ఎనభై ఏళ్ల వయసులో హైదరాబాద్ లోని అపార్ట్మెంట్ లో ఇంటికే పరిమితమై జీవిస్తున్న రత్నమాల విరామ మెరగని ఉద్యమకారిణి. ఉద్యమ అవసరాలకు రచన ఒక ప్రధాన భూమిక అనే విశ్వాసం రత్నమాలది. ఆమెకి యాభై ఏళ్ల రాజకీయ, ఉద్యమ ప్రస్థానముంది. తెలుగు సాహిత్యంలో సాధికారత వుంది. మనుషులు ముఖ్యంగా స్త్రీలు రూపొందుతున్న వికాస యుగానికి రత్నమాల ప్రతినిధి. తెలంగాణ సాంస్కృతిక రంగం నుండి మొలకెత్తిన గ్రామీణ మూలాలు వున్న స్త్రీ. ప్రజా పోరాటాల గమనంలో రాజీ ధోరణి లేని నడక రత్నమాలది. ఈ స్వాభావిక లక్షణాలతో తన సజీవతను ఉద్యమపరం చేసారు. భూస్వామ్య భావజాల తెలంగాణా పల్లెల నుండి, సామాజిక, సమాజ అంతర్లీనత నుండి ఆలోచనా పరురాలిగా మారారు. చదువు, పుస్తకాలు, వివిధ పోరాటరూపాలు తెలంగాణా జీవన సంస్కృతిని ఆమెకి పరిచయం చేసాయి.
జీవించే కళను తెలంగాణా ఒరిపిడి నుండి నేర్చుకున్నారు. వైవిధ్యభరిత తెలంగాణా సమాజం మౌలిక మార్పులు చెందడానికి అనేక త్యాగాలు ఆమె జీవితచరిత్రలో నమోదయ్యాయి.
భారతదేశ ముఖచిత్రరచనలో తెలంగాణా అధ్యాయం ప్రత్యేకమైంది. పోరాటం, అనేక త్యాగాల తెలంగాణ నేల. తలవంచని ధిక్కారం. నిత్య ఉద్యమాల రాపిడిగా ఊపిరి తీసుకుంటుంది. ఆ ఊపిరి నిలపడానికి ప్రగతి శీల ఉద్యమశక్తుల కార్యాచరణ వుంది. అటువంటి సమాజపు ఆకాంక్ష రత్నమాల. వ్యక్తిగత జీవితం పట్ల ఎలాంటి అనురక్తిలేదు.ఆమె చుట్టూ అల్లుకున్నది ఉద్యమ జీవితం. అలాంటి సందర్భాల్లో మనుషులు ముఖ్యంగా ఎలా రూపొందాలో రత్నమాల ఉదాహరణ.
బాల్యం నుండి చదువరి. ఊరి గ్రంధాలయం ఉండనే వుంది. గ్రామీణ సంస్కృతి, కట్టుబాట్ల నుండి బయటపడి తను ఎలా ఉండాలో అనే ఒక ఊహా శిల్పం తయారు చేసుకున్నారు. ఆ ఊహకు రక్తమాంసాలు అద్దారు. ఈ ఉద్యమకారిణి నిర్మాణం వెనుక మార్క్సిజం అనే తాత్వికత ఉన్నది. రత్నమాల జీవితంలోని సాధారనీకరణ ఇదే. సారాంశంలో నిత్య ఆందోళనాజీవి. ఈ ఆందోళన వ్యక్తిగతమైంది కాదు. సామూహికతతో కల గలసినది. ఆమె స్వప్నం ప్రపంచమంత విస్తారమైనది. నూతన వెలుగు, మానవ జీవన లాలసతో పాటు క్షణ, క్షణం బద్దలు కాని ప్రపంచం ఆమె అంతరంగం.
నిరాడంబర జీవితం నుండి మనుషుల కోసం ఆమె ప్రయాణం చేసింది. అవమానాలు, నిర్భంధం, అరెస్టుల మధ్య ఉద్యమ పోరాటరూపాన్ని విడువలేదు. పోరుబాట అక్షరబద్దమైతే రత్న మాలది ఒక ప్రత్యేక అధ్యాయమే! తెలంగాణా పోరాట భూమికకు తానే సజీవసాక్షి. తెలంగాణా అస్తిత్వం కోసం నిప్పురవ్వలు రాజేస్తే దానిని కొలిమిగా మార్చింది స్త్రీలు. ఇలా రూపొందడానికి కావాల్సిన సృజనాత్మతకు మళ్ళీ మళ్ళీ తెలంగాణా జీవితమే కాన్వాసు. మార్కిస్టు ఆలోచనాధార నుండి స్ఫూర్తి పొందారు. తన రచనాతీరును ఈ వైపు నుండి మలుచుకున్నారు. పుట్టుక కారణంగా వచ్చిన అధిపత్య స్వభావాన్ని చేరిపేసుకొని రచయిత, ఉద్యమకారిణిగా తెలుగు సమాజపు ఆర్తి అయ్యారు.
జీవితం రణరంగంగా మారినా జీవన, ఉద్యమ సమాంతర రేఖలపై నడిచారు.
రత్నమాలది యాభై ఏళ్ల సాహిత్యప్రయాణం. అధ్యయనం, ప్రజాపోరాట తలం ఆమెని రచయితను చేశాయి. చలం, కాళోజి, మహాశ్వేతాదేవి రచనలపట్ల అభినివేశముంది. వారి రచనాక్రమాన్ని సాహిత్య విమర్శకురాలిగా అంచనా వేసారు. తెలుగు సమాజం చలంను అర్ధం చేసుకోలేదు అనే భావన రత్నమాలది. ఆదివాసి మానసపుత్రిక మహాశ్వేతాదేవి రచనలను విశ్లేషణ చేశారు. ఏరచన పట్ల అయినా ఖచ్చితమైన మార్కిస్ట్ చింతన రత్నమాలది. రచయితులందరూ తమ తరానికి జవాబుదారులు. వర్త మానకాలపు విధ్వంసీకరణ తమ రచనలో భాగం కావాలి. మానవ జీవిత భిన్నదశలను, సజీవ స్రవంతుల జీవన నాదాన్ని స్వీకరించాలి. రత్న మాలది ఈఒరవడి. మహిళగా ఆమెకున్న సంకెళ్లును భాధిత స్త్రీల వైపు నుండి ధిక్కరించారు.
సామాజిక తలంలో లోతైన చూపున్న రచయిత. అభివృద్ధి నమూనా వెనుకదాగిన అసమానతలను సరిచేసే ప్రయత్నం చేసారు. నిర్వాసిత్వం, వలసల వెనుక ఉన్న పాలకపక్ష విధాన నిర్ణయాలపై రాజీలేని పోరాటం రత్నమాలది. స్వతంత్ర అనంతర భారతదేశం ప్రజా ఆకాంక్షలకు భిన్నమయినది. ఈకాలాన్ని అర్ధం చేసుకోవడం, సమాధానం వెతకడంలో వున్న తపన రత్నమాలది.
స్త్రీవాద చైతన్యం దగ్గరే రత్నమాల ఆగలేదు. గతి తార్కిక భౌతికవాదాన్ని అనువర్తింపు జేసుకున్నారు. నడుస్తున్న చరిత్రలో భాగమైనారు. తెలుగు సమాజంలోని వైవిధ్యం, వైరుధ్యాలను ఈరెండిటి మధ్య ఉన్న వివేషణను అర్ధం చేసుకున్నారు. సాహిత్య, ఉద్యమభావనకు ఆచరణ గీటురాయి . ఆ నిమగ్నత వెలుగులోనే పనిచేస్తున్నారు.
చాలాకాలంగా విప్లవ రచయితల సంఘంలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. తన ప్రాపంచిక దృక్పథం మార్కిజం, లెనినిజం, మావో ఆలోచనా ధోరణిని రత్నమాల స్వీకరించారు. పౌరహక్కుల సంఘం అధ్యక్షులుగా పని చేసారు. రాజ్య నిర్భంధ కాలంలో హక్కుల సంఘ నాయకత్వ భాధ్యతలు స్వీకరించి రాజ్య యంత్రాంగానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. రాజ్య రాపిడిని తట్టుకొని తను జీవించి వున్న కాలాన్ని నిర్వచించారు. మానవ పవృత్తిలో వున్న స్వార్ధ చింతన రత్నమాల స్వభావం లో లేదు. రాజకీయ, ప్రజా స్వామిక హక్కుల కార్యకర్త. ఆలోచనాపరులు ఏ పక్షం వహించాలో రత్నమాల నడిచినదారి ఒక ఉదాహరణ.
హైదరాబాద్ లో శరీరం సహకరించని స్థితిలో తన జీవనగమనాన్ని తడుముకుంటున్నారు. జీవితంలోని ఉద్యమ భాగం ఫలవంతం అయినదా! ఒక సంక్షుభిత, కల్లోల కాలాన్ని ఎలా ఉద్దీపన చేయగలిగాం! ఈదారి మరింత విశాలం కావాల్సింది కదా! వర్తమాన భారతదేశ గందరగోళం ఆమెను వెంటాడుతుంది. సమాజాన్ని వున్నతీకరించాము అనే దశ లో రాజకీయ, భావప్రకటన దగ్గరే మరొకసారి దేశం నిలబడింది. ఏ ప్రాధమిక హక్కుల కోసం రాజ్య ధిక్కారం చేసారో ఆ మలుపు దగ్గరే ప్రజలు భరోసా కోసం నిలబడి వున్నారు. ఇది భారతదేశ మన కాలపు స్థితి. ఆర్ధిక, అసమానతలు లేని భారత దేశం మాత్రమే సృజనకారుల ఊహ.
రత్నమాల సాహిత్య వీక్షణం విమర్శ, నూతన, దాక్షిణ్య వాదం నుంచి దండకారణ్యం దాకా భారత మహిళా ఉద్యమం అనే పుస్తకాల రూప శిల్పి. నడుస్తున్న భారతచరిత్రలో వలస, నిర్వాసితం మధ్య వున్న పునాదివర్గాల మానసిక భావోద్వేగస్థితి రత్నమాల అంతరంగం. నందిగ్రామ్, వాకపల్లి, పోలవరం, ఆదివాసి
అణిచివేత ఇవాళ కొత్త రూపం తీసుకుంది. ఆదివాసి రహిత భారతదేశం ఇవాళ్టి పెట్టుబడి అవసరం. రత్నమాల సకల అణిచివేత లకు ధిక్కార గొంతుక అయ్యారు.
కాలమే ఆమె రచన, కార్యాచరణను అంచనా వేస్తుంది.
*
Add comment