కాల యవనికపై నిలిచి…

ధర్మ యుద్ధంలో
ఇప్పుడిక మరణ సదృశ్య దారులు తప్ప మిగలని
ఆ కారడువులలో శత్రువు
కాల్చి చంపేసి, మూట కట్టిన
వెదురు బొంగులకు వేలాడదీసిన
ఎందరెందరి నెత్తుటి చిరునవ్వుల స్వప్నాలో
నా హృదయంలో గుచ్చుకుంటాయి
నిత్యం ఒక దుఃఖ సుడిగుండం లోన తిరుగుతూవుంటుంది

ఎన్నో ఏళ్లుగా నేను
దారి పొడుగునా కూలిపోయిన వటవృక్షాల
పాదుల నుండి కొన్ని వేర్లను
శిధిలమైన స్థూపాల నుండి
చిన్న చిన్న ఇటుక ముక్కలను
స్మశానాలలో అనామకంగా దగ్ధమైన
నా సహచరుల శరీరాల బూడిదలో మిగిలిన
ఎముకలను పొగుచేసాను

మరెన్నెన్నో కన్నీటి చుక్కలని
అసంఖ్యాక జ్ఞాపకాలని
నాకు ఎన్నడూ తెలియని మరెవరి కొరకో జాగ్రత్తగా
కాల నాళికలో దాచిపెడతాను

నొప్పించాలనో, ఒప్పించాలనో కాదు
ఈ విషాద పునరావృతాల
చిక్కుముడులు పడిన దారులను
పరిహరించజాలని ఎడల ఎక్కడా
ఏ సరికొత్త చరిత్రా ప్రారంభ కాదన్న
సత్యాన్ని ఎలా అర్థమయ్యేలా చెప్పను ?
ఎవరికి చెప్పను?
ఎవరికి వినిపిస్తుంది హృదయ ఘోష?

కాల యవనిక పై నిలిచి
చరిత్ర పొడుగునా మైలురాళ్లయిన
ఆ కరిగిపోని కాసిన్ని జ్ఞాపకాల్ని
ఎవరికైన ఇవ్వాలని పిలుస్తాను
కానీ జ్ఞాపకాలు కూడా కొన్నాళ్ళకి నిశ్శబ్దంగా మరణిస్తాయి

***
వెళ్ళాక, వెనక్కి తిరిగి రాని వాళ్ళ పాదముద్రలే కాలం గుండెల మీద నిలిచి ఉంటాయని
మహా సముద్రాలపై కలల వేటకు
తమ తెప్పతో చెప్పరానంత తెగువతో
ఎగసి దూకి స్వారీ చేసిన వాళ్లే
ఆ అలల చివర సీతాకోకచిలుకలై నిలిచి ఉంటారని
ఎవరూ సంచరించని చోట కొత్త దారులను వేస్తూ
దుర్గమారణ్యాల్లో తిరిగిన వాళ్ళ మాటలే మళ్ళీ మళ్ళీ అక్కడ చిగురిస్తూ ఆకుపచ్చ సముద్రాలై మిగిలి ఉంటాయని విన్నాను

కానీ మెలమెల్లగా
కాలం కాని కాలపు కరకు దారులలో
అనామక స్మృతులై, విస్మృతులై
నేను ఇంకా జీవించి వున్నప్పుడే
మెల్లిగా వాళ్ళ జ్ఞాపకాలు చెదిరిపోవడాన్ని
ఇప్పుడు దుఃఖితురాలినై చూస్తున్నాను

ఎంతో కష్టంగా, మరింత భయంగా ఉన్నప్పుడు చిమ్మ చీకటిలో నిలబడి
కళ్ళను దివిటీలు చేసి వెలిగించే వాళ్లు
ఓడిపోతామని తెలిసీ యుద్ధం చేసే వాళ్ళు
ఎవరో ఒకరు ఉండాలన్న నిజాన్ని
ఎవరైనా మనకి చెప్పవచ్చు
నిజంగా అవి ఎంతో అద్భుతమైన మాటలు

నేను అట్లా నిలబడ లేనప్పుడు,
నన్ను నేను, నా పరిమితుల్ని
నేను అర్థం చేసుకోలేనప్పుడు
వడ్డున నిలిచి, నువ్వు అట్లా నిలబడాల్సిందే
అని నీకు చెప్పేందుకు నేను సిగ్గుపడతాను
నా నైతిక అనర్హత నన్ను చూసి వెక్కిరిస్తుంది

కోల్పోవడం అంటే

ఏమిటో తెలిసిన నేను అమరత్వం రమణీయత గురించి
పెదవుల చివర నుండి ఎన్నడూ
అలవోకగా పాడలేను

**
ఎంతో శ్రమించి ఆ కొండ శిఖరం పైకి చేరాలనుకున్నప్పుడే
వెనక్కి వచ్చే దారులను, స్వంత పేర్లను, ఉనికిని,
చిరునామాలను, గుర్తులన్నింటిని చెరిపేసి వచ్చిన వాళ్ళు
భవ బంధాల, ప్రేమ పాశాల కన్నీళ్లను
దాటుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళు,
ఆ ప్రాణాల విలువ తెలిసినందుకే కదా
ఇంత వేదన

అవును గెలవక పోవచ్చు
నువ్వు లేదా ఇంకెందరో అన్నట్టు
పదేపదే ఓడిపోవచ్చు కూడా
మనకోసం మరణాన్ని కౌగిలించుకునే
వాళ్ల కోసం మనసు కొట్టుకుంటుంది
ఎంతో దుఃఖ దుఃఖంగా ఉంటుంది

ఎంతో ప్రేమతో, వేదనతో
మనలోకి మనల్ని తొంగి చూసుకోమని ఎవరైనా అన్నప్పుడు
వాళ్ళని భీరువులు, పలాయనులు, విద్రోహులు అని పిలిచి
ప్రశ్నలు లేని ఒక స్మశాన శాంతిని, మౌనాన్ని
ఎవరైనా ఈ నేలపై నాటవచ్చు
అది నిజంగా జవాబు కాదు ఎన్నడూ

**
నెత్తుటి చిత్తడి లో తడిసి ఇంకా ఆరని
నా పాదాల కేసి చూసుకుంటాను
అనామకంగా మిగిలిన, ఇంకా ఎవరూ అందుకోని

నా సహచరుల చేతులు కేసి చూస్తాను

అదుగో ఆ మానేటి ఒడ్డున

దగ్ధం చేసిన కొన్ని నక్షత్రాల కోసం

భోరున విలపిస్తూ పరిగెత్తిన నా కేసి నేను చూస్తాను
కూలిన స్థూపాలకు కేసి,

మృత శరీరాలు దగ్ధమైన బూడిద రాశులకేసి చూస్తాను

మరణానుభవం, మనుషులను కోల్పోవడం
అనుభవంలోకి వచ్చాక
అనేక ఏళ్లుగా అక్కడొక పక్షి
ఆకాశంలోకి ఎగురుతుందేమో
అని ఎంతో ఆశగా చూస్తాను
రెక్కలు విరుగుతున్న పక్షి ఈకలు అనేక మార్లు
నా పైన మెల్లిగా రాలి పడతాయి

రెండు చేతులు చాచి

మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంటుంది
ఇక చాలు వచ్చేయాలని
మరో ప్రారంభ ప్రారంభాన్ని
మరో సరికొత్త ప్రయత్నాన్ని
మరి ఏదైనా ప్రయోగాన్ని
చేద్దామా అని పిలవాలని ఉంటుంది

వెనక్కి ఒక అడుగు వేయడం
వెన్నుచూపడం కాదనీ
కొన్ని మార్లు అది మన పాదముద్రలని
పదిల పరచటం అనీ
పరుగు పందెంలో ఆగి అలసట తీర్చుకొని
మళ్లీ పరిగెత్తడమనీ చెప్పాలని వుంటుంది

మెల్లిగా మూసుకుపోతున్న దారుల వెంట
మృత్యువును ముద్దు పెట్టుకునేందుకు
ఇప్పుడు నేను అటే వెళ్ళమని చెప్పలేను

అటువైపు వెళ్లిన వాళ్లకి కూడా
వాళ్ళ దారి అనేకమార్లు
అంచనాలు తప్పి మారిందని
అట్లా మార్చుకోవడం
వాళ్లకి ఎన్నో మార్లు అనివార్యమైందని తెలియనిదేమీ కాదు

దీపాన్ని వెలిగించాల్సివచ్చినప్పుడల్లా
శలభాలై రాలి పోయేందుకు కాదు వున్నది

కొన్ని మార్లు రేపటి కోసం
మరల దీపము వెలిగించేందుకైనా
మన ఉమ్మడి స్వప్నాల సాఫల్యత కోసం అయినా
జీవించి వుండటం కొన్ని సందర్భాలలో అనివార్యం

నడచిన, నడుస్తున్న దారి ఎక్కడ ఆగిపోయిందో
ఏ ఏ బండ రాళ్లు అడ్డం పడి
మూసుకుపోయిందో
ఏ అపసవ్య దారుల్లోకి, ఆత్మాహుతి నిప్పుల లోయలోకి

ఈ నడక వెళుతుందో అన్న

మీమాంస, స్వీయ పరిశీలన
నేరం కానే కాదు ఎన్నడూ

కొంత దూరం నేనూ నడిచి వచ్చినందున
ఇప్పుడు ఇదంతా ఎట్లా ముగియ నుందో

కొంచెం కొంచెం తెలుస్తూనే ఉంటుంది

ఆవేశము,పంతము, ధిక్కారము,
కన్నీళ్లు, హృదయము,కవిత్వము మాట్లాడే భాష ఒకటి

చరిత్ర గమనము,
జ్ఞానము, తర్కము, హేతువు చేసే నిర్ధారణ మరొకటి

జంకు ఎందుకు?
గడచిన అనేకానేక పోరాటాలలో
ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు
రెండు అడుగులు ముందుకు,

ఒక అడుగు వెనక్కు వేయడం కూడా ఉందన్న

జ్ఞానానుభవం తెలియనిది ఎవరికి?
“ఏమిచేయాలి?” అన్న ప్రశ్న
తలఎత్తని పొరాటం ఏది?

కొండను తవ్వుతూనే వున్న

ముసలి మూర్ఖుడికి కూడా తెలుసు.

నిజానికి ఎవరి కన్నీటి చుక్కలు

బొబ్బలెక్కిన అతని అరచేతులకి లేపనం కాజాలవని
సుత్తిని, కొడవలిని మళ్ళీ పదును పెట్టేందు కైనా

అతడు క్షణకాలం ఆగడం వెన్ను చూపటం కాదు

ఎంతో దుఃఖ దుఃఖంగా ఉంది

కానున్నది తెలిసీ
ఇంకెంతో కూడా తెలిసిన వాళ్లకి
అంతా తెలుసునుకునే వాళ్ళకి
ఏమి తెలియదని
ఏమి చెబుదాం?

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

విమల

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పోరాటాలను ప్రభుత్వం అణచివేస్తూ నిర్దాక్షిణ్యంగా కాల్చి వేస్తుంటే వచ్చే దుఃఖాన్ని బాగా చెప్పారండి.

  • కాల యవనిక పై మార్క్సిజాన్ని మరింత లోతుగా ఆవిష్కరించారు. రాలుతున్న నెత్తుటి చుక్క రేపటి మహోదయం కోసం… మనిషి ఆగి ఆలోచించటం వెనకడుగు వేయడం కాదంటూ సాగిన దీర్ఘ కవిత కి సెల్యూట్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు