నేను కవిని కాకుంటే
ఈ వర్షపు రాత్రి నా నిద్దురను ఎవరూ దోచుకెళ్లేవారు కాదు కదూ
గుక్కెడు పాలకై
లేదా
ఓ రొట్టెముక్కకై
దేవులాడే ఏ చేయికీ
నా నిద్రను చెడగొట్టే శక్తి ఉండేది కాదు కదూ….
ఏ సుషుప్తావస్థ లోకో చేరిపోయిన
నా బాల్యం
ఆ చిల్లులింటి ప్రహసనం
ఒంటి గది తండ్లాట
కప్పల అరుపుల నిద్రలేమి
పక్కన్నే పారాడుతున్నాయనిపించే పాముల పలకరింపులు
ఇప్పటి ఈ ఇంత పెద్ద ఇంటిలోని
నా ఆరడుగుల పరుపుపైకి చేరి నన్ను గిచ్చి గిచ్చి లేపేలా తయారయ్యేవి కావు కదూ…..
ఈ వర్షపు రాత్రి…
కొట్టుకు పోతున్న నా ఆశయాల కలలు
నన్ను చేరుతున్న నా ఆశల డాంబికాలు
ఎంత కొత్తగా ఉంది
ఎంత కలగాపులగంగా ఉంది
ఎంత రోతగా ఉంది
ఎంత నిబిడాశ్చర్యజనకంగా ఉంది
ఏవో అరుపులు
నీటిలో కొట్టుకుపోతున్న ప్రాణాలవో
నీరుగారిపోతున్న ఆరుగాలపు కష్టాలవో
ఏవో కన్నీళ్లు
పాయలుగా చీలుతున్న మనసు అట్టడుగు పొరల్లోనో
పాపాన్ని శమించమంటూ వేదిక ఎక్కుతున్న ఆర్భాటపు అంచుల మీదనో
ఏవో ఏవో పలవరింతలు
గడ్డిపోచల దారుల్లోంచీ నక్కి నక్కి వచ్చే చినుకు శబ్దాల మూలలో
మెట్ల మీదకు చేరిన గర్వపు మలినాల దరహాసాలో….
ఏవైనా నా ఈ వర్షపు రాతిరి నిద్దురను కబళించలేక పోయేవి…
నేను కవిని కాకుంటే
నా మెలుకువ నిద్రపుచ్చబడి ఉండేది.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
గడ్డి పోచల దారుల్లోంచి నక్కి నక్కి వచ్చే చినుకు శబ్దాల