కొత్తగా రచయితగా నా రచనల మీద పాఠకుల స్పందన తెలుసుకోవాలన్న కుతూహలం ఉండటం సహజం. చలంనీ, చేహోవ్ నీ చదివి కథలు రాసేందుకు రెడీ అయ్యాను, కానీ ఇక్కడ పాఠక లోకం స్పందించలేదు.
“బహుశా తీరిక లేదేమో” మొక్కజొన్న తింటూ నిశి.
“హలో… మన ప్రేమకథ రాయరాదూ.. చదువుకుంటాను.” అంటుంది బుచ్చిబాబు గారి ‘నన్ను గురించి కథ రాయవూ’ కథలో నాయికలా. తను చదువుకోవడానికి వాట్సప్ చాట్ చాలదూ. దీనికే నలుగురిని స్పందింపజేశాం అనుకుంటే మాత్రం అది ఒట్టీ ఫాల్స్ ప్రిస్టేజి. ఆరు నెలలు, ఆరు కథలు, ఆరని ఎదురు చూపులు. ఇక అస్త్ర సన్యాసం చేయడం మంచిది.
నిశితో లంచ్ బ్రేక్. కబుర్ల మధ్యలో నా ఫోన్ గొంతెత్తింది
“యే అజ్ నభీ, తూ బీ కభీ… ఆవాజ్ యే కహీ తో ”
“హలో,”
“రచయిత విశ్వక్ యేనా,”
“అవును, నేనే”
“మీ కథలో నాయకుడి పేరు బాగుంది, శ్రీరా..మ్…” రాగం తీసింది ఫోన్ లో ఆవిడ.
“థాంక్యూ మేడం,” నిశి చెవులు రిక్కించింది పిల్లిలా.
” ఇంకేమి నచ్చాయి కథలో” పొడిగించడానికి కారణం ఇది నాకు మొదటి పాఠక స్పందన.
“శ్రీరామ్.. అదొక్కటే.”
“ఆ… అది కాకుండా ఈ కథలో వేరే ఏ అంశమూ?”
“మిగతావి పెద్దగా గమనించలేదు.” అని ఫోన్ కట్ చేసింది.
ఎటూ కాని పాఠక స్పందనకి నిట్టూర్చాను.
“హాయిగా వార్తలు రాసుకోక ఈ తిప్పలెందుకు” మా డెస్క్ ఇంచార్జ్ పెప్పర్ చల్లే నవ్వు, మిగతావాళ్ళు దానికి ఉప్పు కారం కలిపారు, చిరాకుగా బయటకు వచ్చేసాను. పత్రికలో జర్నలిస్ట్ అంటే వార్తలు రాయడం మాత్రమేనా? స్పందింపచేసింది ఏదైనా రాయొచ్చు అని నా ఉద్దేశం. డ్యూటీ అవ్వగానే నిశి వచ్చి వాళ్ల డెస్క్ లో వాళ్లు నా కథలని ఎలా పోస్ట్ మార్టం చేశారో వివరిస్తుంది.
“అయిష్టంతోనయినా వాటిని చదువుతున్నారుగా, గుడ్డిలో మెల్ల, చాలు.”
ఎలా స్పందించాలో అర్థం కాక అనుకుంటా అరనవ్వు నవ్వి తలనిమిరింది. నేనూ అలాగే నవ్వాను.
పొద్దున్నే “గ్రోసరీస్ కొనడానికి డి-మార్ట్ కి వెల్తున్నా, రా” అంది నిశి. నా దిగులు పోగొట్టడానికే కావచ్చు. ఎల్బీ నగర్ లో రూం నుంచి డి-మార్ట్ కి చేసుకోడానికి 15 నిమిషాలు పడుతుంది, కాబట్టి దార్లో ఫోన్ తీశాను.
“హలో మేడం… నిన్న మీరు కథ సరిగ్గా చదవలేదన్నారు, మళ్లీ చదివి ఎలా ఉందో చెప్తారని.”
“మీ కథ చదివాను, నాకు అంతగా నచ్చలేదు” స్పందించిన మొదటి పాఠకురాలు ఉషశ్రీ గారు.
ఒక రచయిత తో డిప్లమసి లేకుండా ఇంత స్ట్రైట్ గా మట్లాడుతుందేంటి!
“కానీ మీ పేరుకింద ఊరి పేరు చూసి కాల్ చేశా. మాదీ మీ ఊరే, ఇప్పుడైతే అక్కడ లేను, మార్కాపురం ట్రాన్స్ ఫర్ అయింది. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ని, కథలో తెలుగు మాస్టారికి ఆ పేరు ఎందుకు పెట్టినట్లు?”
“కథన్నాక మనకు తెలిసిన వాళ్లవే పాత్రకి తగ్గట్టు పెడుతుంటాం. ఈ పేరు మా హై స్కూల్ లో తెలుగు సార్ ది, ప్రతి కథకీ ఒక మెటాఫర్ ఉన్నట్లే ప్రతి రచయితకీ ఒక ప్రోద్బలం ఉంటుంది, నా వరకు ఆయనే.”
” మంచి ఆన్సరే దొరికింది.”
“అలాగా, సార్ మీకు తెలుసా?”
“తెలుసు.”
“కూల్, సార్ ఎలా ఉన్నారు? అడిగానని చెప్పండి.”
“సార్ లేరు విశ్వక్.”
ఉన్నట్టుండి ఎవరో నదిలో తోసేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంది “ఏమైంది సార్ కి!?”
ఆ నీళ్ళలోనే రాళ్లు వేసినట్టు చిన్న చిన్న శబ్దాలు, ఆమె ఏడుస్తున్నట్లుంది.
“మమ్మీ… టేబుల్ మీద 6 టాబ్లెట్స్ ఉన్నాయేంటి?”మరో మహిళ గొంతు.
“మర్చిపోయా, 5 పిల్స్ మళ్లీ డబ్బాలో వేసెయ్. విశ్వక్… మా అమ్మాయి, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, పండగ సెలవులకి వచ్చారు.” ఆమె క్లారిటీ ఇచ్చింది.
“ఈ నల్లరంగు కర్టెన్స్ ఎప్పుడూ వేసి ఉంచుతావ్, వెలుగే రాదు లోపలికి” మళ్లీ వాళ్ల అమ్మాయే అరిచింది, కర్టెన్స్ సర్రున లాగిన శబ్దం.
“విశ్వక్ ఇంక నేను నిద్రపోవాలి, ఉంటా.”
పగలు పదింటికి నిద్రా, ఏంటీవిడ!? కలల్లోల్ని దృశ్యాలూ, కథల్లోని సంఘటనలూ అబద్దాలే, వాటినీ డీకోడ్ చేయాలని చూస్తాం, ఇదీ అలాంటిదే ఆయితే బాగుండు, నా మెదడులో ఊటబావి తవ్విన మనిషి,
ఊపిరి తీయడం ఆపేసాడా? నిజంగా లేడా! “ప్చ్, టైం చాలా దుర్మార్గమైంది మేడం.”
“అవును, పది నిమిషాలు ట్రాఫిక్ క్లియర్ గా ఉండి ఉంటే, అంబులెన్స్ డ్రైవర్ తనకి యాత్రికంగా జరిగే ఘటన మాకు ఘోరకలిక అని గ్రహించి వేఘంగా వెళ్లి ఉంటే, అసలు ఆయనే వీళ్లని ఒంటరిని చేస్తున్నానని అనుకొని ఉంటే ఎంత బాగుండు, 55 ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో దూరమయ్యారు, దేవుడు కూడా చెడ్దవాడు విశ్వక్.”
మనకి నష్టం జరిగినప్పుడు సిద్దాంతం మార్చుకుంటాం. చేతిలో చిల్లిగవ్వ లేని రోజుల్లో పండగలు అర్థంలేని పనులంటూ లాజికల్ థియరీలు చెప్పేవాడు నాన్న. అప్పుడు కసిరేవాణ్ణి, ఇప్పుడు ఆయన్ని అర్దం చేసుకోలేకపోయానే అనిపిస్తుంటుంది. మేడమ్ కి కాస్త ధైర్యం చెప్పాను.
“అమ్మా… అతన్నెందుకు ఇబ్బంది పెడతావ్” వాళ్లమ్మాయి.
మేడం సైలెంట్ అయిపోయింది.
అలాంటిదేం లేదని చెప్పాలనుకున్నాను, కానీ ఒక మాట వెనక ఒకే ఉద్దేశం ఉంటుందని అనుకోలేం. నిట్టూర్పులూ, నిశ్శబ్దంగా విలపించినట్లున్నాయి. ఓదార్చడం తెలీని మనిషి నేను, అందుకే నా కథల్లో కూడా చావు మేలం వాయించను.
తెలియని దిగులుతో ఫోన్ పెట్టేసాను.
******************
హైదరాబాద్లో జరిగిన ఒక ‘మహిళల హస్త కళాకృతుల ప్రదర్శన’ మీద కథనం రాయడం పూర్తయింది. దాన్ని ఎడిట్ చేయడానికి వీల్లేదంటూ డెస్క్ ఇన్ చార్జ్ తో గొడవ పడుతుండగా ఫోన్ చేసి “మీ మధ్య జరిగిన సంఘటనలు ఏమైనా చెప్పు” అన్నారు మేడం.
ఏమేం జరిగాయో ఆలోచిస్తూ బయటకు వచ్చాను “తెలుగు సార్ మంచి వాక్చాతుర్యం గలవాడు, ఆ కథలు చెప్పిన తీరే నన్ను రాయమని పోరింది. ఒకరోజు పోటీలో వ్యాసం రాయమన్నాడు, తర్వాత నీ రాతలో తమాషా ఉందే అని కథ రాయమన్నాడు. రాస్తే చదివి పేరు పెట్టాడు… రచయిత అని.”
“ఆయనంతే, నేర్పరులను పట్టడంలో నేర్పరి.”
“కానీ నా విషయంలో విఫలమయ్యారనుకుంటా.”
“ఆయన ఎందులోనూ పొరపాటు చేయడు.”
సార్ చూడ్డానికి పోలీసులా ఆరడుగులు ఉంటాడు, హీరోలా అందంగా ఉంటాడు. వికీపీడియాలా అన్ని విషయాలూ మాట్లాడుతుంటాడు. ప్రభావవంతమైన ఆయన సాంగత్యాన్ని మర్చిపోవడం కష్టమే. మేడం చాన్నాళ్ళ నుంచి నిస్పృహలోనే ఊగిసలాడినట్టు ఉంది.
“పండగ సెలవులు అయిపోయాయిగా
మరి స్కూల్ కి..?” అన్నాను.
“వెళ్లట్లేదు”
“చుట్టాలింటికి?”
“ఆసక్తి లేదు”
“పోనీ చుట్టాలు మీ ఇంటికి?”
“ఎవరికి తీరిక లేదు”
“సినిమాకి?”
“అక్కర్లేదు”
“ఆకలి?”
“లేదు” టపీ టపీమని సమాధానాలిచ్చారు మేడం. “అమ్మమ్మా.. నాకు కాగితం పూలు చెయ్యి” మనవరాలు “నాకు ఓపికెక్కడిది.” మేడం.
రోజులపాటు తిండి మానేశారు. నిద్ర లేదు, దాని కోసం టాబ్లెట్ మింగాలి వస్తుంది. లేదంటే తలపోటు, ఏడవడం, ఆర్నెల్ల నుంచి ఇదే తంతు, ఇప్పటికీ ఉంది. ఆమెకు ఎలా సాంత్వన చేకూర్చాలో అర్థంకాక “పోనీ, బుక్స్ చదవచ్చుగా అసలే పాఠకులు తగ్గిపోతున్నారు.” అన్నాను.
“అందుకే డేల్ కార్నేగి, రోండాబర్న్ ల పుస్తకాలు కొన్నాను. 3 నెలలయింది, వాటిని ముట్టితే వొట్టు.”
రోలర్ కోస్టర్ జీవితాల్లో వ్యక్తిత్వ వికాసం పుస్తకాలకు డబ్బులు వస్తాయని అర్థం చేసుకున్న క్లవర్స్ రాసే పుస్తకాలు అవన్నీ, మరి ఖాళీ సమయం ఎలా?”
“పిల్లలకు రావడానికి కుదరదు, అందుకే నేనే తరచూ వెళ్లి వస్తున్నాను, సార్ వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ 10 లక్షలు అప్పు తీసుకున్నారు, వస్తే అడుగుతామని రావడం మానేశారు, చూసి మొహం తిప్పుకు పోయే వాళ్ళని రోజూ చూస్తూనే ఉన్నాను. ఆరు నెలల క్రితం వరకు వీళ్ళందరికీ అత్యంత ఆప్తురాలిని, మరి ఇప్పుడు? నన్ను నేను బిజీగా పెట్టుకుంటున్నా మనసులో తెలియని ఖాళీ” కళ తప్పిన గొంతు, నిస్పృహ నిండిన మాటలు.
“ఖాళీలు పూరించే అస్త్రమే కథ, మీతో మాట్లాడాక ఓ కథ రాద్దామనుకుంటున్నాను, ప్రేమకథ” అన్నాను.
“అలాగా! ఏం రాస్తారూ?”
గొంతు సవరించి మొదలుపెట్టాను “మనస్సు ఫీనిక్స్ పక్షి లాంటిది, ప్రతి ఉదయం కొత్తగా ప్రేమించడం మొదలు పెడుతుంది. అలా రోజూ 40 ఏళ్ల కుర్రాడు 35 ఏళ్ల అమ్మాయికి సైట్ కొడుతున్నాడు. లంచ్ కి రమ్మంటూ సైగ చేశాడు, ఆమె కళ్లతో సరే అంది, భవిస్యత్ లో కాబోయే రచయిత ఇదంతా నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ రూమ్ కిటికీలో నుంచి గమనిస్తున్నాడు. ఆ జంట రోజూ బైక్ మీద ఒక్కటిగా వస్తారు, కలిసి తింటారు, కలిసి పిల్లలకి ఆట పాటలు నేర్పిస్తారు, కొన్ని స్మృతుల మూటలతో వెళతారు. ప్రణయ జీవన సౌందర్యం.”
“విశ్వక్.. అంత గమనించావా! భలే పిల్లలు మీరు, తర్వాత కథ నేను చెప్తాను.. సార్ హెడ్మాస్టర్ కూడా కదా, ఎప్పుడైనా సెలవు కావాలంటే లీవ్ లెటర్ బదులు లవ్ లెటర్ పెడతాను, చదువుకోలేక, నవ్వుకోలేక, తెగ ఇదై పోయేవారు, హ..హ్హా.. హ్హా… సాయంత్రాలు టెర్రస్ మెద కూర్చుంటే నాకోసం పాటలు పాడేవారు” గొంతులో కొంచెం ఉత్సాహం.
ఈ మాటలు వింటుంటే అనిపిస్తోంది, ఆడవాళ్లకి ఎంత వయసొచ్చినా 18 ఏళ్లే, లేకపోతే సిరివెన్నెల రాసే ఆ ప్రేమగీతాల్ని ఆస్వాదించగలరా, మగవాళ్లూ అంతే, లేకపోతే సిరివెన్నెల రాయగలడా.
“తొమ్మిదో తరగతి లో ఒక అమ్మాయికి గ్రీటింగ్ కార్డు ఇచ్చి ప్రపోజ్ చేశా, ఆ పిల్ల ఆ కార్డు తీసుకెళ్లి నేరుగా తెలుగు సార్ కి ఇచ్చింది, సార్ కూర్చోబెట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పెట్టి ‘ఈ ప్రేమ మెదడు మనతో ఆడే ఆట, హార్ట్ షేప్ లవ్ సింబల్ ఒకటి కనిపెట్టి దాన్ని గ్రీటింగ్ కార్డుల మీద వేసి మిమ్మల్ని ఆకర్షిస్తారు, ఇలాంటివాటికి పడొద్దు, దేన్ని ఎక్కువ ప్రేమించ వద్దు, నిన్ను నువ్వే ప్రేమించుకోవాలి’ అన్నారు”
“అబద్ధం చెప్పకు, సార్ అలా అని ఉండరు”
“నమ్మకపోతే మీ ఇష్టం సరే, కథ మధ్యలో ఆగింది కంటిన్యూ చేయండి, అయినా అసలు గొడవలే లేని కథ ఏమి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది!” కాస్త ఉడికించాలని అన్నాను.
“ఎందుకు ఉండవు, కవి ప్రకృతి ఒడిలో పరవశించినట్లు ఆయన ప్రేమకి అతిగా లొంగిపోకూడదని అప్పుడప్పుడు గొడవ చేస్తుంటాను, దాంతో ఆయన అలుగుతాడు, పండక్కి వాళ్ల చుట్టాలందర్నీ పిలుస్తాడు, వాళ్ళందరికీ చాకిరీ చేసేసరికి నాకు పండగ లేకుండా పోతుంది, అప్పుడు గొడవ పడతాను.”
“ఆ, ఇదీ గొడవ అంటే”
“పొద్దున్న సార్ ని తలుచుకోగానే షెల్ఫ్ నుంచి కిందపడ్డాయి జ్ఞాపకాలు, ఎవరికో ఇవ్వటానికి మనసొప్పక అలాగే బీరువాలో పెట్టాను. లైఫ్ చాలా భారంగా ఉంది విశ్వక్.”
మాట తడబడింది, గొంతు జీరబోయినది
ఎలా సముదాయించాలో అర్థం కాలేదు “మా జనరేషన్ కి ఇదంతా వట్టి బయోకెమిస్ట్రీ, అంతే. ప్రేమ పుట్టడానికి Phenylethylamine అనే కెమికల్ ఓ కారణం కదా! ఇది చాక్లెట్ లో కూడా ఉంటుందట, అందుకే కాబోలు చాక్లెట్లు తినే అమ్మాయిలు త్వరగా లవ్ లో పడతారు, ఇలా ఎప్పటికప్పుడు కొత్త ప్రేమలే”
“అలాగే ఉంది, నువ్వు నీ పిచ్చి తర్కాలూ” కసిరారు.
నిశి కూడా ఇలాగే అంటుంది, ఒక్కో బలహీన క్షణంలో నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటుంది. తను అన్నంత పనీ చేస్తుంది.
మణిరత్నం సినిమాలో హీరో చెప్పినట్లు లవ్ అంటే ఓ కెమికల్ రియాక్షన్ అని బ్రెయిన్ వాష్ చేయబోతాను, ఒక్క చెంప దెబ్బతో నా మేధావి తనాన్ని విసిరి అవతల పడేస్తుంది.
“ఓకే, కథలో క్లైమాక్స్ ఏంటో చెప్పండి”
“ఆయనే నా ఫ్రెండ్, లవర్, గైడ్, గాడ్ అన్నీ, నా జీవితాన్ని ఎటూ కాకుండా చేసి వెళ్ళిపోయాడు, కథకు ముగింపు అంటే నాకు ముగింపు. ఇప్పుడు అర్థంలేని బ్రతుకయింది, అక్కడ నా కోసం చూస్తూ ఉంటాడేమో.” సన్నగా నవ్వింది.
అది నవ్వు కాదు, నేను అర్థం చేసుకోగలిగింది.. ఆమెది అనంతమైన ప్రేమ, తెగని వేదన. ఆ దుఃఖం చూస్తే నాకు భయం వేసింది. ఉద్యోగాలతో పిల్లలు బిజీగా ఉంటున్నారు. అక్కడికి వెళ్లి వాళ్లకు భారం కాకూడదని ఆలోచించే ఇండివిడ్యువాలిటీ ఉన్న మనిషి మేడం, ఎంతైనా టీచర్ కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరితనం ఆమెను కాజేస్తే..? ఏదో భయం ఆవహిస్తుండగా “మేడం.. ఎక్కువగా ప్రేమించబడటం ఒక ఎమోషనల్ డిపెండెన్సీ, ఒక స్థాయి దాటాక అవతలి వారి ప్రేమకు బానిస ఐపోవడం. అది మనల్ని మనకు కాకుండా చేస్తుంది, మీకిప్పుడు ఆయన ప్రేమ అక్కర్లేదు, మనవాళ్లకి మనం బలహీనత కాకూడదు, అది గ్రహించకుండా మీ మీద అతి ప్రేమ చూపించడం సార్ తప్పే” ఆమె కథ రాయాలన్న నా సంకల్పాన్ని మరిచి అన్నాను.
“మాది పాతికేళ్ల ప్రయాణం, మనిషి నలిగిపోతూ ఉంటే దాన్ని తప్పంటే ఎలా? నువ్వు కూడా మెటీరియలిస్టిక్ మనిషివే, భావోద్వేగాలు అర్థం చేసుకోని మీ జనరేషన్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది విశ్వక్” నేను అర్థం చేసుకోలేదన్న అసహనంతో స్పూన్ విసిరేసిన శబ్దం.
“ఓఫ్!” మేడం.
“ఏమైంది?”
“వేలు తెగింది”
అయితే విసిరేసింది స్పూన్ కాదు “బాగా కట్ అయిందా?”
“కొంచమే తెగింది, కానీ బ్లీడింగ్ ఆగట్లేదు, బ్లడ్ ఈజ్ నాట్ క్లాడింగ్!”
ఫోన్ కట్ అయింది. నేను తిరిగి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
************************
రోజులు దొర్లిపోతున్నాయి, ఫోన్ కలవడం లేదు, ఎందుకనో! కథ రాస్తున్న అంతసేపు ఆమె మాట్లాడే వాళ్ళు లేక ఎంత బాధ చూసింది తలుచుకొని నాకు బాధేసింది. వారం తర్వాత కథ పూర్తయింది, వాట్సప్ లో పీడీఎఫ్ పంపాను.
మర్నాడు ఫోన్ చేసి “కథ చదివాను, సార్ దూరమయ్యాక నేనున్న పరిస్థితిని కళ్లకు కట్టారు, కాలక్రమేణా అన్నీ మర్చిపోయి హాయిగా ఉన్నానని రాస్తావా? నీ పిచ్చి కాకపోతే, పాతికేళ్ల బంధం, అలా ఎలా మర్చిపోతాం, తెలుగు మాస్టారు నీ కథలో అపార్ట్మెంట్ లో అందరికీ తలా ఒక మొక్క ఇచ్చి మంచి చేసుకుంటాడు, ఈ మెటీరియలిస్టిక్ మనుషుల్లో ఒక్కరోజులో అది సాద్యం కాదు”
“నిజమే, కానీ మీది సమస్య కాదు, ఒంటరిగా మగ్గిపోతుఉంటే సెరటోనిన్ అనే కెమికల్ రిలీజయ్యి మరింత నైరాశ్యంలోకి నెట్టేస్తుందట, ఒకసారి అద్దంలో చూసుకొని చిరునవ్వు నవ్వండి, ఆ వ్యక్తిని అభినందించండి, ఆ వ్యక్తి కోల్పోయిన ప్రేమను మీరే ఇవ్వండి, తన కళ్ళల్లోకి చూస్తూ…” విశ్వక్ ప్రయత్నం చేస్తున్నా, నా మాటలు ఆలకించినట్లు లేరు.
“అమ్మా… స్లీపింగ్ టాబ్లెట్స్ 9 పెట్టారు ఏంటి?” పనమ్మాయి.
“అనుకోకుండా పడిఉంటాయి, టాబ్లెట్స్ కి డిస్క్రిప్షన్ లేకపోతే ఇవ్వరు, షాప్ వాల్లకీ భయమే, ఈ రోజుల్లో ఎక్కువ డెత్ న్యూస్ వస్తున్నాయి, ఇక ఉంటాను”
ఆమె కథ, లేదా దుఃఖం ఎలా ముగుస్తుందో నాకే అర్థం కాలేదు. ఒక కథకుడు గానే కాదు ఆమె బాధను ఆలకించిన వాడిగా కూడా విఫలమయ్యా అని అనిపించింది. ఇప్పుడు ఈ కథ పబ్లిషింగ్ కి ఇద్దామా, వద్దా? ఇంచార్జ్ ఏమంటాడో, నేను కూడా నైరాశ్యంలోకి జారుకోవడంలేదు కదా!
*******************
నా తర్కాలు విని నిశి మాట్లాడటం మానేసింది, పత్రికలో ఆర్టికల్ రాలేదు, ఇంచార్జ్ ని అడిగితే నిశి వైపు చూపించాడు. ఆ మహిళల కష్టాన్ని తూతూమంత్రంగా ఉంచారట. ప్రూఫ్ రీడ్ చేసిన నిశి ఆ కాగితం అతని ముందే చించి పడేసిందట. తనకి ఎంత తెగింపు, ఈ దైర్యం ఎక్కడి నుంచి వచ్చింది!! నా వెనుక బాగానే ఉంటుంది, నాతో మాత్రం మాట్లాడలేదు, కాస్త ఊరట కలిగింది.
మేడం నుంచి కూడా నెలల తరబడి ఫోన్ లేదు. నేను చేస్తే కలవడం లేదు, మెదడులో జ్ణాపకాలూ ఒక్కొక్కటే తుడిచేస్తుండగా వచ్చింది ఫోన్.
“విశ్వక్.. మీరు ఉషశ్రీ మేడం స్టూడెంటా!”
“కాదు” ఆశ్చర్యాన్ని దాచి అన్నాను.
“అమ్మ అలా చెప్పిందే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నెలలుగా మాతో మాట్లాడని అమ్మ మీతో మాట్లాడుతుంటే ఆశ్చర్యం, భయం వేసేది. అడిగితే వాడు మా స్టూడెంట్ అంది గర్వంగా. మేము కాస్త బిజీ, ఇంట్లో అన్నీ టైంకి సమకూరుస్తున్నా అలా ముభావంగా ఉండి విసిగించేది.”
నాలుగు మాటలు ఎంతో చేయగలవు, అవును! అమ్మకీ ఓ ప్రేమకథ ఉంటుంది. ఊసులు, జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. కానీ ఆలకించేదెవరు? అందుకే అది నేనయ్యాను.
మేడం కూతురు కొనసాగించింది “ఇరుగూ పొరుగూ తనతో మాట్లాడట్లేదని ఏం చేసిందో తెలుసా! సూర్యుడికన్నా ముందు అందరి ఇళ్లకూ వెళ్లి తలా ఒక మొక్క గిఫ్ట్ ఇచ్చి వచ్చింది, వాళ్లు ఏమంటారో అని హడలిపోయాము, అందరూ రూపాయి బిళ్లలు గోతులో పడ్డట్టు మొహం పెట్టారు.
ఈరోజు ఆ మొక్కలకు పూలు పూసాయి… వాళ్ళ మనసులో కూడా.”
నాకు ఆశ్చర్యంగా అనిపించింది, నా ఆర్టిఫీషియల్ పరిష్కారం, అర్దం మార్చుకుందా?
“నైట్ ఏడుస్తుందని పిల్లలని తనతో పడుకోబెట్టేవాళ్లం కాదు, భయపడతారు కదా,” మళ్లీ ఆమే.
“అవును.”
” 2 నెలలు హాస్పిటల్ చుట్టూ తిరిగాం. మళ్లీ వెల్లాల్సొస్తుంది అనిపించింది. పక్కింటివాళ్లకి చెప్పిమరీ బెంగుళూరు వెళ్లాం, డ్యూటీస్ కదా!”
“అవును”
“ఒక విషయానికి ఆశ్చర్యపోయాను, ఇంట్లో నల్ల కర్టెన్స్ తీసేసింది, ఇప్పుడు ఇల్లంతా వెలుగే. వార్డ్ రోబ్ కూడా ఖాళీగా ఉంది.”
“ఖాళీ చేశారా!! అన్ని షాకుళ్లోకీ ఇది పెద్దది.
“ఈ మార్పేంటని అడిగితే! ‘అద్దం మహిమ అంది, అందులో ఏముందో నాకు అర్థం కాలేదు. ఈ మధ్య పెయింటింగ్ నేర్చుకుంటున్నా స్కూల్లో మాస్టారు చాలా బాగా నేర్పుతారు అంది, ‘నాలుగైదు బొమ్మలు గీశాను.. అడవుల్లో పక్షులు చిన్నప్పుడు చూసిన బొమ్మలు గుర్తొచ్చాయి, అవన్నీ గీశాను’ అంటూ బొమ్మలు చూపించింది. పిల్లలు బొమ్మలు చూసి అబ్బురపడ్డారు. ఆగిపోయిన ఇల్లూ, బ్యాంక్ అకౌంట్స్, స్కూల్ అన్ని పనులూ మొదలుపెట్టింది, ఆ షాక్ నుంచి నేను ఇంకా తేరుకోలేదు, టేబుల్ మీద అన్ని టాబ్లెట్లు ఎందుకుండేవో ఇప్పుడు తలుచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. మీరు రోజు మాట్లాడకపోతే ఏదో ఒకరోజు నిరాశలో అవన్నీ మింగేసేది” ఆమె గొంతులో వణుకు, ఏడుస్తున్నట్లు ఉంది.
ఆమె కొనసాగించింది “అమ్మ ఎంత మారిందంటే, ప్రతి నిమిషాన్నీ తను ఆస్వాదించేలా, దీనంతటికీ కారణమైన మిమ్మల్ని రేపు లంచ్ కి పిలవమంది మీ మేడం, వస్తున్నారుగా.”
“తప్పకుండా” నా చెంపలు తడి.
అడ్రస్ చెప్పి పెట్టేశారు. మేడం నిజంగా మారిందా, నమ్మలేం, మారితే నా వల్లేనా, ఇదీ నమ్మలేం, గాఢంగా ఒక కథ రాయలేని నేను, ఘనీభవించిన మనసుని కదిలించానా? తెలీని ఉద్వేగం పొగమంచులా కమ్మింది.
లంచ్ కోసం హైదరాబాద్ నుంచి మార్కాపురానికి ప్రయాణం. బస్ ఎక్కేముందు కాల్ చేశాను,
“ఎక్కడిదాకా వచ్చారు,”
“రావట్లే, నిశి ఫోన్ చేసింది, ఉన్న రంగులు వెలిసిపోకముందే బధానికి మరిన్ని రంగులద్దాలి, ఆ అవకాశం వచ్చింది, ఈసారి వస్తాను, మేడం కి చెప్పండి”
“ఓకే విశ్వక్ ” ఫోన్ కట్ చేసారు.
బస్ దిగి నడుస్తున్నాను, ఓకే విశ్వక్… అన్నమాట చెవిలో మోగుతోంది. ఆ గొంతు మేడందే. నేను రాకపోవడాన్ని ఇంత లైట్ గా తీసుకున్నారే, అలక, కోపం, నిష్టూరం ఏమీ లేవు. నా నుంచి ఆమాత్రం కన్సర్న్ కూడా ఆశించట్లేదు. మనసు తేలికయింది. ఏ భావోద్వేగాల్ని అయినా మనసుకి ఎక్కువగా తీసుకుంటేనే సమస్య. ఇప్పుడు పూర్తి కథ రాయచ్చు, ఇదే చివరి కథ మాత్రం అవ్వదు. ఇదే నా గురు దక్షిణ. జీవితంలో మనకి ఎవరూ తోడు లేని రోజులు కూడా వస్తాయి. అప్పుడు నిభాయించుకోవాలి, మనకై మనమే నిలదొక్కుకోవాలి. మేడం కథలో నాకు అర్థమైన ముగింపు ఇదే. ఇప్పుడామెది సప్తవర్ణాల్లో మరోసారి ముంచి తీసిన జీవితం,
ఇది మళ్లీ జన్మించడం,
ఓడిన సంఘం,
దుఖం సమాప్తం,
ఇది మరొక ప్రణయం,
బ్రతుకు బహుమానం,
ఉనికి ఉత్సవం!
*
చాలా బాగా రాశారు. మితిమీరిన ప్రేమ, డిపెంన్డెన్సీ కూడా శూన్యాన్ని తలపిస్తాయని బాగా చెప్పారు. ముగింపు నచ్చింది.
ధన్యవాదాలండీ.
Kallu chemarchayandi..chaala chaala baagundi 🙏🙏
ధన్యవాదాలండీ.
Nice Story…. Anna
Regular touch thone oka emotional treat ichav climax lo vachina bhavodyogaham amogham…..
👌👌👌👌👌
Thank u ra.
కథ చాలా బాగుంది 👏👏👏 భావోద్వేగాలు సహజంగా అనిపించాయి…
కథ చాలా బావుంది. బుచ్చిబాబు కుముదాన్ని గుర్తుచేశావ్. సూర్యుని ప్రేమ కోసం ఆరాటపడే ఫినిక్స్ పక్షిని స్మరణకి తెచ్చావ్. కవిత్వంలో అతిగా చొరబడే మెటఫర్ కథలో కూడా ఎంతో కొంత ఉంటుందన్నావ్… మొత్తానికి ప్రేమకి ఒక పరిధి అంటూ ఉంటుంది. శ్రుతి మించిపోతే… నిభాయించుకోవడం కష్టమని భలే అందంగా చెప్పావ్ తెల్సా!
ఫోన్ సంభాషణ తోనే కథా మొత్తాన్ని నడిపిస్తూ…. అంతలోనే కట్ చేస్తూ…. కథాయానాంలో తత్వాన్ని చొప్పిస్తూ…. ఏవేవో చెప్పి…. పాత్రలతో చెప్పించి… తనను తాను ప్రేమించుకుంటేనే గదిలోకే కాదూ మదిలోకి వెలుతురు పొడ తగుల్తుందని ఒప్పించి,
మానవ జీవన ఉత్తర దశలో… విభా ప్రభాతాల మంత్రజాలాన్ని ఎలా అవగాహన చేసుకోవాలో… నైరాశ్యాన్ని ఎలా ఛేదించుకోవాలో చెప్పడం కాదు.. కళ్లకు కట్టినట్టు చూపించావ్! చరణ్! ఇలాగే నీకు అనిపించినవన్నీ కథలుగా రాస్తుండు. మాకు వినిపిస్తుండు. సరేనా!
థాంక్యూ సో మచ్. విశ్లేషణ కథలోని గాఢతని చక్కగా చూపిస్తుంది.
Katha chala baga rasaru … Congratulations charan sir .. dagarina varu dooram ithe ontariga migilipoiona aame vedhana varnanatetam Keep writing ..,
అభినందనలు.. మీ కథ బాగుంది అని ఒక్క మాటతో సరిపెట్టలేను. .
నిజంగా చాలా బాగుంది .. మనసుకి హత్తుకుంది.
జీవితంలో మనకి ఎవరూ తోడు లేని రోజులు కూడా వస్తాయి. అప్పుడు
నిభాయించుకోవాలి, మనకై మనమే నిలదొక్కుకోవాలి అని
చక్కటి ముగింపునిచ్చారు. once again congratulations.. and
waiting for ur next story sir..
Thank u so much