ఈ కవి నేను ఒంటరిని కాదని ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నాడు.
మతాన్ని గుమ్మం దగ్గర వదిలేసి రావడం గురించి ఆలోచించమంటున్నాడు. మతాన్ని గుళ్లో నుంచి రథం ఎక్కించి పోలింగ్ బూతు దాకా మోసుకొచ్చిన వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. చీకటి కాలానికి శంకుస్థాపన చేసే వాళ్ళని గుర్తించి, పదునైన ఆలోచనలతో జాగ్రత్త పడమని చెప్తున్నాడు. బతుకు పడవల్ని ఒడ్డుకు చేర్చడం కోసం ఇతని వాక్యం భరోసాగా నిలుస్తోంది. జీవితాన్ని కవిత్వంలా చదువుకుంటూ వెళ్లాల్సిందే అంటూ ప్రకటన చేస్తున్నాడు. వెలుగుతున్న నక్షత్రం ఇతని వాక్యం.
మసీదు మీనారు మీది నుంచి
కనిపించే పండుగ నెలవంక కోసం
అందరూ వెతుకుతుంటే
అమ్మ ముఖంలో మెరిసే నెలవంక కోసం
నేను వెతుకుతున్న ”
ఇట్లాంటి వాక్యాలు ఈ కవితా సంపుటి నిండా మనకు చాలా దొరుకుతూ ఉన్నాయి. అనేక కోణాల్లోంచి జీవితాన్ని, సమాజాన్ని తన హృదయం లోకి తీసుకొని , మన హృదయాల్లోకి వాక్యమై ప్రసారం ఐపోతున్నాడు. ఈ సంపుటిలో 59 కవితలు విస్తారమైన జీవితాన్ని ప్రతిఫలింప చేస్తున్నాయి. కవిత్వీకరిస్తున్నాయి. చదివిన పాఠకలు ఆలోచనలను ఉన్నతీకరిస్తాయి. ఈ సంపుటిలోని మొదటి కవిత ద్వారానే ఈ కవి హృదయం ఏంటో ,ఆలోచన ఏంటో ,ఉద్వేగమేంటోచాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
ఈ కవి తన వాక్యం ద్వారా పలికించిన అస్తిత్వ వేదన అర్థవంతంగా ఉంది. కుర్చీ కొరకే రాజకీయాలనుచేస్తూ, మతాల మధ్య చిచ్చులు రేపుతున్న వారికి చాలా మర్యాదగా సమాధానం ఇస్తున్నాడు. నేను నిలబడ్డ ఈ ఆకుపచ్చని పొలం సాక్షిగా అంటూ చెప్పిన వాక్యం లో ఆకుపచ్చ ని ఎందుకు వాడాడు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టిన మట్టిని ,సాటి మనిషిని సమానంగా ప్రేమించే వాడినేగాని, కుట్రకత్తులతో మనుషుల మధ్య సామరస్యాన్ని మొక్కలు చేసే వాళ్ళ కుటిలనీతి ని గుర్తించమని సూచన చేస్తున్నాడు. ఈ మట్టి నా ఆత్మ. మా ముత్తాతల ఆత్మ. మా వేర్లు ఇక్కడే ఉన్నాయి. ఈ నేల మీదే నా జనాజా నమాజు. అని చెప్పడం ద్వారా ఈ దేశం నాదే, ఇందులో నేను కూడా భాగమే అంటూ, ముగింపులో
“ఒకే గాయం దగ్గర ఒక్కటవుతున్న సోదరులంతా నా వెంటే” అనడం ద్వారా దళిత ,బహుజన, మైనారిటీ చైతన్యాన్ని కోరుకుంటున్నాడని తెలుస్తుంది. ముస్లిం వాళ్ళ దృక్పథం లోంచి ఈ కవి రాసిన రెండు కవితలు చాలా బలమైనవి. ఈ కవితలు ఆధిపత్య మతంలో పుట్టిన వారికి ఆత్మ విమర్శన చేసుకునేలా చేస్తాయి. మైనార్టీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. పుట్టుమచ్చను గుర్తుకు చేస్తూ రాసిన కవిత కొత్త మచ్చ. పుట్టుమచ్చనాటి నుండి నేటి వరకు జరుగుతున్న వివక్షతను చూపుతూ, కరోనా కాలంలో కూడా మర్కజ్ రూపంలో వేసిన కొత్తమచ్చను గురించి కలత పడిన విధానాన్ని చక్కగా ఆవిష్కరించారు.
“నిందల చీకట్లలో
నా నిజాయితీ చాందిని
దీనంగా ఆరిపోతుంటే
చీకటి జంతువు తినగా
మిగిలిన నెలవంకను నేను”
చాలా చిన్న చిన్న మాటలతో కవితను ఎంత శక్తివంతంగా నడుపుతున్నాడో గమనించవచ్చు. పుట్టుకతో ఉన్న మచ్చల్ని ఉతికి ఆరేసుకుంటూ ఈ నేల మీద నాకున్న ప్రేమను నిరూపించుకోలేక ,నేను ఇబ్బంది పడుతూ ఉంటే
కొత్త మచ్చ లెక్క నన్ను అంటుకున్నావ్ ,ఎందుకే కరోనా అంటూ తమ దయనీయ పరిస్థితిని అదే టోన్ లో వినిపించాడు. ఈ కవితలో టోన్ శక్తివంతమైంది. పాఠకుల ఆలోచనలును కదిలించే శైలి ని కవి అప్రయత్నంగా సాధించారు.
అనగనగా ఒక అమ్మ కథ కవిత మొత్తం ఒక కథలాగా సాగుతూనే మనలోని దుఃఖపు తీగను కదిలిస్తుంది. అమ్మల కన్నీటి కథలు వినిపిస్తుంది. ఎకరాల కొద్ది నాటేసిన పచ్చని పంట పొలం అమ్మ అంటూ మధ్య మధ్యలో కవి చెప్పిన వాక్యాలు అతను ఎంత నిపుణతతో కవిత్వీకరణ చేయగలడో ఈ ఒక్క కవితలో అనేక సాక్ష్యాలుఇవ్వవచ్చు. మంచి టెక్నిక్ తో కవిత నడిపాడు. అమ్మ నాన్నల గొడవలతో తన ఇంట్లో నిశ్శబ్ద గబ్బిలం వేలాడేదని, భయం పాము కనబడకుండా ఇల్లంతా తిరుగాడేదని చెప్పడం ద్వారా తనలో ఉన్న వేదనని, మనలో కూడా విజయవంతంగా ప్రయాణింప చేశాడు. మనుషుల మధ్య గోడలు కట్టే ఇల్లు వద్దంటాడు. ఇంట్లో మనుషులు మధ్య ప్రేమ లేకపోవడమే అసలైన పేదరికమని ఒక నిర్ధారణ చేస్తాడు.
“అమ్మను ఏడిపిస్తే
నాన్నయినా నాకు శత్రువే
కాదు కాదు లోకమ్మీ ద
ఎవరిని ఎవడు ఏడిపించినా వాడు నాకు శత్రువే”
అని సాధారణీకరణ చేయడం కూడా బాగుంది.
ఈ కవి,కవిత్వ నిర్మాణం గురించి లోపలికి చూస్తే, మామూలు వాక్యాల ద్వారా ప్రభావశీలంగా మనలోకి తాను చెప్పదలుచుకున్న సారాన్ని పంపిస్తాడు. కానీ ఎంచుకున్న వస్తువుకు ఏశైలి అవసరమో, అదే శైలి వాక్యాల్లో కనిపిస్తూ ఉంది. ఇలా కవిత్వ సృజన చేయాలంటే ఆ కవికి అపారమైన సామర్థ్యం ఉండాలి. పాఠకుడిలో రసావిష్కరణ కలిగించడంలో, కవి విఫలం కాలేదు. రహీముద్దీన్ ఒక కలల నిర్మాణ కార్మికుడిగా కనిపిస్తాడు. తన వాక్యాలతో మన చుట్టూ ధైర్యాన్ని ప్రహరీ గోడలా నిర్మిస్తాడు. తాను ఎంచుకున్న వస్తువుని, రహీముద్దీన్ నిర్లక్ష్యం చేసినట్టు ఎక్కడా కనబడలేదు. ఈ కవిలో చెట్టుతత్వం కనిపిస్తుంది. అనేక చోట్ల ఏదైనా వాక్యం అమ్మలా మాట్లాడుతుంది. రైతు ఉద్యమంలో మేకులు కొట్టిన సంఘటన మనకు తెలుసు, ఆ సంఘటనకు సంఘీభావం రాసిన కవిత “కంచం లో మేకులు” ఈ శీర్షిక ద్వారానే కవి ఏమి చెప్పదలుచుకున్నాడో మనకు తెలిసిపోతూ ఉంది. కవిత్వ నిర్మాణంలో శీర్షికలు కూడా భాగమని మనకు తెలుసు. ఇతని కవితా శిల్పంలో శీర్షికలు కూడా భాగమై పోయాయి. చెట్టు గురించి మాట్లాడుతూ” ఆకుపచ్చని దీవెన “అంటాడు. పక్షి నుంచి మనమేం నేర్చుకోవాలో చెప్తూ” పక్షి రెక్కల మీద పాఠం” అంటాడు.
ఈనాటి సాహిత్యం చేయవలసిన పని సమాజాన్ని విడగొట్టడం కాదు. వైషమ్యాలను పెంచడం కాదు. హై స్కూల్ తరగతి పుస్తకాలో రాసుకున్న సామరస్యం ,సహజీవనం అలాంటి మాటల్ని హృదయాల్లోకి తీసుకెళ్లగలడం. మనుషులంతా ఒక్కటే అనే పాతబడిన వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ వల్లించడం ఇట్లాంటి పనిని ఈ కవి చేస్తున్నాడు.
మున్సిపాలిటీలో పనిచేసే సఫాయి కార్మికుల గురించి రాసిన కవిత అద్భుతమైన కవిత. వాళ్లు లేకపోతే ఈ బజార్లు అమ్మలేని అనాధ పిల్లలు అనడం ద్వారా కవితను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. వాళ్లను దయగల తల్లులు అంటాడు. కాంతి రేఖలు గీసే చేతులు అంటాడు. వాళ్ల వాకిట్లో ఎన్ని చీకట్లు ఉన్నా నలుగురు నడిచే దారిని తెల్లని నవ్వులతో కడిగిపోతారు అంటాడు. ఈ కవితలో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కవి చేసిన పోలికలు, ఊహలు, మనల్ని క్షణక్షణం కదిలించి వేస్తాయి.
“తెల్ల బట్టల చాటున
కుళ్ళిన బుద్ధులు దాచుకున్న దేశం
పనికిమాలిన నినాదాలను
గోడలపై రాసుకుంటది కానీ
ఈ దేశపు చెత్తను ఎత్తిపోసే
చేతులు గొప్పతనాన్ని
ఎప్పటికీ తన గుండెలో రాసుకోదు
ఏదో ఒకనాడు రోడ్లను ఊడ్చే ఈ చీపురులే
తమ బతుకులు పీడిస్తున్న మురికి కీటకాలను
ఊడ్చిపారేసే ఆయుధాలవుతాయి”
కలల రంగులో కవి కొత్త వస్తువులు ఏమి చెప్పలేదు. మనకు బాగా తెలిసిన లేదా అంతకుముందు కవిత్వం చేసిన అంశాల్ని తీసుకున్నాడు. కానీ తన అభివ్యక్తి, శైలి, శిల్పం , అలాగే కొత్త ఊహలు, సరికొత్త పదబంధాలతో కలల రంగును వెలిగించాడు.
కరోనా కాలాన్ని ఇతడు రికార్డు చేసిన కవితల్లో కూడా ఇదే సూత్రాన్ని పాటించాడు. మనుషులు రాలుతున్న శిశురం అనే కవితలో మనం ఇప్పుడు మన లోపలికి వెళ్లి రావాల్సిన సందర్భం వచ్చింది ,ఇన్నాళ్లు తప్పిపోయిన వాటిని వెతికి తెచ్చుకుని లోపల చచ్చిపోతున్న మనిషిని బతికించుకోవాలని అంటాడు. అలా మనిషిని బతికించుకునే కవిత్వమే ఈ కవి రాస్తున్నాడు.
“మృత్యువు అద్దంలో కనబడుతున్నప్పుడైనా
బతుకు అర్థం కొత్తగా వెతుక్కోవాలి” ఆ చీకటి కరోనా రోజుల నుంచి ఇతను చెప్పిన ఈ రెండు వాక్యాలు ఏదేవో మత గ్రంథాలు చెప్పిన వాక్యాల కన్నా బాగున్నాయి. రహీముద్దీన్ కలల రంగులో ఒక తాత్వికుడు కనిపిస్తాడు. ఒక మనో వైజ్ఞానిక వైద్యుడు కనిపిస్తాడు. జీవితాన్ని ఎలా వ్యాఖ్యానం చేయాలో స్పష్టంగా తెలిసిన పెద్ద మనిషిగా కనిపిస్తాడు. తనదైన దృక్పథం ఉంది. ఆ దృక్పథాన్ని ఏ గొంతులో చెప్పాలో స్పష్టంగా తెలుసు. చాలాచోట్ల మనకు కొత్త పద చిత్రాలు, పదబంధాలు కనిపిస్తాయి. రాములు బాబాయ్ స్మృతిలో రాసిన కవిత మంచి స్మృతి కవిత. ఇంటి పక్కన ఇల్లు అంటే బతుకు పక్కన బతుకు , కరెన్సీ కత్తి పొలాన్ని ముక్కలుగా పోయడం, ఉన్నట్టుండి రాలిపోతున్న పూలను చూస్తూ ,బతుకు రుచి వాసన కోల్పోవడం, గాయాల వాసనలు మోస్తున్న ఆసుపత్రి గది, సెలైన్ చుక్కలుగా ఇంకిపోతున్న కాలం, కూలీ కిరణాలు ఇలాంటి వ్యక్తీకరణలు కొత్తగా ఉన్నాయి. కొన్ని కవితల్లో గాఢత తగ్గినట్టుగా అనిపిస్తుంది. బహుశా చాలా తేలిగ్గా పాఠకుల్లోకి ప్రవహించాలనే ఉద్దేశం కావచ్చు. కలల రంగు చదువుకున్న తర్వాత ఒక మంచి కవిత సంపుటిని చదివామనే తృప్తి సంపూర్ణంగా కలుగుతుంది.
“ఎత్తుగడలోనే
ముగింపును ఊహించలేము
జీవితాన్ని కవిత్వంలా
చదువుకుంటూ వెళ్లాల్సిందే”
*
అఫ్సర్ గారికి ధన్యవాదాలు
Thank you so much sir.
వ్యాసం బాగున్నది కవికి విమర్శకునికి అభినందనలు
కలలరంగు పై మంచి వ్యాసం రాశారు అన్న.అన్న కవితాత్మను పెట్టుకున్నారు..
కంగ్రాట్స్ 💐💐💐
మీ వాక్యంలో చదివించే మహత్తు ఏదో వుంది. “కలల రంగు” ను ఆవిష్కరించిన తీరు బాగుంది. అస్తిత్వ వేదనను, కవి హృదయ సంవేదనను పట్టుకున్న విమర్శకత్వం ఆకట్టుకుంది.
గోపాల్ గారికి, రహీమొద్దీన్ గారికి అభినందనలు.
రహీముద్దీన్ అన్న కలల రంగు ను చక్కగా పరిచయం చేసారు.బావుంది అన్న..మీకూ అన్నకి శుభాకాంక్షలు💐