కాళ్ళకూరి శైలజ కవితలు రెండు

ఏరువాక కవిత్వ శీర్షిక. ఈ శీర్షికకు రెండు కవితల చొప్పున పంపించండి.

అభివ్యక్తిలో తనదే అయిన దారి వెతుక్కుంటున్న శైలజ కాళ్లకూరి ఇప్పటికే పాఠకులకు తెలిసిన పేరు. కవిత్వంలోని చిక్కదనం తగ్గకుండా, భావాన్ని సూటిగా వ్యక్తం చేయడం శైలజ శైలి. జీవన సహజత్వమూ, అనుభూతి వైవిధ్యమూ ఆమె సొంతం. ఈ రెండు కవితలూ రెండు భిన్నమైన కాన్వాస్ ల మీద చిత్రించిన పెయింటింగులు. ప్రతి వాక్యం చివరికొచ్చేసరికి  మీ మనసులో ఒక బొమ్మ గూడు కట్టుకుంటుంది. 

*
తన కవిత్వ ప్రయాణం గురించి శైలజ మాటల్లో-
“పాఠ్యపుస్తకాల తో పాటు కవిత్వం చదువుకుని,విశ్లేషించుకోవడం అలవాటు.ఒక వాక్యం ఛందో వ్యాకరణ వర్ణనలతో  ప్రయోగించే ప్రక్రియ మాత్రమే కాదు. అది మనల్ని వెంటాడే తీరులో దాని విలువ ఉందని నమ్మకం.
మనిషి తోటి వారితో విభేదించడం సహజం.కానీ అది వేర్పాటు వాదమైతే జరిగేది యుద్ధం.ప్రకృతి లో భాగమైన మనిషి కృతకంగా మారుతున్న వైనం పట్ల బాధ. ఆధునికత పేరుతో సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే ఆసరాగా జీవిస్తూ అనుభూతిని వదులుకున్న కొత్త తరం గురించి ఆందోళన. ఈ నేపథ్యంలో కవిత్వం వ్రాస్తూనే,వివిధ దిన పత్రికల్లో,వెబ్ మాగజైన్స్లో ,’కవిత’ పుస్తకంలో కవితలు ప్రచురించబడ్డాయి. ‘కొంగలు గూటికి చేరిన వేళ” గా తొలి కవితా సంపుటి ‘ అనల్ప’ ప్రచురణ సంస్థ ద్వారా వచ్చింది. కవిత్వ మార్గంలో వాక్య నిర్మాణానికి సంబంధించి ఎందరో సహృదయుల సూచనలు ప్రోత్సాహం మరువలేనివి. మాయమౌతున్న మానవ సంబంధాలను కళ్ళకు కట్టి, ఆ మాధుర్యాన్ని అందించాలనే ఆకాంక్ష తో కవిత్వం వ్రాస్తున్నాను. “

1

నడిచే పుస్తకాలు

నడిచే రెండు పుస్తకాలతో కలిసి
నాలుగడుగులు వేసిన సాయంత్రం,
మాటలే కవితలై పొంగుతాయి.
చీకటి పేరుకున్న మనసు
హాయిగా ఎలా ఏడవాలో
స్థిరంగా ఎందుకు నవ్వాలో నేర్చుకుంటుంది.
ఏభై ఆరు బలపాలతో
ఏ పదాలు దిద్దుకోవాలో
ఏ వాక్యాలు దాచుకోవాలో
తెలిపే క్షణాలు ఒకేసారి విరబూస్తాయి.
సాటి మనిషిని మోసం చేసే
మేధో చౌర్యం బయటపడి,
ఆరాధించే వ్యక్తుల అహంకారం
ముసుగు తీసిన చిత్రమై ఎదురుపడుతుంది.
కష్టాలు, బాధలూ చుట్టుముట్టినా,
ఓటమి తుఫాను అస్తిత్వాన్ని కూల్చినా
నిప్పు రవ్వలై విరజిమ్మే
భయం లేని మాటల్ని
పరిచయం చేస్తుంది.
సూర్యుడు అస్తమిస్తుంటే
మరిన్ని కెరటాలై పొంగే సముద్రం లా
జీవితం కొత్త ఉత్సాహాన్ని అందిపుచ్చుకుంటుంది.
మంచి పుస్తకం లాంటి  మనుషుల్ని కలుసుకుంటే,
నాన్న కష్టంతో కొన్న  పుస్తకం తెరిచినప్పటి,
కొత్త పేజీల వాసన గుర్తుకొస్తుంది.
ముందు పేజీలో నా పేరు వ్రాసిన అమ్మ దస్తూరీలా
నిటారుగా నిలబడే బలం వస్తుంది.

2

వికల్పం

మూసిన తలుపుకు తగిలి
పిలుపు మూలుగుతూ కింద పడుతుంది.
ఏ ఇద్దరినీ కలపని బాట
విసుగ్గా ఎండిపోతుంది.
ఆశ్చర్యం, ఆనందం విడాకులు తీసుకున్నాయి.
ఒకే ప్రపంచంలో
నాదో లోకం నీదో లోకం.
అనుబంధం బంధనమై
మెడచుట్టూ బిగుసుకున్నట్టు
ఒకరికొకరు పరాయి.
పక్షుల సభ రోజూ వెక్కిరిస్తుంది
అవాస్తవ వాస్తవంలో పడి,
భ్రమించే మనిషి మీద
కవితల పోటీ జరుగుతున్నట్టుంది.
సంకేత భాషలో సంఖ్యలు
మాదకద్రవ్యాలై చుట్టుముడతాయి.
పేరుకే పగలూ, రాత్రీ
తప్పు చేయడానికి చీకటి పడక్కర్లేదు.
అన్ని ముఖాలూ ఒకేలా నవ్వుతూ,
అస్తిత్వం లేని కంకాళాలు
గంపగుత్తగా తన్నుకులాడుతాయి .
ఎవరూ కలిసి రారు.
శతాబ్దాల పోరాట చరిత్ర
గ్లేసియర్ లా కరిగి
నియంత కనుసన్నల్లో
రెండు నీటి చుక్కలౌతాయి.
ఒకటి ఉన్మాదం
రెండు విధ్వంసం.
కపట లిపిని అనువదించి
చెవిలో చెప్పేందుకు
అక్షరం ఒక్కటే ఒంటరిగా మిగిలింది.
*

శైలజ కాళ్ళకూరి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాన్న కొని ఇచ్చిన పుస్తకంలో అమ్మ దస్తూరీ వాసన భలే బావుంది మేడం

  • మంచి పుస్తకం లాంటి మనుషుల్ని కలుసుకుంటే
    నాన్న కష్టంతో కొన్న పుస్తకం తెరిచినప్పటి
    కొత్త పేజీల వాసన గుర్తుకొస్తుంది.
    ముందు పేజీలో నా పేరు వ్రాసిన అమ్మ దస్తూరీలా
    నిటారుగా నిలబడే బలం వస్తుంది – డాక్టర్ గారిని కవయిత్రిగా నిటారుగా నిలిపే వారసత్వ బలం ఏమిటో అర్థమైంది.

    కపట లిపిని అనువదించిన అక్షరాల వికల్పంలోనే కవయిత్రికి మానవ సమాజం పట్లగల మొక్కవోని సంకల్పబలం ఎంతుందో అర్థమౌతుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు