కాంక్రీట్ జంగిల్ లో మసిబారిన ఆదిమ తెగ

యానాది జాతికి దేశాభివృద్ధిలో వాటా ఇవ్వకపోయినప్పటికీ ‘అభివృద్ధి’ అనే భూతానికి మాత్రం బలి ఇస్తూనే ఉంది ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ లోని ఆదిమ తెగలలో యానాది తెగ ప్రధానమైంది. ‘అనాది’ అనే మాట నుంచి ‘యానాది’ అనే పేరు ఈ తెగకు ఒచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ అంతటా నివసిస్తున్నప్పటికీ ఎక్కువగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు మరియూ కడప జిల్లాలలో స్తిర నివాసం ఏర్పరచుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలోని యానాదుల్లో అత్యధిక శాతం మంది నెల్లూరు జిల్లా శ్రీహరికోట దగ్గర ఎక్కువగా కేంద్రీకృతం కావడం వలన శ్రీహరికోట యానాదుల అసలు స్థావరమని కొందరంటారు. వారి నివాస ప్రాంతాలను ‘యానాది సంఘాలు’ అంటారు. మామూలు ‘సంఘం’ అనే అర్ధానికి దీనితో సంబంధం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం ఆదివాసీ జనాభాలో యానాది జాతి జనాభా 7.0% గా ఉన్నారు. ఇతర ఆదివాసీ తెగలు వారి జనాభా రీత్యా అంతరించిపోతుంటే అందుకు భిన్నంగా యానాది తెగలో వారి జనాభా రోజురోజుకూ పెరుగుతుందని తెలుస్తుంది. అందుకు వారి ఆహారపు అలవాట్లు కారణం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నాలుగు వందల యానాది సంఘాలు ఉన్నాయని అంచనా. వీటిలో చిత్తూరు జిల్లాలో 50, నెల్లూరు జిల్లాలో 150, గుంటూరు జిల్లాలో 100, కృష్ణా, గోదావరి జిల్లాల్లో 80 సంఘాలు ఉన్నట్లు, వారు అక్కడక్కడా వ్యవసాయం మొదలుపెట్టినట్టు ఒక సర్వ్ లో తేలింది. ఎడ్గర్ ధరస్టన్ రాసిన ‘కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియా(1909)’ అనే గ్రంధంలో యానాదులలోని ఉప తెగల గురించి యానాది ప్రజల జీవన విధానం, ఆచార సంప్రదాయాలు మొదలైన అంశాలను చర్చించాడు. తర్వాత 1962లో వారి కోసం పనిచేసిన వెన్నెలకంటి రాఘవయ్య యానాది జాతి పుట్టుపూర్వోత్తరాలను ‘ద యానాదీస్’ అనే గ్రంధంలో వివరించాడు. ఆంధ్ర దేశంలోని నల్లమల అడవులలో నివసించే మరొక ముఖ్యమైన ఆదిమ జాతి అయిన చెంచులతో జాతి పరమైన లక్షణాలతో పాటు చెంచుల జీవన విధానంతో వీరికున్న దగ్గరి పోలికల రీత్యా వీరిద్దరి పూర్వీకులూ ఒకరేనని, కావున యానాదులు, చెంచులు, ఒకే జాతికి చెందినవారని, కొండదిగిన చెంచులే యానాది వారని మానవ శాస్త్రవేత్తలైన ధరస్టన్ వంటివారు పేర్కొన్నారు. వీరికి ‘యానాది చెంచులు’ లేదా ‘చెంచు యానాదులు’ అనే పేరు కూడా ఉంది. యానాదుల ఇంటిపేర్లు, గోత్రాల పేర్లు చెంచులకు దగ్గరగా ఉంటాయి. వారి ఇంటిపేర్లు జంతువుల పేరుతోనూ, పక్షుల పేర్లతోనూ, వారుపయోగించే వస్తువుల పేర్లతోనూ ఉంటాయి. ఉదాహరణకు టెంకాయల, తోట, మేకల, పాముల, ఉడుముల, చిలకల, ఈగ, ఏకుల, గడ్డం, మండల, కత్తి, రాచగిరి మొదలైనవి. ఇతర ఆదివాసీ తెగలకు ఉన్నట్టు యానాదులకు వారి తెగ చిహ్నాలు ఉండవు.

యానాదుల జీవన విధానాన్ని బట్టి వారిలో ప్రధానంగా నాలుగు ఉప జాతులున్నట్టు ధరస్టన్ పేర్కొన్నాడు. అయితే వారు చేసే పనుల రీత్యా వారిలో సుమారు పది దాకా ఉప తెగలున్నట్టు తెలుస్తుంది. మైదాన ప్రాంతాల్లో ప్రధాన వ్యావసాయిక కులమైన రెడ్డి కులం కింద పనిచేసే వారిని ‘రెడ్డి యానాది’ లేదా ‘మంచి యానాది’ అని, వారిలో కాస్త తక్కువగా చూడబడే వారిని ‘చల్ల’ యానాదులని, అడవుల్లో నివసించేవారిని ‘అడవి యానాదుల’నీ, కప్పల్ని పట్టి తినేవారిని ‘కప్పల యానాదుల’ని పిలుస్తారు. అయితే శ్రీహరికోట లో నివసించే యానాదుల్లో ప్రభుత్వం కింద పనిచేసేవారిని ‘సర్కార్ యానాదులు’ అని, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారిని ‘ కంపెనీ యానాదులు’ అనీ, గ్రామాల్లో ఇతర కులాల రైతుల వద్ద పనిచేసేవారిని ‘ఊర యానాదులు’ అనీ, మట్టి పని, ఊడ్చే పని చేసేవారిని ‘పాకీ యానాదులు’ అనీ అంటారు. వీరుగాక చెట్లు పుట్టలు గాలించి ఆహారాన్ని సేకరించేవారిని ‘చెట్ల యానాదులు’ అని, పొడి వాతావరణంలో జీవిస్తూ తృణ ధాన్యాలను పండించేవారిని ‘గరప యానాదులు’ అని, నక్కలను వేటాడి తినే వారిని ‘నక్కల యానాదులు’ అనే విభజన ఉంది.

యానాదులు ఎక్కువగా మైదాన ప్రాంతాలలో పొలాల దగ్గర, చెరువు గట్టుమీద, కాలువలు, నదుల ఒడ్డున, గ్రామాలకు బయట, కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తుండడం చూస్తాం. తమకు కావసిన నీరు, ఆహారం అందుబాటులో ఉండే చోట నివసించే వీరు మౌలిక వసతులు దొరకని రోజుల్లో తమ ఆవాసాలను వేరే చోటికి మార్చుకుంటారు. యానాది రక్త సంబందీకులంతా సహజంగానే ఒకే చోట ఉంటారు. వీరిది సంచార, అర్ధ సంచార తెగగా భావించవచ్చు. నాలుగైదు కుటుంబాలు ఒక చోట జీవించడం జరిగుతుంది, దానినే ‘యానాది సంఘం’ అంటారు. పెద్దదైన యానాది సంఘం కడప జిల్లా లోని సిద్దుల పల్లె. ఇక్కడ సుమారు 127 ఇళ్ళు ఉన్నాయి. చెట్ల ఆకులు, జమ్ము గడ్డి, వెదురు కర్రలతో వృత్తాకారపు గుడిసెలు నిర్మించుకుంటారు. తమ వాకిలికి కుడిపక్కన గుంతపోయ్యి, నీటి కుండలు, చెంబులు, ఎడమ పక్కన తట్టలు, బుట్టలు, రోకటి గుంత ఉంటాయి. ఈతాకుల చాపలు, నులక మంచాలు తప్ప పెద్దగా వస్తువులేవీ వీరి ఇళ్ళలో ఉండవు. గుడిసెలపైన సొర, బీర తీగలు అల్లిస్తారు. తరచూ తమ నివాసాలను మార్చే యానాదులు ఇప్పుడిప్పుడే స్థిర నివాసం వైపు అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. ప్రాధమికంగా సంచార జాతి అయిన యానాదుల ప్రధాన వ్రుత్తి వేట, చిన్న చిన్న జంతువులను, పిట్టలను వేటాడి ఆహారాన్ని సేకరిస్తారు. వీరికి వ్యవసాయం అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. ప్రకృతిలో దొరికే ఆకులు, కాయలు, దుంపలతో పాటు ఎలుకలు, పిల్లులు, ఉసిళ్లు, నేలమీద పాకే జంతువులైన ఉడుము, తాబేలు వంటి వాటిని పట్టుకుని తింటారు. చేపలు, పొలంలో ఉండే ఎలుకలు, పంది కొక్కులు, తాబేలు, జంగు పిల్లి మాంసం అంటే వీరికి ఇష్టం. వాటిని నేర్పుతో వేటాడి తెస్తారు. నీటి వసతి ఉండేచోట చేపలు పడతారు. వెదురు బుట్టలు, చాపలు అల్లి వాటిని ఇతరులకు అమ్మి బియ్యం, నూనె, బట్టలు కొనుగోలు చేస్తారు. యానాదులు అరుదుగా చిల్లర దొంగతనాలు కూడా చేస్తారు, ఏ ఇంటికైనా కన్నం వెయ్యడానికి వెళ్తే ముందు వంట పాత్రల్లో ఆహారం కోసం చూస్తారు. దొరికితే అన్నం తిని గానీ మిగిలిన వస్తువులజోలికి వెళ్ళరని పరిశీలకులు అంటారు. చిన్న చిన్న దొంగతనాలకు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గేవారుంటారు. యానాదులకు కుడుమిస్తే పండగ అనే సామెత ఉంది. అయినప్పటికీ నేరస్త జాతుల చట్టం(1871) ప్రకారం వారిని తరచూ నిర్బందించడం జరుగుతుండేది. తర్వాత వెన్నెలకంటి రాఘవయ్య గారి కృషి వలన ఆ చట్టం పరిధి నుంచి బయటపడి షెడ్యూలు తెగల జాబితాలో వీరు కూడా చేరారు. యానాది తెగ విముక్తి కోసం శ్రమించిన వెన్నెలకంటి రాఘవయ్యను ‘యానాది రాఘవయ్య’ అంటారు.

యానాదులు మైదాన ప్రాంతాల్లోని ఇతర కులాలతో కొంతమేరకు సంబంధాలు కొనసాగిస్తారు. అయితే ఇతర కులాల పెళ్లి, పుట్టుక, చావు వంటి సందర్భాలకు వీరు హాజరు కారు. యానాదులు షెడ్యూలు కులాలైన మాల, మాదిగలతో ఎటువంటి సంబంధాలు కొనసాగించకపోగా వారు చేసే కులవృత్తులకు దూరంగా ఉంటారు. తిండి లేకపోయినా చచ్చిన గొడ్డును తీసుకెళ్ళి పడెయ్యడం వంటి పనులను చెయ్యడానికి అంగీకరించరు. అలాగే వేటాడి ఏ ఇతర జంతువునైనా తింటారు గానీ గొడ్డు మాంసాన్ని భుజించరు. అది బహుశా గొడ్డు మాంసాన్ని తినే మాల, మాదిగలు వారికంటే ‘తక్కువ’ అనే భావన వలన కావచ్చు. అడవి పంది, జింక, దుప్పి వంటి జంతులను వేటాడడంలో వీరికి ప్రావీణ్యం ఉండడమే కాక వీరు ఆయా జంతువుల, పక్షుల అరుపులను అనుకరించగలరు. వేంకటగిరి సంస్థానంలో రాజులు జంతువులను వేటాడే క్రీడలో యానాదుల సహకారం తీసుకునేవారని చెబుతారు. వరిపొలంలో కావలి వుండి దానికి ప్రతిఫలంగా కళ్లంలో మిగిలిపోయిన వడ్లు, పరిగ గింజలు ఏరుకుంటారు. పంటల్ని నాశనం చేసే ఎలుకల్ని పట్టడానికి బుట్టలు పెడతారు. ఇళ్ళల్లో పాచిపనులు చేసి వారిచ్చే మిగిలిపోయిన చద్ది అన్నం తీసుకుని ఇంటిల్లిపాదీ తింటారు. అలాగే విందు భోజనాల దగ్గర చల్ల యానాది శాఖకు చెందిన వారు విస్తరాకులు ఎత్తేసి అందులో మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకుంటారు. పాకీ యానాదులు పారిశుధ్య పని చేస్తారు. పిల్లల చేత కూడా వీరు బలవంతంగా ఈ పని చేయిస్తారు. యానాదుల్లో నూటికి 84.7 శాతం జనాభాకు భూమి మీద హక్కు లేదు. 46.5 శాతం మంది వ్యవసాయ సంబంధమైన పనుల్లో ఉండగా, 15 శాతం యానాదులు చేపల వేట ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు. ఇంకా ఆహార సేకరణలో 14.7 శాతం మంది యానాదులు ఉన్నారు. నెల్లూరు, కడప జిల్లాలలో వీరు అక్కడి భూస్వామ్య కులమైన రెడ్ల వద్ద పనిచేస్తారు. యానాది స్త్రీలపైన భూస్వాముల లైంగిక వేధింపులు కూడా సర్వ సాధారణం.

వారు అనాదిగా ప్రకృతిలో మమేకమై జీవించడం వలన యానాదులకు అనేక చెట్లు, వాటి ఉపయోగం తెలుసు. అలాగే అనేక జంతువుల ప్రవర్తన, స్వభావం గురించి వీరికి అవగాహన ఉంటుంది. చెట్ల ఆకుల పసర్లతో మూలికా వైద్యం చేస్తారు. పరిసరాలనుంచి లభించే మూలికలు, తేనె వంటివి సేకరించి ఇతరులకు ఇస్తారు. పాముకాటు, తేలు కాటు వంటి సమస్యలకు చెట్ల నుంచి సేకరించి అప్పటికప్పుడు చేసిన ఆకు పసర్లు వంటి మందులు ఇస్తారు. అలాగే స్త్రీలకూ పిల్లలకు వచ్చే జబ్బులకు కూడా వీరు చేసే ప్రక్రుతి వైద్యం పనిచేస్తుంది. స్త్రీలకు ప్రసూతి సమయంలో వచ్చే సమస్యలకు, రుతుస్రావ సమస్యలకు పసరు మందు ఇస్తారు. ఈ విద్య ఎక్కువగా స్త్రీలకు తెలుసు. వారు ఆ జ్ఞానాన్ని తమ అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మలు, అత్తల నుంచి నేర్చున్నామని చెబుతారు. అలాగే కొందరు రాబోవు కాలంలో జరగబోవు విషయాలను ఇతరులకు చెబుతారు. దీనిని ‘రంగం’ చెప్పడం అంటారు. వీరిలో కొందరు వ్యక్తులకు అతీంద్రియ   శక్తులున్నట్టు, వారికవి నిష్టతో ఉపవాసం ఉండి పూజలు చెయ్యడం వలన తమ పూర్వీకులు ప్రసాదిస్తారని అంటారు. గ్రామాలలో ఇతర కులాలవారు తమ జీవితాలకు సంబంధించిన మంచి చెడుల గురించి, వ్యాధి, బాధల గురించి యానాదుల చేత ‘రంగం’ చెప్పించుకుంటారు.

యానాదులు శాంతి కాముకులని వారికి పేరుంది. వారు సొంత ఆస్తి అనేది లేకుండా ఉన్నదాంట్లో సంతృప్తికరంగా జీవించడం తెల్సిన మనుషులు. అబద్దమాడరు, నిష్టగా ఉంటారు. యానాది వ్యక్తిని సాక్షిగా పెట్టుకునే వకీలు కుక్క చావు చస్తాడని నానుడి. ఎవరితోనూ తగాదాకి వెళ్ళరు, పెద్దగా వాద వివాదాల్లో తలదూర్చరు. ఆనంద విషాదాలను ఒకేవిధంగా స్వీకరిస్తారు. వివాహం విషయంలో ఒకే ఇంటిపేరున్న వారిని చేసుకోరు, దాదాపు ఇతర గ్రామాలలో నివసించేవారిని వివాహమాడడానికి మొగ్గు చూపుతారు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం వారి పెళ్లి ముహూర్తం. ఒక రోకలి నిలబెట్టి దాని నీడ నేలమీద పడకపోవడాన్ని మిట్ట మధ్యాహ్న సమయంగా, తమ ముహూర్త సమయంగా భావించడం యానాదులకు ఆనవాయితీ. అన్ని ఉత్సవాలకూ మేళం వాయించడం వీరికి అలవాటు. యానాది తెగ మాత్రుస్వామ్యాన్ని పాటిస్తుందని తమ సంప్రదాయాలను బట్టి తెలుస్తుంది. వారిలో స్త్రీ, పురుషుల మధ్య సమానతని పాటిస్తారు. వివాహం సమయంలో ఆడపిల్లకి ‘ఓలి’ అనే కట్నాన్ని ఇస్తారు. ఇది హైందవ సమాజంలోని ‘కన్యాశుల్కం’ అనే ఆచారం లాగా కనిపించినప్పటికీ ఆచరణలో ‘ఓలి’ అనేది వేరుగా ఉంటుంది. వివాహ సమయంలో తాళికి బదులు చిన్న కాసును వధువు మెడలో కట్టి కాలి వేళ్ళకు మెట్టెలు పెడతారు. వీరిలో వితంతు సమస్య లేదు. భర్త మరణిస్తే ‘మారు మనువు’ చేసుకునే ఆచారం ఉంది. ఏడు సార్లు పెళ్లి చేసుకున్న స్త్రీకి యానాది తెగలో ఎక్కువ మర్యాద ఉంటుందని చెబుతారు. యానాది కుటుంబాలలో మేనమామకు అతున్నత స్థానం ఉంటుంది. జీవితంలోని అన్ని ముఖ్య ఘట్టాలలో అమ్మాయి మేనమామ కుటుంబ పెద్దగా వ్యవహరిస్తాడు. పెళ్ళిలో అలంకరణ సామాగ్రిని కొని ఇవ్వడం నుంచి కుటుంబ కలహాలు తీర్చడం కూడా అతని బాధ్యతగా ఉంటుంది. కుల పంచాయితీలో పెద్దలు నిర్ణయాలు చేసి వివాదాలను పరిష్కరిస్తారు. పెళ్లి ఎక్కువ శాతం పెద్దల నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ప్రేమ వివాహాలు కూడా సర్వ సాధారణం. సమాన వయస్కులైన స్త్రీ పురుషుల మధ్య వివాహం జరుగుతుంది. విడాకులు తమ కుల పంచాయితీ ద్వారానే తీసుకుంటారు. భర్త నుంచి విడిపోవాలనుకునే స్త్రీ పెళ్ళిలో ఆమెకు భర్త తరపు వారు ఇచ్చిన ఓలి డబ్బును తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. వీరిది ఆహ్లాదకరమైన కుటుంబ వ్యవస్థ అని చెప్పొచ్చు. వేటాడినా, కందమూలాలు గాలించడానికి వెళ్ళినా భార్యా భర్తలిద్దరూ కలిసే వెళ్తారు. ఆడా, మగా భేదం లేకుండా అందరూ నాటుసారా, పొగాకు సేవిస్తారు. జీవితంలోని అన్ని ప్రధాన ఘట్టాలలో వారు తమవైన ఆచార సంప్రదాయాలు పాటిస్తారు. ప్రసవించిన స్త్రీకి పదకొండవ రోజు అంటు స్నానం చేయించి ఇంట్లో కలుపుతారు. అలాగే బిడ్డలకు పేర్లు పెట్టే తతంగం, తల వెంట్రుకలు తీసే తంతు మొదలైన అన్ని సందర్భాలలో వేడుకలు చేస్తారు. యానాది స్త్రీలకు చక్కగా పాటలు పాడే అలవాటు ఉంటుంది. బాగా నాట్యం చేస్తారు. వీరు చేసే నాట్యాలలో ‘దెయ్యం నాట్యం’ ప్రత్యేకమైనది. డాన్స్ చేసేటప్పుడు శరీరాన్ని చాలా సులువుగా వంచడం వీరి ప్రత్యేకత.

యానాదుల ఇంటికి బంధువులు వస్తే వీరికి భారం కాకుండా వచ్చేవారు కొంత బియ్యం, తమదగ్గర కాసిన సొరకాయో, బీరకాయలో, వేటాడిన జంతు మాంసమో తీసుకొస్తారు. బంధువులు కూడా వారితో పాటు ఇతరుల దగ్గర పని చేస్తారు. కాలాలు మారినా ఈ మంచి ఆచారాన్ని యానాదులు వదలలేదు. యానాదులకు దైవ భక్తీ కంటే ప్రభు భక్తీ, వినయం ఎక్కువ అని చెప్పాలి. వారు పూజించే తెగ పితృదేవతలను ‘చెంచోరు’ లేదా ‘చెంచు దేవత’ అంటారు. వీరితో పాటు ఇతర కులాల వలె పోలేరమ్మ, గంగమ్మ, అంకమ్మ వంటి గ్రామ దేవతలను కొలుస్తారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో నివసించే యానాదులు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. కానీ వీరికి దేవుడి పట్ల పెద్దగా పట్టింపు ఉండదు. చనిపోయినవారిని తమలో మళ్ళీ పుట్టబోయే వారిగా పరిగణించడం పునర్జన్మ పైన వారికుండే నమ్మకాలకు చిహ్నంగా భావించ వచ్చు.

యానాదుల భాష అచ్చ తెలుగు భాష. అయితే ప్రత్యేకమైన యాసతో కూడిన వీరి తెలుగు ఉచ్చారణ తన ఆదిమ నాగరికతను సూచిస్తుంది. యానాదుల తెలుగే సంస్కృత, ఉర్దూ భాషల ప్రభావానికి లోనుకాని అసలైన ప్రాచీన తెలుగు భాష అని భాషా పరిశోధకుల అభిప్రాయం. వారికి ‘వీరు, ‘వారు’ ‘మీరు’ అనే ఇతర కులాలు మర్యాదకర మైన మాటలు గా భావించే పదాలు తెలీదు. అందరినీ ‘నువ్వు’ అని పేర్కొనడం వారి ఆనవాయితీ. ఇది చెంచులలో కూడా కనిపించే ఉమ్మడి అంశం.

యానాది తెగ అత్యంత ఆదిమ తెగ అని వారి జీవన విధానం వలన తెలుస్తుంది. తమ దాయాదులైన చెంచుల వలే వీరు కూడా ఇతరుల నుంచి ఏ అలవాటునూ తొందరగా నేర్చుకోరు, తమ పాత అలవాటును వొదిలిపెట్టరు. అయితే రాను రాను యానాది జాతి కూడా మైదాన ప్రాంతాల్లోని ఇతర హైందవ కులాల వలె కుల సమాజపు పోకడలను నెమ్మదిగా అలవర్చుకుంటున్నారు అని పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రధానమైన నాలుగు తెగలలో ‘రెడ్డి యానాదులు’ లేదా ‘మంచి యానాదులు’ అనే తెగ ‘చల్ల యానాదుల’ విషయంలో అంటరానితనాన్ని పాటించడం దీనికి మంచి ఉదాహరణ అనుకోవచ్చు. అలాగే వీరిని ఇతర హైందవ సూద్ర కులాలు తక్కువగా చూస్తూ ‘యానాది’ అనే పేరును నిందార్ధంలో ఉపయోగిస్తారు. బిడ్డలు పుట్టి చనిపోయే తల్లిదండ్రులు తమపిల్లలకు అసహ్యకరమైన పేరు పెడితే బతుకుతారనే నమ్మకం గిరిజనేతర కులాల్లో ఉంటుంది. వారు పుట్టి చనిపోతారనుకున్నప్పుడు తమ బిడ్డలకు ‘పెంటయ్య’, ‘దిబ్బయ్య’, ‘రోశయ్య’ అనే హీనమైన పేర్లతో పాటు ‘యానాది’ అనే పేరును దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో పెట్టుకోవడం అనేది యానాది తెగ పట్ల వారి దృక్పధాన్ని తెలియజేస్తుంది. అయినప్పటికీ యానాదులు మాల, మాదిగల పట్ల అంటు పాటించడం సమాజంలో పై నుంచి కింద దాకా పాకిపోయిన కుల జాడ్యం కుల వ్యవస్థతో సంబంధం లేని ఆదివాసీ తెగలకు కూడా అంటుకోవడం కుల సమాజపు విడ్డూరం.

యానాది తెగ క్రమంగా మార్పుకు గురవుతుంది. అయితే పోడు వ్యవసాయాన్ని వొదిలి ఇప్పుడిప్పుడే స్థిర వ్యవసాయంలోకి వస్తున్నప్పటికీ యానాదులు వ్యవసాయాన్ని తమ వ్రుత్తి అని భావింకపోవడం గమనార్హం. ప్రభుత్వాల సహకారంతో వారు స్థిర నివాసం ఏర్పరచుకుని ఓటరు లిస్టులో తమ పేరు నమోదు చేసుకుంటున్నారు, ఆధార్ కార్డులు కూడా పొందుతున్నారు. వీరిలో క్రమంగా అక్షరాస్యత శాతం కూడా పెరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరిలో అక్షరాస్యత 30 శాతం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే స్కూల్ మధ్యలో మానివేసే వారి సంఖ్య ఎక్కువ అని భావించవచ్చు. నెల్లూరు జిల్లా లో జరిగిన సారా వ్యతిరేక పోరాటంలో యానాది స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని పదునెక్కించారు. వారిలో ‘కత్తి చెల్లమ్మ’ అనే ఆమె యానాది స్త్రీలకు నాయకురాలిగా గుర్తింపబడింది. ఆమె వెన్నెలకంటి రాఘవయ్య వంటి వారి వలన స్పూర్తి పొంది ఉద్యమాల దారిలో నడిచింది. యానాది తెగ జీవితంపై ‘ఇ. వి’ గా గుర్తింపు ఉన్న ఏకుల వెంకటేశ్వర్లు అనే ప్రజాగాయకుడు, రచయిత ‘వెన్నెల నవ్వు’ అనే పేరున నవల రాసి ప్రచురించడం విశేషం. ఆయన అదే యానాది నేపధ్యం నుంచి వచ్చి ఉద్యమకారుడిగా, రచయితగా, గాయకుడిగా గుర్తింపబడ్డాడు.

ఇంకా సంచార జీవితంలో ఉండి చెరువుల పక్కన, కాలవ గట్ల పైన గుడిసెలు వేసుకుని బతికే యానాది సమూహాలను ప్రభుత్వం, కార్పోరేట్ సంస్థలు ఎప్పుడుబడితే అప్పుడు రోడ్డు విస్తరణ పేరున, మైనింగ్ పేరున, భవన నిర్మాణం పేరున తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా వారిపై ఒత్తిడి తేవడం, వారు నిత్యం అభద్రతతో బాధపడడం ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. శ్రీహరికోటలో అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో కూడా యానాదులు పెద్ద మొత్తంలో నిర్వాసితులు అయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వారు తమ ఆదిమ జాతి లక్షణాలలో ముఖ్యమైన మంచి అంశాలను కోల్పోతారు. సంప్రదాయంగా పెద్దల నుంచి తాము అందుకున్న ప్రకృతి వైద్యం, మూలికల గురించిన జ్ఞానం వారికి దూరమవుతుంది. తమ ఆచార వ్యవహారాలను ఈ క్రమంలో మర్చిపోయే అవకాశంతో పాటు ఇతరుల పెత్తనానికి దౌర్జన్యానికీ గురయ్యే పరిస్థితి ఉంది. కడుపుకి పిడికెడు అన్నం తప్ప ఏమీ ఆశించక రేపటి గురించి సంపద కూడబెట్టుకోవాలనే ధ్యాస లేని యానాదుల బతుకు చౌరస్తాలో నిలబడుతుంది. రోజురోజుకూ విస్తరిస్తున్న కార్పోరేట్ రంగం, వారికి తొత్తులుగా మారిన ప్రభుత్వాలు ఇక్కడ పుట్టి పెరిగి ప్రకృతితో మమేకమై జీవించే ఆదిమ తెగ యానాది జాతికి దేశాభివృద్ధిలో వాటా ఇవ్వకపోయినప్పటికీ ‘అభివృద్ధి’ అనే భూతానికి మాత్రం బలి ఇస్తూనే ఉంది. యానాదుల వెన్నెల కాంక్రీట్ జంగిల్ లో చిక్కుకుని మసిబారిపోతుంది.

*

 

 

 

చల్లపల్లి స్వరూప రాణి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Uranium thorium nikshepaala thavvakam yaanaadi chenchula bathukulu Prashnaardhakamaindi.
    Yaanadula jeevana sthithigatulapai vivaranathmakamgaa parichayam chesina swaroopa Rani gaariki krutagnathalu

  • స్వరూపరాణిగారు యానాదుల జీవనం గురించి వివరణాత్మక సమాచారం ఇచ్చారు . చా లా బాగా రాసారు . అభినందనలు

  • మీరు మా యానాది తెగ
    జీవితాల గురించి రాసినందుకు కృతజ్ఞులం

    యానాది సంఘం
    చీరాల

  • యానాదుల్ని గురించి చక్కని విశ్లేషణ చేశారు ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు