అగ్రహారంలో ప్రతి గుమ్మం ముందు దీపాలు పూసేవి.
ఆకాశంలో ఏ ముత్తైదువులు నక్షత్ర దీపాలుంచారో కాని మా ఆడపడుచులు దీపాలతో నక్షత్రాలను అగ్రహారంలో దింపేవారు. సాయం సంధ్య వేళ అగ్రహారమంతా దీపపు తోరణంలా వెలుగులు చిమ్మేది.
వర్షాకాలం ముగియడంతో అగ్రహారం మంచు దుప్పటి కప్పుకునేది. దీపావళి విరజిమ్మిన కాంతులు అగ్రహారంలో ప్రతి ఇంటిని దేవీప్యమానం చేసేవి. చేతిలో రెండు దీపాలతో కార్తీకమాసం అలా అలా నడుచుకుంటూ అగ్రహారంలోకి ప్రవేశించింది.
అగ్రహారాన్ని ఆధ్యాత్మిక వాతావరణం అక్కున చేర్చుకునేది.
అగ్రహారాన్ని నమ:శివాయ పంచాక్షరీ మంత్రం వీనుల విందు చేసేది.
అగ్రహారాన్ని కార్తీక శోభ కళకళలాడించేది.
అగ్రహారాన్ని వన భోజనం రారమ్మని ఆహ్వానం పలుకేది.
దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఒక్కరోజు వచ్చే అమావాస్య చీకటిని నెల రోజుల దీపపు కాంతులతో పారద్రోలేవారు. కార్తీక మాసం నాలుగో రోజున నాగుల చవితితో వేడుకలు ప్రారంభమయ్యేవి. నాగులచవితి నాడు తెల్లవారు ఝూమునే అగ్రహారం ఆడపడుచులు అమలాపురం పొలిమేరలలో ఉన్న గోదావరి పాయలైన నల్ల వంతెన, ఎర్రవంతెన దిగువన పారే కాలువలకు స్నానాలకు వెళ్లేవారు. అక్కడ స్నానాధికాలు ముగించుకుని ఇళ్లకు చేరేవారు. పాముల పుట్టలలో పాలు పోయడం అగ్రహారీకులకు అనవాయితి కాదు. అందుకే ఇళ్లలో గోడకు పసుపు రాసి దానిమీద కుంకమతో మూడు నాగుపాముల బొమ్మలను గీస్తారు.
వాటినే నిజమైన సుబ్రహ్మణేశ్వర స్వామిగా తలంచి, నూపప్పు, బెల్లంతో తయారు చేసిన చిమ్మిలి, బియ్యం పిండి, బెల్లం, ఏలకులతో తయారు చేసిన చలిమిడి నైవేద్యంగా పెడతారు. నాగులచవితి నాడు ఇంట్లో దీపాలు వెలిగించరు. కారణం దీపపు కాంతి సుబ్రహ్మణేశ్వర స్వామి కళ్లలో పడి నాగుపాములకు చేటు చేస్తుందని ఓ భయం. నాగుల చవితి నాడు 24 గంటల పాటు అగ్రహారం ఆడపడుచులందరూ కటిక ఉపవాసం ఉంటారు. అంటే కాఫీ కూడా చల్లగానే తాగుతారు. తయారిలో కూడా పొయ్యి ముట్టించరు. పొయ్యి నుంచి వచ్చే వేడి పాములకు హాని చేస్తుందని ఓ నమ్మకం. కార్తీక మాసంలో నాగులచవితి ఓ విశిష్టమైన పర్వదినం. ముఖ్యంగా సంతానం లేని దంపతులు నాగులచవితి నాడు నిష్టతో పూజలు చేసి, ఉపవాసాలు ఉంటారు. అలా చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
నాగుల చవితి పూజలు, ఉపవాసాల అనంతరం సంతానం ప్రాప్తిస్తే ఆ పిల్లలకు సుబ్రహ్మణ్య స్వామి పేర్లు పెట్టుకుంటారు. అందుకే ఆ నాటి తరంలో నాగేశ్వర రావు, నాగుబాబు, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, వల్లీశ్వర రావు, నాగేశ్వరి, వల్లి, సుబ్బలక్ష్మి, నాగవల్లి, నాగలక్ష్మి వంటి పేర్లున్న వారు అనేకానేకులు ఉండేవారు.
* * **
కార్తీక సోమవారం నాడు ఉదయాన్నేఅగ్రహారీకులు చలి గిలిగింతలు పెడుతూండగా కాలువల్లో తల మీంచి స్నానం చేయడం ఓ సాముహిక వేడుక. కాలువలో స్నానమాచరిస్తున్న సమయంలో “కార్తీక దామోదర… దయా దామోదర” అంటూ మంత్రం పఠించేవారు. అనంతరం నుదటన విభూది రేకలు పెట్టుకుని అప్పుడప్పుడే ఉదయిస్తున్న నారింజ రంగు సూర్య కిరణాల ముందు చలి కాగడం కాలువ ఒడ్డున కనిపించే కమనీయ దృశ్యం. కార్తీక సోమవారం నాడు ఉదయం నుంచి ఉపవాసంతో గడిపిన అగ్రహారీకులు సాయం సంధ్య వేళ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో శివుడికి అభిషేకాలు చేసేవారు. కాఫీ తప్ప ఏమీ తినని మావంటి పిల్లలు ఇంట్లో పెద్దలు చూడకుండా కర్పూరం అరటి పళ్లు తినడం ఓ మధురమైన జ్ఞాపకం.
రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నవకాయ పిండివంటలతో భోజనం కోసం ఎదురు చూడడం, దానికి ముందు ఆకాశంలో నక్షత్రాలు వచ్చాయో లేదోనని పదే పదే ఆకాశం వైపు చూసే వారు పిల్లలు. పెద్దలు కూడా కడుపులో ఆకలి నకనకలాడుతూండగా యథాలాపంగా ఆకాశం కేసి చూస్తున్నట్టున్నట్లుగా నటించడం పిల్లలమైన మాకు లోలోపల ఓ నవ్వు తెప్పించేది.
ఇంట్లో కార్తీక సోమవారం నాడు చేసే కందాబచ్చలి కూర ఇతర మాసాలలో చేసినప్పనటి రుచి కంటే భిన్నంగా, అద్భుతంగా ఉండేది. ఇది కార్తీకమాసానికే ప్రత్యేకమైన వంట.
* * *
అగ్రహారంలో ధనికులలో ఒకరైన డక్కన్ శాస్త్రి గారి ఇంట్లో లక్షపత్రి పూజ శోభాయమానంగా జరిగేది. అగ్రహారం చివర వేంచేసిన చంద్రమౌళీశ్వర ఆలయంలో లక్షపత్రి పూజలు ఘనంగా జరిగినా డక్కన్ శాస్త్రి గారి ఇంట్లో జరిగే లక్షపత్రి పూజకు ఎంతో విశేషముండేది. అగ్రహారం ఆస్థాన పురోహితులు తోపెల్ల నరశింహ మూర్తిగారు, మరువాడ మహదేవుడు గార్ల నేతృత్వంలో లక్షపత్రి పూజ ఎంతో ఘనంగా నిర్వహించేవారు. ఈ ఇద్దరు వేద పండితులు సనాతన ధర్మానికి నిలువెత్తు రూపంలా ఉండే వారు. మరువాడ మహదేవుడు గారు ఆజానుబాహుడు. ఎర్రగా, లావుగా నడుస్తున్న పౌరహిత్యంలా ఉండేవారు. తోపెల్ల నరసింహ మూర్తిగారు బొజ్జతో పొట్టిగా ఉండేవారు.
ఈయన అగ్రహారంలో నడిచి వెళ్తూంటే స్వయంగా వినాయకుడే అగ్రహారీకులను ఆశీర్వదించానికి వచ్చారా అన్నట్లు ఉండే వారు. వారిద్దరు పట్టు పంచెలు కట్టుకుని, చేతిలో గుడ్డ సంచితో వస్తూంటే నాలుగు వేదాలు రెండుగా మారి వస్తున్నట్లుగా తోచేవారు. బర్కిలీ సిగరెట్లకు పోటీగా మార్కెట్లోకి వచ్చిన డక్కన్ సిగరెట్ల పంపిణీదారుడు శాస్త్రి గారు. ఎర్రగా నిలువెత్తు రూపంతో ఉండేవారు. ముఖంలో చిరునవ్వు తప్ప ఆయనలో ఎప్పుడు కోపాన్ని చూడలేదు అగ్రహారీకులు. దీపావళికి ఇంటి ముందు అరటి బోదెలతో ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేసేవారు డక్కన్ శాస్త్రి గారు. దీపావళినాడు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే బాణసంచా కాల్పులు అర్దరాత్రి ఏ 12 గంటలకో ముగిసేవి.
డక్కన్ శాస్త్రిగారి ఇంట్లో దీపావళి నాడు ప్రారంభమైన కార్తీక మాసపు వేడుకలు లక్షపత్రి పూజతో అంబరాన్ని తాకేవి. పిలుపులు, మర్యాదలతో నిమిత్తం లేకుండా అగ్రహారంలోని వారందరూ డక్కన్ శాస్త్రిగారి ఇంట్లో జరిగే లక్షపత్రి పూజకు విధిగా వెళ్లేవారు. లక్షపత్రి పూజ సమయంలో డక్కన్ శాస్త్రిగారు ఓ అద్భుత రూపంతో మెరిసిపోయే వారు.
పట్టుపంచె, భుజాల మీంచి గుండెల వరకూ కప్పుకున్న పట్టు కండువాతో అందరినీ నవ్వుతూ ఆహ్వానించేవారు. భుజాల మీంచి కప్పుకున్న పట్టు కండువాలోంచి ఆయన గుండెల మీద ఉన్న వెంట్రుకలు పట్టులా వెరుస్తూ కనిపించేవి. ఎర్రటి ముఖంపై విభూది రేకలు, ముక్కుకి పైనా… నుదిటికి కిందా… రెండు కనుబొమ్మలకి మధ్యలో పెట్టుకున్న ఎర్రటి బొట్టు శివుడి మూడో కన్నులా ఉండేది. పూజ అనంతరం జరిగే భోజనాల వేడుక పనులను అగ్రహారీకులందరూ ఎవరికి వారే తమ భుజానికెత్తుకునే వారు. దీపపు కాంతులతో, విద్యుత్ వెలుగులతో డక్కన్ శాస్త్రిగారి ఇల్లు దేదీప్యమానంగా విరాజిల్లేది.
* * *
కార్తీక మాసంలో మరో పండుగ క్షీరాబ్ధి ద్వాదశి. ఈ వేడుక బాల్యంలో ఓ తీపి జ్ఞాపకం. ఓ మధురానుభూతి. ఏకాదశి ఉపవాసాల అనంతరం క్షీరాబ్ధి ద్వాదశి వేడుక ప్రారంభమయ్యేది. క్షీరాబ్ధి ద్వాదశి సాయంత్రం అగ్రహారంలోని ఆడపడుచులందరూ తులసికోట ముందు భక్తిశ్రద్దలతో పూజలు చేసేవారు. తులసి కోటలో ఉసిరి, కృష్ణతులసి, లక్ష్మీ తులసి మొక్కలను ఉంచి వాటికి పూజలు చేస్తారు. ఉసిరికాయ దీపాలు పెట్టి విష్ణువును ఆరాధిస్తారు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు శేషశయనంపై పవళించిన విష్ణుమూర్తి… క్షీరాబ్ధి ద్వాదశి నాడు నిద్ర లేస్తారని ఓ నమ్మకం.
అలా విష్ణుమూర్తిని దీపాలతో స్వాగతం పలుకుతూ నిద్రలేపడమే ఈ క్షీరాబ్ధి ద్వాదశి ప్రత్యేకత. క్షీరాబ్ధి వేడుక అగ్రహారం ఆడపడుచులకే కాదు, పిల్లలకు కూడా పెద్ద పండగే. ముఖ్యంగా అగ్రహారంలో పెరిగిన నా వంటి వారికి మరీను. నేను, వక్కలంక సత్తిబాబు, రాయప్రోలు శేఖర్, అనిపిండి చిట్టి మరికొందరు మిత్రులం ఓ జట్టుగా ఇంటింటికి తిరిగే వాళ్లం. క్షీరాబ్ధి ద్వాదశి సాయంత్రం కాగానే ఆగ్రహారంలో ఉన్న ఇళ్లకు వెళ్లేవాళ్లం. వాళ్లిచ్చే అటుకులు, బెల్లం, కొబ్బరి ముక్కల ప్రసాదం అద్భుతం. వాటి కంటే కూడా వారిచ్చే డబ్బులు మమ్మల్ని మరింత ఆకర్షించేవి. ముందుగా పట్టాభి వీధితో ప్రారంభమయ్యేది మా యాత్ర.
అంతకు ముందు రాత్రిళ్లు ఆ వీథిలోకి వెళ్లాలంటే ఓ భయం. డక్కన్ శాస్త్రిగారి ఇంటి వెనుక ఉన్న చింతచెట్టు మీద దెయ్యం ఉందనే బెరుకు క్షీరాబ్ధి ద్వాదశి నాడు మాత్రం కనిపించేది కాదు. వీధి మొదట్లో ఉండే నముడూరి వారి ఇంటికి వెళ్లగానే నముడూరి రాముగాడి నాయనమ్మగారు ‘అదిగో పిల్లలు వచ్చేసారు. వాళ్లకి ముందుగా ఇవ్వండి. ఇంకా చాలా చోట్లకి వెళ్లాలి వాళ్లు’ అనేవారు. అక్కడి నుంచి మండలీక వారి ఇల్లు. పక్కనే పెమ్మరాజు మాష్టారి ఇల్లు. పెమ్మరాజు మాష్టారి సతీమణి మహా ఇల్లాలు. ఎందుకో తెలియదు కాని నా పట్ల ప్రత్యేక ప్రేమా, అభిమానం. మా జట్టుకు కలిపి అర్దరూపాయో, రూపాయో ఇచ్చేవారు. మా జట్టులో వారెవరూ చూడకుండా నాకు విడిగా పావలా ఇచ్చేవారు. ఈ అభిమానం ఆ తల్లి స్వర్గస్తులయ్యే వరకూ నామీద చూపించారు. ముఖ్యంగా మా అమ్మ మరణించాక నా పట్ల ఆవిడ వాత్సల్యం మరింత పెరిగింది.
పెమ్మరాజు శ్రీను, గణపతి, రాంబాబు పెద్దవాళ్లయ్యాక ఆ తల్లి కలిపిన అన్నం ముద్దలు తిన్నారో లేదో నాకు తెలియదు కాని నేను మాత్రం అమలాపురం వెళ్లిన ప్రతిసారి కందిపొడి కలిపిన అన్నం ఆ మహాతల్లి నాకు ముద్దలుగా అందించడం నా పూర్వజన్మ సుకృతమే. పట్టాభి వీధి తర్వాత ఆగ్రహారంలో ఇతరుల ఇళ్లకు వెళ్లేవాళం. గడియారాల శివరావుగారు అనే సింహం ఓ పక్క, భమిడిపాటి పార్వతీశం గారు అనే మరో సింహం ఇంకో పక్క ఉండగా ఆ ఇద్దరి మధ్యలో ఉండే కర్రా రాము ఇంటికి వెళ్లే వాళ్లం. కర్రా రాము వాళ్ల నాన్నగారు పిల్లల పట్ల చూపించే వాత్సల్యం అద్భుతం. బయటకు వచ్చి ధైర్యం చేసుకుని భమిడిపాటి వారింటికి వెళ్లే వాళ్లం. మా కోసమే నిరీక్షీస్తున్నట్లుగా పడక్కుర్చీలో కూర్చునే వారు పార్వతీశం మాష్టారు. మేం కనపడగానే నవ్వుతూ ‘‘పెరట్లోకి వెళ్లండి. ప్రసాదాలు మళ్లీ అయిపోతాయి’’ అనే వారు. అంతే ఒక్క గెంతుతో పెరట్లో పడేవాళ్లం. అక్కడ ప్రసాదం, వారిచ్చే డబ్బులు తీసుకున్నాక, సరిపెల్ల వారింటికి వెళ్లేందుకు కాస్త ధైర్యం వచ్చేది.
నిజానికి మా భయమే కాని శివరావు గారు అరుగు మీద కూర్చుని మా కోసమే ఎదురు చూసే వారేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఆ వయసులో అలాంటి భయాలు ఎదురు కాకపోయి ఉంటే జీవితంలో ఇలా కూడా స్ధిరపడే వాళ్లం కాదేమో. ఇక్కడ నుంచి క్రిష్ణారావు వీధి. ఈ వీధిలో కామాక్షి పీఠం పక్కన ఉన్న వైస్ ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్లడమంటే ఓ అనాసక్తి. ఇది పెద్దయ్యాక కూడా పోలేదు. ఆ ఇంటి ఎదురుగా ఉన్న అయ్యగారి శ్రీను వాళ్ల ఇల్లు, తటవర్తి రామా వాళ్లిల్లు, చివర్లో పీడీగారి ఇల్లు. వీరంతా మా రాక కోసం ఎదురు చూసే వారు. మాకు ప్రసాదాలు ఇవ్వడంలోను, డబ్బులు ఇవ్వాలనుకోవడంలోనూ వీరికి చాల ఆనందం కనిపించేది.
మా జట్టులో వారు కాకుండా నేనొక్కడినే ఇన్ కంటాక్స్ ఆఫీస్ వీధిలో ఉండే అడ్వొకేటు జయంతి సత్యనారాయణ గారింటికి వెళ్లే వాడ్ని. దీనికి కారణం వాళ్లబ్బాయి జయంతి వఝలు మా మూడో అన్నయ్య ముక్కామల రామం మంచి మిత్రులు. అక్కడ కూడా పావలా లేదూ అర్ద రూపాయి తక్కువ కాకుండా ఇచ్చేవారు. చివరిగా బులుసు గాడిల్లు, మా ఇల్లు, సత్తిబాబు వాళ్లిల్లు, అనిపిండి చిట్టిగాడిల్లు.
మా ప్రయాణం పూర్తి. ఇన్ని ఇళ్లు తిరిగి సంపాదించుకున్న డబ్బులు వాటాలు వేసుకుని పంచుకునే వాళ్లం. చాల ఎక్కువ వచ్చింది అనుకుంటే.. అది ఒక్కొక్కరికి… రెండు రూపాయలో, మూడు రూపాయలో.. అంతే. అదే ఇప్పుడు పదివేలతో సమానం.
కాని క్షీరాబ్ధి రాత్రి, కార్తీక మాసం మిగిల్చిన నెమలీక జ్ఞాపకాన్ని దేంతో సరిపోలుస్తాం.
* * *
ఎప్పటి లాగానే చక్కగా వ్రాసారు.
శివాలయం లో జ్వాలా తోరణం గురించి కూదా వ్రాసి. ఊంటే
బాగుండేది
Correctly…it is short period of stay at Amalapuram in my childhood..but , was good time we spent to carry the memories..
Nemaleeka laanti gnapakam … Kanda bachali antha ruchi …kartheekam antha pavithram … verasi Agraharm oka adbhutham …daani meeda mee katha inka adbhutham 👏👏
సార్…
ఎన్నో.. ఎన్నో జ్జాపకాల దొంతరలు తీసుకొస్తున్నారు…
ఏమని వర్ణించనూ….
Chala baga rasavu annayya.Kallaki kattinatlu cheppavu.Nee memory ki salute..Chinnanati gnapakalani Akshara malikalatho mammalini tanmayatvamu chendistunnavu..Karthikamasamu lo konaseema(Amalapuram) ela vuntundo Superb ga cheppavu.Ivvala telisindi enduku subramanyam,nageswarrao,valli etc Perlu chala vunnayo…I became fan of ur pen down skills.Amazing..
Awaiting for many a more..Thank you
అద్భుతం గా రాసారు…చదువుతూ ఉంటె అగ్రహారం వీధుల్లో తిరుగుతూ గోదావరి పాయలో స్నానం చేసి కార్తీక దీపాలు చూస్తూ, శివ నామస్మరణా వింటూ ప్రతి అనుభవం స్వయంగా గమనిస్తున్నట్లనిపించింది…
చిన్నప్పటి విషయాలు కళ్ళకి కట్టినట్టు వ్రాసారు.మాది కోనసీమే అధన్యవాదములు
కధ వ్రాసేటప్పుడు కధనాన్ని వాస్తవాన్ని వీడకుండా పాఠకులను నీ కూడా తీసుకు వెళ్ళి మరొక సారి ఆ జరిగిన వాస్తవ సంఘటనలను కళ్ళకు చూపిస్తూ మనస్సు కి హత్తుకునేలా చేసావు ముక్కామల. మన సత్ సాంప్రదాయాన్ని తరువాత తరానికి అందించిన తద్ ఘనత నీకే చెల్లు.
బుజ్జీ! కథ శీర్షికతోనూ, ఎత్తుగడతోనే నీ ప్రత్యేకతను ప్రకటించావు. దీపాలు పూయడం అద్భుత ప్రయోగం. ఇక, ఆడపడుచులు నక్షత్రాలను అగ్రహారంలో దింపడం, చాలా కళాత్మకమైన భావన. అలాగే నడుస్తున్న పౌరోహిత్యం, నాలుగు వేదాలు రెండుగా మారడం మా బుజ్జి మార్కు తళుకుల మేజిక్కులు. ఇక జ్ఞాపకాల దొంతర్ల గురించి ఏంచెప్పినా, ఎంత చెప్పినా తక్కువే! చాలా సంతోషం. చాలా చాలా సంతోషం.
కథా వస్తువు.. వర్ణన అద్భుతం
అగ్రహారంలో ప్రతి గుమ్మం ముందు దీపాలు పూసేవి ఈ మొదటి వాక్యంతో పాఠకుడిని కట్టి పడేశాడు రచయిత. “చేతిలో రెండు దీపాలతో కార్తీకమాసం అలా అలా నడుచుకుంటూ అగ్రహారంలోకి ప్రవేశించింది” ఎంత బాగుందో వర్ణన. ఎక్కడా అతిశయోక్తి అనిపించలేదు, అన్నీ జరిగినవి జరిగినట్లుగా ఆగ్రహారం లోని ప్రతీ ఇంటిని పలుకరిస్తూ వారు ఎలా కనబడుతారో ఎప్పూడూ చూడని నాలాంటి పాఠకుడు సులభంగా ఊహించుకునే విధంగా పరిచయం చేశాడు. చివరగా “క్షీరాబ్ధి రాత్రి, కార్తీక మాసం మిగిల్చిన నెమలీక జ్ఞాపకాన్ని దేంతో సరిపోలుస్తాం అని ముగిస్తాడు. బాల్యాన్ని ఇంత గొప్పగా చెప్పగలగడం చేయి తిరిగిన రచయిత ‘బుజ్జిగాడి” లాంటి వారికే సాథ్యమనిపిస్తీంది. All the Best Bujji ! Good going Agraharam !!
Hatsaff to your terrific memorable skills. Almost 40 years back episode ni, live lo symbolic ga chupinchavu.
Really proud to claim myself as your friend.
Adbhutamaina ruchigaaa vundiraaa chakriga 💯
పాత జ్ఞాపకాలను నెమరి వేసుకున్నారన్నమాట…అద్భుతంగా ఉంది చక్రధర్ గారూ.. నమస్తే.
ఈ కథ అందం నెమలీక అందమంత