కప్పల బడి కప్పరాడ

బర్మా క్యాంపు కథలు-5

నా చేతి మీద వున్నా గోళ్ల గురుతులు చూసి ” కప్పల బడి లో చదవడం వళ్ళ వీడిని కప్పలు బాగా బరికే సాయి ” నవ్వుతూ ఎకసెక్కంతో అన్నాడు హైదరాబాద్ నుంచి దిగబడిన మా మేనమామ.

నా చేతి మీద గోళ్ళ  గురుతులు చూసుకొని మూడురోజుల క్రితం బాదిరెడ్డి శ్రీనుతో కప్పల బడి కప్పరాడ లో చేసిన కొట్లాట గురుతొచ్చి ఊరుకుండి పోయాను.

బర్మా క్యాంపు కింద కిందకు దిగి  జాతీయ రహదారి దాటుకొని  ముందు కెలితే  ఊర్వశి జంక్షన్, ఆ కింద బైపాస్ రోడ్డును ఆనుకొని కేరళ నుంచి వొచ్చి ఇక్కడ స్థిరపడిన ‘ఉన్ని’   టీ కొట్టు ఉంటుంది.

ఆ ప్రక్కనే నేవల్ ఆర్మెంట్ డిపో లో పనిచేసే  భోగలింగం తెల్లటి బట్టల్లో తెల్లటి సిగరెట్ కాలుస్తూ బృందం తో వుంటారు, అక్కడే ఒక మూలన బడ్డ ఒక  పాత కారు కూడా ఉంటుంది , దాని కవరుపై ఈ కారు అమ్మబడును  సినీ నిర్మాతలకు మంచి అవకాశం అనే యెగతాళి వ్యాక్యం ఉంటుంది, ఆయనెప్పుడూ సీరియస్ గాను వెనకాల అయన బృందం నవ్వుతూను ఉంటుంది.

అక్కడే నాన్న మిత్రులంతా కలిసి పార్టీ కార్యక్రమాల కోసం, యువజన సంఘం కోసం నడిపే ”   యునైటెడ్ లైబ్రరీ ” పేరుతొ గ్రంధాలయం అందులో పెంటకోట రామారావు, బీవీ అప్పారావు పుస్తకాలు చదువుకుంటూ రాసుకుంటూ వుంటారు.

ఆ దారమ్మట ముందుకెళితే ఎడమవైపు తుమ్మడ పాలెం ఇంకా ముందుకెళితే ఐ టి ఐ  జంక్షన్ , ఆ తరువాత కప్పరాడ వూరు,

అదుగో అక్కడ ఉంది  జీ వీ ఎం సి కప్పరాడ  పాఠశాల. అప్పటి కే ప్రభుత్వ పాఠశాలలను దుంపల బడి  అనే వారు కంచరపాలెం మెట్టు మీద వున్న బడి  దుంపల బడే, కానీ కప్పరాడ దగ్గర వున్న మా బడి ని ‘కప్పల బడి’ అనే వారు.

తుమ్మడ పాలెం , సిధార్థనగర్, పట్టాభి రెడ్డి తోట, సంకురు పేట,మంచుకొండ గా ర్డెన్స్, సత్యా నగర్, కుంచుమాంబ కాలనీ, దుమ్ములు మిల్లు ఏరియా ,ఇండస్ట్రియల్ ఎస్టేట్ పక్కనుంచి, ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్క కొంపలు నుంచి బిల బిల మని గుంటలు కప్పల బడికి వొస్తుంటారు.

ఇన్ని  దాటుకుని, దారులు కొలుచుకుని కప్పల బడి కి బర్మా క్యాంపు నుంచి నడుచుకొని వెళ్ళామా ,

జ్ఞానాపురం నుంచి రిక్షాలో వొచ్చే  బట్టతల లింగం మాస్టారు ఫస్ట్ పీరియడ్లోనే తోటపని మొదలు పెట్టేస్తాడు, గడ్డి పీకడం, గోంగూర, తోటకూర నారు పెంచడం, స్కూలు ఎదురుగా వున్న తాటి తోపుల్లోకి పోయి తాటి పళ్ళు తేవడం చేయించేస్తాడు, తెచ్చిన తాటిపళ్ళ బుర్రల్ని కొబ్బరి చెట్టు మొదలు చుట్టూ కప్పెట్టించి నీళ్లు పోయిస్తాడు.

“హమ్మయ్య ” అని ఇంటి శ్రీను, బొక్కా హరి, అవతారం, పొట్టి ప్రసాద్, పొడుగు రవి, కుమారు, ఎల్లాజీ, బాదిరెడ్డి శ్రీను, శాంతీ, విజయకుమారి అనుకునే లోగ .. పసుపు స్కేలు విరిగే లాగ యెర్రిక్కి పోయి చితకబాదేసీ వోడు లెక్కల మాష్టారు నాయుడు.

శాంత మూర్తి అయిన హెడ్ మాస్టర్ పద్మకుమారి ఎవరెవరికి స్కాలర్ షిప్పులు ఇవ్వాలో, జనాభా లెక్కలు యెంత వరకు వొచ్చాయో ప్రశాంతంగా రాసుకుంటుండే వారు.

ఖాళీ పీరియడ్ ని కాస్త చూసుకొని పిల్లల్ని సముదాయించమ్మా  అని కిరస్తానీ మతం పుచ్చుకున్న సోషల్ టీచెర్ని మా క్లాసుకు పంపితే  పట్టపగలే డ్రాక్యులా కథలు చెప్పి మాకు జొరాలు పుట్టించేసేదావిడ.

నోటు పుస్తకాలు బయటకు వెళ్లి కొనుక్కునే శ్రమ లేకుండా మా దగ్గరకే పుస్తకాలూ తెచ్చి అమ్మేసే వారు కాముట్ల టీచర్.

ఇంగ్లీష్ చెప్పే పద్మా టీచర్ పువ్వుల గొడుగు వేసుకొని వొచ్చి అందంగా పాఠం చెప్పి హాయిగా  ఊయల ఊగి వెళ్ళిపోయేవారు.

ఇక గుంట   నా కొడుకులమైన మేము అల్లికాయలు ఆడటం, సిగరెట్ పెట్టెల కవర్లతో, అగ్గిపెట్టెల కవర్లతో  బచ్చాలాటాడటం , కర్రా బిళ్ళలు ఇలా నానా రకాల ఆటలు ఆడేసే వాళ్ళం. టీచర్లు జనాభా లెక్కలకు పొతే నాటకాలు ఆడే వాళ్ళం, పాటలు పాడే వాళ్ళం.

ఇలాంటి దుంపల స్కూళ్ల దగ్గర మాములు గానే అమ్మే మామిడి  తాండ్ర, తాటి తాండ్ర, పుల్ల ఐసు, ఊరేసిన ఉసిరి, మామిడి ముక్కలకు అదనంగా కప్పరాడామె సేమ్యా సగ్గుబియ్యం తీసుకొచ్చి అమ్మేసేది.

స్కూలు కి వొచ్చే ముందు ఐటిఐ జంక్షన్ దగ్గర సూపర్స్టార్ కృష్ణ కి, చిరంజీవికి పోస్టర్ల మీద పేడ పడిందో లేదో పరిశీలించి వొచ్చే వాళ్ళం.

కప్పల బడి నుంచి బర్మా క్యాంపుకి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కుంచుమాంబ కాలనీ గెడ్డల్లో కాళ్ళు తడుపుకుంటూ, కప్ప పిల్లలను పట్టుకుంటూ, పాలిటెక్నిక్ కాలేజీ గేటు దూకి దాటుకుంటూ, పట్టాభి రెడ్డి గార్డెన్స్ చూసుకుంటూ ఎప్పటికో ఇంటికి వెళ్తుండే నాకు ఒక సారి ఎప్పటి లాగే  గేటు దూకాక తూలి కంప చెట్లలో పడిపోయాను..

తొడలో ఇనప రాడ్డు దిగబడిపోయింది … ఆ రక్తం కార్చుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ మెల్లగా బర్మా క్యాంపులో మా పెంకులు ఇంటికి చేరే సరికి మా ఆఖరి తమ్ముడు ” స్టాట్యూ ” అన్నాడు.

నా ఏడుపు చూసి మా అమ్మ నా వీపు మీద రెండు మోది పరుగున కిందనున్న దుర్గా నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్తే

డాక్టరు  “మరేం పరవాలేదు నాలుగు కుట్లే పడ్డాయి ” అన్నాడు.

కప్పల బడి లో నా చేతికి పడిన గోళ్ళ గురుతులు చెరిగి పోయాయి కానీ ఈ కుట్లు మచ్చ మాత్రం పోలేదు.

మచ్చ ఎక్కడ పడిందో చెప్పాలంటే నాకు సిగ్గు బాబు.

*

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బర్మా కేంపు కథలు చదువు తున్నాను..హాస్య చతురత తో మనసును ఉల్లాస భరితంగా చేస్తున్నాయి.. మా విశాఖ ప్రజలకు…సాహిత్య లోకానికి మరో భ.రో.గో.దొరికాడు అనిపిస్తున్నది.. వివిధ రకాల వత్తిడులు మద్య నవ్వే మరచి పోయిన సగటు మనిషి ముఖం లో చిరునవ్వు లు పుయిస్తున్న రచియిత హరి వెంకట్ గారికి హృదయ పూర్వక అభినందనలు.. “సారం గ అంతర్జాల పత్రిక నిర్వహకులు ఎంతైనా అభినందనీయులు.. ధన్యవాదాలు

  • హరివెంకట రమణ రచించిన కప్పల బడి కప్పరాడ కధ చాలా బాగుంది. కధ ఆసాంతం చదివింపజేసింది.రచయిత అభినందనీయయులు.

  • హరివెంకట రమణ రచించిన కప్పుల బడి కప్పరాడ కధ చాలా బాగుంది. కధ ఆసాంతం చదివింపజేసింది.రచయిత హరి వెంకట రమణ అభినందనీయులు.

  • చాలా బాగుంది సార్ మీ చిన్న నాటి కబుర్లు చాలా చక్కగా చెప్పారు ఆ ప్రాంతం లో ఉండే విశేషాలు కూడా చాలా బాగుంది సార్ ఈ కధలు చాలా బాగున్నాయి సార్ , ఇటువంటి కధలు ఇంకా ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను.
    మీకు హృదయ పూర్వక అభినందనలు సార్.

  • మీ చిన్ననాటి ముచ్చట్లతో దుంపల బడి(మీ కప్పల బడి) కధ(నం) బాగుంది. ఇప్పుడు దుమ్ముల మిల్లు(బొక్కల ఫేక్టరీ అని కూడా అనేవారు) స్థానే ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు