కరడుగట్టిన కాలం..కరోనా కాలం అంటున్న దయాకర్

మీరు సుత ఆడుర్రి. బయటికి రాకుర్రి. సంపుడుపంజెం ముట్టెదన్క గమ్మునుండుర్రి. ఆటల గెల్శినంక దావత్ జేసుకుందం. ఏమంటరు?

డ్లకొండ దయాకర్ పలుకుబడుల భాషలో కవిత్వం రాస్తున్నవాడు. “బంతి బువ్వ” పేరుతో మేలిమి కయితల దొంతిని ఆవిష్కరించుకున్నవాడు. వరంగల్ ప్రాంతపు నుడికారానికి మెర పెడుతున్నవాడు. లొట్టి మీది కల్లు నురుగసొంటి తేట మనసున్నోడు. కవిత్వమే ప్రాణంగా ‘కల్లెడ’ ఊరి మట్టిని శ్వాసిస్తూ బతుకుతున్నవాడు. నాకు అతని అక్షరాలన్నా, వాటి సౌందర్యమన్నా బహు ఖాయిసు. మనుషుల్ని ఎడబాపుతున్న “కరోనా” మహమ్మారి మీద రాసిన అతని కవిత “ఎనపచ్చీసు” నన్ను బాగా ఆకట్టుకుంది.
*
ఎనపచ్ఛీసు
~
ఇది గత్తర కాలం
ఇది బిత్తర కాలం
గవ్వలు గాయపడ్డా
సంపుడుపంజెం నొక్కనికాలం
బత్కు సాపుసీదా సాగనికాలం
ఇది గడబందుల కాలంరా తండ్రీ!
దూగలు,తీనులు,చార్,చౌదాలుగా మూగి
ఆటసాగని కాలం
కచ్చెగాయలు పట్టానెక్కనోసుకోని కాలం
విజ్ఞాన త్రీషులెక్కువై ముర్గీసులతో
చేజేతులా సంపుకుంటున్న కాలం
బట్టకు పొట్టకు చెయ్యిదూగని కాలం
చెక్క బోడక్కల కాలంరా అయ్య!
ఎంత యాతనపడ్డా..
పంజెం తోయని కాలం
పండుగాయలు ఫలారమౌతున్న కాలం
దస్సుల దరహాసాలు లెవ్వు
పచ్ఛీసుల పసందులు లెవ్వు
సంపదంతా కొల్లగొట్టబడి
అప్పుల పావులు మిగులుతున్న కాలం
స్వీయ నియంత్రణల అదుపుతప్పితె
బతుకును మసిజేసే కాలం
పీనిగె దొరకని కాలం పిసినారి కాలం
ఇది కరడుగట్టిన కాలం.. కరోనా కాలం
*
 వడ్లకొండ దయాకర్ కవితల్లో దేశీయత కొట్టొచ్చినట్టు అవుపడుతది. ‘ఎనపచ్చీసు’ కవితలో మరుగునపడుతున్న పచ్చీసు ఆటను, ఆటలోని పారిభాషిక పదజాలాన్ని సమర్థవంతంగా కరోనా కాలానికి అన్వయించిన తీరు అతని కవిత్వ పటుత్వాన్ని, సూక్ష్మ పరిశీలనను, సృజనాత్మక నైపుణ్యాన్ని, అన్వయ సామర్థ్యాన్ని, వస్తు అంతర్గత స్వరూప స్వభావాల్ని అంచనా వేయగలిగే శక్తిని పట్టిత్తది. భాష అతని కవిత్వానికి ఆయువుపట్టు.
 ఇప్పటి కల్లోల సందర్భాన్ని తెలియజేస్తూ కవితను ఎత్తుకుంటడు. ఎత్తుగడలో గత్తరకాలం, బిత్తర కాలం అనేవి గతకాలపు చేదు అనుభవాల్ని (ప్లేగు వ్యాధి ప్రబలిన నాటి పరిస్థితులు మొ.) ఏమీ చేయలేని నిస్సహాయ స్థితుల్ని ప్రతిబింబిస్తయి. “ఇది గడబందుల కాలం రా తండ్రీ!” అనడం నేటి లాక్ డౌన్ ను, కర్ఫ్యూ విధించిన పరిస్థితుల్లో ముందుకు కదలలేని, అడుగు వేయలేనితనాన్ని చెబుతది. ‘పచ్చీసు’ ఆటలో గడమీద ఉన్న పావును దాటి ప్రత్యర్థి పావులు ముందుకు కదలలేవు. కనీసం అదే గడమీదికి వచ్చే ఆస్కారం ఉండదు. అందుకే ఇది గడబందుల కాలం. ఇటువంటి విపత్కర పరిస్థితులను అధిగమించడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నాల్ని (వ్యాక్సిన్ కనిపెట్టడం జాగ్రత్తలు పాటించడం మొదలైనవి) “గవ్వలు గాయపడ్డా/సంపు డు పంజెం నొక్కని కాలం” లాంటి ఒకే వాక్యంలో ఇమిడ్చి చెబుతడు.
 ‘పచ్చీసు’ ఆటలో దస్సు, పచ్చీసు, త్రీషు పడితేనే ఆట మొదలైతది. అట్లా కాకుండా దూగ, తీను, చార్ , చౌదాలు పడితే ఆటసాగదు. ఈ కరోనా సమయంలో సమూహాలుగా మూగితే మన ఆటలు సాగవని, అందుకే “కచ్చగాయలు పట్టానెక్కనోసుకొని కాలం” అని మొత్తుకుంటడు.
(వాటి సంభావ్యతను బట్టి) వరుసగా 3 పచ్చీసు లో, దస్సులో, త్రీషులో లేదా మూడు కలగలిసిపడితే “ముర్గీస్ ” అంటం. కొన్ని ప్రాంతాల్లో గుడ్డీస్ అంటం. మనిషి విజ్ఞానం మరీ ఎక్కువై తన చావును తానే కొనితెచ్చుకుంటున్న వైనాన్ని, కనీస అవసరాలకు సుత తండ్లాడే పరిస్థితిని చెప్పడానికి “చెక్క బోడక్కల కాలంరా అయ్యా!” అని మందలిస్తూ కళ్ళు తెరిపిత్తడు. ఆట ఆడేటప్పుడు “చెక్క బోడక్క పంజెం పడితే పాతర పెడతా” అని అంటాంటరు. ఇంకా ఇలాంటి దేశీయ ఆటల్లో ” కోడిని కోత్తా..గొర్రెను కోత్తా…” అని సుత అంటాంటరు. ఇటువంటివి ప్రత్యర్ధిని ఇరకాటంలో పెట్టడానికి, ఆట రంజుమీద వున్నదని చెప్పడానికి రకరకాల ఉత్త్రేరకాలుగా పనికొత్తయి.
‘కరోనా’ వైరసు వయసు పైబడిన వారి మీద తొందరగా తన ప్రభావాన్ని చూపెడుతది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి వారిని మనం కాపాడుకోలేకపోతున్నం. జీవితం మొత్తం తరచి చూసిన పెద్దల్నీ, వారి అనుభవసారాన్ని పదిలపరుచుకోలేకపోతున్నం. ‘పచ్చీసు’ ఆట లో ఇంట్ల బడే పావును పండుగాయ అంటం. ఇగ ఇంట్లబడుతదనంగ ప్రత్యర్థి దాన్ని మట్టుబెడితే పండుగాయ పలారమైందని అంటం. ఇప్పటి కరోనా స్థితిని “పండుగాయలు ఫలారమవుతున్న కాలం” గా కవి చెబుతడు.
 విపత్కర పరిస్థితుల్లో ఏ పనీ కొనసాగదు. అత్యవసర సరుకులు అతి కష్టంగా సమకూర్చుకుంటం. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయితది. ఉన్నదంతా ఊడ్సుకుపోతది. ఆఖరికి దివాళా దీత్తది. ఇక ఏమీచేయలేక చేతులెత్తేత్తం. అందుకే కవి “దస్సుల  దరహాసాలు లెవ్వు/  పచ్చీసుల  పసందులు లెవ్వు” అంటడు.
‘పచ్చీసు’ ఆట లో ప్రత్యర్థి పావుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తేనే మనుగడ. స్వీయ నియంత్రణ అదుపు తప్పితే ఒక్క అడుగు వేసినా, ఎదుటోనికి ‘పంజెం’ ముడుతది. ప్రత్యర్థికి మన ‘ఇంటి గుట్టు’ చేతిలో పెట్టినట్లయితది. మన సావుకు మనమే తొవ్వ సూపినట్టు అయితది. ‘కరోనా’ కట్టడికి ముందు జాగ్రత్తలు పాటించకపోతే పరిస్థితి విషమిస్తుందనే విషయాన్ని తదనంతర పరిస్థితుల్ని గూర్చి హెచ్చరిస్తూ పైలంగుండమని చెబుతడు. అందుకే “పీనిగె దొరకని కాలం.. పిసినారి కాలం/ కరడుగట్టిన కాలం..కరోనా కాలం” అని ముగిస్తాడు.
గతంలో పచ్చీసు ఆటను తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని చెప్పడానికి కవి అన్నవరం దేవేందర్ ‘గుడ్డీస్ ‘ అనే కవిత రాసిండు. ఇంతకాలానికి మళ్లీ ఈ అత్యవసరపరిస్థితిని చెప్పడానికి వడ్లకొండ దయాకర్ ‘ఎనపచ్చీసు’ రాసిండు. గడులు లెక్క పెట్టేటప్పుడు ‘ఎనపచ్చీసు’ అనే పదాన్ని వాడుతరు.
పచ్చీసులో  96 గడులు,16 కాయలు (వివిధ రంగుల్లో) ఉంటయి. ఏడు గవ్వల తోటి ఆట ఆడతరు. బోర్లబొక్కల,  ఎల్లెలుకల పడ్డ గవ్వలను బట్టి పేర్లు పెడుతరు. ఇద్దరు లేదా నలుగురు ఆడుతరు. ఆడుతాంటె మస్తు మజా ఉంటంది. మీరు సుత ఆడుర్రి. బయటికి రాకుర్రి. సంపుడుపంజెం ముట్టెదన్క గమ్మునుండుర్రి. ఆటల గెల్శినంక దావత్ జేసుకుందం. ఏమంటరు?
*

బండారి రాజ్ కుమార్

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నైస్ పోయెమ్
    నైస్ అనాలిసిస్
    జయహో

    • thank u uday garu

      తెలంగాణ నుడికారంతో రాసే కవుల్లో నేటితరంలో వడ్లకొండ దయాకర్ ది విలక్షణమైన గొంతుక.

  • పచ్చీసు ఆ టలోని పదజాలాన్ని,ఆడే విధానాన్ని చెప్పడం వ్యాసానికి నిండుదనం అన్న.పచ్చీసును కరోనా కు సమన్వయ పరుస్తూ అద్భుతంగ కవిత రాసిన దయాకరన్నకు శుభాకాంక్షలు.

    • థాంక్యూ.. తమ్ముడు. నీ స్పందన నాకు ఉత్ప్రేరకం💐💐

    • మీ ఆత్మీయ స్పందనకు శనార్తులు గోపాల్

  • మంచి కవిత దానిని అంతే చక్కగా వివరించి విశ్లేషించిన తీరు బాగుందన్న ఇద్దరికీ అభినందనలు

  • తమ్ముడూ దయాకరన్న కవిత్వాన్ని చాలా అద్బుతంగా సమీక్షించినవ్…పచ్చీసు పలారాన్ని పంచి పెట్టినవ్…దయాకరన్న కవిత్వం ఎప్పుడూ ఏదో ఒకదాన్ని గొప్పగా చెప్పి చూపిస్తుంది. పచ్చీస్ ఆటను కరోనా భయాన్ని అనుసంధానిస్తు చెప్పడం క్రియేటివ్‌ గా ఉంది….దానికి నీ విశ్లేషణ బలాన్నిచ్చింది.మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు…💐💐💐

  • దయాకర్ అన్న కవిత బావుంది…పచ్చిసు ఆట గురించి మీ పరిచయం, విశ్లేషణ ఇంకా బావుంది…రాజ్ అన్న…ఇద్దరికి శుభాకాంక్షలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు