పొప్పుచారు నా లొప్పుచారులాగుంది. నీయ్యవ్వా ఇంతకన్నా బాగా వొండుడు రాదాసేయ్ … నాయన అమ్మ మీద ఇసుక్కుంటన్నాడు.
మా అయ్యగారమ్మగారు పొప్పుచారు తింటే పజ్జెనిమిది రోజులు ఆ రుసి నాలిక మీదే ఉంటది. ఆయమ్మ ఇంట్లో తిరగమాత సుయ్యిమని మోగిందంటే కడుపులో ఆకలి గయ్యిమని బండకుక్కలాగా లెగిచి మొరుగుద్ది. నీయ్యవ్వ… నువ్వూ ఉండావు…నాయన ఇంకా అమ్మను యకసెక్కాలు ఆడతన్నాడు.
నాయనకు ఎదురుగ్గా కూకోని బొడ్డు గిన్నెలో ఏసిన అన్నం పెల్లను పొప్పుచారులో నలుసుకుంటా అమ్మదిక్కు చూశాను. మాయమ్మకు యగతాలంటే బో కోపం. ఒగిటో సారి నవ్వుద్ది. రొండోసారి కస్సుమని లేసుద్ది.
ఆడ్నే తినకపోయావా… నాకాడికి ఎందుకు వొచ్చావు? మీ అయ్యగారమ్మగారికాడ్నే పొడుకో. నాయింటి గడప తొక్కావంటే సూడు…. ముంతంత సుట్టిల్లు ఇచ్చేడు మీ బాబు. ఇందులో తిరగమాతలే ఎయ్యనా తిర్నాల్లో గెంతనా? తిరగమాతంట తిరగమాత…. చిన్నుల్లిబాయలు ఉండయ్యా, పెదుల్లిబాయలు ఉండయ్యా, తిరగమాత దినుసుల డబ్బా కొన్నావా, పొసుపు కొమ్ములు పండిత్తన్నావా… ఆకిరికి ఇంటిముంగల కరేపాకు చెట్టైనా నాటుకుందావంటే ఒక దడీ లేదూ దమ్మిడీ లేదు. పోయిన వానల్లో రొండు టమాటా మొక్కలు నాటుకున్నా… బాడవకు పోయే ఆసావుల బరిగొడ్డు మూడో రోజే మేసేసి పొయ్యినయ్యి. ఆడమడిసి కాలుమడుసుకుందావంటే కనీసకం ఒక తాటాకుల దొడ్డైనా ఉందా? సీకటి పడ్డాక చెంబట్టుకుని డొంకకు పోతే మొగనాబట్టలు బీడీలు కాల్చుకుంటా అదే దారెమ్మటి కావాల్సికుని నడుత్తా నాటకాలు దెంగుతారు. గొద్ది గొద్దికీ లేచి నిల్సోవాలి. నీయసుంటి పాలేరు బతుక్కి తిరగమాత గావాలా తిరగమాత ? కనీసం నీ పెద్ద కొడుకును చూసైనా సిగ్గు రాదా? ఇంట్లో మార్కాపరం నాపరాళ్ళేపిచ్చేడు. పెళ్ళాం కోసం లెట్రూం కట్టేడు… నువ్వూ వుండావు.. కంచం నిండా తిని మంచం నిండా పొనుకోడానికి… అనుకుంటా వాయింపుడు మొదులు పెట్టింది.
… అమ్మ నోటెంట ఈ వజాన యల్లటూరు లాకులు తెరుసుకోగానే నాయన కుస్సు కుస్సూమంటా నవ్వుకుంటా పళ్ళెం కాలీజేసి గాబుదెగ్గిరికి పోయి కడిగి పంచలో గిరాట్నూకాడు. బయట దండెం మీద ఏసిన కండవా దులుపుకుని తలగుడ్డ సుట్టుకుని , అట్టాగే పొరంబోయేటట్టు నవ్వుకుంటా ఆసావుల ఇళ్ళ దిక్కు పోయేడు.
యారా అటిక తలకాయి నాబట్టా… నీగ్గూడా తిరగమాత కావాల్నా ఈపిమీద అని నా దిక్కు తిరిగి అడిగింది మాయమ్మ.
మ్మో…. నేనేం అడగలా.. నాయన మింద కోపం నామింద సూపిత్తావేందీ? నే బడికిపోవాల.. తాలు… అనుకుంటా బువ్వ తినుడు పూర్తిజేసి బొక్కుల సంచి సంకకి తగిలిచ్చుకుని రయ్యిమని బయటపడ్డాను.
ఆ దినం బళ్ళో మ్యాక్స్ క్లాసు జరగతా వుంది. బయట రోడ్డు మీద మా పల్లెలో అన్నాయోళ్ళు సైకిళ్ళు ఏసుకుని పెదపాలెం పొన్నూరుకు మజ్జ తిరగతానే ఉండటం పదో క్ల్యాసులో కూకున్న నాకు అగపడతానే ఉంది. పల్లెలో ఏదో జరిగిందని తెలుత్తానే ఉంది. యావై ఉంటందీ…? ఔటాబెల్లు కొట్టాడు గుడ్డి నాగయ్య. మా పల్లెలో మడిసే ఆయన. వరసకి నాకు బాబాయి అవుతాడు.
బాబాయ్… యావయ్యిందీ పాట్లో? ఆన్నాయోళ్ళు ఎందుకు తిరగతన్నారూ .. అని అడిగేను.
పెతాపోళ్ళ తాత బెంజిమీను ఇరోజనాలయ్యి సచ్చిపోయేడంట అబ్బాయ్.. అన్నాయోళ్ళు సమాది పన్లు చూత్తన్నారు.. అని కబురు చెప్పేడు.
మా పాట్లో ఎవురన్నా సచ్చిపోతే మా అన్నాయోళ్ళు అందరూ కలిసి మట్టి చేసే బాజ్జత తీసుకుంటారు… అందుకేనన్నమాట ఇయ్యాల అడావిడి.
బడయ్యిపోయాక సంచి తగిలిచ్చుకుని ఇంటికి పోయాను. ఇంటిముందు జానన్న, సాలుగాడోళ్ళ పెద్దన్న సంసోనూ, పెతాపన్నా నిలబడి మా కెనడన్నాయితో మాట్టాడతన్నారు.
ఏదో వొకిటి నువ్వే చెయ్యి. పొద్దుటినుంచి రొండుమాట్లు పొన్నూరు పోయొచ్చేరు మనోళ్ళు. రాను పదీ, పోను పదీ మైళ్ళూ. సమాది పెట్టెల గాబ్రేలు పెళ్ళికి పోయేడంట. కొట్టు మూసుకుని ఉండాది. ఇరోజ్జనాలు అయ్యిన పీనిగ… వాసన గొడతంది. పాద్దిరిగోరు గూడా బోడిపాలెం నుంచి వొచ్చేడు. తొందరగా మట్టిజెయ్యాలి. యాదో ఒగిటి నువ్వే చెయ్యాలి… ప్రెతాపన్న గోజాడతా ఉండాడు.
అది సరేరా… వడ్రంగం అంటే అన్నిపన్లూ ఒకిడికే రావు. దోరబందాలూ, నిట్టాళ్ళూ, కిటికీలూ తలుపులూ చేసే పని నాది. ఈ సామాది పెట్టెలూ, గోతులూ నాకు రావు మావా.. నా పని గెట్టి చెక్కతో ఉంటది…. ఈ కిరసనాయిలు చెక్కతో పెట్టెలు చెయ్యటం మనతో కాదు…. కెనడన్నాయి ఇవరం చెబుతున్నాడు.
అరేయ్…. ఈ పాలికి ఎట్టాగో నువ్వే సూడాలి. ఆజాం సాయిబు కాడ మనోళ్ళు కాళీ యాప్లీసు కాయల పెట్టెలు ఎనిమిది కొనుక్కొచ్చేరు. ఇంకా కవాలంటే చెప్పు.. బిరాన కసుకూరు పోయి దెంకొత్తాం.. పెట్టి మటికి నువ్వే చెయ్యాలి.. కావాలంటే కూలి తీసుకో… సంసోను అన్నాయి తేల్చి పార్నూకేడు.
అరే నీయమ్మా సంసోనుగో…. కూలీ మాటెందుకు ఎత్తుతావురా? నా కొడకా నెవరగంతలకు పెట్టి ఒక్కటి నూకానంటే తెల్లారిదాకా బొబ్బుంటావు.. అదిగాదు ప్రెతాపు మావా ఇదివరికి ఈ పెట్టెలు నేనెప్పుడూ చెయ్యలేదు. ఎవుడి పని ఆడికి ఉంటదిగందా.. ఈ పెట్టెలు చేసే పని నాదిగాదు… కెనడన్నాయి ఇంకా సర్ది చెప్పబోయేడు.
అరేయ్ కెండీగా.. పాట్లో ఇప్పుటిమటికి అన్నీ కలిసే చేసేము. సావైనా పెళ్ళైనా…. నీపెళ్ళికి రొండుబండ్ల పేళ్ళు పగలేసేను. రోడ్డు పక్కన చింతచెట్లు రేత్రికి రేత్రి ఎవుడికీ అగపడకుండగా కొట్టుకొచ్చి మీ ఇంటిముందు దించేను. అవిసిరం వొచ్చింది.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడురా.. పాట్లో ఉండా కట్టుబాటుమీదైనా కాత్తి గవురం సూపెట్టు. రేపు మీ అయ్య సావడా, అమ్మ సావదా? … ప్రెతాపన్న నిష్టూరం పోయేడు.
కెండన్నకాడ ఇంక మాట్టాడటానికి మిగల్లేదు…. కాసేపు బుర్రగోక్కుని .. సరేలే మావా…సావు మాటలు ఎందుకూ…. ఎట్టాగో కానిద్దాంలే… యాప్లీసు పెట్టెలు మా ఇంటెనక గొందిలో పెట్టిపిచ్చు… మాటేల నాలుగ్గెంటలకు పెట్టి రడీ అవ్వుద్ది. అరే సంసోనుగో.. నువ్వూ, మన జిక్కీసుగోడూ వొచ్చి దెంకపోండి అనేసి ఇంటోకి నడిచాడు. బోషాణం తెరిచి చిన్న రంపం, ఉలీ, బాడిశ, చిత్రిక బేటికి తీసి ఇంటెనక గొందిలోకి పోయి కూకుని నన్ను కేకేసేడు.
సంటీ.. ఉరుక్కుంటా పోయి సేసిగిర్రావు కొట్లో అరంగుళం మేకులు పది రూపాయలూ, చెపుల మేకులు పది రూపాయలూ కొనుక్కురాపో… చెప్పుల మేకులు.. నల్లరంగు మేకులు అని చెప్పు. ఇదుగో డొబ్బులు.. ఒక్క దౌడులో రావాలి అని నా చేతిలో ఇరవై రూపాయలు పెట్టాడు.
మా కెండన్నకు పోయిన యాడాది పెళ్ళైయ్యింది. మా వొదినది చింతలపూడి మాలిపిల్లి. మాయన్న ఏడో క్ల్యాసు దాకా సదివి మా మేనమావ మండ్రు జెక్కరయ్య దెగ్గిర వడ్రంగం నేర్సుకున్నాడు. మా సుట్టుపక్కల కంసాలోళ్ళు ల్యాకపోయే తలికి జెక్కరయ్య మావే వూళ్ళో పెద్ద మేస్త్రీ. ఆయన కింద చిన్న మేస్త్రీ మా కెండన్న. ఆరేడు నెల్లమిట్టి మావకి సూపు ఆనటం లేదని అన్ని పన్లూ కెండన్నే వొప్పుకుని ఎట్టాగో లాక్కొత్తన్నాడు. వూళ్ళో ఇల్లు కట్టినా,సావిడి లేపినా , కొట్టాం , కంచే బాగు చేసినా మాయన్నన్ని పిలిపిచ్చి పనులు చేపిచ్చుకుంటారు. పొరుగూరి ఆసావుల ఇళ్ళల్లో పనైతే సామాను తీసకపోయి ఆడ్నే వారం పదిరోజులు ఉండి ఆళ్ళకి కావాల్సిన దర్వాజా, పీటా, పొప్పుగుత్తీ, సల్లకం చేసిత్తాడు. మాయన్న పనితనం తెలిసి మా ప్యారీషు పాద్దిరిగోరు చింతలపూడి సంబందం తీసుకొచ్చేడు. మాయన్నాయోళ్ల అత్తగారు రొండున్నర ఎకరాల యగసాయం వున్న కలిగిన కుటంబం. పెళ్ళి రోజు ఆళ్ళు పంపిన యార్నాలు ఇప్పుటుమటికి మా పాట్లో యమా హవిలైటు అని మా సలాదులూ, సంగపెద్దలూ అంటావుండేది.
మాయన్నకి పెళ్ళై ఆర్నెల్లైనా కాకతలికే అత్తా కోడళ్ళ మజ్జ చిన్నా చితకా మాటలు చూసి మా నాయన ఏరు కాపరం పెట్టిచ్చాడు. మా ఇంటి ముంగలే పోరంబోకలో వుంకో సుట్టు గుడిసె ఏసుకుని మాయన్నాయోళ్ళు కాపరం వుంటన్నారు.
అన్నాయిగోడు ఇచ్చిన డొబ్బులు జేబులోనుంచి జారిపోకుండా సొక్కా జోబును ఒక అరిచేత్తో పట్టుకుని సిలపర్లు లపా లపా కొట్టుకుంటా క్వాంటింటికి ఒక్క దౌడు తీశా. సెట్టిగోరూ.. మేకులు గావాలా… పద్రూపాలు అరంగుళం, పద్రూపాలు చెప్పుల మేకులు… అని యగసోసా దిగసోసా పడుకుంటా చెప్పా. చెప్పుల మేకులు ఎందుకబయా… మీరు మాదిగోళ్ళు కాదుగదా అని అడిగేడు సేసగిర్రావు. అందుగ్గాదు.. బెంజిమీను తాత సచ్చిపోయినాడు కదా… సామాదిపెట్టి చెయ్యటానికి.. అని చెప్పాను. అదేందీ… సమాధిపెట్టి పొన్నూరు నుంచి తీసకరాలేదా.. మీయన్న చెయ్యిటం ఏందీ అని అడిగేడు. పొన్నూరు సమాది పెట్టిల కొట్టాయన పెళ్ళికి పోయాడంట.. పెట్టి చేసేవోళ్ళు లేరు… అందుకని మాయన్న చేత్తన్నాడు అని ఇవరాలు చెప్పి సెట్టిగోరు ఇచ్చిన మేకుల పొట్లాలు బద్రంగా పొట్టుకుని మళ్ళీ ఎనక్కి లగెత్తాను.
(మావూళ్ళో మాలపిల్లీ, మాదిగపిల్లీ కలిసే ఉంటాయి. కానీ వూరూ పాడూ మజ్జన పెద్దచెరువు ఉంటది. వూళ్ళల్లో తోలు పనులన్నీ మాదిగోళ్ళ పాలి. మాలోళ్ళకి ఒక పనంటూ ల్యాకపోయింది. అందుకే అనుకుంటా మా ఇళ్ళల్లో వైద్దికం చేసే నాటు మందుల యంకటేసు నుండి, సన్నాయి వూదే ఏల్పూరి పిన్నీసు దాకా అన్ని పన్లూ చేసే జనాలు ఉంటారు.)
అనుకున్న టయానికి పెట్టి రడీ చేసి సంసోను అన్నాయోళ్ళ చేతికి అప్పజెప్పేడు. ఆయాల పొద్దుగూకేతలికి బెంజిమీను తాత మాయన్న చేతిమీద తయారైన పెట్టిలో పొడుకుని వొనుకుల దిక్కుకు పోయేడు.
ఆ తెల్లారి ఎప్పుటికిమల్లేనే సామాను సంచి తీసుకుని రాయపాటోళ్ల బజాట్లో దోరబందాలు చెయ్యటానికి పోయిన మాయన్న అర్దగెంటలో ఎనక్కి తిరిగి వొచ్చేడు. అనుకున్నా టయువుకి పనికి ఒప్పుకున్నాచోట కలప రాకపోయినా, ఇల్లుగల్లా ఆసావులకు ఏదైనా అరిజెంటు పనిబడినా ఆరోజుకు మాయన్నాయి ఇంటికాడే ఉంటాడు. అట్టాంటిదే ఏదో అయి వుంటదిలేమని మా వొదిన అన్నాయికి పంచలో మంచం ఏసి కాగెత్తుకుని నీళ్ళకోసం చిన్నచెరువుకు పోయింది. మా వొదిన లేనిది చూసి మాయమ్మ అన్నాయిగోడికి ఒకరవ్వ కాపీ పోసి ఇచ్చింది. అన్నాయూ, నేను పక్క పక్కనే కూకోని కాపీ సప్పరిత్తా వుండాం.
ఇయ్యాల పన్లేదా పెద్దా , కలప రాలేదా.. అని అడిగింది మాయమ్మ.
పనుందిమా.. కలపగూడా మొన్ననే వొచ్చింది.
మరేంది.. వొంట్లో బాగోలేదా .. ఈయాలప్పుడు మంచలో పొడుకున్నావేందీ … అమ్మ రెట్టిచ్చింది.
యావో.. ఆ రాయపాటి అరిబాబు పని వొదిలెయ్యమని చెప్పాడు. … కూతురి ఇంటి కట్టుపని నేను చెయ్యగూడదంటా.
ఎందుకూ.. చెంగుతో అన్నాయికి ఇసరతా అడిగింది అమ్మ
సావు పన్లు చేసిన చేతుల్తో సుపకార్యాలు చెయ్యగూడదంటా.. అన్నాయిగోడు మనాది పడతా అసలు కత చెప్పేడు.
ఆళ్ళ మొకం…. రొండ్రోజులు పనాగిపోతే దేక్కుంటా వత్తారు నీకాడికే. మాయమ్మ సవదాయిచ్చింది.
ఈ ప్రెతాపుగోడోళ్లకి చెబుతానే వుండా… ఎవుడి పని ఆడికి ఉంటదిరా నాయాలకాన్లారా అని… ఈనాకొడుకులు ఇంటేగదా.. సంసోనుగోడు ఇటేపు రానీ.. గూదజార తంతా నాకొడుకుని …. కోపంలో చెమటులు పోత్తన్నాయి అన్నాయికి. ఈలోపు మా వొదిన కాగు మోసుకుంటా వొచ్చింది.
అమ్మా కొడుకులేదో కూటాలు పెట్టినట్టున్నారే… యాందత్తమ్మా… యాంది కతా… వొదినెమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటా మాయమ్మని సరసవాడింది.
మారే…. కాకాణి కూటాలు పెట్టుకుంటన్నాం… వొచ్చి సందాపట్టు… చింతలపూడి గోరోజనం బాగానే వుంది… పెడసరంగా అనేసి లేవబోయింది మాయమ్మ.
వాయబ్బో… మీ తాడిగిరోళ్లకన్నా ఎక్కువా…. యాడికి పోతన్నావ్… కూకో తల్లా… మెత్తాళ్ళూ వంకాయ వొండా… వుండు వుడుకుడుకు అన్నం ఏసుకొత్తా… రొండు ముద్దలు తినిపో.. కొడుకింట్లో తింటే నీ రోసం రోట్లో పచ్చడి కాదులే… పకపకా నవ్వుకుంటా కాగు తీసుకుని లోపలికి పోయింది మా వొదిన.
తెల్లారి వీర్రాగవయ్య ఇంటికి పనికి పోయేడు అన్నాయి. ఆడగూడా అదే మాట చెప్పారు. వూళ్ళో సావులూ, దినాలకు ఏదన్నా పనుంటే పిలుత్తాం.. ఇళ్ళకూ , గుడికీ ఏరే వూరినుంచి కంసాలాయన్ని పిలిపిచ్చుకుంటాం అని చెప్పేసేరు. మా పాట్లోగూడా ఎవురూ అన్నాయి చేత ఇంటి పనిముట్లు చేపిచ్చుకోటం లేదు. నెలకి పాతిక రోజులు పనిలో నలిగే కెండన్నాయ్ ఇప్పుడు పంచలో పొడుకునే ఉంటన్నాడు.
ఆళ్ళ అత్తగోరికి ఈ కతంతా తెలిసి అయినకాడికే తిందాం చింతలపూడి కాపరం మార్చుకొమ్మని వొచ్చి చెప్పేరు. వుండా యగసాయం చేసుకుంటే బతకలేకపోతావా అని సవదాయిచ్చబోయేరు. ఇంతబతుకు బతికి ఇల్లరికం పోటం నామర్దా అనుకున్నాడో ఏవో.. కెండన్నాయి రానని ఆళ్ళకి చెప్పేసేడు. మా వొదినగూడా ఏరే ఏదో ఒక పని దొరక్కపోదా. ఈడ్నే ఉంటాం అని ఆళ్ళ నాయనకి చెప్పింది.
చిన్నప్పుటాలమిట్టి కూలీ పనులు ఎరగడు కెండన్నాయి. పన్నెండూ పద్నాలుగూ వొచ్చేతలికే వండ్రంగం నేర్చుకున్నాడు. మా నాయన గూడా పెద్ద కొడుకుతో కావిడి నీళ్ళైనా మోపిచ్చిన పాపన పోలా. పజ్జెనిమిదో యాట పెళ్ళి చేసేసి అన్నాయి బతుకు తీరింది అనుకున్నాడు. అంతా బెమ్మాండంగా జరుగుతా ఉండా రోజుల్లో ఇసుమంటి కష్టిం వొచ్చుద్దని ఎవురూ అనుకోలా.
వుండావూళ్ళో ఇంటి పనులు ఇయ్యటం మానేశారు. వూళ్ళో ఒకటీ అరా పీనిగ లేసినా ఆళ్ళు కాలబెడతారు. పూడ్సిపెట్టే ఆశారం మా మాలా మాదిగ పల్లెల్లోనే ఉంది. సమాదిపెట్టి అవసరమూ మాకే ఉంది. అట్టాగని రోజూ ఎవుడో ఒకిడు సావాలని ఎట్టా అనుకోడం?. రొన్నెల్ల తరవాత పొన్నూరులోనన్నా ఏదన్నా వడ్రంగం పని దురుకుతుందేవో అని ఎతకడం మొదులుపెట్టేడు.
మేయ్… ఎస్తేరా… పొన్నూరులో గాబ్రేలు సామాది పెట్టెల కొట్లో పని దొరికింది. రోజూ పొద్దునే పోయి ఆడే కూకోవాలి. సుట్టుపక్కల పల్లెలో మనోళ్ళ పీనిగలేత్తే పెట్టి కోసం జనాలు గాబ్రేలు కాడికే వత్తారు. పెట్టికి మూడొందలు ఇత్తానన్నాడు. రోజూ రాటం పోటం యాతన నాకు. ఆడ్నే యాడన్నా ఒక గది అద్దికి తీసుకుని కాపరం పెడదాం….
కెండన్నాయ్ చెప్పుకుంటా పోతన్నాడు. మాయమ్మ, వొదినా దిగులుగా ఇంటా ఉండారు.
ఆ శనివారం నాయన కుటంబ పార్దన పెట్టి పాద్దిరిగోరిచేత ఆసిర్వాదం ఇప్పిచ్చి అన్నాయోళ్ళని నాటు బండిలో పొన్నూరులో దించి వొచ్చేడు.
యండల్లో నేను పది రాసి పొస్టు క్ల్యాసులో ప్యాసయ్యాను. ఆ యాడాది జీతం వొడ్లతోపాటు సౌదరిగారి పేరు చెప్పి గుడ్లమూట అరవయ్య కాడ నాకోసం గ్యాబర్డీను ప్యాంటూ, స్పీడు సొక్కా గుడ్డలు తెచ్చి పొన్నూరు యాక్సు టైలర్ దెగ్గిర కుట్టిచ్చాడు. ప్యాంటూ సొక్కా ఏసుకుని పీబీఎన్ కాలేజీలో ఇంటరు ఎచ్చీసీ గ్రూపులో చేరి సదూకోటం మొదులుపెట్టేను.
మొదుట్లో రోజూ మా వూరి ఆర్టీసీ బొసెక్కి కాలేజీకి పోయి వచ్చేవోడిని.కానీ రోజూ రానూపోనూ పన్నెండు రూపాయల కర్సు లెక్కలేసేతలికి మాయమ్మ గుడ్లు ఎల్లికిలబెట్టింది. జీతానికి వొడ్లు అమ్మి సైకిలు కొనమని మా నాయనకు రోజూ ముంతపొగ ఏసీ ఏసీ సగం ఏడు అయ్యేతలికి సెకిండు హ్యాండు ర్యాలీ సైకిలు కొనిచ్చేదాకా నిద్దర పోలేదు. ఆ సైకిలు ఏసుకుని చైన్లో ప్యాంటు ఇరుక్కోకుండా తొక్కటం నా సదువుకన్నా పెద్ద కష్టంగా అనిపిచ్చింది. రోజూ ఇంటికి వొచ్చేతలికి కాళ్ల దెగ్గిర ఆయిలు మరకలు….., రొండ్రోజులకి ఒకసారి కుట్లు పిగిలి కాలి అంచులు యాలకిలబడేయి.
ఆదోరం మాసం కోస్తే ఒక కువ్వ ఎక్కువ తీసుకుని ఆవగిలబెట్టి టిపినీలో అన్నాయిగోడికోసం సోవారం పొద్దున్నే పంపిచ్చేది మాయమ్మ. దాన్ని తీసుకోటానికి వచ్చిన అన్నాయిగోడు నా ప్యాంటుకు అంటిన ఆయిల్ మరకలు చూసి … అబ్బాయి సంటీ.. నువ్వుకాలేజీకి పో… సైకిలు నాకియ్యి… అని చెప్పి సైకిలు ఏసుకు పోయేడు. సాయంత్రం మా క్లాసులు ఎయిపోయి నేను కాలేజీ గేటుకాడ ఎదురు చూత్తా వున్నాను. దూరం నుండి అన్నాయిగోడు రాటం కనబడింది.
సైకిలు మొత్తం వోవరాయిలింగ్ చేసి కొత్త గేరుకేసు బిగిచ్చి ఉంది.
ఇప్పుడు మెత్తగా ఉందబ్బాయ్ సైకిలు… ప్యాంటుగూడా చైన్లో పడదు… అప్పుడప్పుడు చైన్లో, బ్రేకులకూ కొబ్బిరి నూనె యెయ్యి…. ఇంటికి జాగర్తగా పో…. అని సైకిలు అప్పగిచ్చి వెళ్ళిపోయాడు.
ఇంటర్ పరీక్షలు అయ్యీ అవ్వకతలికే మా సావాసగాళ్ళంతా టీటీసీ ( టీచర్ ట్రెయినింగ్ సర్టిఫికెట్) కోసం అప్లికేషన్లు పెట్టుకుంటన్నారు.
ఇప్పుడు బీయ్యే సదివీ, ఆతరాత బీయ్యీడీ, ఎమ్మే చేసేతలికి ముడ్డి కింద ముపైయ్యేళ్ళు వొస్తాయి. ఉజ్జాగం వొచ్చిద్దీ అనే గ్యారెంటీ లేదు. అదే గనక టీటీసీ ప్యాసైతే రొండేళ్ళలో డీఎస్సీ రాస్తే ఎస్జీటీ ఉజ్జోగం కొట్టొచ్చు. పైగా డీఎస్సీ ఒకటీ రొండేళ్ళకు పడతానే ఉంటది. ఒకేడు కాకపోయిన రొండో ఏడు జాబ్ కొట్టొచ్చు…. మా వోళ్ళు ఇట్టా డిస్కషనింగ్ చేసుకుంటూ వుంటే నాగ్గూడా ఆశ పుట్టింది.
అందరితో పాటు నేను కూడా టీటీసీ అప్లికేషన్ పెట్టాను. ఎంట్రాన్సు పరీక్ష కోసం యాడ్నన్నా కోచింగ్ తీసుకోవాలి అని సావు కపురు సల్లగా చెప్పారు మా సావాసగాళ్ళు. ఆ సోవారం అమ్మ పంపిచ్చిన నత్తలగోంగూర కూర టిపినీ తీసుకెల్లడానికి వొచ్చిన కెండన్నాయికి ఈ సంగతి చెప్పాను. అయ్యకాడ అన్ని డబ్బులు ఉండవు అని ఇద్దరికీ తెలుసు. అన్నాయి దిక్కు చూసుకుంటా నిలబడ్డాను.
అబ్బాయ్… నువ్వు మటికి బొక్కులు తెరిచి సదూతా వుండు. ఏదో ఒకిటి చేద్దాం అని అన్నాయి దైర్న్యం చెప్పేడు.
సరిజ్జిగా ఆ శనివారం మళ్ళీ అన్నాయొచ్చేడు.
డూపాంట్ ఫర్నీచర్ సామాన్ల కంపెనీ పెడతన్నారు హైద్రాబాదులో. గాబ్రేలోళ్ళ అల్లుడు ఆడ్నే చేరేడు. దర్వాజాలూ, కిటికీలూ, డైనింగ్ టేబుళ్ళు ఇసుమంటి వస్తువులు చెయ్యాలి. చానా మంది మేస్త్రీలు కావాలంటా.. నాగ్గూడా పని దొరికింది. మొదట్లో నెలకు పన్నెండేలు… పెంచుతారంటా… ఎగస్ట్రా పని చేత్తే ఎగష్ట్రా ఇస్తారంటా… సోవారం రమ్మన్నారు. గాబ్రేలు కాడ అయిదు వేలు అప్పు తీసుకున్నాను. తీసకపోయి ఆ కోచింగుకు కట్టు. వొదిన్ని చింతలపూడి పంపిత్తన్నా. హైద్రాబాదులో రూము దొరికితే తీసకపోతా. నాయనకి చెప్పు… నాకు ఇష్టమైన పని… ఈ సమాది పెట్టెలు చేసే యాతనన్నా తప్పుద్ది…..
డబ్బులు జేబులో పెడతా కెండన్నాయి చెప్పుకుంటా పోతన్నాడు.
ఆదివారం చెరుకుపల్లి పోయి కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టాను. కోచింగ్ ఇంటర్ పరీక్షలు అయిపోయిన తరవాత సోవారం మొదులు అని చెప్పారు.
ఆడకీ ఈడకీ తిరక్కుండా ఇంట్లో కూకోనీ, సావాసగాళ్ల రూముల్లో కూకోనీ ఇంటర్ పరీక్షలు బెమ్మాండంగా రాశాను. సంచీ బొక్కులూ సర్దుకుని చెరుకుపల్లిలో కాదర్ ఖాన్ ఆసిపత్రిలో వాడాయి ఉజ్జాగం చేత్తన్న మా రాణత్త ఇంటికి పోయాను. రాణత్త మాయమ్మ తరుపున చినతాత ఆఖరి కోడలు. మా సేకర్ మాయ్య భార్య. రొండు గదుల ఇల్లు. అయినా మా రాణత్తకు మాయమ్మ అంటే పేణం. ఎప్పుడు పోయినా మాయమ్మని అమ్మా అమ్మా అనుకుంటా పలకరిచ్చుద్ది.
సంటీ… నువ్వేం దిగులు పడమాక. ఎట్టాగో సర్దుకో…. సీటు మటికి కొట్టాల్సిందే … అని తేల్చి చెప్పింది.
రోజూ పొద్దున్నే డూటీకి పోయే ముందు వుడుకుడుకు అన్నం పెట్టి, మజ్జానానికి బాక్సు కట్టి ఇచ్చుద్ది. టీ యావన్నా తాగు అనుకుంటా పది రూపాయలు జేబులో పెట్టేది.
కోచింగ్ సరిజ్జిగా నెల రోజులు. టెంట్ల కింద రొండొందల కుర్చీలు ఏసి మైకులో సార్లు క్లాసులు చెబుతారు. క్లాసులంటే కాలేజీ క్లాసులాగా కాదు. ఒక కొచ్చన్ పేపర్ ఇచ్చి దాన్లో ప్రశ్నలకు ఒక్కొక్కటిగా వివరణ ఇస్తారు. మొత్తం క్రిస్ఠమస్ పండగ రోజు మా చర్చీలెక్క ఉంటది. వొచ్చేవోడూ పోయేవోడూ తెరిపి ఉండదు. ఒకడి గోల పట్టిచ్చుకోకుండా ఐయిదు వేల ఫీజుకోసం అన్నాయిగోడు వూరు మారిన సంగతీ, రాణత్త చాలెంజీ, అన్నిటికన్నా ఎక్కువ మాయమ్మ…. తిరగమాత ఏసుకోటానికి కరేపాకు చెట్టైనా నాటుకోలేని ఆతల్లి పేదరికం.. ఇయ్యన్నీ ఎప్పుడూ నా తలకాయలో తిరగతానే ఉంటాయి.
ఎంట్రన్స్ రిజ్సల్ట్స్ వొచ్చాయి… ఎనభై మూడో ర్యాంకు… కౌన్సిలింగుకు రమ్మని గుంటూరు పిలిచారు. బోయపాలెం గవుర్నమెంటు డైట్ కాలేజీలో సీటు వొచ్చింది. మా రాణత్త గుప్పిడు పంచదార తెచ్చి నా నోట్లో పోసింది.
అబ్బాయ్… ఇట్టాగే సదవాల. ఉజ్జోగం కూడా కొట్టాల….. శాంతీ, రమేషుల్ని కూడా నీకుమల్లే సదవమని చెప్పు… పిల్లల్ని చూపిచ్చి అంది రాణత్త.
గవుర్నమెంటు కాలేజీ, హాస్టలు ఒకే చోట.. దూరం పోవాల్సిన పనిలేదు. తిండికీ టికానాకూ డోకా లేదు. అప్పుడప్పుడూ నాయనా అమ్మా వొచ్చి చూసి పోయేవోళ్ళు. వొచ్చేటప్పుడు కోడిమాసం కూరా, కొబ్బిరన్నం వొండుకు తెచ్చి నాకూ మా సావాసగాళ్ళకీ తినిపిచ్చి పోయేవోళ్ళు.
ఒకసారి సెకండు సాటర్ డే రోజు అట్టాగే కోడిగుడ్ల కూరా, పొప్పు చారు, వొరన్నం వొండుకుని వొచ్చింది. మాయందర్నీ ఆస్టల్ బయట గడ్డిలో కూకోబెట్టి ఇస్తరాకుల్లో వొడ్డిచ్చింది.
పొప్పుచారు ఎట్టాగుంది రాంబాబూ అని మా పొరుగూరి పొంతులుగారి అబ్బాయిని అడిగింది. ఆంటీ… పొప్పు బాగుంది … పస్సుపు పొప్పు మీద కర్వేపాకు ఆకులు తేలాడతా వుంటే ఆ వాసనకే ఆకలి రెపరెపలాడతది … తాలింపు భలే వుంది ఆంటీ అన్నాడు. అందరూ తిన్నాక యావనుకుందో మాయమ్మ, సంచినుంచి ఈరుబ్బాని బయటకు తీసి… అబ్బాయ్… పోయిన తడవ వొచ్చినప్పుడు ఒగిటే తలకాయ గోక్కుంటన్నావు… పేలు పడ్డట్టుండాయి… దా ఈరుత్తా … అని నా జుట్టు పొట్టుకుని లాగింది.
మా సావాసగాళ్లంతా ఒకిటే నవ్వులు. నాకు యమా ఇన్సాల్టింగ్ అయ్యింది. ఇదిలిచ్చి కొడదాం అనుకున్నా… మాయమ్మ మొకంలోకి చూశా.. పాపం… అదే అమాయకం…. అదే రోషం…
సరేలే… ఏ నాయాలు యావనుకుంటే నాకేంది… మాయమ్మకన్నా ఎక్కువా అనుకుని ఆడ్నే గడ్డిలో మాయమ్మ వొళ్ళో తలకాయ పెట్టి పొడుకున్నా..
మాయమ్మ మెల్లిగా, నెప్పి తక్కువగా ఉంటేటట్టు జుట్టు ఈరుత్తుంది
అవా… తిరగమాతకు కరేపాకు యాడ్నుంచి వొచ్చిందీ అని అడిగాను.
మాయమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటా..
అబ్బాయ్.. నిన్న మాటేల కూలికెల్లి వత్తంటే చీకటి పడింది. దార్లో లచ్చుమ్మగారి దొడ్లోనుంచి కరేపాకు కొమ్మలు బాటమీదకి పెరిగినయ్యి… ఎవురూ సూడకుండా ఎగిరి రొండు రెమ్మలు దూసుకుని తెచ్చుకున్నా…. అని చెప్పింది మురుసుకుంటా…
మాయమ్మ వొళ్ళో తలకాయ పెట్టి పైకి చూశా… తెల్లటి మబ్బుల్లో కరేపాకు అడివి కనబడింది.
***
ఇట్టా రొండేళ్ళు గిర్రన తిరిగిపోయాయి. కాలేజీ చదువూ అయిపోయింది. నా ఆలోచన్లలో ఎంతోమార్పు వచ్చింది. దానితోపాటే నా భాష, ఆశలూ,గమ్యాలూ క్రమంగా ఒక రూపానికి వచ్చాయి. మార్చిలో నా పరీక్షలు అయిపోయాయి. ఏప్రిల్ లో రిజల్స్ వస్తాయి అని ఎదురు చూస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది.
ఆ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు.. నవంబర్ లో ఎన్నికల తేదీలు ప్రకటించారు. అప్పటికి నాలుగు ఏళ్ళుగా డీ ఎస్సీ రిక్రూట్మెంట్ లేకుండా వందల ఖాళీలను నింపకుండా నెట్టుకొస్తున్న ప్రభుత్వం హఠాత్తుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం మూడువేల ఎనిమిది వందల పోస్టులు. అందులో రెండువేల ఒకవంద సెకెండ్రీ గ్రేడ్ టీచర్ పోస్టులు.. ఎస్జీటీ.
అన్నీ అమ్ముకుదొబ్బుతారు వాళ్ళు. ఇంతకాలం పెట్టిన ఖర్చుకు తోడు ఎన్నికల ఖర్చు కూడా ఈ రిక్రూట్మెంట్ తో వసూల్ చేసుకుంటారు. పోస్టుకు అయిదు లక్షలు అంటున్నారు…. రాంబాబు చెప్పాడు. నాలో భయం, నిరాశ తొంగి చూశాయి. పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూనే వున్నాను కానీ గుండెల్లో ఒకటే భయం. అయిదు లక్షలు నేను ఎక్కడినుండి తేగలను? పోరంబోకులో వేసుకున్న చిన్న ఇల్లు మినహా ఏ ఆస్తీ లేని వాళ్ళం.
నా దిగులంతా గమనిస్తూ ఉందనుకుంటా మాయమ్మ.
ఏందబ్బాయ్… గుబులు గుబులుగా ఉండావూ? ఏందో చెప్పు…. అడిగింది మాయమ్మ
అమా… ఉజ్జాగానికి అయిదు లక్షలు అడుగుతున్నారంటా.. రాంబాబూ, జగదీషూ … అంతా డొబ్బులు రడీ చేసుకుంటన్నారు…. చెప్పాను మాయమ్మకు.
చాలా సేపు ఆలోచిస్తూ కూర్చుంది మాయమ్మ..
అబ్బాయ్… మొత్తం ఎన్ని ఉజ్జాగాలు ఉండయ్యి?
దెగ్గిర దెగ్గిర నాలుగు వేలు…
అన్నీ అమ్మకానికి పెడతారా?…
కాదులే… సగమైనా అమ్ముకు దొబ్బుతారు…
నీకు ఎన్ని ఉజ్జోగాలు కావాలీ… ఒకిటేగా?.. ఒక్క వుజ్జోగమే ఉంది అనుకుని సదువు…. ఆ వొక్కటీ నీదే అనుకుని సదువు…. నరికేసి నావైపు చూసింది.
ఆయాడాది రిక్రూట్మెంట్ డ్రైవ్ లో జిల్లా తొమ్మిదో ర్యాంకు నాది.
ఈంటర్వ్యూ , పోస్టింగ్ అయ్యి ఉద్యోగంలో చేరి ఆర్నెల్లు అయినా తిరక్కముందే ఎలక్షన్లు వొచ్చేశాయి. గుంటూరు పక్కన తురకపాలెంలో నా ఫస్ట్ పోస్టింగ్. గుంటూరు నుండి సర్వీసు ఆటోలు తిరుగూ ఉంటాయి కాబట్టి గుంటూరులోనే ఉంటే సరిపోతుంది అని అందరూ చెప్పారు. అందుకే గది అద్దెకు తీసుకుని గుంటూర్లోనే ఉంటన్నా.
ఎలక్షన్ డ్యూటీ వేశారు. ఓరియంటేషన్ కోసం జిల్లా ఎస్పీ ఆఫీసుకు పిలిచారు. రోజంతా డ్యూటీ ఎలా చెయ్యాలీ, జాగ్రత్తలూ ఏమేం తీసుకోవాలీ, ఈవీయెం ఎలా ఆన్ చెయ్యాలి, ఎలా ఆఫ్ చెయ్యాలి… ఇలాంటి వివరాలన్నీ నేర్పించి సరంజామా చేతికి ఇచ్చి బయట మాకోసం ఎదురు చూస్తున్న రూట్ బస్సులు ఎక్కమన్నారు. నా డ్యూటీ తెనాలి పక్కన పిడపర్తి అగ్రహారం. నాతోపాటు ఇంకో ఇద్దరు టీచర్లకు కలిపి ఒక పోలింగ్ బూత్ ఇచ్చారు. అందరం కొత్తవాళ్ళమే.
సాయంత్రం అయిదూ అయిదున్నర వేళకు పిడపర్తి అగ్రహారం చేరుకున్నాం. అక్కడే స్కూల్లో మా బస. మేం ఇద్దరం మగ టీచర్స్. మాతో పాటు ఒక లేడీ టీచర్ కూడా ఉంది. విజయలక్ష్మీ. నా బ్యాచ్చే. పోస్టింగ్ మా మండల హెడ్ క్వార్టర్స్ నల్లపాడులో. మా స్కూలుకు మూడూన్నర కిలోమీటర్లు. మా ఇద్దరికీ స్కూల్లోనే ఏర్పాట్లు చేసి ఆమెను తమ ఇంట్లో ఉండమని ఆహ్వానించారు వూళ్ళోని వీ ఆర్ వో. నాతో ఉన్న మరో సార్ పేరు జంగయ్య.
స్నానాలూ, అవీ చేసి కాస్త తీరికగా కూర్చునే సమయానికి క్యారియర్లలో భోజనం పంపారు వీ ఆర్ వో గారు. క్యారియర్లు తీసుకు వచ్చే మనిషితో పాటు వచ్చింది విజయలక్ష్మీ మేడం కూడా. అందరం కలిసి తింటూ రేపటి డ్యూటీ గురించి మాట్లాడుకోవచ్చు అని వచ్చాను సార్… అంది.
భోజనం వడ్డించాడు ఆ వూరి మనిషి. హోటల్ కాకుండా బయట మగమనిషి వడ్డిస్తే తినడం అదే మొదటిసారి. భోజనం చాలా రుచిగా ఉంది. ముందు పిసరంత పులిహోరా, ముద్దపప్పు వడ్డించారు. అది తినేసే సరికి తెల్లటి వరి అన్నం, అందులోకి టమాటా పప్పు, బీరకాయా శనగపప్పు కూరా, అప్పడాలు… వీటన్నిటి పక్కన పచ్చటి రంగులో ఏదో పచ్చడి. నాకు పచ్చడి అంటే చిరాకు. అయినా కాస్త టేస్ట్ చేద్దాం అని వేలితో ఇంత తీసుకుని నాలుక మీద వేసుకున్నాను. కమ్మటి వాసనతో భలే రుచిగా ఉంది. ఇదేం పచ్చడి అని అడిగాను. వడ్డించే మనిషి పేరు తెలియక తికమక పడటం చూసి విజయలక్ష్మీ మేడం కూడా రుచి చూసి దోసకాయ పచ్చడి సార్ అన్నది. దోసకాయ పచ్చడి ఇదివరకు చాలా సార్లు తిన్నాను మేడం… కానీ ఇంత రుచిగా ఎప్పుడూ లేదు అన్నాను..
సార్ పచ్చడి చేసే పద్దతి ఇంపార్టెంట్. దానికి వాడే రోలూ రోకలీ కూడా ఇంపార్టెంట్ అన్నది మేడం.
అదేంటి మేడం పచ్చడి రుచి చేసే పదార్ధాల మీద కదా ఆధారపడేది… రోలూ రోకలిబండా మధ్యలో ఎందుకు వచ్చాయి… అడిగాను.
సార్… ఈ పచ్చడి చెయ్యడానికి వాడింది కర్వేపాకు బండ…. రహశ్యం చెప్పింది.
నాకేం అర్ధం కలేదు. అదేంటి మేడం… కర్వేపాకు ఆకులు వేస్తారేమో.. కానీ కర్వేపాకు బండ ఏమీటీ… అని అడిగాను.
సార్ కర్వేపాకు చెట్టు బాగా ఎదిగి ముదిరాకా దాని కాండంతో రోకలి బండ తయారు చేస్తారు. దానితో పచ్చళ్ళు నూరితే దాని సువాసనా, రుచీ ప్రతీ పచ్చడికీ పడుతుంది. అందుకే రోటి పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి అని చెపింది.
అంటే చెట్టును నరికి రోకలిబండ చేస్తారా… అడిగాను
అవునండీ బాబూ.. చెట్టును అలానే వుంచి బండ ఎలా చేస్తారూ అని గట్టిగా నవ్వేసింది. నాకు మొదట నవ్వు వచ్చినా , తరవాత మెల్లగ ఎందుకో మనసంతా విషాదం కమ్ముకుంది.
ఎలక్షన్ డ్యూటీ ముగించి సరంజామా నోడల్ ఆఫీసులో జమ చేసి మూడో రోజు మధ్యాహ్నానికి ఇల్లు చేరాను.
“ఇల్లు చేరారా మాస్టారూ ”
కొత్తగా కొనుక్కున్న మొబైల్ ఫోనుకు విజయలక్ష్మి మేడం నుండి మెసేజ్ వచ్చింది.
“చేరాను మేడం! మీరు క్షేమంగా చేరారా?”
“చేరాను సార్… ”
“ఇంకా…? ”
“మీరే చెప్పాలి ”
మీకెప్పుడైనా రోటి పచ్చడి కావాలంటే చెప్పండి… నేను తెస్తాను. రోటి పచ్చళ్ళు చెయ్యడంలో మనది అందె కాకపోయినా కనీశం బ్రాస్లెట్ వేసిన చెయ్యి”
“హహ… థాంక్ యూ మాడం”
“నన్ను విజయ అని పిలవవచ్చు ”
“మీరు కూడా ”
“ఏంటీ … మిమ్మల్ని విజయ అని పిలవమంటారా?”
“హహహ ”
ఆ మధ్య న్యూ యియర్ రోజు విజయ వాళ్ళ ఇంటికి బోజనానికి పిలిచింది. బోజనాల తరవాత ఫ్యామిలీ ఆల్బం చూయిస్తుంటే ఒక చోట ఆగిపోయాను.
బోరుగడ్డ శాంతయ్య… ఈయన ఫోటో మీ ఆల్బంలో ఉందేంటీ? మీ చుట్టమా…. అడిగాను
ఈయన మా పెదనాన్న.. పెదపాలెంలో ఉంటారు. మీకెలా తెలుసు?
మాదీ పెదపాలెమే. శాంతయ్య మా చెర్చీ సంఘపెద్ద..
అవును. చిన్నప్పుడు వేసవి శలవుల్లో మేం పెదపాలెం వచ్చేవాళ్ళం. పెద్దమ్మ పోయాక మళ్ళీ వెళ్ళలేదు.
తరవాత పెదపాలెం గురించీ, మా వూరి చెరువు గురించీ, వరిపొలాల గురించీ చాలా సేపు మాట్లాడుకున్నాం. వాళ్ళ అమ్మా నాయనా టీచర్లుగా రిటైర్ అయ్యారు. నల్లపాడులోనే ఇల్లుకట్టుకుని స్థిరపడిపోయారు. ఇద్దరు కొడుకుల తరవాత విజయలక్ష్మి ఒక్కతే కూతురు.
***
మా స్కూలు ఎనిమిది వందల గజాల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం రెండు పక్కా బిల్డింగ్స్. హెడ్మాస్టర్ గది, నాలుగూ అయిదూ తరగతుల గదులూ కలిపి ఒక బిల్డింగ్. దానికి సరిగ్గా మరోవైపు ఒకటి నుండి మూడు తరగతుల గదులు ఉన్న మరో బిల్డింగ్. మధ్యలో ఆటల మైదానం, కాస్త ఖాళీ ప్రదేశం ఉంటాయి. నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పటికి ఆ ఖాళీ ప్రదేశం నిండా పిచ్చిమొక్కలు, జిల్లేడు చెట్లూ ఉన్నాయి.
మొదటి నాలుగునెలలూ కొత్త ఉద్యోగం, కొత్త వూరూ, స్కూలు పిల్లలూ, సహోద్యోగులూ అనుకుంటా చాల సరదాగా గడిచింది. నెలాఖరు రోజున జీతం బ్యాంక్ అకౌంటులో పడుతూనే ఫోన్లో మెసేజ్ అలర్ట్ రావడం ఎంత సంతోషమో. ఆ మెసేజును అలాగే చూస్తూ ఎంతసేపు కూర్చునే వాడినో. ఆ మెసేజ్ లో కనబడే ప్రతీ అంకెలో నా జీవితం కనబడేది. 1 నిటారుగా నిలబడ్డ మాయమ్మను గుర్తు చేసేది. 2 మాయమ్మను యగతాళి చేసుకుంటూ కుస్సూ కుస్సున దగ్గే మా నాయన్ని గుర్తుకు చేసేది. 3 మా రాణత్త నవ్వును గుర్తుకుచేస్తే 4 నా గాలిపటాల తోకను గుర్తు చేసేది…
బహుశా అది ఆరోనెల అనుకుంటా… ఋతుపవనాల కదలిక చురుకుగా ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఆ యాడాది వానలు జాస్తిగా పడతన్నాయి. స్కూలు ఆవరణంలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి పొదల్లా తయారయ్యాయి. అప్పుడప్పుడూ ఒకటీ అరా పాం పిల్లలు వాటిల్లో కనబడిన కారణాన పిల్లలు బయట ఆడుకోడానికి కూడా భయపడుతున్నారు. మా హెడ్మాస్టారు సుబ్బారాయుడు గారు. పిల్లల్ని బయటకు పోనివ్వవద్దని అందరికీ స్ట్రిక్ట్ హెచ్చరిక ఇచ్చారు. ఎవరికి ఏమైనా చివరకు బాధ్యత టీచర్ల మీదకే వస్తుంది. వూరంతా ఏకమై మనల్నే నిందిస్తారు అని ఆయన హిత బోధ చేశాడు.
సరే ఎన్నిరోజులు పాములకు భయపడి పిల్లల్ని తరగతి గదుల్లో కూర్చోబెడతాము అని వూళ్ళో కనబడిన నలుగురు ఐదుగురు కుర్రాళ్ళను సాయం అడిగి గొడ్డలీ, పారా తెచ్చి ఆ పొదల్ని సాఫీ చేశాను. పొదలన్నీ మట్టం అయ్యి ఇప్పుడు మా గ్రౌండ్ క్షేమంగానే వున్నా వానల దాటికి మళ్ళీ పదీ పదిహేను రోజుల్లో పొదలు గుబురు అవుతాయి. అప్పుడెలా అని అడిగారు మా హెడ్మాస్టారు.
సార్… ఆ పొదల ప్లేసులో ఏదైనా స్కూల్ గార్డెన్ లాంటిది పెంచుదాం.. రోజూ అందులో కాసేపు పనిచెయ్యడం పిల్లలకు కూడా నేర్పుదాం. స్కూల్ గార్డెన్ కాన్సెప్ట్ బాగుంటుంది …. క్రాఫ్ట్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ నేర్పినట్టు కూడా ఉంటుంది అని సలహా ఇచ్చాను. నా సలహా ఆయనకు నచ్చినట్టే ఉంది.
సరే సార్…. రేపట్నుండి ఆపని చేద్దాం. ఇవాళ్ళ స్కూల్ ఇంప్రెస్ట్ మనీ నుండి కొంత సొమ్ము తీసి అవసరమైన పనిముట్లు కొంటాను .. అని చెప్పాడు.
అనుకున్నట్టుగానే మరుసటి రోజు గార్డెనింగ్ కి కావలసిన పనిముట్లు స్కూలుకు చేరాయి. కాస్త బలం వున్న పిల్లలూ, నేనూ, హెడ్మాస్టారూ కలిసి పారతో భూమిని వదులు చేశాము. తరవాత అందులోనే సాళ్ళూ పాదులూ చేశాము.
అప్పుడు వచ్చింది ప్రశ్న..
ఏం మొక్కలు పెడదాం?
పిల్లలు ఒక్కొక్కరూ ఒక్కో పేరు చెప్పారు
మాడికాయ చెట్టు పెడదాం సార్..
జాంకాయ బాగుంటది సార్
వుసిరిగాయలు యమాగుంటయ్ సార్… ఉప్పు అద్దుకుని తింటే…ఇస్స్స్స్స్స్స్స్
కర్వేపాకు చెట్టు కూడా పెడదాం సార్… అన్నాను నేను
వూరుకోండీ సార్.. మీరు కూడా పిల్లల్లా. ఇలాంటి కాయలూ పండ్లూ కాసే చెట్లు పెడితే వాటి పండ్లకోసం, ఆకులకోసం పిల్లలు చెట్లెక్కి కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకుంటారు. పైగా రాళ్ళూ కర్రలూ విసరడం వలన తలలు కూడా పగులుతాయి. వీటన్నిటికీ తోడు కాపు ఎవరు తినాలీ అనే పేచీ కూడా వస్తుంది. అంతెందుకు…. మన సెంటర్ క్లాస్ స్కూల్లో ఇదివరకు అరటి చెట్లు ఉండేవి. వాటి కాపుకోసం, పండగలకూ పబ్బాలకూ ఆకులకోసం టీచర్ల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. అవి మన యూనియన్ రెండుగా విడిపోయే వరకూ సాగాయి. మనం అలాంటి ఏ రిస్కూ తీసుకోవదు. చక్కగా నీడను ఇచ్చే వేప, రావి చెట్లను పెడదాం. కొలుపులకూ, పండగలకూ వూరి జనాలు భక్తిగా మొక్కుతారు వాటికి. లేదంటే మంచి పూల మొక్కలూ, క్రోటన్ మొక్కలూ పెడదాం. పిల్లలు వాటికింద కూర్చుని అన్నం తింటారు. లేదా స్కూలు మూశాక వూళ్ళో వాళ్ళు వచ్చి కాసేపు కూర్చుని వెళతారు… అన్నాడు.
ఆయన చెప్పిన దాంట్లోనూ నిజం లేకపోలేదు. రిస్క్ ఫ్రీ గార్డెన్.
***
ఉద్యోగంలో జాయిన్ అయ్యి అయిదేళ్ళు అవుతుంది. జీపీఎఫ్ అకౌంట్ నంబర్ వచ్చింది. హోండా ప్యాషన్ బండి కొనుక్కున్నాను. అమ్మా నాయనా దాదాపు నాదగ్గరే ఉంటన్నారు. అప్పుడపుడూ వూరికి పోయి నాలుగు రోజులు ఉన్నా వారం తిరక్క ముందే మనవరాల్ని చూడాలని తిరిగి వస్తున్నారు. నా భార్య విజయలక్ష్మి సంపాధన తోడయ్యింది. ఇద్దరికీ కలిపి అరవై వేలదాకా టేక్ హోం జీతం వస్తుంది.
అబ్బాయ్.. ఇల్లన్నా కట్టుకోరాదండీ… పెద్దోడు ఎట్టాగూ ఐద్రాబాదు వొదిలి రాడు. మీరన్నా మనూళ్ళో ఇల్లు కట్టుకోండీ… అమ్మ సలహా ఇచ్చింది. నాకూ ఇల్లు ఒకటి ఏర్పాటు చేసుకోవాలనే ఉంది. కానీ అంత స్థోమత ఇంకా సాధించలేదు. అయితే మా ఉద్యోగం, జీతం లాంటి వివరాలు బ్యాంకుల్లో ఉంటాయి కాబట్టీ, బ్యాంకులన్నీ కుమ్ముక్కై వుంటాయి కాబట్టి రోజుకు కనీసం రొండుసార్లైనా హౌసింగ్ లోను కావాలా అంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మొదట్లో చిరాకు అనిపించినా మా చుట్టూ ఉన్న మిగతా ఉద్యోగులూ, టీచర్ల సంభాషణల్లో తరుచూ దొర్లే ఇన్ కం టాక్సు లెక్కలూ, హౌస్ లోన్ ఇంటరెస్ట్ మీద దొరికే పన్ను రాయితీలూ వినీ వినీ ఏ బ్యాంకు ఎంత లోన్ ఇస్తుందీ, ఎంత శాతం వడ్డీ కట్టాలీ లాంటి లెక్కలు వేసుకోడం మొదలు పెట్టాము.
అయితే ఇల్లు ఎక్కడ కట్టాలి అనే విషయంలో మాత్రం నిర్ణయం అంత సులభంగా జరగలేదు.
అమ్మా, నాయనలకు మేం మా సొంత వూళ్ళో ఇల్లు కట్టుకుంటే చూసి మురుసుకోవాలీ అని ఉంది. కానీ మా వూరు మా ఉద్యోగాలకు ముప్పై కిలోమీటర్లు. పైగా అమ్మా, నాయనా మాదగ్గరే వుంటున్నారు. అక్కడ ఇల్లుకట్టి ఏం చెయ్యాలి అని అంటుంది విజయ. దీనికి తోడు , మా ఇల్లు ఉండేది పంచాయితీ పోరంబోకు స్థలంలో. అక్కడ ఇల్లు కడితే ముప్పై మూడో నాటికి ఏదన్నా సమస్య వచ్చినా రావొచ్చు. … అన్నీ చెప్పి నాయన వైపూ అమ్మవైపూ చూశాం.
సరే చిన్నా… మీకు ఎక్కడ సవికిరం ఉంటే అక్కడే కట్టుకోండి. మాకు ఇష్టమే అన్నారు.
గుంటూరు…. వూరు పేరు అదేనని పోస్టల్ డైరెక్టరీలో ఉన్నా వూరినిండా అమరావతీ ఫ్యామిలీ రెస్టారెంట్, అమరావతీ వైన్స్, అమరావతీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, అమరావతి కర్రీపాయింట్, అమరావతి మెన్స్ అండ్ వుమెన్స్ స్పా, అమరావతీ కట్ పీసెస్…. ఇవే బోర్డులు. ఎటునుండి వూళ్ళోకి ఎంటర్ అయినా మొదట కనబడే బోర్డు ‘అమరావతి..22 కి. మీ ‘ వూర్లో స్థలాల రేట్లు అమరావతిలో జరిగే రాజకీయ మార్పులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.
వూరి నడిబొడ్డు బ్రాడీపేటలో గజం తొంభై వేలుంటే శివారు గ్రామం పలకలూరులో యాభైవేలకు తక్కువ లేదు.
రాష్ట్ర విభజన జరిగి హైదరాబాదు తెలంగాణా రాజధాని అవ్వడంతో అమరావతి ఆంధ్రా రాజధాని అని ప్రకటించేసిన దరిమెలా రాజధాని పక్కనే ఎప్పటికైనా అవసరం అని వందల అపార్ట్మెంట్లు కట్టేశారు. దాదాపు సగం అపార్టుమెంట్లలో సెక్రెటేరియెట్ ఆఫీసులు నడుస్తుండగా మిగతా సంగంలో ఉద్యోగులు అద్దెకు ఉంటున్నారు. వూళ్ళో ఇళ్ళ అద్దెలూ అదే వరసలో పెరిగి పోయాయి.
రెండు పడక గదుల అపార్ట్మెంట్ కోసం కనీసం పదిహేను వేలు పెట్టాలి నెలకు.
అదే పదిహేనుకు ఇంకో పది కలుపుకుంటే ఇంటి ఈ ఎం ఐ కట్టుకోవచ్చు. పదిహేనూ ఇరవై ఏళ్ళలో లోన్ తీరిపోతుంది. సొంత ఇంట్లో చల్ల తాగి పడుకున్నా అదొక తృప్తి మాస్టారూ… సుబ్బారాయుడు గారు చెబుతూ ఉంటారు.
సరే ఇలా కాదూ అని కనీసం ఇంటికి ఎంత స్థలం అవసరమో అనే ఆరా తీసా.
ఇలాంటి ప్రశ్నలు స్టాఫ్ రూములో అత్యంత ప్రధానమైనవి. ప్రశ్న అడిగీ అడగక ముందే దాదాపు ఇంటి బ్లూప్రింట్ తో సహా కాగితం మీద గీసి చూపించే ఎక్స్పర్ట్ టీచర్లు అన్ని స్కూళ్ళలోనూ ఉంటారు. గతంలో పెళ్ళికాని బ్యాచిలర్ ల వెనక పెళ్ళి చేసుకోమని పోరే మనుషులు ఇప్పుడు ఉద్యోగం వచ్చిన ప్రతీ ఒక్కర్నీ అదే లెవెల్ లో ఇల్లుకట్టుకోమని పోరటం సహజం అయ్యింది. అలా ఎంతమంది చేత ఇళ్ళు కట్టిస్తే అంత పుణ్యం అనే రకంగా ఉంటాయి కొందరి ఆలోచనలు. సాయంత్రం అరండల్ పేట రెండో లైను మొదలులో నిలబడి మాల్పూరీ కోవా తింటూ మాస్టార్లంతా మాట్లాడుకునే మోస్ట్ పాపులర్.. టాపిక్ రియల్ ఎస్టేట్.
కనీసం 120 గజాల స్థలం ఉంటే ఒకమోస్తరు ఇల్లు కట్టుకోవచ్చు…. అందరూ కలిసి నా స్తోమతకు తగిన సలహా ఫైనల్ చేశారు.
ముందు చిన్నపోర్టికోతో రెండు బెడ్రూముల ఇల్లు ఎలా కట్టుకోవచ్చో రోజూ రకరకాల డిజైన్లు పంపుతున్నాడు సుబ్బారాయుడు మాస్టారు. ఆయన బంధువుల్లో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఆయన కూడా ఖాళీసమయంలో, అంటే స్కూలుకు వచ్చినది మొదలుకుని ఇంటికి వెళ్ళే వరకూ, ఫోనుమీద స్థలాలు అమ్మడం, కొనిపించడం చేస్తూ అందరికీ సహాయం చేస్తున్నట్టు అనుకుంటాడు.
మొత్తానికి పలకలూరూ, తురకపాలెం మధ్యన వున్న కొండపక్క స్థలంలో గజం 24 వేలకు అమ్ముతున్న వెంచర్ దగ్గరకు వచ్చి ఆగాయి మా ఆలోచనలు. నూటా ఇరవై గజాలు కొనాలంటే దగ్గిర దగ్గిర ఇరవై తొమ్మిది లక్షలు చేతిలో ఉండాలి. తమ ఇద్దరి సంపాదనతో దాచుకున్న మొత్తం ఒక మూడు లక్షలు ఉంటుంది. ఇల్లు కట్టుకోడానికైతే బ్యాంకులు ఎగబడి లోన్లు ఇస్తాయి. కానీ స్థలం కొనాలంటే అంతే వేగంగా వెనక్కు పోతాయి. ఒకటీ అరా బ్యాంకులు ప్రాపర్టీ లోన్లు ఇస్తునా దానికి అనేక గ్యారెంటీలూ, ష్యూరిటీలూ అవసరం. వడ్డీ రేటుకూడా మోత మోగిపోతుంది. ఎలా చెయ్యడం?
ఆ రాత్రి విజయ నా దగ్గరికి వచ్చి…
నా పెళ్ళిలో ఇచ్చిన నగలు అమ్మితే కనీసం ఒక ఐదు లక్షల వరకూ వస్తుంది. మనదగ్గర ఒక మూడు ఉంది. మొత్తం ఎనిమిదీ తొమ్మిది రెడీగా ఉంది. మిగతా ఇరవై లక్షలూ, ఇల్లు కట్టుబడికి దానిమీద మరో పదిహేను లక్షలూ కలుపుకుంటే మొత్తం పుప్పై అయిదు లక్షలు కావాలి. మా స్కూల్లో రంజనీ మేడం వాళ్ళ ఆయన బ్యాంకు ఆఫీసరు. రాఘవశర్మ గారు. ఆయన్ని అడిగితే ఏదైనా దారి చూపిస్తాడు. రేపొకసారి వెళ్ళి వద్దాం….. అన్నది.
తెల్లారి స్కూల్ అయిపోయాక రాఘవశర్మ గారి బ్యాంకుకు వెళ్ళి కూర్చున్నాం. విషయం అంతా విని….ఒక పని చేద్దాం… ఆ వెంచర్ వాళ్ళతో నేను మాట్లాడతాను. ముందు స్థలం మీ పేరు మీద రిజిస్టర్ చెయ్యమని అడుగుదాం. డౌన్ పేమెంట్ మీరు ఒక పది లక్షలు ఇవ్వండి. మిగతా ముప్పై అయిదు హౌసింగ్ లోన్ అరేంజ్ చేద్దాం. అందులోనుండి ఆ వెంచర్ వాళ్ళకు ఇరవై ఇచ్చేసి మిగతా పదిహేనుతో కన్స్టక్షన్ జాగ్రత్తగా మ్యానేజ్ చెయ్యండి. ఆ వెంచర్ వాళ్ళు మా బ్యాంకులోనే లోన్లు తీసుకుంటూ ఉంటారు. బహుశా ఇరవై లక్షలకు నెల వడ్డీ కడతాం అంటే లోను సాంక్షన్ అయ్యే వరకూ ఆగుతారు అనుకుంటా. మీ ఇదరి సిబిల్ స్కోర్స్ చాలా బాగున్నాయి. పైగా ప్రభుత్వ ఉద్యోగులు.. కాబట్టి అనుకున్న మొత్తం లోన్ రావడం గ్యారెంటీ.. లోను ఇరవై అయిదు ఏళ్ళకు పెట్టుకోండి. మీకు ఇంకా ముప్పై ఏళ్ళ సర్వీసు ఉంది అన్నాడు. ఆయనకు చేతులు జోడించి ఇంటికి వచ్చాము.
***
డిసెంబర్ 23……. గృహప్రవేశం… మా స్టాఫ్ తో పాటు బంధువులు అందర్నీ ఆహ్వానించాం. హైదరాబాదు నుండి కెండన్నా, వొదినా పిల్లలూ వచ్చారు. సుబ్బరాయశర్మ గారు కూడా వచ్చారు.
అందేంటీ ఇంటిముందు పోర్టికో లేకుండా రోడ్డు మీదకు కట్టుకున్నావూ? రేపు కారు కొంటే ఎక్కడ పెడతావూ? పైగా పండగకో పబ్బానికో మేడం గారు ఒక ముగ్గేసుకోవాలన్నా, సరదాగా కుర్చీ వేసుకుని టీ తాగాలన్నా ఇంటిముందు కనీసం రొండు గజాల స్థలం ఉండాలి కదా? ఇంటి ముందు ఇరుకు చేసుకుని ఇంటెనక స్థలం వదిలావు. ఎవరు చూస్తారనీ అక్కడ? … అయినా పర్లేదు. దర్వాజా మాత్రం గ్రాండుగా ఉంది. మొత్తం ఇంటికి అదే అందం ఇచ్చింది. మేస్త్రీ ఎవరూ? ఎక్కడ చేయించావూ… ఆయన అడుగుతూ పోతున్నాడు.
డ్యూపాంట్ రెడీమేడ్ దర్వాజ సార్. డిజైన్ ఆర్డర్ ఇస్తే రెండ్రోజుల్లో డెలివరీ చేస్తారు…. అని సమాదానం చెబుతూ కెండన్న వైపు చూసి నవ్వాను. అన్న కళ్ళల్లో తడి.
అమ్మా.. ఒకసారి వెనక్కి రా… అమ్మను పిలిచాను.
నాయనా నువ్వు కూడా రా.. అన్నా , వదినా.. మీరు కూడా….
అందర్నీ తీసుకుని ఇంటి వెనక జాగాలోకి వెళ్ళాము. అప్పటికే విజయ అక్కడ ఒక పాదు చేసి రెడీగా ఉంది.
నాయనా… ఆ కరేపాకు మొక్క పాదులో నాటు. అమ్మా నువ్వు నీళ్ళు పొయ్యి… అంటూ ఉండగా నా కళ్ళు మసకబారాయి!!!!!!!!
*
చాల బాగుంది అన్న.. మా చిన్నప్పటి ఇల్లు గుర్తుకు వచ్చింది.
మా ఊర్లో పెట్టెలు మేమే చేసుకునే వాల్లం పక్క పల్లెలకు కూడా చేసిచ్చే వాల్లం.
Thank you bro
నువ్వు రాసే ప్రతీ అక్షరంలో ఒక లైఫ్ ఉంటది. నీది గుంటూరైనా… ఆ జీవితాల పద్ధతి ప్రపంచంలో ఉండే ఎన్నో సమూహాలకు సంబంధించినట్టే అనిపిస్తుంది.
కరివేపాకు చెట్టుతో ముగింపు ఊహించిందే.. దానికి ముందున్న స్కూల్ మాస్టారు జీవితం కూడా మామూలు కథకులు వాడిన లాంటిదే. (స్కూల్ లో కరివేపాకు చెట్టు అనటం ఆ పాత్ర మనసులో నాటుకున్న ఒకప్పటి ఆశని చెప్పటం నచ్చింది.) దీన్ని కూడా దాటి పైకి ఎగబాకితే….. అది నువ్వు తప్ప ఎవరూ రాయలేని శైలి, నీకు తప్ప ఎవరికీ పట్టుబడని ఒక పిరియడికల్ ఫ్రేమింగ్ 💝 యు బ్రో
Thanks for reading and responding bro 💕
‘బో కోపం” ఇది రాయలసీమ స్లాంగ్ అన్న… బలే ఇమడ్చారు అందులో.. మాండలీకం లో రచనలు అంత సులువుగా పాఠకుణ్ణి చేరవు.. కానీ…వాక్యం వాక్యం లో దృశ్యాన్ని పొదిగారు.. ఆ . ఇంగువ తిరగబాత..రుచులు… ఇలా చాలా నేర్పుగా అందించారు.. ఎత్తుగడ నే భిన్నంగా ఉంది…కుడొస్ కవి..
Thanks for reading and responding bro 💕
బావుందండి
చర్చకు అవసరంలేని కొన్ని జీవితాలను,వారి వేదనలను కథగా రాసుకొచ్చారు రచయిత.
ఆత్మాశ్రయ మైన ఈ కథ కాలంతో పాటు ఎవరైతే ఈ కథను చెబుతున్నారో ఆ వ్యక్తితో పాటు తన భాషను మార్చుకుంటూ వచ్చింది.
ఇప్పటి వరకు కూడ కొనసాగుతున్న దళితవాడల్లోని కూలినాలి పేదల అవస్థలను కళ్లకు కట్టినట్లు సజీవమైన మాండలిక భాష తో ప్రత్యేక వ్యాఖ్యానాలు ఏమీ చేయకుండా కనపడుతున్న దానిని ఉన్నది ఉన్నట్లుగా చాలా బాగా చిత్రీకరించాడు రచయిత.(పాఠకుడు తనంత తాను ఆలోచించుకునే విధంగా)
కథ ఆశాంతం కరివేపాకు ‘పాజిటివ్ పరిమళాలు చిందిస్తూ ఉండటం విశేషం.
సాదాసీదా వ్యక్తులు మాట్లాడుకునే యాసని కథలో భాగం చేయటం సామాన్యమైన విషయం కాదు. ఎంతో పరిశీలన శక్తి అవసరం. ఆ భాష నుంచి వచ్చినప్పటికీ, తర్వాత మారిన తన భాషని కూడా చూపుతూ రచయిత ఇండస్ మార్టిన్ చాలా బాగా రాశారు. ఆయనకు అభినందనలు.
ఇది రెండు కథలుగా రాయవచ్చు. సీరియస్గా ఒకరి బాధను కథగా చెబుతూ, ట్రాక్ మరో కథ లోకి తీసుకు రాకుండా ఉంటే బాగుండేది.
Thanks for reading and responding annaa💕
Nice and i loved it
మంచి కథ…
కళ్ళు చెమర్చకుండా కథ బైటకి రాలేము…
Congratulations brother Indus martin
Annaa thank you
Chaala baagundi sir..Mee katika poola lo kathalaku konasaagimpu laa..North East lo mee work experiences gurinchi raasthoo konni episodes tho aapesinattunnaaru..Please continue that..Evaroo cheppani, raayani boledu teliyani vishayalu mee posts dwara telusukuntunnaamu
గుంటూరు మాండలికం లో సాగిన అద్భుతమైన కథ. మా ఊరి కథలాగా అనిపించింది.
Thank you so much Sir
Thank you so much Sir 💕💕
Beautiful Brother.
It’s really touching. More valuable and memorable for me. It’s a mirror image to realistic life. U filled life to each word.
Thats so kind of you for reading my story!
Dear Indus Martin sir,
ఎంత బాగా రాశారు…
పొన్నూరు, చెరుకుపల్లి,khadharkhan hospital, పల్లెటూరి ప్రేమలు, సహకారం,motivation…
ఇవ్వన్నీ నాలో కూడా ఉన్నాయి, అందుకనే చాలాసార్లు కళ్ళవెంట నీళ్ళు…
Rajikakommu మేడం చెప్పినట్లు Non-stop గా చేదివేసా…
Thank you sir for giving a great feel n recollecting my memories from childhood to today…
Thanks a lot brother!
Wonderful narration. It’s a feat to remember details from that long ago and then write them in this manner. I can see every person and place in this story in front of my eyes. In my opinion, only folks that live full and passionate life (with both good and bad experiences) can write like this.
Some people like this author are born with special skills. Please publish more.
That’s very kind of you! Thanks for reading my humble lay! If you get some time , try to get my book KATIKAPULU (కటికపూలు) and read. The whole book is in the same genre from the point of an elementary school boy… me!
Can you please send me the order link for the book.
I am sorry! unfortunately the book is out of stock even after three publications. May be Mr Satyaranjan Koduru can help you!
https://www.facebook.com/satyaranjan.koduru
That is his Facebook link. Try to contact him please !
చదివించే గుణం ఉన్న కతల్లో ఇది కూడా add చేసుకోవాలి .,
నిజానికి చదివించడం అనేకన్నా –
పరిగెత్తించే కత ఇది .,
చాలా చిన్ని విషయాలను కూడా – మనసుతో చెప్పిన feel .,
తెలియకుండానే కళ్ళు చెమర్చడానికి కారణాలు –
చెప్పాల్సిన పని లేదేమో కదా !
Dear ఇండస్ మార్టిన్ …. మనసారా అభినందనలు ..
బాగుంది అనే పదం న్యాయం చెయ్యలేదు ఈ కథ అని మనం అంటున్న జీవితానికి. మన జీవితాలను మనకే పరిచయం చెయ్యటం అనేది ఒక తెలియని అనుభూతి కి లోను చేసింది. అనేక సామాజిక, రాజకీయ బేతాళ ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరుకుతున్నాయి మీ ఈ కథలో… మీ నుండి బహుజన రాజకీయ కథ వస్తే చదవాలని, అనేక విషయాలు తెలుసుకోవాలని కోరిక…
చదివి అభిప్రాయం చెప్పినందుకు వందనాలు
గుంటూరు యాసలో, మీరు రాసిన ప్రతీ పదం, ఆ పదాలలో కనిపించిన బడుగు జీవితాలూ, మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. అద్భుతమైన కథ, చాలా బావుందండీ.
Thank you so much for reading this story
చదివి అభిప్రాయం చెప్పినందుకు వందనాలు
బాబాసాహెబ్ అంబేద్కర్ పారిశ్రమికీకరణ, పట్టణీకరణలు కులవివక్షత ని అధిగమించే సాధనాలుగా చెప్పారు. ఈ రెంటి వల్లా కులం పూర్తిగా పోదు గాని వివక్ష తగ్గుముఖం పడుతుంది, తరాలు మారినకొందీ మరింత గా. పల్లె లోంచి హైదరాబాద్ సాగిన కెనడన్న జీవితం మొదటి అడుగు. అక్షరంతో సొంతింటి కల పక్కాగా నెరవేర్చుకొన్న చంటి జీవితం ముందడుగు.
కథ కి వుండాల్సిన ఓ సజీవ లక్షణం విజువలైజేషన్, సాదృశ్యత. చదువు తుంటే ఆనాటి వాతావరణం, మనుషులు కళ్ళకు కట్టినట్లు కనబడటం. ఈ కథంతా అలా కళ్ళ ముందు కదలాడుతుంది.
అంతకు మించి ఇంకో డైమన్షన్ వుందీ కథలో. అది కథ వాసన. కరేపాకు తిరగమాత లేని పొప్పుచారు వాసన నుంచి అప్పుడే నాటిన లేత కరేపాకు మొక్క నుంచి వచ్చే సజీవ సువాసన వరకూ.
జీవితం పైన ఆశ, రేపటి పట్ల నమ్మకం కలిగించి ఆ వైపుకి నడిపించే దళిత కథల అవసరం ఉంది అలాంటి కథ రాసిన చంటికి అభినందనలు.
Thank you Babu
సజీవమైన భాషతో ,కథనంతో ఆసక్తికరంగా రాశారు .చాలా సాధారణమైన సంఘటనతో మొదలై రెండు తరాల దళిత జీవితాల్లోని పరిణామాలను చర్చించిన కథ .
మీనుండి మరిన్ని మంచి కథలను ఆశిస్తూ ,అభినందనలు .
అభిప్రాయం చెప్పినందుకు దండాలు. మీరు మెచ్చారంటే సక్సెస్ అనే అర్ధం!
చదివి అభిప్రాయం చెప్పినందుకు వందనాలు
దిగువ మధ్య తరగతి దళిత కుటుంబాలలో మొదటి జనరేషన్ ఉద్యోగం పొందిన ప్రతి వ్యక్తి కథ.. మనకు ఉద్యోగం అంటే టీచర్ ఉద్యోగమే… ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారి ఇతర గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రైవేట్ ఉద్యోగాల వైపు మరలారు.చాలా బాగుందన్న 👌.అక్కడక్కడ లీనమైనపుడు కళ్ళు చెమర్చాయి
అభిప్రాయం చెప్పినందుకు దండాలు.
చదివి అభిప్రాయం చెప్పినందుకు వందనాలు
More such stories that evoke a serious commitment towards life, is need for the Kids of the community. Being a good story teller, you can produce such stories alot, but in these days of electronic gadgets, could we find a means to reach children and make read such stories !!!!!
అద్భుతమైన కధ నిజంగా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన దాన్ని జయించడానికి పడే సంఘర్షణ చాలా చక్కగా రాసారు. మీ రచనా శైలి మనసుకి హత్తుకునేలా ఉంటుంది. అంతిమంగా కరివేపాకు మొక్క నాటడం కోసం ఇంటి ప్లాన్ మొత్తం మార్చి మాతృమూర్తి కోరికను తిర్చుకునే అవకాశం కల్పించారు చూడండి నిజంగా మీకు ,విజయ మేఢమ్ గారికి అభినంధనలు.
కేనడన్నాయ్ పడిన సంఘర్షణలు కన్నీళ్లు పేట్టించాయి.
అద్భుతమైన కధ నిజంగా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన దాన్ని జయించడానికి పడే సంఘర్షణ చాలా చక్కగా రాసారు. మీ రచనా శైలి మనసుకి హత్తుకునేలా ఉంటుంది. అంతిమంగా కరివేపాకు మొక్క నాటడం కోసం ఇంటి ప్లాన్ మొత్తం మార్చి మాతృమూర్తి కోరికను తిర్చుకునే అవకాశం కల్పించారు చూడండి నిజంగా మీకు ,విజయ మేఢమ్ గారికి అభినంధనలు.
కేనడన్నాయ్ పడిన సంఘర్షణలు కన్నీళ్లు పేట్టించాయి.
Love your write-up Indus Anna
Thank you bro
Thank you Sir
It means a lot !
చదివి అభిప్రాయం చెప్పినందుకు వందనాలు
ఇంత గొప్ప కథ నేనిటీవల కాలంలో చదవలేదు. బతుకులో నిలదొక్కుకోడానికి యాతన పడే దళిత బతుకులోని అంతః క్షోభని ఒకగట్టి తపనతో రాసిన కథ.
చదివినంత సేపూ
అవసరమైన కన్నీళ్లు ఎన్ని ఉబికాయో చెప్పలేను.
రచయిత కీ, సారంగకూ హృదయ పూర్వక దండాలు.
దండాలు అన్నా
ఈ కథ గురించి చెప్పటానికి బాగుంది అనే మాట సరిపోదు, ఎంతో గొప్పగా రాశారు. చదివినంతసేపూ కళ్ళముందు ఈ కథ లోని మనుషులు తిరుగుతున్నట్లే ఉంది.
నా చిన్నప్పటి మా ఊరు నా కళ్ళ ముందు మెదిలింది ఈ కథ చదువుతున్నంత సేపు. చాలా బాగుంది బ్రదర్…
చాలా బాగుంది అన్న… నా జీవిత సంఘటనలు దాధాపు ముప్పావు ఈ కథలో లాగే ఉన్నాయి.. నన్ను నేను చూసుకున్నాను… చివరికి నా కళ్ళు కూడా మసకబారాయి…. అమ్మ చెప్పిన మాట” నీకు ఎన్ని ఉజ్జోగాలు కావాలీ… ఒకిటేగా?.. ఒక్క వుజ్జోగమే ఉంది అనుకుని సదువు…. ఆ వొక్కటీ నీదే అనుకుని సదువు…” నాకు అలాగే జరిగింది…..
Thank you so much for reading and responding
చాలా బావుందండీ. ఇది దాదాపు మధ్యతరగతి జీవితాల్లో అందరికీ అనుభవంలో ఉండేదే. పల్లెటూళ్ళో కావలసినంత పొలమూ పుట్రా ఉన్నా కూడా, ఉద్యోగాల కోసం పట్టణాలకు వచ్చి, తమకంటూ ఓ స్వంత ఇల్లూ పెరడూ ఏర్పరచుకునే వరకూ అద్దె గుహలలో మగ్గిన మా పేరెంట్స్ లాంటి వాళ్ళందరి కథ కూడా ఇది. మొత్తం కథనం ఆపకుండా చదివించింది. ఎక్కడైనా ఓ పదానికి అర్థం తెలియకపోయినా సరే, చదువుతున్న వాక్యం అర్ధం కాకపోవడమో, భావం మనసుకి అందకపోవడమో జరగలేదు.
ఓ పిట్ట కథ ఉంది, బాగా డాబుసరిగా మాట్లాడుతున్నవాడు కాస్తా ఎవడో కాలు తోక్కేసరికి ‘ఓరి … కొడకా, చంపేసావు కదరా’ అని అరిచాడట. అలా మనం ఎంత చదువుకుని ఎంత సోఫిస్తికేటేడ్ భాష మాట్లాడినా, మన ఇలాకాలో ఉన్నప్పుడు, మనవాళ్ళతో మనభాషే బయటికొస్తుంది. బయటి ప్రపంచంలో సంస్కారవంతమైన భాషే మాట్లాడతాం. ఇక్కడ కథకుడు తన పూర్వ కథ చెప్పేటప్పుడు కథకుడి ప్రపంచం తన చుట్టూ ఉన్న తన వాళ్ళే. కానీ ఉద్యోగం చేసి కుదురుకునే సరికి, చదువూ, అది తెచ్చిన పాలిష్ నెస్ పెరిగి సమాజంలో తను మాట్లాడే భాష మారింది. ఉద్యోగానికి ముందూ, తర్వాత కూడా తన కథే, మనతోనే చెప్తున్నా, ఏ కాలానికి తగ్గట్టు అప్పటి తన ప్రవృత్తికి తగ్గట్టే భాష కుదురుకుంది. ఆ వేరియేషన్ ఎక్కడ చూపెట్టాలో తెలియడమే గొప్పతనం. రచయితకి ఉండాల్సిన ఎస్సెట్ అది. కథ మొదటినుంచీ ఇప్పుడు తన పాలిష్డ్ భాషలో చెప్పి ఉండవచ్చు, అయితే ఆ ఇన్నోసెన్స్, తన జ్ఞాపకాలతో తన మనుగడతో మమేకమైన ఆ ఉద్వేగం తగ్గి ఉండేది అని నాకనిపించింది.
చాలా ఏళ్ళగా మాండలీకంలో రాసినవేవీ నన్ను ఆసక్తిగా చదివించలేకపోతున్నాయి. కారణం మాండలీకం పట్ల నా వ్యతిరేకత కాదు. దాని వాడకం, అందం సరిగా తెలియని రచయితల మీద మాత్రమే. నామిని, ఎండపల్లి భారతి గార్ల తర్వాత (నాకు గుర్తున్నంత వరకూ, నేను చదివిన్నత వరకూ ) మాండలీకాన్ని ఎఫెక్టివ్గా వాడగలిగినవారు మీరు. మీ కటికపూలు కూడా చాలా ఇష్టంగా చదివి, చాలామందికి సజెస్ట్ చేసాను కూడా.
This is a beautifully orchestrated art piece. Congratulations!
Felt blessed to wake up this morning
Thank you for the valuable words and appreciation !
మీ రచనా శైలి అద్బుతం .
I am dancing
చాలా బాగుంది అన్న కథ…..టీచర్ల స్టాఫ్ రూంలో లంచ్ టైమ్ లో ఇల్లు కొనాలనుకుంటున్నా అనే విషయం తెలిస్తే చాలు వాళ్ళు ఇచ్చే సలహాలు నువ్ చెప్పిన మాదిరే బ్లూ ప్రింట్ తీసి ఇచ్చే విధంగా ఉంటాయి…
Thank you brother
భలే ఉందండీ కథ. తొమ్మిది మంది పిల్లలు పుట్టాక మా అమ్మమ్మ కరెంట్ పెట్టించుకుంటే, మా తాతయ్య చెప్పు విసిరాడట అమ్మమ్మ మీద. ఆ తర్వాత అమ్మమ్మ ఆయనతో మాట్లాడింది లేదు. కొడుకులు పెడ్డయ్యి, వాళ్ళ సంసారాలు వాళ్ళకి వచ్చాక.. అమ్మమ్మికి కావల్సినంత గౌరవం ఉండేది కానీ, డబ్బులు ఆడేవి కాదు చేతిలో. మా పెళ్ళిళ్ళు అయ్యాక అందరికీ ఒక స్టీల్ బియ్యం డబ్బా కొనివ్వాలి అనేది అమ్మమ్మ ఆశ. 27 మంది మనవ సంతానానికి తడవలు తడవలుగా కొనేది. చిన్న ఖర్చే. కానీ అచ్చంగా తన దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి?? పంట రాగానే మామయ్యలతో గొడవ పడేది డబ్బుల కోసం. ఇలాంటి చిన్న చిన్న వాటికోసం. ఇప్పుడు ఇంత మోడరన్ గా వంటిల్లు కట్టుకున్నా, నేనా బియ్యం డబ్బా అలానే ఉంచుతా. అమ్మమ్మ ఎదురుగా ఉన్నట్లే ఉంటుంది..
మీ శైలి పెద్ద అసెట్ అండి. మీ కటిక పూలు చదివాక, విక్టోరియా మహారాణి మా అమ్మ అయిపోయింది. ఇప్పుడు ఈ కథలో కూడా నాయన్ని నాలుగు ఝాడిస్తుంటే అచ్చం విక్టోరియా మహారాణి లానే.
పొద్దున్నే మామిడికాయ పప్పు తాలింపు లోకి నాలుగు కరేపాకు రెబ్బలు దూస్తుంటే, చప్పున నవ్వొచ్చింది. తాలింపు వేసొచ్చి మీ కథలో కామెంట్ పెడుతున్నా.
ఏమిటో అండీ
నా కథకు ఇంత కథ కమామీషు ఉందని మీరంతా గుర్తుపట్టే దాకా నాకు నమ్మకం లేదు
నా కథలను దళిత కతలు అని దూరంగా పెట్టిన అనుభవాలే ఎక్కువ
నేనైతే నా చుట్టూ చుసిన అనుభవించిన జీవితాన్నే రాసాను
మీకు బోలెడు దండాలు
చాలా చక్కటి కధ. నా చిన్ననాటి జ్ఞాపకాలను తడిమింది. రచయిత మార్టిన్ కు నా ఆశీస్సులు.