అక్షరాలు కన్నీరు పెడుతున్నాయి
వార్తలు అలుక్కుపోయి కనిపిస్తున్నాయి
మదిలో సముద్ర హోరు కలవరం
మాటలొచ్చినా మర్మం తెలియని పిల్లి కూనలు
పాలుగారే పసితనాలు
బేబీ కేర్ సెంటర్లో అడుగులు, ఆటలు నేర్వలే
నర్సరీ రైమ్స్ తో గొంతు కలపలే
శిశు తరగతిలో అక్షరాలు పూర్తిగా దిద్దలే
అమ్మ, ఆవు దగ్గరే ఉన్నది జ్ఞానం
ఆకలి అంటే కడుపు మాడటమొక్కటే అనుకున్నవి
రకరకాల ఆకలి పులులుంటాయని తెలియనివి
విచక్షణ విత్తుకోని కామం కళ్లకు
చిగురుటాకులను చిదిమేస్తే నెత్తురు ముద్దలైనాయి
ముత్తు పాము కరిస్తే ఊపిరులు కోల్పోయాయి
అకస్మాత్తుగా ఇంటిని జెసిబిలతో కూల్చేసిన దుఃఖం
నరాలను మెలిపెట్టినట్లు తల్లడిల్లడం ఇంటిల్లిపాదిది
పరామర్శలు ప్రాణం తిరిగివ్వకున్నా
కన్నీళ్లు తుడిచే దస్తీలు, నీళ్లు
ధైన్యం వదిలేందుకు నూరిపోసే ధైర్యాలు
ఒక సంఘటన మరపు గంగలో కలవకముందే
మరొకటి గుండె గుట్టపై పేలిన తూటాల్లా
నిఘా కళ్లు నిషాలో ఉంటున్నాయి
ఓదార్పులైనా అందివ్వని పాలనలు
*
నిఘా కళ్ళు నిషాలో ఉన్నాయి
రకరకాల ఆకలి పులులు
విచక్షణ విత్తుకోని కామం