కిరాత విజయం

యాసంగి ఎండలు మండుతున్నయి.

మామిడి కొమ్మల మీద సమరుకాకి రొప్పుతూ తిరుగుతంది.

మామిడి పండ్ల వాసనకు చిలుకలు, గొర్రెంకలు చెట్ల మీద వాలి లొల్లిలొల్లి చేస్తన్నయి.

“వూల్లె ఎవనికన్నా బతుకు మీద ద్యాస వున్నదా? మనం అంటే దర్దెపల్లి పొయి చదువుకున్నం. నాయిన అయిదు చదివిచ్చిండు. ఆ తెలివితో నెగ్గుకొత్తన్నం. దినాలు ఒక్కతీరుగుంటయా ఎప్పటికీ. వూల్లె సర్కారు బడి మూతబడి ఎన్ని నెలలాయే”? అని బాయి కాడ బొక్కెన తొండాన్ని కుడుతా తమ్ముడు సోమయ్య కేసి సూత్తా అన్నడు సెంద్రెయ్య.

ఆ మాటలకు కోపం వొచ్చింది సోమయ్యకు.

“నీ తమ్మునికి సెవులు లెవ్వా? ఆయనకే చెప్పరాదు సూటిగా” అని పార పట్టుకొని దోనెలో పేరుకు పోయిన నాచును తీసే పనిల పడ్డడు సోమయ్య.

ఆ యిద్దరి మాటలను వింటూ “నువ్వు చెప్తేనే మాకు దెలుస్తది మరి” అంటూ తాటి నార చీరే పనిలో పడ్డడు యెంకటయ్య.

యెంకటయ్య పోలీసు పటేలు. అంతేనా, వూరి పెద్ద మనిషి కూడా.

 

ఎండలు ముదిరినయ్.

పొద్దంతా బావుల కాడ ఏ పనీ వుండదు. అప్పటికే యగుసాయం పనులన్నీ ఒడిసిపోయినయి.

జీతగాళ్లకైనా యజమానులకైనా పనులు పెద్దగా వుండవు.  సెంద్రెయ్యకు కూడా ఏమీ పనులు లేవు.

యాసింగి పండియ్యాలంటే బాయి ఎండిపోయింది.

వెంకటయ్య, సోమయ్య, సెంద్రెయ్య వానకాలం మొదలవ్వగానే ఏమి చెయ్యాలో ఆ పనుల గురించి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.

 

మామిడి చెట్ల కింద కూచోని ఒక వారం రోజులు తాళ్లు పేనిండ్లు.

మోట గొట్టాలంటే దండెడ బాగుండాలే. వాళ్ల  మోట బొక్కెన చాలా పెద్దది. దాన్ని గుంజాలంటే చాలా పెద్ద దండెడ కావాలె. వారం రోజులు అదే పని చేసిండ్లు ముగ్గురు.

జనుప పొరుక దెచ్చి నీళ్లలో అప్పటికే అయిదు రోజులు నానబెట్టిండ్లు.

మురిగిన నీటి వాసన ముక్కులను చికాకు పెట్టే దశలో ఆ జనుప పొరుకను బయిటికి తీసి కొద్దిగా ఆరనిచ్చిండ్లు.

ఆ తర్వాత తోలు వొలిచినట్టు నార వొలిచిండ్లు. ఆ జనుప నారతో అయిదు తాళ్లు ఒక మోస్తారువి తయారు చేసిండ్లు.

ఆ అయిదు తాళ్లను కలిపి పెద్ద దండెడను పేనిండ్లు. దాన్ని ఒక రాత్రంతా నీళ్లలో నానబెట్టిండ్లు. ఆ తర్వాత చూస్తే అది బుసలు కొట్టే కొండ చిలువలాగా వుంది.

ఆ తర్వాత గొడ్లకు, బర్రెలకు తగుళ్లు పేనిండ్లు.

సెలుకలో అక్కడక్కడ మొలిచిన తుమ్మ చెట్లను చెలిగిండ్లు.

 

అన్నా దమ్ములు సెలుకలో వున్న తాటి చెట్లకున్న కమ్మలను గౌండ్లాయనను పిలిపించి కోయించిండ్లు. తాటి కమ్మలను ఒకదాని మీద ఒకటి పెట్టి కుప్ప పెట్టి, దాని మీద పెద్దపెద్ద లావైన యాపవి తుమ్మవి మొద్దులు పెట్టిండ్లు. అలా ఒక అయిదు రోజులయినంక అవి సాపుగా మారిపోయినయి.

వాటిని దొడ్డికాడికి ఎత్తుకొచ్చిండ్లు.

ఒక్క పూటలో దొడ్డి పాత పైకప్పు ను పీకేసిండు సెంద్రెయ్య.

మర్నాడు యిద్దరు తమ్ముండ్లు తాటాకులు పైకి అందిస్తుంటే, వాటిని అందుకొని వాసాల మీద జాగ్రత్తగా కట్టిండు.

మాపటేల కల్లా దొడ్డి కప్పిండు సెంద్రెయ్య.

యెంత వానపడ్డా, అందులోంచి ఒక్క సుక్క కూడా కారదు మరి.

ఆ సాయంకాలం బర్లు, గొడ్లు కొత్త దొడ్లో సంతోషంగా సేద తీరినయి.

 

మల్లంపల్లి వూరంతా ఆసాములు, జీతగాళ్లు ఇలాంటి పనుల మీదే తీరిక లేకుండా పొద్దంతా గడుపుతుండ్లు.

కానీ చీకటి పడ్డాక ఏం చెయ్యాలే?

అందరూ ఇంటికి చేరుకున్నాక నాలుగు ముద్దలు ఎంగిలి పడ్డంక మనసు ఉల్లాసాన్ని కోరుకుంటది.

ఆడోళ్లు సప్పట్లు కొడుతూ ఉయ్యాల పాటలు పాడుకుంటా ఆడుతండ్లు ఒక వాడల.

గౌండ్లోళ్ల వాడల కోలాటం ఆడుతండ్లు.

మాదిగోళ్ల వాడకు కబడ్డీ ఆడుతండ్లు పడుసోళ్లు.

గొల్లోళ్ల వాడల సప్పుడు లేదు. పొలాలలో సెలుకల్లో మంద పెట్టిండ్లు. తోడేళ్ళు జీవాలను యెత్తుక పోకుండా కాపలా కాయ బోయిన గొల్లలు ఊరిలో వినపడుతున్బ హడావుడీని దూరం నుండి వింటా నవ్వుకుంటండ్లు మనసుల.

సెంద్రెయ్యకు కల్లు తాగాలని ఆ పూట అనిపిచ్చింది. అప్పటికే అది అందరూ అన్నం దినే యాళ్ల.

గర్వందుల సత్తెయ యింటికి పోయిండు.

బయిట సత్తెమ్మ చాపలు వొండుతంది.

“అల్లుడు లేడారా, సత్తెవ్వా?” అని ముడ్డికింద తువ్వాల యేసుకొని కూసున్నడు సెంద్రెయ్య.

కాల్చిన చాపలను గిన్నెల దెచ్చి ముందట పెట్టింది సత్తెమ్మ.

“అల్లుడు యాడికో పోయిండే. యెంకటయ్య సిన్నాయిన, కోళ్ల నారాయణ మామ పిలిచిండ్లని పోయిండు” అంది కల్లు కుండలోంచి దీసి లొట్టిలో పోస్తా.

మోత్కాకు సేతికిచ్చి లొట్టితో నిలబడ్డది.

“ఓవ్వా, ఒక లొట్టి సాలు. ఎక్కువ వొద్దు” అనుకుంటా ఒక మూడు సుక్కల కల్లు నేల మీదికి యిడిసి పట్టుపట్టిండు.

యిగ సాలన్నట్టు తలాడించిండు సెంద్రెయ్య.

సత్తెమ్మ కల్లు ఒంపుడు ఆపి, లొట్టి కింద పెట్టింది. యింట్లకు పోయింది. ఒక కటోరల యాటకూర తున్కలు దెచ్చి “మీ అల్లుడు పొద్దున యాటను కోసిండు. కూర లేతగా వుంది. ఒక పోగు సెంద్రెయ్య మావకు పంపాలె అన్నడు గానీ అప్పుడే పెరుకోళ్ల బిక్షపతి వొచ్చి నాగ్గావాలే అని తీస్కపోయిండు. మీ అల్లుడు సానా బాదపడ్డడులేవే. తిను సిన్నాయినా” అని చేతిల పెట్టింది.

 

గర్వందుల సత్తెయ్య కుటుంబానికీ జిలుకర యెంకటయ్య కుటుంబానికీ మంచి బందం. అంటూ ముట్టూ ఏమీ వాళ్ల మధ్య లేదు. వెంకటయ్య తెలివి తేటలు, సెంద్రెయ్య తెగింపు అంటే గర్వందుల సత్తెయ్యకు,‌ సత్తెమ్మకు యిష్టం.

న్యాయం మాట్లాడే సెంద్రెయ్య అంటే సత్తెమ్మకు సానా యిష్టం.

సిన్నాయినా అని కడుపు నిండా పిలుస్తది.

మంచి కోడి కూరనో, యాటకూరనో వొండినప్పుడు మీ మామను పిలువని సత్తెయ్యకు చెప్తది. సెంద్రెయ్య యే రాత్తిరి వొచ్చినా ఒక లొట్టి కల్లు బోసి, నీసు కూరతో స్టీలు కంచంల బువ్వ పెడుతది.

 

చేతిల కటోర పట్టుకొని, ఒక్కో ముక్క నములుతూ ఏదో ఆలోచిస్తా వున్నాడు. బయట వీధుల్లో ఆడుకున్న కొడుకులు చిన్న పిల్లలిద్దరు అమ్మో ఆకలైతంది అనుకుంటా ఇంట్లకి ఉరుకొచ్చిండ్లు.

వాళ్లు కాళ్లు కడుక్కొని కూచున్నరు. రెండు కంచాలలో అన్నం పెట్టి, మాంసం ముక్కలు దండిగా పెట్టింది. చిన్నోడు నాకు ముడుసు బొక్క కావాలని మొహం మాడ్చిండు.

అప్పుడే వొచ్చిండు సత్తెయ్య. గోలెం కాడ కాళ్లు చేతులు కడుక్కుంటా “మావకు కూడా పెట్టు” అన్నడు.

ఆ మాటకు లోపల సంతోషించిన సెంద్రెయ్య “వొద్దయ్యా. మా బిడ్డ ఇప్పటికే సాపలు, యాట కూర పెట్టింది. అవి తిన్న” అన్నడు.

తువ్వాలతో తుడుసుకుంటా పీట మీద కూసున్నడు సత్తెయ్య.

కంచంలో అన్నం పెట్టుకొచ్చి ముందు పెట్టింది సత్తెమ్మ.

అన్నం తింటా ఏం సంగతి మామా. దొడ్డి కప్పినావంట గదా. రేపు ఓ పూట మా దొడ్డి కూడా కప్పాలే. వొత్తవానే అన్నడు సత్తెయ్య.

“వొత్తగనీ, ఇప్పటి దాకా యాడికి బోయినవు అయ్యా?” అని ఆరా తీసిండు.

“ఎవడో బొందిలోడట. వూళ్లెకు వొచ్చిండు. కుల పెద్దలను కలిసిండు. బాగోతాలు నేర్పుతా. సిన్నపిల్లలకు సదువు నేర్పుతా అంటండు. యెంకటయ్య మావ మాట్లాడుదాం రమ్మంటే పోయిన” కార్జం ముక్క నములుతూ సెప్పిండు.

చీకట్లో పిల్లి నెమ్మదిగా గోడ మీద నుండి సప్పుడు కాకుండా దునికింది.

నీసు వాసనకు అది మియామ్ అంటూ తోక లేపి సత్తెయ్య, ఆ ఇద్దరు పిల్లలను రాసుకుంటా తిరుగుతంది.

“ఈ పిల్లి పాడువడ. తినేటప్పుడే వొస్తది యాన్నుంచో” దాన్ని ఎల్లగొట్టాలని చూసింది సత్తెమ్మ. కానీ అది పోవడం లేదు.

“బాగోతాలు వేయడానికి సిందోళ్లు లేరా అల్లుడా. ఈయన కతేంది మధ్యలో?” అని తువ్వాల సేతిలోకి తీసుకున్నడు సెంద్రెయ్య.

“ఆ ముచ్చట కూడా వొచ్చింది. దర్దేపల్లి నుండి వొచ్చి సిందోళ్లు పోయినేడు పది రోజులు ఆట ఆడిండ్లు. కానీ ఈ బొందిలాయన ఆట నేర్పుతా అంటండు. సిందోడు నేర్పడు గదా. పైగా పొల్లగాళ్లకు బడి నేర్పుతా అంటండు. అందుకే సరే అన్నం. పది బస్తాల వొడ్లు. ఖర్చులకు మూడు వేలు. బడి సెప్పినందుకు పిల్లగాళ్ల తల్లిదండ్రులు నెలకు యాభై రూపాయలు ఇవ్వాలె” అని చెప్తూనే కంచం ముందు నుండి లేచి చెయ్యి కడుక్కున్నడు. తువ్వాలతో చెయ్య, మూతి తుడుచుకున్నడు.

“ఏం అటో ఏందో అయ్యా. ఇగ బోతా. పొద్దుగాల మీ దొడ్డి కాడికి వొత్త. అది తొందరగా కప్పి బాయి కాడికి పోతా. రేపు మంచి రోజు. బాయిల పూడిక తియ్యాలె. మా యెంకటయ్యకు వూరి రాజకీయమే సరిపోతంది. సరే. సత్తెవ్వా. సల్లగుండు బిడ్డా. ఇగ పోతన్నా” అని చీకట్లోకి  నడిచిండు.

కరెంటు స్తంభాలకు ఉన్న లైట్లు ఎలుగుత లేవు.

 

తెల్లారక ముందే లేచి బాయికాడికి పోయిండు. తమ్ముడు సోమయ్యకు బాయిలోని పూడిక తీయడానికి పెరుకోళ్ల బాయి కాడ  గడ్డ పార వుంది అడుక్కరమ్మని చెప్పిండు.

సోమయ్య దాన్ని తీసుకొచ్చిండు. ఇద్దరు కలిసి బాయిలోని పూడికను తీసిండ్లు.

సెంద్రెయ్య బాయిలోకి దిగిండు. తను పూడికను తవ్వి చిన్న బొక్కెనలోకి ఎత్తగానే సోమయ్య దాన్ని మోట గిరిక మీద గుంజి ఆ పక్కనే ఎత్తి పోస్తున్నాడు.

సెంద్రెయ్య పూడిక తీస్తూ బాగోతం ఆడాలని ఆలోచిస్తున్నాడు.

ఏ ఆట ఆడితే బావుంటది? సింధోళ్లు అంతకుముందు ఆడిన ఆటలు యాది చేసుకుంటా పని చేస్తూ వున్నాడు.

 

ఇంటి ఆడోళ్లు గంపల సద్ది ఎత్తుకొచ్చిండ్లు. పని ఆపి, యింత తిన్నరు.

నేను సత్తెయ్య బాయి కాడికి పోయి వొత్తా. మీరు కానియ్యిండ్లు అని నెత్తికి తువ్వాల చుట్టుకుని బయల్దేరిండు.

సత్తెయ్య దొడ్డికి కొత్త కప్పు వేసే పని అయిపోయే సరికి చీకటి పడ్డది.

 

యింటికి పొయి ఏదో యింత తిన్నడు.

దబదబా యింట్లోంచి బయల్దేరి, బొందిలాయన బాగోతం నేర్పే కాడికి పోయిండు.

 

ఒక కుర్చీ మీద కాలు మీద కాలేసుకొని కూసున్నడు బొందిలాయన.

అప్పటికే పదిహేను ఇరవై మంది వొచ్చి కూసున్నరు.

సెంద్రెయ్య కూడా ఒక పక్కన కూసున్నడు.

బొందిలాయన అటూ యిటూ సూసి కళ్లు మూసుకున్నడు.

దీపం వెలుగుల అతని మొహం తెల్లగా విరగబూత్తంది.

అర నిమిషం తరువాత కళ్లు తెరిచిండు. ఇంకెవ్వరైనా వస్తరా? మొదలు పెడుదామా అన్నడాయన.

మొదలు పెట్టండి గురువా అన్నాడొకరు.

ఇప్పటికే చానా యాళ్లయింది. తెల్లారక ముందే లేసి సెలుక కాడికి ఉరుకాలె అని మరొకరు అన్నాడు.

అప్పుడు బొందిలాయన లేచి నిలవడ్డడు. గాలి ఎద నిండా తీసుకున్నడు.

“నేను ఇప్పటి నుండి మీకు గురువుని. నా పేరు రామయ్య. ముందు మీరంతా నా కాళ్లకు దండం పెట్టాలె. గురువుకు అట్టా దండం పెట్టడం సంప్రదాయం. మన ఆచారాలు, సంప్రదాయాలు చాలా గొప్పవి. వాటిని కాపాడుకోవడానికే బాగోతాలు. రామాయణము, మహాభారతము, ఇంకా పురాణాలు అన్నీ సాలా గొప్పవి. వాటి ప్రకారం మనం బతుకాలె. బాగోతం ఉత్తగా ఎగిరి దునుకడానికో లేక పాటలు పాడి సొల్లు కార్చడానికో కాదు. ముందు మీరు ఈ సత్యం ఒంట పట్టించుకోవాలె” అని అందరినీ ఒకసారి చూసిండు.

చీకట్లో వాళ్ల మొహాలు సరిగా కనపడుతలేవు. కానీ వాళ్లంతా శ్రద్ధగా వింటున్నారని తనకు అర్థం అయ్యింది.

రండి కాళ్లకు నమస్కరించండి అన్నాడు.

ఒక్కరొక్కరు లేచి ఆయన కాళ్లకు దండం పెట్టుకున్నారు.

సెంద్రెయ్య లేవలే. ఏర్పుల రామసెంద్రు కూడా.

ఆ యిద్దరినీ చూసిన గురువు వొచ్చి ఆశీర్వాదం తీసుకొమ్మన్నడు.

“నేను ఎవ్వని కాళ్లు మొక్కను. నువ్వు నిజంగానే మంచి గురువ్వని నాకు నమ్మకం కుదిరితే, అప్పుడు సూత్తలే” అన్నడు సెంద్రెయ్య.

నాదీ అదే ఆలోచన అని అట్లాగే కూసున్నడు ఏర్పుల రాంచంద్రం కూడా.

ఆ గురువుకు ఆ మాటల వెటకారం అర్థమైంది. కానీ తమాయించుకున్నాడు.

 

“మీకు కత బాగా మనసుకెక్కితేనే, బాగోతం బాగా ఆడుతరు. మీకు కిరాతార్జునీయం కత ఎరుకేనా?” గురువు ప్రశ్నించిండు.

తెలిసీ తెలువనట్టుగా అంతా తలలూపిండ్లు.

“అయితే యినండి. మహాభారతం ధర్మాన్ని కాపాడటానికి చెప్పిన కత. పాండవులు, కౌరవులది పాలిపగలని పామరులు అనుకుంటరు. కానీ అది నిజం కాదు. ఆ ఇద్దరు రెండు విషయాలకు ప్రతీకలు. ధర్మానికి పాండవులు. అధర్మానికి కౌరవులు. ధర్మానికి అధర్మానికి జరిగిన మహా సంగ్రామమే మహాభారతం” అని బొందిలి రామయ్య పంతులు గాఢంగా గాల్చి పీల్చుకున్నాడు‌.

అందరూ ఉద్వేగంతో వింటున్నారు.

“మరి కిరాతుడెవడు? అతడు ఎటువైపు?” అని సెంద్రెయ్య నెమ్మదిగా ప్రశ్నించిండు.

“ఆడికే వస్తున్నా. కిరాతుడు ఏకలవ్యుడు. ధర్మానికి విరుద్దంగా విలు విద్య నేర్చుకోవాలని ఆశ పడ్డడు. పాండవులకు, కౌరవులకు గురువైన ద్రోణాచార్యుని ఎదుట నిలబడి క్షత్రియ విద్యలు నేర్పమని ప్రాధేయపడ్డాడు. నీచ కులస్తుడైన ఏకలవ్యుడు అలా అడగటం తప్పా? కాదా? క్షాత్ర విద్యలను క్షత్రియులకు మాత్రమే నేర్పాలి. నీచకుల సంజాతుడైన ఏకలవ్యునికి ఎవరైనా ఎలా నేర్పుతారు?

తన కులం కారణంగా తనకు ద్రోణుడు విద్య నేర్ప లేదనే కోపంతో ఏకలవ్యుడు దట్టమైన అడవిలో సాధన చేసిండు. ద్రోణాచార్యుని బొమ్మ పెట్టుకొని.

ఒకనాడు వేటకు వెళ్లిన పాండవుల కుక్క నోటిలోకి శబ్దభేరీ విద్యను ఉపయోగించి బాణాలు కొట్టాడు కిరాతుడు. అది చూసి అర్జునుడు ఆశ్చర్య పోయాడు. బాణాలు వొచ్చిన దిశగా ద్రోణుడు, అర్జునుడు నడుచుకుంటూ పోయారు. ఒకచోట కిరాతుడు కళ్లకు గంతలు కట్టుకుని విలువిద్య సాధన చేస్తున్నాడు. అది చూసి ద్రోణుడు భయపడ్డాడు. ఒక నీచ కులజుడు విద్యను సాధన చేయడమే కాదు. అందులో ప్రవీణుడయ్యాడంటే వర్ణ ధరానికి ప్రమాదం వుందని ద్రోణుడు భయపడ్డాడు. ఎవరి కుల వృత్తి ప్రకారం వాళ్లు బతకాలి. అదీ ధర్మం అంటే. కానీ ఎలాగైనా సరే క్షత్రియుల కన్న గొప్ప వాణ్ణి కావాలనే పగతో ఏకలవ్యుడు విలువిద్యను, ఇతర క్షత్రియ విద్యలను నేర్చుకున్నాడు. అతడు పాండవులను, కౌరవులను ఇద్దరినీ జయించగలిగే మహాశక్తి ని పొందితే, జరుగబోయే ముప్పు ను పసిగట్టే ఏకలవ్యుని బొటన వేలును దక్షిణగా అడిగాడు.

ఏకలవ్యుడు గురువుకు తన బొటన వేలును అర్పించాడు. కానీ ద్రోణుడు తనను మోసం చేశాడని పొరపాటు గా అర్థం చేసుకున్నాడు ఏకలవ్యుడు. పగ పెంచుకున్నాడు. బొటన వేలు లేకుండానే తను యింకా కఠోర సాధన చేసిండు.

 

అరణ్యంలో అజ్ఞాత వాసం చేస్తున్న పాండవులలో మధ్యముడైన అర్జునుడు ఒక రోజు అడవిలో చీకటిలో ప్రయాణిస్తున్నాడు. ఏదో జంతువో లేదా తనను చంపడానికి వొచ్చిన శత్రువో అనే అనుమానం వచ్చింది ఏకలవ్యునికి. అర్జునిని వెంబడించి, యుద్ధానికి దిగాడు. యిక అర్జునుడు అని తెలిశాక మరీ రెచ్చిపోయాడు. అలా ఆ యిద్దరి మధ్య జరిగిన కతే కిరాతార్జునీయం ఇతివృత్తం. ఆ కతనే మీరు ఆడబోతున్నారు” అని కుర్చీలో కూలబడ్డాడు.

 

అంతా నోళ్లు తెరిచి విన్నారు.

చీకటిలో అప్పటి దాకా రొదపెడుతున్న పురుగులు కూడా మౌనం దాల్చాయి.

సెంద్రెయ్యలో చానా సందేహాలు ఉన్నాయి. అవి అడగాలని ఒకటే ఉరుకులుగా వుంది.

“బాగా చెప్పినవు గురువా. అయ్యా రామయ్య గారు. మీ లెక్క ప్రకారం కిరాతుడు అంటే ఏకలవ్యుడు అధర్మానికి ఒడిగట్టాడు. అంతే కదా?” అని జర గుర్రుగా అడిగిండు సెంద్రెయ్య.

ఆ మాటకు అందరూ గురువు ఏం సెప్తడా అని చూస్తున్నరు.

“రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని ఎన్కటికి నీలాంటోడే అడిగిండట” అని కళ్లు ఎర్ర చేసిండు గురువు రామయ్య.

 

“అయ్యా తప్పుగా అనుకోవద్దు. మీరు బొందిలోళ్లు గదా. మీరు భారతంలో చెప్పినది ధర్మమే అంటరా?” సెంద్రెయ్య ప్రశ్నను చాలా తేలికగా తీసుకున్నడు గురువు.

“అవును” అని బదులిచ్చిండు.

“అట్టా అన్నందుకు సిగ్గయిత లేదా నీకు? అదే ధర్మమైతే ఏ విద్య నేర్చుకోవడానికి, నేర్పడానికీ నీకు అధికారం లేదు. నువ్వు కూడా నీచ కుల సంజాతుడవే. మేమూ కూడా. మరి మాకెట్లా నేర్పుతున్నవు? మాకు గ్నానం వొద్దన్న కతను మాతో ఆడిత్తావా? నిన్ను నువ్వు మోసం చేసుకునేదిగాక మమ్మల్ని కూడా మోసం చేత్తవా? నువ్వు చెప్పిన ధర్మం లెక్కన మా వూరిలో ని ప్రతి కులం వాళ్లు సదువుకోవద్దు. యిట్లా రెక్కల కష్టం చేస్తా, మా తలరాత యింతే అనుకుంటా బతకాలే. అంతేకదా?” తన మాటలు ఆపి అందరి మొహాలూ చూశాడు.

తన మాటలో న్యాయం వుందని అందరి ముఖాలు చెప్తున్నాయి.

 

“ఇగో సూడు పంతులు. ఈ కిరాతార్జునీయం కాదుగాని, ఇంకేదన్నా నీతి కథ వుంటే అది నేర్పు. లేకపోతే ఈ వూళ్లో నువ్వు ఈ ఆటను ఎట్లా ఆడిత్తావో, వూరు దాటి ఎట్లా పోతావో నేనూ సూత్తా” అని లేచి నిలబడ్డాడు సెంద్రెయ్య. ఏర్పుల రాంచంద్రం కూడా లేచి నిలబడ్డడు.

“ఇగో పంతులు. నువ్వు నేర్పే కతలన్నీ మాకు తెలుసు. మా సిందోళ్లు ఆడిన ఆటలే అవన్నీ. నిన్ను ఎందుకు ఒప్పుకున్నాం అంటే మా పొల్లగాండ్లకు సదువు నేర్పుతా అన్నావని. ఇంకేదన్నా కత నేర్పు” అన్నాడు తను.

నిజమే గురువా అని వొకరు. అంతా గలాటలా అయిపోయింది.

ఎవరేమి మాట్లాడుతున్నారో తెల్వని పరిస్థితి.

ఆ సప్పుడుకు గుడ్లగూబ సెట్టు మీది నుండి అరవడం మొదలు పెట్టింది.

వాళ్లలో కొంతమంది సెంద్రెయ్యది తప్పు అన్నారు. ఆట నేర్పుతా అంటే మధ్యల సెంద్రెయ్య వితండం ఏందని వాదులాటకు దిగిండ్లు.

కానీ ఎక్కువ మంది సెంద్రెయ్య ఆలోచన సరైంది అన్నారు.

దాంతో రామయ్య పంతులు సారంగధర, అల్లి రాణి కథలు నేర్పుతా అన్నాడు. కానీ సెంద్రెయ్య మాటలు తనను అవమానించాయని లోలోపల రగిలిపోతున్నడు.

ఎట్లా అయినా సరే సెంద్రెయ్యకు మంచి వేషం ఇవ్వొద్దని అనుకున్నాడు.

తనను అపహాస్యం చేసేలా బందర్ మియా వేషం ఇచ్చాడు.

 

పగలంతా బాయిలోని పూడిక తీసే పనితో కష్టం చేస్తున్నడు. రాత్రంతా సారంగధర బాగోతం నేర్చుకుంటున్నాడు. బందర్మియా వేషంతో ప్రజలను మెప్పించాలని కష్టపడుతున్నాడు.

 

ఊరంతా సారంగధర ఆట గురించి బాగా మాట్లాడుకుంటండ్లు. ఆట చూడాలని ఆత్ర పడుతండ్లు.

ఒకరోజు వెన్నెల రాత్రి దొరగడీల సారంగధర బాగోతం ఆడిండ్లు.

“మేరే నామ్ తురుకోంటి

ఇదివరిదాక యింట్ల పంటి” అని నెత్తి మీద ఒక టోపీ. దానికి అటూయిటూ వూగే ఒక గిలక. ఆ వేషం చూడగానే అందరూ పగలబడి నవ్వుతున్నరు. తానే కతలోని పాత్రలను రంగస్థలం మీదికి పిలుస్తండు. కరుణరసం దండిగా వున్న కత అది.

మారుతల్లి తనతో సంబంధం పెట్టుకోమని ఒత్తిడి చేస్తే, ఆ పనికి నిరాకరించిన సారంగధరుణ్ని చంపించాలని కుట్ర చేసింది. కన్నతండ్రికి తన మీద ఫిర్యాదు చేసి, కళ్లు పొడిపించింది.

ఈ కత పూర్తిగా కన్నీళ్ళు పెట్టిస్తది. అలాంటి సన్నివేశాలలో సెంద్రెయ్య మాటలు నవ్వులతో పాటు, కన్నీళ్ళు కూడా పెట్టించాయి.

ఆటలో ప్రతిఒక్కరూ బాగా నటించిండ్లు. పక్క ఊరి నుండి లాంతర్లు పెద్దవి తెప్పించి మరీ పెట్టించారు.

ఆ ఆట చూసిన సెంద్రెయ్య కుటుంబ సభ్యులు బాగా సంబురపడ్డరు.

గౌండ్లోళ్ల సత్తయ్య, సత్తెమ్మ ఇద్దరు సెంద్రెయ్యను బాగా మెచ్చుకున్నరు.

ఎప్పుడూ నువ్వు కోపంగా వుండటమే చూసినం. ఇంతగనం నవ్విస్తవని తెల్వదే అని మెచ్చుకున్నది సత్తెమ్మ.

 

మళ్లో పదిహేను రోజులకు అల్లీరాణి ఆట ఆడిండ్లు. ఈసారి కూడా సెంద్రెయ్య బందర్మియా వేషంతో అందరినీ బాగా నవ్వించిండు.

రామయ్య పంతులుకు సెంద్రెయ్య నచ్చకపోయినా, సందర్భానుసారం జోకులు వేస్తూ, కతను ముందుకు నడుపుతున్న సెంద్రెయ్య తెలివి తేటలకు తను ముచ్చట పడ్డాడు.

అల్లీరాణి ఆటకు ఊరంతా నిద్ర మరిచి పోయింది.

మంచి ఆటలు నేర్పినందుకు ఊరి పెద్దలు పంతులును మెచ్చుకున్నారు.

కానీ సెంద్రెయ్యకు రామయ్య పంతులు అందరిలో చొప్పించాలని చూస్తున్న విలువల పట్ల అంగీకారం లేదు.

 

బొందిలి పంతులును ఒకరాత్రి అడిగిండు.

“నాకు కావాలనే బందర్మియా వేషం ఇచ్చినవు కదా. ఎందుకు? సగం తెలుగు సగం తుర్కం మాట్లాడేలా ఆ వేషం ఎందుకు తయారు చేసిండ్లు? సారంగధర, అల్లీరాణి కతలు ఏ కాలంలో జరిగినయి? తుర్కోళ్లు ఎప్పుడు ఒచ్చిండ్లు? మధ్యల తుర్కోళ్లను ఎందుకు ఎక్కిరిత్తండ్లు” అని అడిగిండు.

చాలాసేపు మౌనం వహించాడు పంతులు.

ఆఖరికి “ఎవరి అర్హతనుబట్టి వాళ్లకు వేషం దొరుకతది. అది ఆ భగవంతుని యిచ్ఛ” అని ఆణ్ణుంచి ఎళ్లిపోయిండు.

 

సెంద్రెయ్యకు అర్హత అనే మాట ఏకలవ్యుని కతలోని మాటలాగే వినపడ్డది.

బొందిలి పంతులు తనకు ద్రోణాచార్యుడు లాగా కనిపించాడు.

ఆ రాత్రి చీకట్లో మంచం మీద పడుకొని ఆకాశం కేలి చూసిండు.

కొన్ని తారలు రాలిపోవడం చూస్తున్నాడు. అవి కోట్లాది మంది ఏకలవ్యుల బొటన వేళ్లని అనిపించింది. తన మనసంతా భారంగా మారిపోయింది. ఆ రాత్రి నిద్రపోలేదు తను.

 

బాయిలో పూడికతో పాటు, ఇంకో కోల లోతు కసిగా తొవ్విండు సెంద్రెయ్య.

గాలిలో సల్లదనం పెరిగింది.

నేల తడిసిన వాసనను గాలి మోసుకొచ్చింది.

వానలు వరుసగా మూడు రోజులు పడ్డయి.

మల్లంపల్లి లో యగుసాయం పనులు జోరుగా సాగుతున్నాయి.

సెంద్రెయ్య, అన్నాదమ్ములతో కలిసి ఇరవై ఎకరాలు దున్నిండు.

పెసళ్లు, జొన్నలు, రాగులు, సజ్జలు, నువ్వులు, వరి పెట్టిండ్లు.

మరో వారంలో అవి మొలుకెత్తాయి.

అవి భవిష్యత్తు లాగా కనిపిస్తున్నయి.

వాటికి ఏ పురుగూ పట్టకుండా చూడాలని గట్టిగా మనసులో అనుకున్నాడు సెంద్రెయ్య.

 

వానకు తడిసిన ఇసుకలో బొందిలి పంతులు బడి మొదలుపెట్టిండు.

సెంద్రెయ్య కొడుకు, యెంకటయ్య కొడుకు, సోమయ్య కొడుకులు ఆ పంతులు కాడ చేర్పించిండ్లు.

కోతి సోమయ్య కొడుకు, గర్వందుల సత్తెయ్య కొడుకులు అంతా కలిసి ఇరవై మంది బుడుతలు చేరిండ్లు. తమ పిల్లలు బాగా చదివి బాగుపడుతరని వాళ్లను కన్న వాళ్ల ఆశ.

 

ఎస్సీ కాలనీ పక్కనే కట్టిన కొత్త బడి బిల్డింగ్ ఖాళీగా వుంటంది.

మాటి మాటికీ తాలూఖా అధికారులు బడి పంతుళ్లని తబాజలా చేస్తండ్లని  ఎవరూ సదువు చెప్పడానికి రావడం లేదు.

అందుకే బొందిలి పంతులును ఆ బిల్డింగులోనే సదువు సెప్పమని పెద్ద మనుషులు చెప్పిండ్లు.

ఆ ఖాళీ బిల్డింగ్ లోకి సోమవారం పొద్దున్నే పిల్లలంతా శుభ్రంగా తలంటుకొని, కొత్తబట్టలు వేసుకొని వొచ్చిండ్లు.

 

బొందిలి పంతులు తన సందుక నుంచి పెద్ద కొరడానొక దాన్ని బయిటికి తీసి చేతిలో పట్టుకున్నాడు.

పిల్లలందరినీ బయిటికి పిలిపించి వరుసగా నిలబెట్టిండు. చేతులు జోడించి కళ్లు మూయమని చెప్పిండు. వాళ్లు అట్లనే చేసిండ్లు.

సరస్వతీ నమస్తుభ్యే శ్లోకం తను చెప్తూ, పిల్లల చేత అనిపించాడు.

ఆ పెద్దపెద్ద మాటలు నోరుతిరక్క ఏవో గునిగిన పిల్లలను బొందిలి రామయ్య పంతులు గమనించిండు.

కింద ఇసుకలో కూర్చొమ్మని చెప్పిండు.

వాళ్ల ముందు ఇసుకలో ఓం అని తన చేతిలోని కర్రతో రాసిండు.

పిల్లలంతా తమ చూపుడు వేలుతో ఓం అంటూ ఏదో అటూయిటూ గెలికారు.

అది బొందిలి రామయ్య పంతులుకు చికాకు పెట్టింది.

పిల్లలకు కొరడాతో ఒకటి తగిలిస్తే తప్పా చదువురాదని అతని బలమైన నమ్మకం.

పిల్లలను వరుసగా నిలబడమని చెప్పిండు.

కొరడాతో ఒక్క దెబ్బ వేసిండు. అది ఒకేసారి పది మంది పిల్లల వీపులను చిట్లిపోయేలా చేసింది.

తెల్లని వాళ్ల అంగీలు ఎర్రని నెత్తురుతో తడిసిపోయాయి.

పిల్లలు పెడబొబ్బలు పెట్టిండ్లు.

ఏడుస్తూ ఎవరి యింటికి వాళ్లు ఉరికిండ్లు.

 

రక్తం కారుతున్న తన పిల్లల ఒళ్లు చూసి ఊగిపోయిండు సెంద్రెయ్య.

దొరికిన వెదురు ముల్లుగట్టెను సేతిలోకి తీసుకొని బడి కాడికి ఉరుకొచ్చిండు.

అప్పటికే కోతి సోమయ్య బొందిలి రామయ్య పంతులును అమ్మనాబూతులు తిడుతున్నాడు. తన కొడుకు తొడ చిట్లిపోయి రక్తం కారుతంది.

బైండ్ల సెంద్రెయ్య ఆడికి చేరుకొనే సరికి పంతులు అందరి మధ్య మౌనంగా  నిలబడి వున్నడు.

ద్రోణాచార్యుడు తన ఆయుధాలతో నిలబడి, ఏకలవ్యుని పిల్లలను దండిస్తున్నట్టు కనిపిస్తండు తనకు.

ఆకాశంలో రాలిపడుతున్న తారలు తనకు రాత్రి పూట ఎందుకు కనపడుతున్నాయో అర్థమైంది.

ద్రోణాచార్యున్ని చూసి సెంద్రెయ్య ఊగిపోతూ చేతిలో వున్న ముల్లుగట్టెతో నాలుగు అంటిచ్చిండు.

ఆ దెబ్బలకు ద్రోణాచార్యుడు కళ్లు తేలేసిండు.

నన్ను చంపొద్దని చేతులు జోడింవి దీనంగా వేడుకున్నడు.

నువ్వు నీ సదువు వొద్దు. పిలగాళ్ల కొట్టి బడి అంటే భయపడేలా చేసినవు. వూరిడిచి పోవాలే నువ్వు రేపటి కల్లా అని సెంద్రెయ్య హెచ్చరిచ్చిండు.

గుమిగూడిన అందరూ అదే మాట అన్నరు. అయ్యో కొట్టకపోతే సదువు వొత్తదా అని కొంతమంది దీర్ఘాలు తీసిండ్లు.

కొడుకు అంగీ యిప్పి పగిలిన తోలు సూపిస్తా శాపనార్థాలు పెట్టింది సత్తెమ్మ.

ఆమెకేదో సర్ది చెప్పబోయిండ్లు కొంతమంది.

“వాని కత మీకు తెల్వదు. వాడు ద్రోణుడు. మన బొటనవేళ్లను కోసుకు పోను వొచ్చిండు. మీకు దెల్వకపోతే గుద్దమూసుకొని పోండ్లి” అని వాళ్ల మీదికి ఎగిరిండు.

ఎవరితోనైనా పెట్టుకుంటరు గానీ బైండ్ల  సెంద్రెయ్యతో పెట్టుకోరు.

తెల్లారే సరికి బొందిలి రామయ్య పంతులు వూల్లే లేడు. మల్లా ఏ వూరుకు బోయిండో తెల్వదు.

 

ఊరి సర్పంచి యింటి ముందు నిలబడి బడి సంగతి ఏందని నిలదీసిండు సెంద్రెయ్య.

అందరూ వస్తే కొడకండ్ల తాలూఖా ఆఫీసరును కలిసి మాట్లాడుదాం అని అన్నడు సర్పంచి.

ఇంటికొచ్చి తమ్ముడు యెంకటయ్యకు గట్టిగానే సెప్పిండు. “ఏం రాజకీయంరా నీది యెంకటయ్య. మీరంతా పెద్దమనుషులు మల్లా. వూల్లే బడి బందయి యాడాది అయితంది. తాలూకా ఆఫీసుల ఎవ్వని యిష్టం వానిదేనా? మాటి మాటికి పంతుళ్లను తబాజల చేస్తే అడిగేటోడు లేడా? నువ్వేం చేస్తవో తెలువది. పెద్ద మనుషులంతా పొయి మాట్లాడుండ్లి. లేదంటే నేనే పొయి మాట్లాడుతా” అన్నడు.

ఆ మాటలకు అర్థం తెలుసు యెంకటయ్యకు. “ఆగరాదే నువ్వు. మాకు దెల్వదా. ఆ బొందిలి పంతులును కొడితే వాడు కచ్చీరుదాకా పాయే. ఆ అమీను సాబుతో మాట్లాడ్డానికి ఎంత కష్టం అయ్యిందో నీకేం ఎర్క” అని కోపం చేసిండు యెంకటయ్య.

ఆ మర్నాడు తమ్ముడు యెంకటయ్య వూరి సర్పంచినీ, మిగతా పెద్ద మనుషులను యెంటేసుకొని కొడకండ్ల పోయిండ్లు. తహిశీల్దారుతో మాట్లాడి, ఇద్దరు పంతుళ్లను మల్లంపల్లి బడికి యేయించుకున్నరు.

పదిహేను రోజులకు సర్కారు బడి తెరిసిండ్లు.

వూరిలోని పిల్లలంతా బల్లె చేరిండ్లు. సెంద్రెయ్య తన కొడుకును, తమ్ముళ్ల కొడుకులను దగ్గరుండి మరీ బల్లె చేర్పించిండు.

ద్రోణాచార్యుడు సర్కారు పంతుల వేషంలో వొచ్చిండా అని ఒక కన్నేసి వుంచుతూనే వున్నడు.

*

జిలుకర శ్రీనివాస్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జిలుకర శ్రీనివాస్ కు నమస్కారములు.
    మా చిన్ననాటి జ్ఞాపకాలను ,
    మా సోపతి గాండ్ల ను, జ్ఞాపకం చేసిన కథ.
    పల్లె వాతావరణాన్ని జ్ఞాపకం చేసిన విధానం చాలా బాగుంది .
    అన్న ఇంకా మీరు రాయాలని ఆశిస్తూ ….
    మీ
    భూరెడ్డి రామకృష్ణారెడ్డి.

    • Dear Jilukara Srinivas, కథ మొదట్లో వాతావరణం చిత్రణ వాస్తవికంగా, దళిత సంస్కృతిని ప్రతిఫలించేలా ఉంది. రెండవ దశలో మనం విద్యాలయాల్లో బోధిస్తున్న పాఠాల్లోని భావజాలాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. మూడవ దశలో దళిత, పేద వర్గాలకు చదువు చెప్తున్నట్లే కనిపిస్తున్నా, వాళ్ళని భయకంపితులను చేసి, వాళ్ళకు వాళ్ళే చదువులకు స్వస్తి చెప్పే కుట్రలను చక్కగా స్ఫురింపజేస్తూ, తల్లి తండ్రులు తమ పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరాన్ని తెలుపుతుంది. తెలంగాణ దళితులు సజీవ చిత్రాలను ఈ కథలో చూడొచ్చు. అభినందనలు డియర్ డాక్టర్ జిలుకర శ్రీనివాస్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు