ఉత్తరాంధ్ర మేప్ సరిగ్గా సూడండి…యెక్కుబెట్టిన తుపాకీలాగ ఉంటాది. అదేటి సిత్రమో ఊరంతటిదొక దారయితే ఉలిపికట్టెది ఒక దారి సామెత లాగ ఉత్తరాంధ్రది ఉలిపికట్టె దారి.
అలనాడు భూభాగాలని రాజులూ, సెక్రవొర్తులూ యెవులెవులో పాలిస్తున్నపుడు (పాలు ఇస్తున్నపుడు కాదండీ బాబూ… ఏలుతున్నపుడన్న మాట) ఈ భూభాగాన అలాటోళ్ళెవురు లేరండీ…! ఆళు యే పాలూ (యెరిటేజో గట్రా) ఇవ్వలేదండీ! అసలకి ఉత్తరాంధ్ర అని ఇపుడంతే దిక్కు పేరుతోటి పిలస్తన్న దిక్కుమాలిన ప్రాంతం గానీ దీనికి అప్పుడు కళింగం అని పేరండీ. కళింగం ల యెవుడికి ఆడే యజమానండీ. యెవుడి మగ్గానికి ఆడు శెనాపతి అంతారె అలాగ. ఆడ, మొగా తేడాల్లేవు. గరీబూ, అమీరూ అగుపడరు…అందరొకటిగ బతికీవోళ్ళు. రాజూ, బంటూ లేరు. సంద్రం, అడివీ, సారవొంతమయిన పల్లబ్భూములూ…అటు గోదారి కాంచి ఇటు మహానది వరకి కళింగమే!
అడివిల బతికేవోళ్ళు, సంద్రం దగ్గిట బతికీవోళ్ళు, పంటభూముల కాడ బతికీవోళ్ళు… యెవుళను కున్నారు? రేయీ, పగలూ కష్టపడే మనుషులు. ఆళ్ళకి సిక్కితే రత్తమొస్తాది అంత కండల్తోటి శరీరాలు వున్నోళ్ళు. ఆళ్ళు సదువూ, సంధ్య లేనోళ్ళే గానీ పనీ పాటు చేసేవోళ్ళు. ఆళ్ళకి వొత్తినే కూకోడం తెలీదు. అస్తమానం నిద్రోడం తెలీదు. కారని సెమటల శెరీరాలు కావవి. సెమటలే స్నానాలు ఆళ్ళకి. తిన్న ప్రతీ మెతుకూ అరిగేదాకా వొళ్ళొంచి పాటుపడతారు.
ఆళ్ల సంద్రాన దవాలు, బంగారుపాపలు, బొమ్మిడాలు, జెల్లలు, కొర్రమీనులు, కారవాలు… వొకటేటి సేప జాతి సమస్తం బతకతాయి. సంద్రం ఆళ్ళ పిల్లకాయలకి నిలువీత, మునగీత, బారీత నేర్పుతాది. కెరటాల మీద నడకలు నేర్పుతాది. ఇసకల కట్టిన గూళ్ళని కెరటం ముంచీసినా మళ్ళా మళ్ళా బతుకు గూళ్ళు కట్టడం మానొద్దంతాది. పడి లేవడం తెలిసిన కెరటాలు… తీరాకాశం మీద తారలు ఆళ్ళు!
ఆళ్ళ కొండాకోనల్లోన కజ్జాపనస కావిళ్ళునిండతాయి. కొండమామిడి, చింతపండు, ఇప్పపువ్వు, జీడిపిక్క సేతులకందుతాయి. జీలుగుకల్లు కడుపు నింపుతాయి. రెల్లుగడ్డి ఇంటి కప్పులేస్తాది. గుగ్గిలం, బర్నిక, యేగిస దూలాలు, తుమ్మ, పాసి, వేప నిలువు రాటలయి ఇళ్ళని నిలుపుతాయి. అడివిపూల గంధం ఆళ్ళ గూడేల్లో గిలిగింతలాట ఆడతాది. పున్నమి సెంద్రుడు గూడల వీధుల్లో ధింసా ఆడతాడు. పులులూ, సింహాలూ, సిందవలూ, యేనుగులూ ఆళ్ళ గానుగలను తిప్పుతాయి. గంగిగోవులూ, గొర్రే, మేకలూ ఇంటి ముందరి సాలల సంతానాలవుతాయి. జీవరాశి సమస్తం తోటి బతకడం నోకానికి నేర్పిన ఆదిశక్తులు ఆళ్ళు. పచ్చదనాల పసిడికొండలు ఆళ్ళు!
ఆళ్ళ సారవొంత మైదాన భూముల్ల…
నోకపు ఆకలి సీకట్ని తరిమే బువ్వల దివ్వలు యెలుగుతాయి. నల్లరేగడి మట్టి ఆళ్ళ సేతుల్ల మాణిక్యమవుతాది. యెక్కడో పుట్టి యెటెటో తిరిగే నదులు…ఆళ్ళ భూముల్లోకి ప్రవహించి పుణ్యనదులవతాయి. వొర్షం ఆళ్ళ భూముల ఆల్చిప్పల్లో పడి ముత్యమవతాది. ఆళ్ళు నడిచే పంటమొక్కలు… నాగేటిచాళ్ళలో కాంచన సీతల్ని కన్న జనకులు.
అది కళింగం. జన గణతంత్ర భూభాగం. అక్కడ సంద్రాన సంపద, అడివీ, కొండల కలప, ఖణిజం, మణులూ, రాయీ, రప్పలు, పల్లపు పంటలు…యేనుగులు, వోడలు యెనలేని భాగ్యాల కళింగం మీద యెవుళెవులికో కన్ను పడింది. ఇకేటి…భాగ్యాల కళింగాన్ని దోచుకోవాల. ఆక్రమించుకోవాల… ఒకళా, యిద్దరా… పదుల సంఖ్యలో రాజులు, సెక్రవర్తులు దాడులుకి దిగిపోనారు. దిగినోడికి దిమ్మతిరిగిపోనాది…యెనక్కి పరిగెత్తించేరు కళింగులు. సంద్రం…కొండాకోనా… అడివిలూ…యేనుగులూ, సిం హాలూ… బాకులూ, బళ్ళేలూ, జనగణ కళింగాన్ని జయించ సాధ్యం కాలేదు. సేనామంది సెక్రవొర్తులూ, రాజులూ కళింగం కేసి చూడ్డానికి భయపడ్డారు. చండాశోకుడు మాత్రం ఒకసారి కాదు పదుల సార్లు…దాడులుకి దిగేడు. మాయ జేసాడు. కళింగం ఆడపడుచు కారువాకిని యెత్తుకుపోనాడు, తంత్రాలు చేసాడు…అయినా లొంగని కళింగాన్ని యెన్నెన్నో సైనిక బలగాలతో, కొత్తకొత్త ఆయుధాలతో చీకటి దాడులు చేసాడు, వెన్నుపోట్లు పొడిచేడు. కళింగనదుల్లో జనగణాల నెత్తురు పారించేడు. వేలాది మందిని చంపేడు. లక్షలాది మందిని బానిసలుగా పట్టుకు పోయేడు. కళింగాన్ని ఆక్రమించేడు.
అద్గద్గో… అప్పుడు కాంచి జనగణ కళింగం పరతంత్రమయ్యింది.
స్వతంత్ర దేశంలో కళింగం ఉత్తర విశాఖ అయ్యింది, తరాత సిక్కోలు అయ్యింది. తరాత ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఉత్తరాంధ్ర అయ్యింది. ఇపుడు మూడు జిల్లాల ఉత్తరాంధ్ర లో గూడా కళింగం నాటి సంద్రం, అడివీ, కొండాకోనా, సారవంత మైదానభూమీ ఉన్నాయి. సహజవనరుల సంపదుంది. సంపదల మీద అశోకుడిలా… ఆల్ఖైమా, జిందాల్, టాటాలు, బిర్లాలు, అంబానీలు, ఆదానీలు…యెవుళెవులో కన్నేసారు. అడివిమీద, సంద్రం మీద, సారవంత భూమ్మీద కంపెనీవోళ్ళు జెండాలు పాత్తండ్రు.
అశోకుడు రోడ్లు వేసెను, రోడ్లకిరువైపులా చెట్లు నాటించెను. బావులు తవ్వించెను…అని తప్పా వేలాదిమంది కళింగులను చంపెను, లక్షలాది మందిని బానిసలుగా తీసుకుపోయెను, ఆ బానిసలేమయ్యెను… వంటి చరిత్ర పాఠాలు చదవలేదు మేము.
మా తర్వాత తరాల వారు – బిర్లా ఆలయాలు నిర్మించెను, టాటా రైలు మార్గాలు వేసెను, అంబానీ, ఆదానీలు ఉత్తరాంధ్ర లోని సంపదలను వెలికితీసి అభివ్రుధ్ధి చేసెను వంటి చరిత్ర పాఠాలు తప్పకుండా చదువుకుంటారని ఇందుమూలంగా సదువరులయిన పదుగురికీ ఈ ఊసు సెప్తున్నాను.
అయితే అశోకుడిని యెదిరించిన కారువాకలు తరం నుంచి తరానికి పుడతానే ఉన్నారు. మొన్న సోమ్ పేటలో, నిన్న కాకరాపల్లిలో ఆ కారువాకల వారసులు కంపెనీల ఆక్రమణలకు యెదురు నిలిచేరు. యెక్కడా వోడని కార్పొరేట్ కంపెనీ సొంపేటలో వోడిపోయింది. ఆ వూసు మళ్ళీ సంచికలో…!
*
“యెక్కడో పుట్టి యెటెటో తిరిగే నదులు…ఆళ్ళ భూముల్లోకి ప్రవహించి పుణ్యనదులవతాయి. వొర్షం ఆళ్ళ భూముల ఆల్చిప్పల్లో పడి ముత్యమవతాది. ఆళ్ళు నడిచే పంటమొక్కలు…నాగేటిచాళ్ళలో కాంచన సీతల్ని కన్న జనకులు.” ఏం రాసారు అప్పల్నాయుడు గారు ???? ఉత్తరాంధ్రపైన, అక్కడి కారువాకిల వారసుల పైన మీకున్న ప్రేమనంతా ఇట్లాంటి మాటల్లో నింపి మీరు చెప్పే వూసులకోసం ఎదురుచూడక తప్పదింక.
Thanq
గొప్ప వ్యాసం గురువు గారూ.. ఒక ఎమోసనల్ టచ్ తో ఒక ఎత్తుకి వెళ్లింది. నిర్మాణ వ్యూహమున్న వ్యాసం. అంతే తప్పుడు చరిత్ర గుడ్డలూడగొట్టాలి. ఊడగొట్టారు. గతాన్ని వర్తమానాన్ని అంచనా కట్టే పని.. మీ చూపులోంచి, నేల భాషలోంచి.
థాంక్ మౌళీ
నూతన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర భవిష్యత్ పై ఇప్పటికిప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటులా కనిపించ వచ్చు. కానీ సామాజికంగా, పాలనాపరంగా, రాజకీయంగా కొత్త రాష్ట్ర పాలకుల, ప్రతిపక్షాల ప్రాధాన్యాలు గమనిస్తే ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి.
ఇదే విషయమై రాష్ట్రంలో మరో వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు అనుమానాలున్నాయి. ఈ రెండు ప్రాంతాల ప్రయోజనాలు తాకట్టు పెట్టి అభివృద్ధి అంతా కోస్తా వైపు కేంద్రీకరిస్తారని ఉత్తరాంధ్ర, రాయలసీమ ఆలోచనాపరులు ఆందోళన చెందుతున్నారు. అందుకే అప్పలనాయుడు వంటి వారి గొంతుకలు ఉత్తరాంధ్ర నుంచి, బండి నారాయణ స్వామి వంటి వారి గొంతుకలు సీమ నుంచి ప్రజలను జాగృత పరుస్తున్నాయి. చక్కని విశ్లేషణ అందించిన అప్పలనాయుడు గారికి ధన్యవాదములు.
Thanq balleda
“అశోకుడు రోడ్లు వేసెను, రోడ్లకిరువైపులా చెట్లు నాటించెను. బావులు తవ్వించెను…అని తప్పా వేలాదిమంది కళింగులను చంపెను, లక్షలాది మందిని బానిసలుగా తీసుకుపోయెను, ఆ బానిసలేమయ్యెను… వంటి చరిత్ర పాఠాలు చదవలేదు మేము.#మా తర్వాత తరాల వారు – బిర్లా ఆలయాలు నిర్మించెను, టాటా రైలు మార్గాలు వేసెను, అంబానీ, ఆదానీలు ఉత్తరాంధ్ర లోని సంపదలను వెలికితీసి అభివ్రుధ్ధి చేసెను వంటి చరిత్ర పాఠాలు తప్పకుండా చదువుకుంటారని ఇందుమూలంగా సదువరులయిన పదుగురికీ ఈ ఊసు సెప్తున్నాను.”
మిత్రులు అట్టాడ అప్పలనాయుడు గారు తనదయిన ప్రత్యేక శైలి లో చెప్పిన ఊసు చాల బావుంది.
Thanq dit