కలల ఫోటో ఫ్రేమ్

కావ్య ఇంటి నుండి వచ్చేసి నాలుగు గంటల పైనే అవుతూ ఉంది. స్నేహితురాలు రీనా ఇచ్చిన కాఫీ తాగుతూ, అస్తమిస్తున్న సూర్యుడిని బాల్కనీ లో నుండి చూస్తూ ఉంది కావ్య. కాసేపటికి తన బ్లాక్ కాఫీ కప్ తో రీనా కూడా వచ్చి కావ్య పక్కన కూచుంది. ఇద్దరూ నిశ్శబ్దంగా కాఫీ తాగసాగారు.

ఆకాశం అంతటిలో ఒక్కటే మేఘం ఉంది. అది కూడా నిండు చూలాలి లా మెల్లిగా కదులుతూ ఉంది. దూరంగా మసీదు నుండి సాయంత్రపు అజాన్ వినిపిస్తుంది. బాల్కనీ లో నైట్ క్వీన్ అప్పుడే విచ్చుకోవడానికి సన్నద్ధం అవుతూ ఉంది.

ఇంకో పక్క గుత్తులు గా వేలాడుతున్న రెండు రెక్కల మల్లెలు. బాల్కనీ లోని మినియెచర్ తోటలో గులాబీలు కూడా రెండు మూడు రకాలు విచ్చుకుని ఉన్నాయి. ఆ వాసనలన్ని కలిసి మందంగా, మత్తుగా ఏదో అత్తరు చల్లినట్టు అక్కడి గాలి వింతైన వాసనలు మోసుకుని తిరుగుతూ ఉంది.

కాసేపటికి, ముందు కావ్యానే మాట్లాడింది, “రోహిత్ అలా మాట్లాడుతూ ఉంటే నేను భరించలేకపోయాను. పెద్దగా వాదించలేదు కూడా. అక్కడి నుండి లేచి వచ్చేసాను.. అంతే! మళ్ళీ నేను ఏదో అని.. తరువాత బాధపడటం కంటే కొంచెం స్పేస్ తీసుకుంటే మంచిదనిపించి వచ్చేసాను. హోప్ ఇట్స్ ఓకే. ఒక రెండ్రోజుల్లో వేరే ఆప్షన్ చూస్తాను.”

“కమాన్.. కావ్య! హ్యాపీ గా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండొచ్చు. అయినా మీకివన్ని మామూలే కదా.. ఏదో విషయానికి గొడవ పడతారు, మళ్ళీ మీరే కలిసిపోతారు.” నవ్వుతూ అంది రీనా.

కానీ ఈ సారి రోహిత్ కొంచెం ఎక్కువగానే హర్ట్ చేసాడు తనని.. ఆ మాటలు విన్నాక రోహిత్ అలా ఎలా మాట్లాడగలిగాడు.. అన్న విషయం తను జీర్ణించుకోలేక పోతుంది. పైకి మాత్రం రీనా మాటలకు చిన్నగా నవ్వి ఊరుకుంది. ఆలోచనలు రోహిత్ వైపు మళ్ళాయి.

***************

సరిగ్గా రెండేళ్ళ క్రితం ఒక షాపింగ్ మాల్ లో కాలేజ్ ఫ్రెండ్ రోహిత్ కనిపించే సరికి చాలా హ్యాపీ గా ఫీల్ అయింది కావ్య. అదే మాల్ లో కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు, కాలేజ్ రోజులు గుర్తు చేసుకున్నారు, నంబర్స్ ఇచ్చి పుచ్చుకున్నారు.

ఎప్పుడో ఒకసారి ఫేస్బుక్ లో ఫొటోస్ లైక్ చేయడం, బర్త్ డేస్ కి, పండగలకి విష్ చేసుకోవడం వరకే ఉన్న వాళ్ళ స్నేహం పెరిగి పెద్దదైంది.

ఒకరంటే ఒకరికి ఇష్టం అవడం వల్ల, వాళ్ళిద్దరూ కొద్ది కాలానికే ఒకే ఫ్లాట్ లో కలిసి ఉండటం మొదలు పెట్టారు. ఇద్దరికీ పెళ్ళి మీద గొప్ప అభిప్రాయం లేకపోవడం వల్ల లివ్ ఇన్ రిలేషన్షిప్ వాళ్ళకు బెస్ట్ అనిపించింది.

ఒక కాలేజ్ లో ఫోటోగ్రఫీ నేర్పించే కావ్యకి ఎప్పటి నుండో ఈ 9 టు 5 జాబ్ మానేసి ఇండిపెండెంట్ గా, ప్రాజెక్ట్స్ చేయాలని కోరిక. అప్పటికే మ్యారేజ్ వీడియోస్, ఈవెంట్ కవరేజ్ లు, షార్ట్ ఫిల్మ్ షూట్స్ చేసే అనుభవం ఉన్న రోహిత్, కావ్య ని జాబ్ మానేసి హ్యాపీ గా ఫోటోగ్రఫీ సొంతంగా చేపట్టమని ప్రోత్సహించాడు.

ఉన్న కొద్ది పాటి సేవింగ్స్ ని చూసుకుని ధైర్యంగా జాబ్ కి రాజీనామా చేసింది. తన వద్ద ఉన్న పాత కెమెరా అమ్మేసి, లేటెస్ట్ మోడల్ DSLR, కొన్ని లెన్స్ లు, ఇంకొన్ని చిన్న చిన్న కెమెరా ఆక్సెసరిస్ తీసుకుంది. రోహిత్ దగ్గరుండి కావ్య చేత ఆన్లైన్లో ఒక పోర్ట్ ఫోలియో తయారు చేయించాడు.

కావ్య ఆనందానికి హద్దులు లేవు. సంతోషంగా ఇంటర్నెట్ లో అవకాశాల కోసం వెతకసాగింది.

ఒకరిద్దరు స్నేహితులు, కొలీగ్స్, బంధువులు కావ్య కొత్త కెరీర్ గురించి తెలుసుకుని తమకు తెలిసిన చోటల్లా రెఫర్ చేశారు. తమ తమ ఇళ్ళలో జరిగే ఫంక్షన్స్ కి కూడా తననే ఫోటోగ్రాఫర్ గా పెట్టుకున్నారు. రోహిత్ సహాయం తో ఫోటోషాప్, ఎడిటింగ్ కూడా నేర్చుకుంది కావ్య.

ఇవన్నీ బానే ఉన్నా, కావ్యకి ఎక్కడో ఏదో వెలితి. ఇంకా ఏదో చేయాలి, ఈ పెళ్ళిళ్ళ వీడియోలు, బర్త్ డే పార్టీలే కాదు, ఇంకా పెద్ద స్కేల్ లో ఫోటోగ్రఫీ చేయాలని తన కోరిక. అందమైన ఈ ప్రపంచాన్ని, మనుషులను, వారి భావోద్వేగాలను తన కెమెరా కళ్ళతో బంధించి కొత్త కోణంలో అందరికీ చూపించాలని కావ్య తాపత్రయం. ఇదే విషయం రోహిత్ తో అంటే, “ఒకే సారి ఆకాశానికి ఎగిరిపోవాలంటే ఎలా? ఒక్కో మెట్టు పైకి వెల్దువు గానీ!” అన్నాడు. నిజమే కదా అనుకుంది కావ్య.

పోర్ట్ ఫోలియో లో భాగంగా తను తీసిన వీడియోలు, ఫోటోలు తన వెబ్సైట్ లో పెట్టింది కావ్య. తను కవర్ చేసిన ఈవెంట్స్ కి సంబంధించిన వీడియోస్ కూడా యూట్యూబ్ లో ఒక ఛానల్ ఓపెన్ చేసి, అందులో పెట్టింది. తనకు తెలిసిన చిన్న చిన్న కెమెరా టెక్నిక్స్ గురించి వివరిస్తూ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసింది. చూస్తుండగానే తన యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ అయ్యింది.

ఒక రోజు ఇంటర్నెట్ లో ఒక మంచి యాడ్ చూసింది. వేరే వేరే దేశాల నుండి వచ్చే ఆరుగురు ఫోటోగ్రాఫర్స్ కొన్ని ప్రదేశాలు తిరిగి, ఆ అనుభవాలన్ని రికార్డ్ చేస్తారు. అలాంటి ప్రోగ్రాం కి దరఖాస్తులను ఆహ్వానిస్తూ పెట్టిన యాడ్ అది. మంచి ప్యాకేజీ, ఖర్చులు కూడా స్పాన్సర్స్ భరిస్తారు. ఏం అవుతుందో చూద్దాం అన్న కుతూహలం వల్ల ఆ వెబ్సైట్ లో అప్లికేషన్ పంపింది కావ్య.

వారం తిరక్కుండానే ఆ వెబ్సైట్ వాళ్ళు కావ్య కి మెయిల్ పెట్టారు, “యు ఆర్ సెలెక్టెడ్” అని.

ఉబ్బి తబ్బిబ్బైపోయింది కావ్య. పరిగెత్తుకుని వెళ్ళి రోహిత్ కి ఈ విషయం చెప్పింది. “అబ్బో, పర్లేదే! ఏమో అనుకున్నా.. అమ్మగారికి ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే దేశాల దాకా చేరిందన్న మాట!” అన్నాడు రోహిత్.

ఒక్క క్షణం కావ్యకు అది పొగడ్త లా కాదు, వెక్కిరింపు లా అనిపించింది. కానీ తమాయించుకుని, “నేనేం మాట్లాడుతున్నా? నువ్వేం మాట్లాడుతున్నావ్? అవకాశం వచ్చింది. అది కూడా గోల్డెన్ ఛాన్స్. నీకు తెలుసు, ఎప్పటి నుండో నాకు ప్రపంచం చుట్టేయాలన్న కోరిక ఉందని. ఆ కోరిక తీరడానికి ఇంతకంటే మంచి అవకాశం నాకు రాదు. నా డీటెయిల్స్, పాస్పోర్ట్, అన్ని పంపిస్తే, వెంటనే ఏర్పాట్లు చేస్తారంట. జూన్ చివరి వారం లో బయల్దేరాల్సి రావొచ్చు. మొత్తం మూడు నెలల ట్రిప్. నా పర్సనల్ ఖర్చులు తప్పిస్తే, ట్రావెలింగ్ కి, ఉండటానికి హోటల్ ఖర్చులు, వీసా పనులు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఐ యామ్ సో ఎక్సయిటెడ్.”

ఆశ్చర్యపోయినట్టు చూసాడు రోహిత్. “నిజంగానే వెళ్తావా? నేనేదో టైం పాస్ కి అప్ప్లై చేసావనుకున్నా!”

“సరదాకే అప్ప్లై చేసాను. కానీ ఇంత మంచి అవకాశం వస్తే, వదులుకోలేను కదా!”

“నువ్వు అనుకున్నంత ఈజీ గా ఏమీ ఉండదు. ముక్కు మొహం తెలీని వాళ్ళతో మూడు నెలలు ఉండాలి, తిరగాలి, అసలు ఎలాంటి ప్లేసెస్ కి తీసుకెళ్తారో ఏంటో! ఇవన్నీ ఆలోచించకుండా తొందరపడితే తరువాత నువ్వే బాధపడతావ్.”

“అదొక పెద్ద ఇంటర్నేషనల్ ఏజెన్సీ. కరెక్ట్ గా ప్లాన్ చేయకుండా ఎందుకుంటారు? పైగా ఇదిలా వాళ్ళు ఏర్పాటు చేయడం మూడో సారి.”

“ఏమో లే, నీ ఇష్టం. మళ్ళీ నేనేదో అడ్డు పడినట్టు అనిపిస్తుంది నీకు.”

అంత మంచి ఏజెన్సీ తో ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం వచ్చిన ఆనందం మొత్తం నీరు కారిపోయింది కావ్య కు.

***************

సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ వల్ల కాఫీ షాప్ లో చల్లగా ఉంది. మంద్రంగా ఇంగ్లీష్ పాటలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో కార్నర్ టేబుల్ దగ్గర కూచుని స్ట్రాబెర్రీ చీజ్ కేక్ తింటూ ఉంది కావ్య. తన ఎదురుగా కూచుని శాండ్విచ్ తింటూంది రీనా.

“ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యు. ఇమాజిన్.. ప్రపంచం లో ఎంతో మంది అప్ప్లై చేసి ఉంటారు. వాళ్లందరిలోకి నిన్ను సెలెక్ట్ చేసుకున్నారంటే మాటలు కాదు. నీ ఫొటోస్ కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. దే లిటరల్లీ స్పీక్. మొబైల్ ఫోన్ తో ఫోటోలు తీస్తున్నప్పటి నుండే నీ ఫోటోలంటే నాకు ఇష్టం. ఇంతకీ ఏర్పాట్లన్నీ అయ్యాయా? ఎప్పుడు ప్రయాణం?” ఉత్సాహంగా అడిగింది రీనా.

నెమ్మదిగా తలూపింది కావ్య.

“ఏంటే ఆ మొహం? నాకే ఎక్సయిట్మెంట్ అనిపిస్తుంది. నువ్వెంటి అలా పెట్టుకున్నావ్ మొహం??”

“ఏమీ లేదు.. రోహిత్ కి నేను వెళ్ళడం ఇష్టం లేదు లా ఉంది. నాకు ప్రాజెక్ట్ వచ్చిన విషయం చెప్తే అదోలా మాట్లాడాడు.”

“హ హ హ.. పక్కా తనకు కుళ్ళు పుట్టి ఉంటుంది. నిజానికి నీకంటే ముందు నుండే తాను పెద్ద పెద్ద ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు కదా. అలాంటిది నీకు ఇలాంటి మంచి అవకాశం రావడం తో కొద్దిగా ఇగో హర్ట్ అయ్యుంటుంది లే!” తేలిగ్గా అనేసింది రీనా.

“అయినా తను అలా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా చాలా సపోర్ట్ చేస్తాడు. అసలు నాకు ఈ ఎడిటింగ్, ఫోటోషాప్ నేర్పింది, పోర్ట్ ఫోలియో క్రియేట్ చేయడం లో హెల్ప్ చేసింది కూడా తనే…”

“హలో మేడం.. పార్టనర్ తన కంటే ఎత్తులో కనపడితే ఈర్ష్య పడకుండా మురిసిపోయే మగాళ్ళు చాలా అరుదు. వాళ్ళకు అందేంతలా ఉంటే బానే ఉంటారు. ఆ పరిధి వరకు సపోర్ట్ కూడా బానే చేస్తారు. కానీ.. వాళ్ళకంటే ఎత్తుకి వెళ్తున్నారన్న విషయం అనిపించిన క్షణం వాళ్ళ అసలు రంగులు బయట పడతాయి. రోహిత్ కూడా ఆ కేటగిరి లో వాడే అనుకుంటా.. సో డిసప్పోయింటింగ్..!” పెదవి విరిచింది రీనా.

ఒక్క సారిగా గుచ్చినట్టనిపించింది కావ్యకు. “చ్చ చ్చ.. రోహిత్ అలాంటోడేమి కాదు.” చెప్పింది రీనా కే అయినా తనకు తాను చెప్పుకుంటున్నట్టే అనిపించింది కావ్యకు.

“అదంతా సరే.. నువ్వు కొంప తీసి ఆయనగారికి ఇష్టం లేదని ఈ ప్రాజెక్ట్ కాన్సల్ అయితే చేసుకోవట్లేదు కదా!”

“ఏమో రీనా, అందరూ వద్దంటున్నా ఉద్యోగం వదిలేసి ఈ రోజు నాకు నచ్చిన ఫోటోగ్రఫీ చేపట్టడానికి రోహిత్ ప్రోత్సాహం చాలానే ఉంది. ఎప్పుడూ గైడ్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు తను అలా హాఫ్ హార్టెడ్ గా మాట్లాడుతుంటే నాకే మనసుకు కష్టంగా ఉంది.” చప్పున చెమర్చే కళ్ళు తిప్పేసుకుని ఎటో చూస్తూ అంది కావ్య.

“అవేమీ పట్టించుకోకు. ఇది నీకు గోల్డెన్ ఆపేర్చునిటీ. ఇది వదులుకుంటే నీ అంత పిచ్చిది ఉండదు. ఎప్పుడూ దేశాలు తిరిగి రావాలని కలలు కనే దానివి కదా. ఇప్పుడు నీకు ఆ అవకాశం వచ్చింది. ఉంటాడో పోతాడో తెలీని రోహిత్ కోసం నీ ఫ్యూచర్ పాడు చేసుకోకు. అలా మొద్దు మొహం పెట్టుకుని చూస్తావే? అర్థమవుతోందా నేను చెప్పేది?” స్నేహితురాలిని మృదువు గానే మందలించింది రీనా.

“హ్మ్.. ఈ రోజు మళ్ళి ఇంకో సారి మాట్లాడతా రోహిత్ తో.”

“తిక్క తిక్కగా మాట్లాడతావేంటి? అసలు రోహిత్ పర్మిషన్ ఎందుకు నీకు? ఇలాగే అనవసరంగా వాళ్ళ చేతులకి కంట్రోల్ ఇవ్వడం సాధారణంగా ఆడవాళ్ళు చేసే తప్పు. ప్రేమ అనుకుంటారు కానీ.. తెలీకుండానే వాళ్ళ చేతుల్లోకి మొత్తం కంట్రోల్ ఇచ్చేస్తారు. దిస్ హాస్ టు స్టాప్. ఇట్స్ యువర్ లైఫ్. ఇట్స్ యువర్ డ్రీమ్. కష్టపడ్డావు.. అవకాశాన్ని చేజిక్కించుకున్నావు. సింపుల్. అనవసరంగా ఎక్కువ ఆలోచించకు.” హితబోధ చేసింది రీనా కాష్ కౌంటర్ దగ్గరికి వస్తూ.

పరధ్యానంగానే బిల్ కట్టేసి బయటకి దారి తీసింది కావ్య. రీనా తన కార్ వైపు నడిచింది. కావ్య కూడా బైక్ స్టార్ట్ చేసి ఇంటి వైపు బయల్దేరింది.

****************

ఎక్కడో గుజరాత్ లో నెల రోజుల వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్ తరువాత ఇంటికి చేరుకున్నాడు రోహిత్. సామానంతా గదిలో పడేసి స్నానం చేసొచ్చాడు. వంట గదిలో తను వస్తున్న సంతోషం లో చికెన్ వండుతున్న కావ్య ని వెనక నుండి గట్టిగా వాటేసుకున్నాడు.

“ఎలా జరిగింది ట్రిప్?” ఉత్సాహంగా అడిగింది.

“క్రేజీ ట్రిప్. అమీ విటెల్, ఆర్ట్ ఉల్ఫ్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా రావడం వల్ల చాలా నేర్చుకున్నట్టయ్యింది. మంచి ఎక్స్పీరియన్స్. చాలా అలసిపోయాం, కానీ.. లెక్క లేనన్ని ఫోటోలు, మాటల్లో చెప్పలేనన్ని మెమొరీస్, లక్షలిచ్చినా నేర్చుకోలేనన్ని పాఠాలు. టోటల్లీ వర్త్ ఇట్.” మెరిసే కళ్ళతో అన్నాడు రోహిత్.

“ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ యు! నేను మాత్రం చాలా మిస్ అయ్యా నిన్ను. అసలే అడవుల్లో సిగ్నల్ లేక నీతో సరిగ్గా ఫోన్ మాట్లాడటం కూడా కుదరలేదు. ఎనీవేస్.. నీకిష్టమైన వంటలన్నీ చేసాను. అక్కడ పాపం ఏం తిన్నావో ఏంటో. భోంచేద్దాం రా!”

ఇద్దరూ హాయిగా భోంచేసారు మధ్యలో కబుర్లు నంజుకుంటూ. అప్పుడప్పుడూ ఇలా ప్రాజెక్ట్ పనుల మీద రోహిత్ వెళ్ళడం అలవాటే అయినా.. ప్రతి సారి అతన్ని చాలా మిస్ అవుతుంది. దూరం ప్రేమని పెంచుతుందంటారు.. నిజమే కాబోలు.

అతని మెడ వంపులో అలవాటైన తన సోప్ వాసన ఊపిరి అంతా నింపేస్తుంటే చాలా రోజుల తరువాత అతని కౌగిలిలో హాయిగా పడుకుంది కావ్య.

********************

“హే.. సోహైల్ తెలుసు కదా! ఫేమస్ మోడల్.. ఒక మ్యాగజిన్ అతని ఫోటోషూట్ కోసం నన్ను అడిగారు. రేపు తాజ్ లో షూట్. మన మూవీ నైట్ నెక్స్ట్ వీకెండ్ కి పోస్టుపోన్ చేసుకోవాల్సి వస్తుందేమో.” ఇంట్లో అడుగు పెట్టగానే సోఫా లో కూచుని టి. వి. చూస్తున్న రోహిత్ తో చెప్పింది కావ్య.

ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్న రోహిత్ నుండి ఏ జవాబు లేకపోవడం తో, “హలో.. వింటున్నావా?” పక్కనే వెళ్ళి కూచుని రోహిత్ తాగుతున్న కాఫీ కప్ చనువుగా తీసుకుని తనూ కొద్దిగా సిప్ చేసింది, అలాగే పక్కకి వాలి తన భుజం మీద తల వాల్చింది.

విసురుగా లేచాడు రోహిత్, “మన మూవీ నైట్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలీదా నీకు? ఫ్రెండ్స్ పార్టీ అంటే, వాళ్ళకు కూడా కుదరదని చెప్పాను. నువ్వేమో హోటళ్ళు పట్టుకుని తిరుగు.”

ఉలిక్కి పడింది కావ్య, “హోటళ్ళు పట్టుకుని తిరిగేది పని గురించే కదా, రోహిత్. టైం పాస్ చెయ్యట్లేదు, పార్టీలకని కాదు. ఎందుకలా మాట్లాడతావ్?” నొచ్చుకుంది.

వెంటనే తమాయించుకుని, “అది కాదు కావ్యా, ఈ వీకెండ్ మొత్తం నీతోనే ఉండాలని ఎన్నో అనుకున్నా. ఈ ఒక్కటి కాన్సల్ చేసుకోలేవా నా కోసం?” దగ్గరగా వచ్చి కూచుని అన్నాడు.

“అలాగే కాన్సల్ చేసుకునే దాన్నే. కాకపోతే ఈ ప్రాజెక్ట్ రెఫర్ చేసింది అశోక్ గారు. ఇప్పుడు కాన్సల్ చేస్తే బాగుండదు.”

“ఆ అశోక్ నా ఫేస్బుక్ పోస్టులకు లైకులు మాత్రం చేస్తాడు. నన్నెప్పుడూ ఏ ప్రాజెక్ట్ కీ రెఫర్ చేయలేదు. అమ్మాయిలనే సరికి ప్రతి ఒక్కడూ రెఫర్ చేసే వాడే!” చేతిలో రిమోట్ విసిరి కొట్టి అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయాడు.

ఒక్క మాట కూడా మాట్లాడి రోహిత్ కి ఎక్సప్లనేషన్ ఇవ్వాలనిపించలేదు కావ్య కి. అలా చేస్తే, తనను తాను అవమానించుకున్నట్టే! క్షణం ఆలస్యం చేయకుండా రీనా కి ఫోన్ చేసింది. అటునుండి నేరుగా రీనా వాళ్ళ ఇంటికి వొచ్చేసింది.

*********************************

“ఇంతకీ షూట్ కోసం పొద్దున్న ఏ టైం కి బయలుదేరాలి? అన్ని రెడీ చేసుకున్నావా?” రీనా అడిగే ప్రశ్నలకి మళ్ళీ ఈ లోకం లోకి వచ్చింది కావ్య.

“ఇంకెక్కడి షూట్? ఆల్రెడీ కాన్సల్ చేసేసాను. అశోక్ సర్ కి కాల్ చేసి చేయనని చెప్పాను. పాపం లాస్ట్ మినిట్ లో చెప్పే సరికి ఏమనుకున్నారో ఏంటో!”

“పిచ్చి పట్టిందా నీకు? రోహిత్ వాగితే నాలుగు తిట్టకపోగా, నువ్వు షూట్ కాన్సల్ చేయడమేంటి? ఇందుకు కాదా.. వాడు ఇష్టమొచ్చినట్టు బెహేవ్ చేస్తున్నాడు? వై డు యు లెట్ హిమ్ గెట్ అవే ఎవరీ టైం? నిజానికి తనే నీకు సారీ చెప్పాలి.. ఇది టూ మచ్, కావ్య. అండ్ ఐ థింక్, అతని ప్రవర్తన కి కొద్దో గొప్పో నువ్వు కూడా కారణం అవుతున్నావ్!”

రీనా మాటల్లో నిజముందని తెలిసినా, “అదేం లేదు లే! నేను ఈ చిరాకు మూడ్ లో వెళ్ళి షూట్ చేసినా సరిగ్గా చేయలేను. నా కెమెరా ఎక్విప్మెంట్ కూడా ఇంట్లో ఉండిపోయింది. అందుకే వద్దనుకున్నాను.” చెప్పింది కావ్య.

“అసలు నీ ఎక్క్యూసెస్ ఎంత సిల్లీ గా ఉన్నాయో నీకైనా అర్థం అవుతూ ఉందా? డోంట్ రూయిన్ యువర్ కెరీర్ ఫర్ ఎనీ వన్, కావ్య. తరువాత నువ్వే రిగ్రెట్ అవుతావు.” తను చెప్పగలిగినంత చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది రీనా.

కాసేపు శూన్యం లోకి చూస్తూ, తరువాత లేచి గదిలోకి వెళ్ళి పడుకుంది కావ్య.

*************************

మరుసటి రోజు పొద్దున్నే డోర్ బెల్ మోగుతున్న చప్పుడుకి కావ్య కి మెలకువ వచ్చింది. కాసేపు రీనా తీస్తుంది లెమ్మని అలాగే బెడ్ మీద ఉండిపోయింది.

కానీ బెల్ మళ్ళీ మళ్ళీ మోగేసరికి, తనే వెళ్ళి తీసి చూస్తే, ఎదురుగా రోహిత్ కనిపించాడు. నేరుగా లోపలికొచ్చి కూచున్నాడు. కాసేపు మౌనంగా ఉన్నా, మెల్లిగా లేచి వచ్చి కావ్య పక్కనే నిలబడి కావ్య చెయ్యి పట్టుకున్నాడు.

“కావ్య.. ఐ ఆమ్ సో సారీ.. నిన్ను బాధపెట్టాలని అనలేదు.” బతిమాలాడు రోహిత్.

“హ్మ్మ్”

“ఇంకా కోపం పోలేదా? ఏదో మూడ్ ఆఫ్ అయ్యి ఉన్నా, మన ప్లాన్స్ కాన్సల్ అవుతాయన్న బాధ లో అనేశాను.”

“…..”

“ప్లీజ్ అంటున్నా కదా! కావాలంటే గుంజీలు తీయనా? యు నో ఐ లవ్ యు, రైట్?” దగ్గరికి తీసుకున్నాడు.

“అయినా అంత కోపం ఎందుకొస్తుంది రోహిత్? వచ్చినా, నోటికి ఎంతొస్తే అంత అనేయడమేనా? నాకూ నోరుంది. నేను అనాలనుకుంటే ఎంత సేపు? ఏం? నువ్వు రిసార్టులకు వెళ్ళి అమ్మాయిల ఫోటో షూట్లు చేయలేదా? ఒకరి మీద ఒకరికి నమ్మకముంది అనుకున్నా ఇన్ని రోజులు. నన్ను చాలా బాధపెట్టావు నీ మాటలతో. అసలు తలచుకుంటుంటేనే మనసు మెలి పెట్టినట్టు అనిపిస్తుంది.”

“అది కాదు కావ్యా.. ఐ డింట్ మీన్ ఇట్.”

“పైగా నేను అమ్మాయిని కాబట్టి నాకు అదేదో ఫేవర్ చేయడానికి అశోక్ గారు నాకు ప్రాజెక్ట్ ఇప్పించినట్టు మాట్లాడావ్. ఎవరైనా నన్ను రెఫర్ చేయడానికి నాకున్న క్వాలిఫికేషన్ నేను అమ్మాయి అవడమే నా? నాలో ఉన్న టాలెంట్ కాదా? జస్ట్ నేను అమ్మాయినైనందుకు నాకు ప్రాజెక్ట్స్ వస్తున్నట్టు చెప్తున్నావ్!” వంట గదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకుంటూ చెప్పింది కావ్య.

“నా ఉద్దేశం అది కాదు.. నాకు మగ వాళ్ళ బుద్ధి తెలుసు.. ఏదో అనేసా లే! లెట్ ఇట్ గో..” వెనకాలే వచ్చి కిచెన్ కౌంటర్ ని ఆనుకుని నిలబడ్డాడు రోహిత్.

“ఏం తెలుసు? అమ్మాయైనా అబ్బాయైనా టాలెంట్ ఉన్న వాళ్ళని ఆయన ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. అసలు నీ మాటలు వినడానికి ఎంత అసహ్యం వేసిందో ఆ క్షణం.” బాధపడుతూ అంది కావ్య.

“అరే.. ఆయన మొహం చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఒక ఉమనైజర్ అని..”

“ఓహో .. తమరికి ఫేస్ రీడింగ్ తెలుసన్న సంగతి నాకు తెలీదు.. మొన్న కూడా అంతే. ఆ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫోటో ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పగానే ముక్కు మొహం తెలీని వాళ్ళుంటారు.. అవసరమా, అదీ ఇదీ అన్నావ్. అసలు ఏముంది నీ మనసులో?”

“అలా మాట్లాడతావేంటి కావ్యా? ఫోటోగ్రఫీ చేస్తానంటే నేనే కదా అన్ని విధాలా నీకు సపోర్ట్ చేశాను? మర్చిపోయావా?”

“పైకి చేసినట్టే కనపడతావ్.. కానీ, ఇలా నేను షూట్స్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడల్లా ఏదో ఒక గొడవ, లేదంటే మొహం మాడ్చుకుంటావ్. ఎంత సేపు చిన్నా చితక బర్త్డే పార్టీ లు, స్కూల్ ఈవెంట్స్ కవర్ చేస్తే ఒకే. కొద్దిగా పెద్దదిగా ఏం చేయాలని బయల్దేరినా, నీ ప్రవర్తన మొత్తం మారిపోతుంది.”

“నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్.. అవుట్ డోర్ షూట్స్ కి నువ్వెళ్తే, నిన్ను వదిలి ఉండలేక అలా అంటానే తప్ప వేరే ఉద్దేశం కాదు. నిన్ను, నీ చేతి వంట ని ఎంత మిస్ అవుతానో నీకు తెలీదా? నువ్వు లేకపోతే మొత్తం గజిబిజిగా అనిపిస్తుంది నాకు.”

“వావ్ రోహిత్! నువ్వేమో నెలల తరబడి షూట్స్ కి వెళ్తావు. నేను వెళ్ళాల్సి వస్తే మాత్రం నీకు బాధ. ఇక్కడే కూచుని నీకు వండి పెడుతుంటే హ్యాపీ కదా నువ్వు?” తాగేసిన కాఫీ కప్ కడిగేస్తూ అంది కావ్య.

“అయినా ఈ డిస్కషన్ ఇక్కడెందుకు? పద, ఇంటికెళ్దాం. అక్కడ మాట్లాడుకుందాం.” చెయ్యి పట్టి లాగుతూ అన్నాడు రోహిత్.

“నో రోహిత్. నాకు కొంచెం స్పేస్ కావాలి. ఆలోచించుకోవడానికి కొంచెమ్ టైం కావాలి. మనసుకి కొద్దిగా క్లారిటీ వచ్చాక నేనే వస్తాను. నువ్వెళ్ళు, బై!” కదలకుండా నిలబడింది.

 

చేసేదేమి లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు రోహిత్. అలాగే అతను వెళ్ళిన తలుపు వైపు చూస్తూ నిలబడింది కావ్య.

రోహిత్ వెళ్ళిన ఐదు నిముషాలకి రీనా కిచెన్ లోకి వచ్చింది. రీనాని చూసి పేలవంగా నవ్వింది కావ్య. మెల్లిగా ఆమె భుజం తట్టి, తన కోసం బ్లాక్ కాఫీ కలుపుకోసాగింది రీనా.

*********************************

మరుసటి రోజు పొద్దున్న జిమ్ నుండి ఇంటికొచ్చే సరికి రోహిత్ కి గదిలో కంప్యూటర్ టేబుల్ దగ్గర కూచుని లాప్టాప్ మీద ఏదో పని చేసుకుంటూ కనిపించింది కావ్య.

“నాకు తెలుసు నువ్వొచ్చేస్తావని. నా మీద అలిగి ఎక్కువ కాలం ఉండటం నీ వల్ల కాదు. యు లవ్ మీ టూ మచ్.” వంగి కావ్య బుగ్గ మీద ముద్దు పెడుతూ అన్నాడు రోహిత్.

ఏమి మాట్లాడకుండా, చేస్తున్న ఇమెయిల్ పని పూర్తయ్యాక, లాప్ టాప్ షట్ డౌన్ చేసింది. లేచి తన కప్ బోర్డు తీసి ఏదో వెతకడం మొదలుపెట్టింది.

“ఏం వెతుకుతున్నావ్?” బెడ్ మీద వాలి కావ్య కదలికల ను గమనిస్తూ అన్నాడు రోహిత్.

”పాస్పోర్ట్!” అంది కావ్య.

“ఇప్పుడెందుకు గుర్తొచ్చింది పాస్పోర్ట్ నీకు?”

“ట్రావెల్ ఫోటోషూట్ ప్రాజెక్ట్ కి అన్ని డాక్యూమెంట్స్ పంపడానికి ఈ రోజే ఆఖరు తేదీ. ఇవన్నీ పంపితే వాళ్ళు వీసా పనులు మొదలు పెడతారు.” చెప్పింది కావ్య.

“వెళ్తున్నావా? ఒక్క మాట కూడా చెప్పకపోయే సరికి, మానుకున్నావనుకున్నాను. అయినా నా మీద కోపం తో అలా అంటున్నావ్ కదా?” లేచి కావ్య దగ్గరికి వస్తూ అన్నాడు.

“నీకు నీ కెరీర్ ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుందో, నాకూ అంతే. అసలు నీ ప్రాబ్లెమ్ ఏంటో తెలుసా? నేను నీతో సమానం అని ఒప్పుకోవడానికి నీకు బాధ. పైకి బాగున్నట్టే నటిస్తూ, ప్రతి సారి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తావు. నేనేమో పిచ్చి దానిలాగా ప్రాజెక్ట్స్ వదిలేసుకుంటాను.”

“నేనేదో నీ గురించి ఆలోచించి అని ఉంటానే తప్ప, నువ్వు సెలబ్రిటీ అయిపోతే నాకేంటి బాధ?” వ్యంగ్యంగా అన్నాడు.

“ఇంత కంటే హిపోక్రసి ఉండదేమో! ఇప్పుడు నువ్వొచ్చి ఆదుకుంటేనే తప్ప నేను బయట బతకలేను అనుకుంటున్నావా? ఇన్నేళ్ళు నువ్వు అండగా ఉంటేనే ఉద్యోగం చేసానా? ఇక్కడే కాదు, ఇబ్బంది పెట్టడానికి ప్రతి చోటా ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. వాళ్ళందరినీ ఎక్కడ పెట్టాలో, ఎలా లిమిట్ లో ఉంచాలో నాకు బాగా తెలుసు. నా గురించి నువ్వేం బాధపడకు. నేను రీనా ఫ్లాట్ కి మూవ్ అవుతున్నాను. సాయంత్రం లగేజీ మొత్తం షిఫ్ట్ చేసుకుంటాను.”

హ్యాండ్ బాగ్ తగిలించుకుని బయటకు నడిచింది కావ్య.

“నా కంటే నీకు ఆ ప్రాజెక్ట్స్ ఎక్కువయ్యాయన్న మాట ఇప్పుడు..” లోపలి నుండి కసిగా అన్నాడు రోహిత్.

ఆగి వెనక్కి తిరిగి గట్టిగా నవ్వింది కావ్య, “అవును రోహిత్. నీకన్నా, నాకు నా కెరీరే ఇంపార్టెంట్.” అని చెప్పింది.

“లివ్ – ఇన్ లో ఉన్నాం కాబట్టి ఇంత ఈజీ గా చేతులు దులిపేసుకుంటున్నావ్. ఒక వేళ మనకి పెళ్ళి అయ్యుంటే నా ఒపీనియన్ కి వాల్యూ ఇచ్చేదానివే కదా!”

“ఫన్నీ రోహిత్.. ఇంత షాల్లో గా నువ్వున్నావన్న సంగతి తొందరగా గుర్తించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ రిలేషన్షిప్ కి అయినా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సపోర్ట్ చేసుకోవడం, కలిసి ఇవోల్వ్ అవడం ముఖ్యం. జెండర్ తో సంబంధం లేకుండా ఎవరు సక్సెస్ఫుల్ గా ఉన్నా దాన్ని ఇద్దరూ సెలెబ్రేట్ చేసుకోగలగాలి. అది జరగనప్పుడు ఆ రిలేషన్షిప్ కి వాల్యూ ఉండదు. టిపికల్ గా ఎప్పుడో నీలో మార్పు వస్తుందన్న ఆశ తో ఇప్పుడు నేను నా కెరీర్ ని ఆపుకోలేను. గుడ్ బై !”

కిందకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి వెళ్తుంటే, మళ్ళీ రెక్కలొచ్చినట్టు, గాల్లో తేలినట్టు హాయిగా అనిపించింది కావ్య కి.

సెప్టెంబర్ 15, 2020 , సారంగ 

 

మాధురి పాలాజి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు