పల్లపు స్వాతి ఊరు ముకుందాపురం. తెలంగాణలోని ఒక చిన్న గ్రామం. తండ్రి బాల్యంలోనే మరణించారు. ముగ్గురాడ పిల్లలను తల్లి తన రెక్కల కష్టం ద్వారా పెంచి పెద్ద చేసింది. ఆధునిక సమాజంలో పిల్లలను పెంచడం ఒకానొక అభ్యాసం. స్వాతి వీటన్నిటి మధ్య పెరిగింది. తండ్రి లేని కాలాన్ని, తల్లి పూరిస్తున్న జీవనయానం మధ్యలో పల్లపు స్వాతి ప్రయాణం కొనసాగింది. చైతన్యవంతమైన తెలంగాణ గ్రామీణ సంబంధాలలోని అనేక అణిచివేతలను చూసింది. ఘర్షణల మధ్య, ఆందోళన మధ్య జీవితం ఎలా విప్పా రుతుందో తన అనుభవం నుండి అంచనా వేసింది. ఈ గమనింపు ప్రశ్నగా మిగిల్చినది.
స్వాతి సమాజ పరిశీలనలో తనని తాను వెతుక్కున్నారు. తానెటు నిలబడాలో అవగాహన చేసుకున్నారు. తన అవగాహనలో సామాజిక స్వరూపాన్ని అర్థం చేసుకున్నారు. చాలా చిన్న వయసులోనే విప్లవ రచయితల సంఘంలో సభ్యురాలుగా మొదలైనారు. తన అస్తిత్వాలు అనేకం. భిన్న అస్తిత్వాల నుండి వాస్తవిక జీవన గమనం. వ్యవసాయ కుటుంబంలోని నెమ్మది మనస్తత్వం.మానవ సంబంధాల మధ్య జీవితం, సంఘము తన చుట్టూ ఉన్న సామాజికావరణలోని పరిశీలనలు ఆమె సృజనాత్మక గవాక్షం. ప్రధానంగా తెలంగాణ అస్తిత్వ మూలాల నుండి సాహిత్య క్రమాన్ని వెతికారు. సాకారమైన తెలంగాణ స్వప్నం చిన్నదేమీ కాదు. మన ముందటి పోరాట చరిత్ర. స్వాతి ఈ ఉద్యమాల ప్రభావాల నుండి వికసించారు.ఇక్కడ వికసించడం అంటే తనని తాను అన్వేషించుకోవడమే.
మానవీయత నుండి మనిషి వేరవుతున్న కాలం. మరోవైపు ఉద్యమాల తీవ్రత కొనసాగుతున్నదశ . పల్లపు స్వాతి వీటన్నిటిని నిశితంగా గమనిస్తూ వచ్చారు .జీవితంలో అనేక అవకాశాలు, సుఖ లాలసులు ఉంటాయి.. జీవితం రంగుల ప్రపంచం. వెలుపుల అనేక చీకట్ల ద్వంద నీతి, ద్వందత్వం ఇమిడి ఉన్నది. ఘర్షణలు, వైరుధ్యాలు, క్లేశాలు మనుషుల అంతరంగంలోకి దారి చేసుకుంటాయి.వాటిని ఎలా స్వీకరిస్తున్నామనేది ప్రధానమైన అంశం. వాటి నుండి ఎలా దారి చేసుకుంటున్నాము . ఇది సమాజం ,సాహిత్యం అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నలు ఇవాల్టివి కావు. ఈ ప్రశ్నల దొంతర సాహిత్యంలో అనేక అస్తిత్వాల ఎరుక నుండి వికసిస్తున్న క్రమంలో మరిన్ని ప్రశ్నలకు ఒక దారి. పల్లపు స్వాతి బహుళ అస్తిత్వాల సమ్మిళితం. జెండర్, కులం, వర్గం వీటన్నిటి మధ్య తన దృక్పథం. వ్యక్తిగత స్థాయిలో సరి చేయలేని అంశాలను సమూహంలో సరిదిద్దగలం. అందుకే విశాలమైన విప్లవోద్యమం ఒకదారి.ఒక జ్వాల నిత్యం రగులుకోవాలి. ఆజ్వాలను అస్తిత్వం దగ్గర నిలవరించ లేం .సమస్త ప్రపంచం విముక్తం కావడానికి వర్గ దృక్పథం ఒక గమనం .ఈ ప్రాపంచిక భావజాలం నుండి పల్లపు స్వాతి కవిత్వాన్ని అంచనా వేయాలి.
ఆమె సాహిత్య పరికరం కవిత్వం .నిజానికి విరసం వంటి రచయితల సంస్థల లోకి ఎక్కువ శాతం కవిత్వం ద్వారా వస్తారు. రచయితల సంఘంలో వారి ప్రయాణం తర్వాత అనేక ప్రక్రియలోకి తర్జుమా అవుతారు. కవిత్వం ఒకానొక రాజకీయ ప్రకటన. అనేక ధిక్కార స్వరాల కలయిక. ఏదైనా రచయితల సంఘంలో చేరాక ఈ ధిక్కారం రాజకీయ స్వభావ మౌతుంది. ఇది , విడ్డూరమూ కాదు. కవి, రచయిత తనదైన భావజాల ప్రకటనకు ప్రపంచం మరింత విశాలమై దారి చూపుతుంది. రాజకీయ, కళా, రచన, తాత్వికత మొదలవుతుంది. ఇదొక సృజనాత్మక గమనం. పల్లపు స్వాతి సాహిత్య రచన కవిత్వం నుండి ఆరంభమైంది.
పల్లపు స్వాతి కవిత్వ రచనా కాలంలో భయ వంచన నీడన ప్రపంచం మనుగడ సాగిస్తుంది. యుద్ధాల మధ్య ప్రపంచం ఉంది. భారతదేశం మినహాయింపు కాదు. ద్వేషభావం ,మానవ హననం సమాంతర రేఖలుగా ఉన్నాయి. అంచులలోకి నెట్టి వేయ బడిన పీడితుల అభద్రత వెంటాడుతుంది. తమ మాతృభూమి తమది కాకుండా పోతున్న కుట్ర ఏదో కొనసాగుతుంది.
కాగితంపై గాయపడ్డ/ అక్షరమిప్పుడు సాయుధమై/ యుద్ధ క్షేత్రానికి సాగిపోయింది/ వెలుగులీనే వెన్నెల్లా/ తుడుం మోతలు/ యుధ్ధగీతంలా ధిక్కారం ఆందోళన జీవుల వ్యక్తీకరణ. ఈవ్యక్తీకరణ హఠాత్తుగా తెలుగు సాహిత్య ప్రభావాలలో కలగలిసిన కాదు. యుద్ధము, కవిత్వం జమిలిగా ఈ ప్రపంచాన్ని వెంటాడాయి. యుద్ధం,విధ్వంసం,కవి త్వం ప్రజల కంఠస్వరం. ఈఎరుక పల్లపు స్వాతిది.అనేక యుధ్ధ అంచులలో నిలబడినప్పుడు, జీవితమే యుద్ధ క్షేత్ర మైనప్పుడు అక్షరం సాయుధమవుతుంది .ఈ సాయుధమనే మాట దగ్గర భధ్ర ప్రపంచపు ఆందోళన వుంది. ఇక్కడ బహుళ సమాజం కోసం ఆరాటపడే ఒక మార్గం అక్షరాల్ని సాయుధం చేయడం.
ఈదుఃఖ భరిత కాలాన్ని , కలల్ని ,చెదిరిన గూళ్ళను, కన్నీరింకిన మనుషుల్ని గుండెలకు హత్తుకోవాలి. కవిత్వంలో తాము ఏమి చెబుతున్నామనేది ప్రధానం. ఒక కాలాన్ని సంక్షుభిత ఆవరణలో చెప్పేటప్పుడు ఆ వస్తువుకు తగిన కవిత్వ తూకం సరిపోవాలి. కవిత రాయడం అనేది మాత్రమే కాదు. ఒక ఒంటరితనాన్ని, లేదా ఏకాకితనన్ని చెబుతున్నప్పుడు కవిత్వ వ్యక్తీకరణ కవిని బహిర్గతం చేస్తుంది .ఈవసంతానికి గాయపడటం/ కొత్తేమీ కాదు/ ఆకుల సవ్వడి సంగీత మంత సహజమది. పోరాటంలోని ఎగుడు దిగుడులను పకృతిలోని ప్రతీకలతో చెప్పడం విప్లవ కవిత్వంలో ఒక భాగం. వసంతానికి గాయాలు, గెలుపులు సహజం. ఈప్రయాణంలో మనుషులు అనేక ఊహలు, ఆలోచనలు చేయవచ్చు. సంగీత అలలా తిరిగి లేస్తుంది . నీచూపు /చిమ్మ చీకటిలో/ మెరిసే మిణుగురుల వెలుగు. స్వాతి ఈ కవిత్వ పరిభాష ఎక్కడి నుంచి స్వీకరించారు. తెలంగాణ జనజీవితంలో, భౌగోళికతలో ఈసౌందర్యవంతమైన భాష ఉంది. ఆభాషనే శక్తివంతంగా కవిత్వ వ్యక్తీకరణలో భాగం చేశారు. దీని వలన కవిత్వం మరింత పదునయింది . ఎవరు వాళ్ళు నిన్ను /నన్ను మనందరినీ బతికిస్తున్న చెట్లువాళ్లు/ వారి రెక్కల కష్టం తిని తెగబలిసింది దేశం. భూమికి బువ్వ పెట్టకుండా/ కంచంగా మార్చినోళ్ళు. ఈ దేశపు రైతు గురించి ఎందరు ఎన్ని అక్షరాలు రాసిన ఒక ఖాళీ ఉండనే ఉంది. గాయపడిన /పక్షి రాలి పడినప్పుడు/ నెట్టురోడుతున్న అడవంతా/ ఎడతెరిపి లేని వాన. బహుశా కొత్తగా కవిత్వం లోకి దారి చేసుకుంటున్నప్పుడు కవుల సామాజిక పరిశీలన గడ్డకడుతుంది .హృదయ రాపిడిలో ఆగడ్డ మంచులా కరుగుతుంది .అదే కవిత్వ రచన.
స్వాతిది సాధారణ అభినివేశం కాదు. కవిత్వంలోని గాఢతకు జీవితం పునాది అనే గ్రహింపు ఉంది. జీవితంలోని అనేక పొరలు ఏనాటికీ అంతం కావు . ప్రాంత, వర్గ, అస్తిత్వ భావజాలం కవిని తయారు చేస్తాయి. అంతరంగపు జ్వాల సామాజిక తలంపై నిగూఢంగా ఉంటుంది. లేకపోతే కవిగా మిగిలే అవకాశం లేదు. అనేక రంగాలలో తనదైన ప్రవేశాన్ని ఆమె సొంతం చేసుకుంది. అంతరంగంలో మనుషుల. విచ్చిన్నతకు రాజకీయ ,పాలనా వ్యవస్థలో ఉందనేది ఆమె అవగాహన. ఆమె కవిత్వం ద్వారా కొత్తదారులు వెతికారు. విప్లవ కవిత్వానికి సౌందర్యత ఎక్కడ నుండి వస్తుంది. రక్తపాతం ,హింస, సీతాకోకచిలుక సున్నితత్వం. నెలవంక చల్లదనం. ఈ ప్రతీకల ద్వారా విప్లవ కవిత మరింత జనాంతిక మౌతుంది. తన జీవన ఘర్షణ నుండి స్వాతి తనదైన సొంతముద్ర కలిగి ఉన్నారు.
విస్తృతమైన రాజకీయ అవగాహన ఉన్న కవి. సృజనాత్మక ప్రక్రియలో ఇంకా రాణించగలరని భవిష్యత్తు పట్ల ఒక చూపును ప్రసరించగలరని ఆమె ప్రయాణము- ఆమె రాజకీయాలు రూపు కడుతున్నాయి.
*
Add comment