*
అత్యాధునికుడిని
~
యంత్రాలతో సంభాషిస్తూ
రెక్కల్ని బిగించుకొని
ఎగురుతున్న వాన్ని
కళ్ళ అద్దాల మీద ఖాళీ ప్రతిబింబాన్ని
గీసుకుంటున్న వాన్ని
*
అప్పుడప్పుడు
రాత్రులను
కలలవానతో కడుగుతూ
గాలిపూలతో అలంకరిస్తూ
నక్షత్రాలమాలల్ని కడుతుంటాను.
చేతిలో భూమిని పట్టుకొని కళ్ళను,
పెదవులను గీస్తుంటాను
మబ్బులచెవుల్లో ముచ్చట్లు చెప్తాను
ఆకాశాన్ని దగ్గరగా లాక్కొని కుట్లేస్తుంటాను
సూర్యుడికి తలనొప్పోస్తే కొంచెం దూరంగా
ఉంటూనే మాత్రలు వేస్తుంటాను
చంద్రుడి బుగ్గల్ని గిల్లుతూ ఆటలాడుతుంటాను.
బోసిపోయిన మొక్కలకు నవ్వడం నేర్పిస్తాను
రోడ్లపై బల్లాల చెవులకి ఇయర్ఫోన్స్ పెడుతుంటాను
విరిగిపోతున్న వస్తువులకు రక్తదానం చేస్తాను
అరుగుల అనుభవాల్ని వింటుంటాను.
దుఃఖానికి నాలుగు
ధైర్యవచనాలు చెప్తాను
బాధలపరీక్షకి జవాబునందిస్తాను
పేదోడి తరపున అక్షరాన్నై నిలబడతాను
అన్యాయంతో గుంజీలు తీయిస్తాను.
కుల పునాదుల
మీద కూలబడిపోతున్న
మనిషి దేహాన్ని
భుజం మీద వేసుకొని
కాలం గాయాల మీద నడుస్తుంటాను
*
మనిషి అత్యాధునికుడిగా ఎలా ఎదిగి వచ్చాడు? తన ఊహాశక్తికి రూపం ఇస్తూ కాలక్రమేణా ఏమి సాధించాడు? ఏం కోల్పాయాడు ? దేన్ని మార్చలేకపోతున్నాడు? ఇవన్నీ కవిత బహిర్గతపరుస్తుంది. ఆధునిక సాంకేతికత వల్ల అందివచ్చిన జీవితం మనిషిని గడియ రికాం లేకుండా చేస్తుంది. ఇంకేదో సాధించాలనే తపన తనను తెలియని ఊబిలోకి తోస్తుంది.
ప్రకృతిలో కనిపించిన భూమి, ఆకాశం, మబ్బులు, సూర్యుడు, చంద్రుడు తనకన్నా గొప్పవిగా భావించి వాటికి దైవత్వాన్ని ఆపాదించిన మనిషి రాను రాను వాటిపై పైచేయి సాధిస్తూ వస్తున్నాడు. భూమిని గుప్పిట్లో పెట్టుకుని, చంద్రుడిపై కాలుమోపి, మబ్బుల్ని జోపి కృత్రిమ వర్షాన్ని కురిపిస్తూ, ఆకాశానికి తూట్లు పొడుస్తూ చివరికి కృత్రిమ సూర్యుడిని సృష్టించే(ఇటీవలి చైనా ప్రయోగం) స్థాయికి చేరుకున్నాడు. యువల్ నో ఆ హరారీ రాసిన ‘Sapiens: A Brief History of Humankind’ పుస్తకం ఏ ప్రత్యేకతా లేని జంతు దశ నుండి హోమో ప్రజాతికి చెందిన తోటి మానవులైన రుడాల్ఫెన్సిస్, నియాండేర్తలేన్సిస్, సోలోన్సిస్, ఏర్గాస్టర్, ఎరక్టస్ లను దాటుకొని సేపియన్స్(నేటి మనిషి) మాత్రమే బతికి బట్టకట్టగలిగిందని, అతనే పరిణతి చెందిన/ తెలివైన మానవుడని చెబుతుంది.
కవి చెబుతున్న అత్యాధునికుడికి పిల్లల్ని నవ్వించగల, ముసలివారితో ముచ్చటించగల సమయం దొరుకుతుందా? అని చిన్న సందేహం. ఎప్పుడూ ఉరుకులు, పరుగులతో నిత్యం బిజీగా వుండే మనిషికి తీరిక దొరికితే మరీ మరీ సంతోషం. ఎలిజబెత్ బి. హర్లాక్ తన ‘Developmental Psychology: A Lifespan Approach’ లో పేర్కొన్న పది మానవవికాస దశల్ని(జనన పూర్వదశ, నవజాత శిశువు, శైశవదశ, పూర్వబాల్యదశ, ఉత్తరబాల్యదశ, పూర్వకౌమారదశ, ఉత్తరకౌమారదశ, వయోజనదశ, మధ్యవయస్సు, వృద్దాప్యం) చూస్తున్నప్పుడు మనిషి ఏం కోల్పోతున్నాడో స్పృహలోకి వస్తుంది. కవి ఈ దశల్ని సాధారణికరించి బాల్య,యవ్వన, మధ్య, వృద్దాప్య దశలుగా తీసుకోవడం చూస్తాం. జి. లక్ష్మినర్సయ్య రాసిన ‘కవిత్వనిర్మాణ పద్దతులు ‘ ఒక సాధారణ వాక్యాన్ని స్థానభ్రంశము (Displacement) టెక్నిక్ ద్వారా కవిత్వ వాక్యంగా ఎలా మార్చవచ్చో చెబుతుంది. కవి ఆయా దశలలోని మనిషిని రోడ్డుపై వుండే బల్లాలతో, విరిగిపోతున్న వస్తువులతో స్థానభ్రంశం చెందించి కవిత్వ వాక్యాలుగా మార్చిన విధానాన్ని గమనించవచ్చు.
దు:ఖానికి ధైర్యం చెప్పగల, బాధలకు పరిష్కారం వెతికిపెట్టగల, పేదవాడికి తోడుగా నిలబడగల, అన్యాయాన్ని ఎదిరించగల మనిషి, యంత్రాలతో సంభాషిస్తూ రెక్కల్ని బిగించుకొని ఎగురుతున్న..
కళ్ళ అద్దాల మీద ఖాళీ ప్రతిబింబాన్ని గీసుకుంటున్నఅత్యాధునికుడైన మనిషి కులభారతంలో ఎందుకు నెగ్గలేక పోతున్నాడో.. అని కవి ఆవేదనను వ్యక్తపరుస్తాడు.
*
అనేక కోణాలలో నుండి నేను రాసిన కవితను విశ్లేషణ చేస్తూ చాలా విషయాలను క్రోడీకరించి రాయడం చాలా బావుంది అన్నా. మీ వాక్యాలు నాకెప్పుడూ ప్రోత్సాహంమే. ధన్యవాదాలు అన్నా .
అఫ్సర్ సార్ కి మరియు సారంగా టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు💐
పేర్ల రాము గారి కవితా బావుంది. ముఖ్యంగా:
కుల పునాదున్ని
భుజం మీద వేసుకొని
కాలం గాయాల మీద నడుస్తుంటాను
బండారి రాజ్ కుమార్ గారు కవితను బాగా పరిచయం చేశారు.