కన్నాంబ అంటే నాకు చాలా ఇష్టం. ఈ నాటి సినీ ప్రేక్షకులకు యెంతమందికి ఆమె గురించి తెలుసో నాకు అంచనాలేదు .ఆమె మరణించే సుమారు యాభై సంవత్సరాలౌతోంది మరి. ఆమె పోషించి మెప్పించలేని పాత్రలేదు.ఆమె నటనలో వున్న ఒకలాంటి రాజసం నాకు యే నటి లోనూ కనిపించదు.
సాత్విక పాత్రలో నయినా,గయ్యాళి పాత్రలో నయినా,పేద గృహిణి పాత్రలో నయినా,మహారాణి పాత్రలో నయినా ఆమె ఇట్టే ఒదిగి పోతుంది.
చక్కటి ఉచ్చారణ,స్పష్టంగా సంభాషణలు పలికే తీరూ,కంచులాగా ఖంగున మ్రోగే గొంతూ.క్షణాలలో రంగులు మార్చే ఊసర వెల్లిలాగా రకరకాల భావాలనూ మార్చే కళ్లూ ముఖకవళికలూ ఆమెను ఒక ప్రత్యేక నటిగా తెలుగులోనూ ,తమిళం లోనూ కూడా నిలబెట్టాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె శరీరంలోని ప్రతి అణువూ నటిస్తోంది అనిపిస్తుంది .
తెలుగులో ఆమె కెంత పేరుందో,తమిళంలో కూడా అంత పేరుంది.తమిళంలో ఆమె స్వఛ్ఛమైన ఉచ్చారణ కి ,సంభాషణలు పలికే తీరుకీ వారంతా ఆమెను యెంతో అభిమానిస్తారు. “కణ్ణగి”,”మనోహర” చిత్రాలలో ఆమె నటన చూసిన తమిళులు ఆమె కు బ్రహ్మరథం పట్టారు. యం.జి.ఆర్ ,శివాజీ గణేశన్ ,పి.యు.చిన్నప్ప భాగవతార్ ,యం.కె.త్యాగరాజ భాగవతార్ ,నాగయ్య లాంటి సూపర్ స్టార్స్ సరసన నటించారామె.
మన తెలుగులో హరిశ్చంద్ర, ద్రౌపదీ వస్త్రాపహరణం, చండిక, పల్నాటి యుధ్ధం, ముగ్గురు మరాఠీలు,గృహలక్ష్మి,దక్షయజ్ఞం చిత్రాలు నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమె చాలా మంచి గాయని,చాలా చిత్రాలలో ఆమె పాటలు ఆమే పాడుకున్నారు. కొన్ని ప్రయివేట్ రికార్డులు “కృష్ణం భజరాధా “లాంటివి ఆనాడు చాలా పాప్యులర్. పల్నాటి యుధ్ధం లోనూ,ముగ్గురు మరాఠీలు లోనూ ఆమె పాడిన పాటలు వింటుంటే స్థిరమైన గొంతూ,అలవోకగా పలికే సంగతులూ చెవుల్లో అమృతం పోసినట్టుంటుంది.ఈనాడు కృత్రిమ మైన గొంతుతో కీచుగా పాడే గాయనీమణులు ఆమె గొంతు వింటే యేమంటారో మరి!
ప్రఖ్యాత మ్యూజికాలజిస్ట్ వి.ఎ.కె. రంగారావుగారు “అలనాటి అందాలు “పేరుతో కన్నాంబ ,నాగయ్యల పాటలు గ్రాంఫోన్ కంపెనీ వారికి కాసెట్ల రూపంలో అందించారు.కానీ అవి అంతగా ప్రజాదరణ పొందలేదని గ్రాంఫోన్ కంపెనీ వారు అసంతృప్తి వెలిబుచ్చారట.”వారెంత బాగా పాడినా శ్రోతల ఆదరణ లేకపోతే మనమేం చేయగలం” అని వి.ఎ.కె.వాపోయారు.నిజంగా ఇద్దరూ అద్భుతమైన గాయకులు. ఆమె కేవలం నటీ,గాయనీ మాత్రమే కాదు తన భర్త కడారు నాగభూషణంతో కలిసి రాజరాజేశ్వరీ ఫిలింస్ పేరిట సుమారు ముఫ్ఫయి చిత్రాలు నిర్మించిన నిర్మాత కూడా
నాకు వ్యక్తిగతంగా రెండు సినిమాలలో ఆమె నటన చాలా చాలా ఇష్టం. అందులో ఒకటి “తోడికోడళ్లు” .ఈ సినిమాలో ఆమే,సావిత్రీ,సూర్యకాంతం నటిస్తున్న సన్నివేశాలలో ఒకరితో ఒకరు యెంత పోటీగా నటిస్తారో! యెవరిని చూడాలో కూడా అర్థంకాదు. ఇక రెండోది “రాజమకుటం”. ఈ సినిమాలో రాజమాత గా రాజసం ఒలికిస్తూ,భర్తను కోల్పోయిన మహారాణి గా బాధను పలికిస్తూ జిత్తుల మారి మరిది యెత్తులను తిప్పికొడుతూనే కొడుకుకు ధైర్యం చెబుతూ ఆమె నటించిన తీరు అనుపమానం.ఏక కాలంలో ఒక కంట రాజసం,ధైర్యం చూపిస్తూ కర్తవ్య బోధ చేయడం,ఇంకో కంట మరిది దగ్గర దైన్యం నటించడం చూడాలే కానీ చెప్పలేము. ఆమె ఇంత అత్యున్నతమైన నటిగా యెదగడం వెనక నేపథ్యం అంటే ఆమె పుట్టుక ,పెంపకం,ఆమె కళాకారిణిగా యెదిగిన తీరూ తెలుసుకుందాం.
పసుపులేటి కన్నాంబ పుట్టిన తేదీ గురించి చాలా అయోమయం నెలకొని వుంది.ఒకో చోట ఒకోరకంగా రాసివుంది, అయితే ఆమె కోడలు కళావతి అనే ఆమె “హిందూ “పేపర్ కి ఇచ్చిన వివరాల ప్రకారం ,ఆమె 1911 వ సం” అక్టోబర్ 5 వతేదీన కడపలో జన్మించింది.తల్లిదండ్రులు లోకాంబ, వెంకట నరసయ్య.తండ్రి గవర్నమెంట్ కంట్రాక్టర్ గా పనిచేస్తూ వుండేవాడు.
అయితే కన్నాంబ చిన్నతనమంతా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో అమ్మమ్మ ,తాతయ్యల దగ్గర గడిచింది.తాత నాదముని నాయుడు గ్రామ వైద్యుడుగానూ,అమ్మమ్మ నర్స్ గానూ పనిచేస్తూ వుండేవారు.ఆమె తాతగారికి సాహిత్యమన్నా ,కవిత్వమన్నా చాలా మక్కువ వుండేది.ఆయన కన్నాంబకు చిన్నప్పుడే కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పించాడు.ఆమె పద్యాలూ,పాటలూ బాగా పాడేది. ఆమెను నటిగా మార్చిన సంఘటన గురించి తెలుసుకుంటే భలే ఆశ్చర్యంగా వుంటుంది
ఆమె తన 16 వయేట “హరిశ్చంద్ర” అనే నాటకం ప్రదర్శిస్తుంటే వెళ్లింది.అందులో చంద్రమతి వేషం వేసినాయన పద్యాలు చాలా ఘోరంగా పాడుతున్నాడు.అది చూసిన కన్నాంబ వెంటనే లేచి ఆక్షేపించింది.ఆయన నువ్వు ఈ వేషం వేసి చూపించు అని సవాల్ చేశాడు .ఆమె ఆ సవాల్ ని స్వీకరించి,యే విధమైన రిహార్సలూ లేకుండా స్టేజీ యెక్కి బ్రహ్మాండంగా నటిస్తూ పద్యాలు పాడి అందరి ప్రశంసలూ పొందింది.
ఇది జరిగింది 1927 లో ,ఆ తర్వాత ఆమె నవకళా నాటక సమితి ఏలూరు లో చేరి ,నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆ సంస్థ ఆర్గనైజరూ,డైరెక్టరూ కడారు భగవానుల నాగభూషణం .కన్నాంబా,ఆయనా ఒకరినొకరు ఇష్టపడి 1934 లో వివాహం చేసుకున్నారు.ఆయనకి అప్పటికే ఒక పెళ్లయింది పిల్లలు కూడా వున్నారు.
అదే సంవత్సరం(1934) కన్నాంబ ఇష్టదైవం రాజ రాజేశ్వరీ దేవి పేరిట రాజరాజేశ్వరీనాట్యమండలి స్థాపించి నాటకాలాడటం మొదలు పెట్టారు.దాదాపుఆంధ్ర దేశమంతటా తిరిగి ప్రదర్శనలు ఇస్తూ వుండేవారు.
1935లో స్టార్ కంబైన్స్ వారు “హరిశ్చంద్ర “అనే సినిమా తీయదలచి చంద్రమతి పాత్రకు కన్నాంబను సంప్రదించారు.ఆమె తన ట్రూపులో వున్న ఇరవైరెండుమంది సభ్యులనూ కూడా సినిమాలోకి తీసుకుంటే తప్ప తాను నటించనంది.వారు ఆమెనూ,ఆమె ట్రూపునూ కూడా బుక్ చేసుకున్నారు. అలా కన్నాంబ 1935 లో చిత్రరంగంలోకి అడుగు పెట్టింది. ఆ చిత్ర దర్శకుడు టి.ఏ.రామన్ .హీరో అద్దంకి శ్రీరామ మూర్తి. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించిన పి.పుల్లయ్యకు కూడా అదే మొదటి చిత్రం.1935 నవంబర్ తొమ్మిదో తేదీన ఆ చిత్రం విడుదలయి ఘన విజయం సాధించింది. కన్నాంబకు మంచి పేరు వచ్చింది.
ఆ తర్వాత ఆమెకు వరసగా పిక్చర్లు రాసాగాయి. సరస్వతీ టాకీస్ బెజవాడ వారు 1936లో హెచ్ .వి.బాబు గారి దర్శకత్వంలో తీసిన “దౌృపదీ వస్త్రాపహరణం” లో కన్నాంబ దౌృపది గానూ,సి.యస్ .ఆర్ .కృష్ణుడు గానూ ,యడవల్లి సూర్యనారాయణ దుర్యోధనుడు గానూ నటించారు. ఈ సినిమా సూపర్ హిట్టయ్యింది,దీనికి పోటీగా తయారయిన “దౌృపదీ మానసంరక్షణం” ఫ్లాపయింది.దానితో .ఆమె విజయ పరంపర మొదలయింది.
1937లో వచ్చిన కనక తార
1938లో వచ్చిన గృహలక్ష్మి
1940లో వచ్చిన చండిక — లో ఆమె వేసిన వేషాలు నటిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి.
“చండిక” లో ఆమె పాడిన “నేనే రాణీనయితే ఏలనే ఈ ధర ఏక ధాటిగా” అనే పాట ఆ పాత్రలో ధీరత్వమంతా ప్రతిబింబించేటట్టుగా వుంటుంది .ఆ పాట సూపర్ హిట్ .”చండిక” లో ఆమె గుర్రపు స్వారీ చేయడం,పులులను కూడా మచ్చిక చేసుకుని వాటితో యేమీ భయం లేకుండా నటించడం అంతా వింతగా చెప్పుకునే వారు.
“గృహలక్ష్మి” లో ఆమె పిచ్చిదానిగా నటిస్తూ మద్రాసు పుర వీథుల్లో పరిగెడుతుంటే ,అదంతా నిజమనుకుని పోలీసులొచ్చి ఆమెను అరెస్టు చేయబోయారట ,అంత సహజంగా నటించేవారామె.”పల్నాటి యుధ్ధం”లో నాగమ్మగా ,గోవిందరాజుల సుబ్బారావుకి పోటీగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. “తానా పంతము నాతోనా” అనే పాట చాలా పెద్ద హిట్టు.
“తోడికోడళ్లు,రాజమకుటం, ఆడపెత్తనం “మొదలైన చిత్రాలలో ఆమె పాత్రలు మరపు రానివి.
“గృహలక్ష్శి” సినిమాలో నిర్మాతలు హెచ్ .యమ్ .రెడ్డి,బి.యన్ .రెడ్డి గార్లతో పాటు ఆమె కూడా వాటా తీసుకున్నారు.ఆ సినిమా సూపర్ హిట్టయ్యి పెట్టిన పెట్టుబడికి మూడింతలు లాభాల నార్జించి పెట్టింది.దానితో ఆమెకు నిర్మాతగా మారి సొంతంగా సినిమాలు తీయాలనే ఆశ కలిగింది.
నిర్మాతగా—–ఆమె 1941లో భర్త కె.బి.నాగభూషణంతో కలిసి తన ఆరాధ్య దైవమయిన రాజరాజేశ్వరీ దేవి పేరిట “రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ” స్థాపించి సొంతంగా చిత్రాలు తీశారు.తెలుగు తమిళాల్లో కలిపి సుమారు పాతిక ముఫ్ఫయి చిత్రాలు తీశారు. వారి మొదటి సినిమా కు జ్యోతిష్ సిన్హా దర్శకత్వం వహించారు ,సినిమా పేరు “తల్లిప్రేమ” అది బాగా హిట్టయింది.తర్వాత వారి సంస్థ తీసిన సినిమాలన్నిటికీ దాదాపు కె.బి.నాగభూషణమే డైరెక్టర్ .
వారి నిర్మాణ సంస్థలో హిట్టయినవీ వున్నాయి,ఫ్లాపయినవీ వున్నాయి. అయితే మంచి అభిరుచితో చిత్రాలు రూపొందిస్తారనీ,మంచి విలువలు పాటిస్తారనీ పేరు తెచ్చుకున్నారు.
పేరుతెచ్చిన చిత్రాలు
తల్లిప్రేమ
సుమతి
పాదుకా పట్టాభిషేకం
సతీ సక్కుబాయి
శ్రీకృష్ణతులాభారం
ఉషా పరిణయం
దక్షయజ్ఞం –మొదలైనవి
“దక్షయజ్ఞం” — సినిమాలో యన్ .టి.ఆర్ మొదటి సారి శివుడిగా నటించారు.
వారి చిత్రనిర్మాణ సంస్థ మంచి విలువలతో నడుస్తూ వుండేది అని.చెప్పుకున్నాం కదా అవేమిటంటే,తమ సంస్థ లో ఉద్యోగులు అందరికీ ప్రతినెలా ఒకటవ తేదీకి ముందే జీతాలు అందించేవారు.సంస్థ నష్టాలలో వున్నాసరే అవసరమైతే కన్నాంబ నగలు తాకట్టుపెట్టయినా డబ్బు సమకూర్చుకుని, ఈ అలవాటుకి భంగం రాకుండా చూసుకునేవారు.
అలాగే ఆ సంస్థ కాంటీన్ లో చాలా మంది అన్నార్తులకి భోజనం దొరుకుతూ వుండేది.అలా తాను మద్రాస్ వచ్చిన తొలిరోజుల్లో కన్నాంబ తల్లి తనకి భోజనం పెట్టి వేషాలు చూపించి ఆదుకున్నారని ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం చెబుతూ వుండేవారు.
వ్యక్తిత్వము—-కన్నాంబ డబ్బు విషయాలలో ఖచ్చితంగా వ్యవహరించేవారని చెబుతారు. ఆ రోజుల్లోనే ఆవిడ పారితోషికం యనభై అయిదు వేలు. బంగారం అంటే మక్కువ ఏడు వారాల నగలు ధరించేది. బంగారు కాసులు పోపు డబ్బాలలో దాచేది అనికూడా అంటారు. రాజ రాజేశ్వరీ దేవికి భక్తురాలు,ప్రతి రోజూ పూజ చేయనిదే పచ్చిమంచినీళ్లు కూడా తాగేది కాదట. ఆమె నటన పట్ల చాలా క్రమ శిక్షణతో వుండేది.షూటింగ్ కి ముందు రోజే డైలాగులు చూసుకునేది..సెట్ కి రాంగానే తానెంత పెద్ద నటి అయినా అసిస్టెంట్ డైరెక్టర్ కి డైలాగులు అప్పజెప్పేది. చిన్న చిన్న వేషాలు వేసే నటీ నటుల పట్ల దయగా వుండేది. తన తోటి నటీ నటులు నటన లో యేవైనా పొరపాట్లుంటే సరిదిద్దేది.
“ఆడపెత్తనం” లో నటించేటప్పుడు తన పక్కన భర్తగా నటించే చదలవాడ కాస్త బెరుకుగా నటిస్తుంటే ,చనువుగా మాట్లాడి ఆయన బెరుకు పోగొట్టిందని చెబుతారు. ఆమె కు బిరుదులూ ,సన్మానాలూ అంటే గిట్టేది కాదట వాటికి దూరంగా వుండేది.ఆమె యే సినీ ఫంక్షన్ కీ ,యే శతదినోత్సవానికీ హాజర్ కాలేదు. ఒకే ఒక్కసారి “ఆంధ్ర నాటక కళా పరిషత్తు” వారి సన్మాన సభలో పాల్గొని అనర్గళంగా నాటక రంగ పూర్వాపరాలను గురించి మాట్లాడింది.అదేమిటంటే “అంతా రాజరాజేశ్వరీ మహిమ” అంది. ఆమె తన ముఫ్ఫయ్యేళ్ల సినీ జీవితంలో సుమారు తమిళంలోనూ తెలుగులోనూ కలిపి నూటయాభై పై చిలుకు చిత్రాలలో నటించారు.
తమిళ సినీ రంగ ప్రవేశం—-తమిళంలో ఆమె మొదటి సినిమా “కృష్ణన్ తూదు” .ఈ సినిమాలో ఆమె సంభాషణల్లో తెలుగుయాస వినపడడం వలన ఫెయిలయ్యిందనే టాక్ వచ్చింది. ఆ తర్వాత ఆమె నాగయ్య గారి సలహాతో డైరెక్టర్ ఆర్ .యస్ .ప్రకాష్ ప్రోద్బలంతో తమిళం క్షుణ్ణంగా నేర్చుకుంది. ఆమె యం.కె.త్యాగరాజ భాగవతార్ తో నటించిన “అశోక్ కుమార్ ” సినిమాలో ఇళంగోవన్ రాయగా ఆమె చెప్పిన డైలాగులకు వంకపెట్టలేక పోయారెవ్వరూ.ఈ సినిమా కోసం ఆమె డాన్స్ కూడా నేర్చుకుంది.చాలా తక్కువ సమయంలో చాలా చక్కగా నేర్చుకుంది అని ఆమెకు డాన్స్ నేర్పిన వైదీశ్వరన్ కోయిల్ మీనాక్షీ సుందరమ్ పిళ్లే మెచ్చుకున్నారు.
మహాకావ్యం శిలప్పదికారం సినిమాగా తీసేటప్పుడు “కణ్ణగి” పాత్రకు ఆమె ను యెన్నుకున్నారు.అందులో ఆమె అభియమూ,ఆమె సంభాషణలు పలికిన తీరుకి తమిళ ప్రేక్షకులు వెర్రెక్కిపోయారు .కన్నాంబే కణ్ణగి,కణ్ణగే కన్నాంబ అని పిలువ సాగారు .ఈ చిత్రానికి కూడా ఇళంగోవనే సంభాషణలు రాశారు. ఇక శివాజీ గణేశన్ తో నటించిన “మనోహర “చిత్రం తెలుగు,తమిళ ,హిందీలలో కూడా విజయఢంకా మోగించింది.ఈ చిత్రం హిందీ వర్షన్ లో కూడా కన్నాంబ తన డైలాగులు తానే చెప్పుకున్నారు.
తమిళులు ఆమెను “కలైమామణి”తో సత్కరించుకున్నారు.పోస్టల్ స్టాంపు కూడా రిలీజ్ చేశారు. కన్నాంబ,నాగభూషణం దంపతులకు పిల్లలు లేరు.ఒకమ్మాయినీ ,ఒకబ్బాయినీ పెంచుకున్నారు.అమ్మాయికి రాజరాజేశ్వరి అని పేరు పెట్టుకుని ప్రముఖ దర్శకుడు సి.పుల్లయ్య కుమారుడు సి.యస్ .రావుకు ఇచ్చి పెళ్లి చేశారు .ఆయన కూడా సినీ దర్శకుడే ,పిల్లలు కూడా పుట్టాక ,అతను నటి రాజసులోచనను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. కన్నాంబ గారు పెంచిన కొడుకు తబలా ప్లేయర్ అని మాత్రం తెలుస్తోంది.మిగతా వివరాలు తెలియవు. 1952నుండీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ తీసే చిత్రాలు పరాజయం పాలవడం,కంపెనీ నష్టాలలో కూరుకుపోవడం మొదలయింది.నటిగా ఆమె సంపాదించినదంతా ,ఆమె భర్త సినిమాలు తీసి పోగొట్టడం ఆమెను మానసికంగా,శారీరకంగా కృంగదీసింది అదే ఆమె అనారోగ్యానికి కారణమయింది.
7–5–1964లో అనారోగ్యంతో ఆమె మరణించే వరకూ చిత్రాలలో నటిస్తూనే వుంది.ఆమె చివరి చిత్రం “వివాహబంధం”.
నాగయ్య గారి సినిమా”భక్తరామదాసు” లో చివర రెండుమూడు సీనులు ఆమె తో తియ్యవలసినవి ఆమె మరణించడంతో డూప్ ని పెట్టి తీశారు.టి.జి.కమలాదేవి ఆమె కు డబ్బింగ్ చెప్పారు.
ఆమె పోవడంతో రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ మూతపడింది.ఎలా వచ్చిన సిరి అలా వెళ్లిపోయింది.ఆస్తిపాస్తులన్నీ యెట్లా నడిచిపోయాయో తెలియదు.నాగభూషణం గారు ఒంటరిగా ఒక చిన్న హోటల్ గదిలో వుంటూ,రోడ్డుమీద కాలినడకన పోతూనో,బస్సుల్లో పోతూనో కనపడిన దృశ్యాలు చూసి సినీ పరిశ్రమ కంటనీరు పెట్టుకుంది.చివరికి అక్కినేనీ,మరొకరూ కలిసి కొంత డబ్బు బాంకులో వేసి ,నెలా నెలా కొద్దిమొత్తం ఆయన చేతికి అందేలా చూశారు. “నాఐశ్వర్యమంతా ఆమె తోనే పోయింది,సుమంగళిగా పోవాలని కోరుకుంది అలాగే పోయింది,నేనూ కొద్దికాలంలో పోతాను” అన్న మాటలు నిజంచేస్తూ 1976లో ఆయన కన్నాంబను కలుసు కున్నారు.
ఇరవైతొమ్మిదేళ్ల నటజీవితంలో నవరసాలూ పోషించి,యభై రెండేళ్ల నిజజీవితంలో కూడా తన పాత్ర చక్కగా వంకపెట్టలేనట్టుగా పోషించిన కన్నాంబకు సాటి యెవరూ లేరు.
నా దృష్టిలో ఆమె మహానటి.
*
Beautiful and concerned writeup on Kannamba garu. A great artist.
Thank u so much andee
చాలా బాగా రాశారు. హుందా తనానికి నిర్వచనం గా ఉండే కన్నాంబ ని చూడగానే గౌరవ భావం, ఇష్టం కలుగుతాయి . ఆవిడ వాయిస్ చాలా ఇష్టం నాకు . తోడి కోడళ్లు సినిమా లో ఎంత బావుంటుందో
అవునండీ చాలా హుందా అయిన నటి