కలయికకి ముందే కుదిరిన స్నేహబంధం!

జూన్ వెళ్ళిపోతూ జులై వస్తోందంటే స్వర్గీయ ముళ్ళపూడి వెంకట రమణ గారి పుట్టిన రోజే గుర్తొస్తుంది.

ప్పుడు నా వయసు మూణ్ణెల్లో, ఫది నెల్లో. అది నాకూ “గ్నాపకం” లేదు. అప్పుడు వాళ్లిద్దరికీ పదిహేనేళ్ళ లోపే! అప్పటి నుంచీ ఆయనా, బాపు గారూ నాకు బాగా తెలుసు. ఎందుకంటే, తెలుగు చదవడం కాస్తో కూస్తో వచ్చిన కోటానుకోట్ల తెలుగు వారు హాయిగా నవ్వుకోడానికీ, శ్రుతి మించని వ్యంగానికీ, ఎంతో ఆహ్లాదకరమైన సాహిత్య వాతావరణాన్ని తెలుగు నాట సృష్టించడానికీ రమణ రాత-బాపు గీత, వారిద్దరూ సృష్టించిన ఆ అద్భుతమైన వాతావరణంలో పెరిగిన కోటానుకోట్ల మందిలో నేనూ ఒక పిపీలకాన్ని. నాకు వారు చిన్నప్పటి నుంచి “తెలుసు” కానీ, వారిద్దరికీ నేను చాలా ఏళ్ళు అస్సలు తెలీదు. అంటే అంతా వన్ వే ట్రాఫిక్కే..అయితే వ్యక్తిగత పరిచయం అయ్యాక సుమారు పాతికేళ్ళ పాటు వారి ఆత్మీయతకి నోచుకున్న నా అదృష్టానికి అంతే లేదు.

మొదటి సారి …1987 లో నా పూర్వ జన్మ సుకృతం వలన ఒక రోజు బాపు గారిని భయం, భయంగానే పిలిచాను. ఎందుకంటే, మా హ్యూస్టన్ లో తలపెట్టిన సప్తమ తానా మహా సభల సావనీర్ “మధుర వాణి” కి నన్ను సంపాదకుడిగా పెద్దలు నియమించారు. అది తెలియగానే నా బుర్రలో వెలిగిన మొట్టమొదటి పేరు బాపు-రమణ. అవి ఇద్దరి పేర్లు అని ప్రపంచంలో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. ఆ ఫోన్ ఎత్తి, హలో అన్నది సాక్షాత్తూ బాపూ గారే అని తెలియగానే నాకు ముచ్చెమట్లు పట్టేసి, అనుకోకుండానే కుర్చీలోంచి లేచి నుల్చుని వణుకుతూ మాట్లాడడం మొదలు పెట్టి “అయ్యా, మాది అమెరికాలో టెక్సస్. ఊరి పేరు హ్యూస్టన్. ఇక్కడ భారీ ఎత్తున మేము తెలుగు సభల జరుపుకుంటున్నాం” అని గబ గబా వాగేస్తుండగా ఆయన “సభలా? అందులోనూ అమెరికాలోనా? నేను రాను” అని ఫోన్ పెట్టెయ్యబోతుంటే, నేను బుడుగు కంటే ఘాఠిగా, “మాకు అట్ట మీద అద్భుతమైన బొమ్మ కావాలి” అని అరిచాను. ఆ అరుపేదో ముందే అరవచ్చుగా అనకుండా, “ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చుగా” అనే ధోరణిలో మాట్లాడకుండా బాపు గారు చల్ల బడ్డారు.

“సరే, బొమ్మ వేస్తాను, ఎలాంటి బొమ్మ కావాలీ?’ అని అడిగారు బాపూ గారు. “అంటే, మీకు పండగలూ, గుళ్ళూ గోపురాలూ, దెయ్యాలూ, భూతాలూ కావాలా? చీర కట్టుకున్న లిబర్టీ అమ్మాయి కవరు మీద ఉండాలా?” మొదలైన ప్రశ్నలు అడిగి నా అభిప్రాయాలు తెలుసుకుని, ఎప్పటికి కావాలో కనుక్కున్నారు. అదే అవకాశం కదా అని “సార్, మా మధుర వాణికి రమణ గారి చేత ఏమైనా మంచి ఆర్టికల్ రాయించి పెట్టగలరా? ” అని అడిగాను.

“ఇదిగో, ఆయన్నే అడగండి. మధ్యలో నా సిఫారస్ ఎందుకూ? నేను రికమెండ్ చేస్తే అసలు రాయడు కూడాను” అని నవ్వుతూ బాపూ గారు ఫోన్ రమణ గారికిచ్చారు. నా జన్మలో మొట్ట మొదటి సారిగా బాపు గారి గొంతుక విన్న పది నిముషాలలో “హలో, ఎలా ఉన్నారు?” అని రమణ గారి గొంతుక కూడా వినడం కూడా నా జన్మలో మొట్టమొదటి సారి. వెను వెంటనే ఇంకా భయం, భయంగా, నెర్వస్ గా  నేను కుర్చీకూడా ఎక్కేసి పోన్ లో మాట్లాడడం కూడా నా జన్మలో మొదటి సారే!

కాస్సేపు “హలో, కులాసా” కబుర్లు చెప్పుకున్నాక, నా పూర్తి పేరు అడిగి తెలుసుకున్న రమణ గారు “ఈ పేరు ఎక్కడో విన్నానే?” అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నక్కకీ, నాకలోకానికీ కనెక్షన్ ఎక్కడా అనుకుంటూ.

“మీరు ఎప్పుడైనా మీరు వ్రాసిన నాటకాలు నాకు పంపించారా?” అడిగారు ముళ్ళపూడి గారు. అప్పటికి నేను ఏడో, ఎనిమిదో నాటకాలు వ్రాసినా అవి ఆయనకి ఎప్పుడూ పంపించ లేదు. కానీ ఆ క్షణంలో నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే, 1967 లో నేను వ్రాసిన నా మొట్టమొదటి నాటకం “బామ్మాయణం అను సీతా కల్యాణం” హైదరాబాదులో మా బావ గారు చదివి, ఈ సరదా నాటకం ముళ్ళపూడి రమణకి పంపించి అభిప్రాయం వాయమని అడుగుదాం” అన్నారు. మా బావ గారు..అంటే నండూరి వెంకట సూర్యనారాయణ మూర్తి (సీనియర్ అడ్వొకేట్, హైదరాబాద్)  మద్రాసు కేసరి హైస్కూల్లో బాపు-రమణల సహాధ్యాయి. బహుశా మా బావ గారు నిజంగానే నా నాటకాన్ని ముళ్ళపూడి గారికి పంపించి ఉంటారని అప్పుడు తెలిసింది. ఎప్పడో ఇరవై ఏళ్ళ నా నాటకం మీకు ఎలా గ్నాపకం ఉంది గురువు గారూ అంటే, “నాటకం కాదు, నీ పేరు ఫన్నీగా ఉంది, పైగా ఆ తర్వాత కూడా అక్కడా, ఇక్కడా నీ పేరు చూశాను, అందుకూ” అన్నారు రమణ గారు. మొత్తానికి రమణ గారు మా “మధుర వాణి” కి రాయక పోయినా, బాపు గారు ఒక అద్భ్హుతమైన ముఖ చిత్రమూ, పతాక శీర్షికా పంపించారు. నాకు తెలిసీ అమెరికా సావనీర్ల కి బాపు గారు బొమ్మ వెయ్యడం అదే మొదటి సారి.

సుమారు 35 ఏళ్ల క్రితం నా నాటకాలు పంపించి నన్ను పరోక్షంగా ముళ్ళపూడి గారికి పరిచయం చేసిన మా పెద్ద బావ గారు నండూరి వెంకట సూర్య నారాయణ మూర్తి గారు క్రిందటి నెల . 26, మే 2018 నాడు దివంగతులయ్యారు.  చిన్ననాటి స్నేహితులైన బాపు -రమణలని కలుసుకున్నారు.

రమణ గారి అసలు పేరు వెంకట్రావ్ అని అందరికీ తెలుసు. కానీ నాకు ఎలా తెలిసిందీ అంటే, నేను ఒక సారి ఇండియా వెళ్ళినప్పుడు నా “పుణ్య క్షేత్రాల యాత్ర” లో భాగంగా మద్రాసులో బాపు గారి ఇంటికి వెళ్ళాను. తన ట్రేడ్ మార్క్ నవ్వుతో మమ్మల్ని లోపలికి ఆహ్వానించి సోఫాలో కూచోబెట్టి,  బాపు గారు ఫోన్ తీసుకుని డయల్ చేసి “వెంకట్రావ్, ఆయనొచ్చారు” అన్నారు. బాపు గారితో మాట్లాడదామని వస్తే, ఈ వెంకట్రావ్ గోల ఏమిటీ” అని నేను వెర్రి మొహం పెడదామని అనుకుంటూ ఉండగానే, మూడు నిముషాలలో సదరు వెంకట్రావ్ గారు “పైనించి దిగి వచ్చారు”. ఆయనే ముళ్ళపూడి వెంకట రమణ గారు అని తెలియగానే….నా గుండె మరింత స్పీడుగా కొట్టుకుంది. ఆనందం రెట్టింపు అయింది. ముళ్ళపూడి గారు పై అంతస్థులోనూ, బాపు గారు క్రిందా ఉంటారనీ తెలుసు, దానికి కారణాలూ తెలుసు. కానీ, ప్రత్యక్షంగా చూడడం అదే మొదటి సారి.  ఆ రోజు ముగ్గురం చాలా సేపు అమెరికా విషయాలూ, ఆంధ్ర్రా విషయాలు మాట్లాడుకున్నాం.

ఆ తరువాత కొన్నేళ్ళ తరువాత నేను ఆయనకి ఎందుకో అమెరికా నుంచి ఫోన్ చెయ్యగానే, ” ఎలా ఉన్నారు వారధి  గారూ అన్నారు” ఆయన.

“నా పేరు సారధి కాదు సార్, వంగూరి….అంటూ ఉండగా

“సారధి కాదయ్యా, నువ్వే కదా అసలు వారధివి” అన్నారు ముళ్ళపూడి గారు.

“అయితే నన్ను కోతి మూకలో చేర్చారన్న మాట” అని నేను చమత్కరించినప్పుడు, ముళ్ళపూడి గారు చిరునవ్వు నవ్వుతూ “వారధి అంటే తమిళ్ నాడుకీ శ్రీలంకకీ కాదయ్యా…..నీది సాహిత్య వారధి. దానికి రాళ్ళూ, రప్పలూ అక్కర్లేదు. అమెరికా కథలు ఇక్కడ ప్రచురించి, సినిమా తారలు కాకపోయినా ఇక్కడి రచయితలని అక్కడికి పిలిచి మీరు అమెరికాకీ ఇండియాకీ వారధి కడుతున్నారు కదా, అందుకూ? అన్నారు ముళ్ళపూడి గారు. ” అన్నారు. ఈ జన్మకి నా ఆ గుర్తింపు చాలు.

1996 లో బాపు గారు హ్యూస్టన్ వచ్చినప్పుడు తను వేసిన ముఫై తిరుప్పావై రంగుల బొమ్మలు నాకు ఇచ్చి, “ఇవి శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రుల వారి కోరిక మీద, ఆయన రచించిన తెలుగు తిరుప్పావై ముఫై ఫాశురాలలో, ప్రతీ ప్రాశురానికీ ఒక్కొక్క వాక్యం స్పూర్తిగా ఈ బొమ్మలు వేశాను. అనుకోకుండా ఆయన పోయారు. కానీ ఈ బొమ్మలతో, ఆయన వ్రాసిన తిరుప్పావై మీ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా ప్రచురించగలరా” అని అడిగారు. ఆయన మాట శిరసా వహించి, ఆ “తిరుప్పావై” పుస్తకాన్ని 1998 లో మేము నిర్వహించిన “మొట్ట మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు”లో విడుదల చేశాం. ఆ తిరుప్పావై పుస్తకానికి ముళ్ళపూడి వారు అద్భుతమైన ఎనిమిది పేజీల పరిచయ వాక్యాలు వ్రాశారు. అది చదవానే నేను ఆనందం, ఆవేశం పట్టలేక ఆయనకి ఫోన్ చేసి “చాలా గొప్పగా వ్రాశారు గురువు గారూ” అని ప్రశంసించబోతుంటే, ముళ్ళపూడి గారు “అది వ్రాయడానికి ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసయ్యా. పది, పదిహేను మంది పండితులని మా ఇంటికి పిలిచి, కాఫీలూ, టిఫిన్లూ ఇచ్చి, ఈ సబ్జెక్టు మీద మాట్లాడించేసి,  నోట్సు రాసేసుకుని, కాపీ కొట్టేశాను” అన్నారు. ముళ్ళపూడి గారి లాంటి నిజమైన గొప్పవాళ్ళు తమ గొప్పతనాన్ని కూడా ఇతరులకే ఆపాదిస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏ మాటే చెప్పుకోవాలి. ఆ పుస్తకం ముద్రణ అస్సలు బాగా రాలేదు కాబట్టి బాపు గారి చేత సుతారంగా చివాట్లు కూడా తిన్నాను.

2006 లో మా అనుబంధం ఇంకా బలపడింది. ఆ ఏడు నా మొట్టమొదటి పుస్తకం “అమెరికామెడీ కథలు” జూలై లో ప్రచురించాం. ఆ పుస్తకం ప్రచురిద్దాం అని అనుకున్న అర క్షణంలో బాపు గారినీ, రమణ గారినీ ముచ్చటగా మూడు కారణాలకి పిలిచాను. మొదటిది, ఆ పుస్తకం వారిద్దరికీ అంకితం ఇవ్వడానికి వారి అనుమతి పొందడానికి. రెండోది బాపు గారిని ముఖచిత్రం వెయ్యమని అర్ధించడానికి. మూడోది ఆ పుస్తకానికి ముందు మాట వ్రాయమని విన్నవించుకోడానికీ.

అన్నీ విని రమణ గారు “బిల్లు ఎంతా?” అన్నారు, “అంకితానికి ఎంతా? ముందు మాటకి ఎంతవుద్దీ? బాపు బొమ్మకెంతవుద్దీ, అన్నీ కలిపి హోల్ సేల్ కి ఎంతా? కన్సెషన్ ఏమన్నా ఉందా” అనే పధ్ధతిలో.

అయన ఏ దృష్టితో అన్నారో నాకేం తెలుసూ. అందు చేత “ఏమో, గురువు గారూ, మొత్తం పుస్తకం వెయ్యడానికి లక్ష రూపాయలు అవుతుందేమో?” అన్నారు.

“అది కాదయ్యా, మేము అంకితం పుచ్చుకుంటే, నీ కెంత ఇవ్వాలీ అని నా కొశ్చెను. ఏదైనా పుచ్చుకున్నప్పుడు ప్రతిఫలం ఇవ్వాలి కదా”  అని చమత్కరించారు రమణ గారు.

కానీ, ఏ విధమైన ప్రతి ఫలమూ అడక్కుండా, ఆశించకుండా, కేవలం నా మీద అభిమానం కొద్దీ ముళ్ళపూడి రమణ గారు అధ్భుతమైన ముందు మాట రాసిచ్చారు. దాన్ని బాపు గారు స్వదస్తూరీతో వ్రాసి పంపించారు. అందులో కొంత భాగం ఈ క్రింద యదాతధంగా మీ ముందు ఉంచుతున్నాం.

బాపు గారి బొమ్మా, రమణ గారి ముందు మాటా అందే ముందు మూడు నాలుగు వారాలూ ఎలాంటి బొమ్మ వేస్తారా, ఎలాంటి ముందు మాట వ్రాస్తారా అని అంతుపట్టని కుతూహలంతో, ఉత్కంఠతో ప్రాణాలు ఉగ్గబట్టుకున్న నాకు బాపు-రమణలు నిజంగానే నా కథలకి ప్రాణపతిష్ట చేసి, రచయితగా నా ప్రతిష్టని శిఖరాగ్రాన్న నిలబెట్టారు. ఆ కథల పుస్తకం తెలుగు నాట పదిహేను నగరాలలోనూ, మద్రాసులో మాలతీ చందూర్ గారి చేతా ఆవిష్కరించబడిన ప్రతీ చోటా, అందరూ నా కథల కంటే  బాపు-రమణల రాత-గీతల యోగ్యతా పత్రల గురించే  ఎక్కువ మాట్లాడుకున్నారు. అది నాకు ఒక రిలీఫ్ గా ఉండి, మహా సంతోషాన్ని కలిగించింది.

అంతటి అభిమానాన్ని నామీద చూపించిన వారికి ఎన్ని జన్మలు ఋణపడి ఉంటానో ఆ అప్పారావుకే తెలియాలి. ఎందుకంటే, అప్పుల అప్పారావు ఒక ప్రధాన పాత్రగా నేను వ్రాసిన “యమ సభ” నాటకాన్ని ఎప్పుడు, ఎక్కడ చదివారో నాకు తెలియదు కానీ, ఏదో మాటల సందర్భంలో ముళ్ళపూడి గారు “ఆ అప్పారావు వేషం నువ్వే వేశావా?” అని అడిగారు.

“అవును సార్, ఏం బావుండదా?” అన్నాను భయం, భయంగా. “అబ్బే, నీ బాడీ లాంగ్వేజ్ అప్పారావు కేరక్టర్ కి బానే ఉంటుంది” అన్నారు ఆ మహానుభావులు.

అదే విధంగా, నాకు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి తెచ్చి పెట్టిన “అసలు ప్రశ్న” అనే నాటకం బాపు-రమణలకి వీడియో పంపించాను, కానీ వారు నిజంగా అది చూస్తారని అని నేను అనుకోలేదు. కానీ, మనం అనుకోనివి అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. “మీ నాటకం చాలా నిజాయితీగా ఉంది” అనే వారి అభిప్రాయం అందుకోవడం ఒకటి. ఎందుకంటే ఆ నాటకం చూసిన వేలాది మంది అభిప్రాయం “చాలా హాస్యంగా ఉంది, ఒక అమెరికా సామాజిక సమస్యని తెరమీదకి తెచ్చారు, అందరూ బాగా నటించారూ…” మొదలైన తరహాలో ఉంటే బాపు-రమణల ఈ అభిప్రాయం నన్ను చాలా ఆశ్చర్య పరిచింది. దానికి కారణాలు తరవాత అడిగి తెలుసుకున్నాను అనుకోండి. అది వేరే విషయం. ఆ నాటకంలో అన్ని నిజాయితీ అంశాలు నేను వ్రాసినట్టు నాకే తెలియదు.

ఆ ఏడు..అంటే 2006 అక్టోబర్ లో హ్యూస్టన్ లో జరిగిన “ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” కు బాపు-రమణ లని ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారికి జీవిత సాఫల్య పురస్కారం బహూకరిద్దామని మా ఆలోచన. ఆ సదస్సు అంశం “సాహిత్యంలో హాస్యం”. సభలూ, సత్కారాలూ బొత్తిగా వారికి కిట్టవనీ, ఇది నేను మామూలుగా ఫోన్ లో పిలిస్తే “ఇదేదో అర్రీ బుర్రీ గా తేలే యవ్వారం” కాదు కాబట్టి, స్వయంగా మద్రాసులో వారింటికి వెళ్ళి వారిద్దరినీ “బతిమాలుకుంటే” మా కోరిక తీరే అవకాశం కొంతైనా ఉంటుందనీ, వారింటికి వెళ్ళాను. ఏ కళని ఉన్నారో బాపు గారు “నువ్వు పిలుస్తున్నావు కాబట్టి సరే” అన్నారు. రమణ గారు మటుకు “నువ్వు నన్ను ఎత్తుకుని మొయ్యగలవా అన్నారు?” నవ్వుతూ.

“అదేమిటి సార్” అన్నాను విషయం అర్ధం కాక.

“అదేలే, మీ అమెరికా ఇళ్ళలో గెస్ట్ బెడ్ రూములు ఎక్కడో రెండో అంతస్థులో ఉంటాయి. నేనేమో ఆ మెట్లు ఎక్క లేను. ఒక వేళ నువ్వు కష్టపడినా, నాతో బాటు నువ్వు కూడా కింద పడతావు. ఎందుకూ అంత ఇది” అంటూ రమణ గారు రాలేనన్నారు.

ఆ సదస్సులో జరిగిన గొప్ప విషయం బాపు గారి స్పందన. బాపు గారు సభలలో ఎప్పుడూ మాట్లాడరు. ఎందుకంటే, తనకి “సభాకంపం, జన గండం” ఉందని సభాముఖంగా ప్రకటించి, “అందాల రాముడు రాజ్ బాబు అన్నట్టు నాకు తెలుగే రాదు, సంస్కృతం నిల్లు. అందు చేత నాకేం తోచక ఇద్దరి తరఫునా -సాహిత్యం అంటే మైత్రి ఉంది కదా ఏదైనా చెబితే రాసుకుని చదువుతాను అని రమణ గారిని అడిగాను” అని ముళ్ళపూడి గారు వ్రాసి ఇచ్చిన ప్రసంగ వ్యాసాన్ని డా. పప్పు వేణుగోపాల రావు చేత చదివించారు. అది వింటూ ఉంటే రమణ గారు రాకపోయినా వచ్చి అక్కడే కూచుని నవ్వుతున్నట్టు మేం అందరం తెగ ఫీలయిపోయాం.

2006 లోనే నా జీవితంలోనూ, బాపు-రమణల జీవితంలోనూ, ఆ మాటకొస్తే తెలుగు సాహిత్య చరిత్రలోనూ మరొక అపురూపమైన సంఘటన జరిగింది. ఇది ఏ కోశాన్నా అతిశయోక్తి కాదు. నా “అహంభావం” అంతకన్నా కాదు. వారం రోజుల పాటు అప్పుడు వెలువడిన ఏ తెలుగు వార్తా పత్రిక చూసినా, ఏ టీవీ చానెల్ చూసినా ఈ వార్తే పతాక శీర్షిక.

ఆ సంవత్సరం ఆఖరి రోజు, (డిశంబర్ 31, 2006), మరియు మరుసటి సంవత్సరం మొదటి రోజు (జనవరి 1, 2007) తేదీలలో మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు హైదరాబాదులో జరిగింది.  “తెలుగు భాషా చరిత్రలో నవ చైత్యానికి నాంది పలికిన సభలు” అనీ, “బాపు -రమణలు మైత్రీ బంధానికే మారు పేరు. వారి స్నేహబంధానికి అరవై ఏళ్ళు నిండిన షష్టి పూర్తి గురించి మనం మర్చిపోయాం. కానీ వంగూరి ఫౌండేషన్ వారు మర్చిపోలేదు. ఈ అపురూప సంబంధాన్ని పురస్కరించుకుని, వారిద్దరినీ దంపతీ సమేతంగా సత్కరించారు. తెలుగు చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టం” అని ఈ టీవీ వారు తమ ప్రత్యేక ప్రసారంలో వ్యాఖ్యానిస్తూ, 30 నిముషాల ప్రత్యేక ప్రసారం చేశారు.

ఆ సదస్సులో ప్రత్యేక అతిథులుగా బాపు గారు, ఆయన సతీమణి భాగ్యమతి గారు, ముళ్ళపూడి గారు, ఆయన సతీమణి శ్రీదేవి గారు రెండు రోజులూ పూర్తిగా పాల్గొన్నారు. నాకు తెలిసినంత వరకూ వారు నలుగురూ ఒకే వేదిక పైన కనపడడం అదే మొట్టమొదటి సారి.

ఈ చారిత్రాత్మక సదస్సు పూర్తి విశేషాలూ, ఈటీవీ వారి పూర్తి ప్రసారం కౌముది సంచిక లోనే http://koumudi.net/vanguri/psadassu_sum_up.htm” అనే లింకులో చూడవచ్చు. ఇవన్నీ “వివిధ సదస్సుల చిత్ర మాలికలు” అనే కౌముది విభాగంలొ ఉంటాయి. అందులో డా. సి. నారాయణ రెడ్డి గారి ప్రసంగం అందరూ విని తీరవలసిందే!

రమణ గారి కోరిక మీద ఆ సదస్సులోనే రచన సాయి గారు ప్రచురించిన బాపు గారి బొమ్మలతో ” ముళ్ళపూడి వెంకట రమణ బొమ్మల కథలు” అనే 500 పేజీల అపురూపమైన బృహత్ గ్రంధాన్నీ, ముళ్ళపూడి వారి “రమణీయ భాగవత కథలు” పుస్తకం ఆవిష్కరించబడ్డాయి.

ఆ మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకి పరాకాష్టగా బాపు-రమణ లకి జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించాం. సంస్థ మొదలు పెట్టిన 13 ఏళ్లలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఇచ్చిన మొట్ట మొదటి పురస్కారాలు అవే. సత్కారం అనగానే ఆమడ దూరం పారిపోయే బాపు -రమణలు సతీ సమేతంగా మా సత్కారం అందుకోవడం ఒక చారిత్రాత్మక సంఘటన. ఇప్పటికీ…అంటే పదేళ్ళ క్రితం జరిగిన ఆ సదస్సుకి ప్రత్యేకంగా అన్వర్ వేసిన బాపు -రమణ ల కేరికేచర్ బొమ్మలనే అన్ని టీవీ చానెల్స్ వారూ వాడుతున్నారు.

ఈ అపురూప సన్మానానికి వారి ప్రతిస్పందిన లో బాపు గారు యధాప్రకారం నమస్కారం మాత్రమే పెట్టగా, రమణ గారు మాట్లాడుతూ “ఈ అరవై ఏళ్ళ ప్రయాణంలో నాకు అర్ధమయిందేమిటంటే, ఇదేమీ మేమిద్దరం చిన్నప్పుడే కాంట్రాక్ట్ రాసుకుని స్నేహితులుగా ఉందామని అనుకోలేదు. స్నేహ బంధం నిలబడాలంటే, కొన్ని ధరించాలి. మరి కొన్ని భరించాలి. ఇదొక అలంకారం. అదొక అలంకారం. ఆ రెండూ కలిసి ఉన్నదే మంచి స్నేహం.” అని మంచి స్నేహాన్నీ, భార్యా భర్తల సంబంధాన్ని కూడా నిర్వచించారు.

మరొక విశేషం ఏమిటంటే, సదస్సు పూర్తి అయిన మద్రాసు వెనక్కి వెళ్ళిన తరువాత మాకు ముళ్ళపూడి వారి దగ్గరనుంచి ఐదు వేల రూపాయలకు చెక్కు వచ్చింది. నేను ఆశ్చర్య పోయి, ఇదేమిటీ, ఏదైనా పొరపాటు జరిగిందా అని నేను వెంఠనే ఆయనకి ఫోన్ చేశాను.

“అదా! మేమందరం నీ ఆతిధ్యంలో రెండు రోజుల పైగా పెద్ద హొటెల్ లో ఉన్నాం కదా. ఆ రెండు రోజులూ మా అబ్బాయి వరా (సినీ దర్శకుడు) మాతో ఉండడానికి వచ్చి, మాతో కలిసి భోజనం చేశాడు. వాడి ఖర్చు మీరు పెట్టుకోకూడదు కదా! అందుకూ ఆ ఐదు వేలూనూ. తక్కువైతే చెప్పండి” అన్నారు.

నేను గుండెలు బాదేసుకుని, “మీ అబ్బాయి మా అబ్బాయి కాదా” అనే సెంటిమెంటల్ డైలాగులు కూడా చెప్పి ఎంత బతిమాలినా ఆయన చెక్కు వెనక్కి తీసుకోడానికి ఒప్పు కోలేదు. పైగా “కావాలంటే, మా పోలిసీ గురించి ఫలానా ప్రొడ్యూసర్ని అడుగు. నేను పనిచేసిన అతని సినిమాకి పంపించిన పారితోషికంలో అది గమనించి, పాతిక వేలు వెనక్కి ఇచ్చేశాను. ఎందుకంటే, ఆ సినిమా టైములో నా సిగరెట్ల ఖర్చు అతను ఎందుకు పెట్టుకోవాలీ? అది నా పెర్సనల్ ఖర్చు కదా?” అని వివరణ కూడా ఇచ్చారు రమణ గారు. ఒక గొప్ప మనిషి వ్యక్తిత్వానికి అది ఉదాహరణ.

ఆ నాటి సదస్సు పూర్తి అవగానే బాపు గారు నన్ను పక్కకి పిలిచి “ఈ 2006 సంవత్సరం అంతా వంగూరి వారిదే. థేంక్యూ ” అన్నారు. “డిటో” అన్నారు రమణ గారు.

ఆ సంవత్సరమే నేను ఎందుకో కాలిఫోర్నియాలో ముళ్ళపూడి వారి అమ్మాయి అనూ ఉండే ఊరు వెళ్ళాను. ఏదో మాటల సందర్భంలో ఆ మాట రమణ గారికి చెప్పానేమో నాకు గుర్తు లేదు కానీ, ఆ అమ్మాయీ, ఆమె భర్తా పిల్లలతో సహా నేను ఉన్న చోటికి వచ్చారు నన్ను చూడ్డానికి. నేను కొంచెం ఆశ్చర్య పోయి నేను మీ కెలా తెలుసూ అని అడిగాను. “మా నాన్న గారు మీరు ఇక్కడికి వస్తున్నారని చెప్పి , మిమ్మల్ని కలుసుకోమని చెప్పారు” అని సమాధానం చెప్పింది ఆ అమ్మాయి అనూ. రమణ గారి ఆత్మీయతకి ఇది ఒక ఉదాహరణ.

2010 లో ఒక సారి మద్రాసు వెళ్ళినప్పుడు నేనూ, గొల్లపూడి మారుతీ రావు గారూ రమణ గారింట్లో బాపు గారితో సహా నాలుగు గంటలు హాయి, హాయిగా కబుర్లు చెప్పుకున్నాం. ఆ రోజు ఆయన అటు స్టీవెన్ స్పైల్ బర్గ్ గురించి, అమితాబ్ బచ్చన్ గురించే కాకుండా “మనకున్న ఒకే ఒక్క డైరెక్టర్ కె. వి. రెడ్డి గారు”..గురించీ చాలా అభిప్రాయాలు చెప్పారు. అదే ముళ్ళపూడి వెంకట్రావ్ గారిని ఆఖరి సారి చూడ్డం.  ఎన్ని సార్లు కలుసుకున్నా ఆయనతో ఎడా పెడా ఫోటోలు తీయించుకునే సెల్ ఫోన్లు లేని అవకాశాలు లేని రోజులు అవి. పైగా ఆ ఇద్దరూ అలాంటివి అంత ఇష్టపడే వారు కాదు.

మహానుభావులకి జయంతులే కానీ వర్ధంతులు ఉండవు. అందుకే ఇప్పుడూ, ఎప్పుడూ ముళ్ళపూడి వెంకట రమణ అనబడే వెంకట్రావ్ గారు మనందరి మనస్సుల్లోనూ అనుక్షణం మెదులుతూనే ఉంటారు.

*

 

 

 

 

వంగూరి చిట్టెన్ రాజు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అవునండి చిట్టెన్ రాజు గారూ! బాపూ రమణలు ఎప్పుడూ మనందరి మనస్సుల్లో మెదులుతూనే ఉంటారు.

    మైత్రీ బంధానికే మారు పేరు అయిన బాపూ రమణలతో మీకున్న అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు తాంక్స్ వాయ్.

    ( అన్నట్టు అప్పుడెప్పుడో హలొ గురూ ఓ ఫైవ్ ఉంటె సర్ధవా అని నేనడిగితే నోరుజారి సరేనన్నారు గుర్తుందా? నేనా సదవకాశాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోలేదు గుర్తెట్టుకోoడి )

    • మీ స్పందనకి ధన్య వాదాలు.
      అన్నట్టు ఏదో పరధ్యానంలో ఉండి మీ హలో కులాసా కి హలాగే అనేసి ఉంటాను. ముళ్ళపూడి వారు ముత్యాల ముగ్గు లో చెప్పినట్టు “ఒక సోట డ్యూటీ ఎయ్యవు కదా. ఎంత మందిని అని గుర్తెట్టు కోను?”

    • స్పందించి నందుకు ధన్యవాదాలు మీకూ…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు