ఈ పుస్తకం గురించి ఇలా రాస్తున్నాను అంటే దాన్ని గురించి విమర్శించడమూ కాదు, విశ్లేషించడమూ కాదు. నాకిష్టమైన ఒక వాక్యాన్ని పరామర్శించడం, పలవరించడం… నాతో నేను సంభాషించడం. నేను కవిత్వాన్ని ఎక్కువగా రాయలేను, రాయలేదు కూడా. కానీ చదవడానికి ఇష్టపడతాను. ఒక పాఠకుడిగా ఏ కవిత్వాన్ని బహు దగ్గరికి తీసుకోగలనో చెప్పే హక్కు నాకు ఉంటుందని ఇలా ప్రయత్నిస్తున్నాను. ఒక వాక్యంలో సరళత, వాక్యాన్ని కవిత్వీకరించే భావదృశ్యాలు… ఈ రెండూ నన్ను ఇతని కవిత్వం వైపు ఆకర్షించేలా చేసాయి.
నేను టీ బలహీనుణ్ణి. టీ కోసం నాలుగైదు కిలోమీటర్లు కూడా నడిచివెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. టీ కోసం ఒక్కోసారి మిత్రులతో పోట్లాడిన జ్ఞాపకాలూ ఉన్నాయి నాకు. మంచుతెరల తెల్లవారిని పొగలు కక్కుతున్న టీ తో నంజుకోవడం నాకున్న అత్యంత విలువైన సమయాల్లో ముఖ్యమైనవి. చాలా సార్లు టీ పై కవిత రాయాలని మొదలెట్టి వదిలేసాను కూడా. కవిత్వమూ, టీ నాకున్న బలహీనతల్లో కొన్ని. టీ అలవాటు ఎప్పుడు మొదలైందో నాకు గుర్తులేదు. కానీ ఎలా వదిలించుకోవాలో తెలీడం లేదు. నా ఇష్ట బలహీనతలు ఎక్కడైనా ఎదురైనపుడు వాటిని గుండెల్లో దాచుకుంటాను. అలాంటి దాచుకోవాల్సిన సందర్భాలు “కరవాక” కవిత్వంలో దొరికాయి నాకు.
ఒక కవి, ఒక సాధారణ సందర్భాన్ని కవిత్వీకరిస్తున్నప్పుడు బర్డ్ ఐ వ్యూ లో నిలబడి వ్యాఖ్యానించడం అతడి సామర్ధ్యాన్ని నిర్ధారిస్తుందని నా నమ్మకం. “టీ ఒంటరిది కాదు టీ ది సామూహిక తత్వం” అని కవి చెప్పినప్పుడు అతని చూపు మనకి ఒక అంచనాకొస్తుంది. సామూహికతత్వాన్ని కలగన్న కవి ఒంటరితనాన్ని భరించలేడు, కవిత్వ సాధనంగా సమూహాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉంటాడు. ఆ పని ఈ కవిత్వంలో సులభంగా పూర్తి చేస్తున్నాడనిపించింది.
చీకటి పొడి రాలుతున్న తేయాకు తోటల్లో / వెలుగు రవ్వలకై చిందిన రక్తపు చుక్కలు / పల్లెల్లో పసిమొగ్గల మూతులు కట్టి / పాల కేంద్రాలకు తరలిన పాల చుక్కలు / పంచదార ఫ్యాక్టరీలలో రాలిన / చెమట చుక్కల సమ్మేళనం ఈ “ టీ” అన్న వ్యాఖ్యానంతో కవి మనల్ని టీ వెనక ఉన్న శ్రామిక జనాల కష్ట దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కవితకు The morning song అని పేరుపెట్టాడు. ఇది బృందగానమని కవి మనకి చెప్పకనే చెబుతున్నట్టనిపిస్తుంది. ఇది సామాన్యుల సామూహికతను, వారి ఐక్య ఉద్యమాల అవసరాన్ని చెబుతున్నట్టుగా మనకు ధ్వనిస్తాడు.
సరిగ్గా ఇలాంటిదే మరొకటి… ఖర్జూరం అనే శీర్షిక కలిగిన కవిత.
ఇది ఒక అంతర్జాతీయ యుద్ధ సందర్భాన్ని సాధారణ మాటలతో గంభీరంగా వ్యాఖ్యానించే ఒకానొక మానవీయతని మనమీ వాక్యాల్లో గమనించగలం. ఇందులో పోలికలు… వాటి విస్తృతి మనకి కవి మీద గౌరవాన్ని కలిగేలా చేస్తాయి.
ఖర్జూరం కొని తినడానికి చేతిలోకి తీసుకున్న కవికి యుద్ధం గుర్తొస్తుంది. ఖర్జూరం ఎడారి పంట… గల్ఫ్ దేశాల దిగుమతి. అది తింటుంటే మామూలు వాళ్ళకి దాని తియ్యదనం మాత్రమే కనిపిస్తుంది. కానీ మృదుహృదయుడైన కవికి మాత్రం దాని చారిత్రక మూలాలు, ఆ ఉత్పత్తి నేపథ్యాలు, ఆయా దేశాల వర్తమాన సంక్షోభాలు గుర్తుకొస్తాయి. అలాంటి వ్యాఖ్యానం నాలాంటి పాఠకుడు అందుకోవడానికి ఆయా దేశాల చారిత్రక నేపథ్యాల్ని అవగాహన కలిగి ఉండాలేమో అనిపిస్తుంది.
“ఎందరి తల్లుల కన్నీళ్ళు ఇంకిన / ఇసుక గుండెలపై పెరిగిందో / ఎందరి తండ్రుల ఎడారి ఆశల ఎండమావులను చూసిందో / యుద్ధంలో దెబ్బతిన్న పిల్లాడి ఒంటిపై గాయంలా తడిగా వుంది” అని ఖర్జూరాన్ని వర్ణిస్తున్నప్పుడు మనకు కూడా ఆ యుద్ధ గాయం అనుభవంలోకి వస్తుంది. ఆ నెత్తుటి తడి మనకీ అంటుకుంటుంది. అలాగని ఆ ఖర్జూరపు తియ్యదనాన్ని చెప్పకుండా ఒదల్లేదు… “నోట్లో వేసి నమిలి తిన్నాక / యుద్ధం నుండి తన భర్త క్షేమంగా తిరిగొచ్చినట్టు / ఓ సైనికుడి భార్య కన్న కలలా / తియ్యగా వుంది” అంటాడు. ఇందులో యుద్ధగాయపు తడి, తిరిగొచ్చిన సైనికుడి భార్య కల… ఈ రెండిటి వైరుధ్యాన్ని హృద్యంగా మనకందిస్తాడు.
ఈ పుస్తకంలో Mannequin అనే కవిత నాకు అత్యంత ఇష్టమైన కవితల్లో ఒకటి. ఇందులో నన్నాకర్షించినది కవితా నెరేషన్ ఒక చిత్రమాలికల సమాహారంగా కనిపించడం. వాక్యం చదువుతుండగానే ఆ భావ చిత్రం మనలో స్పష్టంగా రూపుదిద్దుకుని మనల్ని కవిత వెంట పరుగులు తీసేలా చేస్తుంది. ఇది కవితలా రాసినా, కథలా మన ముందు కనిపిస్తూ వుంటుంది.
“నగరం మంచు దుప్పటి కప్పుకుని / నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు / మూడు రోడ్ల కూడలిలో / రావాల్సిన చివరి ఆటో కోసం ఎదురు చూపై నిల్చుంటాను’ అని మొదలైన కవిత “బటన్స్ అరిగిన ఫోనులో బ్యాటరీ ఇండికేటర్ నా గుండెలాగానే / భయం భయంగా కొట్టుకుంటుంటే / బ్యాలన్సు నా ఇంటి ఆర్థిక స్థితిని / పదే పదే గుర్తుచేస్తుంటుంది” అని రెండో దృశ్యపు వాకిట్లోకి మనల్ని తీసుకుపోతుంది. పై రెండు స్టేంజాల్లో రెండు దృశ్యాలు మనల్ని వెంటాడతాయి. ఒకటి ఆటో కోసం ఎదురు చూస్తున్న అమ్మాయైతే మరొకటి ఆమె ఇంటి ఆర్థిక స్థితి. ఈ రెండు దృశ్యాల ద్వారా కవి మనకు ఏమి చెప్పబోతున్నాడనేది అర్థమైపోతుంది. కానీ ఆ చెప్పడంలో కొంత సస్పెన్స్ కూడా తోడయి మనల్ని తరువాతి స్టేంజాల వైపు వేగంగా వెళ్ళేలా చేస్తుంది. ఈ కవితా నిర్మాణంలో నాకు కథ చెప్తున్నట్టు అనిపిస్తోంది. ఒక దృశ్యం తర్వాత మరొక దృశ్యం దొర్లిపోతూ మనకి చెప్పాల్సిందేదో చెప్పి వెళ్ళిపోతుంది కవిత. ఇది కథానిక టెక్నిక్. బహుశ అందుకేనేమో నాకు దగ్గరయ్యింది.
“ఇన్ని కొత్త బట్టల మధ్య / నేనో మాసిన చున్నీని అవుతూ / నెలంతా నేను రాల్చిన / చెమట చుక్కలకు / చివరాఖరికి దక్కేవి చిల్లర నోట్లే” అన్న వాక్యాల్లో శ్రమ దోపిడీని మనం గమనించగలం. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో పని చేస్తున్న సేల్స్ గాళ్స్ పేదరికాన్ని మనకు కళ్ళకు చూపిస్తుందీ కవిత. నా కోసం అమ్మ నాన్నలు ఎదురు చూస్తూ వుంటారని ఎలా చెప్తుందో చూడండి… “మూలనున్న మంచంలో నాన్న / చల్లారిన అన్నం ముందు అమ్మ / బ్యాలెన్సు అయిపోయిన సిమ్ కార్డ్ లా ఎదురు చూస్తుంటే / మూడు రోడ్ల జంక్షన్లో ఆటో కోసం పడిగాపులు కాస్తుంటాను” అని ఆమె ఇంటి ఆర్థిక పరిస్థితిని మనకి పరిచయం చేస్తుంది.
ఈ కవిది కార్మిక స్వరం. నెల్లిమర్ల జూట్ కార్మిక కుటుంబంలోంచి వచ్చిన ఒకానొక శ్రామిక నాదమితడు. ఈ కవితల నిండా ఒక రోడ్ మేప్ కనిపిస్తుంది. దాని కోసం ఒక ప్రణాళికాబద్ధ ప్రయాణం కనిపిస్తుంది అతని నడకలో. అడుగడుగునా అది పాఠకునికి అందించే నేర్పు మనకి కనిపిస్తుంది.
పెట్టుబడి, దాని వికృత రూపాలూ… సగటు మానవ జీవితాల మీద ఎక్కువగా కామెంట్ చెయ్యడం కూడా మనకు తెలుస్తుంటుంది. “మార్కెట్… ఓ మహాసర్పం” కవిత దానికి అద్దం పడుతూ వుంటుంది. ఆ మహాసర్పం పెట్టుబడి. దాని ద్వారా జడలు విప్పిన గ్లోబలైజ్డ్ వ్యాపారం. ఈ దారిలో వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులు, సహవృత్తులు మానవ సంబంధాలపై పెను ప్రభావాన్ని చూపుతూ డబ్బు మాత్రమే కనపడుతూ ఉంటుంది, మిగతావన్నీ మిథ్య అయి మాసిపోతూ వుంటాయి. ఈ స్థితిని మనకి కళ్ళకి కట్టినట్టు చెబుతాడు. “మడిగట్టు నా సింహాసనమని, పొలం నా రాజ్యమని రైతు ధీమాగా ఉండడానికి సహవృత్తులైన కుండ, బండ, బట్ట, బుట్ట, కత్తి, కత్తెర నా ముంగిట చేతులు చాచి నన్ను మారాజును చేసాయి అని రైతు అనుకుంటున్న సమయంలో ఊరిలోకి మహాసర్పం ప్రవేశించింది” అని మొదలుపెట్టి “మిగులు చేతులను వలస చీమలుగా మార్చేసింది” అంటాడు. ’మిగులు చేతులు వలస చీమలుగా మారిపోవడమ”న్న వ్యాఖ్యలో ఆర్థిక సూత్రాలు ధ్వనిస్తాయి. ఆ మహాసర్పానికి ఆకలెక్కువ అంటూ దాని కోసం అరిచేతుల్ని అరగదీసుకున్నాను, కడుపును కుదించుకున్నాను, చివరికి అదనపు చేతులను సైతం దానికి అర్పించుకున్నాను’ అంటాడు. ముగింపులో ఆ మహాసర్పాన్ని మట్టుబెట్టే ఒక పరిష్కారాన్ని చూపుతాడు. దానిని మట్టుబెట్టగల పట్నపు శ్రమచీమల సైన్యంలోనైనా చేరాలి” అని. ఇది పల్లెను మింగిన పెట్టుబడి వికృతరూపానికి అంతిమ పరిష్కారంగా ధ్వనిస్తాడు. పెట్టుబడి పల్లెల్ని మింగుతూ పట్నంగా విస్తరిస్తున్న వేళ సమస్త చేతివృత్తులూ వలసపోవడాన్ని, పట్నంలో కూడా అదనపు చేతులుగా బతుకుతున్న శ్రామిక జనాలు ఉద్యమావశ్యకతని చెబుతున్న ఒక దారి దీపమీ కవిత. ఇది అతని ప్రణాళిక.
మెషీన్ లో పడి నలిగిన నెల్లిమర్ల జ్యూట్ కార్మికుల మొండి వేళ్ళను చూసి… “చిగురించే… చేతివేళ్ళు” రాసేడు. అందులో కార్మిక కుటుంబాల దీనస్థితిని మనం గమనించవచ్చు. వేళ్ళూ, శరీరాలూ యంత్రాల కింద నలిగిపోతున్నా తమ బతుకు చెట్టు మొండిగా నిలబడడాన్ని స్ఫూర్తి కలిగిస్తుంది. “ప్రేమని పంచిన వేళ్ళు / నను నడిపించిన వేళ్ళు / ఊయలై ఊగించిన వేళ్ళు / ఆ వేళ్ళ లోంచి నిత్యం పని ప్రవహించేది / గిజిగాడి నిర్మాణం కనిపించేది / మానవ పరిణామం అగుపించేది” అని శ్రమ నిర్వచనాల్ని చెప్తాడు. ఆ చేతి వేళ్ళ లోంచి ప్రవహించిన పని సమాజ గమనానికి ఎంత ముఖ్యమో దాని పరిణామ క్రమ చిత్రాన్ని మన కళ్ళకి కడతాడు. ఆ వేళ్ళ వెనక కార్మిక కుటుంబాల బతుకుచిత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. “ఆ వేళ్ళే… మా అమ్మ చిరుగుల చీరను పైటగ చేసి / గోడకు కొట్టిన పసుపు ముద్దలా / మా చెల్లిని కూర్చుండబెట్టి / నలుగురిలో నవ్వులపాలు కాకుండా / అయిన వాళ్ళకు నాలుగాకులేసి / నెత్తిన రెండక్షింతలేసి లేవదీసాయి” అని అంటూ “ఆ వేళ్ళే… అక్షరమ్ముక్క నాకు ఆసరాగా కావాలని / నా వేళ్ళ మధ్య కలాన్ని కదలాడేలా చేసాయి / ఎక్కడైనా… వేళ్ళు నరికితే పచ్చని చెట్టు కూలుతుంది / మిషన్లో పడి తెగిన మా నాన్న చేతి వేళ్ళపైనే / రేపటి ఆశల పతాకమై చిగురించాల్సిన మా బతుకు చెట్టు మొండిగా నిలిచింది” అని వేళ్ళ శ్లేషార్థాన్ని అద్భుతంగా వాక్యాల్లో వాడుకుని ఆశావహ ముగింపునిచ్చేడు.
“కొనాలి” కవిత లో చిన్న ప్యాకెట్లలో దాగివున్న వ్యాపార సూత్రాన్ని సిమిలీ, మెటఫర్ల తో అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. “పలచగా పలకర్రలా వున్న ఓ పిల్ల / డొర్రి పల్లెల్లబెట్టి నవ్వుతూ / ’క్లోజప్ లా కదిలిపోయింది / శొంటి కొమ్ములాంటి ఓ ముసలాయన ’నవరత్న’ ప్యాకెట్ లా నడిచెల్లిపోయాడు / సగముడికిన కూరలాంటి ఓ ముసలామె ’ప్రియా’ పచ్చడి ప్యాకెట్టై వడివడిగా ముందుకు సాగింది / నోట్లోంచి నువ్వుగింజే నాననట్టున్న ఒకాయన ’రిలయన్స్’ రీచార్జ్ కార్డై రింగుటోనులా చెవిని పోరుబెడుతూనే వున్నాడు” అని మనల్ని తన కవితా ప్రభావంతో మెస్మరైజ్ చేస్తాడు.
ఇటీవలి కాలంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి ఆన్లైన్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. దీన్ని ఒక పెద్ద నదిగా ఉదహరిస్తాడు. ఇందులో సగటు జనం చెమట చుక్కల్ని ఎలా మింగేస్తుంటుందో మనకి అర్థం చేయిస్తాడు. “పొద్దున్న… లేచిన దగ్గర నుండి / ఏదో ఒక వస్తువు కొనాల్సి వుంటుంది / ఏదో గుర్తుకు వచ్చినవాడికి మల్లే / నా అరచేతిలో ఉన్న బుల్లి ప్రపంచం లోకి గబుక్కున దూకేస్తాను” ఆ ప్రపంచం సెల్ఫోన్. ఆ నదీ ప్రవాహాన్ని నా చూపుడు వేళ్ళతో తాకుతానంతే / నా ముందు కుప్పలు తెప్పలుగా / వస్తువులొచ్చి నిలుచుంటాయి / పిడకలు… ముక్కుపుడకలు … బట్టలు, పుస్తకాలు… పౌడర్లు, అత్తర్లు… / గుండు సూది నుంచి గాలిలో దూసుకుపోయే బండి దాకా అన్నీ దొరుకుతాయి/ నాకు కావాల్సిన వస్తువును / అలా సుతారంగా తాకుతానంతే / క్షణాలలో నా కార్డులో వున్న / కొన్ని చెమట చుక్కలను / ఆ నది తాగేస్తుంది” ఆ నది అక్కడితో ఆగదు, “ఎన్ని నీటి పాయలను తనలో కలుపుకుందో / మరెన్ని చిన్న చిన్న వాగులను / తను మింగిందో / …. నేడు ప్రపంచమంతా ప్రవహిస్తున్నట్టు కనపడినా / నా చెమట చుక్కలను తాగిన ఈ నది వెనుక / ఓ సముద్రం దాగున్నదన్న సంగతి / నాకిప్పుడే అర్థమయ్యింది” అని ఆ ఆన్లైన్ వ్యాపారం వెనుక ఒక మహాసామ్రాజ్యం దాగివున్నదని చెప్తాడు. ఇలాంటి వాక్యాలు చదువుతున్నపుడు ప్రతి వ్యక్తీ తనను తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. నిజమే కదా అని నిర్ధారించుకుంటాడు. అది కవితా నెరేషన్ లో సరళత వల్ల. సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పడంలో శ్రీను తొందరగా ఆకట్టుకుంటాడు. తను చెప్పాల్సిన విషయాన్ని అన్ని స్థాయిల పాఠకులకీ నేరుగా చేరిపోతాడు తన కవిత్వంతో.
“సరుకులు మాట్లాడుతాయి” అన్న కవితలో ముందు కవితకి కొనసాగింపులా సాగుతుంది. బజారులో వస్తువులు తనని ఎలా ఆకర్షిస్తుంటాయో, తనని ఎలా పలకరిస్తుంటాయో చెప్తాడు. “ఆఫర్లు… డిస్కౌంట్ల పేరుతో కొన్ని / కన్నుగీటి నన్ను తమ బుట్టలో వేసుకుంటాయి / నా చేతిలోనివి కొన్ని … నువ్వు మమ్మల్ని కొనేది కన్నా / ప్రతినెలా చూసిందే ఎక్కువని / కిసిక్కున నవ్వుకుంటూ తిరిగి సెల్ఫ్ లోకి చేరుకుంటాయి / మరికొన్ని … మమ్మల్ని చూడడానికే / నీవు అర్హుడివి కాదంటూ నావైపు నుండి ముఖం తిప్పేసుకుంటాయి / అని మధ్యతరగతి మనస్తత్వాన్ని మనకి చూపిస్తాడు. ఇందులో ప్రతి వాడూ సూపర్ మార్కెట్ లో ఈ స్థితిని ఎదుర్కునే వుంటాడు. “బిల్లును చెల్లించడానికి కార్డును స్వైపింగ్ మెషిన్ నోటికందించినపుడు… ఒక అద్భుతమైన వాక్యంతో ఈ కవితను మెరిపిస్తాడు. “అది నా డెబిట్ కార్డుతో పాటు / నా భవిష్యత్తు శ్రమను తాకట్టు పెట్టిన క్రెడిట్ కార్డును కూడా గీకేస్తుంది” అంటాడు.
ఈ పుస్తకానికి “కరవాక” అని పేరుపెట్టేడు గానీ ఇందులో చాలా కవితలు శ్రమ, శ్రమ విలువ, మార్కెట్టూ, దాని వికృత రూపం, గ్లోబలైజ్డ్ సందర్భంలో మధ్యతరగతి నలిగిపోవడం పై ఎక్కువగా ఫోకస్ చేసాయి. శ్రీను ముందు కవిత్వం “సముద్రమంత చెమట చుక్క” ఇప్పుడు “కరవాక”. సముద్రంతోనూ, దాని తీర ప్రాంతంతోనూ ఇతనికి విడదీయలేని అనుబంధమేదో ఉన్నట్టు మనకు ధ్వనిస్తాడు. ఇందులో అతని వ్యక్తిత్వమూ, ప్రణాళికా మనకి స్పష్టమవుతాయి.
మొత్తంగా ఈ కరవాక నాపై ఎనలేని ప్రభావాన్ని చూపించిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ కవి నాకు కవిత్వం ద్వారానే పరిచయమయ్యేడు. కవిత్వం గురించి మాత్రమే నాతో మాట్లాడుతాడు, మా ఇద్దరికీ మధ్య అతని వాక్య విన్యాసం మాత్రమే ప్రవహిస్తుంటూ స్నేహ సౌరభంగా వెదజల్లుతుంటుంది. అందుకే ఈ కరవాక ప్రభావం నుంచి నన్ను నేను తప్పించుకోలేక ఈ రెండు మాటలు ఇలా మీతో పంచుకుంటున్నాను.
*
Add comment