కవి హృదయం పలికే భాష

ప్రతి భాషకూ ఒక ప్రత్యేక నుడికారం ఉంటుంది. సొగసు ఉంటుంది. అది గ్రామ్యమయినా మాండలీకం అయినా శిష్టవ్యావహారికం అయినా!

క కవి “కవిత్వంలో విధి నిషేధాలు”1 అనే వ్యాసంలో “నా కవితకు మూలాధారం విశ్వాసం. ఈ విశ్వాసం ఇరవై ఐదు లక్షణాలతో కూడుకుని ఉంది” అంటూ తన విశ్వాసానికి ఉన్న ఇరవై ఐదు లక్షణాలనూ వివరించారు.

ఆ కవి చెప్పిన ఇరవై ఐదు లక్షణాలలో ఒకదాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ కవి తన విశ్వాసానికి ఒక లక్షణంగా చెప్పుకున్నదేమిటంటే  “తన ప్రత్యేకమైన అనుభూతికీ అంతవరకు అందుబాటులో ఉన్న సాధారణ పరిభాషకీ మధ్య అసమంజసతని ఆ కవి గమనించడు.  ఒక్కోసారి గమనించినా కొద్దిసేపు కొంత అశాంతికి గురవుతాడు. ఆ తరువాత బలవంతంగా అనుభూతిని పరిభాష కింద పరిణామం చెందేలా చేస్తాడు. అది కేవలం ఆ కవి అదృష్టం.”

మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు కవిత్వపు భాష ప్రత్యేకమైనది. దానిలోనుండి దృశ్యం ఒక్కొక్కసారి సూర్యకాంతిలో దృశ్యం లాగ, ఒక్కొక్కసారి చంద్రకాంతిలో అద్భుతం లాగ, ఒక్కొక్కసారి మస్తిష్కంలో  వెలిగే ఆశ్చర్యంలాగ కనబడవచ్చు. ఒక్కొక్కసారి చెబుతున్న భాషకు అందని రహస్యమేదో చదువరుల గ్రహింపుకు రావచ్చు. పదాల చాటున దోబూచులాడుతున్న భావాన్ని మనం వెంటనే గ్రహించవచ్చు, ఒక్కొక్కసారి అది కొంత వెతికితేగాని స్పష్టం కాకపోవచ్చు.

కవులు తాము వాచకంగా వాడుతున్న భాషనుండే వారు అందజేయాలనుకున్న భావాలను స్పస్టాస్పష్టంగా  చెప్పే ప్రయత్నాలు చేస్తుండవచ్చు.

యిక్కడ కవులు తాము నిత్య జీవితంలో వాడుతున్న భాషను ఉపయోగించినా లేక భాషకూ భావానికీ మార్మికతతోనూ అనుభూతితోనూ ముడివేసినా చదువరులు భాషనుండి తమకందిన భావంతో పాటు కవి మార్మికంగా అందజేస్తున్న భావాన్నీ గ్రహిస్తారు.

ఇటీవలి మణిపూర్ సంఘటనలకు స్పందించిన ఒక కవి (మహెజబీన్) ‘మణిపూర్ ఆక్రందన’2 పేరుతో రాసిన కవితలో

“ కుకీ అమ్మాయీ లే! కళ్ళు తుడుచుకో” అంటూ వాచ్యంగా బాధితులకు ధైర్యం చెబుతారు.

“ నగ్నంగా ఊరేగించిన నీ దేహం మాతృ భూమిది.

ఈ మాతృభూమి నీదీ నాదీ వాళ్లదికూడా

నీ ఆక్రందన ప్రపంచాన్ని తాకింది

అది ప్రశ్నయి  వాళ్లకు గుచ్చుకుంటుంది”

అంటూ బాధితుల వేదనను విశ్వజనీనం చేయడం ద్వారా స్వాంతన చేకూర్చడానికి ప్రయత్నిస్తారు.

“మనం వంచనకు గురైన వాళ్ళం

వస్త్రాపహరణ సమయానికి చీర ఇవ్వడానికి

ఇప్పుడు కృష్ణుడు లేడు

నీ దుస్తులు నువ్వు తీసుకో

కుకీ అమ్మాయీ వెళ్ళు, వెళ్లి స్నానం చెయ్యి

పూసల హారాలతో అలంకరించుకో ——

మణిపూర్ కొండలమీద పాటలు పాడుతూ సాగిపో”

కవితలో కవి గొంతు వాచ్యంగా మొదలై రూపకాలంకారంగా రూపుదిద్దుకుని mythopoetic గా మారి ముగింపును అన్యాపదేశం చేశారు. ముగింపును గురించి ఆలోచిస్తే ఆ మణిపూర్ అమ్మాయి పాడే పాటలు ఎలా ఉంటాయి? ఆమె సాగిపోయే తీరాలేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు ఏకశిలా సదృశం కాదు చదువరులు  తాము ఆకళింపు చేసుకున్న సమాజం పోకడల మేరకు తమ తమ సమాధానాలు వెతుక్కుంటారు.

కవి అనుకున్న భావం కంటే భినమైన అర్థాలను సూచించగలిగే  భాషను స్పృహతో ఎంచుకుని ఉంటారని మనం అనుకున్నా అనుకోకపోయినా మణిపూర్ ఆక్రందనను ఒక మణిపూర్ అమ్మాయి ఆక్రందనలో మూర్తిమత్వం చెందించగలిగిన నేర్పుతో కవి ఈ కవితను నిర్మించిన తీరును మనం గమనించవచ్చు.

యింకో కవి (పల్లిపట్టు) ఒక కవితను ‘మతకం’3 అనే మకుటంతో యిలా ప్రారంభిస్తారు.

“ రూన్త సలికే ఈదుల్లో సలిమంటలేసుకుని కాగుతున్నాం గదా!

దుప్పటి కప్పుకుని సలి దూరకుండా చెవుల చుట్టూ

తలపాక సుట్టుకుని చెరువుసాయ సేతులు బిగించుకుని నడుస్తూ ఎన్ని ఏర్పాట్లు?

రూన్త సలికే పొద్దట్ట మొలిస్తే పారిపోయే సలికే ఎన్నెన్ని జాగర్తలు!

సలికంటే సలికోరలకంటే పడునయింది పెను ప్రమాదమయింది

బకితి పూనిన ఇల్లంతా ముసురుకునే సాంబ్రాణి కడ్డీల పొగలా

వూళ్ళ నిండా కమ్ముకుంటున్నదేదీ   మనకంటెందుకు బడటం లేదో?

సలికన్నా తీవ్రమయింది సలికన్నా క్రూరమయినది

సావుకూతలమధ్య సంకలెగరేసేది  మన్సుకెందుకు ఆనడం లేదో?

మన్సులకెందుకు అగుపడం లేదో?

మతకం బట్టినట్టు ఈమాదిరి తాచారమ్యేమిటి?

పై కవితలో కవి చలికన్నా తీవ్రమైనదేమిటో చెప్పదలచుకున్నాడు. దానిని మనుషులెందుకు చూడడం లేదో అడగదలచుకున్నాడు. అయితే అది ఏమిటి?

కవి తన వ్యావహారిక రాయలసీమ భాషలో రాసిన ఈ కవితలో కవి హృదయాన్ని ఉపమాలంకారం ద్వారా వ్యక్తం చేశారా?  ఉపమానం సరే, మరి ఉపమేయం ఏమిటి? ఇక్కడే కవి నైపుణ్యం కనబడుతోంది. ఉపమేయం అదృశ్య రూపంలో ఉండి చదువరులకు స్పురణకు రావడమే కవి ఉద్దేశ్యం.

కవితనిండా ఉపమానం (చలి) గురించీ, చలిబారిన పడకుండా మనుషులు తీసుకుంటున్న జాగ్రత్తలేమిటీ, ఆ జాగ్రత్తలు ఉపమేయం విషయంలో తీసుకోని కారణం ఏమిటీ అన్నదే కవి అంతర్మధనం. ఆ కారణం అవిద్య కావొచ్చు, అలసత్వం కావొచ్చు, ఎడురుతిరగలేనితనం కావొచ్చు,  ఆర్ధిక సామాజిక రాజకీయ కారణాలేమైనా ఉండవచ్చు. కవి మకుటంలో చెప్పిన విషయం కవితలో ఎక్కడా బహిర్గతం కాదు. చివరి వాక్యంలో చెప్పినట్టు కారణం తనూ అన్వేషిస్తున్నారా లేక “కారణాలు కారల్ మార్క్స్ కు తెలుసు” అని నగ్నముని కొయ్యగుర్రం అనే కవితలో చెప్పినట్టు కారణాలు చదువరులనే వెతుక్కొమ్మంటున్నాడా?

యిక్కడ కవి తన భావాన్ని చెప్పడానికి వాడుకున్న భాష మాండలీకం అయినా ఎత్తుగడ మాత్రం లాక్షనీకం అయింది.

ఆధునిక కవిత చందోబద్ద శృంఖలాలు తెంచుకున్నప్పటికీ భాషకు సౌందర్యాన్ని ఇచ్చే అలంకారాలనూ నుడికారాలనూ పదిలపరుచుకున్నది అనడానికి పై కవిత ఒక ఉదాహరణ.

ప్రతి భాషకూ ఒక ప్రత్యేక నుడికారం ఉంటుంది. సొగసు ఉంటుంది. అది గ్రామ్యమయినా మాండలీకం అయినా శిష్టవ్యావహారికం అయినా ఆ నుడికారాన్నీ సొగసునీ పట్టుకోగలిగిన కవులు అక్షరాలద్వారా వ్యక్తపరచలేని భావాలను అలంకారికంగానో అన్యాపదేశంగానో వ్యక్తపరచగలరు. భాషామూలాలకు సంబంధించిన జ్ఞానం భావావేశం ఉన్న కవులను మంచి కవులుగా మలచగలదు.

అంత్య సూచికలు:

  1. కవిత్వంలో విధి నిషేధాలు వ్యాసం రచయిత విజయ్ దేవ్ నారాయణ్ సాహి, తెలుగు అనువాదం: ఖాదర్ మొహియుద్దీన్, ప్రచురణ “కవితా! సమకాలీన కవితల కాలనాళిక నెంబర్ 2 జనవరి-ఫిబ్రవరి 2009.
  2. కవిత: ‘మణిపూర్ ఆక్రందన’, కవి మహెజబీన్, ప్రచురణ విశాలాంధ్ర దినపత్రిక 12 ఫిబ్రవరి 2024, కవిత 2024 కవితా సంకలనం సాహితీమిత్రులు.విజయవాడ.
  3. కవిత: ‘మతకం’, కవి: పల్లిపట్టు, ప్రచురణ కొలిమి పత్రిక ఫిబ్రవరి 2024, కవిత 2024 కవితా సంకలనం సాహితీమిత్రులు విజయవాడ.
  4. మతకం అనే పదానికి అర్థం: మాయ, మోసం, వంచన, దగా,

 

చంద్రశేఖర్ కర్నూలు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు