ఒక నవల చదువుతున్నప్పుడు అందులో మనకు పరిచయమయ్యే పాత్రలు నిజ జీవితంలో మనుషులకు నకలుగా తోచినప్పుడు పాఠకులు ఒక దిగ్రమకు గురవుతారు. ఆ మనిషి జీవితంలోని సంఘటనను యధాతథంగా చెప్పకుండా కొంత మరుగుపరిచి, మరికొంత కల్పన జోడించి నవలను రచించినప్పుడు పాఠకుడు ఒకింత అయోమయానికి లోనవుతాడు. వాస్తవ జీవితపు పరిధిని మించి రచయిత మరింత నిగూఢపు లోతుల్లోకి వెళ్లి చరిత్రను విశ్లేషించే క్రమంలో తాను తెలుసుకున్న వాస్తవాలను ధైర్యంగా చెప్పగలిగినప్పుడు పాఠకుడు జ్ఞానవంతుడవుతాడు. ఇటీవల కాలంలో ఒక నవల చదువుతూ దిగ్భమపడుతూనే, అయోమయానికి గురై, జ్ఞానవంతం కాగలిగే అరుదైన భావోద్వేగాలను అందించిన నవలగా అట్టాడ అప్పలనాయుడి బృహత్ నవల “బహుళ”ను ప్రముఖంగా చెప్పుకోవాలి.
మరణం అంచున కొట్టుమిట్టాడుతున్న తన భార్యను తదేకంగా చూస్తూ, పొరలుపొరలుగా విప్పారిన తన జీవితాన్ని రాధేయ నెమరు వేసుకోవడమే ఈ ఐదువందల పేజీల నవల. ఏకవాక్యంలో నవల సారాంశం ఇలా చెప్పవచ్చునే గాని అప్పలనాయుడి ప్రాపంచిక దృక్పథం వల్ల, మారుతున్న జీవన సంబంధాలను రచయిత గత కొన్ని దశాబ్దాలుగా కథా సాహిత్యరూపం ఇస్తుండడం వల్ల, మట్టికీ మనిషికీ మధ్యనున్న అనుబంధంలో వస్తున్న రూపసారాల్లో తేడాలను ఒడిసి పట్టుకుని తరానికి తరానికి మధ్య జరుగుతున్న సంఘర్షణను ఈ నవలలో ప్రతిభావంతంగా చిత్రించినందువల్లా ఈ నవల గురించి వర్తమాన సాహిత్యంలో పెద్ద ఎత్తున చర్చ జరగవలిసే ఉంది. దాదాపుగా ప్రతి దేశంలోనూ ఇప్పుడు రాజ్యమేలుతున్న ప్రత్యేక పరిస్థితులలో డిజిటల్ మీడియా సంతరించుకున్న ప్రాధాన్యత దృష్ట్యా చదువుకున్న వారు సైతం, రాస్తున్నవారు సైతం ఘోషిస్తున్నది – టెక్స్ట్ ఈజ్ డైయింగ్. అంటే అచ్చురూపంలో ఉన్న అక్షరం మృత్యుశయ్య మీద ఉందన్న మాట. ప్రధాన భాషలను చెదలా తినేస్తున్న ఈ దుర్దశ ప్రాంతీయ భాషలకు సోకేసరికి మరో పదేళ్లు పడుతుందని అనుకున్నాం గానీ, కరోనా వల్ల అదిప్పుడే వచ్చి పడినట్టుంది. ఇలాంటి సంధిదశలో ఒక మంచి పుస్తకం వచ్చినపుడు, ఒక మంచి కవిత వెలువడినప్పుడు, ఒక మంచి విమర్శ చోటుచేసుకున్నప్పుడు పెద్ద ఎత్తున అరిచి చెప్పాలి. ‘బహుళ నవలకూ ఇప్పుడు ఆ తోడ్పాటు అవసరం.
కళింగాంధ్రలో ఒక నమూనా గ్రామం గంగువాడ. అది ఈ దేశంలో ఏ గ్రామమైనా కావచ్చును. ఈ భూమ్మీద ఏ పల్లెటూరైనా కావచ్చును. అది లాటిన్ అమెరికాలో మాకండో1 అనే గ్రామం కూడా కావచ్చును. ఈ నవలలో మాత్రం గంగువాడ పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే దారిలో ఉండే కురుపాం జమీకి చెందిన ఒక గ్రామం. కథకుడు రాధేయ తండ్రి నారాయుడి అమ్మమ్మగారి ఊరు. నారాయుడి తాతగారైన పెదనారాయుడి గ్రామమది. ఆయన మరణానంతరం ప్రతి ఏటా ఆ వూరిలో తిరునాళ్లు జరుగుతుంది. ఆ తిరునాళ్లే ఈ కథలో మూల మలుపుల్లో పలు పాత్రలు నిలబడే రణస్థలి. మన ఆలోచనలకు పదునెక్కించే కదనకాహళి. తిరునాళ్లు జరుపుకునేలా బతికిన వీరుడు పెదనారాయుడు చేసేందేమిటయ్యా అంటే, తన తోడి జనాలకు భూమి మీద హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండని చెప్పడం. దానికోసం నిలబడడం. దానికోసం ఎంతకైనా తెగించి రైతుకు ఆ భూమి దక్కేట్టు పోరాడడం. దానికోసమే ఆయన ప్రాణం అర్పించడం కూడా. అలా వీరమరణం పొందినందుకే ఆ ఊరిలో తిరునాళ్లు. అప్పటికింకా దేశానికి స్వతంత్రం రాలేదు కాబట్టి కళింగాంధ్రకూ స్వతంత్రం లేదు. ఇప్పటికింకా అలాంటి గంగువాడలకూ స్వతంత్రం రాలేదనుకోండి. అప్పటికి తెల్లదొరలు పాలిస్తుంటే, ఇప్పటికింకా నల్లదొరలు పాలిస్తున్నారు. రైతు బతుకు అందులోనూ చిన్న, సన్నకారు రైతు బతుకు ఎన్నటికీ పరాధీన భారతమే. పెదనారాయుడి వీరగాధను రచయిత పలుపాత్రలచేత చెప్పిస్తారు. అక్కడితో ఆగక, పెదరాయుడి వీరత్వాన్ని ప్రజలు అనేక కళారూపాలలో స్మరించుకుంటారని చెప్తూ, అతని మరణాన్ని జముకుల పాటలో వర్ణిస్తారు.
భూమిని దళారుల పాలు కానివ్వకూడదనే పెదరాయుడి జీవిత పర్యంతపు ఆరాటం, ఆ భూమి పంట పండించుకునే రైతుకు సొంతం కావాలని ఆయన చేసిన పోరాటం, భూమికోసం ప్రాణాలను పణంగా పెట్టవచ్చన్న ఆయన నమ్మకం.. పూనలదండలో దారం ఇమిడిపోయినట్టుగా మొత్తం కథంతా మనలో విద్యుత్ నింపుతూ ప్రవహించడం మనం గమనిస్తాం. బహుళ నవల నిజానికి భూమి కథ. పెదనారాయుడి మనుమడు నారాయుడు శిధిలమైపోతూ కూడా భూమిని నమ్ముకుని బతుకు ఈడ్చడం, రాధేయ న్వయంగా భూమికోసం జరిగే పోరులో పాలు పంచుకోవడం, రాధేయ నేస్తం జానేషు కొడుకు, ప్రస్తుత తరం ప్రతినిధి నత్యకాం వరకు భూమి గురించి పడిన ఆరాటమే ఈ నవల. జమీందార్ల శిస్తులపై పోరాటం చేస్తూ, షావుకార్ల దోపీడిపై పోరాటం చేస్తూ, అగ్రహారం బ్రాహ్మల ఆధిపత్యంపై పోరాటం చేస్తూ, భూస్వాముల పాలిటపడి రైతు రైతుకూలీగా మారిన దుస్థితిపై పోరాటం చేస్తూ, కార్పొరేట్ల గుప్పిట్లో చిక్కిన భూమినుంచి తాము పూర్తిగా దూరమైనప్పుడు పట్టణానికి కార్మికులుగా వలన పోయే పరిస్థితులపై పోరాటం చేస్తూ.. నిరంతర రైతు పోరాటపటిమ చిత్రణ ఈ బహుళ నవల.
ఈ నవల కాన్వాను విశాలమైనది కావడానికి కారణం, భూమి నమన్యతో పాటు, చరిత్రలో కళింగాంధ్రకు అత్యంత ప్రాముఖ్యత తెచ్చిపెట్టిన విప్లవ పోరాటాన్ని చాలా విస్తరంగా ప్రస్తావించడాన్ని చెప్పుకోవాలి. కళ్లు మిరుమిట్లు గొలిపే నక్సల్బరీ విప్లవ పోరాటపు వెలుగు రవ్వ చిమ్మి కళింగాంధ్రపై పడిన నంగతి మనకు తెలిసిందే. అంతకు మునుపు జమీందారులకు జరిగిన వ్యతిరేక పోరాటాలు భూమిపై తమకున్న హక్కును చాటితే, దోపీడి-పీడనలకు వ్యతిరేకంగా అటవీ ప్రాంత గిరిజనం, నమతల ప్రాంతపు రైతాంగం నమష్టిగా పిడికిలి బిగించి చేసిన పోరాటం చరిత్రలో నెత్తుటి అక్షరాలతో నమోదైంది. ఉద్యమంలో మమేకమై తనకెంతో మార్గదర్శనం చేసిన బలరాం కుమార్తెను రాధేయ వివాహమాడటం కథకుడి వ్యక్తిగత జీవితంలో ఒక మలుపు. రాధేయ తన గ్రామం నుంచి పొట్ట చేతపట్టుకుని ఉద్యోగం వెతుక్కుంటూ, కళింగాంధ్ర నాలుగు కొనలూ గిరగిరా తిరుగుతున్నప్పుడు ఉదయించిన ప్రశ్నలు విప్లవోద్యమ పథ నిర్దేశం చేయగలిగి వుండేవి. కాని, అప్పటికింకా దేశంలో విప్లవ భావజాలానికి ప్రత్యామ్నాయం పొడనూపలేదు. నవల చివరికొచ్చేనరికి రాధేయ దీనికి అంటే ఉద్యమంలో వొలుకుతున్న నెత్తురుకు ప్రత్యామ్నాయంగా ఒక ఆశావహ, ఆదర్శప్రాయ పరిష్కారం చూపించారు. నేల పదునెక్కినెపుడు దున్ని విత్తనాలు చల్లితేనే మొలకలు వస్తాయి. రాధేయ చూపించిన పరిష్కారం ప్రస్తుతానికి ఒక ఆదర్శమే. ఎందుకంటే దానిని అందుకునే పరిపక్వత వర్తమాన ఉద్యమాలు చవిచూస్తున్న మన నమాజానికి రాలేదు. ఈ దేశంలో పీడితులు నమష్టిగా లేరు. విపుల భావజాల పీలికలుగా చీలిపోయివున్నారు. వీరందరూ కలిసికట్టుగా సాగించే ఒక బహుజన ఉద్యమం మన నమన్యలకు పరిష్కారం సూచించగలదు. ఈ ఆశావహ దృక్పథంతో నవల ముగుస్తుంది.
ఇదే ఇరుసులో రచయిత నేర్పుగా జొప్పించిన మరొక అంశం రాజకీయాలు. భూమిచుట్టూ తిరిగిన రాజకీయాలు కులం ఆధారంగానే వాటి ఫలితాలను ఈ దేశంలో ఇవ్వగలగడం మరో విషాదం. భూమి మీద పెత్తనం జమీందారుల నుంచి స్వతంత్ర భారతంలో భూస్వాములకు దఖలు పడడం కేవలం కులం ఆధారంగానే జరిగింది. భూమి పెద్దఎత్తున దక్కించుకున్న వారు రాజకీయాలలోకీ, వ్యాపారాలలోకి వెళ్లగలిగారు. తద్వారా అధికారానికి చేరువయ్యారు. పెద్దఎత్తున సంఘర్షణ జరిగిన తర్వాతే అగ్ర కులాలకు అధిపత్యం దక్కింది. ఈ పెనుగులాటలో పెదనారాయుడులాంటి వీరులు దారుణంగా హత్యలకు గురైతే, నారాయుడిలాంటి భూమి ప్రేమికులు బతుకులను బండరాయిల్లాగా మార్చుకున్నారు. కనకం నాయుడులాంటి వారు బ్రాహ్మణుల, రాజుల, ఇతర దోపిడీ కులాల హస్తగతంగా ఉన్న రాజకీయాధికార పరమపద సోపానపటంలో పాముల నోటికి చిక్కి అధ:పాతాళానికి చేరిపొయ్యారు. అవి రెండు భిన్న ధృవాలు. ఒకవైపు ప్రాణాలొడ్డి పోరాడేవారు. మరోవైపు పోరాటాన్ని ఉక్కుపాదంతో అణిచేసేవారు. ఒకవైపు బతుకుకోసం భూమి చాలు అనుకునే వారు. మరోవైపు బతుకు దర్జాకోసం భూమి పోగేసుకునేవారు. రెండోవైపు వారికి రాజ్యం అన్ని విధాలుగా సహకరించి పార్లమెంటరీ రాజకీయాలలో నిరంతరం నిచ్చెనలు వేయించి మెట్లు ఎక్కేందుకు సహకరించింది. మొదటివైపు వారికి మరో ప్రత్యామ్నాయం లేక విప్లవ రాజకీయాలవైపు మొగ్గు చూపవలని వచ్చింది. ఈ రాజకీయ పోరాటాన్ని చాలా గడునుగా అట్టాడ తన నవలలో చిత్రించడం ఒక గొప్ప శిల్పపరమైన ఎత్తుగడ.
దాదాపు వందేళ్ల కళింగాంధ్ర ప్రాంత చరిత్రను చెప్పడానికి రచయిత ఒక కుటుంబ నేపథ్యాన్ని ప్రాతినిధ్యం చేశారు. ఆ కుటుంబంలో ఆరు తరాల చరిత్రను ప్రస్తుత తరపు వ్యక్తి మననం చేసుకుంటున్న ఒక ఎత్తుగడ ద్వారా ఈ నవల రచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల చరిత్ర ఈ నవల. కాని, ఇదొక విచిత్రమైన ప్రదేశం. విశాలమైన నముద్రతీరం, పచ్చటి తివాచీ పరిచినట్టున్న అటవీ ప్రాంతం, మధ్యలో సోయగాలు పోతూ విలసిల్లే మైదాన ప్రాంతం. దీనికి ఒక దేశపు పొగరు. మరి ఈ నేలమీద గడచిన వందేళ్లలో ఏం జరిగిందో తెలునుకోవాలంటే, ఇక్కడి కింటాకుంటే2 లు, ఇక్కడి బుయెందియా3లు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ నవల ఆద్యంతం చదవాల్సిందే. ఎందుకంటే దేశమంటే మనుషులే కదా!
నడుముకి నాగుల గావంచా, భుజాన నాగలి, పతాకలా యెగిరే తలపాగా, నల్లగా బలిష్టంగా జెబరగా తాతముత్తాతలు, ఎడమపయ్యాడ గోరంచు కోకతో, కాళ్ల కడియాలతో, చేతులకు మట్టిగాజులతో, కొనకమ్ములూ, ముక్కుపుడకల మొహాలతో, వారమెట్టలతో, పొట్టిపొడుగూ అమ్మమ్మ, అమ్మమ్మల అమ్మలూ.. అందరూ మన మనుషులే. రక్తమాంసాలున్న జీవం ఉట్టిపడేలా ప్రాణం పోసుకున్న పాత్రలు. వారి సంఘర్షణలు, పెనుగులాటలు, ప్రేమలు, ప్రణయాలు, విజయాలు, పరాజయాలు మన ఇంటింటి కథలు. మన జీవితపు అనుభవాలు. ఈ సాహనపు జీవితాన్ని చదవాలంటే, మనకూ ధైర్యముండాలి. అది జీవితాన్ని ఎదుర్కోవాలన్న ధైర్యం. ఒక సన్నని విషాదపు వీచిక పాడుతున్న గొంతుతో రచయిత చిత్రించిన కొన్ని పదుల పాత్రలు అలా మన ముందు మెరిసి మాయమైపోతుంటాయి. కాని, అవి మనల్ని విడవకుండా వెంటాడుతాయి. దాదాపుగా రెండేళ్లపాటు అసిధారావ్రతంగా శ్రమించి అట్టాడ అప్పలనాయుడు సృజించిన ఈ బృహత్ నవల కల్పనకు వాస్తవానికి మధ్యనున్న పల్చని తెరను చీల్చేస్తూ మనల్ని మరో ప్రపంచంలోకి పట్టుకెళ్లే నవల. ఆ అద్భుతమైన అనుభవం కోసం అన్ని ప్రాంతాలవారూ తప్పక చదవాల్సిన గొప్ప నవల బహుళ. ఇండియాలో ఈ పుస్తకం పొందాలనుకునేవారు అమెజాన్ లో గాని, 9440031961 నెంబరుకు ఫోన్ చేసి కానీ పొందవచ్చు.
నోట్:
1. గాబ్రియా గార్షియల్ మార్కెజ్ నవల “వందేళ్ల ఒంటరితనం”లో గ్రామం.
2. ఎలెక్స్ హేలి నవల “రూట్స్”లోని ప్రధాన పాత్ర.
3. మార్క్వెజ్ నవలలో ప్రధాన కుటుంబ పెద్ద పాత్ర.
*
ధన్యవాదాలు రవికుమార్
నవల ను అద్భుతంగా ఆవిష్కరించారు.
Thank you sir..
ఇప్పటి వరకూ బహుళ మీద వచ్చినవాటిలో ఉత్తమ సమీక్షా వ్యాసం యిది. చాలా సమగ్రంగా వుంది. నవలకు ప్రాణభూతమైన భూ పోరాటాలు, కుల – వర్గ రాజకీయాలు, సామాజిక చరిత్ర అన్నిటినీ పట్టుకున్నందుకు , పరిష్కారంగా ప్రతిపాదించిన వుద్యమ పరిమితిని (ఆదర్శప్రాయం) నిష్పక్షపాతంగా యెత్తిచూపినందుకు అభినందనలు రవీ !
Thank you sir. It is a certificate for me.
జయహో రవికుమార్.
నవలకు న్యాయంచేశారు.
Thank you sir.
బహుళకు గొప్ప యోగ్యతా పత్రం అందించారు సర్..మీలాంటి విమర్శక రత్నాన్ని కలిగిన మన కళింగాంధ్ర ధన్యమైంది
Thank you, sir.
సమీక్ష నవల ని ఇప్పుడే చదివేయా లన్నంత ఆసక్తిగా వుంది.
ఇరువురి కీ అభినందనలు.
Thank you, sir..
సార్…మీ సమీక్ష ఆద్యంతమూ ఆసక్తికరంగా, విపులంగా సాగింది. బహుళ నవలపై మీ అభిప్రాయాలు నాలో క్రొంగొత్త బీజాలు నాటేలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. బహుళ చదివేటప్పుడు నేను గొప్ప అనుభూతిని పొందాను. అది మీ సమీక్షలో అడుగడుగునా గోచరించింది. మీకు అభినందనలు.🙏🙏🙏… ఇట్లు… పిల్లా తిరుపతిరావు…7095184846
Thank you sir..