“ఖడ్గ సృష్టి” పుస్తకం మొదటిసారి ఎనిమిదో తరగతిలో ఉన్నపుడు చూసాను. మా జూనియర్ ఒకడు, 7 వ తరగతిలో వాడు ఆ పుస్తకం ప్లేగ్రౌండ్ లో ఉయ్యాల దగ్గరకి తీసుకు వచ్చాడు. వాడు ఉయ్యాల మీద ఉన్నపుడు ఆ పుస్తకం తీసుకుని చదివాను. ఉయ్యాల దిగి నా దగ్గరకి వచ్చి వాడు రహస్యంగా చెప్పాడు కవిత్వం రాయడానికి ప్రయత్నిస్తున్నాను అని. అప్పటివరకూ నేను కూడా కవిత్వం రాయ వచ్చు అని ఊహ కంద లేదు. నేను వాడి పుస్తకం తీసుకొని, రెండు రోజుల పాటు చదివి మరీ, ఒక కవిత రాసాను. ఎవరికీ చూపించకుండా పుస్తకంతో బాటు వాడి దగ్గరికే ఈ కవిత తీసుకు వెళ్లి చూపించాను. “బాగుంది! అచ్చం శ్రీ శ్రీ రాసినట్లు ఉంది!” అన్నాడు వాడు. శ్రీ శ్రీ రాసినట్లు ఎలాగ ఉందంటే మరి ఆ పదాలు ఎత్తుకు వచ్చి యథాతథంగా వాడితే అలాగే ఉండదూ? ఆ తర్వాత ఆ కవిత చింపేసినట్లు గుర్తు!
అప్పటినుంచీ, నాకు కొన్నాళ్ల పాటు కవిత్వం రాయాలనే తీవ్రమైన ఆకాంక్ష రగిలింది. ఆ రోజుల్లో కొన్ని కొన్ని చిట్కాలు కనిపెట్టాను. ఉదాహరణకి, ఇలా మొదలు పెట్టు:
- ముందు ఒక సాధారణ వాక్యాన్ని రాయి:
“రాత్రి చీకటిగా ఉంది”
2. తర్వాత పదాలు తారుమారు చెయ్యి:
“ఉంది రాత్రి చీకటిగా”
3. ఇది ఎనిమిదో తరగతి కుర్రవాడి లెవెల్. ఇంకా పై తరగతులకు వెళితే, ఇంకొంచెం అలంకారాలు, విశ్లేషణాలు గుప్పించాలి:
“రాత్రి సిగ్గుపడుతున్న అమ్మాయిలా, అస్పష్టంగా, చీకటిగా ఉంది”
4. ఇది మరీ స్పష్టంగా ఉంది. అరబిక్ భాషలో పదంలో అచ్చులు వదిలి వదిలి వేసినట్లు, కొన్ని పదాలు వదిలితే, కొంచెం అస్పష్టంగా బాగుంటుంది:
“రాత్రి సిగ్గుపడుతూ చీకటిగా ఉంది”
5. క్రియలు వదిలి వేస్తే ఒక పద చిత్రమవుతుంది.
“సిగ్గు పడుతున్న రాత్రి// మొహమ్మీదకి జారిన చీకటి ముసుగు”
6. అప్పటికే శ్రీశ్రీ చదివి ఉన్నాను కాబట్టి, కొంచెం రక్తారుణిమ రుద్దవచ్చు:
“రాత్రి నల్లగా కూర్చుంది పేదవాడి గుండెలమీద, పూరిగుడిసె చీకట్ల మధ్య //
ఎరుపెరుపు ఉదయం రాక తప్పదు “
7. పోనీ, శేషేంద్ర జాలంలో పది, కొంత అతి రూపక సమాసాలు విరజిమ్మవచ్చు
“రాత్రి వగరుగాఉంది//
ఊదారంగు ఆనందాన్ని తనలో దాచుకున్న ప్రేయసిలాగ
గాఢతమోద్భవ భయద లాగ //
సినిమా హాలు ముందు తచ్చాడుతున్న నెరుడా కలంలో సిరాలాగ”
చివరికి పదవ తరగతి వచ్చేసరికి నాకు రాష్ట్ర కవితా పోటీలలో మొదటిదో రెండవదో స్థానం వచ్చింది! తర్క శాస్త్ర నిష్ణాతుడైన నా మిత్రుడు ఒకడు ఎప్పుడో నేను నా పరీక్షల్లో మార్కుల గురించి బడాయిలు కొడుతుంటే అన్నాడు: “దీనికి ఒకటే వివరణం ఉన్నది. నీకు వచ్చిన ఒకే ఒక సబ్జెక్టు పరీక్షలో బాగా చెయ్యడం” . కవిత్వ చేలాంచలాల గాలి విసురులు నాకు తగిలాయి అని చెప్పలేను కానీ, అవార్డులు, సర్టిఫికెట్లు వచ్చాయని చెప్పగలను!
నా కవిత్వం అలామొదలైంది అక్షరాలు పదాలు పదబంధాలు చివరికి భావాలు కూడా అరువు తీసుకోవడంతో. నేను కవిత్వం రాయడం మొదలు పెట్టే వరకూ నాకు కవిత్వంతో అంతగా పరిచయం లేదు అనుకునేవాడిని. అంతవరకు చూసిన చదివిన మహాభారతం శతక పద్యాలు ఎందుకు నేను కవిత్వంగా భావించలేదు. బహుశా వాటి ప్రయోజనం కథలు చెప్పటం, నీతులు చెప్పటం, లేదా సంభాషణలు ముందుకు జరిగించడం అనుకునేవాడిని ఏమో. ఖడ్గ సృష్టి లో నాకు ముక్కుసూటిగా అవేవీ కనబడలేదు. నా ఉద్దేశ్యంలో అప్పుడు కవిత్వం అంటే పాఠకుడి మీద ఎక్కువ బాధ్యతగా పెట్టిన రచనలు అనిపించాయి.
తర్వాత ఆలోచించుకుంటే అనిపించింది — నాకు చిన్నప్పటి నుంచీ అందరికి లాగే కవిత్వ పరిచయం ఉన్నదని. అమెరికా వచ్చిన కొత్తలో ఒక అంతర్జాతీయ విద్యార్థుల సంఘంలో మాట్లాడుతూ చిన్నప్పుడు అమ్మ చందమామ రావే అనే పాట పాడుతూ తినిపించేది అని చెప్పాను. ఆ సమావేశంలో ఉన్న ఒక యువతి ఎంత కవితాత్మకంగా ఉన్నది! అని ఆశ్చర్యపోయింది. ఒక అరగంట పాటు ఆ విషయం గురించే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చెప్పించుకుంది! ఆది కాలం నుంచి ఉన్న అనుబంధం తల్లి పిల్లలతో పంచుకోవడం, ప్రపంచానికి వారిని పరిచయం చేయటం అదే కదా! అందులో కాలం దాటిన చరిత్ర ఉంది. భావం మీరిన పదాలు ఉన్నాయి. ఇంతకన్నా స్పష్టమైన, స్వచ్ఛమైన కవిత్వ పరిచయం మరి ఏమున్నది?
ఒక గమ్మత్తయిన విషయం గమనించారా కథలు రాసే వారు ఎవరూ కథ అంటే ఇది అని కథ చెప్పరు. కొన్ని సమయాల్లో మాత్రమే, వ్యాసకర్తలు వ్యాస లక్షణాల గురించి వ్యాసం రాస్తారు. కానీ కవిత్వం వరకు వచ్చేవరకు ప్రతి కవి నిర్వచనం, అదీ కవిత్వంలో, చేస్తాడు. నిజానికి అది ప్రబంధ లక్షణాల్లో ఒకటి అని చదివాను. పెద్దన “పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా కైతలు?” అని పెద్ద ఉత్పలమాలికే ఆశువుగా చెప్పాడు. (ఏమైనా అనండి నేను మటుకు ఆయన ఆశువుగా చెప్పాడంటే నమ్మను. ఇటువంటి సెట్ పీసెస్ కనీసం కొంత అయినా ముందే తయారు చేసుకోవచ్చు). శ్రీశ్రీ “కవితా ఓ కవితా” అని కవిత్వానికి కొత్త అర్థం చూపించాడు. తిలక్ “నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అని చెప్పాడు. బైరాగి “శిరీష సుమ మార్దవపు నవ నవ లా కారిపోతూ, పద్మపత్ర మివామ్భసా జారిపోతూ” అని రాశాడు. మరి వీరందరూ కవిత్వం గురించి ఎందుకు చెప్పవలసి వచ్చింది?
నేను వృత్తిరీత్యా నేను కంప్యూటర్ భాషలు సృష్టించడంలో పీహెచ్ డీ చేశాను. ఆ రోజుల్లో తత్త్వవేత్తల విశ్లేషణలు చదివితే అనిపించేది — ముఖ్యమైన భాషా ప్రయోజనం అమూర్తభావనాలకు ఆకారం ఇవ్వడం అని. ఏనుగు ఎలాగ ఉంటుందో చూపించగలం. ఉద్విగ్నం అంటే చూపించగలమా? నిజానికి నిర్వచనం చెప్పటమే శాస్త్రానికి మొదటి మెట్టు, కొన్ని కొన్ని సార్లు చివరి మెట్టు. (ఇది బయాలజీ, ఫిజిక్స్, లెక్కలు ఇటువంటి శాస్త్రాల్లో బాగా కనిపిస్తుంది). నిర్వచనం ప్రయత్నం, పరిశోధనల దిశలను మారుస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటుంటే ముందు వారి నిర్వచనాలు బయట పెడితే వాదన మంచి దారి పడుతుందని నేను చెబుతాను.
కవిత్వం నిర్వచనం కూడా అందుకే ముఖ్యం. కానీ జలుబుకు అనేక మందులు ఉన్నట్లు కవిత్వానికి అనేక నిర్వచనాలు ఉంటాయి. నేను ఫలానా నిర్వచనం మంచిది అని చెప్పడం లేదు. ఏ నిర్వచనం స్వతస్సిద్ధంగా తప్పుకాదు. ఏ నిర్వచనమూ సార్వజనీనం సార్వకాలీనం కాదు. ఆ నిర్వచనం ఏ దారికి తీసింది, ఆ దారి దేనికి ఉపయోగ పడింది (ఉపయోగం అన్నది ప్రమాదకరమైన మాట — దీనిని మరోసారి వివరిస్తాను) — ఇటువంటి వాటి మూలంగానూ నిర్వచనాలు బేరీజు వేస్తాం.
మరొక విషయం ఏంటంటే వీటిని నిర్వచనాలు అని చెప్పుకోవడానికి లేదు. ఇవి కేవలం సూచనప్రాయంగా మాత్రమే చెబుతాయి. వస్తువు, ప్రక్రియ, ప్రభావం, చదివే విధానం, రసమూ, ధ్వనీ, ఇలాగ మనం కవిత్వానికి గీటురాళ్ళు అనేకం చెప్పవచ్చు గానీ, ఏవీ కవిత్వాన్ని నిస్సందేహంగా నిర్వచించలేవు. ఏదో వస్తువు గురించి చెప్తే అది కవిత్వం కాదు — ఉదాహరణకి చంద్రుడి మీద చెప్పిన ప్రతి రచన కవిత్వం కాదు. మరి చంద్రుడి మీద ఖగోళ పరిశోధనలు ఉన్నాయి! అలాగే ప్రక్రియ కవిత్వం చెయ్యలేదు — ఛందస్సులో రాసిన లీలావతి గణితం కవిత్వం అవుతుందా?
నేను కార్పొరేట్ రంగంలో ఒక ట్రిక్ నేర్చుకున్నాను. ఏదయినా ఒక సిస్టం మీద ఎదుటివారికి నమ్మకం కలిగించాలంటే, ముందు ఎటువంటి సిస్టం ఉండాలో చెప్పాలి. ఆ నిబంధనలు ఎంత అస్పష్టంగా ఉంటాయంటే, వాటిని ఎవరూ వ్యతిరేకించరు. ఆ తరవాత, మన సిస్టం ఆ నిబంధనలు ఎలా పాటిస్తుందో, ఆ సూత్రాలు ఎలా నిలుపుతుందో చెప్పాలి. అప్పుడు వారు అసమ్మతి చూపించడానికి ఆస్కారం ఉండదు. ఇదే ట్రిక్ అనేక మతగ్రంథాలలో ఉంటుంది. అవే నిర్వచనం చెబుతాయి — అవే దాని ప్రకారం ఋజువులు చూపుతాయి. ఏది మంచి కవిత్వమో చెప్పే కవి, ఏది మంచి సాహిత్యమో చెప్పే సాహిత్యకారుడు, ఈ చిట్కా నే పాటిస్తున్నట్లుంటుంది!
నేను ముందే చెప్పాను కదా శ్రీశ్రీ మాటలతో శ్రీశ్రీ భావాలతో కవిత్వం రాయటం మొదలు పెట్టానని. అది తప్పు, అంతకంటే సిగ్గుచేటు అని ఆ రోజుల్లోనే అర్థమైంది. జీవితానుభవం లేని నేను, కార్మికుడి ని అంతవరకు జీవితంలో చూడని నేను, కార్మిక వర్గం గురించి ఎలా వ్రాయగలను? నిజానికి, నేను పుట్టిన చోట గనులలో పనిచేసే కార్మికులు మిగిలిన అందరి కంటే ఒక మెట్టు ఎక్కువ కిందే లెక్క. నెల జీతం వచ్చే వారినందరినీ ఉద్యోగస్తులు అని పిలిచే వారిమి. ఏదో అరకొరగా కార్మిక వర్గం గురించి పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి ఏదో నాలుగు మాటలు రాశాను అనే కానీ అప్పటికి నాకు డబ్బు అంటే తెలియదు. సగటు కార్మికుడు ఎంత సంపాదిస్తాడు తెలియదు. ఆర్థిక వ్యవస్థ గురించి తెలియకుండా దాని మీద కవిత్వం రాయడం తప్పు అని నాకు అర్థమైంది. ఇప్పుడు రాసే కవులు కూడా విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని రాస్తున్నారనుకోను.
కానీ తర్వాతి రోజుల్లో, ముఖ్యంగా జీవితానుభవం పెరిగిన తర్వాత, కాపీ కొట్టడం ఎంత ముఖ్యమో తెలిసి వచ్చింది. చిత్రకారులు మొదటి రోజుల్లో ప్రముఖ చిత్రకారుల చిత్రాలను కాపీ కొట్టడం తో తమ విద్య మొదలు పెడతారు. ముందు యధాతధంగా కాపీ కొట్టడం తో మొదలై తర్వాత కొన్ని కొన్ని మార్పులు చేయటంతో సాధన పెంచుకుంటారు. నేను నేను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మొదలు పెట్టినప్పుడు ఫ్రీ సాఫ్ట్వేర్ వాళ్ల ప్రోగ్రాములు తీసుకొని కొంచెం మార్చి అవి ఎలా పనిచేస్తున్నాయో చూసి నేర్చుకున్నాను. ఎటువంటి వాళ్ల నుంచి కాపీ చేస్తాము అనేది ఆ రోజుల నాటి వాడుక, మన అభిరుచి, అందుబాటు మీద ఆధారపడి ఉంటుంది.
అనుకరణతో మొదలు పెట్టడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఏ రచన అయినా, రెంటి పాదాల మీద ఉంటుంది: సంప్రదాయం, ప్రయోగం. సంప్రదాయం వరకూ వస్తే అది రెండువిధాలుగా ఉపయోగ పడుతుంది. సంప్రదాయం వల్ల వచ్చే మొదటి ఉపయోగం అది అభివ్యక్తి కి ఇచ్చే పరికరాలు: ఒక ఒరవడి, ఒక భాష, ఒక విధంగా చదవడానికి అలవాటు పడ్డ పాఠకులు. భాష అనేదే ఒక సంప్రదాయం. ఏ కవిత్వ స్వరూపమైనా ఒక సంప్రదాయమే. పదాల అర్థాలు కూడా అంతవరకూ వాడిన విధానం నిర్ణయిస్తుంది. రెండవ ఉపయోగం ఏమిటంటే, మనం అన్నీ మొదటి నుంచి మొదలు పెట్టక్కర లేదు. అంతకు ముందున్న సంప్రదాయం తో సారూప్యంగానీ, వైరుధ్యం గానీ ఏ కవిత్వానికైనా ఒక ఆకారాన్ని ఇస్తుంది. విమర్శకుల పరిభాషలో చెప్పాలంటే, సంప్రదాయం ఒక కాంటెక్స్ట్ ఇస్తుంది.
రెండవ పాదమైన ప్రయోగం కూడా నేల విడిచి సాము చేయదు. అది సంప్రదాయానికి విరుద్ధంగానూ, దూరంగానూ ఉంటూనే, సంప్రదాయంలో ఒక భాగమవుతుంది చివరికి. చిన్నపుడు ఒక వ్యాసం రాశాను “కవిత్వం అనేది ఇంటెన్స్లీ పర్సనల్ ఫీలింగ్” అని. ఇప్పుడు దానికి వ్యతిరేకం గా అనను కానీ, దాని వెనుక సామాజిక నేపథ్యం ఎక్కువగా చూస్తున్నాను. ఇలియట్ అన్నట్లు “కవి కళాకారుడిగా పురోగమనం నిరంతర ఆత్మాహుతి”. తరతరాల జ్ఞాపకాలతో తన జ్ఞాపకం కలుపుతూ, ఒక అవిచ్చిన్నమైన పరంపర గా కవిత్వం ఆవిష్కరిస్తాడు. మనం పర్సనల్ అనుకునేది ఒక సామాజిక చారిత్రిక చట్రంలో నిమిడిపోయి ఉంటుంది.
ఎర్రాప్రగడ నన్నయ రాసిన “శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులం” అన్న పద్యానికి రంగు పూసి వెనక్కి పంపించాడు అని చదువుకున్నాం. ఆయన ఈ కవితాత్మను బాగా అర్థం చేసుకున్నాడు అని అనుకుంటాను. అంతకుముందున్న కవిత్వంతో తన కవిత్వం ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నది, ఎక్కడ విభేదిస్తున్న ది అని తెలుసుకున్నాడు. కవి పురోగమనాన్ని, అహం పక్కనపెట్టి గతం మీద నిర్మించ గలిగిన చారిత్రికావశ్యంగా చూడగలిగిన మహానుభావుడు.
ఇప్పుడు గనక నేను వెనక్కి వెళ్లి నాకు నేను సలహా ఇవ్వగలిగితే, చెబుతాను – కాపీ కొట్టమని. కానీ, కాపీ కొట్టేముందు మహానుభావుల రచనలనే కాపీ కొట్టమని. కానీ, కాపీ కొట్టేముందు అర్థం చేసుకోమని. అర్థమయ్యాక, అందులో కొంచెం మార్చమని. అంటే, ప్రక్రియ మార్చినా చాలు — వచనాన్ని పద్యమో, లేదా, పద్యాన్ని గద్యంలో, కృష్ణశాస్త్రిని శ్రీ శ్రీ లాగ నో. ఇవన్నీ సాధన ఇస్తాయి. ప్రక్రియే కాదు, భావం అర్థం అయ్యాక విబేధించడానికి సందేహించవద్దని. ఇలాగ, ప్రక్రియ, భావం అన్నీ మార్చిన తర్వాత, అదే సొంత గొంతుక అవుతుందనీ. సాధన చేయని ప్రతిభ, కేవలం నాటువెయ్యని విత్తనమనీ.
*
1 –
ఈ స్వీపింగు స్టేట్^మెంటు చాలా డామేజింగు, నీ మీద PIL వేస్తాము కాచుకో!
2 – క్రియేటివిటీ ని కంప్యూటర్^కి, లెక్కలకి కట్టబెట్టావుగా!
బాగున్నది. లీలావతి గణితం అంటే ఏమిటో నాకు తెలియదు కానీ చందస్సులో రాసినంత మాత్రాన లీలావతి గణితం కవిత్వమై పోదు అనటం మాత్రం నచ్చింది. మరక మంచిదేలా కాపీ కొట్టడం కూడా మంచిదే అంటారైతే! కాపీ కొట్టిన వాళ్లందరూ బాగుపడతారని లేదు. కవి బాగుపడతాడో లేదో కానీ కాపీ కవిత్వం జనంలోకి వెళితే రెండు సంభావ్యతలైతే వున్నాయి. ఒకటి మరో కవి కవిత్వాన్ని ఈ కాపీ కావే రాసాడని అది కాపీ కవిత్వమని తెలియనివారనుకోవటం, రెండు – అది కాపీ కవిత్వమని తెలిసిన వారి దృష్టిలో అతను కాపీ కవిగానే మిగిలిపోతాడు రేపెప్పుడైనా స్వయంగా మెరుగుపడ్డా!
రాసే వాళ్లకు, రాస్తున్న వాళ్లకు ఉపయోగ పడుతుంది. అర్ధం చేసుకుంటూ చదవడం చాలా శ్రమ.
కవిత్వం రాయాలి అని తపన పడేవారు వాళ్ళకు భలేగా వుంది మీ ప్రోత్సాహం.