగతి గదిలో.. తెలుగు చదవడం కూడా అంతంతమాత్రంగానే వచ్చిన మాకు అదో గొప్ప..
సారు చాలా గొప్పగా కన బడ్డారు మాకప్పుడు..
ఆ కవిత పేరు…” కలలో కౌముది తో…”
బహుశా ఇది 1974 అయ్యుండాలి…
ఆ తరవాత ఖమ్మం కాలేజీ చదువులు..సిద్ధారెడ్డి కాలేజీ కుర్రాడు ఎవరో కవిత్వం రాస్తాడట… అంత వరకే..
ఆతర్వాత త్రిపురనేని శ్రీనివాస్ అనే ఆయన తరచుగా పుస్తక సమీక్షలు చేస్తూ కవిత్వం అంటే ఏమిటో చెప్పడంతో కొద్దిగా అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతి లో మొదటి పేజీలో కవిత్వం కోసం చదవడం అలవాటైంది..abortion state ment , పూలకుర్రాడు లాంటి తేలిక పాటి కవిత్వాలు కొద్దిగా అర్ధం అయ్యేవి..రవూఫ్ ,శిఖామణి , రజని,నిర్మల హైమావతి, శిలాలోలిత , మహజబెన్… పర్వాలేదు..
అజంతా, స్మైల్,ఇస్మాయిల్ లాంటి వాళ్ళు అల్లరి పెట్టే వారు..ఇంక ‘మో’… అస్సలు అర్ధం కాలా..
ఇలియట్ waste land ని వేస్ట్ అని వొదిలేసి వేరే question ని బట్టీ పట్టి ఎలానో బతుకు జీవుడా అంటూ పాసై పోయిన రోజులు..ఇప్పటికీ మో అర్ధం కాని స్ధాయి లో ఉన్న కవిత్వ పరిచయం నాది.
కానీ ఎప్పుడో ఒకసారి చాలాకాలం కిందట అనుకుంటా….ఏదో పుస్తకానికి రాసిన ముందు మాట చదువుతున్నప్పుడు గవర్నమెంట్ తుమ్మముల్లు లా …గుచ్చుకుంది ఒక వాక్యం..
అది గుచ్చుకొని చాలా యేండ్లు అయ్యింది.. సరిగ్గా గుర్తులేదు కానీ ఏదో కాగితం లో పొట్లం చుట్టి.. నట్టు
గుచ్చుకున్న ముల్లు తాలూకూ తీపిదనం బాగా గుర్తుండి పోయింది..
కళ్ళు ఆసక్తి గా కిందికెళితే అక్కడ అఫ్సర్ చేవ్రాలు..
అఫ్సర్ ని అభిమానించడం అక్కడే మొదలు…అయినా ఎప్పుడూ అఫ్సర్ ని చదివింది లేదు..
కాగా అఫ్సర్ అంటే ఖమ్మం..ఖమ్మం అంటే అఫ్సర్..అనిమాత్రం తెలుసు.. అంత వరకే..
ఇటీవల…సారంగ లో ఆ గది తాలూకూ జ్ఞ్యాపకం ఓసారి ఏ ఖిల్లా బజారులో నో ఉన్న ఆ ఆనవాళ్లు ఒకసారి చూసి రావాలన్న భావన కలిగించింది…
అలా చూస్తున్నప్పుడు అయిల నీలం మాయ ని ఎలా అర్థం చేసుకోవాలో అని గింజు కుంటున్నప్పుడు శివజ్యోతి గారు ఒకసారి దెంచనాల రాసిన వ్యాసం చదవండి అన్నారు. అఫ్సర్ రాశాడు వీలుంటే పంపుతా అన్నారు. అనుకోకుండా ఆ తీగ సారంగ లో కాలికి చుట్టు కొని ఇంక వెతుక్కునే అవకాశం లేకుండా చేసింది. శివజ్యోతి గారు పంపక మునుపే
సైదాచారి అర్ధం అయ్యే మార్గం సుగమం అయ్యిది.
ఇంక ఈ కథల వెనుక కథల్ని వివేచిస్తూ సారంగ లో వచ్చిన ఈ వ్యాసం చదివాక ఉండ బట్టలేక ఈ నాలుగు వాక్యాలు రాయాలనిపించింది.
ఖిల్లా గల్లీల వెంట గోళీల్ని గూటి బిళ్ళల్ని ఆడుకుంటూ జంజం అడ్డంగా వేసుకు తిరిగిన ఎందరు పిల్లలనో అవలీలగా దాటేసుకు వెళ్లి ఏకంగా ఖురాన్ లో ని ప్రతి పదాన్ని జల్లెడ పట్టి అనుమాన దృక్కులతో చూసే ఆ అమెరికా మహానగరం లో అఫ్సర్ అనే తెలుగు తనం ఒక miracle..
అఫ్సర్ తెలుగుని జయించాడు..ఇంక అది కవితైనా కథనమైనా..అది అమెరికా నేల ఆయినా ……అన్నీ అలవోకగా అమరి పోతాయ్ ఒద్దికగా…
V VIJAYAKUMAR.
Sir సావిత్రి గారు ‘బందిపోటు’ అనే పుస్తకం రచించారు కదా దాని గురుంచి మీ అభిప్రాయం ఏమిటి