4
కింద నేషనల్ హై వే నెంబర్ ఐదు నుంచి బర్మా క్యాంపు వైపు ఒక పల్లామె చేపల బుట్టతో వెళ్లిపోతోంది,
హై వే నుంచి కొంచెం పైకి వస్తే కుడి వైపు పెద్ద శ్మశానం. క్యాంపు లో వాళ్ళ కి , కింద వున్న గవర, గొల్లల ,రెడ్డి కంచరపాలాలికి
ఇదొక్కటే శ్మశానం. దాని ఎదురుగా కొత్తగా తడికలతో కట్టిన గంటల్లారి ఆఫీసు ముందర ఖాకీ డ్రస్సులతో పొడుగు బూట్లతో పాత సిబ్బందే డ్రిల్లు చేస్తున్నారు . అల్లూరి సీతారామ రాజు నగర్లో
వందల పాకలు కాలి పోవడం, క్యాంపు చుట్టు పక్కల ఎప్పుడూ ఏదో ఒక చోట పాకలు తగల బడటంతో ఇక్కడ గంటల్లారీ ఆఫీసు పెట్టేసారు.
కింద నుంచి క్యాంపు కి వచ్చే వాళ్ళు ఎత్తు ప్రాంతం అవడం మూలాన మె ల్లగా సైకిలు నడుపుకుంటూ వస్తున్నారు. పై నుంచి కిందకు వచ్చే వాళ్ళు వేగంగా నడిచి వెళ్ళే వాళ్ళు పరుగు లాంటి నడకతో సునాయాసంగా వెళ్లిపోతున్నారు,ఇక సైకిళ్లయితే కిందకు సర్రున దూసుకు పోతున్నాయి .
పొద్దున్న బర్మా క్యాంపులో నూకాలమ్మ గుడి దగ్గర పూజారి వేసిన రికార్డు తో జనానికి తెల్లగా తెల్లారుతుంది. కొండల మీద నుంచి కురిసే పొగ మంచు మధ్యే జనం తమ పనులు ప్రారంభించేస్తారు.
పొద్దున్న వేడిగా అప్పటికప్పుడు చేసిచ్చే నాన్ రోటీలు టీ లో ముంచుకొని తినే వాళ్ళు కొందరు , ఇంటి దగ్గర ఇడ్లీలు అట్లు అమ్మే ముసళ్ళమ్మల దగ్గర టిఫిన్ బాక్సు తీసుకెళ్లి దాంట్లో ఇడ్లీలు, పుర్రుగా సెనగ పిండి లేదా వేరుశెనగ చెట్నీ వేయుంచుకొని తినే జనాలు, మధ్యాహ్నం కమ్మటి చింతపండు చారు , అందులోకి పిండి వొడియాలు తో తూరుపు ప్రాంతం నుంచి వొచ్చిన వాళ్ళు సరిపెట్టేసు కుంటారు, గోదారి జిల్లా వలస దారులు నిమ్మ చారు, ఏదో ఒక వేపుడు తోనో వొడియాలతోనో సరిపెట్టుసుకునీ వారు.
ఎవరు ఎలా సరిపెట్టేసు కున్నా సాయంత్రం అయితే చాలు వైరు బాగు సైకిలికు తగిలించుకొని, లేదా నడుచు కుంటూనో , హై వే దాటి , పరమేశ్వరీ పిక్చర్ పాలస్ దాటేసి దూరాన వున్న కంచరపాలెం మెట్టు దగ్గరకు వెళ్లిపోతారు.
బర్మా క్యాంపు జనానికి నీసు కూరలు కావాలి, సాయంత్రం అయితే చాలు ఫిషింగ్ హర్బర్ నుంచి వొచ్చే తాజా చేపలు కోసం చేపల మార్కెట్టులో వరుస కట్టేస్తారు.
” అమ్మ దా యామ్మ వాటా పది రూపాయలే ” అంటాదొ కామె.
” ఏటీ రెండోటాలు పది రూపాయలకు కావాలా ? నాయమ్మే ఎప్పుడైనా చేపలు తిన్నావా? ఆ మొఖం చూడూ ” అని బేరాలాడే ఆడామెని తిట్టేస్తోంది ఒక పల్లామె.
” రారా తమ్ముడా తాజా చేపలు ఇప్పుడే తెచ్చినాను , నాను తక్కువకు అమ్మలేను బాబా”
” కొడకా నువ్వు సూడక్కర లేదు, గిల్లక్కర లేదు తాజా చేపలు కొడకా మా కాడ తేడా ఉండదు ”
” బాబూ మూడోటాలు తీసేసుకో పులుసు పెట్టేసుకో పాతిక్కిచ్చేస్తాను ” అంటుంది ఒక పెద్ద బొట్టు వాడబలిజీ లామె.
” అచ్చీ… తాజా చేప, మొప్పలు సూడొద్దు, నువ్ వొండు కున్నాక నచ్చితే డబ్బులియ్యి, ఇక్కడే వుంటాను నేను. ”
ఇలా రక రకాల మాటలు, బేరాలు, తిట్లు , అరుపులతో కంచరపాలెం మార్కెట్టు అద్దిరిపోయేది.
గులివిందలు, కవ్వళ్లు, మెత్తని పారలు, కానా గత్తలు, నత్తళ్ళు , సందువాలు, వొంజిరాలు, కోనాలు, కొమ్ము కోనాలు ఇలా అన్నీ తాజా, తాజా చేపలు సాయంత్రం ఫిషింగ్ హర్బర్ నుంచి కంచరపాలెం మెట్టు దగ్గర మార్కెట్ కి వొచ్చేస్తాయి.
ఆ సాయంత్రం తూరుపు కనుమల కొండలలో , కొండ కింద వున్న బర్మా క్యాంపు ఒక్కో ఇంటిలో ఒక్కో రకం నీచు కూరలతో, ఒక పక్క రేడియో పాటలతో ముగిసేది.
తాము తినగా మిగిలిన బువ్వ ” చ్చు… చ్చు. … చ్చు.. చ్చు.. అని కుక్కను పిలిచి ”
“మియ్యావ్ …మియ్యావ్” అని పిల్లిని పిలిచి మిగిలిన చేప ముల్లులు, పిల్లలు వొదిలేసిన అన్నంకి
ఇంకొంచెం కూర కలిపి ఆప్యాయంగా పెట్టేవోరు .
” అక్కా యెర్ర కుక్క కనపడిందా? ” ” నల్ల కుక్క కనపడిందా?” అని ఏ కుక్కైనా
కనపడక పోతే బెంగ పెట్టేసుకొనే వారు.
వేసవి కాలం అయితే వేడి వేడి గా, వర్షా కాలం గొడుగులేసుకొని వైరుబాగులు పట్టుకొని మరీ, శీతాకాలం సాయంత్రం చల్లగా మెల్లగా వెళ్లి నీసు కూరలు తెచ్చేసుకోవడమే.
క్యాంపులో రెండు మూడు కుటుంబాలు గిన్నీ కోళ్లు పెంచినా చాలా కుటుంబాలు నాటుకోళ్లు పెంచుకునేవి
కోడి కూర అంటే ఉగాదికో, సంక్రాంతి తర్వాత వొచ్చే కనుమకే , రోజు వారీ నీసు కూరలంటే చేపలు, పరపరాలాడే సముద్రపు యెర్ర పీతలు, రొయ్యలు ఇవే.
ఇవికాక బర్మా కాందిశీకుల ఉపాధి కోసం గోవుర్నమెంట్ కట్టిన దొండపర్తి నెహ్రూ బజారు కు వెళ్లిపోయి ముసిలమ్మల దగ్గర సిల్వర్ బే సి నీ లో సావడాలు ,ఎండు రొయ్యల పొట్టు ,ఎండి నత్తళ్లు తెచ్చుకొని వంకాయతోనో,
బీరకాయ తోనో ,ఉల్లిపాయల పులుసుతోనో , చారు తోనో సరిపెట్టేసుకునీవోరు జనం.
రాశులుపోసి వుండే ఎండి నత్తళ్లు బాగున్నాయా అని అడిగాము అనుకోండి ” బాబా వెండి ..వెండి బాబా ” అని వాటి గొప్పదనం చె ప్పి అమ్మేసీవోరా ముసిలమ్మలు.
ఈ చేపల పులుసుతో పాటు చనిపోయిన మా నాన్నమ్మను గురుతు చేసుకుంటూ గోంగూర రెయ్యలు తెగ వొండించీసీవోరు మా నాన్న.
మా ఇంట్లోనూ ఇవే నీచు కూరలు, ఎప్పుడైనా వూరినించి ఎవరైనా బంధువులు వోస్తే
” ఫిషింగ్ హార్బర్ కి వెళ్లి వొంజురం గాని కోనాం గాని తెద్దాం పదండ్రా ” అని మా నాన్న సైకిలు తీసేవోరు.
బర్మా లో వున్నపుడే అందరికి నీచు కూరలు బాగా అలవాటు అనుకుంటాను బర్మా క్యాంపు ప్రతిరోజూ సాయంత్రం పులుసు మరిగిన వాసనలతో ఘుమాయించి పోయేది.
ఇంత నీచు తినే జనమూ నూకాలమ్మ పండగప్పుడు తొమ్మిది రోజులూ, భక్తులు అగ్నిగుండం తొక్కే వరకూ కూడా ఎక్కడా ఒక నీచు కూర కూడా ముట్టు కునే వారు కాదు.
అప్పుడు ఊరంతా సంపంగి పూల వాసనతో, వేపాకుల వాసనతో, గన్నేరు పూలతో, కొండ గాలితో కలిసిపోయి ఒక రకమైన పరిమళంతో ఉండేది.
ఇప్పుడు బర్మా క్యాంపు కాదు ఏ వూరు వెళ్లినా గుద్ద లు కూడా పైకి లేపలేని బ్రాయిలర్ కోళ్లు పగలు, రాత్రి తేడా లేకుండా
కోసేస్తున్నారు.
“ఎప్పుడో ఏడాదికి రెండు సార్లు పండగలప్పుడు నాటుకోడి తినే మనమేనా ఇలా రాక్షసులు లాగ బ్రాయిలర్ కోడి తింటుంది అని భయమేస్తుంది” అంటున్నారు నాన్న.
భీమవరం , రాజమండ్రి , అమలాపురం నుంచి ఆదివారాలు లారీల్లో వొచ్చే చెరువు చేపలు తినడానికి జనం అలవాటు పడిపోయారు అవేమి అంత రుచీ పచీ వుండవు.
పోనీ రెండు వాటాలు గులివిందలు తెచ్చుకొని కమ్మగా పులుసు చేసుకొని పుర్రుగా కంచం లో కలుపుకొని తిందామా అని మొన్నా మధ్య తుమ్మడ పాలెం లో వుండే అప్పయమ్మ ప్రయత్నం చేసిందంట, రెండు ముద్దలు తినగానే “ఆచీ ఇదేటిది చేపలు ఇలా కిలుమ్ వాసన వేసి రుచీ పేచీ లేకుంటున్నాయని ” మురికికాల్వలో పారీసిందట.
” ఇప్పుడు చేపలన్నీ అలగే ఉంటున్నాయమ్మ గంగమ్మ తల్లిని కలుషితం చేసేస్తే ఆయమ్మి మాత్రం మనం తినడానికి ఏ టిస్తాది?విశాఖ పట్నం లోని కుళ్ళి కాల్వల నీళ్లు అన్నే సముద్రంలోకి వొగ్గేస్తున్నారు, ఆయమ్మి మాత్రం యేటి చేస్తాది ?” అని బుట్ట మీద చేపలు మోసుకొని ఇంటింటికి తిరిగి అమ్మే వరలష్మి అనే వరా వాపోయింది.
*
కవ్వళ్ళు , గులివిందలు , కానా గత్తలు అనే కధ చాలా బాగుంది.చేపలు అమ్ముకునే మత్య్సకారులు భాష,యాసను జాగ్రత్తగా గమనించడం వల్లే ఈ కధ రాయడం వీలైందని భావిస్తున్నాను.రచయిత హరి వెంకటరమణ అభినందనీయులు.
విశాఖపట్నం లోని కుళ్లు కాలవలనీళ్లకు సముద్రంలో చేపలు పాడైపోవు.అవెన్ని!? గానుగులో గంటెడు..
ఫ్యాక్ట్రీ వ్యర్ధాలు రకరకాల కెమికల్స్ సముద్రజలాలను పాడుచేస్తున్నాయి.చెప్పాలంటే అవి చెప్పాలి.మరబోట్లతో, పెద్దపెద్ద నైలాన్ వలల్తో చేపలవేట వలన సముద్రంలో చేపజాతి నశించి పోతోంది.
సామన్య పల్లె కారులజీవితం అతలాకుతలమౌతోంది.
అటు వారికి ఇటు ప్రజలకు నష్టం కలిగించే పెట్టుబడి దారులమీదికి కథ ఎక్కుపెట్టాలి.పొల్యూషన్ అక్కడుంది.మురిక్కాలవలవల్ల అంత పొల్యూషన్ రాదు.మురిక్కాలవల నీరు ఈరోజే చేరలేదు.
Cheppala kura guruthuku thechharu, appudu barma camp ala undeda ani telusa chesaru. appude kadu eppudu kuda cheppala kura non veg lo chala mandhiki estam.
రామకృష్ణ గారు మీ విమర్శకు ధన్యవాదాలు..
చేపలోళ్లు కష్టాలు మీకు నాకు తెలుసు … కానీ చేపలమ్మే ఆమె
ఇంత వివరాలు కొన్నమ్మకు చెబుతుందా.. అని
వెంకటరమణ గారూ! మీరు కాలుష్యం వల్ల సముద్రం ,తద్వారా చేపలు పాడవుతున్నాయన్న విషయం చెప్పాలనుకున్నప్పుడు ఈకథలో కూడా చెప్పొచ్చు. ఒకవేళ మీరు చెప్పలేమని భావిస్తే ఆ విషయానికి కథనపద్ధతి ఎన్నుకోవాలి.
నా ఆభిప్రాయం లో అయితే ఆవిషయం చెప్పడానికి ఈ పద్దతి కూడా సరిపోతుంది.కానీ మీకు ఆ యా మత్స్యకార కుటుంబాలతో స్నేహసంబంధాలుండివుండాలి. వారితో మాట్లాడించి చూడాలి.అంతకు మించినవిషయాలు చెప్తారు.నాకు ప్రత్యక్ష అనుభవముంది కనక చెప్తున్నాను..
Nice, pollution highlighted
బర్మాకేంపు కథలు / నేపధ్యం
బర్మాకేంపు ఒక చిత్రమైన ప్రాంతం, రెండో ప్రపంచ యుద్ధం వచ్చినపుడు 1939నుంచి 1945 మయన్మార్ లో తెలుగువాళ్లు ఇండియా వొచ్చేసారు. భారతదేశం నుండి ఉపాధి, వ్యాపార నిమిత్తం మయన్మార్ వలస వెళ్లిన వాళ్లంతా తిరిగి ఓడల్లో వచ్చేసారు,రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వాళ్ళు విశాఖపట్నం తుమ్మడ పాలెంలో, నవాబుపేటలో ఒక మిలటరీ కేంపు, తాటిచెట్ల పాలెం దగ్గర మిలటరీ కేంపు పెట్టారని అంటారు, యుద్ధం అయిపోయాక తెలుగువాళ్లు తిరిగి బర్మా వెళ్లిపోయారు.
1962 సంవత్సరo బర్మాలో మిలటరీ అధికారంలోకి వొచ్చింది , తెలుగువాళ్లను భారతదేశం వెళ్లిపోమంది. ఓపిక తో ఓడల్లో చేరినవారు చాలామంది, శక్తి ఉండి అక్కడనుంచి విమానాల్లో కలకత్తా వొచ్చి రైళ్లో విశాఖపట్నం చేరినవాళ్లు మరికొంతమంది.
ఇండియా చేరిన కాందిశీకులకోసం అప్పటి ప్రభుత్వాలు దేశంలో ఆశ్రయం కల్పించాయి ,విశాఖపట్నంలో కూడా వారికి ఆశ్రయం కల్పించాయి. ప్రధానమైనది కంచరపాలెం దగ్గర బర్మాకేంపు మిగతావి ఐ టి ఐ జంక్షన్ దగ్గర సిధార్థ నగర్, గంట్యాడ, శ్రీహరిపురం ,అనకాపల్లి, యలమంచిలి దగ్గర ఉన్నాయి.
కాందిశీకుల కోసమే ఉన్న ఈ కంచరపాలెం బర్మాకేంపు చుట్టూ తరువాత మిగతా కుటుంబాలు కూడా చేరాయి. ఈ కాందిశీకులలో ఎక్కువ మంది విశాఖ జిల్లా నుంచి వెళ్లిన వాళ్లే మరికొంత మంది ఇతర జిల్లాల వాళ్లు. శెట్టిబలిజలు, వెలమలు, వాడ బలిజలు, కాపులు, గవరలు ,రెల్లీలు ,దళితులు ఇలా అన్ని కులాల వాళ్ళు వున్నారు.
కాందిశీకులుగా ఇక్కడకు వచ్చినా బర్మా వాళ్లలాగా ప్రత్యేకమైన వారిగా భావిస్తూ గొప్పలు పోవడం, అక్కడి కట్టూ బొట్టూ పూర్తిగా మారకపోవడం, అక్కడ బాగా బతికి ఇక్కడ ఇమడలేక ఇబ్బందులు పడటం, మోసపోవటం,మెల్లగా చిన్న చిన్న వ్యాపారాలు పనులు చేసుకోవటం, ఆత్మగౌరవం అదంతా బర్మా కాందిశీకులు జీవితం .
బర్మా సేమ్యాలు, నాను రోటీలు, నూడుల్సు , మోయింగా ,బర్మా లుంగీలు, పెద్దవారికి బర్మా భాష రావడం, సాయంత్రం అయితే చాలు నీసు కూరలు, ఇళ్ల చుట్టూ ములక్కాడ చెట్లూ, బాదంచెట్లూ, బౌద్ధం ఆచరించడం,ఇక్కడ దుర్గాదేవికి, సంతోషిమాతకు,నూకాలమ్మ దేవతలకు పూజలు, వినాయక చవితికి పందిర్లు, పండగలన్నీ ఒక సంబరంలాగా చేయడం. ఇంకా రోడ్ల మీద కొట్లాటలు, రౌడీయిజం ,ఆడాళ్ల బూతులు, బోరింగ్ దగ్గర గొడవలు, ఆప్యాయతలు అదో ప్రత్యేకమైన ప్రపంచం.
‘కేంప్’ చుట్టూ వున్న ప్రజల జీవితాలు, వైవిధ్యమైన జీవితం, ఉత్తరాంధ్ర అలవాట్లు ఈ కథల్లో పంచుకుందామని నా ప్రయత్నం. ఈ కథలన్నీ ఎనభైయ్యో దశకం చివరి ప్రాంతానికి చెందినవి, అప్పటి మనుషులవి
.
హరి వెంకట రమణ
98660 84124
రుచికరమైన చేపలు వాటిని అమ్మేవారు వారు మాటతీరు ను ఆ పరిసరాల్లో ఉండే ఆ సందడి గా ఉండే వాతావరణం గురించీ చాలా చక్కగా చెప్పారు ప్రత్యేకంగా నీచు కూరలు రుచే వేరు, ఎండు చేపలు, వంజురం, సోర్ర, పీతలు,రెయ్యలు, నెత్తల్లు, ఇటువంటి కూరలు అంటే నాకు చాలా ఇష్టం మా తాత కు 365 రోజులు ఇటువంటి కూరలు ఇంటిలో వండేవారు, దానిప్రభావం నాకు అలవాటయిన దినోత్సవ ఆరోజు చాలా చక్కగా ఉండేవి నాకు కూడా చిన్న నాటి ఙాపకాలు గుర్తుకు వచ్చేశాయి, చాలా బాగుంది సార్ ,చాలా చక్కగా ఉంది.
మా మిత్రులు శ్రీ హరి గారికీ హృదయ పూర్వక అభినందనలు. తెలుపుతూ ఇంకా ఇటువంటి వి కధలు ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను.
Thank u sir I like very much .😊🤝👌
హరిగారు…భర్మా క్యాంపు కథలలో అక్కడి మనుషుల స్వచ్చమైన మనస్సు కనపడుతోంది , మన పాతకాలపు మనుషుల భాష యాసను మర్చిపోయమనుకునే తొందరలో మీరు ఇలాంటి కథలను అందించి మళ్ళీ ఆరోజుల్ని గుర్తుచేస్తున్నారు నిజంగా మీకు ధన్యవాదములు. మీనుంచి మరిన్ని కథల్ని ఆశిస్తూ……
మీ కిరణ్ పాలెపు
ఉత్తరాది ప్రాంత బాష, యాస ఎంత బాగుంటుందో ఈ వ్యాసం రుచిచూపించింది. వాడుక పదాలు చాలా హృద్యముగా మనసుకు హత్తుకునే విధముగా ఉన్నాయి. నీసు కూరని గుర్తుచేసి నోరూరేలోపు సాగరకలుషితాలను తెలిపి కల్లోలపరిచి కర్తవ్యం బోధించారు.
బోట్లు, క్యాట్ఫిష్ లు కాకుండా నావ, నెత్తల్లే మనసున్న మనుషులు కోరుకునేది.
Ee pranta prajala aahaarapu alavatlu ,jeevana sthitiki bagunnai
కంచరపాలెం, మెట్టు, బర్మకేంప్, కప్పరాడ పరిసరాల వర్ణన బాగుంది. చేపలబజార్లో బేరగాళ్ల, అమ్మే బెస్తవాళ్ళ హడావుడి సహజంగా ఉంది. Fire engine లారీ ని గంటల్లారీ అనడం ఆప్రాంతాల్లో మామూలే. మొత్తంగా బర్మకేంప్ వాతావరణాన్ని బాగా కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. హరివెంకట్ గారికి అభినందనలు.
…పి వి రామశర్మ
Hari garu,
Very well written story. It’s tells the way of life of the people of that time. Fishermen slang, language very well explained. We hope many more stories like this from you.
Hari garu kadha kadhanam baavundi.Visakha lo vunnavallaki bazar tirugutunnate anipistundi.Gorusu Jagadamba junction kadha gurtukochchindi.Manchi paryavaranam kadha.Abhinandanalu.Pustaka roopam lo teesukurandi.