కవిత్వం ఒక ఆత్మీయ ఆలింగనం

కవిత్వం కవిత్వంగా చూసే దృష్టి కంటే అది సమాజంలోని మనిషిని మనిషిగా తీర్చిదిద్దే, రూపుదిద్దే ప్రక్రియగా ఉండాలని నా ఆకాంక్ష.

నేను మీ కవియాకూబ్ ను!

మా నాన్న మహమ్మద్ మియా- చింతపండు, మిరపకాయలు తలమీద పెట్టుకుని ఊరూరూ అమ్ముకుంటూ ఖమ్మం జిల్లా కారేపల్లి వచ్చాడు.  ఆ తర్వాత చిన్నప్పటినుండి తెలిసిన తాపీపని చేసిండు మా నాయిన  కారేపల్లిలో. ఆ తరువాత పక్కనే ఉన్న  కోయవాళ్ళ ‘రొట్టమాకురేవు’ అనే చిన్న పల్లెటూరు చేరిండు.  అక్కడవుంటూ పక్కన ఉన్న ఊళ్లు తిరిగి కావిడిలో తినే దినుసులు, బెల్లం, ఉప్పు, పప్పు, పువ్వాకు, చిల్లర సరుకులు అమ్మేవాడు. ఆ తర్వాత చిన్నచిన్నగా ఎగసాయం మొదలుపెట్టిండు కౌలుకు తీసుకుని. చదువుకున్న పూర్వీకులు ఎవరూ లేదు. అంతా జీతగాళ్లే. దాశరథి పుట్టిన ఊరు – వరంగల్ జిల్లా చినగూడూరు మా నాన్న పుట్టిన ఊరు.

బాల్యం కనాకష్టం. అతి సాధారణమైన, కడుపేద బాల్యం. ఆయమన్న తిండి, ఆయమన్న గుడ్డలు లేని బాల్యం. చదువు ఎట్లాగో జీవితంలోకి ప్రవేశించింది. అదికూడా పంతుళ్ళ దయతో, దోస్తుల సహకారంతో సాగింది. కొత్త పలక, కొత్త పుస్తకాలు కొనుక్కోలేని చదువు. ఎవరో పాత పుస్తకాలు దానం చేసేవాళ్ళు. ఎవరో నోటు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. పేద పిల్లలకు ఇచ్చే పుస్తకాలు స్కూళ్లకు వస్తే, అవి నాక్కూడా చేరేవి. చదువు ఒంటపట్టినందువల్ల బతుకు ఒక గాడిలో పడిందేమో. చదువు అన్ని కష్టాలనుంచి దారి చూపిస్తుందని ఆశ పడ్డానేమో. పదో తరగతి పాసైనంక చదువే ఇక దారి అని నమ్మకం కుదిరింది. ఊరునుంచి కాలు బయటపెట్టాను. ఇంటర్ కోసం కొత్తగూడెంలో అడుగుపెట్టాను. అదే విశాలమైన లోకంలోకి పెట్టిన తొలిఅడుగు.

మొదటి కవిత ప్రజాశక్తిలో ‘నేను’ పేరుతో 1983 అచ్చయింది. అంతకుమునుపు పాటలు రాసాను- పాటలు పాడాను. కంజీర కొట్టుకుంటూ ఎన్నెన్ని ఊళ్ళు తిరిగి పాటలు పాడుకుంటూ విద్యార్థి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నానో లెక్కచెప్పలేను. 1980 ప్రాంతాల్లో ఇంటర్ ఫెయిలై కొత్తగూడెం సింగరేణి కాలరీస్ యూనియన్ ఆఫీసు బాయ్ గా, పేపర్ బాయ్ గా ఉన్నప్పుడు, గోదావరిఖనిలో ఐస్ క్రీమ్ అమ్ముతున్నపుడు బతుకును అతి దగ్గరగా గమనించాను.

నన్ను ఆదుకున్న మార్క్సిస్టుపార్టీ కె. ఎల్. నరసింహారావుగారి కుటుంబం (దుర్గమ్మగారు, ఉత్తమ్, పావన్, సుధక్కగార్లు) ఉండటం మూలంగా నేను నా ఉనికిని అణకువగా మలుచుకున్నాను.  వాళ్ళవల్లనే ఖమ్మంలో డిగ్రీ పూర్తిచేయగలిగాను. నాలాంటివాళ్లకు ఎందరికో వీరిలాంటి వాళ్ళ అండ దొరకడానికి నేనొక ఉదాహరణగా మిగలాలని వినమ్రంగా ఆ కుటుంబాన్ని సదా తలుచుకుంటాను. నా విషయంలో అందరూ నాపట్ల అభిమానంగా ఉండేవాళ్ళు. నేనూ అందరిపట్ల ప్రేమగా ఉండేవాడిని. నా బతుకు నేపథ్యం నన్ను అణకువ స్వభావిగా ఉండేట్లు మార్చింది.

డిగ్రీ చదువు దుర్గమ్మగారి, కె. ఎల్. గారి సౌజన్యం. ఆ సౌజన్యమే లేకపోయుంటే నా జీవితమేమై ఉండేదో ఊహించడం కష్టం. రెండుసార్లు ఖమ్మం సిద్ధారెడ్డి డిగ్రీ కాలేజీలో కల్చరల్ సెక్రటరీగా ఎన్నికల్లో గెలిచాను. ఉస్మానియా లో ప్రోగ్రెసివ్ ఫ్రంట్ నుంచి రెండుసార్లు పోటీచేసి ఓడిపోయాను. డిగ్రీకాలేజీలలోనే చివరికంటా ఉద్యోగంచేసి సిటీ కాలేజీనుంచి యాభై ఎనిమిదేళ్లకు ఉద్యోగవిరమణ చేసాను.

నా జీవనసహచరి శిలాలోలిత, కవయిత్రి. పరిశోధకురాలు. నా సహాధ్యాయి.  అసలు పేరు పురిటిపాటి లక్ష్మి.  తల్లిదండ్రులు పురిటిపాటి రామిరెడ్డి, మంగమణి గారు. చిన్నతనంలోనే జీవితపు ఆటుపోట్లను ఎదుర్కొని ఒక బాబుకు జన్మనిచ్చి, వివాహబంధంనుండి విడివడి,  ఆ తర్వాత చదువుకుని జీవితంలో నిలబడి నా భాగస్వామిగా మారి, నన్ను తీర్చిదిద్దింది. తెలుగు సాహిత్యంలో పి హెచ్ డి పూర్తిచేసింది. పదికి పైగా పుస్తకాలు ప్రచురించింది. నా జీవితంలోకి ఆమె ప్రవేశం నన్నో సుస్థిరగమ్యంవైపుకు నడిపించిందనే కృతజ్ఞత నాకు ఆమెపై ఉంది. నా ఆటుపోటుల జీవితానికి ఆమె తెరచాపగా నిలబడింది.

కవిత్వాన్ని మునుపటికంటే విస్తృతంగా ప్రజలకు చేరువచేయడంలో కృషి కొంత చేసాననిపిస్తోంది. నేను 2012 లో సోషల్ మీడియాలో ఆరంభించిన ‘కవిసంగమం’ నాకు గర్వకారణం.  ఇవాళ 18,000 మందికి పైగా కవిత్వప్రేమికులు అందులో ఉన్నారు. అప్పుడే కలంపట్టినవాళ్లకు నేనో యారోమార్కులా వారి మార్గంలో నిలబడ్డాను. ఆత్మీయనేస్తంలా మారాను. ఆకలిదప్పుల ప్రయాణంలో ఆసరాగా సాధ్యమైనంతమేరకు ఉండగలిగాను. నిరంతరంగా మూడుతరాల కవిసంగమం, రెండుతరాల కవిసంగమం, ఊరూరా కవిసంగమం కార్యక్రమాలు, పోయెట్రీ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ కొత్త కవులకు దారులు నిర్మిస్తున్నాను. మా ఊరు రొట్టమాకురేవులో ప్రారంభించిన గ్రంథాలయం Give back to the society భావనలో భాగం.

లౌకిక ప్రజాస్వామిక వేదికల నిర్మాణంలో పాలుపంచుకున్నాను. 2002 గుజరాత్ మారణ హోమం తర్వాత నేను కన్వీనర్ గా ఉన్న ఒక టీమ్ గుజరాత్ కు వెళ్లి వచ్చాక, ఇక్కడ విస్తృతంగా సభలు చేయడంలో, పుస్తకాలు వేసి ప్రచారం చేయడంలో ముందున్నాను.  ఇప్పటి ‘సమూహ’ వేదిక కన్వీనర్ వరకూ భిన్నత్వంలో ఏకత్వపు భావనను నిలపడం అనే దృక్పథంతో పనిచేస్తున్నాను. లౌకికస్వప్నం గురించే మాట్లాడ్డం, అదే ఈ దేశపు అవసరమని అప్పుడూ ఇప్పుడూ నమ్ముతున్నాను. ‘మొహబ్బత్ కా దుకాన్’ ల అవసరం ఈ దేశానికి చాలా చాలా అవసరం. ‘ప్రవహించే జ్ఞాపకం’ నుండి ‘మనుషుల్రా మనుషులు’ కవితాసంపుటాలవరకు… సమాజ ప్రతిఫలనాల్ని నా జీవిత నేపథ్యపు అనుభవాలను మేళవించి కవిత్వం చేయడానికి ప్రయత్నించాను.  నా కవిత్వంలోని ‘నేను’ నేను మాత్రమే కాదు, సమాజంలోని అనేక నేనులు.
సంఘర్షణాత్మక జీవితానుభవపు సారాన్ని కవిత్వంగా మలిచాను. అంతర్లీనంగా భారతీయ ముస్లిం వేదనను వినిపించాను. సెక్యులరిజం అవసరాన్ని, ప్రాధాన్యతను కవిత్వంలో నిరంతరంగా రాస్తున్నాను. సరళంగా కవిత్వవ్యక్తీకరణ ఉండాలని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాను. ‘నా కవిత్వమే నా ఆత్మకథ’ అని ఒకచోట రాసుకున్నాను. అదే కవిత్వంలో ప్రతిఫలించే నిజం.

ప్రవహించే జ్ఞాపకం నుండి వరుసగా సరిహద్దురేఖ, ఎడతెగని ప్రయాణం, నదీమూలంలాంటి ఆ ఇల్లు, తీగలచింత, ‘మనుషుల్రా మనుషులు’ ఈ సంకలనాల పేర్లు నా కవిత్వ పరిణామపు సంకేతాలుగా అనుకుంటాను. వ్యక్తి, సమాజం, అంతశ్చేతన, సంఘర్షణ.. ఈ అంశాలు సూత్రప్రాయంగా ఈ పేర్లలో ధ్వనించడం గమనించవచ్చేమో!

పరిశోధనలో తెలుగు సాహిత్యవిమర్శ అంశంగా తీసుకుని ప్రత్యేకంగా కృషిచేసాను. నాలుగు పుస్తకాలు ప్రచురించాను. కవిత్వ సృజనగురించిన అనేక అంశాలతో ‘సృజనానుభవం’ గా రాసాను. బీహార్ పాట్నా నుండి అందుకున్న ‘నయీధార నేషనల్ అవార్డు’ జాతీయ స్థాయిలో ప్రసిద్ధమైనది. దానితోపాటు తెలుగునేలపై అందుకున్న – ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, మఖ్దూమ్ అవార్డు, సి. నారాయణరెడ్డి అవార్డు, రావెళ్ల వెంకటరామారావు అవార్డు, ఆలూరి బైరాగి అవార్డు, ఎదిరెపల్లి మశమ్మ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, ATA అమెరికా అవార్డు వంటివి ప్రముఖమైనవి.

ఐదేళ్లు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు అడ్వైజరీ బోర్డు మెంబరుగా ఉన్నాను. 2019 లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యాను. 2024 నుండి హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను. కవిత్వం కవిత్వంగా చూసే దృష్టి కంటే అది సమాజంలోని మనిషిని మనిషిగా తీర్చిదిద్దే, రూపుదిద్దే ప్రక్రియగా ఉండాలని నా ఆకాంక్ష. అభిమతం. మనుషుల్ని హ్యాండిల్ విత్ కేర్ అన్నానందుకే. మనిషిని మనిషిగా చూడలేని సమాజం ఎంత ప్రగతి సాధించింది అని గొప్పలు చెప్పుకున్నా అది ప్రగతి కాదు. ప్రగతి అంటే మనుషులు మనుషులుగా మారడం. చూడబడటం. ప్రేమించబడటం. ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగలగడం. దానికోసం కవిత్వం ఒక ఉపకరణంగా మారాలని నా తాపత్రయం. అప్పుడే నిజమైన మానవ వికాసం.

(కవియాకూబ్ సృజన సమాలోచన సదస్సు జరిగిన సందర్భంగా చెప్పుకున్న/చెప్పదగిన కొన్ని నా మాటలు)

కవి యాకూబ్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు