కలరా, కరోనా …మొదటి విక్టిమ్ పేదవాడే!

నాయన మీసాల సత్తయ్య, తోపుడు బండి మీద అరటి పండ్లు అమ్ముకుంటూ నెట్టుకొస్తుంటే, నేను రోజూ పావలా కూలికి సారాయి దుకాణం లో చేరాల్సి వచ్చింది.

ర్ఫ్యూ, లాక్ డౌన్, నిర్మానుష్యమైన పట్టణాలు, నగరాలు, ఉపాధి కోల్పోయిన ప్రజలు – తినడం కంటే బతకడం ముఖ్యమైన కరోనా భయం లోకి జారిపోయిన సందర్భం. ఎక్కడికక్కడ అంతా బంద్. నిశ్శబ్దం… ఇలాంటి నిశ్శబ్దం, కర్ఫ్యూ నా చిన్నతనంలోనే నా జీవితంలోకి వచ్చింది.

అప్పుడు నాకు తొమ్మిదేండ్లు ఉంటాయేమో! ఆ జ్ఞాపకం ఇప్పటి ఈ పరిస్థితికి కాస్త దగ్గరగా ఉందనిపించింది. ‘పెద్దఊర’ అనే ఒక చిన్న పల్లెటూరు నుండి పూలమ్మిన చోటే కట్టెలు అమ్మ లేక, మిర్యాలగూడకు వలస వచ్చింది మా కుటుంబం.

ఇది యాభై ఏళ్ళనాటి ముచ్చట. మా నాయన పేరు పున్నా సత్తయ్య, మీసాల సత్తయ్య అని కూడా అనేవారు. మేము పద్మశాలీలమైనా మా నాయనకు ఎందుకో అప్పటి కులవృత్తి మగ్గం వంటపట్టలేదు. ఆ మాటకొస్తే వాళ్ల నాయన, మా అమ్మ వాళ్ళ నాయన కూడా మగ్గం నేసేవాళ్లు కాదు. ఒక తాత ఉప్పు అమ్మితే, ఇంకొక తాత వ్యవసాయం చేసే వాడు. ఇక మా నాయనేమో హోటల్ బిజినెస్ చేసేవాడు.

అది భారతదేశ ఆధునిక దేవాలయంగా అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూచే కీర్తించబడిన నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణ మవుతున్న దశ. మా నాయన దేవరకొండ నుంచి వలస వచ్చి మధ్యలో ఉన్న పెద్దవూర దగ్గర (హైదరాబాదు నుండి నాగార్జునసాగర్ కు వెళ్లే మధ్యలో ఉంటుందీ పెద్దవూర) ఒక చిన్న గుడిసెహోటల్ స్టార్ట్ చేశాడు. ఆ ఊర్లో అప్పుడూ, ఇప్పుడు కూడా వ్యాపారమంతా ఆ మెయిన్ రోడ్డు మీదే. సాగర్ డ్యామ్ నిర్మాణానికి సిమెంటు, రాళ్లు,మిగతా వస్తువులు తీసుకెళ్లే లారీలు ఇక్కడ ఆగేవి. ఈ లారీల డ్రైవర్లు, క్లీనర్లే మా కస్టమర్లు. మా హోటల్ లో ఉదయం పూట టిఫిన్ల లోకి చపాతి- ఉల్లిగడ్డ బేసిన్, పూరి – ఎర్ర పప్పు, మధ్యాహ్నం భోజనంలోకి మటన్, మునక్కాయ పప్పుచారు, గడ్డపెరుగు .. ఇలా వచ్చిన వాళ్ళు చాలా ఇష్టంగా తమ సొంత ఇంట్లో తిన్నట్టుగా తినేవారు. ఈరోజు వచ్చిన వాళ్లు రేపూ వచ్చేవాళ్లు, కొత్త వాళ్ళు వచ్చేవారు.. మంచి భోజనం ఎక్కడరా అంటే “మీసాల సత్తయ్య హోటల్” అని పేరుపడ్డది(మా నాయనకు మీసాలు పెద్దగా ఉండేవి. వాటిని ఎప్పుడూ వంకీలుగా తిప్పుతుండేవాడు).

చుట్టుపక్కల నాలుగైదు హోటల్లు ఉండేవి, కానీ మా ఒక్క హోటల్లోనే, అప్పుడే కొత్తగా వచ్చిన రేడియో ఉండేది. దానికి ఈ కొస నుండి ఆ కొస దాకా పైన కప్పు కు జాలి యాంటెన్న కట్టి ఉండేది. “వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్..” అని క్లియర్ గా వినిపించేది. వచ్చిన వాళ్ళు వార్తలు, పాటలు వినుకుంటూ హాయిగా తినేవాళ్లు.

అలా హోటల్ బాగానే నడుస్తూ, గుడిసె నుండి మిద్దె ఇంటి దాకా వచ్చింది. తొమ్మిది అర్రల ఇల్లు అనేవాళ్ళు. పెద్ద కుటుంబం – నేను, మా అన్న, చెల్లెలు, ముగ్గురు కక్కయ్యలు, ఇద్దరు చిన్నమ్మలు(మా నాయన తమ్ముళ్ళు), అమ్మా, నాయన, మొత్తం పది మందిమి- అంతా కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. ఇల్లంతా పండగ పండగగా, సందడి సందడిగా ఉండేది. ఏమైందో తెలియదు కానీ, కొంతకాలం తర్వాత ఒకనాడు మమ్మల్ని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్యాలగూడ టౌన్ కి బయలుదేర తీసాడు, మా నాయన.

పెద్ద వూరలో ఉన్న ఇల్లు అమ్మేసి, మమ్మల్ని తీసుకుని మిర్యాలగూడ వచ్చేశాడు. మా కక్కయ్యలు అక్కడే పెద్దవూరలో ఉండిపోయారు. మిర్యాలగూడలో పాత బస్టాండ్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ఒక హోటల్ స్టార్ట్ చేశాడు, దాని పేరు “యాదగిరి విలాస్” అని పెట్టాడు, మా అన్న పేరు యాదగిరి. పెద్ద వూరలో ఒకట్రెండు క్లాసులు చదివినట్టు గుర్తు. ఇక్కడికొచ్చాక ఇంకా అప్పటికి స్కూల్లో చేరినట్టు నాకు గుర్తు లేదు కానీ హోటల్ బాగానే నడిచేది. వంటంతా మా అమ్మ, నాయనలే చేసేవారు. అప్పట్లో పాలు పోయడానికి వచ్చే అమ్మలక్కలే ఇంట్లో పనంతా చేస్తూ, సాయంత్రం పైసలు తీసుకొని పోయేవాళ్ళు. (పెద్దవూరలో కూడా ఇదే పద్ధతి) బుట్టలో పాలు పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ల నుంచి వచ్చే వాళ్ళు. పాలు చిక్కగా ఉన్నాయా లేవా అని థర్మామీటర్ వేసి, డిగ్రీలు కొలిచి తీసుకునేది మా అమ్మ.

మా హోటల్ బోర్డుమీద ‘మిలటరీ హోటల్’ అని ఉండేది. అప్పట్లో మిలటరీ అంటే ‘నాన్ వెజ్’ అని. మా పక్కన లక్ష్మీ విలాస్ అని, ధనలక్ష్మి విలాస్ అని శాకాహార హోటల్లు ఉండేవి. ఇంకొంచెం ముందుకు వెళితే ఇంద్రాభవన్ అనే హోటల్ ఉండేది, అది బిర్యానికి ఫేమస్. మాకయితే రోజులో ఒక్కసారైనా బిర్యానీ పెట్టేది అమ్మ. మా అమ్మ చేసిన బిర్యాని, రంగురంగుగా భలె రుచిగా ఉండేది. పెద్దవూర లో ఉండగా అమ్మకు బిర్యానీ చేయడం కాదు కదా, బిర్యానీ అంటేనే తెలియదు. ఇక్కడికి వచ్చాక ఎలా నేర్చుకుందో ఏమో, సూపర్ గా వండేది.

నెమ్మది నెమ్మదిగా మా హోటల్ కూడా నాన్ వెజ్, బిర్యానికి ఫేమస్ అయిపోయింది. ఇక్కడా మా నాయన, సత్తయ్య పేరు బాగానే వినపడింది. రోజూ వచ్చే ఫ్లోటింగ్ కస్టమర్లే కాకుండా నెలసరి భోజనానికి వచ్చే వాళ్ళు కూడా బాగానే ఉండేవారు. “నెలసరి భోజనాలు” అంటే ఆఫీసులలో పని చేస్తూ, బ్యాచిలర్స్ గా ఉండే చాలామంది నెలంతా భోజనం చేసి, జీతం వచ్చాక పైసలు చెల్లించే వెసులు బాటన్నమాట. ఇప్పడైతే మెస్సుల్లో నెలకు సరిపడా ఒక కూపన్ ముందే పైసలు చెల్లించి కొనుక్కొవాలి. అప్పుడంతా నమ్మకం మీద నడిచేది. ఒక తెలిసినతనితో, ఇంకొకతను, అతనితో ఇంకొకతను…అలా సంఖ్య పెరుగుతూ పోయేది.

మా నాయన ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసేవాడు. తిన్న వాళ్ళు కూడా నెల జీతం రాగానే పైసలు తెచ్చి ఇచ్చేవాళ్ళు. అలా కొన్ని నెలలో, ఒక ఏడాదో ఏ ఇబ్బంది లేకుండా బాగానే గడిచిపోయింది.. ఆ తర్వాత ఆకస్మాత్తుగా పరిస్థితుల్లో మార్పు రావడం మొదలైంది. దేశంలో ఏదో ఒక రాజకీయ సంక్షోభం ఛాయలు కనిపిస్తుండేవి. (అప్పుడు నా చిన్న బుర్రకి అందేవి కావు కాని, తర్వాత తెలిసిన విషయాలు) అది కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయమనుకుంటా. ఏవో గొడవలు జరుగుతుండేవి. “బ్రహ్మానంద రెడ్డి నీ బ్రతుకే …..దొడ్డి, దిగవోయి గద్దె మాది ….. బుద్ధి నీది” అంటూ పాటలు పాడుకుంటూ, బ్యాచ్ లు, బ్యాచ్ లుగా తిరుగుతూ దుకాణాలు మూయిస్తూ, అక్కడక్కడా గొడవలు చేస్తూ, ఇలా కొంత డిస్టబెన్స్ గా ఉండేది. బతుకు బండి నడుస్తున్నట్టూ ఉండేది, ఆగుతున్నట్టూ ఉండేది, కొంత భయం కొంత అలజడి.. (69 దాకా “జై తెలంగాణ” మూమెంట్ తర్వాత 72 లో “జై ఆంధ్ర” మూమెంట్ అని తర్వాత తెలిసింది. ఇది ఏ టైమో అంతగా గుర్తు లేదు గాని) పోలీసులు, లాఠీ ఛార్జీలు, తలలు పగలడాలు… కొందరు రోడ్ల మీద, అక్కడక్కడా పొగలు కక్కుతున్న చిన్న చిన్న సీసాలను విసిరేసే వాళ్ళు.. ఇంకొందరు వాటి మీద మట్టి కప్పే ప్రయత్నం చేసే వాళ్ళు. కర్రలు, రాళ్లు పట్టుకొని ఒక బ్యాచ్ ని ఇంకో బ్యాచ్ తరముతుండేది. గొడవ, గొడవగా ఉండేది, ఇంట్లో నుంచి ఎవరు ఎక్కువగా బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేసేవాళ్ళు.

అక్కడక్కడా పోలీస్ టెంట్లు కనిపించేవి, పోలీసులు జీపులో ఊరంతా తిరుగుతూ మైక్ లో ఏదో చెబుతుండేవారు… ఇలాంటి స్థితి ఎన్ని రోజులు ఉందో గుర్తు లేదు కానీ ఒకరోజు సడన్ గా దుకాణాలు, ఆఫీసులు, బస్సులు, బడులు కాలేజీలు అన్ని మూయించేసి మొత్తం ఊరంతా నిర్మానుష్యం చేసేశారు. మెయిన్ రోడ్డు మీద పెద్ద పోలీస్ క్యాంపు- “ఊర్లో కర్ప్యూ అమల్లో ఉంది, ఎవరు కూడా బయటకు రావద్దు, కనిపిస్తే కాల్చివేస్తాం” అని మైకుల్లో వినబడుతుండేది. మేం తలుపు మూసుకొని ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్లం. అప్పుడప్పుడు బల్లాలెక్కి కిటికీలోంచి బయటికి చూస్తూంటే అమ్మ వెనక్కి లాగుతుండేది. హోటల్ బిజినెస్ పూర్తిగా మూలకు పడిపోయింది, మా బ్రతుకు తెరువు ఆగమై పోయింది, ఎక్కడ మానవమాత్రుడి అలికిడి ఉండేది కాదు. అప్పుడప్పుడు ఎలా వచ్చేవాళ్ళో తెలియదు కానీ, కొంతమంది నెలసరి భోజనాల వాళ్ళు దొంగతనంగా మా ఇంటి వెనుక వైపు నుంచి వచ్చి, రెండు మూడు రోజులుగా ఏమీ తినలేదు, ఏదైనా ఉంటే వండిపెట్టు సుశీలమ్మ అంటూ ప్రాధేయపడే వాళ్ళు. ఒకవైపు కర్ఫ్యూ భయం, ఒకవైపు ఆకలి… అసలే బ్యాచిలర్స్, కర్ఫ్యూ వల్ల వండుకునే వెసులుబాటు కానీ బయట తినే అవకాశం కానీ లేకపోవడం వల్ల వాళ్ల ఆకలిని అమ్మ, వ్యాపార దృష్టితో కాకుండా మానవతా దృక్పథంతో చూసి ఉండవచ్చు. చేతికి దొరికినది ఏదో ఒకటి అప్పటికప్పుడు వండి వాళ్ళ ఆకలి తీర్చేది.

మా నాయన, మా మామయ్య పోలీసులు ఎవరైనా వస్తున్నారని కాపలా కాసేవాళ్ళు. అలా ఓ నాలుగైదు రోజులు గడిచిందనుకుంటాను, గుర్తులేదు. ఒకరోజు సడన్ గా, ఈ నెలసరి భోజనాలు వాళ్ళు తింటుండగా తలుపులు దడ దడ మన్నాయి. అందరి గుండెలు జారిపోయాయి. ” కౌన్ హైభే అందర్, దర్వాజా ఖోల్…” అంటూ అరుస్తూ తలుపుల మీద దబదబ బాదుతున్నారు. మేం పిల్లలం, అమ్మ ఒక మూలకు నక్కి దాక్కున్నాం. మా నాయనా, మావయ్య తినే వాళ్లని తినమని చెప్పి‌, నెమ్మదిగా తలుపు తీశారు. ఎదురుగా ఒక పొట్టిగా, లావుగా, బలిష్టంగా ఉన్న ఒక సిక్కు ఇన్స్పెక్టర్ పదిమంది కానిస్టేబుల్లతో నిలబడి ఉన్నాడు, “క్యా భే, క్యా హోరా యే సబ్, కర్ఫ్యూ మే హోటల్ చలా రహే హో..” అంటూ చేతిలో పిస్తోలు తిప్పుకుంటూ, అటూ ఇటూ చూస్తున్నాడు. మా పై ప్రాణాలు పైనే పోయాయి. మా నాయన, మా మామయ్య “నహీసాబ్, ఏ హమారా హీ లోగ్ హై, గాంవ్ సే అయే తే, కర్ఫ్యూమే ఇదర్ హీ అటక్ గయే తే….” అంటూ ఇంకా ఏదో బతిమిలాడుతూ ఇన్స్పెక్టర్ ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి మా అమ్మ కూడా దండం పెడుతుంది. తినే వాళ్ళు కూడా లేచి నిలబడ్డారు.

పోలీసాయన ఏమనుకున్నాడో ఏమో, తినే వాళ్లని ఎందుకు ఆపాలి అనుకున్నాడో ఏమో, “ఠీక్ హై జెల్దీ ఖతమ్ కరో…నైతో…. .” అనుకుంటూ పిస్తోలు తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అందరం ‘బ్రతికి పోయాంరా దేవుడా’ అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాం. నెలసరి వాళ్ళు తినేసి వెళ్లి పోయారు, కర్ఫ్యూ వున్నన్ని నాళ్లు మళ్లీ రాలేదు. ఆ తర్వాత రోజే, మెయిన్ రోడ్డు మీద ఉన్న వెంకటేశ్వర భవన్ హోటల్ మీద, ఎవరో ఒకతను తచ్చాడుతుంటే షూట్ చేశారని తెలిసింది. ఆ పోలీసాయన తిక్కోడయుంటే మా పని ఏమయ్యేదో అని తలుచుకుంటేనే భయమేసేది. మరి ఈ కర్ప్యూ ని ఎప్పుడు తొలగించారో గుర్తు లేదు కానీ, సాధారణ పరిస్థితులొచ్చేవేళకి మా హోటలు, గీటలు ఏవీ లేవు. ఈ కర్ఫ్యూ వల్ల హోటల్ దివాళా తీసిందని, ఫర్నిచర్ మిగతా వంట సమానంతా అమ్మేసి అప్పులు, రెంట్ కట్టారని, నెలసరి భోజనాలవాళ్లు కూడా కొంతమంది ఎగ్గొట్టారని అమ్మ చెప్పుకొచ్చింది. ఈ హోటల్ ఇల్లు ఖాళీ చేయాల్సివచ్చింది.

ఆ పక్క సందు ఇస్లాంపురలో ఒక సాయిబు ఇంట్లో చిన్న గది అద్దెకు తీసుకుని అందులో కి మారిపోయాం. మా నాయన మీసాల సత్తయ్య, ఒక తోపుడు బండి మీద అరటి పండ్లు అమ్ముకుంటూ నెట్టుకొస్తుంటే, నేను రోజూ పావలా కూలికి సారాయి దుకాణం లో చేరాల్సి వచ్చింది. మా అన్నను పెద్దవూరలో మా కక్కయ్య దగ్గరకు పంపించాడు, మా నాయన. అలా మా బతుకులు ఆగమై, మమ్మల్ని పూర్తిస్థాయి పేదరికంలోకి నెట్టేసిందా సంక్షోభం. ఇప్పుడీ కరోనా మహమ్మారి సంక్షోభంతో, అనాలోచిత కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ల మూలంగా ఎన్ని కుటుంబాలు ఇలా వీధిన పడ్డాయో మనమిప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ఎప్పుడూ ఏ పొలిటికల్ అన్రెస్టయినా, ప్రకృతి వైపరీత్యం వచ్చినా, గత్తర, కలరా, కరోనా ఏది వచ్చినా మొదటి విక్టిమ్ పేదవాడే.

*

 

నర్సిం

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజం. ఏ విపత్తు కైనా మొట్టమొదట బలయ్యేది పేదవాడే! ఓ సిద్దాంతం తో, ఓ నిర్మాణం తో ఒక చిత్తశుద్దిగల నాయకత్వం తో పని చేస్తే సమాజం లో మార్పు తీసుకువచ్చేదీ ఆ పేదవాడే!

  • జరుగుబాటు పరిస్థితులనుండి సంసారాలు చితికిపోయి పేదవాళ్ళు ఇంకా ఇంకా అంచులకి నెట్టబడుతున్నారు. మీ అనుభవాలు నా చిన్నతనాన్నీ, మా ఇంటి బాధల్నీ గుర్తుకి తెచ్చాయి.ప్లేగులూ,కలరాలూ వైరస్ లూ అన్నిటికీ మొదట బలయ్యేది పేదలేనని మీరన్నది నిజం!

  • నర్సిం,

    ఏ దేశంలో నైనా , ఏ విపత్తు వచ్చినా ఆగమయ్యేవి పేదవాళ్ల జీవితాలే. ఇన్ని ఏళ్ళు గడిచినా , తట్టుకొని నిలబడగల ఆర్థిక పరిస్థితులు , అండదండలు లేని పేదవారే కదా బలయ్యేది .

    మీరు బొమ్మలు ఎంత బాగా వేస్తారో, అంత బాగా రాస్తారు. రెగ్యులర్ గా రాయాలని కోరుకుంటూ ….

    ఇంద్రాణి

  • బాగా రాసావు కామ్రేడ్. కదిలించింది.

  • సంక్షోభాలేవైనా క్షోభ సామాన్యులకే. స్వీయానుభవాలతో ఇప్పటి సామాన్యుల కష్టనష్టాలను పరిణితితో అవలోకించారు.

    పెద్దవూర మిలట్రీ హోటల్, మిత్రుని పేరుతో యాదగిరి హోటల్… నేను తెలుసుకున్న కొత్త విషయాలు… రిలీఫ్నిచ్చాయి.
    కీప్ రైటింగ్.
    బెస్ట్ ఎవర్.

    పున్నా కృష్ణమూర్తి

  • నర్సిం, నీ జీవిత దృశ్యాన్ని కళ్ల ముందు చిత్రంలా పరిచావు . మన జీవన సంఘర్షణలే నిజమైన చరిత్ర!

  • రెక్కాడితే డొక్కాడని బతుకులే ఏ ఉపద్రవానికైనా ముందు కూలేది. అట్టడుగు జీవనానుభవాన్ని మించిన కథ, కథనం ఏముంటుంది..కుంచె పట్టే నర్సిం కలం చెప్పిన అరుదైన వాస్తవిక చిత్రణ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు