కవిత్వం కోసం 

బ్దమో

సమ్మోహన పరిచే

సంగీత నిశ్శబ్దమో

వెలుతురో

కళ్ళ ముందు కదలాడే

కాంతి తెరలో

లిప్తపాటో

సుదీర్ఘ పురాస్మృతుల

యుగాల చిరపరిచితమో

 

ప్రియా

నీ కళ్లు అనంత జ్ఞాపకాల దివ్వెలు

రెప్ప మూయకు సఖీ

నా చుట్టూ శూన్యాంధకారం పరుచుకుంటుంది

 

ఏ అనంతాకాశ  నీలినీడల్లో

దాక్కున్నామో

ఏ మిణుకు మిణుకు నక్షత్రాల వెలుతురులో

వెతుక్కున్నామో

ఏ పొగమంచు కప్పుకున్న లోయల్లో

తప్పిపోయామో

స్తంభించిన కాలాన్ని

హృదయస్పందనల్లో చలింపజేసామో

ఇప్పుడిలా నీ సమక్షం

మళ్ళీ కొత్తగా తొలియౌవనాల

పరిమళాలు పూయిస్తోంది

 

నీ సాన్నిహిత్యం

ఎండిపోయిన వనాలకు

కొత్తగా వసంతాన్ని పరిచయం చేస్తోంది.

 

కవిత్వమా

నీతో ప్రతిక్షణం

ఒక పారవశ్య జీవితోత్సవం

 

నీ ప్రతి మాట

నాలో పెల్లుబికే మహదానంద

సముద్రకెరటాల సంరంభం

 

లేలేత చిగురుటాకులాంటి నీ నుదురుపై

నాట్యం చేసే తొలిసూర్యకాంతిని

సుతారంగా ముద్దాడితే

నాలో సమస్త జీవశక్తులూ

పురివిప్పి ఆడే సన్నివేశం

నన్ను నాకే కొత్తగా పరిచయం చేసే

అద్భుత నెమలిపింఛాలు

నీ నేత్రాలముందు

మేఘమై వర్షించాలి

 

నా కవిత్వమా

ఊపిరిపోసే  నీ పాదాలను

ఒక సారి స్పృశించనీ

నీ అనంత ప్రేమలో పునీతున్నయి

మళ్ళీ మళ్ళీ పునర్జన్మ ఎత్తుతా .

*

నారాయణ స్వామి వెంకట యోగి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు