కవిత్వానికి వేణువునే అయినా
ఆ శబ్దానికి
ఆలోచనల బీజం
ప్రాకుతూ నడుస్తూ పరుగెత్తుతూ
నిద్రలో సైతం వెంటాడుతుంది
పెరిగాక ఎలా బయటపడుతుందో
దానికీ తెలియదు
దానిని కవితలా చేయబోతుంటే
గొప్ప కవులు
నన్ను చిన్నవాడిని చేస్తుంటారు
వారిని చదువుతున్నపుడు
గొప్పవాడిని చేస్తుంటారు
ఒకే ఇంటిలో ఉన్నా
అపరిచితుడులా మెలిగే ఆత్మలా కాదు
కవిత-
దాని నీడలనుంచి
సత్యం
బొట్లుబొట్లుగా రాలిపడుతూనే ఉంటుంది
దీపాల్ని ఆర్పేసే జోరు గాలేదో
దాని అగ్గిని మరింత రాజేస్తుంటుంది
మంటలా కవిత్వానికి ఎన్ని నాలుకలో
అయినా పల్లపు నీరులా జారిపోతుంటుంది
ప్రవాహంలో కొట్టుకుపోవటం కంటే
ప్రవాహమవడం ఎంత కష్టం
వ్యాపించినా కనిపించని
పూల పరిమళంలా కాకుండా
కవిత ప్రభావం
కవికైనా తెలుస్తుందో లేదో?
*
Beautiful