కవనశర్మ “ఆమె ఇల్లు”

బాలిక కన్య, ప్రౌఢ, ముగ్ధ, వృద్ధ… ప్రతి దశలోనూ ఏదో ఒక అండ ఉండాల్సిందేననీ,
బాధ్యతలే తప్ప, హక్కుల గురించి నోరెత్తరాదనీ, 
తలదాచుకోవడమే తప్ప, తన ఇల్లని యెప్పుడూ భ్రమపడకూడదనీ
కఠినంగా చెప్పే సంకెళ్లమీద 
సహేతుకంగా పడిన సమ్మెట దెబ్బ –   ఆమె ఇల్లు – కవనశర్మ

పెద్దగా చదువుకోని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది. ఉద్యోగం సమస్య తీరిన కొద్దిరోజులకు ఆమె ఉండటానికి ఇల్లు వెతుక్కోవడానికి నిర్ణయించుకుంది. ఉద్యోగాలకి దరఖాస్తులు పెడ్తుంటే “నీకీ వయస్సులో ఉద్యోగం ఎందుకట?” అని అడిగాడు ఆమె భర్త రామారావు. “సుఖంగా ఉండాల్సిన వయస్సులో ఎందుకమ్మా ఈ అర్థంలేని పనులు!” అని నొచ్చుకుంటూ అడిగాడు కొడుకు నారాయణ. “అక్కయ్యా! ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నీకెందుకు! వచ్చి నాతో ఉండు, నీకేదైనా మనస్సు నొప్పి కలిగితే.” అని ఉత్తరం వ్రాశాడు తమ్ముడు కృష్ణ.

అప్పుడు కమల అందరికీ ఒకటే సమాధానం చెప్పింది. “నాకు తోచడం లేదు. ఎప్పుడు విసుగు వస్తే అప్పుడు మానేస్తాను” అని.

‘ఈవిడగారు అడిగింది కదా అని ఈ వయసులో ఈవిడకి ఉద్యోగం ఎవరిస్తా’రని అందరూ ధీమాగా ఉండి గట్టిగా అడ్డుపడలేదు.

మన దేశంలో ఓ సౌభాగ్యం వుంది. పనిచేయటానికి, ముఖ్యంగా కష్టపడి ఏ పనైనా చెయ్యటానికి సిద్ధపడేవారికి ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదు. సాధారణంగా చూపు అన్ని వైపులకీ ప్రసరించనివారికే ఉద్యోగాలు దొరకడం కష్టం అవుతుంది. కమల తనదైన డబ్బు సంపాదించుకోవాలన్న గట్టి పట్టుదల ఏర్పరచుకొన్నాక ఉద్యోగం పెద్ద కష్టం లేకుండానే దొరికింది.

ఉద్యోగం దొరికిన కొన్నాళ్లకి తనకంటూ, తనదైన ఒక ఇల్లు, ఎంత చిన్నదైనా సరే, ఇరుకుదైనా సరే అద్దెకు సంపాదించాలనుకుంది. ఇల్లు చూడమని తెలిసినవాళ్లని అడిగితే సహాయం చెయ్యకపోగా నోట్లో గడ్డిపెడ్తారని తెలుసు కనక తనే ప్రయత్నాలు చెయ్యడం మొదలుపెట్టింది.

కాని ఇల్లు దొరకటం ఉద్యోగం దొరకటమంత సులభంగా లేదు.

“మీరెంతమంది ఉంటారు?”

“నేనొక్కతినే!”

“మీవారు, పిల్లలూ ఈ ఊళ్లో ఉండరా?”

“మావారుంటారు.  పిల్లలు పెళ్లిళ్లయి దూరంగా ఉన్నారు.”

“మీవారు మిమ్మల్ని విడిచిపెట్టారా? లేక విడాకులిచ్చారా?”

“లేదు”

“మీవారేం చేస్తూ ఉంటారు?”

కమల చెప్పింది.

“అంత పెద్ద ఉద్యోగస్థుడి భార్య అయిన మీరు ఇంత చిన్న ఇంట్లో ఉండగలరా?”

“అనే అనుకుంటున్నాను.”

“మీవారు వస్తూ పోతూ ఉంటారా?”

” తెలియదు” అని చెప్పింది కమల ఆలోచించి.

“మీ ఇద్దరూ దెబ్బలాడుకున్నారా?”

“లేదు”

“మీకు స్వంత ఇల్లుందా?”

“లేదు”

“మీరో అద్దె ఇంట్లోనూ, మీ ఆయనో అద్దె ఇంట్లోనూ ఉంటారా?”

“కాదు. నేను అద్దె ఇంట్లోనూ, ఆయన తన స్వంత ఇంట్లోనూ ఉంటాము.”

“ఆయన స్వంత ఇల్లు మీది కాదా!?”

“కాదుట”

“ఎవరన్నారు?”

“ఆయనే పెళ్లయినప్పటినుంచి అంటున్నారు. అద్దె ఇల్లయిన, స్వంత ఇల్లయినా… అది ఆయన్దేట. ఇంతకూ ఈ ఇల్లు మీదా? మీ ఆయనదా? ఈ ఇల్లు అద్దెకివ్వగలిగిన అధికారం మీకుందా?” కమల ప్రతి ఇంటావిడనూ అడిగింది. ఇంతకాలం వాళ్లు ఆ ఇళ్లు వాళ్లవేననుకుంటున్నారు. కానీ ఆ ఇళ్లు అద్దెకివ్వగల అధికారం నిజంగా వాళ్లకి లేదు. వాళ్ల భర్తలకుంది.

ఆ ప్రశ్నలు వాళ్లనిబ్బంది పెడ్తే కమల ధోరణి వాళ్లని భయపెట్టింది. ఆమె మరీ బరితెగించిన ఆడదేమోనన్న అనుమానం పట్టుకొంది. కమల వితంతువైనా, భర్తచే పరిత్యజింపబడినదైనా కాస్త వాళ్లకి జాలి ఉండునేమో కాని ఆమె రెండూ కాదు. పండంటి కాపురం కాదనుకొని వచ్చిన స్త్రీ. చూడ్డానికి మంచిదాన్లా ఉన్నా, పెద్దదాన్లానే ఉన్నా… తమ కాపురాలకి ప్రమాదం రావచ్చునని స్త్రీలు అనుకొంటే, తమ ఇంటి ఆడవారిమీద ఆమె ప్రభావం పడ్తే పరిణామాలు ఎల్లా ఉంటాయోనని ఆ ఇళ్ల యజమానులు  భయపడ్డారు. అందుకని వాళ్లెవరూ ఆమెకి ఇల్లు ఇవ్వలేదు.

ఆఖరికి కమల వయస్సే ఉన్న ఒక అవివాహిత స్త్రీ, కమల ఆఫీసులోనే పనిచేస్తున్న ఆవిడ తన తండ్రి తనకి వదిలిపోయిన చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి కమలకి అద్దెకిచ్చింది, కంపెనీ కోసం. ఆ మర్నాడు కమల ఆఫీసుకు సెలవు పెట్టి బాంకుకి వెళ్లింది. బాంకులో ఆమె  పేర్న తండ్రి పోతూ వేసిన పదివేల రూపాయలు ఫిక్సెడ్ డిపాజిట్‌లో ఉన్నాయి. దానిమీద అయిదు వేలు అప్పు తీసుకుని ఇంటికి కావలసిన వస్తువులు ఒక మంచం, పరుపు, స్టౌ, పప్పులు, ఉప్పులు మొదలైనవి కొనిపెట్టుకుంది.

ఆపైన తన భర్త ఇంటికి వెళ్లింది. అప్పుడు తన భర్త ఇంట్లో ఉండడని ఆమెకి తెలుసు. తనతో కొని తెచ్చుకున్న పెట్లో తన బట్టలు నాలుగూ సర్దుకొంది.

“మీరు నన్ను ఏలుకోడానికిగాను మా పుట్టింటివారు మీకు పెట్టిన లంచాలు, మంచాలు, కంచాలు అన్నీ మీకే మీ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తున్నాను. ఇన్నాళ్లు మీరు నన్ను పోషించారు. నేను చాకిరీ చేశాను. రెండింటికీ చెల్లు. ఇందులో నా ఎడ్రెస్ ఇస్తున్నాను. ఆ ఇల్లు అద్దెది. కాని అది ‘నా ‘ అద్దె ఇల్లు. మీకెప్పుడైనా రావాలనిపిస్తే రండి. వచ్చినప్పుడు తినాలనిపిస్తే నా వంట తినండి. నా ఇంట పడుకోవాలనిపిస్తే పడుకోండి. ఇదే నా ఇంటికి, మీకు, నా ఆహ్వానం” అని భర్తకో చీటీ వ్రాసిపెట్టి, పెట్టి పుచ్చుకుని బయటకు వచ్చి ఇల్లు తాళం వేసి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది. ఆవిడ అడగనే అడిగింది.

“ఊరు వెళ్తున్నారా?” అని.

“లేదు. నా ఇంటికి వెళ్తున్నాను” అని కమల చెప్పింది. ఆవిడ అయోమయంగా చూసింది. ఇవాళ కాకపోయినా రేపైనా అందరికీ తెలిసేదే కదా అని కమల తను వేరే ఇల్లు చూసుకొని వెళ్లిపోతున్నట్టు చెప్పింది ఆవిడతో. ఆవిడ నోరు తెరిచి వింది.

కమల భర్త ఇంటికి వచ్చి కమల పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు. ముందర ఆ ఉత్తరం అర్థం కాలేదు. అర్థమయ్యాక కమల తెగువకి ఆశ్చర్యం, కోపం కలిగాయి. ఆ కోపంలో కమల చేసిన తెలివితక్కువ పని గురించి ఆమె తమ్ముడికి, తన సంతానానికి ఉత్తరాలు వ్రాసిపడేశాడు.

ఉత్తరం అందగానే కమల తమ్ముడు కృష్ణ పరిగెత్తుకు వచ్చాడు. బావగారు చెప్పినది విన్నాడు. చిరునామా తీసుకున్నాడు. కమల ఇంటికి వెళ్లాడు. ఆ రోజు ఆదివారం అవటం వల్ల ఆమె ఇంట్లోనే ఉంది. “రారా!” అంటూ తమ్ముడిని ఆపేక్షగా పిలిచింది. అతడ్ని ఉన్న ఒక్క కుర్చీలో కూర్చోబెట్టి తను మంచం మీద కూర్చుంది. తమ్ముడి కుటుంబం యోగక్షేమాలు అడిగింది.

అక్క అడిగిన ప్రశ్నలకి ముక్తసరిగా సమాధానాలు చెప్పి, అక్కతో, “నువ్వు చేసిన పనేం బాగాలేదక్కా! బావగారు ముక్కోపే! అందరికీ తెలిసిన విషయమేగా! కోపంగా ఏదన్నా అన్నారనుకో, ముప్ఫై యేళ్లు సర్దుకొన్నదానివి, నీకు కొత్తేం కాదుగదా! అయినా బావకి దూరంగా కొన్నాళ్ళుందాం అని నువ్వనుకుంటే వచ్చి నా దగ్గరుండరాదా? లేక నీ కొడుకు దగ్గరకు వెళ్లరాదా? నువ్వొచ్చి ఉంటానంటే వద్దనే వాళ్లెవరు? ఆఖరుకి బావగారు కూడా నువ్వు అల్లా చెప్పా పెట్టకుండా వచ్చేసినందుకు బాధ్పడ్తున్నారు కానీ నువ్వు వెనక్కి వెళ్తే ఆదరించరా! వద్దంటారా? అది నీ ఇల్లు కాదా? అంతింటికి యజమానురాలివి ఈ దోసెడు కొంపలో ఎలా ఇరికావు! ఎందుకు ఇరికావు?” అన్నాడు. ఆ మాటల్లో అక్క చేసిన మూర్ఖపు పనిపట్ల విసుగున్నా అక్కపట్ల అనురాగం ఉంది. అక్క సుఖంగా ఉండాలనే ఆకాంక్ష ఉంది.

కమల తాపీగా జవాబు చెప్పింది.

“అది నా ఇల్లు కాదా అని అడిగావు. అది నా ఇల్లు కాదు. ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆ ఇల్లు, మా ఆయన పెంచుకొంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ అపేక్షగానే చూసుకొంటారు. నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన ఆయనకులాగా మాకు ఇంటిమీద హక్కులుండవు. మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము. అంతే!”

“ఎందుకక్కా అంత నిష్ఠూరంగా మాట్లాడ్తావు! పోనీ ఏదో విషయంలో బావగారి వల్ల నీ మనస్సుకి నొప్పి కలిగింది. ఆ నొప్పి తగ్గేవరకు వచ్చి నాతో ఉండు. మనసు కుదుటబడ్డాక వెళ్లిపోదూగాని” అన్నాడు తమ్ముడు.

“నేను ఆపేక్ష తక్కువై మీ బావగారి ఇల్లు విడిచిపెడ్తే, ఆపేక్షగా చూసుకొనే పుట్టింటికి పరిగెత్తేదానిని. ఆపేక్షకి ఏమీ లోటు లేదు నాకాయన దగ్గర. కానీ అది నా ఇల్లు కాదని విడిచిపెట్టాను. అట్లాగే నీ ఇల్లూ నాది కాదు కనక రాను” అంది.

“అది నాన్నగారు కట్టిన ఇల్లు. అందులో ఉండటానికి నాకెంత హక్కుందో నీకూ అంతే ఉంది. వచ్చి ఉండు” అన్నాడు తమ్ముడు నిజాయితీగా.

“ఇది ఉండటానికి ఉండే హక్కుల గురించిన సమస్య కాదు. మీ బావగారు కూడా ఉండమంటున్నారు కాని పొమ్మనడం లేదు కదా! అసలు విషయం ఏమిటంటే, నా తండ్రి కట్టించిన ఇల్లూ నాది కాదు. మా మావగారు కట్టించిన ఇల్లూ నాది కాదు, ఆఖరికి నా భర్త కట్టించిన ఇల్లూ నాది కాదు. ఈ విషయం మీరందరూ తలో విధంగా నాకు తెలియజేశారు.” అంది ఏ ఉద్రేకం చూపించకుండా. ఆమె ఎంతో మధనపడి ఆలోచించి తీసుకున్న నిర్ణయం – తనింట్లో తను ఉండటం. “నేనందుకని మీ ఇళ్ళల్లో ఉండను,” అని పూర్తి చేసింది.

“నేనెలా తెలియజేశాను?” అని ఆశ్చర్యంగా అడిగాడు తమ్ముడు.

“ఎందుకులే అదంతా ఇప్పుడు”

“పరవాలేదు చెప్పు” అన్నాడు కృష్ణ.

“నీకు గుర్తుండి ఉంటుంది. నాకు పెళ్లయ్యే సరికి నాకు పద్ధెనిమిదేళ్లు, నీకు పదిహేనేళ్లు. నాకు పెళ్లయ్యే వరకూ ‘పాత న్యూస్ పేపర్లు’ అమ్మగా వచ్చిన డబ్బు మనిద్దరికీ అమ్మ చెరిసగం ఇచ్చేది. ప్రతి తల్లికీ తమ ఇంట్లో కూతురికి, కొడుక్కీ సమమైన స్థానం కల్పించాలని ఉంటుంది కదా. అందుకే నా పెళ్లయిన వేసంకాలం నేను పుట్టింటికి వచ్చినప్పుడు అమ్మిన పాత న్యూస్‌పేపర్ల డబ్బు అమ్మ చెరి సమానంగా ఇవ్వబోయింది. అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా?” కమల కృష్ణ ముఖంలోకి చూస్తూ ఆగింది.

కృష్ణకి గుర్తు వచ్చింది. కమల పెళ్లయిన ఆరునెలలకి పుట్టింటికి వచ్చింది. అప్పుడు వాళ్లింట్లో ఉన్న పాత న్యూస్‌పేపర్లు అమ్మటం జరిగింది.  కృష్ణ తండ్రి పిల్లలకి పాకెట్‌మనీ ఇచ్చేవాడు కాదు. అందుకని పాత న్యూస్‌పేపర్లు, సీసాలు అమ్మితే వచ్చిన డబ్బుని తల్లి పిల్లకి స్వంత ఖర్చులకిగాను పంచి ఇచ్చేది. ఆ రోజుకోసం కృష్ణ ఆత్రుతగా ఎదురుచూసేవాడు. ఆ రోజుల్లో పేపర్లు అమ్మితే అయిదో పదో వచ్చేది. కానీ అదే ఎక్కువ డబ్బు. వయస్సు కూడా చిన్నది అవటం చేత అవసరాలు తక్కువ. కమల పెళ్లయి వెళ్లిపోయిన మూడునెలల తర్వాత ఒకసారి పేపర్లు అమ్మి వచ్చిన డబ్బుని తల్లి పూర్తిగా కొడుక్కి ఇచ్చింది. ఆ విధంగా, కృష్ణ ఆ డబ్బుని పెళ్లయి వెళ్లిపోయిన కమలతో పంచుకోలేదు, ఆసారి. అది కమల హక్కుని కోల్పోవటం చేత అని అనుకొన్నాడు. ఊళ్లో లేకపోవడం చేత అని అనుకోలేదు.

రెండోసారి అమ్మినప్పుడు కమల ఉంది కానీ తల్లి రెండో విధంగా ఆలోచించి కమలకి వాటా ఇవ్వబోయింది. అప్పుడు కృష్ణ అన్నాడు కదా, “అక్కకి కావలసిన డబ్బు ఇవ్వటానికి బావ ఉన్నాడు కదా! పైగా అక్క పెట్లో బోలెడు డబ్బుంది చూశాను”.

“నా దగ్గరున్న డబ్బు ప్రసక్తి ఎందుకు? ఇందులో నాకు వాటా ఇన్నాళ్ళూ ఉంది కదా! ఇప్పుడెందుకు లేకుండా పోయింది?” అని కమల ఆశ్చర్యంగా అడిగింది.

కృష్ణ టపీమని జవబు చెప్పాడు.

“ఆడపిల్లకి పెళ్లవగానే అత్తవారింట్లో హక్కులేర్పడతాయి. పుట్టింట్లో పోతాయి. ఏదో ఒక ఇంటి సంపదలోనే వాటా వస్తుంది. అవ్వా బువ్వా ఎల్లా వస్తాయి! పెళ్లయిన మీ ఆడబడుచులకి మీ ఆయన్తో సమానంగా వాటా మీ మావగారిస్తారా? ఇస్తే నువ్వు ఊరుకుంటావా!”

“రెండ్రూపాయలకెన్ని మాటలన్నావురా! రేపు నీ ఇంటికి నన్ను రావద్దంటావురా!” అంది కమల బాధగా.

“అదేమిటక్కా! తర్కిస్తే జవాబు చెప్పానుగానీ నీకీ ఇంట్లో ఎప్పుడూ స్థానముంటుంది.  పుట్టింట్లో ఆడపిల్లలకి హక్కులూ ఉండవు. అప్పులూ ఉండవు. ముద్దూ ముచ్చట్లకి ఎప్పుడూ లోటు ఉండదు.” అన్నాడు నొచ్చుకుంటూ కృష్ణ. కమల మాట్లాడక ఊరుకుంది అప్పుడు.

కమలకి పుట్టింట్లో నిజానికి ఎప్పుడూ ఏ లోటూ జరగలేదు. కమలనీనాడు బాధిస్తున్నది తనకి హక్కుగా ఏదో రాకపోవటం. అన్నీ బహుమానాలుగానే రావటం. బహుమానాలు అవతలి వాళ్లు ఆపేక్షతో పెట్టే భిక్షలు. కమల కృష్ణతో నెమ్మదిగా అంది, కృష్ణకా సంఘటన గుర్తుకు వచ్చినట్టు పోల్చుకొని.

“ఆరోజు నా పెట్టెలో డబ్బు చూశావు. నిజం. అదెంతుందో తెల్సా! తిరిగి వెళ్లటానికి రైలు ఖర్చులకి, రిక్షా ఖర్చులకి సరిగ్గా సరిపోయే అంత. మీ బావగారు అంతా లెక్కగట్టి అణా పైసలతో ఇచ్చారు నా చేతికి, నేను ఇబ్బంది పడకూడదని.”

“నువ్వు వెనక్కి వెళ్లటానికి ఎప్పుడూ నాన్నగారు డబ్బిచ్చేవారు కదా! నేనే వచ్చి రైలిక్కించే వాడిని కదా! బావగారిచ్చిన డబ్బు నువ్వు స్వంత ఖర్చులకి వాడుకోవచ్చు కదా!”

“ఆయన రైలుకిచ్చిన డబ్బుని స్వంత ఖర్చులకి నేనెప్పుడూ వాడుకోలేదు. అది వెనక్కిచ్చేసేదాన్ని. ఒక్కొక్కసారి ఆయన ‘నీ దగ్గరే ఉంచి ఇంటి ఖర్చులు పెట్టు’ అనేవారు. ఎప్పుడైనా నన్నే ఉంచుకోమనే వారు ప్రేమ పొంగుకు వస్తే.”

“బావగారు మంచివారని నువ్వూ ఒప్పుకొంటున్నావు కదా!”

“అది మంచికి నువ్విచ్చే నిర్వచనం మీదుంటుంది. నేను కోరుకొనే స్వేఛ్చని బట్టీ ఉంటుంది. ఆయన ఇచ్చింది నేను తీసుకొంటున్నంత కాలం ఏ సమస్యా ఉండదు. నేను నాకింత కావాలని అడిగి అది ఆయన ఇవ్వకపోతే సమస్యలు మొదలవుతాయి.”

“అన్నీ ఆయన అమరుస్తుంటే నీకు ఇంకా డబ్బెందుకు!” ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణ.

“నువ్విక్కడ రెండ్రోజులుండు. నీ జేబులోని డబ్బు నాకివ్వు! నీ అవసరాలు గమనించి నేనే నీకు అన్నీ అమరుస్తాను. ఆ స్వర్గం అనుభవిస్తేగానీ అర్థం కాదు.”

“నువ్వు లేని సమయంలో నాకు కాఫీ తాగాలనిపిస్తే?”

“ఆయన లేని సమయంలో నాకనిపిస్తే?”

“ఇంట్లోనే ఉంటావు కదా కలుపుకొంటావు!”

“ఇప్పుడు నువ్వూ ఇంట్లోనే కదా ఉండబోతున్నది. కలుపుకుంటావు. ఎంత జాగ్రత్తగా కలుపుకుంటావంటే పాలవాడు పోసిన పాలు అన్ని అవసరాలకి సరిపడేలాగా జాగ్రత్తగా కలుపుకొంటావు. నేను ఆఫీసునుంచి వచ్చి ఓ కప్పు కాఫీ కోరవచ్చన్న స్పృహతో కలుపుకొంటావు. పాలు వలకకుండా కలుపుకొంటావు! కొలిచి కలుపుకొంటావు!”

కమల మాటలకి కృష్ణ అప్రతిభుడయ్యాడు.

“అదంతా ఎందుకుగానీ పద. మనింటికి పోదాం!” అన్నాడు.

“అది మన ఇల్లు కాదురా! అది నీ ఇల్లు. అక్కడ నేను అతిథిని. మీ బావగారింట్లో దాసిని. అది మన ఇల్లు అని నువ్వు అన్నా మీ ఆవిడ ఒప్పుకోదు. నాన్నగారే ఒప్పుకోలేదు. నాన్నగారి విల్లులో నాకు కూడా భాగం ఎందుకు రాయలేదని అడిగిన రోజున” అంది కమల. అందులో కోపం లేదు. సత్యాన్ని వ్యక్తం చేస్తున్న దృఢత్వమే కాని.

కమల తండ్రికి స్వయంకృషితో పైకి వచ్చాడు. కూతురికి పద్ధెనిమిది సంవత్సరాలు రాగానే పెళ్లి చేశాడు. కొడుక్కి పెద్ద చదువు చెప్పించాడు. మిగిలిన కొద్ది డబ్బులో ఇల్లు కట్టి పింఛన్‌తో బతుకు వెళ్లదీశాడు. కొద్ది సంవత్సరాలకి పోతాడనగా ఆయన విల్లు వ్రాశాడు. అది తన స్వంత దస్తురితో పూర్తి ఆరోగ్యంగా ఎవరి ప్రోద్బలమూ లేకుండా వ్రాశాడు. అది తను ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూతురికి, కొడుక్కి, భార్యకి చదివి వినిపించాడు.

కమలకి అప్పటికి పెళ్ళై పాతిక సంవత్సరాలైంది. ప్రపంచం కొద్దిగా బోధపడింది. అందువల్ల కమల ధైర్యంగా తండ్రిని,

“నాన్నగారూ, మీ స్వార్జితంలో మీ కూతురునైన నాకు వాటా లేదా!” అని అడిగింది.

కమల ప్రశ్నకి తండ్రి ఆశ్చర్యపోయాడు. ఆయన కమల ఈ ప్రశ్న అడుగుతుందని ఊహించలేదు. కాని జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందని గ్రహించాడు. గ్రహించి, “చూడు తల్లీ! తమ్ముడికి నీకంటే ఎక్కువ చదువు చెప్పించాను నిజమే! కాని నీ పెళ్లికి, పురుళ్లకి, పుణ్యాలకి ఖర్చు పెట్టిందేమీ తక్కువ కాదు. అందుచేత వాడి చదువుకైన ఖర్చుకి నీమీద అయిన ఖచులకి ఒక విధంగా చెల్లు” అని జవాబు చెప్తుండగా కమల “నా పెళ్లిలో నామీద పెట్టిన ఖర్చు నాకర్థమౌతుంది. నా భర్తకిచ్చిన బహుమానాలుకూడా నా మీద పెట్టిన ఖర్చుగానే లెక్కపెట్టడం అన్యాయం” అంది.

“మీ కుటుంబానికే ఇచ్చాం కదమ్మా! కోడలికి పెట్టిన నగలు తమ్ముడికిచ్చినట్టు కాదా?” అని అడిగాడు తండ్రి.

“తమ్ముడి విషయంలో అది రైటే అనుకొంటాను. మరదలి వస్తువుల మీద తమ్ముడికి ఆచరణలో అధికారం ఉంది. కానీ నా భర్తకి మీరిచ్చిన వస్తువులపై ఆచరణలో నాకు అధికారం లేదు. ఆస్తులు, డబ్బు ఎప్పుడూ పురుషులనుండీ పురుషులకి వెళ్తాయి. అంటే మీ నుంచి మీ కొడుక్కీ, మీ అల్లుడికీ వెళ్లగా పేరుకి నాకు వెళ్లినట్టుగా లెక్క వేస్తున్నారు” అని జవాబు చెప్పింది కమల. ఆమెకెక్కడో తనూ తన భర్త ఒకటే అని అందరూ భావించటం, భర్తేమో తనూ ఆయనా వేరన్నట్టు పాతిక సంవత్సరాలుగా ప్రవర్తిస్తూ రావటం అన్యాయంగా అనిపిస్తోందీ మధ్య. ఆమె మాటలకి సమాధానం అక్కడే నిలబడి ఉన్న మరదలునుంచి వచ్చింది.

“మీ మావగారి ఆస్తిలో మీ వారు మీ ఆడబడుచులకి వాటా ఇచ్చారా? లేదే! నా అన్నదమ్ములు నాకిచ్చారా? మా తండ్రి ఆస్తిలో నాకు వాటా లేదే! స్త్రీకి భర్త ద్వారా మావగారి ఆస్తిలో వాటా రావడమే పద్ధతి.” మరదలికి కమల జవాబు చెప్పలేదు. ఆమె తన మావగారు పోయినప్పుడు తన ఆడబడుచులకి కూడా తన భర్తతో సమానంగా వాటా రావాలనికానీ రాకూడదని కానీ అనుకోలేదు. ఎంతసేపూ అది వాళ్ల కుటుంబవిషయం అనుకుంది. తన భర్త, తన ఆడబడుచులూ మరుదులూ తననెప్పుడూ పరాయిదానికిందే చూశారు. అందుకని కమలని వాళ్లు అభిప్రాయం అడగనూ లేదు, ఆమె చెప్పనూ లేదు.

“వదినగారూ! మీరు కోరినదీ ధర్మమే! మీ వాటా ఇక్కడ మీరు తీసుకుని, అక్కడ మీ ఆడబడుచులకి, వాళ్ల వాటా వాళ్లకిప్పించండి” అంది మళ్లీ మరదలే.

కమల మరదలు తెలివికి విస్తుపోయింది. తనిక్కడ తీసుకోగలిగినదానికంటే అక్కడ పోగొట్టుకునేదే ఎక్కువ. ఆ విషయం తెలిసి మరదలు ఆ మాట అంది. ఆ రోజున మరదలికి కమల సమాధానం చెప్పలేకపోయింది.

“పైగా నేనూ మీ అమ్మా మా శేషజీవితాలు తమ్ముడి దగ్గరే గడుపుతాం కదా! వాడికి వాడి భార్యకి మాకు సేవ చేయక తప్పదు కదా! ఈ రోజుల్లో డబ్బుకంటే ప్రియమైంది సర్వీస్. మేము వాడికి కాష్‌లో ఇస్తాం. వాడు నాకు కైండ్‌లో రిపే చేస్తాడు” అన్నాడు తండ్రి.

ఆపైన ఆమె అడిగిందనో లేక ముందరే అనుకొన్నాడోగాని ఆమె తండ్రి ఆమె వెళ్లేలోపల ఓ పదివేల రూపాయలు ఆమె పేరు మీద ఫిక్సెడ్ డిపాజిట్ మీద వేశాడు. ఆ తర్వాత ఆయన ఏడాదికి పోయాడు.

(చివరి భాగం వచ్చే సంచికలో)

 

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు