కుదురు

గాయం మానిపోయిందనుకోకు
గతకాలపు ఆనవాళ్ళు గుండె మీద
ఆనెలు కట్టుకుని దర్జాగా కూర్చున్నాయిగా
శ్వాస వదిలి , తీసుకున్న ప్రతిసారీ
ఎంత భారంగా ఉంటుందో తెలుసా
నిద్రలోనూ ఉలిక్కి పడుతూ
నిద్ర పట్టని రాత్రులను వెక్కిరించే పీడ కల
భారంగా కదులుతున్న రోజుల మధ్యకి
పెనుభారమైన కనురెప్పల మధ్యకీ
తెలివిగా చొరబడిన ఊపిరాడని కాలం
పగలు రాత్రీ తేడా లేకుండా
నా ప్రతి కదలికనూ, నన్నూ
వశపరుచుకున్న కాలం
గడచిన కాలమంతా తెలియని పరాధీనతే
గడుస్తున్న కాలంలో తెలిసినా
నువ్వే పై చెయ్యిగా ఉండాలంటావు
ఇంత కాల భ్రమణంలో
నాదంటూ, నాకంటూ ఒక్క రోజు లేదు
అంతటా పేరుకుపోయిన
ఉదాసీనతతో కూడిన అభద్రత!
ఇదంతా ఎవరికోసమని?!
అప్పుడప్పుడు నాలోనూ వో సందిగ్ధత
ఏ మూలనో కొట్టుమిట్టాడుతూ
ఏవేవో జాగ్రత్తలు చెబుతూ
బండ రాయితో నెత్తిమీద
మోదినట్లుంటుంది!
ఎంత ఆత్రంగా ఎదురు చూస్తానో
నిర్దయగా వదిలెళ్ళిన కాలం
వెనక్కి తిరిగి రాదుగా
ఎంత అప్రమత్తంగా ఉంటానో
చేజారిన జీవితాన్ని మళ్ళీ చేదుకోలేనుగా
ఎప్పటికప్పుడు తోడి పోసుకుంటున్నా….
మెలిపెట్టే నెత్తుటి జ్ఞాపకాలే అన్నీ!
ఎప్పుడో ఏదో అద్భుతం జరుగుతుందని
ముఖం చాటేసిన కాలంతో
సంధి చేసుకోలేనిక!
చచ్చి బతికిన ప్రతిసారీ
సందిగ్ధం లేని కుదురు కూర్చుకున్నా!!
మానని గాయమా
నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోను!?
*

వైష్ణవి శ్రీ

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు