“ఓమిత్యేతదక్షరమిదం సర్వం …”మాండూక్యోపనిషత్తు. కవిత్వం చెప్పడం కొందరికి శ్వాసించడమంత ముఖ్యం అంటారు. శ్వాస పైన ధ్యాస ఉంచడమే ధ్యానం అంటారు. కవిత్వాన్ని ధ్యానం చేశాడో, ధ్యానాన్నే కవిత్వం చేశాడో మరి కానీ, ఈయన ధ్యానం దర్శనం లో పర్యవసించింది, ఆ దర్శనాలకు అక్షరరూపం కల్పించాడు ‘వసీరా.’
వసీరా అక్షరాలకు వల్కలం చుట్టి కొన్నాళ్ళు చెట్టు పై పెట్టి, ఒకటిన్నరో రెండో దశాబ్దాలు తానూ ఒక వల్మీకంలో కూచున్నట్టున్నాడు ( శివారెడ్డి గారి ముందుమాటలో ప్రస్తావించిన వివరం.) ఇది అక్షరసన్యాసమా, వాటి స్వీయ నియమిత అజ్ఞాతవాసమా ?!
కవిత్వం వ్యక్తిత్వంలో, జీవితంలో ఒక భాగం అయిపోయాక దాన్ని త్యజించి మామూలు ప్రాపంచిక జీవితం నెరపడం సాధ్యం కాదు ఏ కవికైనా.
కాబట్టి అక్షరాస్త్రాలు చెట్టెక్కించడానికి బలమైన కారణాలు ఉండి ఉండాలి.
ఒకటి, ప్రపంచం తీరుపైన తీవ్ర వ్యాకులత, వైరాగ్యము.
లేదా, ఈ ప్రపంచం ఆవల ఉన్నదాన్ని తెలుసుకోవాలనే తీక్షణ కాంక్ష.
మొదటిది బలపడినపుడు రెండవది మొదలవుతుంది కూడా.
అలా వెళ్ళి వచ్చిన వాణ్ణి, రెండు దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఉపసంహరించి వచ్చిన వాణ్ణి ఏమి కుశలమడిగి తెలుసుకోవచ్చు?
ఏమైనా అడిగేలోపల తన‘ సెల్ఫీ‘ చేతిలో పెట్టి ఇవి చదువుకోండన్నారు తన పాఠకప్రజలను వసీరా.
‘సెల్ఫీ‘ విషయం, ఎవరిని వారు frame చేయడం, close up లో చూడటం, చేసుకోవడం, చూసుకోవడం కాదు. పూర్తిగా ‘self‘ నుంచి వైదొలగి other లా పరిశీలించడం.
మరో ప్రమేయం అవసరం లేని స్వీయపరీక్ష.
దీంతో, రెండు మెరుగైన అస్త్రాలు కవి అంబులపొదిలోకి వస్తాయి, దృష్టి, విశ్లేషణ.
కవి యొక్క ఇప్పటి నిశితమైన ‘పరి‘శీలనమే ప్రార్థన, ఆరాధన, ధ్యానం.
చూపు తీక్షణమైనప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచంలో మంచి సెబ్బర, సౌందర్యం వికారం, సంతోషం దుఃఖం అన్నింటినీ మరింత స్పష్టంగా తెచ్చి ముందర పోస్తుంది.
‘‘బాలోన్మత్త పిశాచవత్‘‘ అంటారు, వీళ్ళ ముగ్గురికీ అన్నీ అధికమే. విభ్రమం, పరవశం, దుఃఖం. కవి ఈ మూడూ కలిపిన పెట్టు. అయితే పై ముగ్గురికీ లేనిదీ ఇతని కి ఉండేది ఆ తీవ్రతలను సమన్వయతో కవితాభివ్యక్తీకరణ.
అందుకే కవి నిశితమైన ‘పరి‘శీలనమే అతని ప్రార్థన, ఆరాధన, ధ్యానం, వెరసి కవిత్వం.
తన సత్యదర్శనాన్ని ప్రపంచానికి ప్రయోజనకారిగా చేయడమే కదా కవి లక్ష్యమూ, లక్షణము.
బాహ్యలోకం లోకి తిరిగి వచ్చిన కవికి ముందుగా కళ్ళెరుపెక్కించే వాస్తవాలే ఎదురైనాయి. తనకు ధ్యానం లో అనుభవమైన అలౌకిక ఆనందానికి, ఈ బాహ్య ప్రపంచ లోని విషాద దృశ్యాలకు పగటికీ, రాత్రికి ఉన్నంత అంతరం ఉంది.
ప్రయోజనమేమి, లోకరీతులకు రోసి? వాటికి రోషం లేదు కదా.
‘‘యోగః చిత్తవృత్తి నిరోధః‘‘ కానీ, లోకవృత్తి ప్రవృద్ధి అవుతునే ఉంటుంది. అది కాదు కదా వెళ్ళింది ధ్యానం లోకి.
ఇప్పుడు, నిజానికి ఎప్పుడూ కూడా, మనిషి వృత్తి, ప్రవృత్తి ఒకటే. అది వ్యాపారం. కనిపించే ప్రతి వస్తువునీ పారలతో తవ్వి లారీల కెత్తుకుని మిల్లిగరిటెల చొప్పున అమ్మే వ్యాపారం చేస్తున్నాడు అనాదిగా ఆధునిక మానవుడు. అతని merchandise కు అనర్హం కాదు ఏదీ.
సూర్యుడు, చంద్రుడు, అడవులూ, సముద్రాలు, నేలా, ఆకాశం సమస్త విశ్వపు కేశపాశాలు భౌతికవాది తన కీచకహస్తాల్లోకి చిక్కించుకున్నాడు.
చంద్రుడి నోట్లో గుడ్డలు కుక్కి ఈడ్చుకుపోతుంటాడొకడు, సముద్రంలోకి దూకి పోతూ భూగోళాన్ని కాళ్ళకి కట్టుకుని లాక్కుపోతుంటాడొకడు.
‘‘సెల్ఫీ‘‘ అనే సంపుటిలో మొదటి కవితా వస్తువు భయానక ఆధునిక మానవుడి దురాగతాలు.
రెండు శతాబ్దాల సంధికాలపు ఈ ఇరవై ఏళ్ళలో ఇంత విధ్వంసం సృష్టించాడా మనిషి? అంతకుముందు అంతా బావుందా? దుర్మార్గం చక్రవడ్డీ లెక్కలో పెరిగినట్లుంది. కాసేపు తండ్రి అటు వెళ్ళివచ్చేలోపు పిల్లరాక్షసులు పాతాళం అంతరిక్షం ఏకం చేసి మింగి కూచుని ఇంకా ఎక్కడ నా ఆకలికి ఆహారం అంటున్నాడు.
ఈ మనిషిది దానవ దాహం, భూత క్రౌర్యం, ప్రేతాత్మ ఆకలి, పైశాచిక కామం.ఇరవైయ్యో శతాబ్దపు మానవుడు Satan కు పనిచేయడం మానేశాడు.
ఇప్పుడు వాడే అన్నీ; Satan, Mephistopheles, Dr. Faustus.
కనిపించే లోకమంతా కలచివేస్తోంది. అలాగని క్రోధంతో కళ్ళుమూసుకుని మెలకువను వాయిదా వేసినంత మాత్రాన ఈ ప్రపంచం తనను తాను మరమ్మత్తు చేసుకుంటుందా?
కాదు, ఇప్పుడు ఆఖరికి ‘‘గాలి కూడా మరణించి ఎడారుల మీద సముద్రాల మీద నింగి మీద తన విశాల మృతకళేబరాన్ని పారేసుకుంటోంది.
‘‘సహజ మృత్యువు సైతం భూమ్మీద బతకలేక… ‘‘, స్త్రీ ని సైతం చెరపట్టి విఘాతం కలగచేస్తున్న కిరాతకుడయ్యాడు మనిషి.
ఎడారులతో సహా ఎండిపోయి మావి కూడా వట్టి పోయి ‘‘ఎలక్ట్రానిక్ సంతును కంటున్న లోహ గర్భాశయాలు.‘‘
అప్పుడు కవి కి కిం కర్తవ్యం? సమస్త తలాన్ని శపించటమా?
సృష్టి కర్త పని ఈ ప్రపంచం సృష్టించడంతో అయిపోతే, దాన్ని భరించి వహించే విష్ణువు కవి. అంటే మనుషులు అందరికీ రోటీ కపడా మకాన్ ఇచ్చే ప్రభుత్వమా అతను?
దోపిడీదారునీ, వాణ్ణి వెనకోసుకొచ్చే కార్పొరేట్ రాజునీ, రాజ్యాంగాన్ని, ఆఖరుకి దేవుణ్ణైనా సరే, మనిషి తరఫున నిలబడి నిలదీసి ప్రశ్నించే గొంతు కవి.
తల ఎత్తి నిలబడ్డ నిలువెత్తు ప్రశ్నే కవి.
కసి మాత్రమే కాదు, సమ్యక్ దృష్టి కలవాడు, మనుషుల పట్ల మాటల పట్ల ఓర్పు గల వాడు.
కాబట్టే ఆక్రోశం తో మొదలైన మొదటి కవిత ఎంత ఆశావహంగా ఎదిగిందో చూడండి,
దృశ్యం మారాలని కలగంటున్నాను.
ధవళకాంతుల హిమాలయాల నుండి
ఆకుపచ్చని లోయలనుండి
ధ్యానం వంటి స్వచ్ఛమైన వెన్నెల నుండి
దిగివచ్చే జీవనోత్సవ నదీ ప్రవాహాలమీద
తెల్లని రెక్కలు విప్పి
మనుషులంతా హంసలై
ఎగిరే దృశ్యం కలగంటున్నాను.
పాతాళ సదృశ అమానుష దృశ్యాలతో మొదలైన ఈ కవిత మానవాతీతమైన ఎత్తులకు సాగింది.
ముక్కు మూసుకుని జపం చేస్తే చేరే అందలంలోని హంసలదీవి కాదు . ఒక అడుగు పక్కకు వేస్తే చాలు ఇలాతలంలోనే హంసలా నూరేళ్ళు బ్రతకొచ్చు అంటున్నాడు ద్రష్ట అయిన కవి.
ఇతని ఆరాటమంతా ఆధునిక మానవుడికి, తను మనిషిననీ, కోరికను అధిగమించగల జీన్ తనలోనే ఉందనే స్పృహ కలిగితే చాలు. విస్మృతిలో భ్రమిస్తున్న తనకు శుభ్ర స్వేచ్ఛాయాన శక్తి, నిర్మల జలాల నివాస యోగ్యమూ ఉన్నవన్న ప్రత్యభిజ్ఞ కలిగిందా చాలు.
ఈ నెమ్మది, యెరుక కలగించ గలవాడే కవికోకిల.కేవలం ఉపనిషద్ మంత్రాలు వల్లె వేస్తూ వేదవృక్షాల పైన కూర్చోకుండా, అన్యాయాల లోకానికి అవతలి ఒడ్డున నిలబడి పోకుండా ఆ మంత్రోపాసన తో వచ్చిన విస్తృత వెలుగులో లోకానికి ఎదురుగా ఒక అద్దం పట్టేవాడు అసలైన కవి. తనను తాను చూసుకోమని జనాన్ని మందలించి హెచ్చరించడం కవి ఉద్యోగం.
ఈ ఉద్యమంలో ఉపకరించే దర్పణాలే కవితలు.
శోకగ్రస్తమైన వాస్తవ చిత్రాలను ఒక చేత్తో , తనకు కలిగిన అతీంద్రియానుభవ దృశ్యాలను ఒక చేత్తో పేర్చుకుంటూ అల్లిన పంక్తులివి. అలా చేయటంలో అతని ఉద్దేశం, రెండూ సంభవమే అనీ, అదీ పక్కపక్కనే అని.
అన్యాయాన్ని అరిచినప్పుడు, ‘హథ్రస్‘ పై అక్రమానికి రగిలినపుడు ఆ కిరాతకుల మానాలు ఉత్తరించే విచ్చుకత్తి అతని కవితా పంక్తి. విస్ఫులింగాల వంటివి ఈ అక్షరాలు.
మాయమైన మేరునగధీర యారాడకొండకై ఏడ్చినపుడు ఆక్రోశపు పిల్లవాడి శోకం ఏనుగంత అక్షరం .
ప్రళయమేదీ ఉదయించని ఓ మంచిరోజున చెట్టు తొర్రలో కూచున్న నులివెచ్చని అర్కబాలుడితో ఇరుక్కు కూచుని పక్కని కొలనిలోకి తొంగిచూస్తుండే పిల్లవాడు ఉడతల నేస్తగాడు పలికేది ఒక ప్రవహించే పాట.
శిశువు, జ్ఞాని వంతులు వేసుకుని కనిపిస్తారు ఈ పేజీల్లో.
తాత్విక ప్రతీకలు విస్తారంగా దర్శనమిచ్చే ఈ పంక్తుల్లో మండూక ప్రసక్తి చాలాసార్లు రావటం ఆశ్చర్యవిషయం కాదు. అగ్నిని నీటిని ఆరాధించే శ్రోత్రియుడు. కొండను అడవిని ప్రేమించినవాడు.
చిగురాకుల్లో అగ్ని
చెట్లనరాల్లో అగ్ని
విత్తు లో అగ్ని పశువులో అగ్ని
పక్షిలో అగ్ని, మందల్లో అగ్ని
…
నీవే రూపాలు మార్చుకునే కాలాగ్ని
జీవితం తుదిమొదలు అగ్నితోనే అని దర్శించడం, ఈ కవిత “అగ్నిర్వా అపామాయతనం”.
“వానలో నీ యజ్ఞం జరుగుతోంది
రాళ్ళ కడుపులో నిదురించే శిశువులు జపించే నిశ్శబ్ద ధనుష్ఠంకారాలే నీ మంత్రాలు”
రాయి రప్ప చెట్టు నీరూ పృధివి సమస్తం యజ్ఞం నిర్వహిస్తున్నాయి.
యివన్నీ యజ్ఞరూపాలు, యజ్ఞ మంత్రాలు, మంత్రం పఠించే ఋత్వికులు, యజ్ఞకర్తలు, కడకు, యజ్ఞంలో నే ఇవన్నీ ఆహుతులు.
నదులు, సముద్రాలు ధ్యానించాడు. ఆకాశ శబ్దతత్వాన్ని ఆరాధించాడు. మృత్తికను సైతం అమృతం చేయగల నేలను ప్రార్థన చేసాడు. ఇవన్నీ చేయగలవాడు, చేవ ఉన్న కవిత్వం వ్రాయడం తెలిసినవాడు ఈ కవి.
శబ్దార్థ సౌందర్యం, శబ్దబద్ధ లయ, మాటలలో తాత్విక దర్శనం నిండుగా కల పంక్తులు అన్ని కవితల్లో.
అరవై ‘సత్యసౌందర్య సంకల్ప‘ గీతాలు రచింపచేసిన అతని ఉపాసనా బలం, అతనికి అటు ఇహం, ఇటు పరం రెంటి సమన్వయాన్ని వశం చేసింది.
ఈయన దృష్టికి తామరాకు మీద నీటి బిందువు బుద్ధుడు, బెకబెకల కప్ప ఓంకార మంత్రరూపం, ఆ మంత్ర ధ్యాన ప్రతీక.
ప్రతీకాత్మకత పుష్కలంగా exploit చేసినవి ఈ అరవై కవితా పంక్తులు.
కవి ఆదిత్య ప్రేమికుడు, అతని బంగారు వెలుగు సోకని కవిత లేదు ఈ సంకలనంలో.
నిదానంగా, శ్రద్ధగా శబ్దాలకు రంగులు అద్దుతాడు. రంగులకు సువాసన పూయగలడు. తేలిపోయే గంధాలకు స్థిర రూపం కల్పించగలడు. రూపాన్ని పంచేంద్రియ జ్ఞానంతో చూస్తాడు. రూపాలను దాటి అతీంద్రియమైన రసానుభవాన్ని అందుకోగలడు.
అందుకే జెన్ నుంచి, మాండూక్యోపనిషత్తు నుంచి బుద్దుడు నుంచి జ్ఞాన ప్రసూనాలతో ప్రవహించి, ప్రవహించి వచ్చింది ఈ కవిత్వం.
ఏరుకున్నవారికి ఏరుకున్నన్ని స్ఫటికాలు, శంఖాలు, నాదోక్తులు.
ఉదాహరణలు చెప్పాలంటే మళ్ళీ అంత పుస్తకమూ తయారవుతుంది.
తన ప్రయాణంలో చిన్న చిన్న విచిత్రాలను కూడా అందమైన గవ్వల శబ్దాల వలె ఏరే బాలుడు, స్వరూపసాక్షాత్కారానికి నిశ్శబ్ద ఉపాసకుడు ఈ కవే.
కడపటగా కవి నమ్మిక ఒక్క ప్రకృతిలోనే .
అమ్మైనా, అడవైనా ప్రకృతే, అసాధ్యమైన ఈ అవకతవకల లోకాన్ని బుద్ధి మళ్ళించి సరైన మార్గం పట్టించగలది అమ్మరూపంలోని ఆడదే.
“ఒక్క అడవికే సాధ్యం , రాయికి తలదువ్వి జడవేయడం”.
చివరకు మనిషికి మూలప్రకృతే గతి.
లోపటి నిష్కల్మష ప్రకృతిని మనిషి జాగృతం చేసుకోగలగడమే ఈ కవితల ఆకాంక్ష.
అమేయమైన పదచిత్రాలతో నిండిఉన్న ఈ కవితలు
భావుకత పైన, ఆధ్యాత్మికత పైన, పాడైపోతున్న మనిషి పైన ప్రేమ ఉన్న అందరూ చదవవలసిన కవితలు.
*
ప్రతులకు: చాయా ప్రచురణలు, హైదరబాద్
సూరపరాజు పద్మజ గారు, కవి వసీరా కవితా సంపుటి
” సెల్ఫీ ” పై మీ విశ్లేషణ సూపర్ గా వుంది. కవి లోపలి ప్రపంచం తోను, బయటి ప్రపంచం తోను పడిన పేచీ దుఃఖాలుగా, ఆనందాలుగా వెరసి కవిత్వంగా బయటపడటాన్ని బాగా పట్టుకున్నారు. కవి స్పందనలపై మీ ప్రతిస్పందనలు చాలా విలువైనవి గా వున్నాయ్. మీకు హృదయపూర్వక అభినందనలు.