ఈనడానికి ఆవు పడుతున్న బాధంతా అమ్మ ముఖంలో కనిపించేది. ఉడుకుడుకు నీళ్లు కాసి దాని వీపు మీద పోస్తూ సముదాయించేది. ఓర్చుకోమని బుజ్జగించేది. పండంటి బిడ్డ పుడుతుందని ఆశ పెట్టేది. ధైర్యం చెప్పేది. నమ్మకమిచ్చేది. కడుపులోని బిడ్డని బయటేయలేక ఆపసోపాలు పడుతున్న ఆవుకన్నా ఎక్కువ ఆందోళన అమ్మ గొంతులో వినిపించేది. అది బయటకు కనిపించకుండా హడావుడి చేసేది. దూడ నేలమీదపడగానే ఎండు గడ్డితో అమ్మ దాని ఒళ్లంతా తుడిచేది. తడి నాలికతో నాకుతూ ఆవు, బిడ్డకి స్నానం చేయించేది. ఆరుతున్న ఒళ్లు జలదరిస్తుండగా దూడ చెవులు అటూఇటూ కదిపి, తోక పైకెత్తి లేవడానికి అవస్థ పడుతూవుంటే, అమ్మ ఆసరా ఇచ్చి పొదుగు దగ్గరకు చేర్చేది. ఆబగా పాలు కుడిచి, నిలబడి తడబడి, చెంగున ఎగిరి దూకి పరుగులు తీసే లేగబిడ్డను అమ్మా, ఆవూ మురెపెంగా చూసుకునే ఈ దృశ్యం నా చిన్ననాటిది, కథాసమయంలో పరిచయం చేయడానికి ఈ కథను మళ్లీ చదువుతుండగా ఈ చిన్ననాటి దృశ్యం పదేపదే గుర్తుకువస్తోంది. ఆవూ, అమ్మా, కథను కనే రచయితా.. అంతా ఒక్కటే కదా అనిపిస్తోంది. పురిటి నొప్పులు పడకుండా ఏ కథా పుట్టదు. పుట్టిన కథను మురిపెంగా చూసుకునే అమ్మ స్థానం నాకు ఈ కథ ఇచ్చింది.
————
పన్నెండేళ్ల కిందట..
శ్రీకాళహస్తి రాజగోపురంమీద పగుళ్లు కనిపిస్తున్నాయని తెలిసి, మైకు పట్టుకుని బయలుదేరాను. ఆ చారిత్రక నిర్మాణం శిథిల స్థితిని ఏబీఎన్ టీవీలో కథనంగా ప్రసారం చేయాలన్నది ఆలోచన. మా కెమెరా మేన్ వీడియో తీస్తున్నారు. నేను గోపురం లోపల నిలబడి దాని చరిత్రనూ, శిల్ప సంపదనూ, విశిష్టతనూ వివరిస్తున్నాను. గోపురం మీద కిచకిచమంటూ దూకే కోతులూ, ఎగిరి వాలే పావురాళ్లూ, నీడకు చేరిన కొందరు బిచ్చగాళ్లూ తప్ప అక్కడ భక్తుల సందడి లేదు. హఠాత్తుగా ఒక పెద్ద రాతి ముక్క పైనుంచి ఊడి సరిగ్గా నా ముందు పడింది. చావుకీ, మరణానికీ నడుమ రెండు క్షణాలు, రెండు అడుగుల దూరం. నివ్వెరపోయి తేరుకున్నాక అర్ధం అయింది. ఒక వార్తగా పరిమితం కాదగినంత చిన్న సంగతి కాదు ఇది అని. గోపురాన్ని ఆనుకుని చుట్టూ ఉన్న ఇళ్లవాళ్లూ, అంగళ్లూ, మనుషులూ, ఆలయ ఆధికార యంత్రాంగం.. ఎవరూ ప్రమాద తీవ్రతను గుర్తించడం లేదు.
అక్కడి సహజ నిర్లక్ష్య గంభీర వాతావరణం నా వెన్నులో వణుకు పుట్టించింది. నా ముందు పడి ముక్కలైన రాతి బెడ్డ – చేసిన హెచ్చరిక శ్రీకాళహస్తి పట్టణం మొత్తానికీ అందాలి. ప్రభుత్వాన్ని తాకాలి. గోపురాన్ని కాపాడుకోలేకపోవచ్చు. దాని చుట్టూవున్న ప్రాణాలనైనా కాపాడుకోవాలి కదా అనిపించింది. స్టుడియోకి సమాచారం ఇచ్చి, ఒప్పించి లైవ్ ప్రసారాలు మొదలు పెట్టాము. కాసేపటికి అన్ని ఛానెళ్లూ అందుకున్నాయి. అతి చేయడం, రచ్చరచ్చ చేయడం కూడా ఒక్కోసారి అవసరమే కావచ్చు. సాయంత్రానికి కదలిక మొదలైంది. గోపురాన్ని ఆనుకుని ఉన్న ఇళ్లవారిని ఖాళీ చేయించారు. దుకాణాలు మూసేయించారు. బారికేడ్లు కట్టి గోపురం దగ్గరకు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు కాపలా కాశారు. బహుశా నన్ను దుమ్మెత్తిపోస్తూనే అందరూ దూరంగా వెళ్లివుంటారు. దిగులు కమ్మిన ఆ చీకటి సాయంత్రం వేళ, భారంగా శ్రీకాళహస్తిని వదిలి బయలుదేరాను. రాత్రి కుటుంబంతో కలిసి తిరుమల కొండమీదకు వెళ్లాను. చల్లని గాలుల ఆ ప్రశాంత వాతావరణంలోనూ తెలియని అశాంతి ఏదో నాలోపల గూడుకట్టుకుని గుబులుగానే ఉండిపోయింది. కాసేపటికే అది బద్దలైంది. 500 ఏళ్ల కిందట శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన మహారాజగోపురం కూలిపోయింది అని ఫోన్ వచ్చింది. తిరుపతిలోనే ఉన్న నా సహోద్యోగి దినేష్‌ను తక్షణం అక్కడికి లైవ్‌వాహనం తీసుకుని వెళ్లిపొమ్మన్నాను. చీకట్లో కనీకనిపించని శిథిలాల ముందు నిలబడి అతను లైవ్‌లు ఇస్తున్నాడు. తెల్లారేప్పటికి నేనూ అక్కడ వాలిపోయాను.
ముందు రోజు ఏ గోపురం లోపల నిలబడి లైవ్ ప్రసారాలు అందించానో, సరిగ్గా అక్కడే, మట్టి దిబ్బ గా మారిన గోపురం మీద నిలబడి ఆ ఉదయం ప్రసారాలను ప్రారంభించాను. శిథిలాలనూ, శిల్పాలు చెక్కిన రాతి స్తంభాలనూ జేసీబీలు ఎత్తి విసిరేస్తున్నాయి. మూగబాధతో వాటిని చూస్తున్న చరిత్ర కారుడు కిరణ్‌క్రాంత్ చౌదరిని పలకరించాను. ఎంతో కాలంగా ఆయన చేస్తున్న హెచ్చరికలన్నీ ఆ మట్టిదిబ్బలో సమాధి అయిపోయి ఉన్నాయి. కూలకముందు గోపురం పట్ల చూపిన నిర్లక్ష్యమే, శిథిలాల తొలగింపులోనూ కొనసాగుతోందని అర్ధమైంది. ప్రాచీనతను సంపదగా కాక, వ్యర్ధాలుగా చూసే ధోరణి మనది.
ఆ రాత్రి నా మిత్రుడు, వైద్యుడు, కథకుడు అయిన మనోహర్ కోటకొండ, మద్రాసు నుంచీ కడపకు వెళ్తూ దారిలో శ్రీకాళహస్తిలో ఆగి, కుప్ప కూలిన గోపురం దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ రాత్రి ఆయన తీసిన ఫోటోలు కొన్ని నాకు పంపారు. అందులో మట్టి దిబ్బలోంచి బయటకు పొడుచుకువచ్చిన చేయి ఫోటో నన్ను బాగా కలవరపెట్టింది. టీదుకాణంలో పనిచేసే వ్యక్తి శవాన్ని తర్వాతి రోజు బయటకు తీశారు. సరిగ్గా కొన్ని గంటలకు ముందు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడంతో పెను ప్రాణ నష్టం అయితే తప్పింది
అప్పటి నుంచీ గోపురం గురించిన సంభాషణ మా ఇద్దరి మధ్య అనేకసార్లు జరిగింది. శ్రీకాళహస్తి గుడి చుట్టూ విస్తరించి విలసిల్లిన కలంకారీ, కొయ్యబొమ్మల కళా విశేషాల గురించి మాట్లాడుకునే క్రమంలో గుడి ముందు గోతాం పట్ట మీద చెక్క దువ్వెనలు చెక్కే సాయిబు గురించి ఒకసారి మనోహర్‌తో చెప్పాను. చెక్కదువ్వెనలను కళాఖండాలుగా మలచిన ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నాడనే మాట ఎందుకో మనోహర్‌లో నాటుకుపోయింది. ఇదంతా జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఒకసారి మనోహర్ నాతో రాజగోపురం సంఘటనను కథగా రాయచ్చు కదా అన్నాడు. ‘రాయచ్చు..’ అని చెప్పాను. ఆయన రాసి పంపాడు. ఆ కథను చదివాక, కూలిన రాజగోపురం నాతోపాటూ మనోహర్ ను ఎంతగా వెంటాడుతూ ఉండిపోయిందో అర్థం అయ్యింది. ఆ కథ పేరు ‘మునిరాజ మహేశ్వరం‘ ఈతకోట సుబ్బారావు సంపాదకత్వంలో నెల్లూరు నుంచి వెలువడే ‘విశాలాక్షి’ మాస పత్రికలో రెండు సంచికల్లో ఈ కథ అచ్చయింది.
మహేశ్వర్ అనే టీవీ రిపోర్టర్‌నూ, బిచ్చగాడైన మునిరాజునీ, దువ్వెన్లు చెక్కే కరీం సాయిబునీ ప్రధాన పాత్రలుగా మలచుకుని మనోహర్ కథను అల్లుకున్నాడు. రాయలకాలం నాటి 136 అడుగుల ఎత్తయిన గోపురం కూలిపోవడానికి ముందు రోజు లైవ్ ప్రసారాలతో మొదలైన కథ, ఏడేళ్ల తర్వాత అదే స్థానంలో అంతే ఎత్తులో తిరిగి నిర్మించిన కొత్త గోపురం ముందు లైవ్ తో ముగుస్తుంది. నిజానికి ఇది గోపురం గురించిన కథ కాదు ఇది. గోపురంతో పెనవేసుకున్న ఇద్దరు హిందూ ముస్లిం మిత్రుల కథ. బాబరీ విధ్వంస విషం మనసులకెక్కని స్నేహితుల కథ. శివతత్వాలు పాడే మునిరాజుతో, దువ్వెన్లు చెక్కుకుంటూ హిందీ సినిమా పాటలు పాడుకునే కరీం సాయిబుని కలిపి పెనవేసి బంధించింది రాజగోపురమే! అలౌకిక బంధం అది. మతం, కులం, సంపాదన అన్నవి దాని ముందు అల్పమైనవి. తాత్విక ధార ఒకటి కథను అల్లుకుంటూ కొనసాగుతుంది.
‘కాలం అంటే ఏమిటి?’ అనే ప్రశ్నతో మొదలైన కథ. దానికి సమాధానంతో ముగుస్తుంది. ‘మానవ జీవితంలో కలిసిపోయి ప్రవహించినపుడే కదా కాలం ఉనికి’ అని కథారంభంలోనే ప్రకటించిన రచయిత, దానిని వివరించడానికి చేసిన విన్యాసమే ‘మునిరాజ మహేశ్వరం’ కథ. రాజగోపురం సంఘటన రేపిన అలజడిని కథగా మలుస్తాను అని మనోహర్ చెప్పినపుడు, ఎలా రాయగలడా అనే సంకోచం నాలో ఉండిపోయింది. అనుభవం తనది కాదు, పాత్రలతో ప్రత్యక్ష పరిచయం లేదు. ప్రదేశంతో అనుబంధం లేదు. అయితే శ్రీకాళహస్తి అనే ఊరు మనోహర్‌ని ఆవహించిందని మాత్రం కథను చదివాక నాకు అర్థం అయ్యింది. పాత్రల్లోకి పరకాయ ప్రవేశం జరిగింది. హిందీ పాటలతో ఉన్న పరిచయం, మమకారం రచయితకు బలాన్నిచ్చాయి. కుండపోత వాన తర్వాత సాగే నదీ ప్రవాహంలా కథ నడిచింది. దృశ్య దృశ్యాలుగా కథను చెప్పిన తీరు హత్తుకుపోతుంది. పొద్దు పడమటి కొండల్లోకి దిగిపోయి, దాంకున్న రాత్రి – రాజగోపురం కింద శివతత్వాలు పాడుతున్న మునిరాజుని భుజాల మీదకు ఎత్తుకుని కరీం సాయిబు శివతాండవం ఆడిన దృశ్యాన్ని కథ గట్టిన తీరు అద్భుతం. ఈ దృశ్యాన్నీ, కథలోని అనేక కవితాత్మక వాక్యాలనీ ఉదహరించాలనే కోరికను, కథ చదివే పాఠకుల అనుభూతికి అడ్డు అవుతుందనే ఉద్దేశ్యంతో ఆపుకుంటున్నా.
గోపురం మీద కనిపిస్తున్న నెర్రెలు చూసి దిగులుపడే మునిరాజు, గోపురం కూలిపోయిన తర్వాత కనిపించలేదు. మరి కరీం సాయిబు ఏమయ్యాడు? గోపురమూ, మునిరాజూ లేని కాలం ఆగిపోయిందా? ఏడేళ్ల తర్వాత మళ్లీ మైకు పట్టుకుని వచ్చిన మహేశ్వర్ ప్రశ్నలకు సమాధానంగా – గుడి ముందు పరచుకున్న గోతాం పట్టమీద కూర్చుని, తల వంచుకుని, చెక్క దువ్వెనలు చెక్కుకుంటూ కనిపించాడు కరీం సాయిబు. ‘ ఏక్ దిన్ బిక్‌జాయేగా మాటీ కా మోల్… జగ్‌మే రహజాయేగా జ్యారే తేరీ బోల్..’ అని పాడుకుంటూ ఉన్నాడతను. కథ పూర్తయ్యేసరికి దీర్ఘ నిట్టూర్పుతో తేలిక పడుతారు పాఠకులు, కళ్లలో ఊరిన తడి శరీరమంతా పాకుతుంది.
తన వృత్తి సంబంధమైన అంశాలతో మానవ సంబంధాల చుట్టూ కథలను అల్లుకుంటూ చెప్పే మనోహర్ కోటకొండ – ఒక చారిత్రక అంశాన్ని కథగా ఎలా చెబుతాడా అనే ఆసక్తి నాలో ఉండింది. తరచూ ఈ సంఘటనపై ఆయనతో నేను పంచుకున్న మాటలను అక్షరాల్లోకి అనువదించి, కథగా మలిచి నా ముందు పెట్టినపుడు, పొత్తిళ్ల బిడ్డను దోసిట్లోకి తీసుకున్న సంబరం కలిగింది నాకు. ఒక పాత్రగా నన్ను నేను కథలో చూసుకోవడం వింత అనుభవం. అందులోనూ రచయితగా చూసే దృష్టి వేరు. పాఠకుడిగా పొందే ఆనందం వేరు. రెండూ సంతోషాన్నే ఇచ్చాయి నాకు.
*
రాజగోపురం కూలిపోవడం విచారకరం. ఆరోజు నేనూ అక్కడే ఉన్నాను, సాయంత్రం చూసిన గోపురం రాత్రికి కూలిపోయింది. వేకువ 5 గంటలకే వెళ్లి శిథిలాలు చూసాను. మనసు కలుక్కుమనింది…
చాలా ఆనందాలు అందించిన కథ..
చరిత్ర నేపథ్యం.
మరోటి.. విశాలాక్షి లో ప్రచురించటం.
ఆ తర్వాత వచ్చిన ఫీడ్బాక్ నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి
ఇక రచయిత డా. మనోహర్ గారికి, ఇప్పుడు చక్కగా పరిచయం చేసిన మీకు ధన్య వాదాలు
Nice narration sir