ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అస్తిత్వంలో ఉన్న కాలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఒక భారీ కుంభకోణం జరిగింది . ప్రతిపక్షాలు దేవాదాయ శాఖా మంత్రిని దుమ్మెత్తి పోశాయి. రాజీనామా చేసి తీరవలసిందే అని పట్టుపట్టాయి. అప్పటి ముఖ్యమంత్రి దేవాదాయ శాఖా మంత్రి తో రాజీనామా చేయించడమే కాకుండా వాళ్ళ మీద పై చేయి సాధించడానికి ఒక విచారణా కమీషన్ వేశారు . ఆ కమీషన్ మూడేళ్ళ పాటు విచారణ జరిపి , పరిశోధించి “కుంభకోణం జరిగిన మాట వాస్తవమే కానీ ఇందుకు ఎవరూ బాధ్యులు కారు. అసలు మంత్రి గారి తప్పే లేదు “అని కర్ర విరగకుండా , పాము చావకుండా ఒక నివేదిక ఇచ్చింది. ఆ తరువాత రాజీనామా చేసిన దేవాదాయ శాఖా మంత్రికి ప్రమోషన్ లభించింది.
మొన్నటికి మొన్న నవ్యఆంధ్రప్రదేశ్ లో గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు. యధావిధిగా ఒక కమీషన్ వేశారు . ఆ కమీషన్ కూడా ఒకేసారి వచ్చిన భక్తులు , వారలా రావడానికి దోహదం చేసిన ప్రవచన కారులది, మీడియాది తప్పిస్తే అందులో ఇంకెవరి తప్పూలేదని నివేదిక ఇచ్చి చేతులు దులుపుకుంది .
ఈ రెండు సంఘటనల మీదా వ్యాఖ్యానించడానికి ఏమీ లేదు . అందరి అనుభవాలలో నిగ్గుతేలిన సత్యాలేవో వాళ్లకు మాత్రమే తెలిసేలా నిలిచి వున్నాయి. స్వతంత్రంగా వ్యవహరించవలసిన మన న్యాయ వ్యవస్థ, మన పోలీస్ వ్యవస్థ అధికార పార్టీలకు ఎలా ఊడిగం చేస్తాయో , వాటి కను సన్నలలో ఎలా మెలగుతాయో కళ్ళకు కట్టినట్టు ముప్పై నాలుగేళ్ల క్రితం ఒక తెలుగు రచయత తన అపూర్వమైన వ్యంగ్య వైభవం తో చిత్రించాడు . సెప్టెంబర్ 1984 సృజన సంచికలో ప్రచురించబడిన ఆ కథ పేరు కమ్యూనిస్ట్ గాడిద. రచయత సాక్షి. ఆ తరువాత ఈ కథ వాసిరెడ్డి నవీన్ సంపాదకత్వంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన తెలుగు కథ (1960-1985) సంకలనంలో కూడా చోటుచేసుకుంది. రచయిత సాక్షి గురించిన వివరాలు ఏవీ ఆ పుస్తకాలలో లేవు. తెలుగు నాట మేధో వ్యవస్థలకు పట్టిన దుస్థితి గురించి మూడు దశాబ్దాల క్రితమే ఊహించిన ఆ రచయిత ప్రాప్త కాలజ్ఞత కు నమస్కరిస్తూ ఒక్క సారి కథ వివరాలలోకి వెళదాము
ఆంద్ర దేశంలోని ఏదో ఒక ఊరు . ఆ వూళ్ళో ఒక రజకుడు ఉండేవాడు . అతడి పేరు రాములు . అతడికి ఒక గాడిద ఉండేది . అతడి ఆర్థిక పరిస్థితి దిగజారి పోవడం వలన , గాడిదను పోషించే శక్తి లేక దాని మేడలో వేసిన గొలుసు విప్పి “ఈ రోజు నుండీ నీకు విముక్తి . నీకు తోచినట్టు గా నువ్వుండు . నీ పొట్ట నువ్వే పోషించుకో . మళ్ళీ నా దగ్గరకు రాకు ” అని చెప్పి పంపిస్తాడు . బజారున పడిన ఆ గాడిదకు కడుపులో ఆకలి అవుతుంది . ఊళ్లోకి వెళ్లాలా ? ఊరి చివరకు వెళ్ళాలా? ఊళ్లోకి వెళితే సినిమా పోస్టర్లు , చెత్త కాగితాలు , ఊరి బయటకు వెళితే చల్లటి కాలువ వొడ్డున పచ్చ పచ్చటి గడ్డి మైదానాలు ఎటు వెళ్లాలో తెలియని ఒక సంధ్యా సమస్య వచ్చిపడింది గాడిదకు . చివరకు అది ఊరి బయటకు వెళ్లాలని నిశయించుకుంది . తీరా ఊరి బయటకు వెళ్లేసరికి దానికి పచ్చగడ్డి మైదానాలు ఎక్కడా కనిపించవు . ఊళ్లోని రెండు పార్టీలు తెలుగు దేశం , కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్నదని ఎవరూ పచ్చగడ్డి వేయనందున దాని ఆకలి తీరక ఒక చెరువులోని నీళ్లు భయం భయం గా తాగి ఊళ్లోకి వస్తుంది . లోపల ఆకలి మంట పెడుతూ ఉంటుంది.
అటూ ఇటూ తచ్చాడుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటించిన ఒక పోస్టర్ కనిపిస్తుంది . కనిపించిందే తడవు అది వెంటనే తన నాలుకతో పోస్టర్ ను తడిపి ఊడబెరికి పరపరా నమలసాగింది. దూరం నుండి చూస్తున్న కాంగ్రెస్ కార్యకర్త కి ఇది కచ్చితంగా తెలుగుదేశం వాళ్ళ పనే అనిపించి అటుగా వెళుతున్న తెలుగుదేశం కార్యకర్తను నిల దేశి అడుగుతాడు . ఏమిటిది అని గాడిద కేసి చూపిస్తూ . ముందు బిత్తరపోయిన తెలుగుదేశం కార్యకర్త చివరకు గాడిద నములుతున్న పోస్టర్ ను చూసి విషయం అర్ధం చేసుకుని మరింత పగలబడి నవ్వుతాడు . కాంగ్రెస్ కార్యకర్త అవమాన పడి తెలుగుదేశం కార్యకర్త మీద చేయి చేసుకుంటాడు . యిద్దరూ బాహా బాహీ కొట్టుకుంటూ వుంటారు . ఈలోగా అక్కడ గుమికూడిన జనం లో ఎవరో ఒకరు పోలీస్ లకి కబురు పంపుతాడు . ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ తో వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్న కార్యకర్తలని , చుట్టూ ఉన్న జనాన్ని చూసి ఆగ్రహం తో ఊగిపోతూ ఆ గాడిదను అరెస్ట్ చేయండి అంటాడు . కానిస్టేబిల్స్ కి ఏగాడిదను అరెస్ట్ చేయాలో తెలియక బిక్క మొహం వేస్తే మళ్ళీ గాడిదను అరెస్ట్ చేయమంటారు . కార్యకర్తలవైపు తిరిగి మీరిద్దరూ సాయంత్రం స్టేషన్ కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి అని విసవిసా వెళ్ళిపోతాడు . జనం మధ్య చిక్కుకుని ఎటు వెళ్లాలో తెలియక నిలబడిపోయిన గాడిదను కానిస్టేబిల్స్ అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వస్తారు
లాకప్ లో పెట్టిన గాడిద మీద ఎలా ఎఫ్ ఐ ఆర్ రాయాలా అని ఆలోచిస్తున్న ఇన్స్పెక్టర్ కి ఒక ఫోన్ వస్తుంది. అటు నుండి మునిపల్ చైర్మన్ గారి గొంతు వినగానే లేచినిలబడి మరీ నమస్కారం సార్ అంటాడు ఇన్స్పెక్టర్.
ఇంతకుముందు జరిగినగొడవలో మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతారు అని అడుగుతారు మునిసిపల్ ఛైర్మెన్ .ఇన్స్పెక్టర్ వెంటనే గాడిదను అరెస్ట్ చేసి తీసుకువచ్చాను సర్ . కేసు ఫైల్ చేయడమే అంటాడు . కేస్ ఎవరిమీద పెడతారు అని చైర్మన్ అడిగితే గాడిద మీదే సర్ అంటాడు
అదే ఏ గాడిద మీద కాంగ్రెస్ గాడిదా ? తెలుగు దేశం గాడిదా అని మళ్ళీ ప్రశ్నిస్తారు చైర్మన్ గారు . అదే ఇన్వెస్టుగేట్ చేస్తున్నాను సర్ అంటాడు . అదేదో త్వరగా తేల్చండి అంటూ ఫోన్ పెట్టేస్తారు చైర్మన్ గారు . గాడిదను పిలిచి వూరు , పేరు అంటూ వివరాలు అడగసాగారు ఇనస్పెక్టర్ గారు . గాడిద నోరు విప్పదు . పైగా దానికి కడుపులో ఆకలి దంచి వేస్తూ ఉంటుంది . ఇన్స్పెక్టర్ వంకా , ఆయన పక్కనే వున్నా ఫైళ్ల వంకా గుర్రుగా చూస్తూ ఉంటుంది . తన ప్రశ్నలకి జవాబు చెప్పకపోవడం తో గాడిద పై లాఠీ ఎత్తుతాడు ఇన్స్పెక్టర్ గారు. అంతే గాడిద ఒక్కఉదుటున ఫైళ్ల మీదకి దూకి వొంటి నోటితో పరపరా నమలసాగింది . చిర్రెత్తుకొచ్చిన ఇన్సెపెక్టర్ గాడిద ను కసి తీరా కొడతాడు . నెత్తురు కారుతున్న గాడిదను మళ్ళీ లాకప్ లో పెడుతూ ఉండగా మళ్ళీ ఒక ఫోన్ వస్తుంది . ఈ సారి అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిది .
ఇంతకుముందు జరిగిన కొట్లాటలో గాడిద ది ఏపార్టీ అని తేల్చారు అని డైరెక్ట్ గా విషయం లోకి వస్తారు అధ్యక్షుల వారు . ప్రత్యక్ష సాక్ష్యాలని బట్టి చూస్తే ఆ గాడిదమా పార్టీది కాదు . కనుక కాంగ్రెస్ గాడిద అని కేస్ ఫైల్ చేయండి అంటారు అధ్యక్షుల వారు . అలాగే సర్ . అలాగే సర్ అంటూ ఇన్స్పెక్టర్ బుర్ర ఊపుతాడు.
ఇప్పుడిక ఆ గాడిద కాంగ్రెస్ పార్టీ గాడిద అని రుజువు చేసే పని ఇన్స్పెక్టర్ మీద పడుతుంది . అది కాగ్రెస్ పార్టీ గాడిద అనడానికి ఇనస్పెక్టర్ కి ఒక బ్రహ్మాండమైన ఐడియా దొరుకుతుంది . గాడిద పోలీస్ స్టేషన్ లో ఫైళ్ల ను తిన్నది కనుక, పోలీస్ స్టేషన్ ప్రభుత్వానిది కనుక , ప్రభుత్వం అంటే అధికారం లో ఉన్న తెలుగు దేశమే కనుక , తెలుగు దేశం గాడిద అయితే తెలుగు దేశం ఫైళ్లను తినదు కనుక , ఈ గాడిద ఫైళ్లను తిన్నది కనుక అది కాంగ్రెస్ గాడిదే అని తీర్మానిస్తాడు . తన ఆలోచనకు , తార్కిక శక్తి కి తన భుజం తానె తట్టుకుంటాడు . మరునాడు పొద్దున్నే గాడిదను కోర్ట్ కి పంపిస్తారు . కేసు ఓడిపోతే పార్టీ ఓడిపోయినట్టే అని భావించిన తెలుగుదేశం , కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడి మరీ లాయర్లను పెట్టుకుని దొంగ సాక్ష్యాలు ఇబ్బడి ముబ్బడిగా గుప్పిస్తారు
సాక్ష్యాలు అన్నీ పరిశీలించిన న్యాయమూర్తి గారికి ఏమి తీర్పు చెప్పాలో అర్ధం కాలేదు . ఒక మీమాంస కి గురి అయ్యాడు . చివరకి తాను ఏ పార్టీకి చెందిన గాడిదో ఆ గాడిద తోనే చెప్పిస్తే బావుంటుంది అని జడ్జీ గారికి ఆలోచన వస్తుంది . బోనులో నిల్చున్న గాడిద చేత ప్రమాణం చేయించమని ఆదేశిస్తాడు . కోర్ట్ గుమస్తా భగవద్గీత తీసుకుని వచ్చి గాడిద ముందు పెట్టి “అంతా నిజమే చెపుతాను …… “అంటూప్రమాణం చెప్పబోతాడు .
భగవద్గీతను చూడగానే లోపల ఆకలి భగ్గుమన్న గాడిద గుమస్తా చేతిలోని భగవద్గీతను లాక్కుని మరీ పరపరా నమిలి జీర్ణం చేసుకుంటుంది . కోర్ట్ అంతా నిశ్శబ్దం అయిపోతుంది . జడ్జీ గారు పదినిమిషాలు ఆలోచించి గాడిద వంక సాలోచనగా చూస్తారు . భగవద్గీత తినడం తో ఆకలి తీరిన గాడిద జడ్జీ గారి వంక కృతజ్ఞత గా చూస్తుంది . జడ్జీ గారు అప్పుడిలా చెప్పారు
“గాడిద కాంగ్రెస్ ది కాదు . అలా అని తెలుగుదేశానిదీ కాదు . మనకు కనిపించిన ప్రత్యక్షసాక్ష్యాన్ని అనుసరించి ఇది కమ్యూనిస్ట్ గాడిద అని చెప్పవచ్చు .ఎందుకంటే కమ్యూనిస్టులకు దేవుడంటే నమ్మకం వుండదు . ఇప్పుడీ గాడిద దేవుడు కాకపోయినా మనమంతా దేవుడి తో సమానమని భావించే భగవద్గీతను మనం చూస్తూ ఉండగానే నమిలి మింగింది కనుక ఇది ఖచ్చితముగా కమ్యూనిస్ట్ గాడిదే “అని ఫైండింగ్ ఇచ్చేస్తారు
ఇది కథ
ఈ కథ ద్వారా రచయిత మన న్యాయ ,రక్షణ , రాజకీయ వ్యవస్థల బండారాన్ని ఎంతలా బట్టబయలు చేసాడో చూడండి . న్యాయవ్యవస్థ కీ
కేవలం ఆధారాలు ఉంటే చాలు . వాటి వెరాసిటీ కానీ అప్పటి సామాజిక ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోదు . సాక్ష్యం దానికి ప్రమాణం . సాక్ష్యాలు సంపాదించి సరిగ్గా ఇవెస్టిగేట్ చేయవలసిన రక్షణ వ్యవష్ట బోలెడన్ని వత్తిడులకులోనై తనను తానూ కోల్పోతున్నది అప్పుడెప్పుడు భర్తృహరి తివిరి ఇసుకన తైలంబు తీయవచ్చు అన్నారు . కానీ మన సర్వ స్వతంత్ర సత్తాక వ్యవస్థలు ఏవీ రాజకీయ వత్తిడులకు అతీతంగా వుండవు . రాజకీయ వ్యవస్థ బలంముందు మిగతావన్నీ బలాదూరే .ఒక చిన్న కథలో ఒక పెద్దజీవిత సత్యాన్ని చెప్పడం, చెప్పి ఒప్పించడం కంటే కథ తాజా తానుగా సాధించగలిగింది అనిపిస్తోంది.
*
రచయిత నందిగం కృష్ణారావు గారు. ఈ కథ గురించిన ప్రస్తావన వల్లంపాటి గారి ‘కథాశిల్పం’ లో కూడా ఉంటుంది!
కధ చదివిన గుర్తు ఉంది.
మంచి కధను పరిచయం చేశారు వంశీకృష్ణ గారూ