” పది నిముషాల్లో పోతామని తెల్సినా తొమ్మిది నిముషాల యాభై తొమ్మిది సెకన్ల యుద్ధమే జీవితం” అంటారు ప్రముఖ కవి ఎన్. గోపి ఒక కవితలో. నిజమే . జీవితం ఆఖరి క్షణం వరకు యుద్ధమే. ఒక్కఒక్కరికి ఒక్కోరకమైన సంఘర్షణ ఉంటుంది.స్వీయ అనుభవాలు ఒకరికి ఉంటే, సామాజిక అనుభవాల మీద పోరాటం మరికొంత మందికి ఉంటుంది. సమస్య ఉన్న వాళ్లంతా యుద్దాలు చేయాలని రూలేం లేదు కానీ కొంతమంది మాత్రం యుద్ధంలో కావాలని దిగుతారు.కాలం వాళ్ళని ఆహ్వానిస్తుంది. గెలుపు ఓటములు లెక్కచేయకుండా వాళ్లు కాలానికి కాపలా కాస్తారు.
ఈ మధ్య కాలం లో కవిత్వం లో కొత్తగా వినబడుతున్న పేర్లలో పద్మజ ఒకరు. యధాలాపంగా ఒకరోజు ఒక ఫోటో ఆమెకు నచ్చి ఒక కవిత రాశారు. అది చాలబాగుంది కానీ కాస్త నిడివి ఉంటే బాగుండు అనిపించింది. చెప్పాను.ఆశ్చర్యపోయేలా ఆమె ఒక కొత్త నిండైన పద్యాన్ని రాసి నన్ను ట్యాగ్ చేశారు.చాలా గొప్ప అభివ్యక్తి ఉన్న ఆధునిక కవిత అది. ఆనాటి నుంచి ఆమె కవిత్వం ఎక్కడున్నా చదువుతున్నా. ఈ రోజు మన తొలకరి లో కొత్త కవి “పద్మజ బొలిశెట్టి”
పైన చెప్పుకున్నట్టుగానే పద్మజ కొత్తగా కవిత్వం లోకి వచ్చినా సరే ఆమె దగ్గర కొంత సరంజామా ఉంది.ఊహాని కవిత్వం చేయగల నేర్పు, అందుకు అవసరమైన పద బంధాలు, కవిత్వం దాన్ని నిర్మించే పద్ధతి అందుకు అవసరమైన భాష ఆమె దగ్గరున్న వస్తువులు. భావాన్ని విపులంగా చెప్పడం కోసం అవసరమైన ఓర్పు కలిగి ఉండడం ఈమెకున్న మరో క్వాలిటీ అని చెప్పొచ్చు.
మనసు లోపల వస్తువు ఎంత మెలిపెడుతున్నా సరే దాన్ని సరైన విధంగా ప్రెజంట్ చేయకపోతే ఆ వస్తువు దాని వెనక ఉన్నభావము రెండూ చెడతాయి.సో, ముందు వస్తువు ను ఎంపికచేసుకోవడంలోనే కవి ప్రతిభ దాగిఉంటుంది. మిగతాది దాన్ని కవిత్వం చేయడం లోనే ఉంటుంది.
పద్మజ గారికి మహిళా సమస్యల పట్ల అవగాహన బాగానే ఉంది.
మొగ్గ దశలోనే తుంచి వేయబడ్డ ఎన్నో
రంగుల పువ్వులు స్త్రీలు
ఆదిమయుగం నుండి నేటికాలం వరకు స్త్రీ తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఎన్నో పోరాటాలు చేయవలసి వస్తుంది.దాని కాలనుగుణ క్రమానుకూల విశ్లేషణనే తన కవితగా చెప్పుకుంటారు పద్మజ .
ఆమె
నేను రాయాలనుకున్నది
బ్లాక్ బోర్డు పై చెరిపేసిన
అక్షరాల ఆనవాళ్లను
నేను పాడాలనుకున్నది గుండె గొంతుకలోనే నలిపివేయబడ్డ నలుపు స్వరాన్ని
నేను సేకరించాలనుకున్నది
చెల్లాచెదురుగా విసిరివేయబడ్డ
సముద్ర తీరపు గవ్వల అస్తిత్వాన్ని
నేను ఎవరినో మీకు తెలియదు?
ఈ విశాల విశ్వపు ఆదిమనాగరికతలో ఓ అమ్మతల్లిని
వేటాడే సింహాన్నివెంటాడే ఆదిమ దీరత్వపు వీరవనితను
అనంతకీర్తిని భుజాలపై మోస్తున్న సృష్టికి ప్రతిసృష్టిని
కాలక్రమేణా…
డు యు నో ద ట్రూత్
నన్ను గెలవలేక
గెల్చుకొలేక
నాతో కలిసి నిలబడలేక
నిల్చోలేక
వెనుకడుగేసి
వెన్నుపోటు పొడిచి
క్రూరత్వాన్ని దీరత్వంగా ధరించిన వీరుని వలె
భీరత్వాన్ని విలువల వలువలుగా
ధరించిన శూరుని వలె
అధికార పీఠమెక్కి
సహచరిని అనే మాట మరిచి
నన్నో సౌందర్యానికి కేర్ ఆఫ్ అంటూ
నా చుట్టూ కథలు అల్లారు
సౌకుమారివని అందమైన కల్పనలు చేశారు
కట్టుబాట్లతో కట్టేసి కావ్యాలు రాసారు.
సతీ అంటూ కాల్చేసి శిల్పాలు చెక్కారు.
అస్తిత్వపు పునాదులను అధపాతాలానికి అణచివేసే ఆనవాళ్లు లేని కొత్త కిరీటాలను తలపై మోపారు.
కానీ తెలుసా మీకు?
ఇన్నాళ్లు నీ మేల్ చావనిస్టిక్ ఇగోను
ఓ తపస్విలా మౌనంగా
మోస్తూ భరించాను.
కానీ
నేనిపుడు
పర్వతవాలులో కరుగుతున్న మంచుని
నేనిపుడు
వసంతాన కాలుతున్న అడవిని
నెనిపుడు
దివి నుండి జారుతున్న ఆకాశాన్ని
నెనిపుడు
బోగ్గుల్లో రేగుతున్న నిప్పుపువ్వును
నేనిపుడు
తీరం దాటిన వాయుగుండపు సుడిగుండాన్ని
నేనిపుడు
శత్రువులను మట్టికరిపించే యుద్ద భూమిని
నేనిపుడు
అనురాగాన్ని పెంచే ప్రేమక్షేత్రాన్ని
నేనిపుడు
కొంగొత్త మనిషిని
నేనిపుడు
నీతో సహా విశ్వాన్ని వినిర్మించ పూనుకున్న వనితను
నేను సృష్ఠి రహస్యాన్ని
నేను మహిళను.
ఇందులో ఒక ఆత్మవిశ్వాసపు ప్రకటన చూస్తాం.
“కానీ తెలుసా మీకు?
ఇన్నాళ్లు నీ మేల్ చావనిస్టిక్ ఇగోను
ఓ తపస్విలా మౌనంగా
మోస్తూ భరించాను. ” . ఈ వాక్యంలో ఆవిడ మొత్తం స్త్రీలతరపున మాట్లాడుతున్న ఒక ప్రతినిధిగా చూస్తాం. సృష్టికి మూలం స్త్రీ అని చెప్పుకుంటూనే మనం వాళ్ళని చూసే చూపు మారాలని స్త్రీలు ఎప్పటినుంచో పురుషుల చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెబుతున్నారు.కానీ వినబడదు కదా.
” నేను బానిస పాత్రలో రాణించినప్పుడు
మా కొండచిలువ మాట్లాడుతుంది
అప్పుడప్పుడు పోట్లాడుతుంది కూడా” అంటారు..
స్త్రీ ని బానిసగా చూస్తున్న దృష్టి మారే వరకు ఇలాంటి కవిత్వం వస్తూనే ఉంటుంది.
ఆధునిక వర్తమానం లో స్త్రీ ఎలా వంచనకి దోపిడీకి గురవుతుంది అన్నా విషయాన్ని పద్మజ ఇలా చెబుతారీ కవితలో
“నన్నో సౌందర్యానికి కేర్ ఆఫ్ అంటూ
నా చుట్టూ కథలు అల్లారు
సౌకుమారివని అందమైన కల్పనలు చేశారు
కట్టుబాట్లతో కట్టేసి కావ్యాలు రాసారు.
సతీ అంటూ కాల్చేసి శిల్పాలు చెక్కారు.
అస్తిత్వపు పునాదులను అధపాతాలానికి అణచివేసే ఆనవాళ్లు లేని కొత్త కిరీటాలను తలపై మోపారు.” ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారం అంతా స్ర్తీ కేంద్రంగానే కదా. చెప్పులకి బికినీ వేసుకున్న స్త్రీ కి ఉన్న సంబంధం ఏంటి అన్నది మనకి తెలీదు ,కానీ ఒక ప్రకటన లో మనం అది చూస్తాం. ఇలాంటివి చాలానే ఉన్నాయి.అనాది కాలం నుంచి అనేకమంది.స్ర్తీలు కవిత్వం కథలు, నవలలు రాశారు.ఎక్కడో ఒకచోట మార్పు మొదలవుతుంది. అప్పటివరకు ఆశావహ దృక్పథంతో రాసే కొత్త కవులని ఆహ్వానించవలసిందే..
అయితే నిడివి మీద శ్రద్ధ అవసరం. అలాగే ఎడిటింగ్ కూడా కాస్త జాగ్రత్తగా గమనించు కోవాలి. హడావుడిగా రాసిన ఫీలింగ్ లేకుండా ఉండాలి కవిత చదివితే. ఫ్రెష్ వాయిస్ వరకు బాగుంది కానీ, వస్తువు పాతది అయినప్పుడు శైలిలో కాస్త మార్పుని ప్రయత్నం చేయవచ్చు. భావగర్భిత పద చిత్రాలు గా కవిత్వం రాసే క్రమంలో ఈవిడ శిల్పం ఆమోఘంగా ఉంటుంది.అలాంటి శిల్పాన్ని కొనసాగిస్తే బాగుంటుంది.
పద్మజ బొలిశెట్టి w/0 తోట మహేష్
అమ్మ -చిలకమ్మ
నాన్న- సత్యనారాయణ బొలిశెట్టి
ఇంటర్మీడియేట్ లో వివాహం అయిన తర్వాత ఇద్దరు పిల్లలు అబ్బాయిలు పుట్టిన తర్వాత మళ్లీ చదువు కంటిన్యూ చేసి ఎమ్మెస్సీ మాత్స్ చేశారు. గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న సమయంలో appsc నిర్వహించిన vro , పంచాయతి సెక్రెటరీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యి vro గా జాయిన్ అయ్యి ప్రస్తుతం పదోన్నతిపై సీనియర్ అసిస్టెంట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కవిత్వం హాబీ గా చెప్పుకునే పద్మజ గత రెండు సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నారు. ఇప్పటి వరకు చాలా కవితలు రాసారు. పెక్కు సంఖ్యలో అవి ప్రచురితం అయ్యాయి. కవిత్వంలో దేశీయ, అంతర్జాతీయ మహిళా రచయితల కవిత్వాన్ని తెలుగులోకి అనువదించడం ఈమెకి ఇష్టమైన ప్రక్రియ ఆ ఇష్టం తో దాదాపు 25 పైగా మహిళా కవయిత్రులు కవిత్వాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో Right to sit అనే చట్టాన్ని తమిళనాడు,కేరళ చట్టాల మాదిరిగా ఇక్కడ తెలంగాణాలో కూడా కల్పించాలని రైట్ టు సిట్ జాయింట్ ఫోరమ్ తరపున నుండి అవగాహన కల్పిస్తున్నాము.దానికి సంబందించిన కవితలను,కథల రూపంలో తెలియజేసి ప్రజల్లో అవగాహన తీసుకురావడం ముఖ్య ఉద్దేశ్యం.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ భావ రూపంలో కవితాత్మకంగా వెల్లడించడం ఇష్టమైన పని. ఈవిడ హస్బెండ్ బిజినెస్ చేస్తారు.తన చదువు మొదలుకొని ఇప్పటి కవిత్వ ప్రయాణం వరకు మహేష్ గొప్ప సహకారాన్ని,ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.త్వరలో ఈమె నుంచి ఒక కవితా సంపుటి మరియు మేలిమి కవిత్వం రావాలని కోరుకుందాం.
*
శక్తివంతమైన అభివ్యక్తి.
అబినందనలు
ఇద్దరకూ
పద్మజ గారి కవిత్వంలో ఒక తెలియని వేగం ఉంటుంది. భావనలు ఉద్వేగ పూరితమైనవి. వస్తువు పట్ల మరింత అవగాహన, ఆమె కవితను ప్రదీప్తం చేయగలదు. అనిల్ మంచి పని చేస్తున్నావు. అభినందనలు
మా డానీ మంచి పరిచయం రాసాడు.గణిత శాస్త్రం మీద పట్టు ఉన్న వాళ్ళు కవిత్వం బాగా రాస్తారు అని సోక్రటీస్ అన్నట్లు ఎక్కడో చదివాను. ఏ కె రామానుజం ని చూస్తే నిజం అనిపిస్తుంది.కానీ నాకు తెలిసిన చాలా మంది లెక్కల మాస్టారులని చూస్తే ఈ లెక్క తప్పింది.మళ్ళీ. మీ విషయంలో నమ్మక తప్పడం లేదు.అభినందనలు.
Keep going
ఒక్కో సమయం ఒక కవి కి జన్మనిస్తుంది అంటారు కదా! అలాంటి ఒక కవి పద్మజ.మంచి పరిచయం.శుభాకాంక్షలు.
Good analyses.
మంచి విశ్లేషణ అనిల్ గారు