ఒక మాట :
ఇవన్నీ నా బాల్యపు అనుభవాలు. వాటినే కొన్ని చిన్న చిన్న కథలుగా రాశాను.
ఈ కథలు 1970 వ దశాబ్దపు ఉత్తరాంధ్ర జీవితాన్ని, అందునా ఒక చిన్న రైతు, లేదా రైతుకూలీ జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. తన బిడ్డల పెంపకంలో ఒక తల్లికి ఎదురైన పరిస్థితులు,ఆ పరిస్థితులను ఎదుర్కోవడంలో తను పడిన సంఘర్షణను ఈ కథల్లో చూపించాలని నా ప్రయత్నం.
1970 వ దశాబ్దం వరకు ఆహారధాన్యాలు ఉత్పత్తి, పంపిణి ప్రజల అవసరాలకు సరిపడా లేకపోవడం వలన ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగాపేద, దిగువ మధ్యతరగతి ప్రజలు అర్ధాకలి జీవితాలను గడిపేరు.పేదలు, కూలీల బతుకు చాలా దుర్భరంగా వుండేది.
ఆదే దశాబ్దం చివరలో సరికొత్త వంగడాలు వచ్చి.ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చేంతవరకు గ్రామజీవితంలో ఆకలే రాజ్యమేలింది. తన బిడ్డలను ఆ ఆకలిబాధకు గురికాకుండా చూడటానికి తల్లి పడ్డ తపనను అక్షరాలలో పెట్టేను .
నేను ఆ కాలంలో బాల్యాన్ని గడపడం వలన నేను చూసిన లేదా నా అనుభవంలోకి వచ్చిన నాటి పరిస్థితులను మా కుటుంబ నేపథ్యంలోనే రాశాను. మా అమ్మ ఆలోచనలు, సరదాలు, చమత్కారాలు అన్నీ కలగలిసి పాఠకులకు ఆసక్తి కలిగిస్తాయని నా నమ్మకం.
పిక్కురోడు” అంటే చాలా చిన్నవాడు,లేదా పిల్లలలో ఆఖరి వాడు అని అర్థం.ఇది ఉత్తరాంధ్ర పలుకుబడిలో.
1
“నెగర్రమ్మా..బువ్వలుతిందుము గానీ” అంది మా అమ్మ
ఆరోజూ ఎప్పటిలాగే పొద్దుపోయాక మా సీతప్ప, నేను పెద్దగదిలో కిరసనాయిలు బుడ్డి పెట్టుకుని చదువుతున్నాము. అప్పుడు సీతప్ప ఐదవ తరగతి చదువుతోంది.నేను నాలుగవ తరగతి చదువుతున్నాను .
మేము చదువు ఆపితే రాత్రి భోజనాలు వడ్డిస్తాది మా అమ్మ.
రాత్రి తిళ్లేలవరకూ అలా మేమిద్దరం చదువుతుంటే మా వెనకని గోడ కానుకొని కూర్చొని వినేవారు మా అయ్య,మా అమ్మ. ఆ పక్కనే మా సూరన్నయ్యకూడా వుండేవాడు.
ఇంట్లో వాడేది ఒకే కిరోసినుబుడ్డీ కావడం,యిద్దరమూ ఆబుడ్డీ దగ్గరే చదవడం వలన సరిగా కనపడేది కాదు. కిరసనాయిలు బుడ్డీ ఒత్తి ఎగేస్తే గానీ ఎక్కువ వెల్తురు రాదు.అలాగని ఒత్తిని పెద్దదిచేస్తే పొగెక్కువగా వచ్చేది. కంపు. కిరసనాయిలు వాసన, ఊపిరాడేది కాదు నాకు. ముఖం అటుతిప్పి , యిటుతిప్పి చదివేవాణ్ణి.
మా ఎదురింట్లో మా మేనమామ శంబంగి అప్పలస్వామి కొడుకు ఈశ్వర రావు చదివేవాడు. ఈశ్వర్రావు నాకంటే ఓక్లాసు పైన అనగా మా సీతప్ప వాళ్ళ క్లాసులో చదివేవాడు
చదువంటే యిలాగలాగ కాదు పోటీ..ఎంత గట్టిగా గొంతెత్తితే అంత గొప్పగా చదివినట్టు.
మా ఎదురింటికి పక్కగా ఉండే కొల్లోలి పాపమ్మ పెద్దమ్మ ఎప్పుడూ అనేది
“సదువంతే అదిగో అలగే సదవాలి నోటినిండా..రెడ్డోలి కిష్ణ సదివితె యిందు మా అన్నట్టుగుంటాది.” అనేది.
నాకు న్నప్పటి నుంచి మంచిపేరు మా వీధిలో. బాగా చదువుతానని. దానర్ధం గట్టిగా స్పష్టంగా అని.
అదిగో అలాటి సదువే చదువుతుండగా మళ్లీ మా అమ్మ అంది.
“ఇక నెగర్రా..బువ్వలుతింతే.. కావాలంతే మళ్లీ సదువు కుందురుగానీ!.” అని.
“అన్నయ్య కల్లాని కెల్లాల ..,నాను గిన్నెలు తోముకోవాల…మీ అయ్య నిద్దరొత్తా దంతా డు…బేగి పడుకుంతే గానీ తెల్లారి బేగి నెగనేము.” మాతోనే చెప్తోందో, తనలో తనే మాట్లాడు కుంటోందో అన్నట్టుగా అంటోంది.
మేం లెగిస్తే ఆ బుడ్డీ వంటింట్లోకి పట్టుకెల్లి బువ్వలొడ్డిస్తాది.
వంటగదిలో ఆ చివరగా మా సూరన్నయ్య కూర్చున్నాడు.మధ్యలోనేను.నా పక్కని మా సీతప్ప. అక్కడ మూడు పీటలే పట్టేవి.మా అయ్య పెద్దగదిలో మా వైపుగా తిరిగి కూర్చొనే వాడు. మా సీతప్పకి మా అయ్యకి మధ్య ద్వారబంధమే అడ్డు.
మా అమ్మ, ముందు మా అయ్యకు కంచుగిన్నెలో అన్నమొడ్డించి దాని మీద కొంత యిగురేసి, గిన్నె అందించింది. నేను ‘కూరేటా ..’ అని తొంగి చూసాను. కూరగిన్నెలో గుడ్డు ఒకటేసి మా అయ్యకిచ్చింది.అది కనపడింది.
“ఆయ్.. ఆయ్ గుడ్డు..” అన్నాను. గుడ్డు చూడగానే గొప్ప ఉత్సాహమొచ్చింది.
ఆ తరువాత మా అన్నయ్యకు సిలవర గిన్నెలో అన్నమేసి కూర ప్లేటులో గుడ్డేసి యిచ్చింది. మా సీతప్పకి నాకు వేరు వేరు పళ్లేలలో అన్నమేసి ఒక గుడ్డుని రెండు ముక్కలు చేసి చెరొక ముక్కా వేసింది.
నా ఉత్సాహం నీరుగారిపోయింది.
“ఆ…నాకు ముక్కా..! నాకొద్దు .. నాకు గుడ్డు పాలంగా కావాలి..” అన్నాను. ఏడుపు ముఖం పెట్టి.
“నేవమ్మా ! మూడుగుడ్లే వొండాను” అంది మా అమ్మ, కొంచెం గారాబంతో నెమ్మదిగా ముద్దుగా చెప్పింది.
“నాకు తెలీదు… నాకు గుడ్డుపాలంగా కావాలి… అమ్మ..ఆ…ఆ.” అంటున్నాను అన్నం తినకుండా.
“నేంది నేనెక్కడ తెచ్చీదిరా!.., నాలుగు పుంజీల గుడ్లు కోడికి పట్టుగట్టి పెట్టేశాను. మూడుంటే అవే వొండేను. ఈపాలి ఒండితే నీకు పాటుగా ఏత్తాన్నే , తినియ్యమ్మా!” బతిమిలాడినట్టు నెమ్మదిగా అంది.
“నేంతిన్ను ..నాకు కావాలి….” ఇదండం పెట్టాను. (ఏ రోజైనా గుడ్డు పూర్తిగ తినాలనేది అప్పట్లో నా కోరిక. అది ఆ రోజుల్లో ఎప్పుడూ నెరవేరలేదు.)
“ఇదసూడు దాకలో నేనేమి దాసుకోలేదు”. అని కూరదాక చూపించింది.
అందులో మరి గుడ్లులేవు. అడూగున కొంచెం వూరుపులాగవుంది.అంతే
“నాకు తెలీదు..నాకు గుడ్డంతా కావాలి..” అంటూనే వున్నాను.
అంతవరకూ గుడ్డు ముక్కను తినకుండా చారన్నమే తింటున్న మా సీతప్ప,మా అమ్మ కూరదాక చూపించేసరికి..యికలేవని నిర్ధారించుకోని దానిముక్క అది గబగబా తినేసింది. అంతవరకు… నేను అల్లరి పెడుతుంటే మా అమ్మ నాకిస్తాదేమోనని చూసింది. నాకిస్తే దానికీ యిస్తాదని దాని ఆశ. ఎప్పుడైతే దాకలో మరి లేవని తెలిసిపోయిందో, యెక్కడ తనముక్కగాని తీసి నాకిచ్చేత్తాదో మా అమ్మని తొందర తొందరగా తినీసింది.
(మా సీతప్ప నాకంటే సుమారు రెండేళ్లు పెద్దది. ఏట్నర్ధం (ఏడాది ఆరుమాసాలు)దాటి పోయింది మీ ఇద్దరికి తేడా అని చెప్పేది మా అమ్మ)
అయినా నేను వూరుకోలేదు.” నాకు తెలీదు..నాకియ్యు..అంతే ..” అంటున్నాను.
మా అమ్మకు కోపం వచ్చేసినట్టుంది
“యిత్తానుగల బీప్మీద..” అంది కోపంగా.
“దాక చూపించేసానా! నేంది రమ్మంతే వత్తాదేటి? తిన్నగ తిను..యింకా నీలిగావంతే యిచ్చీగల్ను రెండు బాతుగుడ్లు” అంది.
“కోడి గుడ్డు కొచ్చినపుడు దాన్నిముయ్యడం తెలీలేదు గానీ… యివాల తిండాని కొచ్చేసరికి మాత్రం కావాలి గుడ్లు”. అంది తనే మళ్లీ.
ఆ మాటకు నాకు రోషమొచ్చింది.
“మరెవులు మూసారు!?.. నువ్వు గాని మూసావేటి?” అన్నాను, ఆవేశంగానూ ఆక్రోశంతోనూ .
మా కోడిపెట్ట గుడ్డుకొచ్చినపుడు పదకొండు పన్నెండు గంటల మధ్యన యింటికొచ్చి, మంచాల మీదికి బుట్టెలమీదికి ఎగురుతుంటాది. మా బడి కూడా పదకొండు గంటలకే ఒదిలేసే వాళ్లు. మేం యింటికొచ్చేసరికి అది గడపలో “కేర్… కేర్” మని గోల పెడుతూ, పై కెగురుతూ బుట్టిమీదున్న తట్టలు మానెలు అవి తిరగేసేస్తుండేది.
అలాంటప్పుడు పట్టుకుంటె సుళువుగా దొరికి పోయేది కూడా. దాన్ని పట్టుకుని,సిట్టు మానెలోనో, లేదంటే గోనె కిందనేసి మరో మానే లోనో పెట్టి,దానిపైన మరొకతట్టను మూతపేట్టే వాళ్ళం. కాసేపటికి అది గుడ్డుపెట్టి “కొక్కో..క్కో”అని అరిసీది.అప్పుడుదాన్ని వొదిలేసి గుడ్డుని జాగర్తగా తీసికెళ్లి వంటగదిలో ఓమూల ఒక పెద్దజాడీ.. దానిపైన చోడిపిండితో పెద్ద అటిక ఉండేది. ఆ పిండిలో ఉంచే వాళ్ళము.మా అమ్మ గుడ్లన్నీ ఆ పిండి అటికలోనే దాచేది.
బడినుంచి వచ్చేక మాకు రోజూ అదేపని. మావాళ్ళందరూ పొలాలకు వెళిపోయే వాళ్లు. ఏసాయంత్రానికో గాని వచ్చే వాళ్ళు కాదు. ఒక్కోసారి అంబల్లకు యింటి కొచ్చినా ఏ ఒంటిగంటకో రెండుకో వచ్చేవాళ్లు. అంచేత మా అమ్మ ఈ పని మాకు ఒప్పగించేది.
మా సుక్కలకోడిపెట్ట ఎప్పూడూ ఐదు పుంజీల గుడ్లు పెట్టీది.మరే కోడీ అలా అన్నిపెట్టీది కాదు. ఐతే ఒకరోజు అది గుడ్డుకు రాలేదు. మేం బడినుంచి వచ్చి చూసేం. ఇంటి దరిదా పుల్లో కూడా ఏక్కడా కనపడలేదు.ముందే ఎక్కడ పెట్టే సిందో..లేక ఎవులైనా గుడ్డుకి ముసీసేరో.. గాని ఆరోజు గుడ్డు తక్కువొచ్చింది.
పొలం నుంచి వచ్చిన మా అమ్మ మాయిద్దర్నీ తిట్టింది.
“తిన్నగా యింటీకి రాకుండా,మీరెక్కడ ఆట్లాడుకొనొచ్చారో.. నిష్కారణంగా ఒక గుడ్డు పోగొట్టేసారు. గుడ్డంతే ఎంత! కాణా! పరకా!?.. అద్దురూపాయి. ఒత్తిని పోయింది అని బాధపడింది.
“ఈసారి ఒండుతానూ… రండి తిందురు బుగ్గలాడించుకోని” అని గూడా అంది.
నాకు ఆమాటలు గుర్తుకొచ్చా యిప్పుడు.
“నువ్వు అప్పుడే అన్నావు మాకెయ్యాననీసి అందుకే ఎయ్యలేదూ..నాకు తెలుసు..” అన్నాను .
మా అమ్మ అంతకోపంలోనూ కిసుక్కున నవ్వింది.
మా అయ్య నా గోల చూసి
“ఇందరా..యిద..” అని తన గుడ్డులోంచి సగం ముక్క తీసి యివ్వబోయాడు. చేతితో పట్టుకునీ చెయ్యిముందుకు చాపేడు.
మా అమ్మ అడ్డుపడింది.
“నువ్వుతిను..ఆడు అలాగే అంతాడు. తినకపోతే మానీన్న” గట్టిగా గసిరినట్టు అన్నాది. మా అమ్మకోపం చూసి నేనే వెనక్కి తగ్గేను. కానీ అటే చూస్తున్నాను.
“నువ్వది అందుకో.. నీకుంది..” కోపంపెరిగిన కంఠంతో.. నా వైపు చూస్తూ అంది.
నాకు దు:ఖమొచ్చీసింది.
“ఆ యిగురన్నయెయ్యి..” అన్నాను విసురుగా పళ్లెం ముందుకు లాగుకుంటూ.
“యిందలింకేటుంది. నేను గట్ట దాసుకోనేదు. ఆ అడుగు మాడిపొయింది బాగోదు…” అనుకుంటూ అందులోంచే కొంచెం వూర్పు తీసియేసింది.
మా అమ్మ భక్తురాలు. గురువు దగ్గర ‘మంత్రో పదేశం’ తీసుకుందట. అప్పటికి చాలా కాలం ముందు నుంచి అనగా నేను పుట్టిన ఏడాది తరువాత నుంచే నీసు తినడం మానేసింది. కనుక తనకోసం ఏమీ ఉంచుకోదు.
“యిపుడు బుక్కీ” అంది ఆవేశంగా.
నా మనసుకు కొంత శాంతి లభించినట్టయ్యింది.
అమ్మకు మాత్రం కోపము తగ్గలేదు.
“కూనా.. కుసుకు కూటికేడిస్తే అవ్వ రంకు మొగుడుకేడిసిందట.తిండికి లేక ఎందరో ఏడుత్తుంటే ఈడికి కూర సాల్లేదని ఏడుత్తండు. అలాగున్నాది ఆవటం”.అంది
“మరి నాకెందుకు తక్కువెయ్యాలి?..నువ్వెప్పుడూ అంతే..నాకే తక్కువేస్తావు”.అన్నాను.
“ఎప్పుడు!?.. నీకు తక్కువేస్సి.. నేను తినేస్తున్నానా..!? ” ఆవేశంగా అడిగింది.
“నువ్వుతినవు ఆలిద్దరికే ఎక్కువేత్తావు”.
“అవును ఆ లిద్దరే మా పిల్లలు,నువ్వు మాపిల్లడవు కాదు..సెరిగట్టుమీద దొరికావు,అందుకే ఆలకే యేత్తాను, నీకెయ్యను” అంది. తను ఒత్తి చారు అన్నం తింటూనే.
“నాకు తెలుసులే..” అన్నాను, ఊరుకోకుండా
“తిన్నగా తినరా ..ఆ రెండు గెజివిలొట్టుకు లాగీగల్ను..” అంది.
యీలోగా మా అయ్య, అన్నయ్య తినీసి లేచి చెయ్యి కడుక్కుని బయటకు వెళ్ళిపోయారు.
“అన్నయ్యకు గుడ్డుపాలంగా ఎందుకేసావు మరి..మాలాగే ముక్కే యెయ్యొ చ్చుగదా..!” అడిగాను
“ ఓహో..అదా నీకడుపుమంటా!..” అని అనీసి
“ఆడితోటీ నీకు సాటేటి!? ..” అంది.
“ఏం అందరికీ ఒక్క లాగే యెయ్యాలికదా…!”
“అలగే ..మూడుఫూట్ల తినీసి పుట్టకొక్కులాగ యింట్లుంతావు,ఎన్నైనా కబుర్లాడు తావు. రాత్రి పొగలు కష్టపడే వోడు ఆడూ. ఆడికి నీకు సమానమా!..” అంది.
“యిన్నాళ్లాగా మీ అయ్య కష్టపడలేక పోతున్నాడు. తల్లైదుగురం,ఆడి కష్టమ్మీదే బతకు తున్నాం. ఆడితో వాటా కావాలా నీకు!? ఎల్లు.. రేపు తెల్లారి ఆడు ఏరుపూస్తన్నాడు. ఎల్లి ఆడితో పాటూగా నువ్వూ మడి దున్నుకురా ! అప్పుడేత్తను సమానంగా ..” అంది.
మా సూరన్నయ్య నాకన్నా ఏడేళ్లు పెద్దవాడు.చదువు మానేసాడు. పొలం పనులు చేస్తుంటాడు.
“ఆవటమెక్కువైతే యిలాగే వుంటాది.వుండు రేపట్నించేత్తాను తిందువుగానీ..” అని కూడా అంది. అంతే ఆవేశంగా అలాగే మూలనున్న చీపురు కట్టమీద ఓ చెయ్యేసింది.
యింకా వాదిస్తే పరిస్థితి గుణాత్మకమైన మార్పుకు గురయ్యేటట్టు కనపడింది.
అంతే..
నేనింక కిక్కురు మంతే ఒట్టు. అక్కడినుంచి పళ్లెం పట్టుకుని దూరంగా వచ్చేశాను.
మా అమ్మ ముఖం పక్కకి తిప్పి చాటుగా నవ్వుకొంటోంది ఎందుకో…
నాకు అర్ధం కాలేదు.
*
“పిక్కురోడి కథలు” శీర్షికన నా బాల్యపు కథలను సారంగ పత్రికలో ప్రచురిస్తున్నందుకు సారంగ పత్రిక సంపాదక వర్గానికి మరీ ముఖ్యంగా అఫ్సర్ గారికి అనేకానేక ధన్యవాదాలు.
సారంగ పత్రికలో ఒక శీర్షికతో నా కథలు కొన్ని వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
రామకృష్ణ గారు ఉత్తరాంధ్ర ను కంటి ముందు ఉంచారు. ఆప్రాస, ఆభాష, ఆప్రాంత ఒరవడిని మీ అక్షరాల్లో మాకు చూపించారు. ధన్యవాదాలు. మరిన్ని మీ కధల కోసం ఎదురు చూస్తూ
మీ
బాపూజీ
బాపూజీ, మీ ఆత్మీయతకు ధన్యవాదాలు
పిక్కురోడి కవుర్లు వినడానికి రడీ మేము. ఆల్ ది బెస్ట్.
మల్లేశ్వరి గారూ మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
రామకృష్ణ గారు బావుంది మీ కథ
శ్రీనివాస్ గారూ మీ స్పందనకు ధన్యవాదాలు.
రామకృష్ణ గారూ ఆనాటి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి జీవితాల్లో అర్ధాకలి పరిస్థితులను మీదైన కుంటుంబ నేపధ్యంతో రాసిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంది…అభినందనలు
మురళీ కృష్ణగారూ,మీ స్పందనకు ధన్యవాదాలు. రానున్న కథలు మీకు మరింత ఆశక్తిని కలుగజేస్తాయని నమ్ముతున్నాను.కథలను చదివి మీ స్పందన
తెలియజేయమని కోరుతున్నాను
బాగుంది సార్ మీ కథనం…
నేను కూడా ఇదే పరిస్థితులను దగ్గరగా చూసాను. అవన్నీ గుర్తుకొచ్చాయి. ఇవి నేటి కథకులు రాయలేరు. ఒకవేళ అరువు తెచ్చుకొని రాసినా దానికి జీవం ఉండదు. నేడు ప్రభుత్వం పాఠశాలల్లో ఇస్తున్న గుడ్డు కూరను తింటున్న తీరును ఒక ఉపాధ్యాయుడిగా గమనిస్తున్నాను. ఈరోజునున్న విద్యార్థులకు ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్డును ఇవ్వడంతో వారు బయట పారవేయడం చూస్తున్నాను. ఈ రోజుల్లో తిండికి కొరత పల్లెల్లో కూడా లేదు. అంతకుమించిన ఆహార పదార్థాలు తినడం అలవాటుగా మారింది. నేడు గుడ్డు కూరంటే నాటి చిన్నతనంలో అనుభవించిన అనుభవాలు తలపుకు వస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో పరిస్థితులు చూస్తుంటే అవి మరీ జ్ఞప్తికి వస్తున్నాయి.
తిరుపతిరావుగారూ, మీ స్పందనకు ధన్యవాదాలు సార్.
చాలామంది గతం గొప్పదని భావిస్తారు.దురదృష్టవశాత్తూ ఆలోచనాపరులైన రచయితలు కూదా కొందరు అందులో ఉన్నారు.గ్రామము అనగానే పులకించిపోతారు. నిజానికి పైకి కనిపించే ప్రకృతి మాత్రమే గ్రామము కాదని,జీవితాలను పరిశీలించి సంక్షోభాలను గుర్తించ గలిగితే వారు ఆమాట మాట్లాడలేరని.కొద్దిమంది పెద్దరైతులు,జమిందారలను చూసి,సినిమాల్లో చూసినదే గ్రామమని అనుకుంటుంటారు.
మెజారిటీ ప్రజల జీవితము ఎలా వుండేదో నాకథలద్వారా కొంత మేర చెప్ప దలిచాను.
మీరన్నట్టు ఆకలి ఎరుగని నేటి తరానికి గతమేమిటో,ఆహారము విలువేమిటో కొంతలో కొంతైనా తెలుస్తుందని భావించి రాస్తున్నాను.
మీ ప్రోత్సాహానికి మరొక మారు ధన్యవాదాలు
బాగుంది సార్! గుడ్డు ముక్కతో ఆ నాటి ఆకలి ఇంటిని చూపించిన తీరు బాగుంది. మంచి ఆరంభం. శుభాకాంక్షలు.
జగదీష్ గారూ,మీరు స్పందన తెలియజేసారు.చాలా సంతోషం.ధన్యవాదాలు.
ఈ కథ చదువుతుంటే సినిమా చూసినట్లే ఉంది. గుడ్డు కోసం ముగ్గురు పిల్లల చిన్న రైతు కుటుంబం అంతలా ఆలోచించిందంటే, అసలు రైతు గాని రైతు అదే కూలోడి జీవితం ఇంకెంత దుర్భరంగా ఉండేదోనని కళ్ల ముందు మెదిలాడింది.
లక్ష్మణరావు గారు,మీ స్పందనకు ధన్యవాదాలు.
నిజమే, కూలీలు పరిస్థితి చాలా చాలా బాధాకరం.ముఖ్యంగా వేసవి కాలంలో, పనుల్లేక, కూలీ దొరక్క చాలా ఇబ్బందికరమైన పరిస్థితి లో జీవించారు.
ఇప్పటిలా నగరానికి పోయి సాయంత్రం వరకు ఏదన్నా పనిచేసుకునే అవకాశం కూడా లేదు.ఎందుకంటే అప్పటికి నగరాలే గ్రామాలపై ఆధారపడి ఉండేవి.
మీ పిక్కురోడి కతలు బావున్నాయ్ రెడ్డి కృష్ణ బావ్! పాటం గడగడా సదివితే ఇన్నట్టే వుండాది. చోడవరం పల్లె గుడిసెంటోకి తొంగి సూసినట్టుండాది.
అరణ్యకృష్ణ గారూ ధన్యవాదాలు.
ఒక సారి బాల్యాన్ని గుర్తు చేసుకుని, ఎక్కడ నుంచి ఎక్కడకు వచ్చామో బేరీజు వేసుకోవడం కోసమే నా ప్రయత్నం.
పిక్కురోడి కథలు మీ బాల్యానికి సంబందించిన కథలే అయినా…. ఇంచుమించు ఒక నలభై, ఏబై ఏళ్ల క్రిందట పేదరికం నిండిన అందరి బాల్యంలో అనుభవించిన కథలే…… వాటిని కథలుగా మీరు మలచటం మా అదృష్టం మాస్టారూ…… నమస్కారం.
రామకృష్ణ గారి కథ బాగుంది ఇది కథ అనేకంటే మా బాల్యపు జ్ఞాపకాలు అంటే సరిపోతుంది ఉత్తరాంధ్ర మాండలికంలోని సొగసును చక్కగా వివరించారు. ముందు ముందు మరిన్ని మంచి కథలు మీ కలం నుండి జాలువారాలని కోరుకుంటున్నాను శుభాకాంక్షలు
ఇరవై సంవత్సరాల క్రిందటి మాట. శ్రీకాకుళం ప్రాంతంనుంచి విజయవాడ వలసవచ్చిన కొన్నికుటుంబాలతో సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. వాళ్ళ మాండలికం నాకు కర్ణపేయంగా తోచింది కృష్ణా తీరపు భాషలో కనిపించని సంగీతం వినిపించింది. మీ కథలో మళ్ళీ.
దశాబ్దాలుగా కృష్ణా గుంటూరు భాష పత్రికలని, సినిమాలని, రచనాప్రపంచాన్ని డామినేట్ చేసింది.
ప్రతిచర్యగా అన్ని ప్రసారమాధ్యమాల్లో హాస్యానికీ, రాజకీయ చర్చలకి నైజాం మాండలికాన్ని దీక్షగా వాడుతున్నారు. శుభ పరిణామం. అయితే–
తెలుగు ఈ రెండు పద్ధతులకే పరిమితం కాదు. చిత్తూరు, నెల్లూరు కర్నూలు, కాకినాడ, విశాఖ, విజయనగరం…మాట్లాడేది తెలుగే. వినసొంపైన తెలుగు.
శ్యామల గారు మీ స్పందనకి ధన్యవాదాలు. ప్రాంతం ఏదైనా ఆ ప్రాంతపు జీవితంలోంచి వచ్చిన భాష సజీవంగా ప్రాణాస్పదంగా ఉంటుంది.
మాండలిక రచనలు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని ప్రాంతాల భాష సీరియస్ పాఠకులకు అందరకు అలవాటై చాలా హాయిగా అనిపిస్తుంది.