ఒకానొకప్పుడు ఒక్కటే ఆలోచన
చదువుతున్నదో రాస్తున్నదో తింటున్నదో
మనసు మనోఫలకం మీద
ఒక్కటే ఆకు రాలుతున్న దృశ్యం
అలలు అలలుగా
అంతరంగం ఎగసిపడుతున్నా ఒక్క అల మీదే దృష్టి మొత్తం
మండుతున్న ఆలోచనల్లోంచే
నడకకు సుగమం చేసే వైపుగా
ఒక్కో అడుగు పేర్చుకుంటూ
పేజీలకు పేజీలు కళ్ళ ముందు నడుస్తుంటే
సారం ఒక్కటే జీర్ణమవుతూ
చైతన్యాక్షరాలను లోనికి ఒంపుకొంటూ
జీవపు బతుకును ఆహ్వానిస్తూ
నిరంతరం తడిసిపోయిన చెమట చుక్కలతో
తవ్విన చలమ చుట్టూ చేరిన
గొంతు ఆర్చుకుపోయిన జీవాల నడుమ
సజీవంగా నీటిని పంచుతూ
ఒకటో రెండో దృశ్యాలు పచ్చదనంతో నిండిపోయి
వసంతాలను వడ్డించుకుంటూ
తాజా తాజాగా
మరి ఇప్పుడో
కల్లోలం అవుతున్న మనసు చెరువులో
నిత్యం అలల హోరు
పేజీలు గోడలయ్యాక
చూపుడు వేలు కింద కదిలిపోతున్న
దృశ్య పరంపర
ఏది నిలవదు, దేనికి నిలకడలేదు
అన్నీ క్షణభంగురాలే
అనేకానేక చిత్తభ్రమణాల్లోంచి ఏది పట్టదు
ఒక శాశ్వత జ్ఞాపకమై
ఏది మనసు గోడకు అంటుకోదు
ఎవరో ఎవరెవరో చూపుడువేలు కింద నుండి జరిగిపోతుంటారు
కొంతమంది మాట్లాడతారు
ఇంకొంతమంది నవ్వుతారు నవ్విస్తారు
మరి కొంతమంది
కొన్ని విషాదాల్ని జార విడుస్తారు ఇంకా కొంతమంది
తమవి కానీ ముఖాల్ని అంటించుకుని
మన గోడలపైకి తొంగి చూస్తుంటారు
ఇన్ని విన్యాసాల నడుమ
నన్ను నేను వెతుక్కుంటూ
తిరణాలలో తప్పిపోయిన
పసిపిల్లాడిలా నేను.
* ** **
Bagundi sir