ప్రాణం పోయేలా ఉంది నీరసంతో.
కళ్ళు తిరుగుతున్నాయి.
పొద్దునెప్పుడో తాగిన కప్పు కాఫీ. కనీసం అదైనా మళ్ళీ ఒక కప్పు తాగుదామంటే వీలు కాదన్నారు. అసలు ఇంటి కోడలు కూడా మడి కట్టుకుని కార్యక్రమంలో సాయం చేయాలి గానీ, కొత్త కదాని వదిలేశామన్నట్టు మాట్లాడారు.
హాండ్ బాగ్ లో చాక్లెట్టో ప్రొటీన్ బారో ఉందేమో అని చూస్తే అదీ ఖాళీగానే ఉంది.
పెళ్లయి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచీ గమనిస్తూనే ఉంది. ఏ చిన్న ఫంక్షనో జరిగినా, “ముందు మగవాళ్ళకు వడ్డిద్దాం భోజనాలు” అనేది మామూలుగా వినపడే సహజమైన డైలాగ్.
పొద్దుటి నుంచీ నానా హైరానా పడి నుడుము విరిగేలా వంటా ఇతర చాకిరీ చేసేది ఇంటి ఆడవాళ్లే అయినా, భోజనాలు మాత్రం “ముందు మగవాళ్ళకి”
“వాళ్ళు తినేస్తే మనం కబుర్లు చెప్పుకుంటూ తినేయొచ్చు”
వాళ్లతో పాటు కూడా కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చుగా.
తనేమో ఒక్కగానొక్క ఆడపిల్ల ఇంటికి.
ఈ సంప్రదాయాలేవీ తెలీకుండా చదువుకుంటూ, హాయిగా గడిపేసింది. అసలు తన ఇంట్లో అలాటి పద్ధతులేవీ ఉన్నట్టు లేదే?
అమ్మ, మేనత్త కూడా తమ ఇళ్లలో ఇలాటి పద్ధతులే పాటించారా? కనీసం కొన్నాళ్లు?
అమ్మ ఇవేవీ పనిగట్టుకుని నేర్పలేదు కూడా. “నీళ్లలో పడేస్తే ఈత అదే వస్తుందిలే, దాన్ని హాయిగా చదువుకోనీ. ఈ జంజాటాలేవీ పెట్టకు, మనం పడ్డాం చాలదూ”అనేది బామ్మ
ఆ జంజాటాలేవో అప్పుడే కాస్త తెలుసుకుని ఏడిస్తే బాగుండేది.
“అదితీ..”పిలుస్తోంది అత్తగారు కృష్ణవేణి.
నీరసంగానే హాల్లోకి నడిచింది.
“ఎక్కడున్నావ్?” ఆశ్చర్యం.
“ఫోనొస్తే మాట్లాడుతున్నానండీ”.
“సరే, ఇదిగో కాస్త గంధం తీసి పెట్టమ్మా, ఈ వెండి గిన్నెలో సగానికి వస్తే చాలు, భోక్తలు సిద్ధంగా ఉన్నారు ”
గంధం తీయడం!! బజార్లో దొరికే పొడి వాడచ్చు కదా! పన్లు ఈజీగా జరిగిపోయే వెసులు బాటు ఉన్నా సరే, కాంప్లికేట్ చేసుకుని ఓపిక అవగొట్టుకోవాలి.
గొప్ప గ్రాటిఫికేషన్ దాంట్లో.అన్నీ పద్ధతి ప్రకారం జరిగాయని ఎవరి భుజాలు వాళ్ళే తట్టుకోవడం.
ఈ ఎనిమిది నెల్ల నుంచీ చూస్తోంది కదా, అత్తగారు ఇంత రెక్కలు విరుచుకుని, అన్నీ పద్ధతి ప్రకారం చేసినా “బాగుంది” అని ఒక్క మాట కూడా మామగారి నోటి నుంచి రాదు.
“ఊ” అంటాడాయన, అది మెచ్చుకోలా,అసంతృప్తా అర్థం కాకుండా.
“మీ మామయ్యకి అన్నీ పద్ధతి ప్రకారం జరగాలి. చాలా పట్టింపు మనిషి” అంటుందావిడ రోజుకు పది సార్లు. ఈ వయసులో కూడా అన్నీ అగ్గగ్గలాడుతూ అమరుస్తుంది.
“నేను లేక పోతే మీ మామయ్య గారికి క్షణం కుదరదు. అన్నిటికీ నేనుండాల్సిందే. ఈయన పద్ధతులు అలాటివి.అంత డిసిప్లిన్” అంటుంది. అన్నీ ఎవరో ఒకరు అమర్చి పెడుతుంటే డిసిప్లిన్ బాగానే నడుస్తుంది.
అలా చెప్పి తనను తాను ఆ ఇంటికి అతి ముఖ్యమైన దాన్నని ఆమె భ్రమ పెట్టుకుంటోందని అదితికి తెలుసు. నిజానికి ఆమె లేక పోయినా ఆయనకు ఏమీ తేడా పడదు. తన పనులు సమయానికి జరిగి పోవాలంతే జరిగితే చాలు.
ఆమె చేస్తోంది కాబట్టి ఆమె కావాలంతే. అతను తన మీద ప్రతి దానికీ ఆధారపడతాడని అత్తగారు అనుకోవడమే గానీ, ఆయన ఆధారపడినట్టు ప్రవర్తించడు, అధికార దర్పంతో చేయించుకుంటాడు.
ఎక్కడికైనా బంధువుల ఇళ్లకు వెళ్ళినా ఆవిడ ఆయన్ని కనిపెట్టుకునే ఉంటుంది.
“ఆయనకు కాఫీలో పంచదార ఎక్కువ పడాలి”.
“ఆయన స్టీలు గ్లాసులో తాగరు”.
“ఆయనకు ఉల్లికారం సరిపడదు” ఇలా ప్రతి చోటా ఆవిడ చెయ్యి ఉండాల్సిందే.
“కృష్ణ పిన్ని, బాబాయిని ఎంత కనిపెట్టుకుని ఉంటుందో”.
ఈ మాట చెవిన పడితే చాలు, అంతటి శ్రమా మర్చిపోతుందావిడ
ఆ మధ్య ఒక రోజు అత్తగారి తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదంటే రెండు రోజులు విజయవాడ వెళ్ళిందామె. ఆ రెండు రోజులూ ఈయన మామూలుగానే ఉన్నాడు. తన పనులేవీ జరగనట్టు ఏమీ లేడు. ఆమె మీద ఎగిరే ఎగురుళ్ళూ అవీ ఏమీ లేవు. పెట్టింది తిని, తన పన్లో తనున్నాడు
ఆ టైం లో అదితికి చాలా టెన్షన్ పట్టుకుంది.
ఆయన కాఫీ తాగి కప్పు టీపాయ్ మీద పెట్టగానే మరుక్షణం అది అదృశ్యమై వంటింటి సింకులో ఉండాలి.
లేదంటే కప్పు తాలూకు చిన్ని మరక టీపాయ్ మీద కనపడితే ఆయనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. పోనీ తను కప్పు సింకులో పడేయొచ్చుగా అని మొదట్లో చాలా సార్లు అనుకుంది.
మొన్నామధ్య అమ్మ దగ్గరికి వెళ్ళినపుడు కంప్లెయింట్ చేసింది.
“ఏంటమ్మా వీళ్ళు, ప్రతి దానికీ పద్ధతులు, పడికట్లూ అని. మనింట్లో ఇవన్నీ లేవు. మనకెక్కడ దొరికారు వీళ్ళు?”
అమ్మ నవ్వింది.
“నా మీద నెడతావేంటే? నువ్వేగా మీ ఆయన్ని ఏరి కోరి వలచావు?”
నిజమే! ప్రహాస్ ని ఇష్టపడి చేసుకోవడం కరెక్టే గానీ, వాళ్ళింట్లో ఇలా ఉంటుందని తనకేం తెల్సు?
అన్నీ సరిగ్గా కుదిరాయని అందరూ ఒప్పుకునే సరికి పెళ్ళి అయ్యే పోయింది.
కానీ ఇక్కడసలు ఊపిరాడదు.కావాలని ఎగిరొచ్చి పంజరంలో ఇరుక్కున్నట్టయింది.
వ్రతాలు పూజలూ ఇవన్నీ అమ్మ చేసేదే గానీ తననెప్పుడూ బలవంత పెట్టలేదు.
ప్రహాస్ తో అంటే, తేలిగ్గా నవ్వేస్తాడు.
“పెద్దవాళ్ళు అలాగే ఉంటారు. వదిలేద్దూ”.
అసలదేం మాటో అర్థం కాదు. పెద్దవాళ్ళు అందరూ అలా ఉండక్కర్లేదని తట్టదా?
“అయిందా గంధం” వచ్చింది ప్రహాస్ పిన్ని అరుణ
“అయ్యో, అదేంటి,అలా తీశావు గంధం?” గంధపు చెక్క లాక్కుంది. జారుగా ఉంది గంధం. ఎంత గట్టిగా అరగదీసినా తనకు చేతకాలేదు
పెద్దగా నవ్వుతూ “ఇలా ఇచ్చెయ్, నేను తీస్తాలే నువ్వెళ్ళు” గిన్నె, సాన చేతిలోకి తీసుకుంది అరుణ.
బతుకు జీవుడా అని గబ గబా బయటికి నడిచింది.
ప్రహాస్ బామ్మ గారు సావిత్రమ్మ బయట వరండాలో పడక్కుర్చీ లో చేరగిల బడి కూచుని కనపడింది
85 ఏళ్ల పండు గువ్వ. పాపం నీరసంగా ఉందేమో.
ఇంటి పురోహితుడు సంవత్సరీకం కార్యక్రమం జరిపించడంలో బిజీ గా మంత్రాలు చదువుతూ తమలపాకుల్లో ఖర్జూర పండ్లూ దక్షిణ డబ్బులూ సర్దుతున్నాడు
“పనసపొట్టు కూరా, నువ్వు పచ్చడీ..”అత్తగారు వంటింట్లో అన్నీ తయారయ్యాయో లేదో సరి చూస్తోంది.
స్పృహ తప్పేలా ఉంది ఆకలితో.
మెట్లెక్కి పైకి వెళ్ళింది. ఆడపడుచూ, ఇతర దగ్గరి బంధువులూ ఎవరిదో పెళ్లి వీడియో చూస్తూ నవ్వుకుంటున్నారు
ప్రహాస్, పైన బాల్కనీ లో మీటింగ్ లో ఉన్నట్టున్నాడు, పిట్టగోడ మీద లాప్టాప్ పెట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకుని నిలబడి ఉన్నాడు. అదితి తలుపు తీసుకుని బయటికి రాగానే “మీటింగ్ లో ఉన్నా” ఫార్మల్ గా నవ్వు మొహం పెట్టి సైగ చేశాడు.
వీకెండ్ కూడా మీటింగులే.
నీరసంగా కిందికి దిగి వస్తూ వంటింట్లోకి తొంగి చూసింది.
అత్తగారు వేడి వేడిగా నేతి గారెలు వండింది, పెద్ద స్టీలు బేసిన్ నిండా పెట్టి ఉన్నాయి.
మరో బేసిన్ లో ఘుమ ఘుమ లాడుతూ పులిహోర. పోయిన తాతగారికి ఇష్టమైన వంటలన్నీ పనస పొట్టు కూరతో సహా అన్నీ విడిగా ఒక టేబుల్ వేసి సర్ది ఉంచింది .పాపం ఎంత చాకిరీ చేస్తుందో.
ఆవిడ ఈ ఇంటి చాకిరీ కోసం, మామగారి అడుగులకు మడుగులొత్తడానికి పడే హడావుడి చూస్తే, పెద్ద బాంక్ లో మానేజర్ గా పని చేస్తోందని, ఎవరూ అనుకోరు.
కళ్ళు తిరుగుతున్నాయి. ఫ్రిజ్ లోంచి చల్లని నీళ్ళు తీసుకుని గొంతులో పోసుకుంది
చల్లగా దిగుతున్నాయి గానీ ఆకలి తీర్చే మార్గం వాటికి తెలీట్లేదు.
పెరట్లోకి వెళ్ళి నిల్చుంది. విశాలమైన పెరట్లో పచ్చటి చెట్లు. ఆ మూలగా గుబురుగా బాదం చెట్లు. పచ్చని ఆకుల మీద ఎండ పడి కాంతి గా మెరుస్తున్నాయి.
చిక్కగా అల్లుకున్న కాకర తీగ, పందిరి కి వేలాడుతున్న పొట్ల కాయలు, మరో పక్క విరగబూసిన పూల తోట
“అమ్మడూ..” వెనక్కి తిరిగింది
అమ్మమ్మ గారు!!
“ఏమైనా కావాలా అమ్మమ్మగారూ” చటుక్కున దగ్గరికొచ్చింది. ఆవిడంటే చాలా ఇష్టం తనకి .
“కళ్ళు తిరుగుతున్నాయే, ఆ మంచం కొంచెం బాదం చెట్టు కింద వేస్తావా?”
ప్రాణం చివుక్కుమంది. హాల్లోకి తొంగి చూసింది. భోక్తలు భోజనాలకు సిద్ధం అవుతున్నారు.
ప్రహాస్ మేనత్త మీనాక్షి చాపలు పరిచి, విస్తళ్ళు వేస్తోంది.
మామగారు నెత్తి మీది అక్షింతలు దులుపుకుంటూ విచిత్రంగా కనపడ్డాడు.
“ఎలా మరి? ఏమీ తినకూడదంటున్నారు గా?”
“ఎవరూ? ఆ బ్రాహ్మడేనా? వాడు ఇంతప్పటి నుంచీ తెల్సు నాకు. పొద్దున్నే కాఫీ టిఫినూ పుచ్చుకోకుండా వచ్చే రకమేనా?”
ఏమనాలో తోచలేదు. “నాకూ చచ్చేంత ఆకలి వేస్తోంది” అందామనుకుంది.
ఈ ఇంట్లో అంతా కొత్తగా ఉంది. ఏ మాటకు ఏం అర్థం వస్తుందో తెలీదు.
అందరికంటే ముందు మొగుడికి హడలు గా ఉంటుంది తనేం అనేస్తుందో అని
“అలా అనేశావేంటి? నాన్నగారేమనుకుంటారు?” అంటాడు.
ప్రతి మాటా “ఈ మాటకి వీళ్ల నాన్నగారు ఏమనుకుంటారో?అత్తగారేం అర్థం తీస్తుందో, వీళ్ల మేనత్తకి కోపం రాదు కదా? వీళ్ళ బామ్మ కి పట్టింపు లేదు కదా?” అని బేరీజు వేసుకుని మాట్లాడాలో ఏవిటో అని, భయం వేసి చాలా విషయాలు చూస్తూ ఊరుకుంటుంది.
తర్వాతెపుడో రాత్రి వేళ టైము దొరికినపుడు తను అనాలనుకున్న మాటో, సందేహమో అతడితో అంటే “ఇంకా నయం, అక్కడ అన్నావు కాదు. నాన్నగారికి పట్టింపు ఎక్కువ” అనేవాడు.
అందుకే ఈ మధ్య అతనితో కూడా అనడం మానేసింది.
పుట్టింట్లో ఇలాటి పద్ధతులు ఎప్పుడూ చూసెరగదు. ప్రతి యేటా బామ్మ చనిపోయిన తేదీ నాడు నాన్న ఒక ఓల్డేజ్ హోమ్ లో గ్రాండ్ గా భోజనాలు ఏర్పాటు చేసేవారు. ఒక్కో సారి ఇంటిల్లిపాదీ వెళ్ళేవారు. కుదరక పోతే అమ్మా నాన్నా, తాతయ్య వెళ్ళేవారు. బామ్మకి ఇష్టమైన వంటలు చేయించాలి అనేది అమ్మ.
నాన్న , తాతయ్య ఒప్పుకునే వారు కాదు.
“మన ప్రేమ కొద్దీ మనం ఇక్కడ ఇవన్నీ చేయడమే. హోమ్ లో వాళ్లకి ఏం ఇష్టమో కనుక్కుందాం” అని ఆ హోమ్ లో ఉంటున్న అనాథ వృద్ధుల్ని ఒక్కొక్కరినీ ఏం కావాలో అడిగి అవే చేయించి పెడతారు
ఈ రోజుకీ అదే పద్ధతి.
ఒకసారి అమ్మ వైపు బంధువుల ఇంట్లో ఏదో వ్రతం ఉందని వెళ్లారంతా.
పూజంతా పూర్తయ్యాక, పొద్దుటి నుంచీ ఏమీ తినకుండా నానా చాకిరీ చేసి, పూజలో పాల్గొని, ఒళ్ళు అలిసి పోయి ఉన్న ఇంటావిడ “ముందు మగవాళ్లకి వడ్డిద్దాం. వాళ్ళ భోజనాలయ్యాక మనం ” అని అలవాటుగా ప్రతిపాదించి, వాళ్లాయనకి చెప్పి మగవాళ్లందరినీ భోజనాలకు లేపింది.
ఒకసారి టిఫినూ, రెండు మూడు సార్లు కాఫీలవీ పొట్టలో వేసి ఆరుబయట చెట్ల కింద మడత మంచాల మీద పవళించీ, కుర్చీల్లో జారగిలబడీ, రాజకీయాలు మాట్లాడుతూ దేశ సేవ చేస్తోన్న మగవాళ్లంతా “అమ్మయ్య, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. రెండింటికైనా పిలిచారు, ఇంకా నయం, మర్చిపోయారు కాదు” అని ఎకసెక్కలాడుతూ లేచారు.
తనకప్పుడు పదమూడేళ్ళుంటాయేమో. “అత్తయ్యా, ఆడవాళ్ళు ముందు తినేసి తర్వాత మగవాళ్లకి పెట్టొచ్చు కదా. పొద్దుటి నుంచీ పని చేస్తూనే ఉన్నారు మీరంతా. ఎంత ఆకలేస్తుందీ?” అంది
వనజత్తయ్య ఆశ్చర్యంగా చూసి “ఇదిగో తులసీ, నీ కూతురు చూశావా? నీ మాటలే అన్నీ. ఆడవాళ్ళం ముందు తినేసి తర్వాత మగవాళ్లకి పెట్టాలట” అంది
అమ్మ నవ్వింది. ఏమీ మాట్లాడలేదు. ఆ ఇళ్ళలో ఇలాటి వాటి మీద చర్చలు నడవవని అప్పుడు తెలీలేదు. చర్చిస్తే ముందు వీటో చేసేది ఆడవాళ్ళే అని అమ్మ చెప్పింది.
“అలా కండిషన్ చేశారు వాళ్లని మొదటి నుంచీ. ఇంటి యజమానులు మగవాళ్ళే కాబట్టి వాళ్లకి ముందు వడ్డించాలి. తరవాతే…..”
“పని వాళ్ళు తినాలి. కదూ? ఈ కండిషనింగ్ ని ఎవరూ బ్రేక్ చేయరా?” కోపంగా అంది తను
“అంత కఠినమైన మాటలు అవసరం లేదులే. అయినా ప్రతి వాళ్లనీ మనం సంస్కరించలేం. మార్చలేం. అవసరం లేదు కూడా. మన ఇళ్ళలో అలాటి పరిస్థితి లేకుండా చూసుకుంటే చాలు” అంది అమ్మ.
వనజత్త ఇంట్లోనే కాదు, చుట్టాలలో చాలా చోట్ల చూసింది తను అలాటి సంఘటనలు. ముందు మగవాళ్లకి పెట్టండి.. ముందు వాళ్లకి వడ్డించండి, అంటూ చివర్లో పూర్తిగా డీలా పడ్డ శరీరాలతో డస్సి పోయి, ఏదో నాలుగు మెతుకులు తిని, వంటిల్లు సర్దుకునే ఆడవాళ్లని. దాదాపు గా అందరూ అమ్మ కంటే పెద్ద వాళ్ళే.
తమ ఇంట్లో అలాటి స్థితి లేనందుకు సంతోష పడాలో, లేక చాలా మంది అలా ఉంటున్నందుకు బాధ పడాలో తెలీలేదు
తనకిప్పుడు 28 ఏళ్ళు. ఇప్పటికీ అలాటి పరిస్థితి ఉందంటే “ఏమో, నాకు అనిపించట్లేదు” అనాలనిపించేది. కానీ తను సరాసరి అలాటి ఇంట్లోనే పడింది.
తను సరే, 84 ఏళ్ళ ముసలావిడ కూడా పస్తుండాలా భోక్తలు తినే వరకూ? ఈవిడకు కూడా మినహాయింపు ఇవ్వరా?
“వాళ్లాయన సంవత్సరీకమే ఇది, ఆగాలి”అంటారేమో.
ఒకవేళ ఈవిడ ఆకలికి ఆగలేక, క్షణంలో ప్రాణాలు పోతే? భయంకరమైన ఆలోచన వచ్చింది. ఆవిడ డయాబెటిక్ అయితే?
కంగారు గా అమ్మమ్మగారి వైపు చూసింది. ఎర్రగా మండుతోన్న ఎండలో బాదం చెట్టు పంచుతోన్న నీడలో, మంచం మీద కూచుని, కొంగుతో విసురుకుంటోంది
“అమ్మమ్మ గారూ, గదిలోకి పదండి. ఏసీ వేస్తాను” అంది దయగా , ప్రేమగా
“ఒద్దమ్మా, ఈ చెట్టు కింద బాగుంటుందే నాకు. ఆ ఏసీ రూము లోంచి బయటికి రాగానే బయట మరింత వేడిగా ఉంటుంది. ఇక్కడే కాస్త గాలి వేస్తోంది లే” నిస్త్రాణగా మంచం మీద వాలింది.
మగవాళ్లకి ముందు వడ్డించేసి, చివర్లో మిగిలిన అరా కొరా తిని, ఆరోగ్యాలు పాడు చేసుకోవడం ఇప్పటి సంగతి కాదట. కులాలకతీతంగా ఇది అన్ని కుటుంబాల్లో ఉందని అమ్మ చెప్పింది.
తాతయ్య వాళ్ల పొలం చేసే రాఘవయ్య గారింట్లో కూడా అంతే జరిగేదట. రాఘవయ్య గారి కూతురు అమ్మ స్కూలు ఫ్రెండ్. 20 ఎకరాల సొంత పొలమూ, కౌలుకి తీసుకున్న మరో 20 ఎకరాలూ, పది బర్రెల పాడీ, ఉమ్మడి కుటుంబపు వంటా.. ఇంత చాకిరీ తో రాఘవయ్య గారి భార్య కి స్థిమితంగా కూచుని రెండు ముద్దలు తినే టైము కూడా ఉండేది కాదు.
అందరికీ అన్నీ అమర్చి, ఏ మూడింటికో ఇంత అన్నం వడ్డించుకునే సమయానికి, ముక్కలు అయిపోయిన పులుసూ, అడుగున మిగిలిన రెండు కూర ముక్కలూ ఉండేవట. “ఈ రోజుకి మాడ్చిన కారమూ, పండు మిరపకాయ కారమే భాగ్యం” అని ఆ కారపు కూడు లో ఇంత నెయ్యి కుమ్మరించుకుని రెండు ముద్దలు తిని మంచి నీళ్ళు తాగి లేచేదట.
అరవై ఏళ్ళకే ఆవిడ పేగు పుండు పడి చచ్చిపోతే మందులు డాక్టర్లు అంటూ తిరిగారు గానీ, ఏ రోజైనా ఆమె సరిగా తిన్నదా లేదా అని ఎవరూ నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదట. ఆవిడ పోయాక కూడా “ఎవరికీ లేదమ్మా ఈ పేగు పుండు మా కొంపలో. ఇదేంటో రత్నమ్మకిట్టా ఒచ్చి పడిందీ” అనుకున్నపుడు ఆవిడ అత్తగారు, 80 ఏళ్ళ ముదిగువ్వ మాత్రం “ఏ నాడైనా టయానికి ఇంత తిననిచ్చార్రా మీరంతా? ఏ నాడైనా అది తినే టైముకి ఇంత కూరా, కాస్తంత నీచూ మిగలనిచ్చార్రా మీ పాడెలు గట్టా? ఏ రోజైనా అది తిన్నదో లేదో కనుక్కున్నారా ఇప్పుడు ఏడ్చే నా దయ గల కొడుకుల్లారా? వేళ గాని వేళ ఇంత పచ్చడన్నం తప్ప ఇంత కూరా పెరుగూ వేసుకుని తినెరిగిందా? నా తల్లి దాటి పోయిందిలే, ఇంకో పదేళ్ళు బతికుంటే ఆ పదేళ్ళు కూడా దానికి పచ్చడి మెతుకులే మిగిలేయి ” అని గొల్లున ఏడ్చిందట.
కళ్ళలో సన్నగా నీటి పొర చేరుకుంటోంది. స్నేహితురాలి తల్లి గురించి చెప్తున్నపుడు అమ్మ చాలా కళ్లనీళ్ళు పెట్టుకుంది.
తెప్పరిల్లి చూసింది. ముసలమ్మ మంచం మీద జల్లెడ లా పడుతున్న బాదం ఆకుల నీడలో డస్సి పోయి సన్నటి గురక పెడుతోంది.
పండి పోయిన తమలపాకు లాంటి శరీరం. అసంఖ్యాకమైన ముడతలతో నిండి పోయిన తెల్లని చేతులు. ఒక్క నల్ల వెంట్రుక కూడా లేని వెండి జుట్టు.నీరసంతో వేగంగా ఊపిరి తీస్తూ వేగంగా కదులుతున్న డొక్క. సెల్ఫ్ డిజైన్ ఉన్న తెల్లని చీర.
చేతికి సన్నని బంగారు గాజులు.ఎవరో ఆర్టిస్టు గీసిన పోర్ట్రైట్ లా ఉందామె.
ఆ చేతులు ఎంతమండికి వండి పెట్టాయో! ఎన్ని రంగుల మట్టి గాజులు వేసుకుని మురిశాయో.
మగత లోనే “మంచి నీళ్ళివండర్రా ఎవరైనా” అంటోంది
చటుక్కున లేచింది అతిది. వంటింట్లోకి వెళ్ళింది గబ గబా. విశాలమైన హాల్లో భోక్తలకు వడ్డన జరుగుతోంది. ఇంకా ఔపోసన పట్టలేదు.
కమ్మని ఇంగువ పులిహోర పరిమళం, నేతి పూర్ణాలు, చక్ర పొంగలి, ఘుమ ఘుమ లాడుతూ వాసనలు మోసుకొస్తున్నాయి.
స్టవ్ పక్కన గట్టు మీద పెద్ద స్టీలు గిన్నె నిండా జీడిపప్పు తేలుతూ సేమ్యా పాయసం
అత్తగారు, మీనాక్షి హాల్లో ఉన్నారు. ఏ చిన్న తేడా జరిగినా భర్త ఏమంటాడో అని అత్తగారు చాలా అలర్ట్ గా ఉన్నట్టు తెలిసిపోతోంది. మామగారు నెయ్యి వడ్డిస్తున్నాడు.
చిన్న స్టీలు గిన్నె ఒకటి తీసి దాన్నిండా పాయసం నింపింది. పేపర్ ప్లేట్లో కొన్ని గారెలు సర్ది దాన్ని మరో ప్లేటు తో మూసి, ఒక స్పూను, మంచినీళ్ళు తీసుకుని వేగంగా అక్కడి నుంచి బయట పడి పెరట్లోకి నాలుగంగల్లో వెళ్ళింది.
బాదం చెట్టుకి అడ్డంగా అరటి చెట్లు సెక్యూరిటీ గార్డుల్లాగా అడ్డం నిలబడి ఉన్నాయి. వంటింట్లోంచి ఏమీ కనపడదు.
“అమ్మమ్మ గారూ, లేవండి, నీళ్ళు తెచ్చాను” అంది నెమ్మదైన గొంతుతో.
ఉలిక్కిపడి కళ్ళు తెరిచిందామె
“అమ్మమ్మ గారూ, ఇదిగో తినండి. ఏమీ పర్లేదు. ప్రాణాలు పోయేంత నీరసంలో కూడా, మీరు భోక్తల భోజనాలు అయ్యే వరకూ ఆగనక్కర్లేదు. ఎవరూ ఏమీ అనుకోరు.అనుకున్నా పర్లేదు. లేవండి. ఎవరైనా ఏదైనా అంటే నేనున్నాను. ఊరుకోను”.
అమ్మమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఆ తడారిపోయిన కళ్లలోకి సన్నని సంతోషపు తెర.
జీవితమంతా ఇంట్లో అందరూ తిన్నాక వడ్డించుకోవడమే అలావాటు. “నీకు మిగిలిందా? నువ్వు తిన్నావా?” అని ఎవరూ అడగలేదు. ఉమ్మడి కుటుంబం కోడలు గా ఎంతెంత పని చేసినా దానికి లెక్కే ఉండదు. ఒక్కోసారి రాత్రి పదకొండింటికి అన్నం తిన్న రోజులు కూడా ఉండేవి.
ఇంట్లో ఏ విశేషం జరిగినా “ముందు మగవాళ్లకి వడ్డించండి” అనే హుకుం లాంటి మాటలు వినపడేవి. ఎంతెంత వంటలూ ఇంట్లోనే చేయాల్సి వచ్చేది.
తన రోజులు పోయి పిల్లల రోజులు వచ్చాక కూడా ఇంతేనా? ఉద్యోగం చేసి భర్తకంటే నాలుగు రాళ్ళు ఎక్కువే సంపాదిస్తున్నా, కోడలికి భర్త అంటే హడల్. వాడు ఎక్కువ మాట్లాడడు. కానీ అంతా అతని కనుసన్నల్లోనే జరిగిపోవాలి. చాదస్తాన్ని, సంప్రదాయాలని బానే ఒంటబట్టించుకున్నాడు.
ఆఫీసులో ఎంత పెద్ద ఉద్యోగి అయినా, కోడలు , ఇంట్లో ప్రతి చిన్న పూజకీ మడి కట్టుకుని తడి బట్టలతో తయారై పోతుంది.
“ఎందుకీ చాదస్తాలు నీకు? వాడికి చెప్పు” అంటే “వొద్దండీ, గొడవలు అవుతాయి. ఆ తర్వాత రోజుల తరబడి ఆ అశాంతిని నేను భరించలేను.దానికంటే ఆ మడేదో కట్టుకుంటే ఒక్కరోజుతో అయిపోతుంది” అంటుంది.
తన కింద ఎంతోమంది ఉద్యోగుల్ని పని చేయించే కోడలు.
ఇంట్లో ఇలాటి అశాంతుల్ని తప్పించుకోడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా సర్దుకుంటున్నారో.
ఒక్క క్షణం ఆగి, అదితి చేతిలోని ప్లేటు అందుకుంది.
“పోయిన మనిషి కోసం ఇన్ని వంటలు చేసి, ఆయన పేరు మీద వాళ్లకి వడ్డిస్తున్నారే, నీరసంతో చచ్చేలా ఉన్న మనిషిని పట్టించుకునే దిక్కు లేక పోవడమే కదూ, సంప్రదాయమంటే?” నవ్వింది గారె ముక్క తుంచుతూ.
“మీలో కమ్యూనిస్టు ఉందండీ బామ్మ గారూ” నవ్వుతూ తనూ ఒక ముక్క తీసుకుంది .
“నిజం మాట్లాడ్డానికి కమ్యూనిస్టు అవ్వాల్టే? పదమూడేళ్ళ వయసులో ఈ ఇంటికి కోడలుగా వచ్చానా? మా అత్తగారు అన్నీ దగ్గరుండి నేర్పించింది. “అందరి భోజనాలూ అయ్యాకే చివర్లో మనం తినాలి” అని ఆవిడ చెప్తే ఎందుకు ఏమిటని ప్రశ్నించకుండా తలూపాము నేనూ మా తోటి కోడళ్ళూనూ.
ఇంటెడు చాకిరీ చేసే ఆడవాళ్ల ఆకలికి ఇంట్లో మాత్రం చివరి పీట.
మీ తాతగారు మరీ ఇంత కఠినంగా ఉండేవారు కాదులే. ఆబ్దికాలవీ వచ్చినా, “చాలా లేటవుతుంది. ఏదైనా టిఫిన్ తిను పర్లేదు.” అనేవారు. నేనే, వద్దులే ఆబ్దికం వంట శ్రద్ధగా చేయాలి అని తినే దాన్ని కాదు.
ఒక్కోసారి పనంతా అయ్యేసరికి ఏ మూడో అయి, ఆకలి చచ్చిపోయేది. ఒక గ్లాసు మజ్జిగ తాగి కాసేపు కునుకు తీసేదాన్ని” ఇష్టంగా సేమ్యా పాయసం స్పూన్ తో తీసుకుని నోట్లో పెట్టుకుంది.
రెండో గారె తినడం పూర్తి చేసి నెయ్యి అంటుకున్న వేళ్లని చూస్తూ ఆలోచనల్లో పడి న అదితి అమ్మమ్మ మాటలతో తెప్పరిల్లింది.
“పిల్లలూ చదువులూ, వాళ్ల కోసం పొద్దున్నే లేచి బాక్సులు సర్ది, పంపి. పొద్దున తాగిన గుక్కెడు కాఫీ తప్ప పదిన్నర దాకా ఒక ఇడ్లీ ముక్క తినడానికి అయ్యేది కాదు. ఒక్కోసారి పూజలవీ ఉంటే పది రకాల వంటలు చేయాల్సి వచ్చేది. ఉమ్మడి కుటుంబం రక్షణ ఇస్తుందన్న మాట నిజమో కాదో తెలీదు గానీ, చాకిరీ తో ఆడవాళ్ళు నలిగి నాశనమయ్యే వాళ్ళు. కొంతమంది కి ఇలా చెప్పుకునే అవకాశం కూడా రాకుండానే నిశ్శబ్దంగా చచ్చిపోయే వాళ్ళు కూడా. వాళ్ల మనసుల్లో ఏముందో ఎవరికీ తెలీకుండానే ముగిసిపోయేవి జీవితాలు.
ఆ చావుల వెనుక, అనారోగ్యాల వెనుక వంటింటి కథలు బోలెడుంటాయి” వేరే లోకంలో ఉన్నట్టు చెప్పుకుంటూ పోతున్న ముసలావిడ వంటింటి గుమ్మం వైపు చూసి మాటలాపేసింది.
చెంపకు చెయ్యి చేర్చి ఆవిడ మాటలే వింటున్న అదితి చటుక్కున తల తిప్పింది.
అదితి అత్తగారు, ఆమె ఆడపడుచు మీనాక్షి! ఎప్పుడనగా వచ్చారో , అరటి ఆకుల సందుల్లోంచి ఇటే చూస్తూ.
అదితి అమ్మమ్మ గారి వైపు చూసింది హడలి పోతూ.
ముసలావిడ వంటింట్లోకి వెళ్ళి తీసుకోదు. అది వాళ్లకి తెల్సు. ఈ పని చేసింది తనే అని తెల్సి పోయింది
అరచేతుల్లో చెమట్లు పట్టాయి.
సరే, తనే తీసుకొచ్చి పెట్టింది అమ్మమ్మ గారికి. తను కూడా తిన్నది
ఇప్పుడేంటి? పోట్లాడతారా? తన దగ్గర జవాబుంది.
సిద్ధమే దీనికి! ఇంట్లో ఆడవాళ్ళు ఆఖర్న తినాలనే సంప్రదాయాన్ని తను అంగీకరించబోవట్లేదు. అది ఖాయం. మామగారిని పిలుస్తారా? పిలవనీ.
మాట్లాడుతుంది తను. అవసరమైతే గొంతు పెంచి మాట్లాడుతుంది. నిశ్శబ్దంగా ఊరుకుంటే రేపు ఈ బాధ్యతలు అత్తగారి నుంచి తనకు సంక్రమిస్తాయి.
అమ్మమ్మ గారి మొహంలో ఏ భావమూ లేదు. చేతిల్ని స్టీలు గిన్నె కింద పెట్టింది అంతే.
ఒక్క నిమిషం నిశ్శదం కొనసాగింది. అది చాలా ఘోరంగా ఉంది. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటే బాగుండు. తను అందుకోవచ్చు. ఏం మాట్లాడాలి మొదట?
“నేనే తెచ్చి పెట్టాను అమ్మమ్మకి. ఆమె దాదాపు స్పృహ తప్పి పడి పోయేలా ఉన్నారు”
“ఇందులో అమ్మమ్మ గారి తప్పు లేదు…”
“మూడవుతోంది. ఆవిడకు ఆకలెయ్యదా?”
ఏది ఎంచుకోవాలి వీటిలో?
గుమ్మం దగ్గరి ఇద్దరిలో చలనం లేదు. “ఇంత పని జరిగిందా? అదీ నాన్నగారి సంవత్సరీకం రోజు” అన్నట్టు చూస్తోంది మీనాక్షి
“ఇన్నాళ్ళ ఇంటి సంప్రదాయాన్ని మంటగలిపేశావా?” అన్నట్టు అత్తగారు
ఇక మాట్లాడాల్సిందే.
గట్టిగా ఊపిరి పీల్చుకుంది. నిటారు గా కూచుంది.
“ముందు మగవాళ్లకి వడ్డించడం, రోజంతా చాకిరీ చేసిన ఆడవాళ్ళు ఎప్పుడో చివర్లో, ఆఖర్న మిగిలిన అడుగూ బొడుగూ ఆడవాళ్ళు తినడం… ఇక నడవకూడదు.. కనీసం ఈ ఇంట్లో” అంది ధృడంగా
అనేశాక , ఏదో ఉపన్యాసంలా మొదలు పెట్టానేంటి? అనిపించింది
లోలోపల కొంచెం జంకు. అసలే మీనాక్షి చండశాసనురాలనీ, పద్ధతులూ పడికట్లూ ఎక్కువని వింది తను.
రెణ్ణిమిషాల తర్వాత…
ఆవిడ మెట్లు దిగి నెమ్మది గా నడుస్తూ అదితి ని సమీపించింది
బ్రహ్మాండం బద్దలవుతుందేమో అన్నంత ఉత్కంఠ. ఏమంటుందో?
అమ్మమ్మ గారు అదితి చేతిని తన చేతిలోకి తీసుకుంది, భయం లేదన్నట్టు.
మీనాక్షి మంచం మీద తల్లి పక్కనే కూచుంది. అమ్మ భుజం మీద తల వాల్చి చుట్టూ చేతులు వేసింది.
మంచం మీద ప్లేట్లో మిగిలిన ఆఖరి గారె చేతిలోకి తీసుకుని తుంచి నోట్లో వేసుకుని ” కృష్ణ వేణీ..రా, నీ కోడలు ఈ గోడను బద్దలు కొట్టేసింది .. ” అంటూ రెండో సగం చూపిస్తూ పిలిచింది.
*
చిత్రం: చిన్నారి మామిడి
మా అత్త కొడుకులు బోంచేస్తేగాని కుక్కకి అన్నం పెట్టేది కాదు ,అదీ ఒక్క పూటే దాని తిండి .కొడుకులు రెండు దాటితేగాని తినరు .ఆవిడా కుక్కా కూడా పస్తే .అది ఇడ్లీ పొట్లం దారాలు విప్పి తినడం ,తేగలు అచ్చంగా మనం తిన్నట్లే తినడం నేర్చుకుంది .విశ్వాసం గల కుక్క. షికారు వెళ్ళినప్పుడు గేటు గడియ తీసి బయటకు వెళ్లి మళ్లీ గడియ వేసి వెళ్ళేది.
మంచి కథ. చాలా హృద్యంగా రాశారు. ఇంకా ఇలాంటి కథలు రాసుకోవాల్సిన పరిస్థితి సమాజంలో ఉండడం బాధాకరం. మనిషి అంటే మనిషి. అంతే. బతకడానికి కావాల్సిన తిండి, నీళ్లు విషయంలో కూడా ఆడ, మగ, ముందు, వెనుక అనుకోవడం ఎంత అనాగరికం.
మన ముందున్న గోడల్లో అతి మాములుగా కనిపించే గోడ గురించి, అది కూలాల్సిన అవసరం గురించి, కూల్చిన తీరు గురించి చక్కని కథనంతో అందించిన సుజాత గారికి అభినందనలు.
చాలా బాగా రాశారు సుజాత గారు. ఇవన్నీ నిజంగా కూలవలసిన గోడలే. నా వ్యక్తిగత జీవితంలో మా అమ్మను చూసాను. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. నిజంగానే చిన్న విషయాల కోసం రోజులు, నెలలే కాదు మళ్ళీ అలాంటి సందర్భం వచ్చినప్పుడు కూడా సూటి పోటి మాటలు భరించాలి. దానికన్నా చేసేస్తే సరిపోతుంది కనీసం మానసిక శ్రమ అయినా తగ్గుతుంది.
Chala chala Bavundi.chala ante no words andi
చక్కటి నిజం.. కధా ఇది! కాదు. కొన్నికొంపల్లోని ‘చంప్రదాయాలను’ బాగా చూపినా, చాలా కొంపల్లోని ఆడవాళ్ల దౌర్భాగ్యాన్నీ, వాళ్ల మరణాల్నీ, వాటికారణాలనీ బాగా రాశారు. బహుశా గోడలు లెక్కలేనంత బలంగా ఉన్నై. చైనా గోడంత.
ఎప్పటికి బద్దలౌనోకదా…
1947 లో ఒక స్వాతంత్ర్యం వచ్చింది. ఇంకొన్ని రావాల్సి ఉన్నాయి. వస్తున్నాయి.. వచ్చేస్తున్నాయి.. తప్పకుండా వస్తాయి.. ❤️
ఒక్కోసారి కొన్ని తీరాలు దాటాలంటే .. కొన్ని తరాలు మారాలి.. Unfortunately !
అవసరమైన సబ్జెక్టు. ఇవాల్టికీ
చాలా మంచి కధ. ఆడవాళ్లు అనవసరమైన కొన్ని పద్ధతుల్ని బ్రేక్ చేసి ప్రశాంతంగా బ్రతకడం చాలా అవసరం. కథను తేలికైన మాటలతో రాసి ఏకబిగిన చదివించారు రచయిత్రి. కథ అద్భుతం. ఇలాంటి కథలు రావడం ఇప్పడు చాలా అవసరం.సుజాత గారికి బోలెడంత ప్రేమ❤️❤️
అవసరమైన కథ.
ఎక్కడా ఆగకుండా చదివించిన కథ. ముగింపు సర్ ప్రైజింగే.
ఇప్పటికే చాలా ఇళ్లలో కూలవలసిన గోడలు ఇలాంటివి ఎన్నో.
సేవలు చేయించుకోవం జన్మహక్కుగా భావించే మగవాళ్లు భుజాలు తడుముకునే చురకలు- ‘అన్నీ ఎవరో ఒకరు అమర్చి పెడుతుంటే డిసిప్లిన్ బాగానే నడుస్తుంది’, ‘ రాజకీయాలు మాట్లాడుతూ దేశ సేవ చేస్తోన్న మగవాళ్లంతా..’ లాంటివి బాగున్నాయి.
Excellent