టేకు ఆకుల సవ్వడి లేదు
వలిసె పూల సింగిడి లేదు
జీలుగు కల్లు బారట్లేదు
కాఫీ గింజల లొల్లి లేదు
చాపరాయి జలపాతం దుంకనని మొరాయిస్తుంది
వంజంగి కొండలు సిగ్గు తో కుంచించుకు పోయాయి
బొడ్డేరు నిండా నాటి రక్తపు మరకలే
పల్లె అంతా మౌనం దాల్చింది
గతం చేసిన గాయాలు
వెదురు తడికల మాటున
ఇంకా మానలేదు
మనువాడిన వోడు వెలేసిండు
గాయం చేసిన తోడేళ్ళు
సాగదీస్తూ
సాక్ష్యాన్ని నరికేస్తూ
భయోత్పాతం దిశలో జయం
తేటగా తేల్చింది
గాయం నిజమే
లేపనం లేకపోగా
నిస్సిగ్గుగా తోడేళ్ళు కావనే
మర్రి కింది రచ్చ బండ కొసరి తీర్పు
పంటి కింది రాయి
స్థూలంగా
మనిషి మనిషి ని బట్టి మారే
న్యాయమే
పుటలెన్ని ఘోషిస్తున్నా!!
ఇంకిన కన్నీటి చుక్కల సాక్షిగా
కళ్ళు మూత బడ్డాయి!
నల్లని గుడ్డే అక్కర్లే!!
*
Add comment